6, మార్చి 2021, శనివారం

తపస్సు కాల 3వ ఆదివారం

తపస్సు కాల 3వ ఆదివారం  

నిర్గమ 20:1-17, 1కొరింతి 1:22-25 ,యోహాను 2:13-22                                                

క్రీస్తు నాధునియందు ప్రియమైన సహోదరి సహోదరులరా! ఈనాటి గ్రంథ పఠనాలు మన జీవితాలలో  దైవ ప్రేమ సోదర ప్రేమ కలిగియుండాలని తెలియజేస్తున్నాయి. తపస్సు కాలంలో ముఖ్యంగా మనం క్రీస్తు పునరుత్తానా మహోత్సవాన్ని కొనియాడుటకు సిద్ధపడుతున్నాం. మహోత్సవంలో నిండు మనస్సుతో పాల్గొనుటకు దైవ ప్రేమ సోదర ప్రేమ అను రెండు సుగుణాలు మనకు ఎంతగానో దోహదపడతాయిఏలయన, నిత్య జీవితం పొందడానికి దైవ ప్రేమ సోదర ప్రేమ అనునవి చాలా ముఖ్యం అని  ప్రభువే చెప్పియున్నారు (లూకా 10:25-27).

            ఈనాటి గ్రంథ పఠనాలను ధ్యానించినట్లయితే రెండు ఆజ్ఞలను మనం చూస్తున్నాం. మొదటి పఠనంలో  యిస్రాయేలు ప్రజలకు ప్రభువు సీనాయి కొండ దగ్గర పది ఆజ్ఞలు ఇస్తున్నారు. దేవుని ఆజ్ఞలను తెలుసుకొని, పాటించుట ధ్వారా ప్రభుని ప్రేమ, కరుణ ఎల్లప్పుడూ మనపై ఉంటాయని తెలుస్తుంది. పది ఆజ్ఞలలో మొదటి మూడు ఆజ్ఞలు దేవుని ప్రేమని, చివరి ఏడు ఆజ్ఞలు పొరుగువారి యందు ప్రేమను వెల్లడిచేస్తున్నాయి (నిర్గమ 20:1-17, మత్తయి 22: 37-40). 

అసలు దైవ ప్రేమ, సోదర ప్రేమ అంటే ఏమిటి? ఎందుకు మనం దేవుని, మన తోటి సోదరుని ప్రేమించాలి? దానివలన మన జీవితాలలో కలుగు మేలు ఏమిటి

దైవ ప్రేమ  

"దైవ ప్రేమయన ఆయన ఆజ్ఞలకు లోబడుటయే" (1 యోహాను 5: 3, యోహాను 14:15 ). దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను పాటించడం, ఆయన ఆజ్ఞలను పాటించడం అంటే దేవుని ప్రేమించడం అని అర్ధం. ఆయన ఆజ్ఞను పాటిస్తే ఆయన ప్రేమ మనపై కలకాలం ఉంటుంది. ఇందుకు నిదర్శనంగా పరిశుద్ధ గ్రంధంలో మనం చాలామందిని చూస్తున్నాం.

ఉదాహరణకు ఆదికాండంలో అబ్రహమును చూస్తున్నాం. దేవుడు అబ్రాహామును "నీ దేశము, నీ ప్రజలను వదిలి నేను చూపు దేశమునకు వెళ్లుము" (ఆది 12: 1-4) అని  ఆజ్ఞాపించగానే అబ్రాహాము తిరుగు ప్రశ్న వేయకుండా వెళ్తూ ఉన్నారు. అల్లాగే "నీవు గాఢముగా ప్రేమించిన నీ ఏకైక కుమారుని నాకు బలిగా సమర్పించుము" (ఆది 22:2-19) అని ఆజ్ఞాపించినప్పుడు కూడా అబ్రాహాము మారుమాట పలాకాకుండా మరుసటి రోజు తెల్లవారకు ముందే కుమారుని తీసుకుని దహనబలి సమర్పించడానికి సిద్ధపడ్డారు అని పరిశుద్ధ గ్రంధంలో చూస్తున్నాంఅబ్రాహామునకు ప్రభువుమీద ఎనలేని ప్రేమ గౌరవం ఉన్నదీ కాబట్టే ప్రభువు ఆజ్ఞాపించినదాన్ని వెంటనే చేస్తున్నారు, అందుకుగాను ప్రభువు అబ్రాహామును నీతిమంతునిగా ఎంచెను (ఆది 15:6). ఈనాడు తల్లి తిరుసభచేత కూడా విశ్వసమునకు తండ్రిగా పిలవబడుచున్నాడు

ఈనాటి సువిశేషంలో యూదులు, దేవాలయ అధికారులు యెరూషలేము దేవాలయాన్ని వ్యాపార స్థలంగా మార్చడాన్ని చూస్తున్నాం. దేవునియందు క్రీస్తుకు  గల ప్రేమ ఆయనను దహించివేస్తుంది. సంఘటనను చూడగానే క్రీస్తు కోపోద్రిక్తుడవుతున్నారు. అధికారులు దేవుని ఆజ్ఞలు మర్చిపోయి, ఆయనాయందు ప్రేమ విశ్వసాన్ని కోల్పోయి దేవాలయాన్ని వ్యాపారస్థలంగా మారుస్తున్నారు.

ఎందుకన, " ప్రజలు నన్ను కేవలం వారి పెదవులతో మాత్రమే స్తుతించుచున్నారు, కానీ వీరి హృదయాలు నాకు కాదు దూరం"  (మత్తయి 15:8) అని ప్రభువునకు తెలుసు. అధికారులు కేవలం జనులు చూచుటకై ప్రార్ధన చేస్తారు తప్ప దేవుని యందు ప్రేమతో కాదు (మత్తయి 6:5). ప్రభువు ఇచ్చిన మొదటి మూడు ఆజ్ఞలు (ప్రభువుని మాత్రమే ఆరాధించాలి, ఆయన నామమును, పండుగా దినములను పవిత్రముగా ఉంచాలి ) పవిత్రత గురించి చెప్తున్నాయి. కానీ దేవాలయ అధికారులు మాత్రం ప్రభువు వసించు ఆలయాన్ని, ఆయన నామమును, పండుగ దినములను అపవిత్రం చేస్తున్నారు. కనుక క్రీస్తుని ఆగ్రహానికి గురియగుచున్నారు. మన జీవితాలలో కూడా ప్రభుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

దేవుని మనం ఎందుకు ప్రేమించాలి, ఆజ్ఞలు పాటించాలి?

1). ఆయన కరుణ కొరకు

దేవుడు నిర్గమ కాండం 20:6 లో పలుకుతున్నారు, ఎవరైతే దేవుని ప్రేమించి, ఆయన ఆజ్ఞలను పాటిస్తారో దీవుడు వారిని వేయి తరములదాకా కరుణిస్తాను అని. నీనెవె ప్రజలు పాపంలో కూరుకుపోయినప్పుడు ప్రభువు పట్టణాన్ని నాశనం చేస్థానాన్ని యోనా ప్రవక్త ధ్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే ప్రజలు పలుకులు విన్నారో వెంటనే పశ్చాతాపం చెంది ప్రభుని మొరపెట్టుకోగానే ప్రభువు వారిని కరుణించారు (యోనా 3:10). కనుక ప్రభువు ఆజ్ఞానుసారం జీవిస్తే ఆయన కరుణ ఎల్లప్పుడూ మనపై ఉండును.

2). ప్రభువు  రక్షణ కొరకు

దేవుడు కీర్తనాకారుడు ధ్వారా  (91:14)  "నన్ను ప్రేమించువారిని నేను రక్షించెదను", " నా నిబంధనమును పాటించి, నా కట్టడాలను పాటించువారికి నా రక్షణ తరతరములవరకు లభించును' (కీర్తన 103:18) అని అంటున్నారు. మనం ప్రభువు పట్ల, ప్రభుని ఆజ్ఞల పట్ల ప్రేమకలిగి జీవిస్తే ఎన్ని అపాయములు ఆటంకాలు మన దారికి వచ్చినా ఆయన ఎల్లప్పుడూ మనలను రక్షిస్తారు. ఇందుకు నిదర్శనం మనం దానియేలు గ్రంధంలో చూడవచ్చు. హిల్కియా కుమార్తె సూసన్నా చిన్నప్రాయం నుండి ధర్మశాస్త్ర నియమముల ప్రకారం జీవించెను (దానియేలు 13:3). ఎప్పుడైతే నాయమూర్తులు అన్యాయంగా సూసన్నపై నిందారోపణగావించి మరణశిక్ష విధించారో, ప్రభువు వెంటనే దానియేలు ధ్వారా తనను నమ్మిన బిడ్డను రక్షిస్తున్నారు (దానియేలు 13:62). కనుక ప్రభువుని ప్రేమించి ఆయన ఆజ్ఞానుసారం జీవిస్తే తన రక్షణ మనతో కాలాంతకాలం ఉండును.

పొరుగువారిని ప్రేమించుట:

క్రైస్తవ జీవితం జీవిస్తున్న ప్రతి ఒక్కరు కశ్చితంగా సోదరప్రేమ కలిగియుండాలి. ఏలయన, తన తోటివారిని ప్రేమించువారే  చట్టములను నెరవేర్చినట్టు' (రోమా 13:8) అని పునీత పౌలు గారు పలుకుచున్నారు. క్రీస్తు ప్రభువే స్వయానా చెప్పియున్నారు  ధైవుని ప్రేమించుట, పొరుగువారిని ప్రేమించుట అత్యంత ముఖ్యమైన ఆజ్ఞలు అని (మార్కు 12:31, యోహాను 15:12). పరిశుద్ధ గ్రంధంలో పొరుగువారిని ప్రేమించుట అను ఆజ్ఞకు చాలా ప్రత్యేకమైన స్థానం ఇవ్వబడింది. పది ఆజ్ఞలలో చివరి ఏడు ఆజ్ఞలు (నిర్గమ 20:12-17) 'మనలను మనం ప్రేమించుకొనినట్లే మన పొరుగువారిని కూడా ప్రేమించాలి' అను ఒకే ఒక్క ఆజ్ఞయందు ఇమిడియున్నదని పునీత పౌలుగారు (రోమా 13:9) పలుకుచున్నారు. అంతే కాదు గలతి 5:14 లోధర్మశాస్తమంతయు సోదరప్రేమ అను ఒక్క ఆజ్ఞలో నెరవేరియున్నదని’ కూడా పౌలుగారు స్పష్టం చేస్తున్నారు

మన జీవితాలలో అనేకమార్లు మనం దేవాలయాన్ని వెళ్తూ, ప్రార్ధనా ఉపవాసాలు చేస్తూ దేవునిపై మన ప్రేమను అనేకవిధాలుగా వెల్లడిచేస్తుంటాము. కానీ మన పొరుగువారితో మాత్రం ఎల్లప్పుడూ గొడవలు, మనస్పర్థలు, కోపం, పగ, ద్వేషాలతో జీవిస్తుంటాం. కానీ దేవుని ప్రేమించడం అంటే మన పొరుగువారిని ప్రేమించడమే అని (1 యోహాను 4:21) పరిశుద్ధ గ్రంధం తెలియజేస్తున్నది. మనం దేవుని ప్రేమిస్తున్నాం అని చెప్పుకుంటూ మన సోహోదరులను ద్వేషిస్తే మనం అసత్యవాదులం అవుతాం. ఎందుకంటే మన కంటికి కనిపించే తోటి సోహోదరుని ప్రేమింపనిచో, మనం చూడని దేవుని ఎలా ప్రేమింపగలం? (1 యోహాను 4 :20). కనుక దైవ ప్రేమ, సోదర ప్రేమ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవి

ఈనాటి సువిశేషంలో క్రీస్తు ప్రభువు త్రాళ్లతో కొరడా పేని దహనబలికి అమ్ముటకు తెచ్చిన జంతువులను, పావురాలను, డబ్బులు మార్చువారిని దేవాలయం నుండి వెళ్లగొడుతున్న సంఘటన మనకు కనిపిస్తుంది. ఎందుకు ప్రభువు ఇంత కఠినంగా ప్రవరిస్తున్నారు? దేవాలయ ఆచారం ప్రకారం దహనబలి వాడే జంతువులు, పావురాలు అసుచికరంగా మరియు ఎటువంటి లోపం కలిగి ఉండరాదు. ఎందుకంటే బలికి మంచి జంతువులను అమ్ముతున్నారు. ఎందుకు క్రీస్తు ప్రభువు కోపోద్రిక్తుడయ్యారు? ప్రభువు ఆలయాన్ని అపవిత్రం చేయడంతో పాటు, వారు పొరుగువారికి అన్యాయం చేస్తున్నారు. వారు వ్యాపారానికి వాడుతున్న దేవాలయప్రాంగణం పరదేశీయులకు, అన్యులకు ప్రార్థనచేసుకొనుటకు కేటాయించిన స్థలం. స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా వారికి ఇష్టం వచ్చిన ధరకు అన్యాయంగా బలి వస్తువులను అమ్ముతున్నారుఅనేకమంది పేదప్రజలు అంతటి వెలనిచ్చి బలివస్తువు కొనలేక ప్రభువుకు బలి అర్పించకుండా నిరాశతో ఇంటికి తిరిగివెళ్తున్నారు. తమ తోటి సహోదరులపైనా ప్రేమపూర్వకంగా ప్రవర్తించకుండా వారికి ఇష్టంవచ్చినట్లు అన్యాయంగా వ్యాపారం చేస్తున్నారు. పేదవారికి జరుగుతున్న అన్యాయాన్ని చూసి భరించలేక క్రీస్తుప్రభువు ఆగ్రహించుకుంటున్నారు

మన జీవితంలో కూడా ప్రభువునకు, ఆయన ఆలయానికి, ఆయన ప్రజలకి ఎంత గౌరవం ఇస్తున్నాం అని ధ్యానం చేసుకుందాం. ఎందుకన, ప్రతిఒక్కరు దేవుని ఆలయమనియు, పవిత్రాత్మకు నిలయమనియు పౌలుగారు 1 కొరింతి 3 :16లో పలుకుచున్నారు. అటువంటి దేవుని ఆలయమైన మన తోటి సహోదరి సహోదరులను మనం ఏవిధంగా గౌరవిస్తున్నాం, ప్రేమిస్తున్నాం. మనం ఎప్పుడైతే మన పొరుగువారితో ప్రేమభావం కలిగి ఉంటామో దేవుని ఆలయమును మనలో దేవుడు నివాసం ఏర్పరచుకుంటారు (1 యోహాను 4:12). తన సహోదరుని ప్రేమింపనివాడు దేవుని బిడ్డడు కాదు, సైతాను బిడ్డ (1 యోహాను 3 :10), అట్టివాడు ఇంకను మృత్యువునందే ఉన్నాడు (1 యోహాను 3:14) అని యోహానుగారు తెలియజేస్తున్నారుఎందుకు మనం తోటివారిని ప్రేమించలేకపోతున్నాం? ఎందుకంటే మనం కూడా యూదులవలె అద్భుతాలను, గ్రీకులవలే వివేకమును (1 కొరింతి 1 :22) కోరుచున్నాము. కానీ వీటి అన్నింటికంటే గొప్పవాడు లోకరక్షకుడైన యేసు క్రీస్తును మన పొరుగువారిలో గుర్తించలేకపోతున్నాం. మనం లోకసంబంధమైన వాటికోసం కాకుండా క్రీస్తుప్రభువు కోసం వెదకితే కశ్చితంగా ఆయన అనుగ్రహం, కరుణ, రక్షణ పొందగలుగుతాం.

కనుక క్రిస్తునాధునియందు ప్రియా సహోదరి సహోదరులారా. క్రీస్తు పునరుత్తాన పండుగకు సిద్ధపడుతున్న మనమందరం ఈనాడు గుర్తుంచుకోవాల్సింది, దేవునియందు ప్రేమ, సహోదర ప్రేమ లేకుండా పండుగలో మనం సంపూర్ణ హృదయంతో దేవునికి ఇష్టపూర్వకంగా పాల్గొనలేము. అది కేవలం నామమాత్రంగానే ఉంటుంది తప్ప నిజమైన పునరుత్తానాన్ని మన జీవితంలో అనుభవించలేం. కాబట్టి, సహోదరి సహోదరులారా పది ఆజ్ఞలను మనస్సునందు ముద్రించుకొని దైవ ప్రేమ, సోదర ప్రేమ అను గొప్ప సుగుణాలతో పునరుత్తాన పండుగకు నిండు మనస్సుతో సిద్ధపడదాం. ఆమెన్.

By Br. Joseph Kampally

 


27, ఫిబ్రవరి 2021, శనివారం

తపస్సుకాల రెండవ ఆదివారము

తపస్సుకాల రెండవ  ఆదివారము 

ఆది 22:1–2, 9–13, 15–18

రోమా 8:31–34

మార్కు 9:2–10

క్రీస్తు నాధుని యందు ప్రియ స్నేహితులారా, ఈనాడు మనము తపస్సుకాల రెండవ ఆదివారమును కొనియాడుతున్నాము. ఈనాటి దివ్య గ్రంథ పఠనములు మనము ధ్యానించినట్లయితే, త్యాగపూరిత జీవితము మరియు దేవుని సాన్నిధ్యము అను అంశముల గురించి మాట్లాడుతున్నాయి. ఎవరైతే దేవుని యందు విశ్వాసముంచి, త్యాగపూరితమైన జీవితము జీవిస్తారో వారు దేవుని సాన్నిధ్యాన్ని కనుగొంటారు, మరియు వారు నిత్యము దేవుని సన్నిధిలో నివశిస్తారు. అప్పుడు దేవుడు వారి వారి కుటుంబాలను దీవిస్తాడు.

ఈనాటి సమాజమును గమనించినట్లయితే ఎంతోమంది దేవుని యందు విశ్వాసములేకుండా, ఎన్నో వ్యసనములకు గురి అవుతున్నారు. తల్లితండ్రులు అంటే గౌరవం లేకుండా పిల్లలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, భార్యభర్తల మధ్య అనేకానేక సమస్యలు, ఒకరినొకరు అర్ధం చేసుకోకుండా వివాహ భాంధవ్యాన్ని అపార్ధాల ముసుగులో నెట్టుకొస్తున్నారు. ఈ సందర్భములో అబ్రాహాము జీవితము, ఈనాటి మొదటి పఠనము ద్వారా ఓ మంచి ఉదాహరణమును మన ముందుంచుతుంది.

అబ్రాహాము విశ్వాసులందరిలో చాల గొప్పవాడు. ఎందుకనగా అబ్రాహాము దేవుని పిలుపును ఆలకించి , దేవుణ్ణి అనుసరించి దేవుని చిత్తానుసారముగా జీవించాడు. అబ్రాహాము ఎల్లపుడు దేవుని కనుసన్నలలో జీవిస్తూ ఉండేవుడు. ఓనాడు దేవుడు అబ్రాహాము విశ్వాసాన్ని పరీక్షించడం కోసం అబ్రాహాము యొక్క ముద్దుల తనయుని, తన ఒక్కగానొక్క కుమారుడైన ఈసాకుని బలిగా సమర్పించమన్నాడు. అబ్రాహామునకు చాల కాలము వరకు సంతానము కలగలేదు. దేవుడు అబ్రాహామునకు ముసలి ప్రాయములో కుమారుణ్ణి ప్రసాదించాడు. దేవుడు ఈసాకుని బలిగా అర్పించమన్నపుడు అబ్రాహాము  చిత్తం ప్రభు! అని దేవుని ఆజ్ఞను శిరసావహించి దేవుని చిత్తానుసారముగా ఈసాకుని దేవునికి సమర్పించుటకు సిద్ధపడుతున్నాడు. దేవుడు ఈసాకుని బలిగా సమర్పించమన్నపుడు అయన విశ్వాసం తొట్రిల్లలేదు. అబ్రాహాము చెదరలేదు, బెదరలేదు, వెనకడుగు వేయలేదు.

దేవుని యందు విశ్వాసము ఉంచి సకలము దేవుడే కలుగజేసాడు, నాకు ఈ బిడ్డను ఆయనే దయచేసాడు, ఆయనే సమకూరుస్తాడు అని ఈసాకును బలిగా సమర్పించడానికి మోరియా కొండ మీదకు తీసుకు వెళుతున్నాడు. అప్పుడు దేవుడు అబ్రాహాము విశ్వాసమునకు మెచ్చి, అబ్రాహాము చేసిన త్యాగమునకు గుర్తుగా ఆయన కుటుంబాన్ని ఎంతగానో దీవించాడు. అదేవిధముగా ప్రియ దేవుని బిడ్డలారా, మం జీవితములో కూడా ఎన్నోసార్లు, అనేక పరీక్షలకు గురవుతుంటాము. అనేక శోధనలు, సమస్యలు ఎదురవుతుంటాయి. ఆ సమస్యలను చూసి మనము భయపడకుండ, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని దేవుని దూషించకుండ, దేవుని యందు విశ్వాసముంచి, అబ్రాహాము ఏ విధముగా త్యాగపూరిత జీవితము జీవించాడో అదే విధముగా మనము కూడా జీవించాలి అని మొదటి పఠనము తెలియజేస్తుంది.

అదే విధముగా ఈనాటి సువిశేష పఠనంలో యేసు ప్రభువు దివ్యరూపము దాల్చడము మనము చూస్తున్నాము. యేసు ప్రభువు దివ్యరూపము దాల్చినపుడు , తాను పొందబోవు శ్రమలు, మరణ పునరుత్తానముల గురించి మోషే, ఏలీయాతో సంభాషిస్తున్నారు. అప్పుడు అక్కడ పేతురు, యాకోబు, మరియు యోహాను మాత్రమే ఉన్నారు. వారు ఆ దృశ్యాన్ని చూసి, దేవుని యొక్క సాన్నిధ్యాన్ని కనుగొన్నారు, ఆ సాన్నిధ్యాన్ని అనుభవించారు. అందుకనే వారు సమస్తాన్ని మరిచిపోయారు. పేతురు గారు 4 వ వచనంలో బోధకుడా! మనము ఇక్కడే ఉందాము. మీకు, మోషేకు, ఏలీయాకు మూడు పర్ణశాలలు నిర్మిస్తాము అని అంటున్నారు.

మనము కూడా ఎప్పుడైతే దేవుని సాన్నిధ్యములో ఉంటామో, ఎన్నడైతే మనము దేవునిని కనుగొంటామో, దేవుడు మనతో మాట్లాడతాడు, తన రహస్యాలను మనకు బయలు పరుస్తాడు. ఆనాడు కొండమీద దేవుడు, ;ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనను ఆలకింపుడు; అని శిష్యులతో పలికారో ఈనాడు అదే దేవుడు మనతో కూడా పలుకుతారు. ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో ఉంటామో అప్పుడు ఎలాంటి సైతాను శోధనలనైనా ఎదుర్కొన శక్తిమంతులమవుతాము. ఎలాంటి సమస్యలైనా మన మనస్సును కలత పెట్టలేవు. అందుకనే ఈనాటి రెండవ పఠనములో పునీత పౌలు గారు ఈవిధముగా అంటున్నారు,దేవుడు మన పక్షమున ఉన్నచో, ఇక మనకు విరోధి ఎవడు ఎప్పుడైతే మనము దేవుని యందు ఉంటామో అప్పుడు దేవుడు మనయందు ఉంటాడు. దేవుడు మనయందు ఉండాలి అంటే మనము పవిత్రముగా జీవించాలి, దేవునికి అనుగుణముగా, విశ్వాస జీవితములో, త్యాగపూరితముగా జీవించాలి. అప్పుడు దేవుడు మనయందు జీవిస్తాడు. కావున ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తపస్సు కాలము ఎంతో చక్కని కాలము. ఎందుకనగా, మనమందరము ఉపవాసముతోను, ప్రార్ధనతోను గడుపుకోవడానికి దేవుడు మనకు దయచేసిన ఒక చక్కటి కాలము. ఈ తపస్సు కాలములో మనము దానధర్మాలతో, ప్రార్థన జీవితముతో, దేవుని యందు విశ్వాసముంచి, మన పాపాలను, చెడు ఆలోచనలను, కుళ్లూకుతంత్రాలను విడనాడి, మంచి జీవితాలను జీవించ కావలసిన అనుగ్రహములను దయచేయమని దేవుని ఆర్థిద్దాము. ఆమెన్.

20, ఫిబ్రవరి 2021, శనివారం

తపస్సు కాల మొదటి ఆదివారం

  

ఆదికాండము 9: 8-15 , 1 పేతురు 3: 18-22, మార్క్ 1:12-15

ప్రియా దేవుని బిడ్డలారా ,సహోదరి సహోదరులారా , ఈనాడు మనం  తపస్సుకాల మొదటి  ఆదివారాన్ని కొనియాడుతున్నాము.  ఈనాడు  తల్లి  తిరుసభ  మన జీవితములో మార్పు, మరియు  హృదయ పరివర్తన గురించి  ధ్యానించ  ఆహ్వానించుచున్నది. తపస్సు కాలము యొక్క  ముఖ్య ఉద్దేశము ఏమిటంటే మానవుడు  తన చేదు క్రియలను, ఆలోచనలను , మాటలను  వదలి , మంచి  క్రియలవైపు , మంచి జీవితం, మంచి  ఆలోచనలవైపు మరియు  మంచి మాటలవైపు మరలడం.  అదే పలు  పశ్చాత్తాప, ఉపవాస మరియు  త్యాగ క్రియల ద్వారా తన  నడవడికను క్రీస్తులో నూత్నికరించుట.  ఈనాటి  సువిశేషంలో  క్రీస్తు ప్రభువు  హృదయ పరివర్తనకు ఆహ్వానము పలుకుచున్నాడు. కాలము  సంపూర్ణమైంది, దేవుని రాజ్యము సమీపించింది. హృదయ పరివర్తన చెంది , సువార్తను విశ్వసింపుడు. (మార్కు :1, 15) అని ఆహ్వానిస్తున్నారు. 

మార్పు : 

మానవజీవితములో  మార్పు  అనేది సహజము.  లోకములో  ప్రతి  వస్తువు, ప్రతి విషయము మారుతు  ఉంటుంది.  మారాలి కూడా. ఎందుకంటే  మార్పులోనే అందము, ఆనందము ఉంటుంది.  అందుకే అంటారు, పాతోక  రోత , క్రొత్త ఒక వింత అని. కనుకనే మానవుడు ప్రతి విషయములోను కూడా  కొత్తదనం కోరుకుంటూ ఉంటాడు.  దైనందిన  జీవితములో కానివండి వ్యాపారములో కానివండి. ,భోజన పదార్థములో కానివ్వండి. ప్రతి  విషయములో కుడా  మార్పుదే విజయము. లోకములో అన్నింటిలోనూ మార్పు , క్రొత్తదనం  కోరుకుంటాడు మానవుడు . దానికి తగినట్లే  క్రొత్త క్రొత్త  విషయములను కనిపెడుతూ ఉంటాడు. ఈ మార్పు  అనే  సూత్రంతోనే  అన్నింటిలోనూ అభివృద్ధి  చెందుతూ ఉన్నాడు. 

 

ఈనాడు  టెక్నాలజీ  పెరిగింది , రక్త  సంభందాలు తగ్గినవి .  ఆస్తు పాస్తులు  పెరిగాయి , బంధుప్రీతి తగ్గినది. వస్తు వినియోగమపెరిగినది. మనిషి విలువ తగ్గినది, క్షణభంగురమైన , అశ్వాశత విషయములపై  ఆసక్తి పెరిగినది, శాశ్వత విషయములగు దేవుడు , ఆత్మ , ఆనందము, సంతోషం, ప్రేమ సహవాసము అను విషయములపై శ్రద్ద తగ్గినది.

ప్రియా దేవుని బిడ్డలారా మనం ఒకసారి  ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం ఎక్కువ  దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాము, లోకములో ఉన్న వాస్తువులకా లేక జీవిత మార్పుకా . 

ప్రేమ - హృదయ పరివర్తన 

నోవా కాలంలో మానవుడు ఘోరమైన  పాపంలో  జీవిస్తున్న సమయములో దేవుడు  కోపించి  మానవుని నాశనం  చేయాలనీ జలప్రళయమును పంపించాడు.  చివరకు నోవా కుటుంబ సభ్యులు  మాత్రమే  రక్షించబడ్డారు, ఈ యొక్క  పతనాన్ని  చూచి దేవుడు మనసు మార్చుకొని నోవాతో ఒడంబడిక  చేసుకుంటున్నాడు.  అది ఏమిటంటే  ఇక ఎన్నడూ ఇటువంటి ముప్పును పంపనని ఆది ఖాండము 9:11 . అలాంటి గొప్ప దేవుడు  మానసు మార్చుకొని  తన ఏకైక  కుమారుణ్ణి మన రక్షణార్థమై పంపియున్నాడు యోహాను3:16. మరి మనము ఎందుకు  హృదయ పరివర్తన చెందలేకున్నాము. 

చివరిగా ఈ తపస్సు కాలములో తరచుగా వినపడే మాటే ఇది .. హృదయ పరివర్తనలే కుండా  మనిషికి పర లోక రాజ్యములో తావులేదు. చక్కని గులాబీ పువ్వు చుట్టూ బోలెడన్ని ముల్లుంటాయి. గులాబీ కోయాలంటే మన చేయి ముల్లులలను ధాటి వెళ్ళాలి. అదే విధముగా పరలోకరాజ్యములో శశ్వతానందం పొందాలంటే  హృదయ పరివర్తన తప్పనిసరి. 

కాబట్టి  ఈ తపస్సు కాలము మొత్తము కూడా దేవుని వాక్యాన్ని  ఆలకిస్తూ , పాటిస్తూ ,మన జీవితలను చిగురింప  చేయమని ప్రార్థనచేద్దాం '. 

 

బ్రదర్ అబ్బదాసరి రత్నరాజు ఓ  సి డి 

 

13, ఫిబ్రవరి 2021, శనివారం

6 వ సామాన్య ఆదివారము

 6 వ సామాన్య ఆదివారము

క్రీస్తు నాథుని యందు ప్రియమైన స్నేహితులారా!

దేవుడు మానవులకు ఒసగు వరములలో ముఖ్యమైనది దయ; ఈ దయనే కనికరము, 

జాలి, కరుణ అని అంటుంటాము. ‘వ్యాధిగ్రస్తులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు 

అక్కరలేదని యేసు ప్రభువు (మత్తయి 9:12) వ వచనములో చెప్పిన మాటలు ఈనాడు 

మనకు గుర్తుకువస్తుంటాయి. మనము ఈరోజు మూడు పఠణాలను చదివినపుడు మనకు 

దేవుడు ఇచ్చు సందేశము ఏమిటి అంటే, శారీరక, మానసిక వ్యాధులతో బాధపడు వారిని 

దేవుడు దయచేత స్వస్థపరుస్తున్నాడని అని అర్థం అవుతుంది. ఈనాటి మొదటి 

పఠనము కుష్ఠ రోగము పొందిన వ్యక్తి యొక్క జీవిత విధానాన్ని చాల క్లుప్తముగా 

వివరిస్తుంది.

 

పాత నిబంధనలో కుష్ఠరోగము ఉన్న వారి పరిస్థితి చాలా ఘోరముగా ఉంటుంది. వారిని 

అశుద్దులుగా పరిగణించేవారు. ఈనాటి మొదటి పఠనములో (లేవి 13 :45) వారికి 

ఉన్ననియమాలు, చిరిగిన బట్టలు, తల విరబోసుకోవాలి. అతడు లేక ఆమె ప్రజల 

మధ్యలోకి రావాలంటే, నేను అశుద్ధుడను, అశుద్ధురాలిని అని కేకలు పెట్టాలి. వారు ఊరి 

బయట జీవించాలి, అటువంటి నియమాలను గూర్చి తెలియజేస్తుంది. రెండవ 

పఠనములో పునీత పౌలు గారు, మీరు ఏమి చేసినను దేవుని మహిమ కొరకై 

చేయవలయునని, ఎవరినీ భాధ పెట్టకుండ, నిస్వార్ధముతో, అందరిని సంతోషచిత్తులను 

చేయ ప్రయత్నిచండి, అని చెబుతూ నేను ఏ విధముగానైతే క్రీస్తును అనుసరించానో 

మీరును నన్ను అనుసరించండి అని నేర్పుతున్నారు.

సువిశేష పఠనములో కుష్టు రోగి ఎంతో వినయముతో చేసిన తగ్గింపు ప్రార్ధన దేవుడు 

ఆలకించి, అయన మీద  జాలి, దయ, కనికరము, ప్రేమ చేత అతనిని తాకి స్వస్థ 

పరిచారు. మార్కు 1: 45 లో చూసినట్లయితే కుష్టు రోగి తాను పొందిన స్వస్థత 

అనుభవాన్నిఎక్కువగా ప్రచారము చేయసాగెను. నలుదెసల నుండి జనులను దేవుని 

యొద్దకునడిపించగలిగాడు.

 

కాబట్టి ప్రియా స్నేహితులారా! మనలో చాలామంది, అనేక రకములైన కుష్టు రోగములతో 

బాధపడుతున్నాము. కుళ్ళు, కుతంత్రాలతో మనము కూడా కుష్టు రోగులుగా 

మారిపోతున్నాము. అదే విధముగా కుల, మాత, ప్రాంతీయ, వర్గములుగ విడిపోయి, ఒకరి 

పట్ల ఒకరు ఈర్ష్య, అసూయ, గర్వము, అహంకారములతో కుష్టు రోగులుగా దేవునికి 

దూరముగా, సంఘానికి దూరముగా, కుటుంబానికి దూరముగా జీవిస్తున్నాము. ఎప్పుడైతే 

మనము మన స్థాయిని గమనించి పశ్చాత్తాపపడి, దేవుని యొద్దనుండి, స్వస్థత అడిగితే 

దేవుడు మనలను తాకి స్వస్థపరుస్తాడు. అప్పుడు మన హృదయాంతరంగాలు 

శుద్ధమై పునీత పౌలు గారివలె క్రీస్తును అనుసరించగలము, ఎంతోమందిని దేవుని 

యొద్దకు నడిపించగలము. కాబట్టి దేవుడు మనలను తాకి శారీరకంగాను, మానసికంగానూ 

స్వస్థపరచాలని వినయముతో ప్రార్ధించి దేవుని దయను పొందుదాము. ఆమెన్ 

                By  Br. Suresh kolakaluru OCD 

 


6, ఫిబ్రవరి 2021, శనివారం

ఐదవ సామాన్య ఆదివారము

 
మొదటి పఠనము: యోబు 7:1-4,6-7
రెండవ పఠనము : 1 కొరింతి 9:16-19,22-23
సువిశేష పఠనం : మార్కు 1:29-39
క్రీస్తునాధుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి, సహోదరులారా, ఈ నాడు తల్లి శ్రీ
సభ మనకిచ్చినటువంటి మూడు పవిత్ర గ్రంథ పఠనాలు ఏమని సూచిస్తున్నాయంటే, ఏ విందంగా మనము క్రీస్తు అనుచరులుగా మన యొక్క క్రైస్తవ జీవిత బాధ్యతను స్వీకరించి, కార్య
నిర్వహణలోకి తీసుకొని వస్తున్నాము అని ధ్యానించమని ప్రశ్నిస్తుంది .
క్రైస్తవులుగా మన యొక్క బాధ్యత, మన యొక్క కర్తవ్యం ఏమిటి, అన్నది ఈ
నాటి సువిశేష పఠనము చాలా అర్థవంతంగా తెలియజేస్తుంది. అది ఏమిటి అంటే మన
జీవితాన్ని దేవుని చిత్తానుసారంగా, దేవునికి ప్రీతికరముగా జీవించి, మన బాథ్యతను
క్రీస్తువలె, పరిపూర్ణంగా నిర్వర్తించడం. పౌలు గారివలె దైర్యంగా, మనకు
అప్పగించినటువంటి క్రీస్తు సువార్తను బోధించడము.
మొదటి పఠనము : మొదటి పఠనములో యోబు గారు మన మానవ ఇహలోకపు జీవితం ఎటువంటిది మరియు మనం పొందే బాధలన్నియు కూడా అశాశ్వతమని , ఇహలోకం నుండి పరలోకపు నిత్యనివాసానికి లేదా నిత్యజీవితానికి ఏ విందంగా సిద్ధపడాలి అని తెలియజేస్తున్నారు.
మనం ధ్యానించినట్లయితే, యోబు గారు మానవ జీవితపు 3 సత్యాలను గూర్చి
మాట్లాడుతున్నారు.
 1. జననం, 2. ప్రస్తుత జీవిత కాలం, 3. మరణం.
ఈ మూడు సత్యాలను, తన జీవిత అనుభవంతో ఈవిధంగా చెబుతున్నారు. ఈ జీవితం
క్షణికమైనది అంటూ, వీటిని మన జీవిత కాలపు స్థితి లేదా వృత్తి తో పోల్చుతున్నారు.
 అది ఏమిటి అంటే, మన అందరికి తెలిసిన విధంగా మనం కూలి పని కోసం కానీ లేదా ఒకరి
దగ్గర బానిసగా పనిచేయుటకు వెళ్లే సందర్భాన్ని, మన జననంతో పోల్చుతున్నారు.
[Our birth into the world]
 మరి పని చేసే సమయంలో అలసిపోయి, విశ్రాంతి కోసం లేక నీడ కోసం ఆశపడుతూ ఉంటాం.
పని అయిపోయాక మన జీతం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అంటే మనం పని చేసే
సమయాన్ని జననం మరణం మధ్య కాల వ్యవధిలో సాగుచున్నటువంటి ప్రస్తుత లేదా
వర్తమాన కాలపు జీవితం తో పోల్చుతున్నారు.
 మన చేసిన పనికి, వేతనం డబ్బులతో చెల్లించబడుతుంది. కానీ మన జీవన వేతనం ఏమిటీ
అంటే, మన మరణం తర్వాత మనం ఇహలోకం నుండి పరలోకం చేరుటకు కావలసిన పరిశుద్ధపు
అర్హత లేదా నిత్య నరకం. అది మనం జీవన విధానాన్ని, జీవన శైలిని బట్టి ఉంటుంది.
అంటే మన ఇహలోకపు జీవితం ఏ విధంగా ఉన్నది, ఈ జీవితం ఏ విధంగా జీవిస్తున్నాము
అన్నది చాలా ముఖ్యమైనది. ఎప్పుడయితే మనం దేవుని కొరకు జీవిస్తామో ,అప్పుడు
మనకి ఎన్నో సైతాను శోధనలు, బాధలు మరియు దుఃఖాలు ఎదురవుతూ ఉంటాయి. వీటన్నింటిని
పట్టించుకోకుండా, వాటి గురించి ఆలోచించి మనోభావానికి గురి అవకుండా, ఇవన్నీ
అశాశ్వతం అని తెలుసుకొని జీవించి, దేవుని అనుసరించడమే మన యొక్క జీవన వృత్తి.
యోబు అంటారు, ఈ నా జీవితం శ్వాసంవంటిది, ఈ జీవితం ఒక గాలి వంటిది. ఒక్కసారి
శ్వాస ఆగిపోతే ఇక ఈ జీవితం లేదు అని. ఏ క్షణాన ఎం జరుగుతుందో తెలియదు. ఒకసారి ఈ
జీవితం కోల్పోయినట్లయితే మళ్ళీ తిరిగిరాదు. ఇది అశాశ్వతం. కానీ ఈ జీవితం తర్వాత
తిరిగి నిత్యజీవితాన్ని పొందగలుగుతాం. ఆ లోకానికి ముగింపు ఉండదు.

అందుకే, ఈ జీవితాన్ని చీకటితో, నిత్యా జీవితాన్ని వెలుగుతో పోల్చుతున్నారు.
యోబు అంటారు ఈలోకం నుంచి ఎప్పుడు పరలోకానికి వెళ్తాను అని ఎదురుచూస్తున్నారు.
రెండవ పఠనము: పునీత పౌలు గారు క్రీస్తు దర్శనం కలుగకమునుపు, ఏ విధంగా జీవించాడో
మనఅందరికి తెలుసు. క్రీస్తుని యెరుగకమునుపు, క్రీస్తు అంటే గిట్టనటువంటి వ్యక్తి,
క్రీస్తు అనుచరులను హింసించిన వ్యక్తి, ఇప్పుడు క్రీస్తే నా సర్వము, క్రీస్తే నాలో
జీవించేది అని క్రీస్తును అంటిపెట్టుకొని జీవిస్తున్నాడు. ఎందుకంటే ఆయన క్రీస్తు
దర్శనం పొందగలిగాడు, క్రీస్తే సత్యమని కనుగొన్నాడు. ఎప్పుడయితే
ప్రవిత్రాత్మతో నింపబడ్డాడో అప్పటినుంచి తనకు అప్పగించినటువంటి క్రీస్తు
సువార్తను ప్రకటించే బాధ్యతను స్వీకరించి, విడనాడకుండా క్రీస్తు సేవను దైర్యంగా
కొనసాగించారు. సత్యానికి అనుగుణంగా జీవిస్తూ, ప్రతిఒక్కరికి సువార్తను బోధిస్తూ,
క్రీస్తు నామములో అందరికి ఒక బానిస వలె, అన్నివిధాలుగా తనను తాను మలచుకొని, తన ఇహలోక బాధ్యతను కొనసాగించాడు అని రెండవ పఠనము లో చూస్తున్నాము. క్రీస్తుకు ఉత్తమమైన
సేవకుడు, అనుచరుడు, అని నిరూపించుకున్నాడు. అందుకు ప్రతిఫలంగా క్రీస్తు ఆయనకు పరలోకపు నిత్యా భాగ్యాన్ని దయచేసారు. క్రీస్తు సువార్తను బోధించకపోతే నేను శిక్షింపబడాలి
అని పౌలు గారు అంటారు. ఎందుకంటే అది క్రీస్తు ప్రభువు తనకిచినటువంటి బాధ్యత.
సువిశేష పఠనము:
యేసు ప్రభువు, ఈ లోకంలో తన యొక్క కర్తవ్యాన్ని గురించి ఈనాటి సువిశేష పఠనం
ద్వారా తెలియజేస్తున్నాడు. దేవుని కుమారుడు ఈ లోకంలో బానిసవలె, ఒక సేవకునిలాగ
జీవించుటకు వచ్చాడు. ఎందుకు? దేవుని ప్రణాళిక ప్రకారం మనందరికీ రక్షణ తీసుకురావడానికి.
మనం ధ్యానించినట్లయితే ఈనాటి సువిశేషంలో కొన్ని సంఘటనలను చూస్తున్నాము.
 యేసు ప్రభువు సీమోను ఇంటికి విందుకి వెళ్ళినప్పుడు అక్కడ సీమోను అత్త
జ్వరంతో బాధపడుతుంది అని, యేసు దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ప్రభువు
ఆమెను స్వస్థత పరుస్తారు, తరువాత ఆమె కూడా తమ బాధ్యతగా, వారి ఇంటికి
అతిధిగా వచ్చిన వారికి సేవచేయడం ఆరంభిస్తుంది. ఆ తరువాత్త
వేకువజాముననే ప్రార్థన చేసుకొని, ఇతర ప్రదేశాలలో కూడా సువార్తను
ప్రకటించాలి, అదే నా కర్తవ్యం అని శిష్యులతో అంటున్నారు.
 లూకా శుభవార్త 4 :18 - 19 వచనాలలో క్రీస్తు ఈలోకానికి వచ్చిన తన
కర్తవ్యాన్ని గురించి స్పష్టంగా వ్రాయబడింది. పేదవారికి శుభవార్తను
ప్రకటించుటకు, పాపమనే చెరసాలలో ఉన్న వారికి విడుదల చేయుటకు,
అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థత పరుచుటకు మరియు దయామయుడైనటువంటి
దేవుని ప్రేమ రాజ్యాన్ని స్థాపించుటకు పంపబడిఉన్నాడని
తెలియజేస్తుంది. అవే ఈనాడు సువిశేష పఠనములో క్రీస్తు చేసేటటువంటి
కార్యాలు. యేసు ప్రభు తన భూలోక జీవితాన్ని తన తండ్రి చిత్తాను సారంగా పరిపూర్ణంగా
జీవించాడు . అందుకు బహుమానం, మనందరి యొక్క రక్షణ, దేవుని బిడ్డలుగా తన పవిత్ర
రాజ్యంలో బాగస్తులుమవడం. యేసు ప్రభు పేరు ప్రఖ్యాతల కోసం, స్వార్థం కోసం
జీవించలేదు, తండ్రికి వినయ విధేయతలు కలిగి, త్యాగశీలుడిగా మానవాళి కొరకు సేవచేసారు.
యేసు ప్రభు ఈ జీవితంలో ఏ విధంగా సాతాను శోధనలను, బాధలను, దుఃఖాలను ఎదుర్కొని
పాపానికి గురియవకుండా తండ్రి చిత్తాన్ని నెరవేర్చగలిగాడు అంటే, అది కేవలం తన నిరంతర
ప్రార్థన ద్వారానే అని సువిశేషంలో చదువుతున్నాము. అనునిత్యము, ప్రార్థన లో తన
తండ్రితో సంభాషిస్తూ, ఈలోకంలో తాను చేయవలసిన కార్యాన్ని గురించి తెలుసుకుంటూ
అందుకు కావలసిన శక్తిని పొంది, తన బాధ్యతను నిర్వర్తించాడు.


తల్లి మరియమాత కూడా, నిరంతర ప్రార్థనఅభ్యాసం ద్వారానే దేవుని ప్రణాళికను
తెలుసుకొని, ఆ ప్రకారం ‘ప్రభుని దాసురాలిగా, దేవునికి తల్లిగా’, తన బాధ్యతను
నిర్వర్తించింది. { లూకా 1:30-38}
ఈ నాడు మనమందరము కూడా ప్రార్థన యొక్క విలువను, శక్తిని తెలుసుకోవాలి.
ప్రార్థన అనేది పరలోకానికి మార్గం. ఈ లోకంనుండి పరలోకం చేరాలంటే ప్రార్థన అనే
మార్గాన్ని ఎన్నుకోవాలి. ప్రార్థన అంటే ఏమిటి అని పునీత అవిలాపురి తెరేసమ్మ గారు
ఈవిధంగా అంటున్నారు. “ప్రార్థన అంటే ఇద్దరి స్నేహితుల మధ్య జరిగే
ప్రేమపూరితమైన సంభాషణ”. ఈ సంభాషణలో దేవుడు మనకి తన ప్రణాలికను తెలియజేస్తాడు.
పవిత్రాత్మ శక్తిని ప్రసాదిస్తాడు. నిరంతర ప్రార్థనఅబ్యాసం ద్వారా దేవుని
చేరుకుంటాము.
మానవుడు దేవుని రూపంలో సృజింపబడ్డాడు. దేవునితోపాటు పవిత్రమైన ప్రేమ
జీవితాన్ని జీవించాడు. కానీ, పాపం ద్వారా ఆ పవిత్రతను కోల్పోయి పాపానికి బానిస
అయ్యాడు. తిరిగి ఆ పవిత్రమైన జీవితం పొందాలంటే, క్రీస్తువలె జీవించాలి. నిరంతర
ప్రార్థన ద్వారా క్రీస్తుని అంటిపెట్టుకుని, ఆయన సువార్తను ప్రకటిస్తూ, ఆయన
చిత్తానుసారంగా జీవించాలి. అందుకు ఉదాహరణ ఈ నాటి రెండవ పట్టణములోని పౌలు గారు.
పునీత పౌలు గారి వాలే ‘క్రీస్తే నా సర్వము, క్రీస్తే నాలో జీవించేది’ అన్న సత్యాన్ని
తెలుసుకొని జీవించి, బోధిస్తూ, సాక్షమివ్వగలగాలి. అందుకు మనం ఏ విధంగా మనకొరకు దేవుడు
మానవ రూపాన్నిదాల్చాడో, ఈనాడు మనం కూడా మన రక్షణ కొరకు, క్రీస్తుకి మనయెడల
ఉన్న ప్రేమ కొరకు, క్రీస్తుకి ఇష్టమైన విధముగా మనలను మలచుకోవాలి, ఆవిధంగా
జీవించాలి.
క్రీస్తు ఈ లోకానికి రక్షణ తీసుకొని వచినప్పటికిని, ఆయన సేవకులమయిన మనందరికీ
ఈలోకంలో తగిన బాధ్యతను ప్రతిఒక్కరికి అప్పగించియున్నాడు. అదియే క్రీస్తు
సువార్తను, ప్రేమను, ప్రతిఒక్కరికి తెలియజేయడం. ముందుగా మన కుటుంబములో, మన
పొరుగువారికి, మన సమాజంలో, దేవుని ఆలయంలో మరియు ప్రపంచమంతటా, దేవుని ప్రేమ,
పవిత్రాత్మ శక్తితో దైర్యంగా మన జీవితం ద్వారా తెలియజేయాలి. అందుకు కావలిసిన శక్తిని దయచేయమని దేవుని ప్రార్థిదాం. ఆమెన్.

by Br. Vijay Talari OCD

20, జనవరి 2021, బుధవారం

పునీత యేసేపు

దేవుడు ఇస్సాకు రిబ్కా లను తోబియాతు సారాలను కలపడం వలన దేవుడు మానవులకు తగిన వారిని వారి జీవిత భాగస్వాములుగా చేస్తారని మనకు తెలుస్తుంది. అటువంటప్పుడు మరియమాత కన్యకగా తన కన్యత్వాన్ని కోల్పోకుండా దేవుని కుమారుణ్ణికి జన్మను ఇస్తుంది . ఆమెలో ఎటువంటి పాపము లేదు , ఆమె దేవుని కుమారునికి  జన్మనివటం వలన దేవుని తల్లి అవుతుంది. ఈమెకు ఇంత గొప్ప వ్యక్తికీ ఎటువంటి వ్యక్తిని జీవిత భాగస్వామిగా చేస్తారు అంటే దానికి సమాధానము పునీత జోజప్ప గారు. ఖచ్చితముగా ఆయనలో అనేక ప్రత్యేకతలు కలిగి ఉండాలి. ఏమిటి ఆ ప్రత్యేకతలు అంటే, పవిత్ర గ్రంధములో  అయన ఒక్క మాట మాట్లాడనప్పటికీ  అతని ప్రవర్తన ,జీవనశైలి , దైవాంకిత జీవితం స్పష్టముగా కనపడుతూవుంటాయి . అందుకే పవిత్రగంధము ఆయనను నీతిమంతుడు అని సంభోదిస్తుంది. 

యేసేపు గారి ప్రత్యేకతలు ఏమిటి అంటే , అయన దయార్ధహృదయము, పవిత్రత , ధర్మశాస్త్ర అవలంభన , కుటుంభకాపరి . 


మోషే ధర్మ శాస్త్రం ప్రకారంగా  ఒక వ్యక్తి తన భార్యకు వ్యభిచారకరనముగా విడాకుకులు ఇవ్వవచ్చు. ఈ విడాకులనేవి రెండు రకాలుగా ఇవ్వవచ్చు. మొదటిగా ఒక స్త్రీ చేసిన తప్పును అందరికి చెప్పి ఆమెను శిక్షించవచ్చు. రెండవ విధముగా ఆమెకు ఆమె కుటుంబానికి ఎటువంటి అనర్ధము జరగకుండా  సాక్ష్యం కలిగివుండి భార్యని రహస్యముగా విడనాడవచ్చు. పునీత యేసేపు గారి దయార్ధహృదయాన్ని మనము ఇక్కడ చూస్తాము. తన భార్య తన ప్రమేయము లేకుండా గర్భం దాల్చిన తరువాత ఆమె కుటుంబానికి ఎటువంటి అపకీర్హ్తి కలగకూడదని రహస్యముగా ఆమెను విడనాడాలి అని కాంక్షించాడు . 


పునీత యేసేపు గారి పవిత్రత చాల గొప్పది . దేవుడు పరమ పవిత్రుడు. తన కుమారుణ్ణి ఈ లోకానికి ఒక స్త్రీ ద్వారా తీసుకురావడానికి ముందుగానే ఆమెను పవిత్ర పరిచాడు,ఆమెలో ఏ పాపమూ లేకుండా చేసాడు. తరువాత తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. దేవుని తల్లి మరియు దేవుని కుమారుని  పవిత్రను ఆస్వాదించాలి అంటే, లేక అంతటి వారితో జీవించాలి అంటే అఅంతటి నిష్ఠ కలిగి జీవించేవారే వారి సాన్నిధ్యములో ఉండగలరు. పునీత యేసేపు గారు అంతటి పవిత్రులు. మరియతల్లి   కన్యకగా ఉంది ఆమె కన్యత్వాన్ని కాపాడుతూ ఆమె అంత పవిత్రముగా జీవించాలి అంటే పునీత యేసేపు వారి అంతటి పవిత్ర ఉండాలి. 

ఎల్లప్పుడూ దైవఒడంబడికలకు అనుకూలముగా జీవించాలి అంటే దానికి ప్రార్థన మరియు దైవ జ్ఞానం అవసరము. యేసేపు గారు ప్రార్థనలో దిట్ట అని చెప్పా వచ్చు. ఆయనకు స్వప్నంలో దేవుదూతలు దర్శనము ఇస్తున్నారు. ఇవి నిజానికి ప్రార్థనలో ని అంతస్తులు . అయన ప్రార్థనలో అంతగా ఎదిగారు కాబట్టే దేవుని దూతలు ఆయనకు దర్శనము ఇస్తున్నారు. జరుగబోయే విషయాలు చెపుతున్నారు. ప్రార్దిచేతివంటివారు దేవునితో సత్సంభందాన్ని కలిగిఉంటారు. వారు దేవుని ఆజ్ఞలని పాటిస్తారు. అందుకే యేసేపు గారు దేవాలయములో అర్పించడానికి తీసుకొనివెళుతున్నారు. ఇక్కడ మనము యేసేపు గారు దేవుని ఆజ్ఞలను పాటించుటలో ఎంత ఖచ్చితముగా ఉంటారో చూస్తాము.   

పాత నిబంధనలో మనము యేసేపు గారిని చూస్తూ ఉంటాము అయనను ఫరో రాజు తన రాజ్య కోశాధికారిగా చేస్తారు. నూతన నిబంధనలో దేవుడు తన కుమారునికి , మరియు తన తల్లికి సంరక్షకునిగా నియమించుకున్నాడు. వ్వారి అలానాపాలన చూసుకోవడడినికి. ఇది నిజానికి దేవుని ప్రణాళిక ఎందుకంటే బాల యేసు అనేక ఆపదల నుండి కాపాడటానికి దేవుడు దేవదూతలు  ఏర్పాటు చేయవచ్చు కానీ యేసేపు గారిని నియమించుకున్నాడు అంటే యేసేపు గారి సంరక్షణ అంత గొప్పది. పునీత అవిలాపురి తెరెసమ్మ గారు యేసేపు గారి సంరక్షణ అంటే చాల ఆనందపడేది ఎందుకంటే అయన సంరక్షకుడిగా ఉంటె ఎవరు ఏమి చేయలేరు అని అందుకే ఆమె స్థాపించిన అన్ని ఆశ్రమాలకు ఈ పునీతుని పేరు పెట్టింది. 

ఈ సంవత్సరాన్ని పునీత యేసుపు సంవత్సరముగా  కొనియాడటము ఎంతో సంతోషము , ఈ పునీతుని అడుగు జాడలల్లో నడిచి అయనను మన అనుదిన జీవితములో అనుసరిద్దాం. 

సామాన్యకాలపు 5 వ ఆదివారం

సామాన్యకాలపు 5 వ ఆదివారం   యెషయా 6:1-6  1కొరింథీయన్స్ 15:3-8,11 లూకా 5:1-11 క్రీస్తునాదునియందు  ప్రియా సహోదరి సహోదరులా, ఈనాడు మనమందరమూ కూడా ...