యేసు ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన అంతరార్థం | మత్తయి 6:7-15 ధ్యానం

మత్తయి 6:7-15 

సువిశేషం: అన్యులవలె అనేక వ్యర్ధపదములతో మీరు ప్రార్ధింపవలదు. అటుల చేసినగాని, దేవుడు తమ మొరనాలకింపడని వారు భావింతురు. కాబట్టి వారి వలె మీరు మెలగరాదు. మీకేమి కావలయునో మీరడుగక మునుపే మీ తండ్రి ఏరిగియున్నాడు. మీరిట్లు ప్రార్ధింపుడు:  పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పవిత్రపరుపబడునుగాక! నీ రాజ్యము వచ్చునుగాక!నీ చిత్తము పరలోక మందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక! నేటికీ కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు, మా అప్పులను క్షమింపుము. మమ్ము శోధనలో చిక్కుకొననీయక, దుష్టుని నుండి రక్షింపుము. పరులు చేసిన దోషములను  మీరు క్షమించిన యెడల, పరలోక మందలి, మీ తండ్రి , మీ దోషములను క్షమించును. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపనియెడల మీ తండ్రి మీ తప్పులను క్షమింపడు. 

ఈనాటి సువిశేషంలో యేసు ప్రభువు తన శిష్యులకు, అలాగే నేటి క్రైస్తవ సమాజానికి అత్యంత ప్రాముఖ్యమైన "ప్రార్థనా విధానాన్ని" నేర్పిస్తున్నారు. ప్రార్థన అనేది కేవలం కొన్ని పదాల కలయిక కాదు, అది సృష్టికర్త అయిన దేవునితో సృష్టించబడిన మానవుడు జరిపే ఆత్మీయ సంభాషణ. అయితే, నాటి కాలంలో ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, మరియు అన్యులు ప్రార్థనను ఒక ప్రదర్శనగా మార్చివేశారు. భగవంతునితో దగ్గరవడం కంటే, సమాజంలో తమ భక్తిని చాటుకోవడానికే వారు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే, యేసు ప్రభువు ప్రార్థన యొక్క నిజమైన రూపాన్ని, దాని వెనుక ఉండవలసిన హృదయ స్థితిని చాలా స్పష్టంగా వివరించారు.

వ్యర్థ పదాల ఆడంబరం 

యేసు ప్రభువు తన శిష్యులను హెచ్చరిస్తూ, "అన్యుల వలె వ్యర్థ పదములతో మీరు ప్రార్థింపవద్దు" అని చెబుతున్నారు. అన్యులు లేదా దేవుని గూర్చిన సరైన జ్ఞానం లేనివారు ఎందుకు పెద్ద పెద్ద మాటలతో, సుదీర్ఘమైన వర్ణనలతో ప్రార్థిస్తారంటే, దేవునికి ముఖస్తుతి  ఇష్టమని వారు భావిస్తారు. మానవ సహజ సిద్ధమైన స్వభావం ఏమిటంటే, ఎవరైనా మనలను ఎక్కువగా పొగిడితే మనం ఉబ్బిపోయి, వారు అడిగినది ఇచ్చేస్తాం. అన్యులు దేవుడిని కూడా అలాగే భావించారు. చాలా అందమైన పదజాలాన్ని, క్లిష్టమైన భాషా ప్రావీణ్యాన్ని వాడితేనే దేవుడు ప్రసన్నుడు అవుతాడని భ్రమపడ్డారు.

కానీ, సత్యదేవునికి ఇటువంటి బాహ్య ఆడంబరాలు ఇష్టం ఉండవు. దేవుడు మన వేడుకోలును ఆలకించాలి అంటే మనకు కావలసినది భాషా ప్రావీణ్యం కాదు, పొగుడుటలో పట్టాలు అంతకంటే కాదు. దేవుడు ఆశించేది హృదయ నిర్మలతను,  యథార్థతను మాత్రమే. ఈ లోకం యొక్క మెప్పును పొందాలి అనుకునేవారు, దేవుని ప్రేమను  సరిగా అర్థం చేసుకోనివారు మాత్రమే ప్రదర్శనాపూర్వక ప్రార్థనలు చేస్తారు. యేసు ప్రభువు తన శిష్యులు అటువంటి అజ్ఞానంలో ఉండకూడదని ఆశించారు.

సర్వజ్ఞుడైన తండ్రి 

"మీకు ఏమి కావలయునో మీరు అడుగక మునుపే మీ తండ్రి ఎరిగియున్నాడు."

ఈ వాక్యం ప్రార్థనలో మనకు లభించే అతిపెద్ద ధైర్యం. మన దేవుడు మన అవసరాలన్నీ ఎరిగిన సర్వజ్ఞుడు. మనం ఎదుర్కొంటున్న కష్టసుఖాలు, గుండెల్లో దాచుకున్న బాధలు, పెదవుల దాకా రాని కన్నీళ్లు అన్నీ ఆయనకు ముందే తెలుసు. అయినప్పటికీ, చాలాసార్లు మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవునికి మన అవసరాలు ఏవీ తెలియవు అన్నట్లు, ఆయనకు ఏదో కొత్తగా సమాచారం అందిస్తున్నట్లు ప్రవర్తిస్తుంటాం. ఒకే విషయాన్ని పదే పదే చెప్తూ, దేవుడిని ఒప్పించడానికి ప్రయత్నిస్తుంటాం.

 ఏలియా మరియు బాలు ప్రవక్తలు

పాత నిబంధనలో ఏలియా ప్రవక్త, బాలు ప్రవక్తలతో గొడవ పడినప్పుడు (రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం) సరిగ్గా ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది. బాలు ప్రవక్తలు తమ దేవతను ప్రసన్నం చేసుకోవడానికి ఉదయం నుండి సాయంత్రం వరకు అరుస్తూ, తమనుతాము కత్తులతో గాయపరుచుకుంటూ వ్యర్థ పదాలతో ప్రార్థిస్తుంటారు. అప్పుడు ఏలియా వారిని హేళన చేస్తూ, "మీ దేవర నిద్రపోతున్నదేమో, లేదా ప్రయాణంలో ఉన్నాడేమో ఇంకా పెద్దగా అరవండి" అని అంటాడు.

మన దేవుడు అటువంటి ఇతర దేవరల వలె మూగవాడు, చెవిటివాడు కాదు. ఆయన మనలను కంటికి రెప్పలా కాపాడే తండ్రి. మనం ఎల్లప్పుడూ ఆయన కనుసన్నలలోనే ఉంటాము. దేవునికి నీ అవసరం తెలుసు, నీ హృదయంలోని కోరిక తెలుసు, అలాగే నిన్ను ఏ సమయంలో ఎంత పరీక్షించాలో, ఎప్పుడు ఏది అనుగ్రహించాలో కూడా ఆయనకు పూర్తి అవగాహన ఉంది.

పరలోక ప్రార్థన: ఒక ఆత్మీయ నమూనా

యేసు ప్రభువు నేర్పిన ప్రార్థన కేవలం పఠించడానికి ఇచ్చిన మంత్రం కాదు, అది మన జీవితాలు ఎలా ఉండాలో నిర్దేశించే ఒక దివ్య నమూనా.

1. పరలోకమందున్న మా తండ్రి!

ఇక్కడ యేసు ప్రభువు సృష్టికర్త అయిన దేవుడిని మనకు "తండ్రి"గా పరిచయం చేస్తున్నారు. ఇది ఒక గొప్ప భాగ్యం. దేవుడు ఎక్కడో భయంకరమైన దూర తీరాలలో ఉంటూ, భయపెట్టే వ్యక్తి కాదు. ఆయన మనతో సత్సంబంధాన్ని కోరుకునే ప్రేమామయుడైన తండ్రి. ఆయన పరలోకంలో ఉన్నారు అనడంలో అర్థం ఏమిటంటే, ఆయన చిత్తం ఎల్లప్పుడూ అక్కడ పరిపూర్ణంగా నెరవేర్చబడుతుంది. ఎక్కడైతే దేవుని చిత్తం నెరవేర్చబడుతుందో, అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది.

2. నీ నామము పవిత్రపరచబడును గాక!

దేవుని నామమును ఎల్లప్పుడూ పవిత్రపరచాలని మనం ప్రార్థించాలి. దేవుని నామమును అపవిత్రం చేయడం అంటే కేవలం నోటితో దూషించడం మాత్రమే కాదు; దేవుని స్థానంలో మరొక దాన్ని ఉంచడం. దేవునిచే సృష్టించబడిన సృష్టిని (ధనం, కీర్తి, విగ్రహాలు, లోక ఆశలు) దేవునిగా ఆరాధించినప్పుడు ఆయన నామము అపవిత్రం అవుతుంది. మన అనుదిన జీవిత సాక్ష్యం ద్వారా ఆయన నామమునకు మహిమ రావాలి.

3. నీ రాజ్యము వచ్చును గాక! నీ చిత్తము నెరవేరును గాక!

యేసు ప్రభువు బోధనలన్నింటిలో "దేవుని రాజ్యం" కేంద్రబిందువు. ఏమిటి ఈ దేవుని రాజ్యం?

  • ఇది భౌతిక సరిహద్దులున్న రాజ్యం కాదు.

  • ఎటువంటి అసమానతలు, కులమత భేదాలు, పేద ధనిక తారతమ్యాలు లేని రాజ్యం.

  • అందరూ సోదర భావంతో మెలగే ప్రేమ రాజ్యం.

  • ఒకరినొకరు క్షమించుకుంటూ, ఆదరించుకుంటూ, ప్రతి నిత్యం దైవ సాన్నిధ్యాన్ని అనుభవించే రాజ్యం.

ఇటువంటి దైవిక రాజ్యం ఈ భూలోకంలో రావాలని మనం ప్రార్థించాలి. ఈ రాజ్యాన్ని స్థాపించడానికే యేసు ప్రభువు ఇహలోకంలో జన్మించి, పరిచర్య చేసి, కల్వరి సిలువపై ప్రాణ త్యాగం చేశారు. అందుకే ఆయన "దేవుని రాజ్యం సమీపించినది, మారుమనస్సు పొందుడి" అని చాటారు. ఎప్పుడైతే భూలోకంలో కూడా దేవుని చిత్తం పూర్తిగా నెరవేర్చబడుతుందో, అప్పుడు ఈ భూలోకం కూడా పరలోకం లాగే మారుతుంది. దేవుని చిత్తం జరిగే చోట స్వార్థానికి తావుండదు; అక్కడ నీ అవసరాలు, కోరికలు ఏవీ కూడా కష్టమైనవి కావు, ఎందుకంటే సమస్తం దైవ క్రమంలో సజావుగా సాగిపోతాయి.

మానవ అవసరాలు మరియు సామాజిక బాధ్యతలు

దేవుని రాజ్యం, ఆయన చిత్తం గురించి ప్రార్థించిన తరువాత మాత్రమే, యేసు ప్రభువు మన భౌతిక, సామాజిక అవసరాల వైపుకు ప్రార్థనను మళ్లిస్తున్నారు. ఇది మన ప్రాధాన్యతలు ఎలా ఉండాలో నేర్పుతుంది (మొదట దేవుని నీతిని, రాజ్యాన్ని వెదకాలి).

అనుదిన ఆహారము

"నేటికీ కావలసిన మా అనుదిన ఆహారమును మాకు దయచేయుము" అని ప్రార్థించడంలో ఒక ఆత్మీయ రహస్యం ఉంది. ప్రభువు మనల్ని రాబోయే సంవత్సరాల కోసం, తరాల కోసం ఆస్తులు కూడబెట్టుకోమని అడగమనలేదు. కేవలం "నేటికీ" కావలసిన ఆహారం అడగమన్నారు. ఇది దేవునిపై మనకున్న సంపూర్ణ ఆధారపడే తత్వాన్ని  సూచిస్తుంది. అరణ్యంలో ఇశ్రాయేలీయులకు దేవుడు రోజువారీ మన్నాను ఇచ్చినట్లు, ప్రతిరోజూ మనం దేవుని కృపపై ఆధారపడాలి.

క్షమాపణ – పరస్పర సంబంధం

మన భౌతిక అవసరముల కోసం ప్రార్థన చేసిన తరువాత, ప్రభువు మనకు చెప్పేది సమాజంలో మనం జీవించే తీరు గురించి.

"మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు, మా అప్పులను క్షమింపుము."

ఇక్కడ ఒక కఠినమైన షరతు ఉంది. మనం ఇతరుల పట్ల ఏ విధముగా ప్రవర్తిస్తున్నామో, మన పట్ల కూడా అదేవిధముగా ప్రవర్తించమని మనం దేవుడిని అడుగుతున్నాం. నీవు ఇతరులను క్షమించకుండా, ఇతరులపై పగ, కక్షలు కార్పణ్యాలు పెట్టుకుని, దేవుని నుండి మాత్రం క్షమాపణను, ప్రేమను ఆశించకూడదు. పరులు చేసిన దోషములను మీరు క్షమించిన యెడల, పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించును; మీరు క్షమింపని యెడల ఆయన కూడా క్షమించడు అని యేసు చాలా స్పష్టంగా, ఖచ్చితంగా హెచ్చరించారు. క్షమాపణ లేని హృదయంలో దేవుని రాజ్యం విస్తరించలేదు.

శోధనల నుండి రక్షణ

"మమ్ము శోధనలో చిక్కుకొననీయక, దుష్టుని నుండి రక్షింపుము." ఈ లోకంలో జీవిస్తున్నంత కాలం మనకు శరీర ఆశలు, నేత్రాశలు, జీవపు డంబం వంటి అనేక శోధనలు ఎదురవుతూనే ఉంటాయి. సాతాను (దుష్టుడు) మనల్ని దేవునికి దూరం చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తుంటాడు. మన సొంత బలంతో ఈ శోధనలను జయించడం అసాధ్యం. చరిత్రలో ఎంతో మంది గొప్ప భక్తులు, రాజులు సైతం ఈ లోక ఆశలకు లోనై, శోధనలలో పడిపోయి దేవుడిని విడనాడారు; ఫలితంగా ఆయన అనుగ్రహాలను, ఆశీర్వాదాలను కోల్పోయారు. అందుకే, ఆ శోధనల లోనికి పడిపోకుండా కాపాడగలిగే దైవిక శక్తి కోసం మనం నిరంతరం ప్రార్థించాలి.

యేసు ప్రభువు నేర్పిన ఈ ప్రార్థన కేవలం పెదవుల నుండి వచ్చే పదాల సమూహం కాదు, ఇది హృదయ రూపాంతరానికి మార్గం. ప్రార్థనలో భాషా సౌందర్యం కంటే హృదయ నైర్మల్యం ముఖ్యమని, స్వార్థపూరిత కోరికల కంటే దేవుని చిత్తం ప్రాధాన్యమైనదని ఈ సువిశేష భాగం మనకు గుర్తుచేస్తోంది. ఇతరులను క్షమిస్తూ, దేవుని చిత్తానికి మనల్ని మనం సమర్పించుకున్నప్పుడే మన ప్రార్థనలు పరలోక తండ్రి సన్నిధికి చేరతాయి.

ప్రార్ధన : ప్రభువా! పరలోక ప్రార్దన ద్వారా మేము ఏమి కోరుకోవాలో, ఏమి కోరుకోకూడదో తెలియజేస్తున్నారు ప్రభువా. దేవా!మీ చిత్తమునే ఎల్లప్పుడు ఈ లోకంలో మేము కోరుకునే విధముగా మమ్ము దీవించండి. అనేక సార్లు మేము అన్యుల వలె అనేక వ్యర్ధ పదాలతో ప్రార్దన ఇతరుల కంట పడాలి అని, మేము బాగా ప్రార్ధన చేస్తాము అని అనిపించుకోవాలని ప్రార్దన చేసిన సమయాలు ఉన్నవి ప్రభువా, అటువంటి క్షణాలలో మమ్ములను క్షమించండి. వాక్యంలో చెప్పబడిన విధముగా మొదట దేవుని చిత్తమును వెదికే వారీగా మమ్ము దీవించండి.   మీ చిత్తమును నెరవేర్చిన తరువాత ప్రభువా, మేము మీ రాజ్యమునకు అర్హులము అవుతాము. మీ చిత్తములో క్షమాపణ ఉంది. మీ చిత్తమును నెరవేర్చువాడు. ఇతరులను క్షమిస్తాడు. ప్రేమిస్తాడు. మీ కరుణకు పాత్రుడు అవుతాడు. మమ్ములను మీ చిత్తము నెరవేర్చేవారిగా చేసి , మీ రాజ్యంలో చేర్చుకోనండి. ఆమెన్. 

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబిల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పవిత్రుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

📲 మా WhatsApp Channel జాయిన్ అవ్వండి!

ప్రతి నిత్య పోస్ట్ మీ WhatsApp కు నేరుగా వస్తుంది

Join WhatsApp Channel

Comments

మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:

Post a Comment

కామెంట్‌లు