పేద విధవరాలి రెండు కాసులు – నిజమైన అర్పణ ఏమిటి? | లూకా 21:1-4 ధ్యానం
లూకా 21: 1-4
దేవాలయము కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనికులను యేసు చూచెను. ఒక పేద వితంతువు అందు రెండు కాసులను వేయుట యేసు గమనించి, "ఈ పేద వితంతువు అందరికంటెను ఎక్కువగా ఇచ్చినదని మీతో చెప్పుచున్నాను. వారలు తమ సమృద్ధి నుండి కానుకలిచ్చిరి. కాని ఈమె తన పేదరికంలో తన సమస్త జీవనమును సమర్పించినది" అని పలికెను.
ధ్యానము:
యేసు ప్రభువు తన భూలోక పరిచర్య కాలంలో కేవలం బోధనలకే పరిమితం కాలేదు; ఆయన చుట్టూ ఉన్న సమాజాన్ని, మనుషుల హృదయంతరంగాలను నిశితంగా పరిశీలించారు. ఆ క్రమంలోనే ఒకనాడు ఆయన యెరూషలేము దేవాలయంలోని కానుకల పెట్టె ఎదురుగా కూర్చుని, ప్రజలు కానుకలు ఎలా వేస్తున్నారో గమనిస్తున్నారు. ఆ సమయంలో ఎందరో ధనికులు వచ్చి, తమ వద్ద ఉన్న సమృద్ధిలో నుండి భారీ మొత్తంలో ధనమును కానుకగా వేస్తున్నారు. ఆ ధనము కానుకల పెట్టెలో పడుతున్నప్పుడు వచ్చే పెద్ద శబ్దాలు వారి హోదాను, సమాజంలో వారికున్న ప్రతిష్ఠను చాటిచెబుతున్నాయి. వారు ఇచ్చే దానం వల్ల వారి రోజువారీ విలాసవంతమైన జీవితానికి ఎటువంటి లోటూ రాదు. ఆ ధనం వారి మిగులు సంపాదన మాత్రమే.
కానీ, అదే సమయంలో ఆ ధనికుల గుంపు మధ్య నుండి ఒక నిశ్శబ్దమైన, దీనమైన ఆకృతి ముందుకు కదిలింది. ఆమె ఒక పేద వితంతువు. నాటి సమాజంలో అత్యంత నిర్లక్ష్యానికి, అణచివేతకు గురైన వర్గానికి ఆమె ప్రతినిధి. ఆమె ఆ పెట్టెలో కేవలం రెండు కాసులను , ఇవి నాటి కాలంలో అత్యంత తక్కువ విలువ గల నాణేలు వేసింది. లౌకిక కళ్లకు ఆ రెండు కాసులు చాలా స్వల్పంగా, కనిపించవచ్చు. కానీ, మానవ హృదయాలను ఎరిగిన యేసు ప్రభువు ఆ పేద వితంతువు వేసిన రెండు కాసులను చూసి ఆశ్చర్యపడ్డారు. ఆమెను అందరికీ ఒక ఆత్మీయ పాఠంగా చూపిస్తూ, "ఈ పేద వితంతువు అందరికంటే ఎక్కువగా ఇచ్చినది" అని ప్రకటించారు.
ఈ రెండు కాసులు ఎందుకు అంత ఎక్కువ అనే ప్రశ్న మనలో కలగక మానదు. బాహ్య ప్రపంచానికి అది కేవలం ఒక చిన్న సంఖ్య, కానీ దేవుని దృష్టిలో అది ఒక జీవిత త్యాగం. ఈమె ఆ రెండు కాసులను అర్పించడానికి వెనుక ఎన్నో సామాజిక, మానసిక, ఆర్థిక అవరోధాలను అధిగమించవలసి వచ్చింది. అయినా ఆమె తన భక్తిని, దేవునిపై ఉన్న విశ్వాసాన్ని ఏమాత్రం కోల్పోలేదు.
సామాజిక మరియు ఆర్థిక అవరోధాలు
నాటి యూదా సమాజంలో ఒక స్త్రీగా, అందులోనూ వితంతువుగా జీవించడం అంటే అడుగడుగునా అవమానాలను, కష్టాలను ఎదుర్కోవడమే. పురుషాధిక్యత కలిగిన ఆనాటి కాలంలో స్త్రీలకు స్వతంత్ర ఆర్థిక హక్కులు ఉండేవి కావు. తండ్రి, భర్త లేదా కుమారుని నీడలోనే ఆమె బ్రతకాలి. ఒక స్త్రీ వితంతువుగా మారినప్పుడు, ఆమెకు ఆదరువు ఇచ్చేవారు కరువయ్యేవారు. సమాజం ఆమెను ఒక శాపంగానో లేదా ఒక బలహీనమైన ప్రాణిగానో చూసేది. ఇన్ని సామాజిక ఇబ్బందులు, ఆర్థిక సంక్షోభాలు చుట్టుముట్టినా, ఆమె దేవాలయానికి వచ్చి కానుక ఇవ్వడానికి సిద్ధపడటం ఆమె అచంచలమైన విశ్వాసానికి నిదర్శనం.
ధనికులు సమర్పించిన కానుకలు కేవలం వారి భౌతిక సంపదలోని ఒక చిన్న భాగం. వారు వేసిన వందల నాణేలు వారి జీవితంలో ఎటువంటి మార్పునూ, ఇబ్బందినీ తీసిరాలేవు. ఆ దానం వల్ల ఆ మరుసటి రోజు వారి భోజనానికో, వస్త్రాలకో లేదా విలాసాలకో ఎటువంటి లోటూ రాదు. కానీ, ఈ వితంతువు వేసిన కానుక ఆమె జీవితాన్ని పూర్తిగా ప్రభావితం చేసేది. ఎందుకంటే ఆ రెండు కాసులను కానుక పెట్టెలో వేసిన తర్వాత, మరుసటి రోజు ఆమె తిండికి ఏమీ లేదు. ఆమె తన రేపటి భవిష్యత్తును పూర్తిగా శూన్యం చేసుకుంది. అందుకే, ధనికులు తమ మిగులును ఇస్తే, ఈమె తన ఉనికినే దేవునికి అర్పించింది.
సమస్త సమర్పణ వెనుక ఉన్న అంతరార్థం
యేసు ప్రభువు ఆమె గురించి మాట్లాడుతూ... "తన సమస్త జీవనమును సమర్పించినది" అని స్పష్టంగా చెప్పారు. ఇక్కడ 'సమస్త జీవనము' అంటే కేవలం ఆమె దగ్గర ఉన్న డబ్బు మాత్రమే కాదు, ఆమె బ్రతుకు తెరువు, ఆమె ప్రాణాధారం. ఆ రెండు కాసులు మాత్రమే ఆమెకు ఉన్నటువంటి ఏకైక ఆస్తి. అయినట్లయితే, వాటిని ఆమె ఎందుకు సమర్పించినది? ఆమెకు జీవితము మీద ఆశ లేదా? లేక ఆమె తనకు ఉన్నటువంటిది మొత్తం దేవునికి సమర్పించి ఆకలితో చనిపోవాలనుకున్నదా?
ఖచ్చితంగా కాదు! ఈ అర్పణ వెనుక చనిపోవాలనే నిరాశ లేదు, బదులుగా "దేవుడే నన్ను పోషిస్తాడు" అనే పరమ విశ్వాసం ఉన్నది. ఆమె దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడి జీవిస్తున్నది అనే విషయం ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. లౌకిక ప్రపంచంలో ఆమె ఒక అనాథ, ఒక వితంతువు. ఒక బలహీనమైన స్త్రీగా సమాజంలో మనుగడ సాగించాలంటే ఒక పురుషుని ఆసరా కావాలి. కానీ ఆమెకు ఆ ఆధారం లేదు. కనుక, ఆమె తన సర్వస్వాన్ని దేవునికే అప్పగించేసింది. భౌతికమైన ఏ ఆధారమూ లేని చోట, దేవుడే ఆమెకు ఏకైక ఆధారమయ్యాడు.
ఆమె ఆ రెండు కాసుల మీద ఆధారపడకుండా, వాటిని కూడా ఆ దేవాలయంలో కానుకల పెట్టెలో వేసి "దేవుడే నా సమస్తము" అని లోకానికి చాటిచెప్పింది. ఆమెకు దేవుని మీద ఉన్న అపారమైన నమ్మకం ఇక్కడ మనకు గోచరిస్తుంది. ఈ రెండు కాసులను దేవునికి సమర్పిస్తే మరుసటి రోజు ఎలా గడుస్తుంది, ఆహారం ఎలా లభిస్తుంది అనే లౌకిక చింత ఆమె హృదయంలో లేదు. దేవుడు తనను భవిష్యత్తులో ఎలా ఆదుకుంటాడు అనే ఆందోళన కంటే, ఆయన నిరంతరం తనను ఎలా కాపాడుతున్నాడు అనే కృతజ్ఞతా భావంలోనే ఆమె నిమగ్నమయ్యింది. ఆమె దేవునికి పూర్తిగా అంకితమైంది. బాహ్య సంపదను కోల్పోయి, దేవున్నే తన శాశ్వత ఆస్తిగా మార్చుకుంది.
నిజమైన అర్పణ
సమృద్ధి నుండి అనేక మంది ధనికులు కూడా అక్కడ అర్పణలు ఇచ్చారు. అవి ఇవ్వడం వలన వారికి ఎటువంటి లోటు ఏర్పడలేదు. ఆ ధనము వారి దగ్గర లేకపోవడం వలన వారి దైనందిన జీవితంలో ఎటువంటి ఇబ్బంది కలిగే అవకాశం లేదు. ఈ సంఘటన ద్వారా దేవుడు మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తున్నారు. మనం దేవునికి అర్పించే అర్పణ కేవలం మన దగ్గర ఉన్న మిగులు (Surplus) మాత్రమే అయితే అది దేవుని దృష్టిలో నిజమైన అర్పణ కాజాలదు. మన సమయం, మన ధనం, మన తలాంతులు... వీటన్నింటిలో మన అవసరాలు తీరిపోగా మిగిలినదానిని దేవునికి ఇవ్వడం పెద్ద త్యాగం ఏమీ కాదు.
కానీ, మనము అర్పించే ప్రతి అర్పణ అది మన జీవితంలో భాగమై, మనకు ఒక త్యాగంగా మారినప్పుడు మాత్రమే అది దేవుని సన్నిధిలో గొప్ప అర్పణ అవుతుంది. ధనికులు తమ జీవితంలో ఉన్నటువంటి మిగులును అర్పించారు, అంటే వారి హృదయం ధనం మీదే ఉంది, కేవలం ఒక ఆచారంగా వారు కానుకలు వేశారు. కానీ పేద విధవరాలు తన సమస్తము అయిన రెండు కాసులను అర్పించింది, అంటే ఆమె హృదయం పూర్తిగా దేవునితో ముడిపడి ఉంది. ధనికులు సంఖ్యాపరంగా ఎక్కువ అర్పించినా అది వారికున్న సమస్తంలో ఒక చిన్న భాగమే, కానీ పేద విధవరాలు రెండు కాసులే అర్పించినా అది తన సమస్తము. అందుకే యేసు ప్రభువు లెక్కింపు పద్ధతి లోకపు పద్ధతి కంటే భిన్నంగా ఉంది. ఆయన పరిమాణాన్ని చూడడు, హృదయ పూర్వకమైన నాణ్యతను చూస్తాడు. ఆమె తన సమస్తము సమర్పించి, దేవున్ని తన సమస్తం చేసుకున్నది.
మన జీవితాలకు అనువర్తనం
ఈ సువిశేష భాగం నేడు మనల్ని మన ఆత్మీయ స్థితిని పరీక్షించుకోమని సవాలు విసురుతోంది.
మనం దేవునికి ఎలాంటి అర్పణలు ఇస్తున్నాం?
మనకు ఉన్న మిగులును మాత్రమే దేవునికి సమర్పిస్తూ, ఆ మిగులు ఇవ్వడం వలన మనకు ఎటువంటి లోటు లేదులే అని పైపైన ఆనందపడుతున్నామా?
మన ప్రార్థనలు, మన సమయం, మన ధనం అన్నీ మన సౌకర్యార్థం మాత్రమే దేవునికి కేటాయిస్తున్నామా?
లేక, కొంత ఇబ్బంది లేదా బాధకు గురైనా, మనకు ఉన్న మిగులు కాకుండా, మనకు ఎంతో ప్రియమైనదానిని దేవునికి సమర్పించి ఆయన మీద సంపూర్ణ నమ్మకం ఉంచుతున్నామా? అని మనలను మనం అంతఃపరిశీలన చేసుకోవాలి. నిజమైన క్రైస్తవ జీవితం అంటే సురక్షితమైన వలయాల్లో బ్రతకడం కాదు, దేవునిపై ఉన్న నమ్మకంతో అడుగులు వేయడం. పేద వితంతువు వలె పూర్తిగా దేవుని మీద నమ్మకం ఉంచి జీవించే గొప్ప జీవితం మనకు కావాలి. లోకసంబంధమైన భద్రత కంటే దేవుడే మనకు సమస్తము కావాలి. మనల్ని మనం దేవుని హస్తాలకు సంపూర్ణంగా అప్పగించినప్పుడే, ఆయన మన జీవితాలలో అద్భుతాలు చేయగలడు.
ప్రార్ధన : ప్రభువా మీరు , మీ వాక్కుద్వారా మీ సంకల్పాన్ని మాకు తెలియజేస్తున్నారు. మాలో ఉన్న లోపాలను తెలియజేస్తున్నారు. మేము ఎలా జీవించాలో తెలియజేస్తున్నారు, మాలో ఉన్న లోపాలను ఎలా అధికమించాలో , మీ వలె ఎలా జీవించాలో తెలియజేస్తున్నారు.ఈ జీవితమునకును , మీరు ఇచ్చిన ప్రతి అనుగ్రహమునకును మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పేదరాలి దిన కానుకను చూచిన ప్రభువా! నేను నా జీవితంలో ధనికుల వలె , నాకు ఉన్న మిగులును ఇతరులతో పంచుకొని గొప్ప ఉదార స్వభావం కలిగిన వాడి వలే చెప్పుకొనుచున్నాను, నాకు మీరు ఇచ్చిన అని వరాలను అనుభవిస్తూ కూడా ఇతరులకు సహాయపడుటకు లేక మీకొరకు వినియోగించుటకు చిన్న ఇబ్బంది కూడా సహించలేకుండా ఉన్నాను.నాకు ఉన్నటువంటి ఆస్తి పస్తులు , నా సర్వస్వం అనే భావనలో ఉన్నాను. ఇటువంటి ఆలోచనలతో చేసిన అనేక తప్పులకుగాను నన్ను క్షమించండి. నాలో ఉన్న ఈ లోపాలను తీసివేయుటకు నాకు సహాయం చేయండి. పేద విధవరాలి వలె నేను కూడా నాకు ఉన్న సమస్తాన్ని మీకు అర్పించి, మీరే నా సమస్తము అని తెలుసుకొని మిమ్ము నా సమస్తముగా పొందే అనుగ్రహము దయచేయండి. ప్రభువా ! నిన్ను తెలుసుకొనుటకు మరియు అర్ధం చేసుకొనుటకు , మీ వలె మారుటకు సహాయం చేయండి. ఆమెన్
Comments
మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:
Post a Comment