అనుదిన దైవ ధ్యానం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అనుదిన దైవ ధ్యానం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, జులై 2022, మంగళవారం

అనుదిన దైవ వాక్కు ధ్యానం

మత్తయి సువార్త 9: 32-38

మూగదయ్యమును  వెడలగొట్టుట మరియు క్రీస్తు కారుణ్యము.

32. వారు పోవుచుండగా పిశాచము పట్టి నోటి మాట పడిపోయిన మూగవానిని ఒకనిని కొందరు యేసు వద్దకు కొనివచ్చిరి. 33. పిశాచము వెడలగొట్టబడిన యంతనే ఆ వ్యక్తి మాటలాడసాగెను. అపుడు అచటి ప్రజలు ఎల్లరు ఆశ్చర్యపడుచు, "ఇశ్రాయేలు జనులలో ఇట్టిది మేము ఎన్నడును ఎరుగము" అనిరి. 34. కాని పరిశయ్యులు, "పిశాచముల నాయకుని సహాయముతో ఇతడు పిశాచములను వెడలగొట్టు చున్నాడు" అని ఈసడించిరి. 

35. యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి, ప్రార్థన మందిరములలో బోధించుచు, పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు, జనుల వ్యాధి భాదలనెల్ల పోగొట్టుచుండెను. 36. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు, కాపరిలేని గొఱ్ఱెలవలె  చెదరియున్న జనసమూహను చూచి, ఆ కరుణామయుని కడుపు తరుగుకొనిపోయెను. 37. అపుడు యేసు తన శిష్యులతో "పంట మిక్కుటము; కాని కోతగాండ్రు తక్కువ. 38. కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రను  పంపవలసినదని పంట యజమానునికి మనవి చేయుడు" అని పలికెను.

ధ్యానము: పరిశయ్యులయొక్క నిర్లక్ష్యము, అసూయ, మరియు క్రీస్తు ప్రభువు దేవుని పనిని నెరవేర్చుట.

ప్రియ స్నేహితులారా ! ఈ నాటి సువిశేష పఠనాన్ని మనము ధ్యానించినట్లైతే మనకు రెండు విషయాలు అర్థమవుతాయి. మొదటిగా “పరిశయ్యులయొక్క నిర్లక్ష్యము, అసూయ, మరియు క్రీస్తు ప్రభువు దేవుని పనిని నెరవేర్చుట, లేదా క్రీస్తు తన సువార్త పరిచర్యను” నెరవేరుస్తున్నటువంటి సారాంశమే  మనకు అర్థమవుతుంది.

ఎందుకంటే, మన అందరికి తెలిసిన విధంగా పరిశయ్యులంటే సంఘ కాపరులు, లేదా ప్రజలను అనునిత్యం కాపాడేవారు, వారి బాగోగులు చూసుకునే వారు.

కాని వారిజీవిత నడవడిక మాత్రం, వారి పదవికి వ్యతిరేకంగా ఉంటుంది, లేదా వారు బోధించే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉంటుంది. వారు ఎప్పుడు కూడా కపట వేషధారులవలె, పేరుకు మాత్రమే భోదకులుగా జీవించే వారు, నిజానికి అమాయక ప్రజలమీద, శాస్త్రాలయొక్క భారాన్ని మోపేవారు, ప్రజలను ఎప్పుడు కూడా సక్రమైన మార్గములో నడిపించే వారు కాదు. ఇశ్రాయేలు ప్రజలు, తమ వ్యక్తి, తమలో ఒకరయినటువంటి క్రీస్తు మీద, ఈర్ష, అసూయ చెందుతున్నారు.

ఎందుకంటే క్రీస్తు ప్రభువుకి వారికంటే, పరిశయ్యులకంటే గొప్ప పేరు తెచ్చుకుంటున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, స్వస్థతలు చేసే శక్తి ఉంది, ప్రజలుకూడా క్రీస్తు ప్రభువు వైపే వెళుతున్నారు అని అసూయ చెందుతున్నారు.

దేవుని శక్తి మనలో లేనప్పుడు మనము సాతానుని వెళ్ళొగొట్టలేము. సాతాను, సాతానును వెళ్లగొట్టగలడా?

క్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు కాబట్టి, దేవుని శక్తి తనలో ఉంది. కాబట్టి క్రీస్తు ప్రభువుకు ఆ సాతాను లొంగి పోయింది.

పరిశయ్యులు కూడా దేవుని యొక్క బిడ్డలే, కాని వారు ఎప్పుడు క్రీస్తు వలె, నిజమైన దేవుని రాజ్యాన్ని బోధించే వ్యక్తిగా లేదా అధికారులుగా, సంఘ కాపరులుగా జీవించలేదు. అందుకే దేవుని శక్తి, దేవుని మహిమ వారు చేయలేకపోయారు.

మరి పరిశయ్యులు, అంతా తెలిసినవారే కదా, దేవుని ధర్మశాస్త్త్రాన్ని అనుసరించే వారేకదా, దేవునిచే ఎన్నుకొనబడినవారే కదా, మరి వారి ప్రజలలో ఒకరు అస్వస్థతకు గురి అయినప్పుడు, పరిశయ్యులు ఎందుకు అద్భుతాలు చేయలేదు, స్వస్థతలు చేయలేదు? ఎందుకంటే వారు పేరుకు మాత్రమే సంఘపెద్దలు, లేదా కాపరులు.

దేవుని ప్రమేయమున్నపుడే, శాతానును మనము జయించ గలము లేదా ఓడించగలము. సాతాను తనకు తానుగా ఎలా ఓడించుకుంటుంది. పిశాచముల నాయకుడు అంటున్నారు, మరి పిశాచముల నాయకుడు అయితే మంచి కార్యములు, అద్భుతములు ఎలా చేస్తాడు? సాతాను నుండి అయితే మంచి పనులు చేయకూడదు కదా.

రెండవదిగా: క్రీస్తు ప్రభువు కారుణ్యము లేదా క్రీస్తు ప్రజలయొక్క నిస్సహాయతను, అమాయకత్వాన్ని చూసి, వారియొక్క భడాలను చూసి జాలి చెందుతున్నాడు.

క్రీస్తు ప్రభువు, గ్రామాలు గ్రామాలు తిరుగుచున్నారు, దేవుని రాజ్యాన్ని బోధిస్తున్నారు, స్వస్థతలు, అద్భుతాలు, చేస్తున్నారు., కాని ప్రజలందురు కూడా కాపరిలేని గొఱ్ఱెలవలె, త్రోవ తప్పిన వారివలె జీవిస్తున్నారు. సంఘ కాపరులు వారిని పట్టించుకోవట్లేదు, నాయకులు, ప్రజల బాగోగులు చూసుకోవట్లేదు. అందుకే ప్రజల జీవితాలు ఈవిధంగా ఉన్నాయని బాధపడుతున్నాడు.

దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. ఇంకా చాల గ్రామాలు ఉన్నాయి వాటన్నిటిలో అద్భుతాలు చేయాలి, దేవుని రాజ్యాన్ని బోధించాలి, అందుకనే క్రీస్తు ప్రభువు, పంట విస్తారము, కోతగాండ్రు కావాలి అంటున్నారు, అంటే, తన సువార్త పరిచర్యలో మనలనుకూడా, బాగస్తులను అవమాని ఆహ్వానిస్తున్నారు.

దేవుడంటే తెలియని గ్రామాలు చాలాఉన్నాయి, దేవుని సేవచేయుటకు, దేవుని రాజ్యాన్ని లోకమంతట వ్యాపింప చేయుటకు, శిష్యులు కావాలి, కాబట్టి ఈ నాటి సువిశేష పఠనం ద్వారా క్రీస్తు ప్రభువు మనందరిని ఆహ్వానిస్తున్నారు.

ప్రియ స్నేహితులారా! మనము ఈ సువిశేషాన్ని గమనించినట్లయితే, భాద్యత కలిగినటువంటి అధికారులే(పరిశస్యులు), ఏ భాద్యత లేకుండా, ప్రజలను భాదలతో, కష్టాలలో ఉన్నప్పుడు వారిని పట్టించుకోవడంలేదు.

కాని దేవుడు కారుణ్యము కలవాడు కాబట్టియే, తనలో దైవత్వం ఉందికాబట్టియే, దేవుని కుమారుడు కాబట్టియే, తన ప్రజలచెంతకు వెళుతున్నాడు, వారికీ స్వస్థతలు, అద్భుతాలు చేస్తున్నాడు. ఒక భాద్యత కలిగి జీవిస్తున్నాడు. దేవుని కార్యాన్ని, చిత్తాన్ని నెరవేరుస్తున్నారు.

ఎందుకంటే తనప్రజలు కష్టాలతో, బాధలతో సతమతమవుతుంటే దేవుడు ఓర్చుకోలేడు, చూస్తూ ఊరుకోడు. తమ ప్రజలకు న్యాయము చేస్తాడు.

ప్రియ స్నేహితులారా ఇప్పుడు మనందరమూ ఒక్క సారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనము పరిశయ్యుల వలె జీవిస్తున్నామా? లేదా క్రీస్తు వలె ఇతరులకొరకే, దేవునిరాజ్యాన్నిభోధించుటకే జీవిస్తున్నామా?

ఎందుకంటే మనం, మన సాధారణ జీవితంలో, ఇలాంటి సన్నివేషాలను చాల చూస్తూనే ఉంటాం, మన గ్రామాలలో, అనారోగ్యం తో బాధపడేవారిని, కష్టాలలోఉన్నవారిని, నిస్సహాయులును, మానసికంగా, శారీరకంగా బాధపడే వాళ్ళను మనము చూస్తూవుంటాం. కాని అందరమూ కూడా పరిశయ్యులవలె, పట్టించుకోము, నిర్లక్ష్యము చేస్తాము. 

ఆ త్రియేక దేవుడు, మనందరిలో జీవిస్తున్నాడు, మనందరిలో కూడా  దైవత్వం ఉంది. కాని మనము, మనలో ఉన్న దైవత్వానికి ప్రాముఖ్యతను ఇవ్వము. అందుకే మనము స్వస్థతలు, అద్భుతాలు చేయలేక పోతున్నాం, అంతేకాక, దేవుడు చేసిన అద్భుతాలను మనం నమ్మలేక పోతున్నాం, ముందుగా వాటిని గ్రహించలేక పోతున్నాం.

మనంకూడా క్రీస్తు వలె అద్భుతాలు చేయగలము, ఎప్పుడైతే మనం దేవుని విశ్వసిస్తామో, దేవుని పై ఆధారపడి జీవిస్తామో. 

ప్రియ స్నేహితులారా చివరిగా మనం గ్రహించాలిసింది ఏమిటంటే, సాతాను క్రియలు నాశనము చేయడానికే, కాని క్రీస్తు చేసే పనులు దేవుని రాజ్యాన్ని నిర్మించడానికి.

ప్రార్థన: కరుణామయుడవైన దేవా! మాలో ఉన్నటువంటి మీ దైవత్వాన్ని మేము గ్రహించలేక పొతున్నాం.

మాజీవితాలు కూడా చాలా సార్లు పరిసయ్యులవలె ఉంటున్నాయి, పేరుకు మాత్రమే నేను, క్రైస్తవునిగా, సంఘంలో ఒకవ్యక్తిగా జీవిస్తున్నాను, దేవుని రాజ్యాన్ని, సువార్తను, నా జీవితం ద్వారా ఇతరులకు భోదించలేక పోతున్నాను, నా సహోదరులను నిరాకరిస్తున్నాను. ఇకనుండి అయినను నేను నీవలె జీవించుటకు, ఇతరులుకొరకు జీవించుటకు నాకు శక్తిని, మంచినే చేసే కరుణగల హృదయాన్ని నాకు ప్రసాదింపుము, అని ప్రార్థన. ఆమెన్.

Br. Subhash

3, జులై 2022, ఆదివారం

అనుదిన దైవ వాక్కు ధ్యానం

మత్తయి సువార్త 9 : 18 - 26

18. ఇట్లు మాట్లాడుచున్న యేసు వద్దకు అధికారి ఒకడు వచ్చి, ఆయన ముందు మోకరించి, "నా కొమార్తె ఇపుడే మరణించినది. కాని, నీవు వచ్చి నీ హస్తమును ఆమెపై నుంచిన ఆమె బ్రతుకును". అని ప్రార్థించెను. 19. అపుడు యేసు లేచి, శిష్యసమేతముగా అతనిని వెంబడించెను. 20. అప్పుడు పండ్రేండేళ్ల నుండి యెడతెగక రక్తస్రావమగుచు బాధపడుచున్నఒక స్త్రీ వెనుకనుండి వచ్చి యేసు అంగీ అంచును తాకెను. 21. ఏలన, "యేసు వస్త్రమును తాకినంత మాత్రమున నేను ఆరోగ్యవతిని అగుదును" అని ఆమె తలంచుచుండెను. 22 . యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, "కుమారీ! ధైర్యము వహింపుము. నీ విశ్వాసము నిన్ను స్వస్థ పరిచెను". అని పలుకగా ఆమె ఆక్షణముననే ఆరోగ్య వంతురాలాయెను.

23. పిమ్మట యేసు, ఆ అధికారి ఇంటికి వెళ్లెను. అచట వాద్యములు మ్రోయించువారిని, అలజడిగనున్నజన సమూహమును చూచి, 24. "మీరందరు ఆవలికి పొండు. ఈ బాలిక మరణించలేదు. నిదురించుచున్నది" అని పలికెను. అందులకు వారందరు ఆయనను హేళన చేసిరి. 24. మూగియున్న జనసమూహమును వెలుపలకు పంపి యేసు లోపలకు వెళ్లి ఆ బాలిక చేతిని పట్టుకొనగా ఆ బాలిక లేచెను. 26. ఆ వార్త ఆ ప్రాంతము అంతట వ్యాపించెను.

ధ్యానము: "నీ విశ్వాసమే నిన్ను స్వస్థ పరుచును".

క్రీస్తు నాధుని యందు ప్రియ స్నేహితులారా, ఈ నాటి సువిశేష పఠనాన్నిమనము ధ్యానించినట్లయితే, మనము ఒక  స్వస్థతను మరియు ఒక అద్భుతము గురించి మనము చదువుతున్నాము. మొదటిగా పండ్రేండేళ్ల నుండి యెడతెగక రక్తస్రావమగుచు బాధపడుచున్నఒక స్త్రీ, తన శారీరక రోగమునుడి స్వస్థత పొందుతుంది.

ఈ వచనాన్ని మనము ధ్యానించినట్లయితే, ఈ స్త్రీకి ఉన్నటువంటి విశ్వాసాన్ని దేవుడు మనకు ఉదాహరణగా చూపిస్తున్నాడు. ఆమెకు ఉన్నటువంటి ధైర్యాన్ని, లేదా సాహసాన్ని, విశ్వాసాన్ని క్రీస్తు ప్రభువు అభినందిస్తున్నారు. క్రీస్తు నందు విశ్వాసముంచి, భయం భయంగా దేవుని యొక్క వస్త్రాన్ని తాకిన వెంటనే ఆమె స్వస్థత పొందుకుంది. క్రీస్తు ప్రభువు, ఆమె యొక్క విశ్వాసముగల సాహసానికి, మెచ్చి, ఆమెతో "కుమారీ! నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచెను అని పలికాడు."

ఈ స్త్రీ, క్రీస్తు ప్రభువు యొక్క అంగీ అంచును, ఒకే ఒక్కసారి,  తాకగానే స్వస్థత కలిగింది.

మరి మనము ప్రతి రోజుకూడా క్రీస్తుని మన హృదయములోకి, మన ఆత్మలోకి  దివ్య సత్ప్రసాద రూపంలో, మనం స్వీకరిస్తున్నాం. మరి ఎన్ని సార్లు మనం స్వస్థత పొందాలి, ఎన్ని రోగాలనుండి మనకు స్వస్థతలు, అద్భుతాలు జరగాలి.  మరి మనది నిజమైన  విశ్వాసమా  లేదా పెద్దలు మనకు నేర్పించినటువంటి ఆచారము మాత్రమేనా అని ఆత్మ పరిశీలన చేసుకుందాం.

రెండవదిగా, క్రీస్తు ప్రభువుకు మరణము పై ఉన్న ఆధిపత్యాన్ని, లేదా జీవాన్ని ఒసగే శక్తి ఉందని మనము గ్రహించవచ్చు.

ఈ వచనంలో మనము రెండు విషయాలు అర్థం చేసుకోవచ్చు, మొదటిగా అధికారికి ఉన్నటువంటి వినయము, విశ్వాసము, రెండవదిగా జనసమూహము యొక్క అవిశ్వాసము. ఇక్కడ అధికారి మోకరించి, క్రీస్తునందు పూర్తి విశ్వాసముంచి, ప్రార్థిస్తున్నారు, కాని జనసమూహము హేళన చేస్తున్నారు, దేవుడిని నమ్ముటలేదు, ఒక పిచ్చివానిగా చూస్తున్నారు. ఎందుకంటే "మరణించిన వారిని నిదురిస్తున్నారు" అంటే ఎవరైనా హేళనచేస్తారు, వెక్కిరిస్తారు, వాస్తవమే. కానీ వారు మాత్రం క్రేస్తుప్రభువు దేవుడన్న సంగతిని గ్రహించుటలేదు.

ఇక్కడ వారు క్రీస్తు ప్రభువుకు, జీవాన్ని ఇచ్చే శక్తి, అధికారం ఉందని గ్రహించలేదు. అందుకు కాబోలు, ఆ జనసమూహము క్రీస్తుని హేళన చేశారు.

కానీ క్రీస్తు ప్రభువు వారి మాటలను హేళనను లెక్క చేయకుండా, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. మరణించిన ఆ బాలికను జీవంతో లేపుతున్నారు.

ఆ సన్నివేషాన్ని చూసి జనసమూహము  అశ్చర్యంతో నిండిపోయారు, అవును. సహజంగా ఆ జనసమూహము, ఇప్పటి వరకు మరణించిన వారిని జీవముతో లేపటం, వినివుండరు, బహుశా చూసివుండరు కూడా. అందుకే వారు అలా ప్రవర్తించి ఉండవచ్చు. తరువాత వారు, క్రీస్తు చేసినటువంటి ఆ అద్భుతాన్ని ఆ ప్రాంతమంతయు చాటిచెప్పారు.

ఈ రెండు సన్నివేషాల ద్వారా మనందరమూ గ్రహించవలసినది ఏమిటంటే, ఏవిధంగా నైతే, ఆ అధికారి మరియు జబ్బునపడినటువంటి స్త్రీ వలే,  మన జీవితాలలో అద్భుతాలు, స్వస్థతలు జరగాలంటే, మనము కూడా, ధైర్యము వహించి, దేవుని యందు విశ్వాసము ఉంచి, దేవుని చెంత మోకరించి ప్రార్థించాలి, అప్పుడే, దేవుడు, మనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని మెచ్చుకొని, మన ప్రార్థనలు, విన్నపాలను ఆశీర్వదిస్తాడు, అద్భుతాలు చేస్తాడు, స్వస్థతలు చేస్తాడు.

క్రీస్తునాడుని యందు ప్రియ స్నేహితులారా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం.

మన జీవితాలు ఏవిధంగా ఉన్నాయి, ఆ అధికారి, మరియు ఆ స్త్రీ వలే, దేవుని యొక్క మనజీవితాలలో చూడాలనుకుంటున్నాయా లేదా, ఒక వేల ఆ జనసమూహము వలే క్రీస్తుని మనము హేళన చేస్తున్నామా?

ప్రార్థన : ఓ దయా సంపన్నుడా! మా జీవితాలు కూడా ఎన్నో సంవత్సరాలుగా, అనేక విధాలైన రోగములనుండి, కోపము, పగ, ద్వేషము, అసూయా, క్రోధము, వ్యామోహము,  దొంగతనము, గర్వము, సోమరితనం, ఇంకా అనేక విధములైన శారీరక, ఆత్మీయక రోగములనుడి నశించి పోతుంది. మాకు మాత్రం, వాటన్నిటినుండి, బయటకు రావాలని ఉంది, స్వస్థతను పొందాలని ఉంది. కానీ నా బలహీనతలే, నా లోని అవిశ్వాసము, అధైర్యము, గర్వము, నన్ను నీదరికి చేరనీయుట లేదు.

మీ యొక్క దయార్ద హృదయము వలన, నాకు విమోచనము కలుగ చేయుము, నాలొఉన్నటువంటి, అస్వస్తతలను తీసివేయుము. మీరు ఒక్క మాట పలికిన, నా శరీరము, నా ఆత్మకూడా స్వస్థత పొందును. కావున, మాకు కూడా, మిమ్ము హేళన చేసిన జనసమూహము వలే కాకుండా, ఆ అధికారి, మరియు ఆ స్త్రీ వలే, ధైర్యమును, విశ్వాసమును కలుగ చేయుము అని ప్రార్థించుచున్నాము. కావున మేముకూడా మీ యొక్క మహిమను చాటి చెప్పే విధంగా మాకు అనుగ్రహము దయచేయుమని ప్రార్థిస్తున్నాము. ఆమెన్.

Br. Subhash

2, జులై 2022, శనివారం

అనుదిన దైవ వాక్కు ధ్యానం

 మత్తయి 9:14-17 

యోహను శిష్యులు  యేసును సమీపించి , మేము , పరిసయ్యులు  కూడా తరచుగా ఉపవాసము ఉందుము గాని. మీ శిష్యులు ఎన్నడును ఉపవాసము ఉండరేల? అని ప్రశ్నింపగా, పెండ్లి కుమారుడు ఉన్నంతకాలము పెండ్లికి వచ్చిన వారు ఏల శోకింతురు?  పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి  కొనిపోబడు దినములు  వచ్చును. అపుడు  వారు ఉపవాసము  చేయుదురు. పాత గుడ్డకు మాసిక వేయుటకు క్రొత్త  గుడ్డను ఎవడు  ఉపయోగించును? అట్లు ఉపయోగించిన క్రొత్త గుడ్డ కృంగుట వలన  ఆ పాత గుడ్డ మరింత చినిగిపోవును. క్రొత్త  ద్రాక్షరసమును పాత తిత్తులలో ఎవరు పోయుదురు? అటుల పోసిన యెడల అవి పిగులును; ఆ ద్రాక్షరసము నేల పాలగును. తిత్తులు నాశనమగును. అందువలన, క్రొత్త ద్రాక్ష రసమును క్రొత్త తిత్తులలో  పోయుదురు. అపుడు ఆ రెండును చెడిపోకుండును అని యేసు సమాధానమొసగెను. 

యోహను శిష్యులు యేసు ప్రభువు  వద్దకు వచ్చి ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఆ ప్రశ్న ఏమిటి అంటే మేము మరియు పరిసయ్యులు ఉపవాసము ఉందుము కాని మీ శిష్యులు ఎందుకు ఉపవాసము ఉండరు? వారు ఈ ప్రశ్న అడగడానికి కూడా చాలా కారణాలు ఉండివుండవచ్చు. వాటిలో యేసు ప్రభువు మరియు ఆయన  శిష్యులు అనేక సమయాలలో విందులయందు కనపడుతుంటారు . 

కానా అనే ఊరిలో జరిగిన పెళ్ళిలో వీరు ఉన్నారు, సిమోను అనే పరిసయ్యుడు ఇచ్చిన విందులో ఉన్నారు, ఒక సుంకరి  అయిన జక్కయ్య మార్పు చెందిన తరువాత ఇచ్చే విందులో యేసు ప్రభువు శిష్యులు ఉన్నారు. లెవీ యేసు ప్రభువు అనుచరుడిగా మారిన తరువాత ఇచ్చిన విందులో వీరు ఉన్నారు. ఈ విందులన్నీ చూసి వీరు ఉపవాసం చేయక, ఎప్పుడు విందులు వినోదలతో ఉన్నారు అని వారు భావించి ఈ ప్రశ్న అడిగి ఉండవచ్చు. లేక యేసు ప్రభువు శిష్యులు ఎందుకు ఉపవాసం చేయడం లేదో తెలుసుకోవడానికి  ఈ ప్రశ్న అడిగి ఉండవచ్చు. యోహను శిష్యులు యేసు ప్రభువును తరువాత కూడా ఒక సారి ఓ ప్రశ్న అడుగుతున్నారు. అది ఏమిటి అంటే మా గురువు మిమ్ములను అడగమని పంపించారు, రానున్న రక్షకుడవు నీవేనా? లేక మేము ఇంకోకని కొరకు మేము వేచి చూడలా ? అంటే  యేసు ప్రభువు దగ్గరకు వీరు అప్పుడప్పుడు  వచ్చే వారు, వారి సమస్యలు గురించి చెప్పేవారు, ఆయనను ఒక రకముగా వారు తమ గురువు వలె గౌరవించారు. 

యోహను శిష్యులు అడిగిన ప్రశ్నకు యేసు ప్రభువు ఇచ్చిన సమాధానం ఏమిటి అంటే ? పెండ్లి కుమారుడు ఉన్నంతకాలము పెండ్లికి వచ్చిన వారు ఏల శోకింతురు?  దీని అర్ధం ఏమిటి? ఇది మనం యోహను నుండి తెలుసుకోవాలి. యోహను యేసు ప్రభువుని సాన్నిధ్యంను తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే గమనించి ఆనందంతో గంతులేశాడు. అంటే యేసు ప్రభువు సాన్నిధ్యం మనకు ఆనందం ఇస్తుంది. అది ఆనందించవలసిన సమయమే కాని దుఃఖించవలసిన సమయం కాదు. అంటే మనతో యేసు ప్రభువు మనతో ఉన్నంత కాలం మనం ఆనందించే సమయం. 

 పాత నిబంధనకాలంలో కూడా అనేక విధాలుగా ప్రజలు ఉపవాసం చేశారు, అది దేవుని నుండి, ఆయన ఆజ్ఞల నుండి  దూరంగా వెళ్ళిన వారు అనేక కష్టాలు అనుభవించారు. వారు చేసిన పాపాలకు గాను దైవ సాన్నిధ్యం యెరుషలేము దేవాలయం నుండి వెళ్ళి పోతుంది. దేవుని సాన్నిధ్యం  మన నుండి వెళ్ళిన , మనం దేవుని నుండి దూరంగా వెళ్ళిన దాని పర్యవసానం మనం అనేక కష్టాలకు , నష్టాలకు గురి అవుతాము. ఇది దేవుడు మనకు ఇచ్చే శిక్ష కాదు. మనం దేవుని నుండి దూరంగా వెళ్ళి మనం  తెచ్చుకున్నవి. కాని మరలా దేవుని దగ్గరకు రావడానికి మనం చేసే ఒక పని నేను మీతో ఉండటానికి ఇష్టపడుతున్నాను అని తెలియజేయడం. ఇది   తెలియజెసే ఒక విధానం ఉపవాసం. కాని దేవున్ని వారు దూరం చేసుకోకపోయిన దేవుని కోసం, ఆయన రాక కోసం , ఆయన  వచ్చినప్పుడు యోగ్యరీతిగా ఆయనను స్వీకరించడానికి ఒక సాధనం ఉపవాసం. యోహను ఉపవాసం దీనిలో భాగమే. దేవుని నుండి దూరమై ఆయన కారుణ్యం పొందుటకు కూడా  ఒక సాధనం ఉపవాసం, ఇది పాత నిబంధనలో నినివే ప్రజలు చేశారు. 

యేసు ప్రభువు సమాధానం మనకు ఒక విషయం తెలియ జేస్తుంది. ఇప్పుడు యేసు ప్రభువు శిష్యులు ఏ విధంగా కూడా ఉపవాసం చేయనవసరం లేదు. కారణం వారు ఇప్పుడు దేవునితో కలసి ఉన్నారు. దేవుని సాన్నిధ్యం పొందుతున్నారు. యోహను శిష్యులు యేసు ప్రభువు రాకకై సిద్దపడు ఉపవాసం చేస్తున్నారు. ఆయనను యోగ్యంగా స్వీకరించడానికి.  కాని యేసు ప్రభువు శిష్యులు ఆయనతో పాటు ఉన్నారు కనుక వారు ఉపవాసం చేయనవసరం లేదు. 

కాని యేసు ప్రభువు చెప్పిన విధంగా "పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి  కొనిపోబడు దినములు  వచ్చును. అపుడు  వారు ఉపవాసము  చేయుదురు." అంటే యేసు ప్రభువు వారి నుండి వెళ్లిపోయినప్పుడు ఖచ్ఛితముగా వారు ఉపవాసం చేస్తారు. వారి నుండి యేసు ప్రభువు వెళ్లిపోతారు. అప్పుడు వారు ఆయన సాన్నిధ్యం పొందుటకు ఉపవాసం చేయాలి. మనం కూడా ఈ రోజు ఆయన సాన్నిధ్యం పొందక పోయిన యెడల ఉపవాసం , పాప సంకీర్తనం ద్వారా మనం ఆయన సాన్నిధ్యం పొందాలి. 

"పాత గుడ్డకు మాసిక వేయుటకు క్రొత్త  గుడ్డను ఎవడు  ఉపయోగించును? అట్లు ఉపయోగించిన క్రొత్త గుడ్డ కృంగుట వలన  ఆ పాత గుడ్డ మరింత చినిగిపోవును.క్రొత్త  ద్రాక్షరసమును పాత తిత్తులలో ఎవరు పోయుదురు? అటుల పోసిన యెడల అవి పిగులును; ఆ ద్రాక్షరసము నేల పాలగును. తిత్తులు నాశనమగును. అందువలన, క్రొత్త ద్రాక్ష రసమును క్రొత్త తిత్తులలో  పోయుదురు. అపుడు ఆ రెండును చెడిపోకుండును అని యేసు సమాధానమొసగెను." ఈ వచనాలలో మనం ఎప్పడూ ఏమి చేయాలో తెలుసుకొని చేయాలి అని నేర్చుకుంటున్నాం. 

ప్రార్ధన : ప్రభువా! మా జీవితంలో అనేక సమయాలలో మీరు మాతో ఉన్న విషయాన్ని గమనించలేక పోతున్నాను. మిమ్ములను మీ సాన్నిధ్యాన్ని పొందాలనే కోరిక మాకు ఎంతో ఉన్నా కాని మేము పొందలేక పోతున్నాము. మేము మిమ్ము గుర్తించే భాగ్యాన్ని ఇవ్వమని వేడుకుంటున్నాము. మేము ఎందుకు ఉపవాసం చేయాలో , ఎప్పుడు ఉపవాసం చేయాలో తెలుసుకునే శక్తిని దయచేయండి. మాలో కొన్ని సార్లు నిజమైన మార్పు లేకున్నా , కేవలం బాహ్యంగా కొద్ది సేపు కనపడే మార్పులకు మేము పూర్తిగా మారిపోయాము అని బ్రమపడుతున్నాము. అటువంటి సమయాలలో మమ్ము మన్నించి మేము నిన్ను పూర్తిగా తెలుసుకొని, మీ సాన్నిధ్యం పొందే భాగ్యం దయచేయండి. ఆమెన్. 

1, జులై 2022, శుక్రవారం

అనుదిన దైవ వాక్కు ధ్యానం

 మత్తయి 9:9-13 

తరువాత యేసు అటనుండి వెల్లుచు, సుంకపు మెట్టుకడ కూర్చున్న మత్తయి అనువానితో "నన్ను అనుసరింపుము"  అనెను. అతడు అట్లే లేచి ఆయనను అనుసరించెను. ఆ ఇంటిలో యేసు భోజనమునకు  కూర్చుండినపుడు సుంకరులును, పాపులును  అనేకులు వచ్చి ఆయనతోను, ఆయన శిష్యులతోను పంక్తియందు కూర్చుండిరి. అది చూచిన పరిసయ్యులు "మీ బోధకుడు ఇట్లు సుంకరులతో, పాపులతో కలిసి భుజించుచున్నాడేమి?" అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. ఆ మాటలను ఆలకించిన యేసు,  "వ్యాధిగ్రస్తులకేగాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు గదా!నాకు కారుణ్యము కావలయునుగాని, బలి అవసరము లేదు అను  లేఖనమునందలి  అర్ధమును మీరు గ్రహింపుడు. నేను పాపులను పిలువవచ్చితిని కాని, నీతిమంతులను పిలుచుటకు రాలేదు" అని పరిసయ్యులకు ప్రత్యుత్తరమిచ్ఛెను. 

మత్తయి అను సుంకరిని యేసు ప్రభువు పిలుస్తున్నారు, యేసు ప్రభువు పిలుపుకు మత్తయి వెంటనే స్పందిస్తున్నారు. నాకు వేరె పని ఉంది అని కాని , లేక ఇంటి వద్ద చెప్పి వస్తాను అని కాని ఏమి చెప్పలేదు. యేసు ప్రభువు అడిగిన వెంటనే యేసు ప్రభువును అనుసరిస్తున్నారు. యేసు ప్రభువుని  శిష్యుడు కావాలి అంటే ఇది ప్రధానమైన లక్ష్యం.  యేసు ప్రభువుని శిష్యుడు ఎప్పుడు విధేయుడగా , సంసిద్ధుడుగా ఉండాలి. విధేయత  మరియు సంసిద్ధత రెండు మనం మత్తయిలో చూస్తున్నాము. విధేయత యేసు ప్రభువు అప్పజెప్పిన పని చేయడానికి మరియు మన కర్తవ్యం మీదనే దృష్టి మరల్చకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. సంసిద్దత మనలను ఎప్పడూ కర్తవ్య నిర్వహణ చేయడానికి, వెనుకడుగు వేయకుండా వుండటానికి ఉపయోగపడుతుంది.  యేసు ప్రభువును అనుసరించే వారు ఎల్లప్పుడు ఈ విధానంగానే ఉండాలి. అడిగిన వెంటనే మారు మాటలేకుండా ప్రభువును అనుసరించడానికి సిద్దపడటమే క్రీస్తు నిజమైన శిష్యుడు చేస్తాడు. 

"మీ బోధకుడు ఇట్లు సుంకరులతో , పాపులతో కలిసి భుజించుచున్నాడేమి?" అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి.  నీతి మంతుడైన పరగణించపడుతున్న ఒక వ్యక్తి ఎందుకు పాపులు, సుంకరులతో కలసి భుజించుచున్నాడు అని వారు యేసు ప్రభువును అడుగుతున్నారు. ఎందుకు యేసు ప్రభువు సుంకరులు, పాపులతో భుజించడానికి కారణం ఆయన వారి కోసం వచ్చారు. సుంకరులు , పాపులు దేవునికి దూరంగా ఉన్నారు. వీరు చేసిన పనుల ద్వారా వారు దేవునికి దూరంగా ఉన్నారు. కాని దేవుడు వీరికి కరుణ చూపించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నారు. దేవుడు వీరి దగ్గరకు వస్తున్నారు. వారిని తండ్రి దగ్గరకు తీసుకువెళ్ళడానికి యేసు ప్రభువు సిద్ధంగా ఉన్నానని తెలియజేయడానికి వస్తున్నారు. వీరు పాపములో ఉన్న దేవునికి దూరంగా ఉన్న వీరిని మరల తండ్రి దగ్గరకు పోవుటకు అర్హులుగా చేయడానికి వీరితో కలసి భుజిస్తున్నారు. వీరితో కలసి భుజించడం వల్ల యేసు ప్రభువు వారిని తనతో కలసి ఉండటానికి వారి పాత జీవితం వదలి వేయడానికి ఆహ్వానం ఇస్తున్నాడు.  . 

ఇది పరిసయ్యులు సరిగా అర్ధం చేసుకోలేకపోయారు. యేసు ప్రభువును అపార్ధం చేసుకొని వారు శిష్యులను ప్రశ్నిస్తున్నారు.    పరిసయ్యులు బహిరంగంగా దేవుని ఆజ్ఞలును దిక్కరించిన వారితో  ఎప్పుడు కూడా భుజించరు. కాని యేసు ప్రభువు వారితో కలసి భుజిస్తున్నారు. ఇక్కడ యేసు ప్రభువు   హ్ోషయ ప్రవక్త మాటలను గుర్తుచేస్తున్నారు. "నాకు కారుణ్యము కావలయునుగాని, బలి అవసరము లేదు"  హ్ోషయ ప్రవక్త  6:6 .  దేవునికి కావలసినది కారుణ్యము , బలులు కాదు. ఎవరికి ఈ కారుణ్యము మనం చూపించాలి అంటే అది ఎవరు అయితే పాపం చేసి దేవునికి దూరముగా ఉన్నారో వారికి కరుణ చూపించాలి. ఎవరు అయితే ఆకలితో ఉన్నారో వారికి కరుణ చూపించాలి. ఎవరు అయితే అనారోగ్యంతో ఉన్నారో వారికి కరుణ చూపించాలి. ఎవరు అయితే  అవసరంలో ఉన్నారో వారికి కరుణ చూపించాలి.  యేసు ప్రభువు చూపించిన కరుణ ఇటువంటి వారికి. వీరికి నిజానికి సమాజంలో ఒక స్థానం లేదు, యేసు ప్రభువు వీరితో ఉండటం వలన వీరికి సమాజంలో ఒక స్థానం ఇస్తున్నాడు. సమాజం వీరికి విలువ ఇచ్చే విధంగా చేస్తున్నారు. 

ప్రార్ధన : ప్రభువా! అనేక సార్లు మీరు నన్ను పిలిచిన కాని నేను మీ మాట వినక, నన్ను ఎందుకు దేవుడు పిలుస్తాడు అని అనుకున్నాను. మీరు మత్తయిని  పిలిచినట్లుగా మీచేత పిలువబడడానికి మీరు నా పవిత్రతని చూడరని, నేను అపవిత్రంగా ఉన్న నన్ను పిలుచుటకు వెనుకాడని మీ ప్రేమకు కృతజ్ఞతలు. మత్తయిని పిలిచినట్లుగానే నన్నును మంచి జీవితానికి పిలువండి. మత్తయి వలె నేను కూడా మీరు పిలిచిన వెంటనే మారు మాటలాడకుండా నేను మిమ్ము అనుసరించే విధంగా చేయండి. ప్రభువా మీరు వచ్చినది నన్ను పిలువడానికని , నాకు మీ ప్రేమను అందించడానికని, నా పాపములు క్షమించడానికని తెలుసుకొని వీటిని మీ నుండి వాటిని పొందుటకు నన్ను సిద్దపర్చండి. ప్రభువా మీరు  ఈ లోకానికి వచ్చినది నా కోసం అని తెలుసుకొని నేను మీ దగ్గరకు రావడానికి నన్ను సిద్దపరచండి. మిమ్ము ఎప్పటికీ కోల్పోకుండ నన్ను దీవించండి. ఆమెన్. 

30, జూన్ 2022, గురువారం

అనుదిన దైవ వాక్కు ధ్యానం, మత్తయి 9: 1-8

మత్తయి 9: 1-8 

అంతట యేసు పడవనెక్కి, సరస్సును దాటి తన పట్టణమునకు చేరెను. అపుడు పడకపై పడియున్న పక్షవాత రోగిని ఒకనిని , కొందరు ఆయన యొద్దకు తీసికొనివచ్చిరి. వారి విశ్వాసమును గమనించి, ఆ రోగితో "కుమారా! ధైర్యము వహింపుము . నీ పాపములు పరిహరింపబడినవి" అని యేసు పలికెను. అపుడు ధర్మ శాస్త్ర బోధకులు కొందరు, "ఇతడు దైవ దూషణము చేయుచున్నాడు"అని తమలో తాము అనుకొనిరి. వారి తలంపులను గ్రహించిన యేసు , "మీకు ఈ దురభిప్రాయములు ఏల కలిగెను? నీ పాపములు మన్నింపబడినవనుటయా? లేక నీవు లేచి నడువమనుటయా? ఈ రెండింటి లోను ఏది సులభతరము ? ఈ భూమి మీద మనుష్య కుమారునకు పాపములను క్షమించు  అధికారము కలదని మీకిపుడే తెలియును" అని పలికి,  ఆ రోగితో "నీవు ఇక లేచి, నీ పడకను ఎత్తుకొని యింటికి  పొమ్ము" అనెను. అతడు వెంటనే లేచి తన  యింటికి పోయెను. అది చూచిన జనసమూహములు భయపడి మానవులకు ఇట్టి అధికారమును ఇచ్చిన దేవుని స్తుతించిరి. 

యేసు ప్రభువు పడవ నెక్కి సరస్సు దాటిన తరువాత అక్కడ ఆ పట్టణములో కొంత మంది పడకపై పడియున్న పక్ష వాత రోగిని తీసుకొని వచ్చారు. అప్పుడు యేసు ప్రభువు కుమారా ధైర్యం వహింపుము, నీ పాపములు పరిహరింపబడినవి అని అంటున్నారు. యేసు ప్రభువు మాటలాడిన ఈ మాటలు అక్కడ ఉన్నవారికి దైవ దూషణ అని అంటున్నారు. అయితే ఆ పక్ష వాత రోగికి యేసు ప్రభువు ధైర్యాన్ని ఇస్తున్నాడు. నీ పాపములు పరిహరింపబడినవి అని అంటున్నారు. పాపము చేయడం అంటే అతను పాపమునకు బానిసగా ఉన్నాడు. కాని ఇప్పుడు ఆయన పాపము నుండి విముక్తి పొందబోవుతున్నాడు. అతను ఒక స్వతంత్రుడు అవుతున్నాడు. ఇక నుండి ఆయన బానిసగా ఉండడు. కనుక యేసు ప్రభువు ఆ వ్యక్తికి భయ పడ వలదు అని అంటున్నాడు. తన రోగంతోనే కాదు తన సమాజం పట్ల కూడా ఆయనకు భయం ఉంది. అందరు ఆయనను పాపిగా పరిగణిస్తున్నారు. మరియు ఆ విధంగా చూస్తున్నారు. యేసు ప్రభువు మాత్రం ఆయన పాపములను పరిహరిస్తాను అని చెబుతున్నారు. 

యేసు ప్రభువు ఈ మాటలు మాట్లాడినది ఆ పక్షవాత రోగిని తీసుకొని వచ్చిన వారి విశ్వాసంను చూసి ఈ మాటలు అంటున్నారు. ఎందుకు వీరి విశ్వాసం చూసి యేసు ప్రభువు మాటలాడుతున్నారు అంటే, వీరు వారి కోసం కాక అవసరంలో, అనారోగ్యంలో ఉన్న ఒక వ్యక్తిని, యేసు ప్రభువు స్వస్థత పరుస్తాడు అని యేసు ప్రభువు దగ్గరకు వారు ఆయనను తీసుకొని వచ్చారు. వీరు తమ కోసం కాక వేరె వారి కోసం , వారి కష్టాలు తీర్చడం కోసం చేసిన మంచి పనిని చూసి మరియు యేసు ప్రభువు యందు వారికి గల విశ్వాసం చూసి ఆయనను స్వస్థత పరుస్తున్నారు. విశ్వాసం అంటె ఎంతటి విపత్కర పరిస్థితులు ఉన్న కూడా నా దేవుడు నన్ను అవమానమునకు గురికానివ్వడు అనే నమ్మకం ఇక్కడ వారి సొంతం. విశ్వాసం మనకు మాత్రమే ఉపయోగపడేది కాదు. అది అందరికి ఉపయోగ పడుతుంది. ఇతరుల శ్రేయస్సు కూడా విశ్వాసం కాంక్షిస్తుంది. ఇక్కడ జరుగుతుంది ఇదియే. దీని ద్వారా లబ్ది పొందిన ఆ వ్యక్తి కూడా ప్రభువును విశ్వసిస్తాడు. మన విశ్వాసం ఇతరులకు ఈ విధంగా ఉపయోగ పడాలి. 

ఆ మాటలు వింటున్న ధర్మ శాస్త్ర బోధకులు యేసు ప్రభువు దైవ దూషణ చేస్తున్నాడు అని అంటున్నారు. ఇక్కడ దైవ దూషణ అని ధర్మ శాస్త్ర బోధకులు అనడానికి కారణం ఏమిటి అంటే యేసు ప్రభువు నీ పాపములు పరిహరింపబడినవి అని చెప్పడం.  వారికి దేవుడు మాత్రమే పాపములను పరిహరింపగలడు. దేవుడు తప్ప ఎవరు మన పాపములను ఎవరు క్షమించలేరు, అటువంటిది యేసు ప్రభువు నీ పాపములు క్షమించబడినవి అంటున్నారు. కనుక వీరు యేసు ప్రభువు తనను తాను దేవునికి సమానముగా చేసుకుంటున్నారు అని అనుకుంటున్నారు. ఆయన దేవుడు అని వారు గమనించలేక పోయారు. అంతేకాదు ఆయన గురించి వారు తప్పుగా అనుకుంటున్నారు. అందుకే యేసు ప్రభువు పక్ష వాత రోగిని లేచి నడువమని చెబుతున్నారు, దాని ద్వారా వారికి ఆయనకు ఉన్నటువంటి శక్తిని ప్రభువు వారికి తెలియజేస్తున్నారు. 

"ఈ భూమి మీద మనుష్య కుమారునకు పాపములను క్షమించు  అధికారము కలదని మీకిపుడే తెలియును అని పలికి,  ఆ రోగితో నీవు ఇక లేచి, నీ పడకను ఎత్తుకొని యింటికి  పొమ్ము అనెను. అతడు వెంటనే లేచి తన  యింటికి పోయెను. అది చూచిన జనసమూహములు భయపడి మానవులకు ఇట్టి అధికారమును ఇచ్చిన దేవుని స్తుతించిరి."  ఇక్కడ మనం అర్ధం చేసుకోవలసిన విషయం ఏమిటి అంటే  యేసు ప్రభువు తనకు ఉన్నటు వంటి శక్తిని చూపుతున్నాడు. అంతేకాదు తాను దేవుడను అనే విషయం తేటతెల్లం చేస్తున్నారు. ధర్మ శాస్త్ర బోధకులకు   మానవుడు చేయలేని పనిని ఇక్కడ యేసు ప్రభువు చేయడం ద్వారా ఈయన దేవుడు అని తెలుసుకోవాలి కాని వారు ఆ విషయాన్ని పూర్తిగా అర్ధం చేసుకోలేకపోయారు. కాని యేసు ప్రభువు మాటను పాటిస్తున్న ఆ పక్షవాత రోగి తన రోగం నుండి విముక్తి పొందుతున్నాడు. యేసు ప్రభువుని నమ్మి జీవించినప్పుడు మన సమస్యల నుండి విముక్తి పొందుతారు. 

ప్రార్ధన : ప్రభువా! మా  జీవితంలో అనేక సార్లు మేము మీ మాటలను నమ్మడంలో , మీ మీద విశ్వాసం ఉంచడంలో విఫలం చెందుతున్నాము. దాని వలన మేము మా బాధల నుండి విముక్తి పొందలేక పోతున్నాము. మీ మాటను ఎల్లప్పుడు పాటిస్తూ మా సమస్యల నుండి మేము విముక్తి పొందే వారిగా మమ్ములను మార్చండి. బాధల్లో, కష్టాలలో ఉన్నవారికి  మేము కూడా మా వంతు సాయం చేస్తూ వారికి వారి సమస్యల నుండి విముక్తి పొందేందుకు మేము చేయగలిగె సాయం చేయు వారిగా మమ్ము దీవించండి.  మేము మీ శక్తిని తెలుసుకొని ఎల్లప్పుడు మిమ్ములను మీ మీద విశ్వాసం ఉంచి జీవించే వారిగా మమ్ము మార్చండి. ప్రభువా అనేక సార్లు మీ మీద పూర్తిగా విశ్వాసం ఉంచలేదు అటువంటి సమయాలలో మమ్ము క్షమించండి. పక్షవాత రోగి పాపములను క్షమించిన విధముగా మా పాపములను క్షమించండి. అతనికి ఇచ్చిన విముక్తిని మాకును దయచెయ్యండి. ఆమెన్. 

28, జూన్ 2022, మంగళవారం

అనుదిన దైవ వాక్కు ధ్యానం

 మత్తయి 8: 23-27 

అంతట యేసు పడవ నెక్కగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. హఠాత్తుగా గాలి వాన క్రమ్మి, పడవను ముంచెత్తు నంతటి అలలు ఆ సముద్రములో చెలరేగెను. ప్రభువు ఆ సమయమున నిదురించుచుండెను. అప్పుడు శిష్యులు  ఆయనను మేలుకొలిపి "ప్రభూ ! మేము నశించుచున్నాము. రక్షింపుము" అని ప్రార్ధింపగ,  యేసు వారితో "ఓ అల్ప విశ్వాసులారా !మీరు భయపడెదరేల ?" అని పలికి , లేచి గాలిని , సముద్రమును గద్దించెను . వెంటనే ప్రశాంతత చేకూరెను. గాలి , సముద్రము సైతము ఈయన ఆజ్ఞకు లోబడినవి. ఈయన ఎంతటి మహానుభావుడు! అని జనులు ఆశ్చర్యపడిరి. 

యేసు ప్రభువు శిష్యులు పడవలో ప్రయాణం చేస్తున్నారు. ప్రభువు నిద్రపోతున్నారు. హఠాత్తుగా గాలి వాన క్రమ్మి , పడవను ముంచెత్తింది.  సముద్రములో అలలు  చెలరేగాయి. అక్కడ ఉన్నటువంటి శిష్యులు అందరు భయ పడుతున్నారు. ఎందుకు ఈ శిష్యులు అందరు భయపడుతున్నారు. వారు ఏమి  సముద్రం గురించి తెలియని వారు కాదు. వీరిలో ఎక్కువ మంది చేపలు పట్టేవారు. ఈత తెలిసిన వారు. సముద్రం గురించి తెలిసిన వారు. కాని వారు భయ పడుతున్నారు. ఎందుకంటే ఆ అలలు చాలా భయంకరమైనవి. వారు అంతకు ముందు చూడనివి కావచ్చు. ఆ అలల తీవ్రతను బట్టి వారు దానిని ఒక సాధారణమైన తుఫాను కాదు అని  అంచనా వేశారు. అందుకే వారు యేసు ప్రభువు దగ్గరకు వచ్చారు. సముద్రములో చెలరేగిన ఈ అలలు ఇప్పుడు వారి జీవితములో చెలరేగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వారు ఏమి చేయాలో వారికి తెలియదు. వారు చనిపోతారో, బ్రతుకుతారో తెలియదు. వారు యేసు ప్రభువును చూస్తున్నారు. ఆయన దగ్గరకు వెళ్ళి తమ గురువుకు తాము అనుభవిస్తున్న పరిస్థితిని ఎలా  తెలియచేయాలా  అని వారు ఒక సందిగ్ధ అవస్థలో వారు ఉన్నారు. 

"ఆయనను మేలుకొలిపి,ప్రభూ ! మేము నశించుచున్నాము. రక్షింపుము అని" చెబుతున్నారు. ఇక్కడ శిష్యులు చాలా వరకు వారి వాస్తవ పరిస్థితిని అంచనా వేసి యేసు ప్రభువు దగ్గరకు వెళుతున్నారు. వారి జీవితం ముగిస్తుంది అని వారు అనుకుంటున్నారు. ఈ పరిస్థితిలో వారిని దేవుడు తప్ప ఇంకా ఎవరు కాపాడలేరు. ఎందుకంటే వారికి తుఫాను గురించి బాగా తెలుసు. సముద్రం గురించి తెలుసు. ఎప్పుడు సముద్రం తీవ్ర రూపం దాల్చుతుందో వారికి తెలుసు. ఈ పరిస్థితిలో వారు జీవించడానికి యేసు ప్రభువు తప్ప ఇంకా ఎవరు వారిని కాపాడలేరు. వారు నాశనం చెందకూడదు అనుకున్నారు. వెంటనే వారు ప్రభువు దగ్గరకు వచ్చారు. మమ్ములను రక్షింపుము అని వేడుకుంటున్నారు. ఈ వెడుకోలులో వారి భయం, ప్రాణం మీద ఆశ అన్నీ అరచేతిలో పెట్టుకొని ఏమి అవుతుందో అని ప్రభువు దగ్గరకు వెళ్లారు. వారిని ప్రభువు రక్షిస్తున్నారు.  సముద్రంను ఆయన శాసిస్తున్నాడు. ఆయన మాటను విని సముద్రం శాంతిస్తుంది.   

యేసు వారితో , ఓ అల్ప విశ్వాసులారా !మీరు భయపడెదరేల ? అని అంటున్నారు.  యేసు ప్రభువు వారిని అల్ప విశ్వాసులారా అని ఎందుకు అంటున్నారు. యేసు ప్రభువు చేసిన అనేక పనులకు వీరు సాక్షులు, సముద్రాన్ని , దాని అలలను అంచనా వేయగలిగిన వీరు వారితో పాటు ఉన్నటువంటి యేసు ప్రభువు ఎవరు అని వారు గ్రహించలేక పోయారు. ఆయన మనతో ఉన్నంత కాలం మనకు ఎటువంటి అపాయం ఉండదు అని గ్రహించలేకపోయారు. వారు భయ పడుతున్నారు. యేసు ప్రభువు చేసిన అనేక పనులను చూసికూడా వీరు ఆయన యందు విశ్వాసం ఉంచలేక పోయారు. పాత నిబంధనలో దావీదు మహారాజు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నాకు ఏ కొదవయు లేదు అని అంటున్నారు. యేసు ప్రభువు శిష్యులు కూడా అలానే ఉండాలి. ఆయన మనకు తోడుగా ఉంటే ఇక ఏ కొదవయు ఉండదు అని తెలుసుకోవాలి. అది వీరు తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాడంలో వారు ఇఫలం చెందారు అందుకే యేసు ప్రభువు యేసు వారితో "ఓ అల్ప విశ్వాసులారా !మీరు భయపడెదరేల ?" అని  అంటున్నారు. 

అప్పుడు యేసు ప్రభువు లేచి  "గాలిని , సముద్రమును గద్దించెను . వెంటనే ప్రశాంతత చేకూరెను. గాలి , సముద్రము సైతము ఈయన ఆజ్ఞకు లోబడినవి. ఈయన ఎంతటి మహానుభావుడు! అని జనులు ఆశ్చర్యపడిరి." గాలిని , సముద్రమును యేసు ప్రభువు గద్దింపగా సముద్రము శాంతించింది. ఇది యేసు ప్రభువు దైవత్వాన్ని తెలియజేస్తుంది. ఇంతకు ముందు శిష్యులు యేసు ప్రభువు స్వస్థత  ఇవ్వడం చూసారు. అద్భుతాలు చేయడం చూసారు. కాని ఇక్కడ యేసు ప్రభువుకు ప్రకృతి కూడా ఆయన మాట వింటున్నది. ఆయన చెప్పినట్లు చేస్తుంది.  అప్పుడు అది చూసిన వారు ఆశ్చర్యపడుతున్నారు. ఈయన ఎవరు , ఈయనకు ప్రకృతి కూడా మాట వింటున్నది అని వారు అనుకుంటున్నారు. యేసు ప్రభువుతో మన జీవితంలో ఉన్నటువంటి అన్నీ సమస్యలు తీరుతాయి. ఆయనతో మనతో ఉంటే మనకు ఏ కొదవయు ఉండదు. అంతే కాదు ప్రశాంతత మన జీవితంలో ఎల్లప్పుడు ఉంటుంది. 

ప్రార్ధన : ప్రభువా! నా జీవితంలో అనేక సార్లు అనేక కల్లోలాలు వచ్చినవి అటువంటి సమయంలో నేను భయ పడి పోతున్నాను. నాకు నాశనము తప్పదు అని అనుకుంటున్నాను. నిరాశలో జీవిస్తున్నాను. నా జీవితంలో వచ్చే సమస్యలు నన్ను క్రమ్మేస్తున్నాయి. అప్పుడుకూడా నేను భయ పడుతున్నాను. నీవు నాకు తోడుగా ఉన్నావు అని తెలుసుకోలేక పోతున్నాను. నీవు నాకు తోడుగా ఉంటే నాకు ఏ కొదవయు ఉండదు అని తెలుసుకోలేకపోయాను. అటువంటి సమయంలో నన్ను క్షమించండి. నీవు నాకు తోడుగా ఉన్నవన్న విషయాన్ని నేను ఎల్లప్పుడు గుర్తుంచుకునే విధంగా దీవించండి. నా జీవితంలో వచ్చే అనేక అలలను ఎదుర్కోడానికి కావలసిన శక్తిని దయ చేయండి. మీ యందు పూర్తి విశ్వాసం కలిగి జీవించే వానిగా నన్ను చేయండి. ప్రభువా! నీవు సముద్రమును గద్దింపగా అది శాంతించింది. అటులనే నా జీవితంలో మీ మీద విశ్వాసం సన్నగిళ్ళే ప్రతి విషయాన్ని గద్దించండి.  మీ మీద ఎప్పుడు విశ్వాసం ఉండే వానిగా చేయండి. ఆమెన్ . 

27, జూన్ 2022, సోమవారం

అనుదిన దైవ వాక్కు ధ్యానం,

 మత్తయి 8:18-22 (జూన్ 27,2022)

యేసు తన చుట్టుప్రక్కల నున్న గొప్ప జన సమూహములను చూచి వారిని ఆవలి ఒడ్డునకు వెళ్ళుడని అజ్ఞాపించును. అపుడు ధర్మ శాస్త్ర  బోధకుడొకడు యేసును సమీపించి , "బోధకుడా!  నీవు ఎక్కడకు వెళ్ళిన నీ వెంట వచ్చుటకు సంసిద్ధుడను" అనగా  యేసు,  "నక్కలకు బొరియలును, ఆకాశ పక్షులకు గూళ్ళును కలవు. మనుష్య కుమారునకు మాత్రము తలవాల్చుటకైన చోటు లేదు" ప్రత్యుత్తర మిచ్ఛెను. మరియొక శిష్యుడాయనతో "ప్రభూ! మొదట నా తండ్రిని సమాధి చేసి వచ్చేదను; అనుమతి దయ చేయుడు" అని కోరగా, యేసు "నీవు నన్ను వెంబడింపుము. మృతులను  సమాధి చేయు విషయము మృతులనే చూచుకొన నిమ్ము" అని పలికెను. 

"నీవు ఎక్కడకు వెళ్ళిన నీ వెంట వచ్చుటకు సంసిద్దుడను", ఈ మాటను ఒక బోధకుడు  యేసు ప్రభువుకు చెబుతున్నారు. ఎందుకు ఇతను యేసు ప్రభువును అనుసరిస్తాను అని అంటున్నాడు అంటే యేసు ప్రభువు చేసిన పనులు ఆయన చూసి ఉండవచ్చు. యేసు ప్రభువు అనేక మంది ఆకలితో ఉన్నవారిని చూశాడు. వారు ఆకలితో ఉన్నారు అని తెలుసుకొని వారి ఆకలిని తీర్చాడు. అంతె కాదు సాతాను చేత పీడింపబడుతున్న వారిని చూశాడు. వారికి సాతాను నుండి విముక్తి ఇచ్చాడు. యేసు ప్రభువు అనారోగ్యంతో ఉన్న వారిని చూశాడు, వారికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఈ విధముగా ప్రజల అన్నీ సమస్యలు, కష్టాలు, బాధలు అన్నీ తెలుసుకొని వారికీ కావలసినవి ఇచ్చి వారి సమస్యలును తీసివేస్తున్నాడు. అయితే ఇవి అన్నీ తెలిసిన వ్యక్తి  అయివుండవచ్చు, నేను, నీవు ఎక్కడకు వెళ్ళిన నీ వెంట వచ్చుటకు సిద్ధం అని పలికే ఈ వ్యక్తి. ఒక వేళ ఈయనను అనుసరిస్తే నాకు కూడా ఈయన ఇస్తున్నటువంటివన్నీ నాకు రావచ్చు అని అనుకోని యేసు ప్రభువును అనుసరించడానికి వీరు సిద్దం అయి ఉండవచ్చు. లేక యేసు ప్రభువును అనుసరిస్తే ఆయనకు వస్తున్న ఆధరణ నాకు రావచ్చు అని ఆయనను అనుసరించడానికి సిద్దం అయి ఉండవచ్చు. లేక తాను బోధకుడు కాబట్టి యేసు ప్రభువును అనుసరించడం తనకు ముక్తిని దయ చేస్తుంది అని తెలుసుకొని ఆయనను అనుసరించడానకి సిద్ధం అయి ఉండవచ్చు. 

అయితే యేసు ప్రభువు మాత్రం, "నక్కలకు బొరియలును, ఆకాశ పక్షులకు గూళ్ళును కలవు. మనుష్య కుమారునకు మాత్రము తలవాల్చుటకైన చోటు లేదు" అని అంటున్నారు. కారణం ఏమి  అయి ఉండవచ్చు అంటే ఆయనను అనుసరించవలసినది, ఆయన ఇతరులకు ఇచ్చినటువంటి అనుగ్రహాలు, వరాలు, లేక  ఆయన ద్వార వచ్చే ఆదరణకొ కాదు. కేవలం ఆయన ఇచ్చే రక్షణ కోసం మాత్రమే కాదు. మరి ఇంకా ఎందుకు అంటే యేసు ప్రభువును అనుసరించవలసినది, ఆయన తరువాత ఆయన జీవితాన్ని, ఆయన పనులను, ఆయన చిత్తాన్ని కొనసాగించడానికి. ఇక్కడ ఆ బోధకుడు నేను నిన్ను అనుసరించడానికి సంసిద్దుడను అని అంటున్నాడు. కాని ఆ బోధకుడు ఇవన్నీ చేయడానికి సిద్ధముగా ఉన్నాడా? లేడా ?అనేది ముఖ్యం. అందుకే యేసు ప్రభువు నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు కాని మనుష్య కుమారునకు మాత్రం తలవాల్చుటకైన చోటు లేదు అంటున్నారు. అంటే ఇక్కడ యేసు ప్రభువు తన శిష్యుడు ఆయనను అనుసరించుటలో ఎటువంటి ఇబ్బందికర పరిస్థితికి అయిన సిద్దంగా ఉండాలి అని తెలియజేస్తున్నాడు. ఎటువంటి సౌకర్యం లేకుండా కూడా ఆయనను అనుసరించుటకు సిద్ధముగా ఉండాలి అని ప్రభువు తెలుపు చున్నాడు. 

ఈ సమయంలో మరియొకడు వచ్చి "ప్రభూ! మొదట నా తండ్రిని సమాధి చేసి వచ్చేదను; అనుమతి దయ చేయుడు" అని కోరగా, యేసు "నీవు నన్ను వెంబడింపుము. మృతులను  సమాధి చేయు విషయము మృతులనే చూచుకొన నిమ్ము" అని అంటున్నాడు. ఇక్కడ ఈ వ్యక్తి యేసు ప్రభువుతో తానే వచ్చి చెబుతున్నాడు. నేను నిన్ను అనుసరిస్తాను, కాని దానికి ముందుగా నేను ఇంటి దగ్గరచేయవలసిన పని చేసి వస్తాను అని చెబుతున్నాడు. అంటే నాకు ఎటువంటి ఆటంకం లేనప్పుడు, అంతా అనుకూలముగా ఉన్నప్పుడు నేను నిన్ను అనుసరిస్తాను అని చెబుతున్నాడు. నాకు వ్యతిరేకముగా లేక నాకు కష్టముగా ఉన్న విషయములలో నిన్ను అనుసరించే, అనుసరణలో నాలో లోపం ఉంటుంది అని ముందుగానే తెలియజేస్తున్నట్లున్నది, ఈ శిష్యుని యొక్క అనుసరణ విధానం.

ఇక్కడ యేసు ప్రభువును అపోస్తులులు ఎలా అనుసరించారు అనే  విషయం మనం గమనించాలి. ఎందుకంటే మత్తయిని యేసు ప్రభువు పిలిచినప్పుడు ఆయన తన సుంకపు పెట్టెను వదలి, రెండవ ఆలోచన లేకుండా యేసు ప్రభువును అనుసరిస్తున్నాడు. యకొబు యోహనులు తమ తండ్రిని పడవలోనే వదలి పెట్టి ప్రభువును అనుసరిస్తున్నారు. కాని ఇక్కడ మాత్రము ఈ వ్యక్తి  అందుకు సిద్ధంగా లేడు, ఎందుకంటే తాను తన తండ్రి మరణించిన తరువాత, తనను సమాధి చేసి తీరికగా యేసు ప్రభువును అనుసరించాలి అని అనుకుంటున్నాడు. యేసు ప్రభువును, నేను అనుసరించ వలసినది నాకు ఎటువంటి బాధ్యతలు లేని సమయంలో కాదు. నాకు అన్నీ బాధ్యతలు ఉన్న సమయంలో కూడా మనం ఆయనను అనుసరించాలి. ఇక్కడ యేసు ప్రభువు ఆ వ్యక్తితో, "మృతులను  సమాధి చేయు విషయము మృతులనే చూచుకొన నిమ్ము" అని అంటున్నాడు. 

ఎందుకంటె, ఈ వ్యక్తి తండ్రి ఇంకా చనిపోలేదు, కాని ఇతను తన తండ్రి జీవించినంత కాలం తనతో ఉండి, అతడు చనిపోయిన తరువాత తాను చేయవలసిన పనులు చేసి వస్తాను అని అంటున్నాడు. దాని గురించి యేసు ప్రభువు , నీవు ముందుగా నన్ను అనుసరించు , మృతులను  సమాధి చేయు విషయము మృతులనే చూచుకొన నిమ్ము, అని అంటున్నారు. యేసు ప్రభువు ఒక వ్యక్తి చనిపోతే ప్రవర్తించే తీరు చాలా కారుణ్యంతో ఉంటుంది. లాజరు చనిపోయినప్పుడు ఆయన కన్నీరు పెడుతున్నారు. పేద విధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు తనను బ్రతికిస్తున్నాడు. కాని ఈ వ్యక్తి మాత్రం యేసు ప్రభువును అనుసరించడానికి తనకు అనుకూల వాతావరణం కోసం చూస్తున్నారు. యేసు ప్రభువు ఆయనను అనుసరించుటకు తగిన సమయం అంటూ ఏమీలేదు. ఆయన పిలుపు అందుకున్నప్పుడు మారుమాట్లాడక అనుసరించటమే ఉత్తమం. 

ప్రార్ధన : ప్రభువా ! నేను అనేక సార్లు మిమ్ములను అనుసరించాలి అని అనుకున్నాను ప్రభువా. అది కేవలం నీవు నాకు ఆరోగ్యం  ఇస్తావు అని,  ఉద్యొగం ఇస్తావు అని, మంచి పేరు ఇస్తావు అని మరియు నాకు వున్న సమస్యలు తీరుస్తావు అని మాత్రమే నిన్ను అనుసరించాలి అని అనుకున్నాను, నిన్ను ఎందుకు అనుసరించాలి అని మాత్రము పూర్తిగా అర్ధం చేసుకోలేదు ప్రభువా. అటువంటి సమయాలలో నన్ను క్షమించండి. నా ద్వారా మీ జీవితాన్ని కొనసాగించడానికి నేను మిమ్ములను అనుసరించే వానిగా నన్ను మార్చండి ప్రభువా. ప్రభువా నేను మిమ్ము అనుసరించడానికి అనేక అవకాశాలు వచ్చిన కాని నాకు తగిన సమయం కాదు అని, నాకు వేరె బాధ్యతలు ఉన్నవి అని, మిమ్ములను అనేక సార్లు విస్మరించాను ప్రభువా, అటువంటి సమయాలలో నన్ను క్షమించి, నేను వెల్లప్పుడు మిమ్ములను అనుసరిస్తూ, మిమ్ములను నా ద్వారా ఇతరులకు అందించే విధంగా నన్ను మార్చండి. ఆమెన్. 17, జూన్ 2022, శుక్రవారం

అనుదిన దైవ వాక్కు ధ్యానం

 మత్తయి 7: 19-23 


(ఇది ఈరోజు సువిశేష భాగము కాదు అని గమనించాలి,  ధ్యానం లో భాగంగా దీనిని ధ్యానించు కొరకు మాత్రమే)
మంచి పండ్లనీయని ప్రతి చెట్టును నరికి మంటలో పడవేయుదురు. కావున వారి ఫలములవలన వారిని మీరు తెలిసికొనగలరు. ప్రభూ!ప్రభూ!అని నన్ను సంబోధించు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు!కాని, పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే  పరలోక రాజ్యమున ప్రవేశించును. కడపటి రోజున అనేకులు ప్రభూ! ప్రభూ ! నీ నామమున గదా మేము ప్రవచించినది, పిశాచములను పారద్రోలినది, అద్భుతములు అనేకములు  చేసినది అని నాతో చెప్పుదురు. అపుడు వారితో నేను దుష్టులారా! నా నుండి తొలగిపోండు. మిమ్ము ఎరుగనే ఎరుగను అని నిరాకరింతును. 

యేసు ప్రభువు ఈనాటి సువిశేషంలో మంచి పండ్లనియని ప్రతిచేట్టును నరికి మంటలో పడవేయుదురు అని చెబుతున్నారు.  ఎందుకంటే అప్పటి వరకు ఆ  చెట్టు మొక్కగా ఉన్నప్పటి నుండి ఎదిగి పండ్లు ఇచ్చే స్థితి వరకు దానిని పెంచి , పెద్ద చేసి అది మంచి పండ్లను ఇవ్వాలని దానికి కావలనసిన అన్నీ రకాల ఎరువులు వేసి పెంచిన తరువాత, అది మంచి పండ్లను ఇవ్వకపోతే దానిని రైతు నరికి వేస్తారు. ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవునిచే ప్రేమించ బడినవాడే. ప్రతి వ్యక్తికి దేవుడు తగిన విధమైన ప్రతిభను ఇచ్చాడు. దానిని వినియోగించుకొని తగిన ప్రతిఫలాన్ని ఇవ్వవలసిన అవసరం ప్రతి వ్యక్తికి ఉంది.

 "వారి ఫలములవలన వారిని మీరు తెలిసికొనగలరు." యేసు ప్రభువు ఇక్కడ కపట ప్రవక్తల గురించి మాటలాడుతున్నారు. వారి ఫలముల వలన వారిని మీరు తెలుసుకోగలరు. ఎందుకంటే బయటకు దేవుని సందేశమును ప్రవచిస్తున్నాము అని వారికి  ఉపయోగపడే మాటలను మాత్రమే వారు అనేక సార్లు చెబుతున్నారు. ఒక విధముగా యేసు ప్రభువు పరిసయ్యుల జీవితాలను ఉద్దేశించి మాటలాడిన మాటలు ఇవి. వీరు చెప్పే మాటలు అన్నీ మంచిగా ఉన్నాయి అనిపిస్తాయి. కాని చాలా స్వార్ధంగా ఉంటాయి. ఉదా .. తల్లిదండ్రులను గౌరవించాలి అనేది దేవుడిచ్చిన ఆజ్ఞ.  ఒక వేళ  దేవాలయానికి మనం అర్పణ ఇచ్చి తల్లిదండ్రులకు మిమ్ములను చూసుకోవాలసిన సొమ్మును నేను దేవాలయానికి ఇచ్చాను అని చెప్పినట్లయితే అప్పుడు వారు తల్లిదండ్రులను చూడనవసరం లేదు అని వారు బోధించారు. 

కేవలం ఇది మాత్రమే కాదు. అనేక విషయాలు వినడానికి చాలా బావుంటాయి. కాని దేవునికి ఇష్టమైన పనులు కాదు.  వారి ఫలములు అనేక సార్లు ఏమి చేస్తాయి అంటే  ఇతరులకు  నష్టమును కలుగజేస్తాయి. ఉదా.. వీరు కాపరుల వలె మందలోనికీ వస్తారు కాని క్రూర మృగమును చూసి వీరు పారిపోతారు. వారి ప్రాణముల కొరకు మందలను నాశనం చేస్తారు. వీరు అనేక మంచి విషయములు  చెప్పిన మంచి పనులు వీరు చేయరు. అందుకే వీరిని యేసు ప్రభువు మీరు బయటకు సుందరముగా ఉన్న సమాధులు వంటివారు అని అన్నారు. బయటకు చాలా అందముగా ఉన్నకాని లోపల మొత్తం కుళ్లిపోయిన శరీరమే ఉంది. కేవలం మనం చేసే ప్రతి మంచి పని వలన మాత్రమే మనలని ఇతరులు  తెలుసుకోగలగాలి. మనం చూపించే ప్రేమ, కరుణ, దయ వంటి గుణాల వలన మనం ఆయన అనుచరులం అని  పిలిపించుకోగలగాలి.

 "ప్రభూ!ప్రభూ!అని నన్ను సంబోధించు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు!కాని, పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే  పరలోక రాజ్యమున ప్రవేశించును." యేసు ప్రభువు మాటలు మనం చాలా శ్రద్దగా ఆలకించాలి. మనం ప్రతి నిత్యం ప్రార్దన చేయడానకి  దేవుని గురించి చెప్పడానికి ప్రాధాన్యత ఇస్తాము ,  అది తప్పు కాదు. కాని దాని కంటే ముఖ్యం మనం దేవుని చిత్తానుసారముగా జీవించుట.  యేసు ప్రభువు తండ్రి చిత్తము నెరవేర్చడం తన ఆహరముగా భావించాడు. తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఎంతటి కష్టమైన అనుభవించడానికి సిద్దపడ్డాడు, కష్టాన్ని అనుభవించాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. 

 కపట ప్రవక్తలు ఎవరు ఇటువంటి జీవితానికి సిద్ద పడలేదు. వాటి నుండి దూరంగా వెళ్లిపోయారు. వారు స్వార్ధంతో జీవించారు. ఎవరైతే ఇటువంటి జీవితానికి సిద్ద పడుతారో వారికి దైవ రాజ్యంకు అర్హుడవుతాడు. తండ్రి చిత్తము అనేది మనకు ఎలా తెలుస్తుంది? పది ఆజ్ఞలు ఇవ్వడం ద్వారా దేవుడు తన చిత్తము తెలియజేశాడు. ప్రవక్తల ద్వారా తన చిత్తము తెలియజేశాడు. తన కుమారుని ద్వారా తన చిత్తము తెలియజేశాడు. నాకు ఆయన చిత్తము తెలియదు అని మనం చెప్పలేం. ఎందుకంటే తన చిత్తం ఏమిటి అని తండ్రి ఎప్పుడు తెలియ పరుస్తూనే ఉన్నాడు. మనం ప్రతి నిత్యం ప్రభూ ప్రభూ అని అనుటకంటే  ఆయన చిత్తము నెరవేర్చడానికి పునుకోవాలి.

 "ప్రభూ! ప్రభూ ! నీ నామమున గదా మేము ప్రవచించినది, పిశాచములను పారద్రోలినది, అద్భుతములు అనేకములు  చేసినది అని నాతో చెప్పుదురు. అపుడు వారితో నేను దుష్టులారా! నా నుండి తొలగిపోండు. మిమ్ము ఎరుగనే ఎరుగను అని నిరాకరింతును."  యేసు ప్రభువు  ఇచ్చేటువంటి కొన్ని అనుగ్రహాలు ద్వారా శిష్యులు కొందరు కొన్ని అద్భుతాలు చేసి వారు అంతిమ దినమున మేము మీ పేరున అనేక గొప్ప పనులు చేశాము , పిసచ్చములు పారద్రోలాము అని చెబుతారు అయిన నేను వారిని నేను తిరస్కరిస్తాను అంటున్నారు. నేను మిమ్ము ఎరుగను అంటాను అని చెబుతున్నారు. కారణం ఏమిటి అంటే వీరు ఎంతటి గొప్ప పనులు చేసిన దేవుని చిత్తము వీరు నెరవేర్చారా ? లేదా? అనేది ముఖ్యం. వీరు ఆజ్ఞలు పాటించి , ఆయన చిత్తం నెరవేర్చితె అంటే ఆయన చూపిన సుగుణాలు కలిగి జీవిస్తూ తండ్రి చిత్తం నెరవేర్చడానకి  ఎంతకైనా మనం పాటుపడితే అప్పుడు ఆయన మనలను ఎరుగుతాను అని అంటారు. 

ప్రార్దన : ప్రభువా ! నా  జీవితంలో నేను మీ ప్రేమను, దయను , ప్రతిభను , కరుణను పొందాను. కాని దానికి తగిన విధముగా నా జీవితములో మంచి ఫలాలు ఇవ్వడంలో నేను విఫలం చెందాను. అటువంటి సమయాల్లో నన్ను క్షమించండి. నేను మరలా నా జీవితంలో మీరు ఇచ్చిన అన్నీ అనుగ్రహాలును వాడుకొని మంచి ఫలాలు ఇచ్చే విధంగా నన్ను దీవించండి. ప్రభువా మీ చిత్తమును విడచి పెట్టి ఈ లోక విషయముల మీద చాల సమయం వృధా చేశాను ప్రభువా. నేను కూడా మీ వలె తండ్రి చిత్తము నెరవేర్చడం నా ఆహారం అనే విధంగా నా జీవితాన్ని మార్చండి . మీ చిత్తం నెరవేర్చే వానిగా నన్ను మార్చండి. ఆమెన్ .  
15, జూన్ 2022, బుధవారం

అనుదిన దైవ వాక్కు ధ్యానం

మత్తయి 6:7-15 (జూన్ 16,2022)

సువిశేషం: అన్యులవలె అనేక వ్యర్ధపదములతో మీరు ప్రార్ధింపవలదు. అటుల చేసినగాని, దేవుడు తమ మొరనాలకింపడని వారు భావింతురు. కాబట్టి వారి వలె మీరు మెలగరాదు. మీకేమి కావలయునో మీరడుగక మునుపే మీ తండ్రి ఏరిగియున్నాడు. మీరిట్లు ప్రార్ధింపుడు:  పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పవిత్రపరుపబడునుగాక! నీ రాజ్యము వచ్చునుగాక!నీ చిత్తము పరలోక మందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక! నేటికీ కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు, మా అప్పులను క్షమింపుము. మమ్ము శోధనలో చిక్కుకొననీయక, దుష్టుని నుండి రక్షింపుము. పరులు చేసిన దోషములను  మీరు క్షమించిన యెడల, పరలోక మందలి, మీ తండ్రి , మీ దోషములను క్షమించును. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపనియెడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు. 

ఈనాటి సువిశేషంలో యేసు ప్రభువు  శిష్యులకు ఎలా ప్రార్దన చేయాలి అని నేర్పిస్తున్నారు .  అన్యుల వలె వ్యర్ధ పదములతో మీరు ప్రార్ధింప వలదు అని వారికి చెపుతున్నారు. ఎందుకు వీరు అనేక పెద్ద పెద్ద మాటలతో , గొప్ప వర్ణలతో దేవుడుని ప్రార్ధిస్తారు అంటే దేవునికి ముఖ స్తుతి ఇష్టం అని వీరు భావిస్తారు, అందుకే చాలా అందమైన పదాలను వాడటానికి ఇష్టపడుతారు. నిజానికి దేవునికి ఇటువంటివి ఇష్టం వుండదు.  దేవుడు మన వేడుకోలును అలకించాలి అంటే మనకు కావలసినది భాష ప్రావీణ్యత కాదు. పొగుడుటలో పట్టాలు కాదు. ఈ లోకం యొక్క మెప్పును పొందాలి అనుకునేవారు, దేవుని గురించి సరిగా అర్ధం చేసుకొనివారు చేసే విధంగా కాకుండా తన శిష్యులు ఏ విధంగా దేవున్ని ప్రార్ధించాలి అని యేసు ప్రభువు చెబుతున్నారు. 

మీకు ఏమి కావలయునో మీరు అడుగక మునపే మీ తండ్రి ఏరిగియున్నాడు . దేవునికి మనం అవసరములు అన్నీ కూడా తెలుసు. మనం కష్ట సుఖాలు అన్నీ ఆయనకు ఎరుకయే. దేవుని మన అవసరములు తెలియదు అన్నట్లు మనం ప్రవర్తిస్తుంటాం. ఏలియా ప్రవక్త,   బాలు ప్రవక్తలతో గొడవ పడినప్పుడు ఆ ప్రవక్తలను ఈ విధముగానే హేళన చేసింది. మీ దేవర నిద్ర పోతున్నదేమో ఇంకా పెద్దగా అరవండి అని అంటున్నారు. దేవుడు మనకు ఉన్న సమస్యలను  ఇతర దేవరల వలె చూడలేని వాడు కాదు. మనం ఎప్పుడు ఆయన కనుసన్నలలోనే ఉంటాము. దేవునికి నీ అవసరం తెలుసు అదే విధముగా నీ కోరిక తెలుసు. నిన్ను ఎంత పరీక్షించాలో తెలుసు. 

"మీరిట్లు ప్రార్ధింపుడు: పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పవిత్రపరుపబడునుగాక! నీ రాజ్యము వచ్చునుగాక!నీ చిత్తము పరలోక మందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక!"  ఇక్కడ యేసు ప్రభువు మనకు దేవుడు తండ్రి అని చెబుతున్నారు. ఆయనతో మనం మాటలాడటానికి చాలా ఆనంద పడాలి. ఎందుకంటే దేవుడు ఎక్కడో మనకు దూరంగా ఉండాలి అనుకునే వ్యక్తి కాదు. ఆయన ఎల్లప్పుడు మనతో ఉండాలి అనుకుంటారు. ఆయన పరలోకంలో ఉన్నారు. ఎందుకంటే ఆయన చిత్తం ఎల్లప్పుడు అక్కడ నెరవేర్చబడుతుంది.

 ఎక్కడ దేవుని చిత్తం నెరవేర్చబడుతుందో అక్కడ దేవుడు ఉంటారు. ఎప్పుడైతే భూలోకంలో కూడా దేవుని చిత్తం పూర్తిగా నెరవేర్చ బడుతుందో అప్పుడు భూలోకం కూడా పరలోకంలానె ఉంటుంది. మనం ప్రార్ధించాలనది దేవుని నామమును ఎల్లప్పుడు పవిత్ర పరచ బడాలి అని. దేవుని అందరు కీర్తించాలి అని. దేవుని నామమును అపవిత్రం చేయడం అంటే దేవున్ని కాకుండా దేవునిచే సృష్టిని దేవునిగా ఆరాధించడం. దేవుని రాజ్యం రావాలని మనం ప్రార్దన చేయాలి అని ప్రభువు చెబుతున్నారు. 

ఏమిటి ఈ దేవుని రాజ్యం. ఎటువంటి అసమానతలు లేని రాజ్యం, అందరు సోదర భావంతో మెలిగే రాజ్యం. ఒకరికోకరు ప్రేమ కలిగి జీవించే రాజ్యం. ప్రతి నిత్యం దైవ సాన్నిద్యం అనుభవించే రాజ్యం. ఇటువంటి రాజ్యం ఈ లోకంలో రావాలని ప్రార్ధించాలి. ఈ రాజ్యాన్ని స్థాపించాలని యేసు ప్రభువు కృషి చేశారు. అందుకే దేవుని రాజ్యం  సమీపించినది అని ప్రభువు చెప్పినది. ఇటువంటి రాజ్యం అంటే దేవుని రాజ్యం ఈ లోకంలో స్థాపించ బడాలి అప్పుడు నీకోరికలు అవసరాలు అన్నీ, ఏది కూడా కష్టమైనది కాదు. ఇది మొత్తం సాధ్యం ఎప్పుడైతే దేవుని చిత్తం ఇక్కడ జరుగుతుందో అప్పుడు. దానికోసం మనం ప్రార్దన చేయాలి. 

"నేటికీ కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు, మా అప్పులను క్షమింపుము. మమ్ము శోధనలో చిక్కుకొననీయక, దుష్టుని నుండి రక్షింపుము." దైవ రాజ్యం, ఆయన చిత్తం గురించి ప్రార్ధించిన తరువాత నేటికీ కావాలసిన ఆహారం కోసం ప్రార్దన చేయమంటున్నారు. మన భౌతిక అవసరముల కోసం ప్రార్దన చేసిన తరువాత ప్రభువు మనకు చెప్పేది సమాజంలో మన జీవించే తీరు గురించి. మనం ఏ విధముగా ఇతరుల పట్ల ప్రవర్తిస్తున్నామో మన పట్ల కూడా అదేవిధముగా ప్రవర్తించమని దేవున్ని ఆడగమని ప్రభువు చెబుతున్నారు. నీవు ఇతరులను క్షమించకుండా , ఇతరులకు ప్రేమను పంచకుండా దేవుని నుండి వాటిని ఆశించవద్దు అని ప్రభువు చెబుతున్నారు.ఈలోకం మీద , లోకం వస్తువుల మీద మనకు అనేక శోదనలు వస్తుంటాయి. వాటిలోనికి పడిపోకుండా మనలను రక్షించమని ప్రార్ధించమని చెబుతున్నారు. అనేక మంది గొప్ప వారు ఈ లోక ఆశలకు లోనై దేవున్ని విడనాడి జీవించి ఆయన అనుగ్రహాలు కోల్పోయారు. 

ప్రార్ధన : ప్రభువా! పరలోక ప్రార్దన ద్వారా మేము ఏమి కోరుకోవాలో, ఏమి కోరుకోకూడదో తెలియజేస్తున్నారు ప్రభువా. దేవా!మీ చిత్తమునే ఎల్లప్పుడు ఈ లోకంలో మేము కోరుకునే విధముగా మమ్ము దీవించండి. అనేక సార్లు మేము అన్యుల వలె అనేక వ్యర్ధ పదాలతో ప్రార్దన ఇతరుల కంట పడాలి అని, మేము బాగా ప్రార్ధన చేస్తాము అని అనిపించుకోవాలని ప్రార్దన చేసిన సమయాలు ఉన్నవి ప్రభువా, అటువంటి క్షణాలలో మమ్ములను క్షమించండి. వాక్యంలో చెప్పబడిన విధముగా మొదట దేవుని చిత్తమును వెదికే వారీగా మమ్ము దీవించండి.   మీ చిత్తమును నెరవేర్చిన తరువాత ప్రభువా, మేము మీ రాజ్యమునకు అర్హులము అవుతాము. మీ చిత్తములో క్షమాపణ ఉంది. మీ చిత్తమును నెరవేర్చువాడు. ఇతరులను క్షమిస్తాడు. ప్రేమిస్తాడు. మీ కరుణకు పాత్రుడు అవుతాడు. మమ్ములను మీ చిత్తము నెరవేర్చేవారిగా చేసి , మీ రాజ్యంలో చేర్చుకోనండి. ఆమెన్. 

14, జూన్ 2022, మంగళవారం

అనుదిన దైవ వాక్కు ధ్యానం (మత్తయి 6:1-6,16-18 )

 మత్తయి 6:1-6,16-18 ( జూన్ 15, 2022)

సువిశేషం: మనుష్యుల కంటబడుటకై వారియెదుట మీ భక్తి కార్యములు చేయకుండ జాగ్రత్తపడుడు. లేనియెడల పరలోకమందలి మీ తండ్రినుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్ధనా మందిరములలోను , విధులలోను డాంబికులు చేయునట్లు నీవు నీ దానధర్మములను మేళతాళాలతో చేయ వలదు. వారు అందుకు తగిన ఫలమును పొంది యున్నారని నేను మీతో వక్కాణించుచున్నాను. నీవు దానము చేయునపుడు నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండునట్లు రహస్యముగా చేయుము. అట్లయిన రహస్య కార్యములనెల్ల గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానము నొసగును. కపట భక్తులవలే మీరు ప్రార్ధన చేయవలదు. ప్రార్ధనామందిరములలో, వీధులమలుపులలో నిలువబడి, జనులు చూచుటకై ప్రార్ధనలుచేయుట వారికి ప్రీతి. వారికి తగినఫలము లభించెనని మీతో వక్కాణించుచున్నాను. ప్రార్దన చేయునపుడు నీవు నీ గదిలో ప్రవేశించి, తలుపులు మూసికొని అదృశ్యుడైయున్న నీ తండ్రిని ప్రార్ధింపుము అట్లయిన రహస్య కార్యములనెల్ల గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానము ఒసగును. మీరు ఉపవాసము చేయునపుడు, కపట వేషధారులవలె విచారవదనములతో నుండకుడు, వారు తమ ఉపవాసము పరులకంట పడుటకై విచారవదనములతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించెనని మీతో వక్కాణించుచున్నాను. ఉపవాసము చేయునప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖము కడుగుకొనుము. అందు వలన అదృశ్యుడైయున్న నీ తండ్రియేకాని, మరెవ్వరునునీవు ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు. అట్లయిన రహస్య కార్యములనెల్ల గుర్తించు నీ తండ్రి నీకు తన బహుమానమును బాహాటముగ ఒసగును. 

దేవునిచేత ఎలా ప్రశంసించబడాలి? 

"మనుష్యుల కంటబడుటకై వారియెదుట మీ భక్తి కార్యములు చేయకుండ జాగ్రత్తపడుడు. లేనియెడల పరలోకమందలి మీ తండ్రినుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు." యేసు ప్రభువు తన శిష్యులకు వారు ఏ విధముగా భక్తి కలిగి ఉండాలి అని చెబుతున్నారు. మన భక్తి దేవునికి మనకు మధ్య వ్యక్తిగతమైనదిగా ఉండాలి అని ప్రభువు కోరుతున్నాడు. మన భక్తి ఇతరులకు చూపించడానికి కాదు అనే విషయం తెలియ పరుస్తున్నారు. ఎందుకు యేసు ప్రభువు ఈ మాటలను చెబుతున్నారు అంటే పరిసయ్యులు , ధర్మ శాస్త్ర బోధకులు వారి భక్తి క్రియలన్నీ ఇతరులకు కనబడే విధముగానే చేసేటువంటి వారు. అందరు వారి భక్తికి వారిని గౌరవంగా చూసేవారు మరియు ప్రశంసించేవారు. ఎప్పుడైతే వీరిని అందరు గొప్పగా పొగుడుతున్నారో, ఆ పొగడ్తలకు మురిసిపోయి వాటి కోసమే వారి భక్తిని బయట చూపించేవారు. ఇది ఎంత వరకు వెళ్ళింది అంటే వారి జీవితాలు కపటత్వంతో నిండిపోయేంతగా వెళ్ళింది. ఇతరులు చూడకుండ వీరు ఏమి చేయడానికి ఇష్టపడలేనంతగా వీరి జీవితాలు ఉన్నాయి. ఇది మనం ఎక్కడ చూస్తాము అంటే వారు బయట నుండి ఒక వస్తువు తీసుకొని వచ్చినప్పుడు దానిని  బయట శుభ్రంగా కడిగితే సరిపోతుంది, లోపల అవసరం లేదు అని చెప్పేంతగా వీరు జీవిస్తున్నారు. 

కొన్ని సంవత్సరాల క్రిందట చదివిన ఒక చిన్న కధ గుర్తుకు వస్తుంది. ఒక ఊరిలో ఒక పెద్ద పేరు మోసిన ఒక లాయరు గారు ఉన్నారు. ఆయన అనేక కేసులలో పేదలవైపున వాదించి పేదలకు సాయం చేసేవారు. ఆ విధంగా ఆయనకు మంచి పేరు వచ్చింది. అందరు ఆయనను పొగిడేవారు. గొప్పవాడు అని అందరు ఆయనను కీర్తించే వారు. పేదల పెన్నిది అని చెప్పేవారు. ఈ లాయరు గారు,  ఈ పొగడ్తలకు బాగా అలవాటు పడి పోయాడు. రాను రాను ఏ మంచి పని చేయాలన్న ఎవరైన ఉన్నారా ? నేను చేసే మంచి పని చూడటానికి, అని ఆలోచించడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా ఒక వేళ తాను చేసే మంచి పని చూడటానికి ఎవరు లేకపోతే, ఆ మంచి పని చేయడం మని వేశాడు. ఎందుకంటే తాను చేసే మంచి పని, కేవలం  కీర్తి , ప్రతిష్టలకోసం , తాను చేసే పని చూడటానికి ఎవరు లేనప్పుడు తాను ఆ పని చేసేవాడు కాదు. ఒక రోజు తాను కారులో ప్రయాణం అయి పోతుండగా అక్కడ  చెరువులో ఒక స్త్రీ నీటిలో మునిగి పోతూ , తనను రక్షించమని వేడుకుంటుంది.  ఆ దారిలో పోతున్న ఈ లాయరు గారికి ఆ అరుపులు వినపడుతాయి.  తాను ఆమెను రక్షించినట్లయితే దానిని చూడటానికి , చూసిన తరువాత దాని గురించి చెప్పి, తనను పొగడటానికి ఎవరైన ఉన్నారా?  అని ఆ లాయరు గారు చుట్టు ప్రక్కల చూసి,  ఎవరు లేరు అని గ్రహించి,  ఆమెను కాపాడకుండా వెళ్ళిపోతాడు. మనం చేసే ప్రతి పనిని ప్రభువు చూస్తూనే వుంటాడు. మనకు బహుమానము ఇచ్చేది ప్రభువే కాని మానవ మాత్రులు కారు. ఇతరులు కంట,  పడటానికే మనం మంచి పని చేస్తే అది స్వార్ధంతో చేసిన పని అవుతుంది. 

యేసు ప్రభువు మనం చేసే ప్రతి మంచి పని,  అది భక్తి తో కూడిన పని అయిన లేక ఉపకారంతో కూడిన పని అయిన ఇతరుల మెప్పు పొందుటకు చేయ వద్దు అని చెబుతున్నారు. మన ప్రభువు మనం చేసే అన్నీ పనులను చూస్తారు, ఇతరులు మెప్పు పొందుటకు మనం మంచి పనులు చేస్తే ఇతరులు మనలను మెచ్చుకుంటారు. మనం పొందవలసిన బహుమానం మనం పొందాము అని ప్రభువు చెబుతున్నారు. మనం బహుమానం పొందవలసినది తండ్రి దగ్గర నుండి. ఆయన మన పనులకు సరి అయిన బహుమానం ఇస్తారు. 

డాంభీకములు చెప్పుకోవడం లేక మేము గొప్ప అని అని పించుకోవడం అనేది మన అజ్ఞానం వలనే జరుగుతుంది. మనం చేసే ప్రతి మంచి పని దేవుడు మనకు ఇచ్చిన ఒక అవకాశం, దానిని మనం సద్వినియోగం చేసుకోవడం కూడా ఆయన కృపనే. కనుక అందుకు మనం ఎప్పుడు దేవునికి కృతజ్ఞతలు కలిగి ఉండాలి. 

యేసు ప్రభువు మనం ఉపవాసం చేసేటప్పుడు మనం ఎటువంటి విచారాన్ని బయట పడనివ్వకుండ ఉండమని చెబుతున్నారు. ఎందుకంటే మన భక్తి క్రియలన్నీ చూసే ప్రభువు ఖచ్ఛితముగా మనకు కావలసిన అనుగ్రహాలు, ఇస్తారు అని చెబుతున్నారు. అంతే కాదు ప్రభువు మనకు ఈ అనుగ్రహాలు , బహుమానాలు బాహాటముగా ప్రకటిస్తారు అని చెబుతున్నారు. అప్పుడు మన మంచి తనాన్ని దేవుడే అందరికి తెలియజేస్తారు. దేవునిచేత మనం గొప్ప వారిగా కీర్తించ బడేలా జీవించమని ప్రభువు చెబుతున్నారు. 

ప్రార్ధన : ప్రభువా! నా జీవిత ప్రయాణంలో అనేక సార్లు ఇతరుల చేత పొగిడించుకోవాలని, మంచి వాడను అని పించుకోవాలని, ఎన్నో మంచి పనులు చేయలని లేకపోయినా చేశాను ప్రభువా. దాని ద్వార నేను మంచి వాడిని అని గొప్ప వాడిని అని పేరు పొందాను. కాని ఎవరు చూడని సమయాలలో అవకాశం ఉండికూడ మంచి చేయడానికి ముందుకు వెళ్లలేదు ప్రభువా. కేవలం నా మంచి పనిని చూడటానికి ఎవరు ఉండరు అనే ఒకే కారణంతో మంచి చేసే అవకాశం వదులుకున్నాను ప్రభువా. ఇటువంటి సంఘటనలు అనేకం నా జీవితంలో జరిగాయి.  ఆ సంఘటనలు అన్నింటిని ఈ రోజు మీ ముందు ఉంచుతున్నాను ప్రభువా. ఇటువంటి ఘటనల నుండి నన్ను క్షమించండి ప్రభువా. మరల ఇటువంటివి నా జీవితంలో జరుగకుండా నన్ను నడపండి. ఇక నుండి నేను చేసే ప్రతి పని ఇతరుల మెప్పు కోసం కాకుండా కేవలం మీ మీద గల ప్రేమ వలనే చేసే విధంగా నన్ను దీవించండి. ప్రభువా , ఇతరుల మెప్పు కాకుండా మీరు మెచ్చుకునే విధంగా జీవించే వానినిగా మార్చండి. ఆమెన్. 


13, జూన్ 2022, సోమవారం

అనుదిన దైవ వాక్కు ధ్యానం (మత్తయి 5: 43-48 )

 మత్తయి 5: 43-48 (జూన్ 14, 2022)

 సువిశేషం: "నీ పొరుగువానిని ప్రేమింపుము; నీ శత్రువును ద్వేషింపుము  అని పూర్వము చెప్పిబడిన దానిని మీరు వినియున్నారుగదా! నేనిపుడు మీతో చెప్పునదేమన : మీ శత్రువులను ప్రేమింపుడు. మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్ధింపుడు. అపుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు. ఏలయన, ఆయన దుర్జనులపై , సజ్జనులపై సూర్యుని ఒకే విధముగా  ప్రకాశింపజేయుచున్నాడు. సన్మార్గులపై , దుర్మార్గులపై వర్షము ఒకే విధముగా  వర్షింపజేయుచున్నాడు. మిమ్ము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానము లభించును? సుంకరులు సైతము అటులచేయుట లేదా?మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియజేసినచో మీ ప్రత్యేకత యేమి? అన్యులు సహితము ఇట్లు చేయుటలేదా? పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులగుదురుగాక!

నీ పొరుగు వానిని ప్రేమింపుము ; నీ శత్రువును ద్వేషింపుము అని పూర్వము చెప్పబడిన దానిని మీరు వినియున్నారుగదా! మీ పొరుగువానిని ప్రేమింపుము అని లెవీయకాండంలో మరియు ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తాం. శత్రువును ద్వేషింపుము అని మనం చూడము. కాని వారి వ్యావహారిక విషయాలలో అది జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మనం అంటే ఇష్టం లేని వారిని ప్రేమించడం మనకు చాలా కష్టం. మనలను ద్వేషించే వారిని ప్రేమించడం అంత సులువైన విషయము కాదు. ఆ విధంగా చేయడానికి మనం చాలా అధ్యాత్మికంగా ఎదగాలి .  మనం అంటే ఇష్టం లేని వారిని ద్వేషించడం లేక దూరం పెట్టడం మనం కొన్ని సారులు చేస్తుంటాము.  కాని ఇది దేవుని వాక్కును సరిగా  అర్ధం చేసుకోకుండా మనం చేసే పని. యేసు ప్రభువు ఇటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వారికి వారి ఆలోచనలు  సరి చేస్తున్నారు.  ఎందుకు వారు ఈ విధంగా ఆలోచించకూడదు అని బోధిస్తున్నారు. అందుకే యేసు ప్రభువు మీ శత్రువులను ప్రేమింపుడు అని అంటున్నారు. 

మీ శత్రువులను ప్రేమింపుడు.  యేసు ప్రభువు చెప్పిన ఈ మాటలు అక్కడ ఉన్న వారిని ఆశ్చర్యపరచి ఉండవచ్చు. ఇవి సాధ్యపడే మాటలు కాదు అని అనిపించి ఉండవచ్చు. నేను ఎలా నా నాశనము కోరుకునే వ్యక్తిని ప్రేమించాలి? అని అనుకోని ఉండవచ్చు. మనం కూడా అటులనే అనుకుంటూ వుండవచ్చు. అసలు నేను ఎందుకు నన్ను వ్యతిరేకించే, లేక నాకు కీడు తలపెట్టే వ్యక్తిని ప్రేమించాలి? అని మనం ఆలోచించినప్పుడు మనకు ఒక విషయం అర్ధం అవుతుంది. అది ఏమిటి అంటే ప్రేమకు మాత్రమే మానవుడు లొంగిపోతాడు. మనం ఒక వ్యక్తిని గెలవ గలిగేది కేవలం ప్రేమతో మాత్రమే. మనం ద్వేషం చూపిస్తే తాను అదే విధంగా స్పందిస్తాడు కాని ప్రేమకు మాత్రము దాసోహం అవుతారు. వారు మారి అనేక మందికి మార్గ చూపరులు అవుతారు. ప్రేమకు మొదటిలో కోపంతో లేక ద్వేషంతో స్పందించిన తరువాత ఖచ్చితంగా వారు మారుతారు. అందుకే మానవున్ని ఎప్పుడు దేవుడు ప్రేమిస్తూనే ఉంటాడు. తన వద్దకు ఆహ్వానిస్తూనే ఉంటాడు. 

"మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్ధింపుడు. అప్పుడు మీరు పరలోక మందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు" : ఆదిమ క్రైస్తవులు ఈ పనులు ఖచ్ఛితముగా పాటించారు. వారిని రాజులు, పాలకులు హింసించినప్పుడు వారి కొరకు ప్రార్ధన చేశారు. స్తేఫాను గారు అందరు రాళ్ళు వేస్తున్న కూడా ఆయన యేసు ప్రభువు వలె ప్రభువు వీరు చేయునదేమో వీరికి తెలియదు వీరిని క్షమించు అని ప్రార్ధన చేశారు. ఆయన మాత్రమే కాదు, అనేక మంది ఆదిమ క్రైస్తవులు ఈ విధంగా ప్రార్ధన చేశారు, వారిని ఇతరులు హింసించినప్పుడు. హింసించే వారి మీద పగ తీర్చుకోలేదు. ఎందుకంటే వారికి తెలుసు ఇతరులను హింసించే వారు వారి అజ్ఞానంతో ఆ పని చేస్తున్నారు అని .  దైవ జ్ఞానం కలిగి వివేకం కలిగిన దైవ జనుడు అటువంటి హింసను చేయడు. కాని వారి కోసం ప్రార్ధన చేస్తారు. ఇది యేసు ప్రభువు చూపించిన మార్గం.  ఆయనను సైనికులు హింసిస్తున్న వారి కోసం ప్రార్దన చేస్తున్నారు. అప్పడు కూడా తన ప్రక్క వాని విన్నపాన్ని ఆమోదీస్తున్నారు. ఆయన దేవుని కుమారుడు. మనలను కూడా ఆయన వలె చేయమని చెబుతున్నారు. ఈ విధంగా జీవించడం వలన మనం దేవుని కుమారులం కాగలమని ప్రభువు చెబుతున్నారు. 

అంతేకాదు ఇది దేవుని గుణం. ఆయన ఎటువంటి తారతమ్యాలు లేకుండా అందరిపై తన ప్రేమను ఒకే విధంగా చూపిస్తున్నారు. "ఏలయన, ఆయన దుర్జనులపై , సజ్జనులపై సూర్యుని ఒకే విధముగా  ప్రకాశింపజేయుచున్నాడు" ఈ సువిశేషము మనలను దేవుని గుణగణాలు కలిగి ఉండే వారిగా జీవించమని కోరుతుంది. మన జీవితంలో  మనం ఎంత గొప్ప ధ్యేయలు సాధించిన కాని యేసు ప్రభువు మనకు చూపిస్తున్న ఈ గొప్ప గుణాలు అంతటివి అవి కాలేవు. ఎందుకంటే ఇవి దైవ లక్షణాలు. అంతే కాదు యేసు ప్రభువు ఇక్కడ ఇంకొక మాట చెబుతున్నారు, మిమ్ములను ప్రేమించే వారిని మాత్రమే మీరు ప్రేమిస్తే దానిలో మీ గొప్పతనం ఏమి ఉంది అని అడుగుతున్నారు. అందరు ఆ విధంగానే చేస్తారు కదా! సుంకరులు కూడా అలానె చేస్తున్నారు. యూదులు  సుంకరులను , తక్కువ వారిగా చూసేవారు. అంటే మీరు ఎవరి కంటే గొప్ప కాదు అని ప్రభువు వారికి చెబుతున్నారు.   క్రీస్తు అనుచరునిగా , దేవుని నమ్మిన వానిగా నేను పరిపూర్ణత కలిగి జీవించాలి. ఆయన ప్రేమ , వాత్సల్యం ఇతరులకు పంచగలగాలి. దిని కోసం ప్రభువు నన్ను పిలుచుకున్నాడు అని విశ్వసించి మనం జీవించాలి. 

ప్రార్దన : ప్రభువా ! మా జీవితంలో అనేక సార్లు నేను నిజమైన క్రీస్తు అనుచరునిగా జీవించాలి అని అనుకుంటున్నాను కాని ఈలోక ఆశలు లేక ఇతరుల మీద నాకున్న చెడు అభిప్రాయాలు వలన అందరిని దూరం పెడుతూ , ఎవరికి నీ ప్రేమను చూపించ కుండ జీవిస్తున్నాను. నీవు మాత్రము ప్రభువా, నేను నీ వలె, తండ్రి వలె పరిపూర్ణత కలిగి ఉండాలని కోరుకుంటున్నావు ప్రభువా, నేను నీ వలె జీవించలేక పోయినందుకు , ఆ అవకాశాలు చేజార్చుకున్నందుకు నన్ను క్షమించండి ప్రభువా. నాలో ఉన్న చెడు లక్షణాలును, ఇతరులను ద్వేషించే మనస్సును, హింసించే హృదయాన్ని తీసివేయండి.   ఇతరులను క్షమిస్తు, ప్రేమిస్తూ మీ సుగుణాలును అలవర్చుకునే అనుగ్రహం నాకు దయ చేయండి. ఎప్పుడు ఎవరిని ద్వేషించకుండ అందరిని ప్రేమించె మనస్సును ఇవ్వండి ప్రభువా. మీ యొక్క కుమారుని వలె జీవించెలా జేయండి. ఆమెన్ . 

11వ సామాన్య ఆదివారం

11వ సామాన్య ఆదివారం  యెహెజ్కేలు17:22-24, 1 కొరింతి 5:6-10, మార్కు 4:26-34 ఈనాటి పరిశుద్ధ గ్రంధ పఠణములు దేవుని యొక్క రాజ్య విస్తరణ గురించి బో...