క్రైస్తవుడు లోకమునకు వెలుగు | మత్తయి 5:13-16 Telugu Homily | Carmel Shobha

 ఐదవ సామాన్య ఆదివారం

మత్తయి 5:13-16 


మీరు భూమికి ఉప్పువలెనున్నారు. ఉప్పు తన ఉప్పదనమును కోల్పోయిన యెడల దానిని తిరిగి పొందలేదు. అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలచే త్రొక్కబడుటకేగాని మరెందుకును పనికిరాదు. మీరు లోకమునకు వెలుగైయున్నారు. కొండపై కట్టబడిన పట్టణము మరుగైయుండజాలదు. ఇంటనున్న వారికి అందరికి వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీప స్తంభము పైననే ఉంచెదరు గాని కుంచము క్రింద ఉంచరు గదా ! ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి యెదుట ప్రకాశింపనిండు.

లోకానికి అర్థాన్ని, సారాన్ని ఇచ్చే మానవుని బాధ్యత

మౌరీస్ మొర్లి పోంటి అనే ఫ్రెంచ్ తత్వ వేత్త క్రైస్తవుల గురించి, క్రైస్తవులు భూమికి సారం ఇచ్చేటువంటి వారు, లోకానికి అర్ధం ఇచ్చేటువంటి వారు అని చెప్పారు. ఇది నిజమే ఎందుకంటే మానవున్ని సృష్టించినప్పుడు, దేవుడు మానవునికి ఈ బాధ్యత ఇచ్చాడు. సకల జీవ రాసులను సృష్టించిన దేవుడు మానవున్ని వాటికి అధిపతిని చేసి వాటికి పేర్లు పెట్టుటకు, వాటిని అన్నీ విధాలుగా వృద్ది చెందే విధంగా చేయుటకు మానవునికి అధికారం ఇచ్చాడు. ఆదికాండములో దేవుడు సృష్టినంతటినీ చేసి, అది 'చాలా బాగుంది' అని చూసుకున్నాడు. ఆ తర్వాత తన పోలీకలో  సృష్టించిన నరునికి ఈ భూమిని సాగుచేసే, దీనిని సంరక్షించే బాధ్యతను అప్పగించాడు.

సకల జీవరాసులకు పేర్లు పెట్టుటకు వాటికి ఒక అర్ధం ఇవ్వుటకు, మానవునికి బాధ్యత ఇవ్వబడింది. పవిత్ర గ్రంథం ప్రకారం, ఆదాము ప్రతి జీవరాశికి ఏ పేరు పెట్టాడో అదే దానికి పేరయింది. అంటే లోకంలోని ప్రతి సృష్టికి ఒక గుర్తింపును, ఒక ప్రయోజనాన్ని, ఒక క్రమాన్ని ఇచ్చే దేవుని ప్రతినిధిగా మానవుడు నియమించబడ్డాడు. ఈ లోకానికి అర్ధం ఇవ్వడానికి, దానిని పెంపొందించుటకు మరియు నాశనం కాకుండా చూచుటకు కూడా మానవుని కర్తవ్యం. సృష్టిని దేవుడు మనకు ఇచ్చింది స్వార్థంతో ధ్వంసం చేయడానికి కాదు, దానిని దేవుని  ప్రేమతో పోషించడానికి.

కాని, కాలక్రమేణా మానవుడే లోక నాశననికి కారణమవుతూ  వచ్చాడు. మానవునిలో పెరిగిన స్వార్థం, లోభత్వం, పాపపు ఆలోచనలు కేవలం తోటి మానవుల మధ్య బంధాలనే కాకుండా, మొత్తం భూమి యొక్క నైతిక, భౌతిక సమతుల్యతను పాడుచేశాయి. యుద్ధాలు, అవినీతి, పగ, ద్వేషాలతో లోకం అంధకారంలో మునిగిపోయింది. ఇటువంటి స్తితిలో మరల లోకానికి అర్ధం ఇవ్వుటకు, అది నాశనం కాకుండా ఉండుటకు క్రైస్తవుడు తీసుకోవలసిన బాధ్యత గురించి ఈనాటి సువిశేషం తెలియజేస్తుంది. క్రీస్తును అనుసరించే ప్రతి ఒక్కరూ ఈ సృష్టిని, సమాజాన్ని పతనమవకుండా కాపాడే 'రక్షక శక్తులుగా' మారాలని యేసు పిలుపునిస్తున్నారు.

భూమికి ఉప్పువలె జీవించడం: పవిత్రతను కాపాడుట  

"మీరు భూమికి ఉప్పువలెనున్నారు."

ఉప్పు ఒక వస్తువును పాడుకాకుండా ఉంచుతుంది. ప్రాచీన కాలంలో నేటిలాగా రిఫ్రిజరేటర్లు లేదా రసాయన నిల్వ సౌకర్యాలు లేనప్పుడు, మాంసం లేదా ఇతర ఆహార పదార్థాలు కుళ్ళిపోకుండా, పాడవకుండా ఉండటానికి ఉప్పును  ఆ ఆ పదార్ధాలకు  రాసేవారు. యేసు ప్రభువు మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు అని అన్నప్పుడు దీని అర్ధం ఏమి అయిఉంటుంది అని మనం ధ్యానించినట్లయితే, మనం ఎల్లప్పుడు ఈ లోకము పవిత్రతను కోల్పోకుండ ఉండే విధంగా చేయాలి అని నేర్పుతుంది. లోకంలో పాపం, నైతిక విలువల క్షీణత అనే కుళ్లు పెరుగుతున్నప్పుడు, క్రైస్తవుడు ఉప్పులా మారి ఆ కుళ్లును అరికట్టాలి.

మనం భూమికి ఉప్పు వలె ఉండటం అంటే భూమి దాని సారం పోకుండా కాపాడకలగాలి. క్రైస్తవులుగా మనం జీవిస్తూ ఈ లోకంలో ఉండి ఈ లోకం చెడిపోకుండా చేయాలి. ఉప్పు ఆహారానికి రుచిని ఇస్తుంది. రుచి లేని జీవితాలు జీవిస్తున్న సమాజానికి క్రీస్తు ప్రేమ అనే రుచిని చూపించవలసిన బాధ్యత మనపై ఉంది. క్రైస్తవునిగా మనం పవిత్రంగా ఉండి ఎప్పుడు ఈ లోకానికి పవిత్రతను తెలియజేయాలి. మన మాటలు, మన ప్రవర్తన, మన ఆలోచనలు సమాజంలో శాంతిని, సత్ప్రవర్తనను పెంపొందించేవిగా ఉండాలి.

ఉప్పదనమును కోల్పోవడం: లౌకికత్వంలో కలిసిపోవద్దు

"ఉప్పు తన ఉప్పదనమును కోల్పోయిన యెడల దానిని తిరిగి పొందలేదు. అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలచే త్రొక్కబడుటకేగాని మరెందుకును పనికిరాదు."

ఉప్పు తన ఉప్పదనం కోల్పోతే దానిని తిరిగి పొందలేదు. ఉప్పు సహజంగా ఎరువుగా మరియు పదార్ధాలు నిలువ వుంచుటకు వాడతారు. ఉప్పు ఉప్పదనం ఎలా కోల్పోతుంది అంటే, పాలస్తీనా ప్రాంతంలో వాడే ఉప్పు మన దేశంలో లాగా శుద్ధి చేసినది కాదు. అది డెడ్ సీ (మృత సముద్రం) తీరాల నుండి సేకరించిన ఖనిజాల మిశ్రమం. అందులో ఉప్పుతో పాటు ఇతర మట్టి కణాలు, జిప్సం వంటివి కలిసి ఉండేవి. ఉప్పును రొట్టెలను కాల్చుటకు వేడిచేసేవారు. పెద్ద పొయ్యిలలో, రొట్టెలు కాల్చే  గుంటలలో వేడిని నిలిపి ఉంచడానికి ఈ ఉప్పు గడ్డలను వాడేవారు. అలా నిరంతరం తీవ్రమైన వేడికి గురైనప్పుడు, ఆ రసాయన చర్యల వల్ల ఉప్పు తన సహజమైన ఉప్పదనాన్ని కోల్పోయేది. కేవలం పనికిరాని తెల్లటి సుద్ద ముక్కలా మిగిలిపోయేది.

అలాగే ఇతర పదార్ధాలు ఎక్కువ మోతాదులో కలిపిన దానిని మరల వాడుటకు ఉపయోగపడదు. లోకపు ఆశలు, లోకపు పద్ధతులు మనలో ఎక్కువైనప్పుడు మన అసలైన గుణం నశిస్తుంది. అలానే మనం కూడా ఇతర వ్యావహారాలలో ఎక్కువ కలిసినప్పుడు మన క్రైస్తవ్యత్వాన్ని కోల్పోతువుంటాము. క్రైస్తవులు లోకంలోవారి వలె జీవిస్తూ వారి క్రైస్తవత్వాన్ని కోల్పోతారో అప్పుడు లోకంలో ఎటువంటి ప్రభావం చూపలెరు. లోకం చేసే అవినీతిని క్రైస్తవుడు కూడా చేస్తే, లోకం మాట్లాడే అబద్ధాలను క్రైస్తవుడు కూడా మాట్లాడితే, ఇక లోకానికి మనకు తేడా ఏముంటుంది?

వారు లోకములోని వారి కంటే భిన్నంగా ఉన్నప్పుడు మాత్రమే తమ ప్రభావం చూపగలరు. ఉప్పు వంటకంలో కలిసిపోతుంది కానీ తన రుచిని వదులుకోదు. అలాగే మనం లోకంలో జీవించాలి కానీ లోకత్వంలో కొట్టుకుపోకూడదు. అందరిలో ఒకరిగా ఉండాలి అని అనుకుంటే మనం క్రైస్తవత్వాన్ని కోల్పోతాము. లోక మెప్పు కోసం దైవిక విలువలను వదులుకుంటే, మనం ఉప్పదనం కోల్పోయిన ఉప్పులా మారిపోతాము. అప్పుడు సమాజం మనల్ని గౌరవించదు, సేకరించిన ఆ తెల్లటి పొడిని వీధుల్లో పారవేస్తే నడిచేవారు కాళ్లతో తొక్కినట్లు, క్రైస్తవ సాక్ష్యం లోకంలో అవహేళనకు గురవుతుంది.

సమాజ సంరక్షణలో క్రైస్తవుని పాత్ర: అబ్రహాము ప్రార్థన వృత్తాంతం

క్రైస్తవుడు లోకానికి ఏ విధంగా ఉపయోగపడతాడు? ఉప్పు చెడి పోకుండా ఉండటానికి ఉపయోగ పడుతుంది. ఈ లోకానికి క్రైస్తవుడు ఉప్పుగా ఉండుట వలన ఈ లోకము చెడి పోకుండా ఉండటానికి ఉపయోగపడుతాడు. ఇది ఎలా ఉంటుంది అంటే ఆదికాండంలో మనం అబ్రహాము దేవుడుని వేడుకొనిన వృత్తాత్తము వలన దీనిని అర్ధం చేసుకోవచ్చు.

సొదొమో గొమొఱ్ఱా పట్టణాలు పాపంతో నిండిపోయినప్పుడు, దేవుడు వాటిని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు అబ్రహాము దేవున్ని సొదొమో గోమోర పట్టణాన్ని కాపాడమని అర్ధిస్తాడు. దేవుని న్యాయశీలతను, కరుణను నమ్ముకుని అబ్రహాము బ్రతిమాలుతాడు:

అబ్రహాము అడిగిన ప్రశ్నదేవుని సమాధానం
"ప్రభువా ఒక యాభై మంది మంచి వారు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా కాపాడుతారా?""ఆ యాభై మంది కోసం పట్టణాన్ని క్షమిస్తాను"
"నలభై మంది మంచి వారుంటే ఆ పట్టణాన్ని కాపాడుతారా?""నలభై మంది కోసం నాశనం చేయను"
"ముప్పై మంది మంచి వారు ఉంటే కాపాడుతారా?""ముప్పై మంది ఉన్నా అలాగే చేస్తాను"
"ఇరవై మంది మంచి వారు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతారా?""ఇరవై మంది కోసం ఆగ్రహించను"
"పదిమంది మంచి వారుంటే ఆ పట్టణాన్ని కాపాడుతారా?""ఆ పదిమంది కోసమైనా ఆ పట్టణాన్ని నాశనం చేయను"

దేవుడు ఎంత కరుణామయుడంటే, అంత పెద్ద పట్టణంలో కేవలం పదిమంది నీతిమంతులు ఉన్నా ఆ పదిమంది కోసం మొత్తం పట్టణాన్ని కాపాడటానికి సిద్ధపడ్డాడు. కానీ విచారకరంగా అక్కడ పదిమంది కూడా దొరకలేదు. అబ్రహాము అడిగిన ఆ యాభై మంది, నలభై మంది, ముప్ఫై మంది, ఇరవై మంది, పది మంది మంచి వారు క్రైస్తవులు  మనమై  ఉండాలి. మన ప్రార్థన, మన నీతి, మన భక్తి ఈ లోకాన్ని దేవుని తీర్పు నుండి కాపాడేవిగా ఉండాలి. ఈ లోకము నాశనము కాకుండా ఉండటానికి క్రైస్తవునిగా మనం మన బాధ్యత నిర్వర్తించాలి. మన ఇంట్లో, మన వీధిలో, మన దేశంలో మనం జీవించే నీతివంతమైన జీవితం వల్లే ఆయా ప్రాంతాలపై దేవుని ఆశీర్వాదం నిలిచి ఉంటుంది. ఇది క్రైస్తవునిగా మన కర్తవ్యం.

లూకా సువిశేష దృక్పథం: భూమికి సారం ఇవ్వడం

లూకా సువిశేషంలో ఉప్పు భూమికి సారం ఇవ్వుటకు వాడటం జరుగుతుంది (లూకా 14:34-35). ప్రాచీన వ్యవసాయంలో ఉప్పును తగిన మోతాదులో ఎరువుగా వాడేవారు. అది భూమిలో మంచివి పెరిగే విధంగా చెడును పెరగకుండా చేస్తుంది. మట్టిలో ఉండే హానికరమైన పురుగులు, కలుపు మొక్కల వేళ్లు కుళ్లిపోయేలా చేసి, ప్రధాన పంట ఆరోగ్యంగా పెరగడానికి ఉప్పు సహాయపడుతుంది.

క్రైస్తవులు మంచిని లోకంలో పెంచుటకు మరియు చెడును పెరగకుండా చేయుటకు ఉపయోగపడాలి. మనం ఎక్కడ ఉంటే అక్కడ ప్రేమ, సంతోషం, సమాధానం అనే మంచి గుణాలు మొలకెత్తాలి. ద్వేషం, అసూయ, కలహాలు అనే కలుపు మొక్కలు నశించిపోవాలి. మానవ జీవితానికి నిజమైన మానవత్వాన్ని పరిచయం చేసేటువంటి బాధ్యత క్రైస్తవునిది. నేటి లోకంలో సాంకేతికత పెరిగింది కానీ మానవత్వం కరువైంది. మనుషులు యంత్రాల్లా మారిపోతున్నారు. ఇటువంటి తరుణంలో యేసు క్రీస్తు జీవించిన విధంగా జీవించుట ద్వారా మానవత్వానికి దైవిక విలువలు చేరుస్తూ మానవత్వానికి అమరత్వాన్ని చూపిస్తుంది, మరియు పాలుపంచుకొనేలా చేస్తుంది. క్రీస్తు చూపిన నిస్వార్థ ప్రేమను, త్యాగాన్ని మనం సమాజానికి చూపించినప్పుడు, ఈ లౌకిక మానవత్వం దైవిక మానవత్వంగా రూపాంతరం చెందుతుంది. ఇది నిజానికి క్రైస్తవ జీవిత ఔన్నత్యం గురించి ఇది తెలుపుతుంది.

లోకమునకు వెలుగైయుండుట: సత్కార్యముల ద్వారా దేవుని మహిమపరచడం

"మీరు లోకమునకు వెలుగైయున్నారు. కొండపై కట్టబడిన పట్టణము మరుగైయుండ జాలదు. ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు, మీ వెలుగును వారి యెదుట ప్రకాశింపనిండు."

ఒక పర్వతం మీద కట్టబడిన పట్టణం దాచబడలేదు. రాత్రి వేళల్లో కొండపై ఉన్న పట్టణంలోని దీపాల వెలుగులు మైళ్ల దూరం నుండి స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే, క్రైస్తవ జీవితం రహస్యంగా దాగుండేది కాదు, అది సమాజం మధ్యలో స్పష్టంగా కనిపించే సాక్ష్యం. మీ కాంతిని ఇతరుల ముందు ప్రకాశింప నిండు అప్పుడు వారు మీ మంచి పనులను చూసి పరలోకమున ఉన్న మీ తండ్రిని మహిమ పరుస్తారు. ఏమిటి ఈ మాటల యొక్క అర్ధం?

ప్రభువు వెలుగు గురించి చెబుతున్నప్పుడు వాని యొక్క అర్ధము, మనము ఈ లోకమునకు వెలుగుగా ఉన్నాము అని అంటే వెలుగు మనకు కాంతిని ఇవ్వడమేకాదు, మనం ఎటువంటి అపాయములలో చిక్కుకొనకుండా ఉండుటకు ఉపయోగ పడుతుంది. చీకటిలో నడిచేవానికి ఎక్కడ గోయ్యి ఉందో, ఎక్కడ రాయి ఉందో తెలియదు. వాడు తడబడి పడిపోతాడు. కానీ వెలుగు ఉంటే అపాయాల నుండి తప్పించుకోవచ్చు. క్రైస్తవుని జీవితం ఇతరులు ఎవరు అపాయమునకు గురికాకుండా చేస్తుంది. ఎందుకు అంటే ఎలా ప్రయాణించాలో క్రైస్తవుడు వెలుగులో ఉండుటవలన అతనికి తెలుస్తుంది. క్రీస్తు అనే వెలుగును పొందిన క్రైస్తవునికి ఏది పాపమో, ఏది పుణ్యమో, ఏ మార్గం పరలోకానికి నడిపిస్తుందో స్పష్టమైన అవగాహన ఉంటుంది. పాపం అనే అంధకారంలో పడిపోకుండా లోకాన్ని కాపాడవలసిన బాధ్యత, ఇతరులను హెచ్చరించ వలసిన బాధ్యత క్రైస్తవుని మీద ఉంది. మనం సమాజానికి నైతిక దిక్సూచిలా  నిలబడాలి.

క్రీస్తు వెలుగుకు ప్రతిబింబాలుగా మారడం

యేసు ప్రభువు "నేనే ఈ లోకానికి వెలుగును" (యోహాను 8:12) అని చెబుతున్నారు. అలానే అయన శిష్యులు కూడా ఈలోకానికి వెలుగు వలె ఉన్నారు అని చెబుతున్నారు. చంద్రునికి స్వయం ప్రకాశం లేదు, అది సూర్యుని వెలుగును పొంది భూమిపైకి ప్రతిబింబిస్తుంది. అలాగే క్రైస్తవునికి స్వంత వెలుగు లేదు; క్రీస్తు అనే సూర్యుని నుండి వెలుగును పొంది, ఈ చీకటి లోకంలో ఆ వెలుగును ప్రతిబింబింపజేయాలి. ఈ మాటలకు అర్ధం ఏమిటి అంటే మనం ఆయన వలె జీవించాలసిన ఆవశ్యకత ఉంది అని మనం నేర్చుకోవాలి.

ఆయన ఏ విధంగా మనకు వెలుగు అంటే యేసు ప్రభువు దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు వారి జీవితం గురించి పూర్తిగా తెలుసుకుంటున్నారు. సమరయ స్త్రీ యేసు వద్దకు వచ్చినప్పుడు ఆమె అంతరంగ జీవితం వెలుగులోనికి వచ్చింది. పాపాత్ముడైన జక్కయ్య యేసును చూసినప్పుడు తన తప్పులను తెలుసుకుని, నష్టపరిచిన వారికి నాలుగింతలు తిరిగి ఇస్తానని ఒప్పుకున్నాడు. వారి జీవితాలు వారి ముందే కనపడుతున్నాయి. యేసు అనే వెలుగు ముందు ఏ కపటము, ఏ దాపరికం నిలువలేదు. మరియు వారి గురించి తెలుసుకున్నవారు పూర్తిగా ఎలా జీవించాలో యేసు ప్రభువు ద్వారా తెలుసు కుంటున్నారు. కనుక మనం ఇతరులకు వారి జీవితాలు ఎలా ఉన్నాయో చెప్పేలా, వారు ఎలా జీవించాలో తెలిపేలా మన జీవితాలు ఉండాలి. మనల్ని చూసినప్పుడు ఇతరులు తమ తప్పులను సరిదిద్దుకుని, సన్మార్గంలో నడిచేలా మన బ్రతుకులు ఒక ఆదర్శంగా మారాలి.

ముగింపు: క్రైస్తవ జీవిత ఔన్నత్యం – మార్గదర్శకత్వం

ఈ సువిశేష భాగం మనకు క్రైస్తవ ఔన్నత్యాన్ని మనకు తెలియజేస్తుంది. కనుక మొదటిగా క్రీస్తు అనుచరులు క్రీస్తు వలె జీవించడం నేర్చుకోవాలి. క్రైస్తవులు వారి యొక్క జీవిత విధానాన్ని ఇతరులకు సుమాతృకలుగా ఉండేలా చేయాలి. ఇతరులు ఎలా జీవించాలి అని నేర్చుకునే విధముగా క్రైస్తవ జీవితాలు ఉండాలి. మాటల ద్వారా సువార్త చెప్పడం కంటే, మన చేతల ద్వారా, మన నడవడిక ద్వారా క్రీస్తును చూపించడం మిన్న.

క్రైస్తవుడుని చూచి లోకం క్రీస్తును తెలుసుకోవాలి  క్రైస్తవులు వారి జీవిత విధానం ద్వారా ఇతరులకు మార్గ చూపరులుగా ఉండాలి. నిరాశలో ఉన్నవారికి నిరీక్షణను, దిక్కులేని వారికి ఆదరణను చూపిస్తూ ముందుకు సాగాలి.

నిజమైన ఆధ్యాత్మిక చింతన వైపు ప్రజలను మార్చవలసిన గొప్ప బాధ్యత క్రైస్తవుల మీద ఉన్నది. ఇది ప్రతి క్రైస్తవుని కర్తవ్యం. మనము కేవలం వెలుగు మాత్రమే కాదు, ఇతరులకు మన వెలుగు చూపించవలసిన వాళ్ళము. అంటే మన మంచి పనులను చూసి ఇతరులు దేవుని తెలుసుకొనే విధంగా మన పనులు ఉండాలి. మన సత్కార్యాలు లోకంలో ప్రశంసలు పొందడానికి కాదు, పరలోకమందున్న తండ్రికి మహిమ తేవడానికి ఉపయోగపడాలి. వాని ద్వారా వారు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. కనుక ఆ విధంగా జీవించుటకు ప్రయత్నించుదాం. మనల్ని భూమికి ఉప్పుగా, లోకానికి వెలుగుగా చేసిన ఆ పరమతండ్రి చిత్తాన్ని మన దైనందిన జీవితాల్లో నెరవేరుస్తూ, ఈ సమాజాన్ని దైవిక మార్గంలో నడిపిద్దాం.

Fr. Amruth

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబిల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పవిత్రుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

📲 మా WhatsApp Channel జాయిన్ అవ్వండి!

ప్రతి నిత్య పోస్ట్ మీ WhatsApp కు నేరుగా వస్తుంది

Join WhatsApp Channel

Comments

మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:

Post a Comment

కామెంట్‌లు