యోహాను 14:6-14
అందుకు యేసు, నేనే మార్గం, సత్యము, జీవము. నా ములమున తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. మీరు నన్ను ఏరిగియున్నచో, నా తండ్రిని కూడా ఏరిగి యుందురు. ఇక నుండి మీరు ఆయనను ఎరుగుదురు. మీరు ఆయనను చూచి ఉన్నారు " అని పలికెను. అప్పుడు పిలిప్పు "ప్రభూ! మాకు తండ్రిని చూపుము. మాకు అది చాలు" అనెను. అందుకు యేసు ఇట్లనెను: "పిలిప్పు! నేను ఇంతకాలము మీతో ఉంటిని. నన్ను తెలిసికొనలేదా? నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రిని చూపమని ఎట్లు అడుగుచున్నావు! నేను తండ్రి యందు, తండ్రి నా యందు ఉన్నామని నీవు విశ్వసించుటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేను చెప్పుట లేదు. కాని, తండ్రి నా యందు నివసించుచు, తన కార్యములను నెరవేర్చు చున్నాడు. నేను తండ్రి యందు ఉన్నానని, తండ్రి నా యందు ఉన్నాడని మీరు విశ్వసింపుడు. లేనిచో ఈ క్రియలను బట్టియైన నన్ను విశ్వసింపుడు. నేను తండ్రి యొద్దకు వెల్లుచున్నాను. కనుక, నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును. అంతకంటేను గొప్ప క్రియాలను చేయును అని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను. తండ్రి కుమారుని యందు మహిమ పరుప బడుటకు మీరు నా పేరిట ఏమి అడిగినను చేసేదను. మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినను దానిని చేసెదను.
యేసు ప్రభువు దేవున్ని లోకానికి ఎరుక పరిచారు
నేనే మార్గం, సత్యం, జీవం. నా ములమున తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు. యేసు ప్రభువు ఇక్కడ తోమసు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతున్నారు. నేనే మార్గం అని చెబుతున్నారు. తండ్రి దగ్గరకు పోవుటకు యేసు ప్రభువు మాత్రమే మార్గం. ఎందుకంటే తండ్రి గురించి పూర్తిగా తెలిసినది కుమారునికి మాత్రమే. యేసు ప్రభువు ఇతర ప్రవక్తల వలె, నాయకుల వలె, న్యాయాధిపతుల వలె కాక తండ్రి ప్రేమను, కరుణను, కృపను, తండ్రి అయిన దేవున్ని చూపించడంలో విఫలం చెందక, పూర్తిగా దానిలో సఫలీకృతం అయ్యి తండ్రిని తన మాటల ద్వారా, పనుల ద్వారా మరియు అద్భుతాల ద్వారా, కరుణ ద్వారా మరియు తాను చూపించిన ప్రేమ ద్వారా తెలియ పరిచారు. ఎవరు ఈ తండ్రి అని తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు మనం యేసు ప్రభువు జీవితం ద్వారా తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన చేసిన పనులన్నీ తండ్రి ద్వారానే చేశారు, తానకై తాను చేయక, తండ్రి ఇష్టప్రకారమే అన్ని చేశాడు. అలా తండ్రిని తన ద్వారా చూపించాడు.
యేసు ప్రభువే తండ్రికి మార్గం
తండ్రి దేవున్ని తెలుసుకోవడానికి మార్గం కేవలం యేసు ప్రభువు మాత్రమే. యేసు ప్రభువు దేవున్ని తెలుసుకోవడానికి మార్గం మాత్రమే కాదు, ఆయన గమ్యం కూడా. ఈ మార్గం మనలను ఎక్కడకు తీసుకుపుతున్ననది, అంటే తండ్రి దగ్గరకు. తండ్రి మరియు కుమారుడు ఎప్పుడు ఏకమై ఉన్నారు. ఆ విధంగా ఆయనే మనం మార్గం మరియు గమ్యంగా ఉన్నారు. ఆయనను అనుసరించినచో మనము ఎప్పటికీ మార్గమును తప్పక, ఆయనను అనుసరించిన ప్రతి ఒక్కరూ గమ్యం చేరుకుంటారు.
యేసు ప్రభువు మాత్రమే సత్యం
యేసు ప్రభువు నేనే సత్యం అని చెబుతున్నారు. ఏమిటి ఈ సత్యం? యేసు ప్రభువును సత్యమనగా ఏమిటి? అని పిలాతు అడుగుతున్నారు. యేసు ప్రభువు తనను తాను లోకమునకు వెలుగు అని చెబుతున్నారు. ఆయనలో అంధకారం అనేది ఏమి లేదు. నేనే సత్యం అని యేసు ప్రభువు చెబుతున్నప్పుడు ఆయనలో అసత్యం అనేది ఏమి లేదు. ఆయన పూర్తిగా సత్యం. ఆయన చెప్పిన ప్రతి మాట కూడా సత్యం. ప్రతిదీ కూడా జరిగితీరుతుంది. మన మాటలలో అనేక అసత్యాలు ఉంటాయి కాని యేసు ప్రభువు సత్యం. ఈ లోకంలో ఉన్న ఏ వ్యక్తి కూడా యేసు ప్రభువు వలె సత్యం కాదు, వారి వారి జీవితాలలో అనేక సార్లు అసత్యం అడినవారే. సత్యం మనలను స్వతంత్రులను చేస్తుంది. సత్యం మనకు దేవున్ని తెలియపరుస్తుంది. సత్యమును అన్వేషించే ప్రతి వారు కూడా దేవున్ని అన్వేషించే వారే. దేవుడు సత్య స్వరూపుడు. అందుకే యేసు ప్రభువు తాను సత్యమును అని చెపుతున్నారు. అసలు సత్యం అంటే ఏమిటి? తత్వశాస్త్రంలో అరిస్టాటిల్ సత్యం గురించి ఉన్నదానిని ఉన్నది అని చెప్పడం, తెలుసుకోవడం సత్యం అని చెబుతారు. పునీత అక్విన తోమసు గారు సత్యం గురించి నిత్యం ఉండునది సత్యం అని చెబుతున్నారు. కేవలం దేవుడు మాత్రమే నిత్యం ఉండేది. అందుకే యేసు ప్రభువు నేనే సత్యము అని చెబుతున్నారు.
యేసు ప్రభువే జీవం
నేనే జీవం అని యేసు ప్రభువు చెబుతున్నారు. దేవుడు జీవం, మనందరికీ జీవం ఉంది. కాని దేవుడు జీవం. మన నుండి ఈ జీవం వెళ్ళి పోతుంది. కాని దేవుడే జీవం కాబట్టి ఆయన నుండి అది వెళ్లిపోదు, అందుకే మనం ఆయనను స్వయంబు అని చెబుతున్నాము. తాను జీవించుటకు ఎవరి మీద ఆధారపడలేదు. కాని మనం మన జీవించుటకు వేరే వారి మీద ఆదరపడిఉంటాం. మనం కూడా ఈ జీవంతో ఎల్లప్పుడు ఉండాలి అనే కోరిక ఉంటుంది అది ఆయన మనకు ఇస్తాడు ఎందుకంటే ఆయన జీవం కాబట్టి. అందుకే యేసు ప్రభువు నేనే జీవం అని చెబుతున్నారు. యేసు ప్రభువు ఈ విషయం గురించి అనేక సార్లు చెప్పారు. పాత నిబంధనలో కూడా దేవుని గురించి మోషే అడుగుతున్నప్పుడు దేవుడు ఆయన ఎవరు అని చెబుతున్నారు. మోషే , దేవునితో నిన్ను ఎవరు పంపారు, ఆయన పేరు ఏమిటి అని అడిగితే నేను ఏమి చెప్పాలి అని అడుగుతున్నప్పుడు దేవుడు ఆయనకు చెబుతున్నారు. "నేను ఉన్నవాడను" అని. ఇక్కడ ఉన్నవాడు అంటే కలకాలం ఉండేవాడు అని అర్ధం. ఆయన గతించిన కాలంలో ఉన్నాడు, భవిష్యత్తు కాలంలో ఉంటాడు, మరియు వర్తమాన కాలంలో ఉన్నాడు అని అర్ధం. ఇలా ఎందుకు అంటే ఆయన జీవం కాబట్టి. ఏవరు అయితే కలకాలం ఉండాలి అంటే ఆయన దగ్గరకు వెళ్ళాలి.
యేసు ప్రభువుని చూడటం తండ్రిని చూడటమే
ఇవి అన్ని కూడా దేవుని లక్షణాలు, యేసు ప్రభువు తన జీవితం ద్వారా తండ్రిని మనకు తెలియజేస్తున్నాడు. అందుకే యేసు ప్రభువు మాత్రమే దేవుని దగ్గరకు మనలను తీసుకువెలుతారు, ఎందుకంటే యేసు ప్రభువుకు మాత్రమే తండ్రి పూర్తిగా తెలుసు. అందుకే యేసు ప్రభువు ములమునే మనం తండ్రి దగ్గరకు వెల్లగళం. తండ్రిని మనం తెలుసుకోవాలి అనుకున్న, లేక తండ్రిని చూడాలి అని అనుకున్నా మనం యేసు ప్రభువును తెలుసుకోవాలి, మరియు చూడాలి. అందుకే పిలిప్పు తండ్రిని చూపించమని అడుగుతున్నప్పుడు యేసు ప్రభువు, పిలిప్పు నీవు నన్ను చూడలేదా? అని అడుగుతున్నారు. యేసు ప్రభువు మాటలు మొత్తం తండ్రి మాటలు, యేసు ప్రభువు పనులు మొత్తం తండ్రి పనులు. ఇక్కడ యేసు ప్రభువు ఇంకొక మాట చెబుతున్నారు. అది ఏమిటి అంటే నేను తండ్రి యందు మరియు తండ్రి నా యందు ఉన్నాము అని చెబుతున్నారు. యేసు ప్రభువు అనేక సార్లు తండ్రితో తన ఐక్యత గురించి చెప్పారు. యేసు ప్రభువు తన శిష్యులను ఆయన చేసిన పనులను బట్టి అయిన తనని విశ్వసించమని చెబుతున్నారు. ఆయనను విశ్వసించిన వారి ద్వారా మరియు తన శిష్యుల ద్వారా ఆయన అనేక మంచి పనులను చేస్తారు. ఆయన శిష్యులు ఆయనను ఏమి అడిగిన అది దయచేస్తాను అని వాగ్ధానం చేస్తున్నారు.
ప్రార్దన : ప్రభువా మీరు చెప్పిన విధముగా మీరే మార్గం సత్యము జీవం, మీ ద్వారా మాత్రమే మేము తండ్రిని తెలుసుకోగలుగుచున్నాము. మీ ములమున మాత్రమే మేము తండ్రి దగ్గరకు చేరుతాము అని విశ్వసిస్తున్నాము. మీరు మాకు మార్గం మాత్రమే కాదు మా గమ్యం అని కూడా తెలుసుకుంటున్నాము. మేము ఎల్లప్పుడు మిమ్ములను వదలకుండా ఎల్లప్పుడు మిమ్ములను అనుసరిస్తూ జీవించే వారీగా మమ్ములను దీవించండి. ప్రభువా మాకు మిమ్ములను పూర్తిగా తెలుసుకొని మీరు అనుగ్రహించే అన్ని అనుగ్రహాలు పొందే భాగ్యం మాకు దయచేయమని వెదుకొనుచున్నాము. మీరు తండ్రి యందు ఉన్నారు అని, తండ్రి మీ యందు ఉన్నారు అని విశ్వసిస్తున్నాము , కొన్ని సార్లు మాకు ఉన్న సమస్యల వల్ల లేక మా అజ్ఞానం వలన మిమ్ములను పూర్తిగా తెలుసుకోలేక పోయిన సందర్భాలలో మమ్ములను క్షమించమని అడుగుచున్నాము. మీ మీద విశ్వాసం వలన మేము మా జీవితాలను కావలసిన వాటిని అనుగ్రహించమని వెదుకునుచున్నాము. ఆమెన్.