17, మే 2025, శనివారం

ఆదిమ క్రైస్తవ విశ్వాసం - నూతన ఆజ్ఞ

 పాస్కకాలపు ఐదవ ఆదివారం 

అపో 14:21-27, దర్శన 21:1-5 యోహను 13:31-35 

సువిశేషం: యూదా వెళ్ళిన పిమ్మట యేసు  ఇట్లనెను: “ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమ పరుపబడి ఉన్నాడు. ఆయన యందు దేవుడు మహిమ పరుపబడెను. ఆయన యందు దేవుడు  మహిమ పరుపబడిన యెడల, దేవుడు తన యందు ఆయనను మహిమ పరుచును. వెంటనే ఆయనను మహిమ పరుచును. చిన్న బిడ్డలారా !నేను కొంత కాలము  మాత్రమే మీతో ఉందును . మీరు నన్ను వేదకెదరు నేను వెళ్ళు స్థలమునకు మీరు రాజాలరు అని యూదులతో చెప్పినట్లే మీతో కూడా చెప్పుచున్నాను. నేను మీకు ఒక నూతన ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరి నొకరు ప్రేమించుకొనుడు. మీరు పరస్పరము ప్రేమ కలిగియున్నచో, దానిని బట్టి మీరు నా శిష్యులని అందరు తెలిసికొందురు."

ఆదిమ క్రైస్తవ జీవిత ఔన్నత్యం 

మొదటి  పఠనంలో పౌలు మరియు  బర్నబాలు,   వారి  సువార్త పరిచర్యలో అనేక మందిని తమ శిష్యులుగా చేశారు. నూతనముగా క్రైస్తవ  విశ్వాసంలోనికి వచ్చిన వారు విశ్వాసంలో  జీవించాలని  వారిని ప్రోత్సహించి వారికి ఒక ముఖ్యమైన విషయం చెబుతున్నారు. అది ఏమిటి అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు మనము పెక్కు శ్రమలను అనుభవించాలి అని వారికి భోదిస్తున్నారు. అపో 14:22. ప్రియ మిత్రులారా ఇది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే ఈ రోజు మనం అనుకున్నది జరగనప్పుడు, మనం జీవితంలో కష్టం వచ్చినప్పుడు, నేను ఎందుకు దేవుడిని నమ్మాలి , విశ్వాసించాలి అని మనం ప్రశ్నిస్తూ ఉంటాం. అటువంటి ప్రశ్నలకు ఈ మొదటి పఠనం సమాధానం చెబుతుంది.

క్రైస్తవుల మీద రాజ్య హింసలు 

ఆదిమ క్రైస్తవులు ఎన్నో కష్టాలు పడి వారి విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారు. ఎటువంటి కష్టాలు వీరు అనుభవించారు అంటే, ఆదిమ  క్రైస్తవ చరిత్ర ఒకసారి పరిశీలిస్తే మనకు తెలుస్తుంది. ఆదిమ క్రైస్తవులను రాజులు , రాజ్యాలు, దేశ, రాజ్య వ్యతిరేకులుగా పరిగణించేవారు. కొంత మంది రాజులు చాలా క్రూరంగా క్రైస్తవులను హింసించేవారు. వలెరియన్, డైయక్లేషీన్ అనేటువంటి చక్రవర్తులు ఎక్కువగా క్రైస్తవులను హింసించారు. వీరికి విధించిన శిక్షలు ఏమిటి అంటే, క్రూర మృగాలకు వీరిని ఆహారముగా వేసేవారు, లేక అగ్నిలో కాల్చి చంపేవారు. ఇటువంటి కష్టాలను అనుభవించడానికి కూడా వారు సిద్దపడ్డారు.  కానీ వారి విశ్వాసాన్ని కోల్పోలేదు. వీరి జీవితాలను చూస్తే మనకు ఎలియజరు, దానియేలు స్నేహితులు, ఏడుగురు కుమారులు ప్రాణాలను అర్పించడం లాంటివి మనకు గుర్తుకు వస్తాయి.

విశ్వాసానికి కట్టుబడిన జీవితాలు 

ఇక్కడ ఆదిమ క్రైస్తవ జీవితాలలో ఒకరు అయిన సీప్రియన్  అనే పునీతుని జీవితాన్ని గమనించినట్లేయితే   మనకు వారి విశ్వాసం ఎంత గట్టిదొ తెలుస్తుంది. పునీత సీప్రియన్ ఒక అన్యుడు మరియు చాలా పేరు పొందిన లాయరు. ఆయన గొప్ప లాయరుగా చాలా ప్రసిద్ధి చెందినవారు. ఆయన యేసు ప్రభువును తెలుసుకొని తన జ్ఞానంతో యేసు క్రీస్తు నిజమైన దేవుడు అని క్రైస్తవునిగా మారాడు. అది తెలుసుకున్న అక్కడి పెద్దలు మరల ఆయనను, తన పాత విశ్వాసానికి తిరిగి రావాలని, తన పాత జీవితానికి వచ్చినట్లయితే అతనికి డబ్బులు , సంపదలు, ఇస్తాము అని చెప్పారు. కానీ తాను యేసు ప్రభువును వీడాటానికి సిద్ధపడలేదు. ఎప్పుడైతే వారు ఆయనను మారమని అడుగుతున్నరో ఆయన తన విశ్వసాన్ని ఇంకా ఎక్కువగా వ్యక్తపరిచాడు. వారికి ఆయన ఒక మాట చెప్పాడు. అది ఏమిటి అంటే దేవున్ని తెలుసుకున్న ఒక మంచి ఆత్మను మార్చలేరు. అలానే ఆయన్ను మార్చలేక ఆయన్ను శిక్షించాలని నిర్ణయించి అందరు చూస్తుండగా తన తలను నరికివేయడం జరిగింది.

 ఇటువంటి శిక్ష ఉంటుంది అని తెలిసికూడా వారు తమ విశ్వాసాన్ని ప్రకటించారు. ఆదిమ క్రైస్తవ జీవితాలు మనకు మార్గ చూపరిగా ఉంటాయి. ఇంతటి గడ్డుకాలంలో వారు జీవించిన ఇతరులకు కీడు చేయాలి అని వారు అనుకోలేదు. కానీ ఈరోజు మనం మనకు వ్యతిరేకముగా ఏమైనా జరిగితే ఇంకా నేను ఎందుకు దేవాలయం రావాలి ? నేను ఎందుకు దేవున్ని నమ్మాలి అని అనుకుంటాం. వీరు ఎందుకు నమ్మారు దేవున్ని అంటే కేవలం ఈ లోకం కోసం మాత్రమే కాదు అని వారి విశ్వాసం తెలియచేస్తుంది.  ఈనాటి సువిశేషం మనం ఇంత గొప్ప జీవితం, జీవించే మార్గం చూపుతుంది. 

నూతన ఆజ్ఞ 

యేసు ప్రభువు తన శిష్యులను ఒకరి నొకరు ప్రేమించుకొనుడు అని చెప్పారు.యేసు ప్రభువు యొక్క బోధన మోషే ధర్మ శాస్త్రం మీద ఆధారపడి వుంది.  ఎందుకంటె ఇది  లెవీయా కాండం లో , ద్వితీయోపదేశ కాండంలో ఈమాటలు చెప్పబడ్డాయి. కానీ   యేసు ప్రభువు చెప్పే ప్రేమ మొత్తం కూడా మోషే ధర్మ శాస్త్రం చెప్పేదాని కన్నా గొప్పది. ఎందుకంటే యేసు ప్రభువు ప్రజలను తన కన్నా ఎక్కువగా ప్రేమించాడు.  యోహను సువిశేషంలో యేసు ప్రభువు ఇతరులను మీ కన్నా ఎక్కువగా ప్రేమించండి అని చెపుతున్నారు.  యోహను 13: 34. యేసు ప్రభువు ఒక నూతన ఆజ్ఞ ఇస్తున్నారు.ఇక్కడ అంత క్రొత్త ధనం ఏముంది? ఈ నూతన ఆజ్ఞలో అంటే యేసు ప్రభువు తనను తాను పరిత్యాగం చేసుకుంటున్నారు మన కోసం. ఆయన  ప్రేమను  తన మరణం ద్వార వ్యక్త పరుస్తున్నారు.  

యేసు ప్రభువును అనుసరించే వారి అందరి జీవితాలు కూడా ఇటువంటి ప్రేమ కలిగిఉండాలి అని ఈ నూతన ఆజ్ఞ తెలియ జేస్తుంది.  ఈ నూతన ఆజ్ఞ, క్రైస్తవులను తమ పొరుగువారిని, వారికంటే ఎక్కువగా ప్రేమించమని పిలుస్తుంది. ఎవరిని శత్రువులుగా కానీ , ప్రేమకు అనర్హులుగా కానీ చూడదు. ఇది నిజానికి యేసు ప్రభువు యొక్క వీడ్కోలు భోధనలో భాగము అంటే చివరిగా యేసు ప్రభువు తన శిష్యులకు ఇచ్చిన సందేశం. లూకా సువిశేషంలో 10:27 దీనినే మనకు    అత్యున్నతమైన ఆజ్ఞగా చెప్పబడుతుంది. ఇక్కడ ఉదాహరణగా  మంచి సమరియుని కథను చెప్పబడింది. నీకు సంబందం లేని వారికొరకు కూడా నీవు సహాయం చేయాలి అని తెలియజేస్తుంది.

అత్యున్నత ఆజ్ఞ 

 యేసు ప్రభువుని ప్రశ్న అడిగిన ధర్మ శాస్త్ర భోదకుడు  ద్వితీ 6:5, లెవీ19:18 గురించి మాటలాడుతున్నాడు. మత్తయి సువిశేషంలో పరిసయ్యుడు యేసు ప్రభువును పరీక్షింప కోరి అత్యున్నతమైన ఆజ్ఞ ఏది అని అడిగారు , మత్తయి 22:35 , దానికి యేసు ప్రభువు ద్వితీ 6:5 చెబుతున్నాడు. కాని  యోహను సువిశేషంలో యేసు ప్రభువే తన శిష్యులకు బోధిస్తారు,ఈ ఆజ్ఞ గురించి  మిగిలిన సువిశేషాలలో, ధర్మ శాస్త్ర భోదకులు యేసు ప్రభువుని ప్రశ్నిస్తారు . దానికి జవాబుగా యేసు ప్రభువు సమాధానం చెబుతారు. ఇక్కడ యేసు ప్రభువు తన శిష్యులను ఒక నూతన సమాజంగా తయారు చేస్తున్నారు. యూదుల వలె కాకుండా వీరి జీవిత విధానం యేసు ప్రభువు వలె ఉండేలా చేయలని ప్రయత్నిస్తున్నారు. అంటే క్రైస్తవులు ఒక ప్రత్యేకమైన సమూహం. 

 యేసు ప్రభువు స్థాపించే ఈ సమూహంలోని  శిష్యులు, యేసు ప్రభువు వారిని ఏవిధంగా ప్రేమించారో, వారుకూడా   ఒకరి నొకరు అధేవిధంగా  ప్రేమించుకోవాలసి ఉంటుంది.  నేను మిమ్ములను ప్రేమించినట్లు మీరును ఒకరి నొకరు ప్రేమించు కోవాలి అంటే యేసు ప్రభువుని ప్రేమ, మన ప్రేమకు కొలమానం కావాలి. పాత నిబందనలో ప్రేమకు కొలమానం ధర్మ శాస్త్రం.   కానీ నూతన ఆజ్ఞలో ప్రేమకు కొలమానం యేసు ప్రభువుని ప్రేమ. నూతన ఆజ్ఞ , పరస్పర ప్రేమ కలిగి ఉండాలి అని కోరుతుంది. ప్రేమించడం ప్రేమించబడటం అనేది ఈ నూతన సమూహాన్ని  యేసు ప్రభుని నిజమైన అనుచరులనుగా చేస్తుంది. అందుకే యేసు ప్రభువు , తన స్నేహితుని కొరకు తన ప్రాణమును ఇచ్చువాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవ్వడు లేడు అని  యోహను 15:13-15 లో చెబుతున్నారు. యేసు ప్రభుని అనుచరులు ఆయన ప్రేమను కొనసాగించేవారిగా   ఉండాలి.  ప్రేమ ఆజ్ఞను అవలంబించడం ద్వారా శిష్యులు దేవుని ప్రేమకు ప్రతినిధులుగా ఉంటారు. ఈ ఆజ్ఞను అనుసరించడమే క్రీస్తు నాధుని అనుసరణగా వారి జీవితాలు మారాలి.

యేసు ప్రభువు ఎంతగా మనలను ప్రేమించారు 

యేసు ప్రభుని ప్రేమ స్వభావం ఏమిటి? ఏలా ఆయన ప్రజలను ప్రేమించారు? ఇది మూడు విధాలుగా జరిగిఉండవచ్చు.  మొదటిగా   యేసు ప్రభువు తన శిష్యులను తన కంటే తక్కువ ప్రేమించి ఉండాలి, లేక తన వలె ప్రేమించి ఉండాలి లేక తన కంటే ఎక్కువగా ప్రేమించి ఉండాలి. ఆయన జీవితం ద్వారా  మనకు తెలిసేది ఏమిటి అంటే ఆయన తన శిష్యులను ఆయన కంటే ఎక్కువగా ప్రేమించారు. యోహను 3:16 లో దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని ఇచ్చెను అని వింటున్నాం. యోహను 15:13 తన స్నేహితుని కొరకు తన ప్రాణమును ఇచ్చువానికంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవరు లేరు అని కేవలం మాటలు చెప్పలేదు, తన ప్రాణమును ధారపోస్తున్నాడు. 

ఆయన అనుచరులు ఎందుకు  ఈ విధంగా జీవించాలి అంటే వారు పరిపూర్ణులుగా ఉండాలి. మత్తయి 5:46 వ వచనం  మిమ్ములను ప్రేమించే వారినే మీరు ప్రేమించినచో మీ ప్రత్యేకత ఏమి ఉంటుంది అని అడుగుతుంది. అందరు అది చేస్తారు కాదా! నీవు ఏ విధంగా జీవించాలో  ఒక కొలమానం ఉంది , అది పరిపూర్ణత కలిగి ఉండటం.  యేసు  ప్రభువు వలె జీవించడం. మత్తయి 5:48లో యేసు ప్రభువు చెప్పే ఈ ప్రేమ, మనకు సాధ్యమా? దీనిని అంత సులువుగా సాధించగలమా? ఇది అంత సులువైన పని  ఏమి కాదు, కానీ ఇది యేసు ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ దీనిని పాటించడం వలన అందరు మనం క్రీస్తు అనుచరులం అని గ్రహించ గలుగుతారు. శిష్యులు ఇది చేయగలిగితే వారు లోకములో వెలుగువలె ప్రకాశిస్తారు. మత్తయి 5:15. లోకం అది చూసి వెలుగు దగ్గరకు వస్తుంది. ఈ ఆజ్ఞ ఇచ్చే ముందుగానే యేసు ప్రభువు తన శిష్యులకు ఒక మాతృకను చూపిస్తున్నారు. తాను వారి పాదాలు కడుగుట ద్వారా, ముందుగానే వారిని సిద్ధం చేస్తున్నారు. 

యేసు ప్రభువు శిష్యులనుఎలా తెలుసుకోవచ్చు?

నూతన ఆజ్ఞ శిష్యులకు ఒక సవాలు.  నిజముగా వారు ఆయన అనుచరులేనా? లేదా? అని తెలుసుకునే సాధనం కూడా. యేసు ప్రభువుకు  యూద, తనను  శత్రువులకు అప్పగించనున్నాడని తెలిసికూడా ఆయనను కించ పరచలేదు. అతన్ని అగౌరపరచలేదు. ఎటువంటి వ్యత్యాసం చూపించలేదు. తనని శత్రువుగా చూడలేదు. మనం చేయవలసినది కూడా అదే. ఎవరిని శత్రువుగా భావించి, వారికి వ్యతిరేకముగా జీవించనవసరం లేదు. మన జీవితం మనం క్రీస్తు అనుచరులుగా  జీవిస్తే చాలు. యోహను మొదటి లేఖలో ఈ నూతన ఆజ్ఞ క్రైస్తవ సంఘానికి ఒక శాసనం అయ్యింది. యోహను 4:7-8 వచనలలో  మీరు  మీ సోదరి సోదరులను ప్రేమించకుండా   దేవున్ని ప్రేమిస్తున్నాం అని చెప్పకూడదు అంటున్నారు. 

ఎవరు యేసు ప్రభువు శిష్యులు అవుతారు?  

ఎవరు  మేము యేసు ప్రభువు అనుచరులం అని చెప్పుకోవడానికి అర్హులు అంటే ఇతరులను ప్రేమించే వారు, ఎవరిని ద్వేషించనివారు, శపించని వారు, ఇతరులను తృణీకరించనివారు, మోసం చేయనివారు, హింసించనివారు.

యేసు ప్రభువును అనుసరించే వారికి, ఆయనను విశ్వసించే వారికి,  అందరికి యేసు ప్రభువు ఈ ఆజ్ఞను ఇస్తున్నారు. ఆయన వలె జీవించవలసిన అవసరం ఉంది, ఆయన అనుచరులం అని చెప్పుకున్నప్పుడు. మనం మన  పొరుగువారిని  ఎక్కువగా ప్రేమించాలి. ఎంత వరకు ప్రేమించాలి అని అంటే మన  ప్రాణమును పొరుగువారి కొరకు ఇచ్చేంతగా ప్రేమించాలి.  ఆ విధంగా జీవిద్దాం. నిజమైన క్రీస్తు అనుచరులగా నిలుద్దాం. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆదిమ క్రైస్తవ విశ్వాసం - నూతన ఆజ్ఞ

 పాస్కకాలపు ఐదవ ఆదివారం  అపో 14:21-27, దర్శన 21:1-5 యోహను 13:31-35  సువిశేషం: యూదా వెళ్ళిన పిమ్మట యేసు  ఇట్లనెను: “ఇప్పుడు మనుష్య కుమారుడు  ...