5, అక్టోబర్ 2024, శనివారం

సామాన్యకాలపు ఇరవై ఏడవ ఆదివారము

సామాన్యకాలపు ఇరవై ఏడవ ఆదివారము 
ఆదికాండము 2:18-24
హెబ్రీయులకు 2:9-11
మార్కు 10:2-16

క్రీస్తునాధునియందు ప్రియ సహోదరీ సహోదరులారా, దేవుని బిడ్డలరా, ఈనాటి మూడు దివ్య గ్రంథ పఠనలను మనం గ్రహించినట్లయితే, మూడు పఠనాలు కూడా మనకు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక బోధనలు లేదా అంశాలను అందజేస్తున్నాయి. 
ఈ మూడు పఠనలు కలిసి మనకు దేవుని త్యాగం, సంకల్పం మరియు శాంతి జీవనానికి కొన్ని గొప్ప మార్గదర్శకత్వలను ఇస్తున్నాయి. 
          త్యాగం అంటే ఏమిటి బైబిల్ ప్రకారం మనం చుసినట్లయితే త్యాగం అనేది. బైబిల్లో దేవుని త్యాగం అనేది మానవ జాతి పట్ల అయన మహోన్నతమైన ప్రేమ, కరుణ, మరియు రక్షణకు సంబంధించిన ఒక మహత్తర అంశం. ఈ త్యాగం ఎవరైతే పాపం మరియు దేవుని నుండి దూరమైనా మానవుని తిరిగి దేవుని చెంతకు తీసుకురావడం కోసం చేయబడింది. దేవుని త్యాగం అనేది ప్రధానంగా యేసు క్రీస్తు ద్వారా పరిపూర్ణతకు చేరింది. ఎందుకంటే అత్యంత పావనమైన మరియు పవిత్రమైన అంశం కాబట్టి. యేసు క్రీస్తు తన జీవితాన్ని మన కోసం అ సిలువపై అర్పించడం ద్వారా మనకు నిత్యజీవం పొందే మార్గాన్ని ఏర్పరచాడు. అయన త్యాగం ద్వారా మనకు దేవుని ప్రేమను, క్షమను, మరియు అనంతమైన రక్షణను తీసుకోని వచ్చియున్నాడు. ముందుగా మొదటి పఠనములో చుసినట్లయితే దేవుడు తన త్యాగం, ప్రేమ ద్వారా మానవుని ఆవిధంగా సృష్టించరో మనమందరము కూడా మొదటి పఠనంలో చూడవచ్చు. 

ఆదికాండము 2:18-24 వచనలలో దేవుడు సృష్టించినటువంటి సృష్టి యొక్క ముఖ్యమైనటువంటి భాగాన్ని మనం చూస్తాము. దేవుడు మనిషి ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని చెప్పియున్నారు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనుషుల మధ్య ఉండవలసిన్నటువంటి సంబంధాలను, మరి ముఖ్యంగా దాంపత్య జీవితానికి లేదా బంధానికి ఉండవలసినటువంటి ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తున్నారు.
 దేవుడు ఆదామునకు కావలసినటువంటి తోడుని లేదా తనలో సగం భాగంగా ఉండవలసినటువంటి సహాయకురాలిని సృష్టించాలని దేవుడు నిర్ణయించుకున్నారు. దేవుడు సృష్టించిన ప్రతి జీవిని ఆదాముకు జతగా చుస్తే, ఆడాముకు అంటే ఆయనకు ఒక సహచరుడిగా ఎవరూ సారిపోలేదు. ఇక్కడ నుండి మనం నేర్చుకోవలసినది ఏమిటంటే మన జీవితంలో ఉన్న సంబంధాలు దేవుని సంకల్పం ప్రకారం ఉండాలి, అవి మనకీ సమానంగా ఉండాలి. ఆలా ఉండాలి కాబ్బటే దేవుడు ఆదాముని నిద్రించలాగా చేసి అతని శరీరం నుండి ఒక ఎముక తీసి స్త్రీని సృష్టించారు. ఇక్కడ, స్త్రీను పురుషుని ఎముక నుండి తీసుకోవడం యొక్క అర్థం ఏమిటంటే, స్త్రీ మరియు పురుషుడు ఒకరికి ఒకరు సమానంగా ఉండాలని. ఇద్దరూ ఒకరిని ఒకరు కలిసినప్పుడు ఏక శరీరముగా ఉండటం అనేది దేవుని యొక్క సంకల్పం. ఎందుకంటే దేవుడు వీరిద్దరిని కూడా ఒక్కటిగా చేసెను అని చెప్పడానికి గుర్తు. వివాహం అనేది కేవలం శారీరక సంబంధం కాదని అది ఒక ఆత్మీయమైన, ఆధ్యాత్మికమైన కలయిక అని అర్ధం చేసుకోవాలి. ఈ వచనల ద్వారా మనం ప్రధానమైనటువంటి విషయాలను గ్రహీంచాలి.

1. పురుషునికి సహాయకురాలి అవసరం ఉండాలి.
2. ఇద్దరి మధ్య సమానత్వం అనేది ఉండాలి.
3. ఇద్దరు కూడా ఒక్కటిగా జీవించాలి.

అందువల్ల ఈ వాక్యం ద్వారా సృష్టి యొక్క గొప్పతనం, బంధం యొక్క పవిత్రత, అనుబంధం యొక్క ప్రాముఖ్యతను గురించి మనకు మొదటి పఠనం తెలియజేస్తుంది.
            రెండొవ పఠనము హెబ్రీయులకు వ్రాసిన లేఖ 2:9-11 వచనలలో యేసు ప్రభువు మన కోసం త్యాగాన్ని స్వీకరించినట్లు మనకు తెలియజేస్తుంది. యేసు దేవుని మహిమతో ఉన్నప్పటికీ, తనను తానే తాగించుకొని,ఈ యొక్క లోకానికి వచ్చి, మన కోసం మానవ రూపాన్ని ధరించి, ఆయన మన పాపాలను తన బుజాలపై మోసి, మనకు శాశ్వతమైన విముక్తిని అందించడానికి సిలువపై అవమానకరమైనటువంటి మరణాని మరనించాడు. ఈ త్యాగం ద్వారా మనం దేవుని కుటుంబంలో ఒక భాగమయ్యాము. అందువల్ల, ఈ వాక్యం మనకు యేసు ప్రేమ మరియు కరుణను గురించి తెలియజేస్తుంది అని రెండొవ పఠనం చెబుతుంది.
                చివరిగా సువిశేష పఠనమును ద్యానించ్చినాట్లయితే మార్కు 10:2-16 వచనలలో యేసు వివాహం మరియు పిల్లల విషయంలో ముఖ్యమైనటువంటి సూత్రాలను ప్రజలకు బోధిస్తున్నాడు. యూదులలో విడాకుల ప్రస్థావన వచ్చినప్పుడు యేసు దేవుని ఆరంభ సంకల్పం వైపు దృష్టి తీసుకెళ్ళి, వివాహం అనేది దైవిక కట్టుబాటుగా, స్త్రీ పురుషులు విడిపోకూడని సంబంధంగా చెబుతున్నాడు. ఎందుకంటే పెళ్లి అనే బంధం దేవుని ఆశీస్సులతో ప్రారంభమవుతుంది, కాబట్టి దానిని పవిత్రంగా ఉంచుకోవాలని క్రీస్తు ప్రభు అంటున్నారు. అదేవిదంగా పిల్లల విషయానికి వస్తే, యేసు పిల్లలను దగ్గరగా తీసుకోని, వారి మనస్సు వాలే దేవుని రాజ్యానికి చేరాలి అని చెప్పాడు. పిల్లల ద్రుష్టి, శ్రద్ధ మరియు నమ్మకాన్ని గుర్తించి, మనం కూడా దేవుని వైపు పిల్లలవలే విశ్వాసంతో నడవాలని గుర్తుచేస్తున్నాడు.
        కాబట్టి ప్రియా దేవుని బిడ్డలరా మన జీవితాలలో బంధం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది కాబట్టి దేవునికి ఇష్టనుసరంగా జీవించాలని భక్తి విశ్వాసల్లతోటి ప్రార్థించుకుందాము. 

---

ఈ మూడు వచనాలు కలిసి మనకు దేవుని సంకల్పం, త్యాగం, మరియు శాంతియుత జీవనానికి సంబంధించిన గొప్ప మార్గదర్శకతలను అందిస్తాయి.
Fr. Johannes OCD 

27 వ సామాన్య ఆదివారం

27 వ సామాన్య ఆదివారం 
ఆది కాండం 2:18-24, హెబ్రీ 2:9-11, మార్కు 10:2-16
ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠణములు "పరిశుద్ధ వివాహం" గురించి బోధిస్తున్నాయి. కుటుంబం అనేది ప్రభువును యొక్క ఉద్దేశంలో సృష్టి ప్రారంభం నుండి ఉన్నది. దేవుడు ఏర్పరచినటువంటి దివ్య సంస్కారాలలో మొదటిగా ఏర్పరచిన దివ్య సంస్కారము ఈ యొక్క వివాహ జీవితం ఎందుకనగా సృష్టి ఆరంభంలోనే స్త్రీ పురుషులు ఇద్దరిని సృష్టించి వారిని 
పవిత్ర వివాహము ద్వారా ఒకటి చేశారు. 
ఈనాటి మొదటి పఠణంలో దేవుడు ఆదాముకు అవ్వమ్మను తోడుగా ఇచ్చిన అంశమును చదువుతున్నాం. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని ఆయనకి తోడుగా ఉండుటకు, సహాయం చేయుటకు, తన కష్ట కాలములో, సంతోష సమయంలో, అండగా -నీడగా నిలబడటం నిమిత్తమై ఆదాము కొరకు అవ్వను ప్రభువు ఇస్తున్నారు. దేవుడు ఈ సృష్టిలో ఒక కుటుంబమునకు ప్రాముఖ్యత నుంచి ఆ కుటుంబమును ఏర్పరచుటకు సిద్ధపడ్డారు ఎందుకనగా కుటుంబమే అన్నిటికీ ప్రధానం. కుటుంబం నుండి అందరూ (గురువులైన, కన్య స్త్రీలైనా రాజకీయ నాయకులైనా, వైద్యులైనా ......) వస్తారు కాబట్టి ఆ కుటుంబం మంచిదైన యెడల ఈ ప్రపంచమే మంచిదిగా మారును అనే ఉద్దేశంతో ప్రభువు  బహుశా ఈ నిర్ణయం తీసుకున్నారేమో. దేవుడు సృష్టించినటువంటి ఆది తల్లిదండ్రులు ఇద్దరు ఒకరితో ఒకరు సగభాగమై, కలిసిమెలిసి జీవించాలన్నది దేవుని యొక్క ప్రణాళిక. ఆదాము యొక్క ప్రకటి ఎముకను తీసుకొని అవ్వను చేసిన సందర్భంలో ఆదాము ఈ విధంగా అంటున్నారు ఈమె నా ఎముకలో ఎముక, నాదేహంలో దేహం ఈమె నా వంటిదైనది అని పలికారు. దాంపత్య జీవితంలో ఇద్దరు వేరు వేరు చోట్ల జన్మించినటువంటి వారు ఒకటిగా అవ్వాలి అన్నది దాంపత్య జీవితం ప్రణాళిక. ప్రతి భార్య తన భర్త లాగా మారాలి అదేవిధంగా ప్రతి భర్త తన భార్య లాగా మారాలి. అందుకే ప్రభువు అంటున్నారు వివాహ బంధం ద్వారా భిన్న శరీరులుగా ఉన్న ఇద్దరూ ఏక శరీరులై జీవించబోతున్నారు. వివాహ బంధం అన్నది దేవుడు ఏర్పరిచిన బంధం. ఒక స్త్రీకి భర్తను అదే విధంగా ఒక పురుషుడికి భార్యను జత చేసేది దేవుడే ఎందుకనగా సృష్టి ప్రారంభంలోనే ఆదాముకు అవ్వే భార్యని దేవుడు వారిద్దరినీ జత చేసారు. ఆది తల్లిదండ్రులకు అంతయు క్రొత్తగా ఉన్నప్పటికీ వారిద్దరూ చివరి వరకు కలిసిమెలిసి జీవించారు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ప్రభువే స్వయంగా పలికారు ఎందుకన ఒంటరితనం బాధిస్తుంది, ఒంటరితనం మగవారు తట్టుకోలేరు అందుకే చాలా సందర్భాల్లో చూస్తాం ఒక భర్త చనిపోయినప్పుడు భార్య జీవించగలదు కానీ ఒక భార్య చనిపోయినప్పుడు భర్త దాన్ని తట్టుకొని జీవించటం చాలా కష్టం.
వివాహ జీవిత ముగింపు అనేది కేవలం మరణం ద్వారా సంభవించాలి కానీ విడాకులు అనేవి వివాహ జీవితంలో లేవు అని ప్రభువు స్పష్టం చేశారు. పరిసయ్యులు ఏసుప్రభువుని "భార్యను భర్త పరిత్యజించుట ధర్మమా అని ప్రశ్నించారు" ఎందుకంటే మోషే వారికి భార్యను పరిత్యజించే నియమము ఇచ్చారు కాబట్టి. మోషే చట్టం ప్రకారము ఒకవేళ భార్య అపరిశుద్ధముగా ఉన్నట్లయితే విడాకులు ఇవ్వవచ్చని రాయబడి ఉన్నది ఇక్కడ అ పరిశుద్ధత అంటే ఒక విధముగా భార్య వ్యభిచారిని అయ్యి ఉండవచ్చు రెండవదిగా అపరిశుద్ధత అనగా భార్య తన జీవితంలో భర్త మాట వినకపోవడం, వంట సరిగా చేయకపోవడం, పరాయి పురుషులతో మాట్లాడటం, భర్త యొక్క బంధువులతో అమర్యాదగా మాట్లాడటం ఇవన్నీ కూడా ఆమె యొక్క అపరిశుద్ధతకు సూచనగా ఉన్నాయి. ఇలాంటి విపరీతార్ధాలు ఉండటం వలన యూదా ప్రజలలో విడాకులు ఎక్కువైనాయి. భర్తలు,భార్యలపై ఏదో ఒక సాకుమోపి విడాకులిచ్చేవారు వైవాహిక జీవితం ఇట్టి దుస్థితికి దిగజారి పోవటం వలన వివాహ జీవితం అద్వానంగా మారేది అందుకని స్త్రీలు వివాహమాడుటకు వెనుకంజ వేసేవారు. 
ఏసుప్రభు మాత్రము వివాహ బంధము విడదీయని బంధము అని స్పష్టము చేశారు అందుకే ప్రభువు అంటున్నారు దేవుడు జతపరిచిన జంటను మానవమాత్రుడు వేరుపరపరాదని. దేవుని దృష్టిలో విడాకులకు తావులేదు కానీ మానవులే స్వార్థం కోసం బలహీనత వలన విడాకులు తీసుకుని దైవ ప్రణాళికకు విరుద్ధంగా జీవిస్తున్నారు.
వివాహ జీవితంలో కష్టాలు ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి బాధలు ఉంటాయి కానీ అన్ని సందర్భంలో ఒకరికి ఒకరై తోడై ఉండాలి అది దేవుడు వివాహ జీవితం ద్వారా నేర్పిస్తున్న అంశం. వివాహం రోజున భార్యాభర్తలిద్దరూ కూడా దేవుని ముంగిట కష్టములోనూ సుఖములోనూ వ్యాధి లోను సౌఖ్యములోనూ నేను నీకు ప్రామాణికంగా ఉందునని ఇద్దరు కూడా ప్రమాణం చేస్తారు. కాబట్టి ఆ ప్రమాణం యొక్క అర్థమును ఎప్పుడూ కూడా గ్రహించి ఇద్దరు కూడా కలిసిమెలిసి చివరి వరకు జీవించాలి. వివాహ బంధము పరలోకమునకై ఏర్పరచబడినది. Marriages are not made in heaven but marriages are made for heaven. ఈ సత్యమును గ్రహించి దాంపత్య జీవితంలో భార్యాభర్తలు ఇద్దరు ఒకరి ఎడల ఒకరు విశ్వాస పాత్రులుగా జీవిస్తూ, పరస్పరం క్షమించుకుంటూ, అర్థం చేసుకుంటూ, ప్రేమించుకుంటూ జీవిస్తే వారు చివరి వరకు సంతోషంగా ఉంటారు.
Fr. Bala Yesu OCD

సామాన్యకాలపు ఇరవై ఏడవ ఆదివారము

సామాన్యకాలపు ఇరవై ఏడవ ఆదివారము  ఆదికాండము 2:18-24 హెబ్రీయులకు 2:9-11 మార్కు 10:2-16 క్రీస్తునాధునియందు ప్రియ సహోదరీ సహోదరులారా, దేవుని బిడ్డ...