హృదయ పరివర్తన లేక నాశనం | లూకా 13:1-9 Telugu Homily తపస్సుకాలం | Carmel Shobha

 లూకా 13:1-9

ఆ సమయమున కొందరు, బలులు సమర్పించునప్పుడు పిలాతు గలిలీయ దేశీయులను చంపిన విషయమును యేసుతో చెప్పిరి. అందుకు యేసు, "అట్లు చంపబడిన ఈ గలిలీయ వాసులు తక్కిన గలిలీయా వాసుల కంటే ఎక్కువ పాపులని మీరు తలంచుచున్నారా? కాదు. హృదయ పరివర్తన  చెందనిచో మీరు అందరు అట్లే నాశనమగుదురనిమీతో చెప్పుచున్నాను. సీలోయము బురుజు కూలి,  దాని క్రింద పడి మరణించిన పదునెనిమిది మంది, తక్కిన యెరుషలేము నివాసుల కంటే ఎక్కువ అపరాధులని  ఎంచుచున్నారా?  కాదు, హృదయ పరివర్తన  చెందనిచో  అందరు అట్లే  నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను" అని పలికెను. పిమ్మట యేసు  ఈ ఉపమానము చెప్పెను: " ఒకడు తన ద్రాక్ష తోటలో అంజూరపు  చెట్టు నాటించెను. అతడు ఆ చెట్టు పండ్ల కొరకు చూచెను. కాని అతనికి ఏమియు దొరకలేదు.  అపుడు అతడు తోట మాలితో 'ఇదిగో! నేను మూడేండ్లు నుండి  ఈ అంజూరపు చెట్టు పండ్ల కొరకు వచ్చుచున్నాను. కాని నాకు ఏమియు దొరకలేదు. దీనిని నరికివేయుము. ఇది వృధగా భూమిని  ఆక్రమించుట ఎందుకు?' అనెను. అందుకు  తోటమాలి 'అయ్యా! ఇంకొక యేడు ఓపిక పట్టుడు. నేను దీని చుట్టు పాదు చేసి, ఎరువు వేసేదను. ముందుకు ఫలించిన సరి. లేనిచో కొట్టి పారవేయుడు' అని పలికెను."

హృదయ పరివర్తన - రక్షణకు రాజమార్గం

మన రక్షణకు అవసరమైనది హృదయ పరి వర్తన. ఈనాటి సువిశేషం ద్వార దీనిని ప్రభువు వెల్లడి చేస్తున్నారు. మనం మారు మనస్సు పొందక పోతే మనం నాశనం అవుతాము అని యేసు ప్రభువు వెల్లడిచేస్తున్నారు. నేను చాలా పాపములు చేసెను ఇంకా నన్ను దేవుడు నన్ను క్షమించడులే అని మనం బాధకు గురికానవసరం లేదు. కాని మనకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మనలను శిక్షించకుండా మనకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశం ఉపయోగించుకుంటే నీవు శిక్షకు గురికావు. నివివే ప్రజలు పాపం చేసిన వారు మారు మనసు పొందినందుకు వారిని శిక్షించడం లేదు.

దేవుని యందు నీకు అభయం ఉంది అది ఏమిటి అంటే నీకు ఒక అవకాశం ఇవ్వడానికి సిద్దాముగా ఉన్నాడు. సాతాను నీకు రక్షణ లేదు అని చెబుతుంది, కానీ యేసు ప్రభువు కోసం ఆ అవకాశం తీసుకొస్తాడు. మొదటి తిమోతి రెండవ అధ్యాయం 5 వ వచనం మనకు ఇది చెపుతుంది. "దేవుడు ఒక్కడే,దేవుని ,మనుజులను ఒక చోట చేర్చు మధ్యవర్తియు ఒక్కడే ఆయనే మనుష్యుడైన క్రీస్తు యేసు. మానవాళి రక్షణకై క్రయ ధనముగా ఆయన తనను తాను అర్పించుకొనేను."

గలిలీయుల మారణహోమం - పిలాతు క్రూరత్వం

"ఆ సమయమున కొందరు, గలీలియ దేశీయులు బలులు సమర్పించునప్పుడు పిలాతు వారిని చంపిన విషయమును యేసుతో చెప్పిరి." యేసు ప్రభువు దీని గురించి ఏమి చెప్పడం లేదు వారికి, అక్కడ పిలాతు తప్పు చేశాడు అని కానీ వారు అలా చేసి ఉండకూడదు అని కానీ ఏమి మాటలాడటం లేదు. ఆ విషాదాన్ని గురించి మాటలాడటం లేదు.

ఎందుకు పిలాతు వారిని చంపించి ఉండవచ్చు అంటే ఆనాటి రోజులలో ఎక్కువగా గలీలియ నుండే రోమా సామ్రాజ్యం మీద తిరుగుబాటు ఎక్కువగా వస్తుండేది. రోమా సామ్రాజ్యం ఎటువంటి విప్లవాలను సహించదు అని చెప్పడానికి చేసి ఉండవచ్చు. ఇక్కడ వారు ఘోరంగా అవమానింప బడ్డారు ఎందుకంటే వారు బలులను అర్పించుచున్నప్పుడు వారిని చంపిస్తున్నాడు పిలాతు. ఇది మనిషి కావాలని చేసిన మారణహోమం.

చారిత్రక నేపథ్యం మరియు రాజకీయ పరిస్థితులు

ఈ సంఘటన వెనుక ఉన్న రాజకీయ, సామాజిక పరిణామాలను మనం నిశితంగా పరిశీలిస్తే, ఆ కాలంలో గలిలీయ ప్రాంతం రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా సాగే విప్లవాలకు కేంద్రబిందువుగా ఉండేదని తెలుస్తుంది. అక్కడి ప్రజలు పౌరుషం కలిగినవారు మరియు యూదా స్వతంత్రత కోసం ప్రాణాలర్పించడానికి సిద్ధపడేవారు. యూదుల పవిత్ర పండుగ దినాలలో యెరూషలేము దేవాలయంలో బలులు అర్పించడానికి వచ్చిన గలిలీయులు ఏదైనా తిరుగుబాటుకు ప్లాన్ చేస్తున్నారనే అనుమానంతో లేదా కేవలం వారిని భయభ్రాంతులకు గురిచేయడానికి రోమా అధిపతియైన పొంతి పిలాతు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. దేవునికి అర్పించే బలి పశువుల రక్తంతో పాటు, ఆరాధన చేస్తున్న మనుషుల రక్తాన్ని కూడా కలపడం అనేది మతపరంగా అత్యంత అపవిత్రమైన, ఘోరమైన అవమానం.

లోకపు వార్తలు మరియు యేసు దైవిక దృక్పథం

సాధారణంగా ప్రజలు యేసు వద్దకు వచ్చి ఈ వార్తను చెప్పినప్పుడు, పిలాతు యొక్క అన్యాయాన్ని ఖండించాలని లేదా ఆ చనిపోయిన వారి పట్ల రాజకీయ సానుభూతిని వ్యక్తపరచాలని ఆశించారు. కానీ యేసు లోకసంబంధమైన రాజకీయ చర్చల్లోకి ప్రవేశించలేదు. ఆయన దృష్టి ఎప్పుడూ మానవుని అంతర్గత ఆత్మ రక్షణపైనే ఉంటుంది. భౌతిక మరణం కంటే ఆత్మీయ మరణం ఎంత భయంకరమైనదో హెచ్చరించడానికి యేసు ఈ సందర్భాన్ని ఒక పాఠంగా మలచుకున్నారు.

ఆధ్యాత్మిక అహంకారం - ఇతరులను తీర్పు తీర్చుట

అందుకు యేసు, "అటుల చంపబడిన ఈ గలీలియ వాసులు తక్కిన గలీలియ వాసులకంటే ఎక్కువ పాపులని మీరు తలంచుచున్నారా? అని అడుగుతున్నారు? ఇటువంటి సమయంలో మనం చనిపోయిన వారు ఎవరు? వారు ఏమి చేశారు? అని చర్చించుకుంటాం. కానీ యేసు ప్రభువు దాని గురించి మాటలాడటంలేదు. నీకు ఇటువంటిది జరిగితే అన్నట్లు మాటలాడుతున్నారు?

దేవాలయానికి ఇద్దరు ప్రార్ధన చేసుకోవడానికి ఇద్దరు వచ్చారు. ఒకడు సుంకరి మరియొకడు పరిసయ్యుడు, పరిసయ్యుడు తాను చేసే పనుల బట్టి నేను మంచి వాడిని అని అనుకుంటున్నాడు. నిజానికి కాదు ఎంతో కపటం అతనిలో ఉంది. నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి పోతున్నది సుంకరియే. నీ జీవితం ఎలా ఉంది ఇక సారు ఆలోచించు. నా జీవితంలో కొన్ని సార్లు ఇతరుల కంటే నేను మంచి వాడిని అనుకుంటాము. కానీ దాని గురించి నీవు ఆలోచించనవసరం లేదు.

స్వనీతి అనే ప్రమాదకరమైన రోగం

మానవ నైజం ఎటువంటిదంటే, ఇతరులకు ఏదైనా విపత్తు జరిగినప్పుడు లేదా ఎవరైనా ఘోరంగా మరణించినప్పుడు "వారు ఏదో అంతర్గతంగా పెద్ద పాపం చేసి ఉంటారు, అందుకే దేవుడు వారిని అలా శిక్షించాడు" అని చాలా సులభంగా తీర్పు తీరుస్తుంది. అదే సమయంలో, "మనం క్షేమంగా ఉన్నాము కాబట్టి మనం వారి కంటే నీతిమంతులం" అనే భ్రమలో బ్రతుకుతుంది. ఈ స్వనీతి (Self-righteousness) అనే ఆధ్యాత్మిక అహంకారాన్ని యేసు ఇక్కడ తీవ్రంగా ఖండిస్తున్నారు.

పరిసయ్యుని ప్రార్థన (బాహ్య భక్తి)సుంకరి ప్రార్థన (అంతర్గత పరివర్తన)
తానే ఎంతో ఉత్తముడనని దేవుని ఎదుట డబ్బా కొట్టుకున్నాడు.రొమ్ము బాదుకుంటూ, "దేవా, పాపినైన నన్ను కరుణించు" అని వేడుకున్నాడు.
ఇతరులను, ముఖ్యంగా పక్కన ఉన్న సుంకరిని తృణీకరించాడు.తన పాపభారాన్ని ఒప్పుకుంటూ దేవుని కృపకై కనిపెట్టాడు.
కపట నీతితో వెనుదిరిగాడు (రక్షణ లేదు).హృదయ పరివర్తనతో నీతిమంతుడిగా మార్చబడ్డాడు.

ప్రభువు మనల్ని ఇతరులతో పోల్చుకోమవద్దు అని హెచ్చరిస్తున్నారు. ఇతరుల పాపాలను లెక్కపెట్టడం మానేసి, మన స్వంత ఆత్మీయ స్థితిని పరీక్షించుకోవాలని పిలుపునిస్తున్నారు.

హృదయ పరివర్తన యొక్క ప్రాముఖ్యత మరియు పునీత పౌలు గారి సాక్ష్యం

యేసు ప్రభువు అడిగిన ప్రశ్నకు ఆయనే జవాబు ఇస్తున్నాడు. కాదు అని. మరల "హృదయ పరివర్తన చెందనిచో మీరు అందరును అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను." హృదయ పరివర్తనం అనేది నీవు రక్షణ పొందడానికి దేవుడు పెట్టిన షరతు ఇది. నేను ఏమి చేయాలి ఈ హృదయ పరివర్తన పొందడానికి. పునీత పౌలు గారి జీవితం మనకు నేర్పుతుంది, హృదయ పరివర్తన ఎలా ఉంటుంది అని. ఆయన క్రీస్తుని తెలుసుకున్న తరువాత ఆయన జీవితం మొత్తం యేసుతోనే. అందుకే ఆయన అంటున్నాడు.ఇక క్రీస్తే నాకు జీవము.

నిజమైన హృదయ పరివర్తన అంటే ఏమిటి?

హృదయ పరివర్తన అనగా కేవలం కొన్ని కన్నీటి చుక్కలు కార్చడం లేదా తాత్కాలికంగా బాధపడటం కాదు. గ్రీకు భాషలో దీనిని "మెటా నోయా" (Metanoia) అంటారు, అనగా "మనస్సులో, ఆలోచనా విధానంలో సంపూర్ణ మార్పు". మనం ప్రయాణిస్తున్న పాపపు మార్గాన్ని వదిలి,   వెనక్కి తిరిగి దేవుని వైపు నడవడం. మన పాత జీవితాన్ని, పాత అలవాట్లను పూర్తిగా విసర్జించడం.

పునీత పౌలు గారి మార్పు 

సౌలు అనే వ్యక్తిగా ఉన్నప్పుడు ఆయన క్రైస్తవులను హింసించాడు, చంపించాడు. దేవుని పేరిట తనే గొప్ప నీతిమంతుడినని భావించాడు. కానీ దమస్కు మార్గంలో పునరుత్థానుడైన యేసుక్రీస్తును దర్శించుకున్న క్షణంలో అతని హృదయం పూర్తిగా పరివర్తన చెందింది. అంతవరకు తాను సంపాదించుకున్న లోక జ్ఞానాన్ని, హోదాను క్రీస్తు కొరకు పెంటతో సమానంగా ఎంచుకున్నాడు (ఫిలిప్పీయులకు 3:8). హింసకుడైన సౌలు, సువార్తికుడైన పౌలుగా మారడమే నిజమైన హృదయ పరివర్తనకు నిదర్శనం. ఆయన జీవితం మనకు నేర్పే పాఠం ఏమిటంటే, ఒకసారి పరివర్తన చెందిన హృదయం మరల వెనక్కి తిరిగి చూడదు; అది కేవలం క్రీస్తు కేంద్రంగానే జీవిస్తుంది.

సీలోయము బురుజు సంఘటన - ప్రకృతి వైపరీత్యాలు మరియు దైవిక హెచ్చరిక

యేసు ప్రభువు వారితో శిలోయము అను బురుజు కూలి, దాని క్రిందపడి మరణించిన పదునెనిమిదిమంది,తక్కినయెరుషలేము నివాసులకంటే ఎక్కువ అపరాధులు ఎంచుచున్నారా? ఇక్కడ మరల యేసు ప్రభువు మరియొక ప్రశ్న అడుగుతున్నారు. ఇంతకు ముందు అడిగినటువంటి ప్రశ్న మరల జవాబు ఆయనే ఇస్తున్నారు. కానీ అక్కడ మనిషి చేసిన మరణ హోమం ఇక్కడ ప్రకృతి ద్వార జరిగిన విషాదం. కానీ ప్రశ్న మాత్రం ఒకటే. ఎందుకంటే अनेक సార్లు మన ఇటువంటి విషయాలే వింటువుంటాం. అది ప్రకృతి వల్ల జరిగిన మనిషి వల్ల జరిగిన కొంత మంది నాశనం అయ్యారు. ఇది కేవలం వారి భౌతిక నాశనమే. వారు మంచి వారు అయితే వారికి రక్షణ ఉంటుంది. కానీ యేసు ప్రభువు అడిగేది, నీవు వీటి గురించి కాక నీ గురించి ఆలోచించమని అడుగుతున్నారు.

భౌతిక నాశనము - ఆత్మీయ నాశనము

మొదటి సంఘటనలో మనుషుల (పిలాతు) క్రూరత్వం వల్ల ప్రాణాలు పోతే, రెండవ సంఘటనలో ఒక నిర్మాణ లోపం లేదా ప్రమాదం వల్ల (సీలోయము బురుజు కూలడం) పదునెనిమిది మంది మరణించారు. నేటి కాలంలో కూడా మనం భూకంపాలు, వరదలు, రోడ్డు ప్రమాదాలు లేదా అంటువ్యాధుల వల్ల వేలాది మంది చనిపోవడం చూస్తుంటాము. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు "దేవుడు వారిని ఎందుకు శిక్షించాడు?" అని ప్రశ్నించడం మానవ నైజం.

కానీ యేసు స్పష్టం చేస్తున్నారు: భౌతిక ప్రపంచంలో జరిగే ప్రమాదాలు ఎప్పుడూ ఒకరి వ్యక్తిగత పాపానికి కొలమానాలు కావు. చనిపోయిన వారు ఎక్కువ పాపులు కాదు, బ్రతికి ఉన్న మనము ఎక్కువ నీతిమంతులమూ కాదు. భౌతిక మరణం అనేది అందరికీ ఏదో ఒక రోజు తప్పదు, కానీ హృదయ పరివర్తన లేకపోతే సంభవించే "ఆత్మీయ నాశనము" (నిత్య నరకాగ్ని) అత్యంత భయంకరమైనది. ఈ ప్రమాదాలు మనకు ఇచ్చే హెచ్చరిక ఏమిటంటే: జీవితం చాలా చిన్నది, ఏ క్షణంలోనైనా ముగిసిపోవచ్చు, కాబట్టి బ్రతికి ఉన్నప్పుడే హృదయాన్ని మార్చుకోవాలి.

బైబిల్ చరిత్రలో హెచ్చరికలు - పరివర్తన లేని సమాజాల పతనం

ఈ ప్రశ్నకు కూడా కాదు అని యేసు ప్రభువే సమాదధానం ఇస్తున్నాడు. అంటే కాదు హృదయ పరివర్తన చెందనిచో మీరందరును అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను అని పలుకుతున్నారు. అంటే మరలా మరలా యేసు ప్రభువు హృదయ పరివర్తన గురించి చెబుతున్నారు. ఒక వేళ హృదయ పరివర్తన చెందక పోతే నాశనం కొని తెచ్చుకున్నవారి వలె మనం మారిపోతాం. దేవుడు హెచ్చరించిన సమయంలో కొంత మంది హృదయ పరివర్తన చెందారు వారు ఎవరు అంటే నినీవే ప్రజలు, యేస్సీయారాజు, అదే హెచ్చరిక నోవా కాలంలో వచ్చింది. సొదొమో గోమొర్రోకు వచ్చింది కానీ వారు దేవుని మాట వినలేదు. పర్యవసానం మనం చూస్తున్నాం. మన రక్షణకు పూజలు, బలులు ముఖ్యం కాదు. ఏమిటి అంటేహృదయ పరివర్తన. హృదయ పరివర్తన లేక నాశనమా ? నిర్ణయం  మనదే.

నినీవే ప్రజల పశ్చాత్తాపం - దేవుని కరుణ

యోనా ప్రవక్త ద్వారా దేవుడు నినీవే పట్టణానికి తీర్పును ప్రకటించినప్పుడు, రాజు మొదలుకొని సామాన్య ప్రజల వరకు, పశువుల వరకు అందరూ ఉపవాసముండి, గోనెపట్ట కట్టుకొని, తమ దుర్మార్గతను విడిచిపెట్టి హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడ్డారు. వారి నిజమైన పరివర్తనను చూసి దేవుడు తన ఉగ్రతను వెనక్కి తీసుకుని వారిని రక్షించాడు.

నోవా మరియు సొదొమ గొమొఱ్ఱాల పతనం

దీనికి విరుద్ధంగా, నోవా కాలంలో ప్రజలు దేవుని హెచ్చరికలను నవ్వులాటగా తీసుకున్నారు. జలప్రళయం వచ్చేంతవరకు తింటూ, తాగుతూ, పెళ్లిళ్లు చేసుకుంటూ పాపంలోనే మునిగిపోయారు. ఫలితంగా సర్వనాశనమయ్యారు. సొదొమ గొమొఱ్ఱా పట్టణాల ప్రజలు కూడా తమ వ్యభిచార, కామ వికార లోకంలో పడి దేవుని దూతల హెచ్చరికలను తిరస్కరించారు, దాంతో ఆకాశం నుండి కురిసిన అగ్ని గంధకాలకు బూడిదైపోయారు.

ఈ చరిత్ర అంతా మనకు నిరూపించే సత్యం ఒక్కటే: దేవుడు బాహ్యమైన ఆచారాలను, బలులను చూసి సంతోషించడు. ఆయనకు కావలసింది విరిగి నలిగిన హృదయం (కీర్తన 51:17). హృదయ పరివర్తన లేని భక్తి కేవలం వేషధారణ మాత్రమే, అది నాశనం నుండి మనల్ని రక్షించలేదు.

అంజూరపు చెట్టు ఉపమానం - దేవుని నిరీక్షణ

యేసుప్రభువు వారికి అంజూరపు చెట్టు ఉపమానం చెప్పారు. . దేవుడు మన నుండి ఎప్పుడు కూడా పండ్లను కోరుకుంటున్నారు. ఈ చెట్టు తన యొక్క ప్రజలు. యాజమాని దేవుడు, తోటమాలి, యేసు ప్రభువు.

తోటమాలితో ఇదిగో! నేను మూడేండ్లనుండి ఈ అంజూరపు చెట్టు పండ్లకోరకు వచ్చుచున్నాను. కానీ నాకు ఏమియు దొరకలేదు. దీనిని నరికి వేయుము. ఇది వృధాగా భూమిని ఆక్రమించుట ఎందుకు?అనెను. ఇక్కడ దేవుడు అన్నీ ఇచ్చాడు. మొత్తం ఇచ్చిన తరువాత మన నుండి దేవుడు ఫలాన్ని ఆశిస్తున్నాడు. ఏమి ఇవ్వకుండా కాదు. నాకు ఏమి ఇచ్చాడు దేవుడు అని నీవు ఎప్పుడైనా అనుకున్నావా? కానీ దేవుడు ఇచ్చిన అనుగ్రహాలు ఒకసారి లెక్కించుకో?

ఫలించని జీవితం - దేవుని ఆవేదన

ద్రాక్షతోటలో అంజూరపు చెట్టును నాటడం అనేది ఆ చెట్టుకు లభించిన ప్రత్యేక భాగ్యం. ద్రాక్షతోటలో నేల ఎంతో సారవంతంగా ఉంటుంది, దానికి ప్రత్యేకమైన రక్షణ, నీరు, పోషణ లభిస్తాయి. అలాగే దేవుడు మనల్ని ఈ లోకంలో ప్రత్యేకంగా ఎన్నుకొని, తన సంఘంలో నాటాడు. మనకు జీవాన్ని, ఆరోగ్యాన్ని, కాలాన్ని, దైవిక వాక్యాన్ని, సంస్కారాలను అనుగ్రహించాడు. ఇవన్నీ దేవుడు మనకు ఇచ్చిన పెట్టుబడి.

ఇన్ని దైవిక అనుగ్రహాలను పొందిన తర్వాత, మనం ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, విశ్వాసము అనే ఆత్మ ఫలాలను (గలతీయులకు 5:22) ఇవ్వాలని ఆయన ఆశిస్తున్నాడు. కానీ మూడు సంవత్సరాలుగా వెతికినా ఏ ఫలమూ లేకపోవడంతో తోట యజమాని అయిన దేవుడు ఆవేదన చెందుతున్నాడు. "ఇది వృధాగా భూమిని ఆక్రమించుట ఎందుకు?" అనడంలో అర్థం ఏమిటంటే, ఫలించని క్రైస్తవ జీవితం దేవుని కృపను వృధా చేయడమే కాకుండా, ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండకుండా భూమికి భారంగా మారుతుంది.

క్రీస్తు మధ్యవర్తిత్వం - కరుణతో కూడిన మరో అవకాశం

అందులకు తోట మాలి అయ్యా ! ఇంకొక యేడు ఓపిక పట్టుడు. నేను దీని చుట్టు పాదుచేసి ఎరువు వేసేదను. ఎవరు ఈ తోటమాలి? యేసు క్రీస్తు నీకోసం నాకోసం దేవుని ముందు మొరపెట్టుచున్నారు. అబ్రహాము అడిగినప్పుడు దేవుడు క్షమిస్తున్నారు. మోషే అడిగినప్పుడు క్షమిస్తున్నారు. ఖచ్ఛితముగా మనం ప్రధాన యాజకుడు, తన కుమారుడు మన కోసం అడిగినప్పుడు దేవుడు ఓర్పు తో ఒప్పుకుంటున్నారు. దేవుడు మన మీద ఉన్న ప్రేమతో ఒప్పు కుంటున్నారు. న్యాయముగా అయితే ఇది జరుగకూడదు. ఎందుకు అంటే న్యాయముగా మనం శిక్షకు గురి కావాలి. కానీ కలకాలం ఇలానే ఉండదు. మనకు ఇచ్చిన అవకాశం మనం సద్వినియోగం చేసుకోవాలి.

మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు

న్యాయప్రకారం అయితే ఫలించని చెట్టు నరికివేయబడాలి. మన పాపాలను బట్టి చూస్తే మనం ఎప్పుడో శిక్షకు పాత్రులం కావాలి. కానీ దేవుని న్యాయానికి, ఉగ్రతకు అడ్డంగా నిలబడే ప్రేమ స్వరూపి మన తోటమాలి అయిన యేసుక్రీస్తు. ఆయన తండ్రి ఎదుట మన కోసం నిరంతరం విజ్ఞాపన (మధ్యవర్తిత్వం) చేస్తున్నారు. "తండ్రీ, వీరిని క్షమించుము, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు" అని సిలువపై పలికిన ఆ దైవిక స్వరమే నేడు మనకు ఆయుష్షును, మరో అవకాశాన్ని ఇస్తోంది.

ఆయన కేవలం సమయం అడగడమే కాదు, "నేను దీని చుట్టూ పాదు చేసి, ఎరువు వేసేదను" అంటున్నాడు. అనగా, మన హృదయాలను వాక్యమనే పారతో తవ్వి, తన రక్తాన్ని, కృపను ఎరువుగా వేసి మనల్ని ఫలించేలా చేయడానికి ఆయన శ్రమిస్తున్నారు. మన జీవితంలో వచ్చే శ్రమలు, కష్టాలు కొన్నిసార్లు దేవుడు మన హృదయాన్ని పాదు చేయడానికి ఉపయోగించే సాధనాలు కావచ్చు.

 హెచ్చరిక -  అవకాశం

ముందుకు ఫలించిన సరి. లేనిచో కొట్టి పారవేయుడు, అని పలికెను. యేసు ప్రభువు ద్వారా మనకు మరియొక అవకాశం వచ్చింది. ఇది చివరిది ఎందుకంటే అంతకు ముందు మనకు చాలా అవకాశాలు వచ్చినవి. మోషే ద్వార ధర్మ శాస్త్రం ఇచ్చి నీవు ఈ విధంగా జీవించమని దేవుడు చెప్పాడు. అప్పుడే మోషే చెప్పారు, యోహోషువా, మీరు దేవుని ఆజ్ఞల ప్రకారముగా జీవించిన జీవిస్తారు లేదా మరణిస్తారు అని చెప్పారు. న్యాయాధిపతులు ద్వారా ప్రభువు వారికి మంచి జీవితం జీవించమని చెప్పారు, ప్రవక్తల ద్వారా వారిని హెచ్చరించారు. యేసు ప్రభువుతో వచ్చినది చవరి అవకాశం కనుక హృదయ పరివర్తన పొంది మంచి ఫలాలను ఇవ్వడానికి ఎప్పుడు సిద్దాముగా ఉందాం.

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబిల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పవిత్రుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

📲 మా WhatsApp Channel జాయిన్ అవ్వండి!

ప్రతి నిత్య పోస్ట్ మీ WhatsApp కు నేరుగా వస్తుంది

Join WhatsApp Channel

Comments

మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:

Post a Comment

కామెంట్‌లు