మత్తయి 8: 23-27 - యేసు చెంతవుంటే నిచ్చింతగా ఉండవచ్చు | కార్మెల్ శోభ
మత్తయి 8: 23-27
అంతట యేసు పడవ నెక్కగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. హఠాత్తుగా గాలి వాన క్రమ్మి, పడవను ముంచెత్తు నంతటి అలలు ఆ సముద్రములో చెలరేగెను. ప్రభువు ఆ సమయమున నిదురించుచుండెను. అప్పుడు శిష్యులు ఆయనను మేలుకొలిపి "ప్రభూ ! మేము నశించుచున్నాము. రక్షింపుము" అని ప్రార్ధింపగ, యేసు వారితో "ఓ అల్ప విశ్వాసులారా !మీరు భయపడెదరేల ?" అని పలికి , లేచి గాలిని , సముద్రమును గద్దించెను . వెంటనే ప్రశాంతత చేకూరెను. గాలి , సముద్రము సైతము ఈయన ఆజ్ఞకు లోబడినవి. ఈయన ఎంతటి మహానుభావుడు! అని జనులు ఆశ్చర్యపడిరి.
1. తుఫాను తీవ్రత - శిష్యుల భయము వెనుక ఉన్న గంభీరమైన సత్యం
యేసు ప్రభువు శిష్యులు పడవలో ప్రయాణం చేస్తున్నారు. ప్రభువు నిద్రపోతున్నారు. హఠాత్తుగా గాలి వాన క్రమ్మి, పడవను ముంచెత్తింది. సముద్రములో అలలు చెలరేగాయి. అక్కడ ఉన్నటువంటి శిష్యులు అందరు భయ పడుతున్నారు. ఎందుకు ఈ శిష్యులు అందరు భయపడుతున్నారు? వారు ఏమి సముద్రం గురించి తెలియని వారు కాదు. వీరిలో ఎక్కువ మంది చేపలు పట్టేవారు. ఈత తెలిసిన వారు. సముద్రం గురించి, దాని ప్రవర్తన గురించి పూర్తిగా తెలిసిన వారు. గలిలయ సముద్రంలో ఎప్పుడు ఎలాంటి వాతావరణం మారుతుందో, ఎప్పుడు గాలులు వీస్తాయో వారికి దశాబ్దాల అనుభవం ఉంది. అయినా సరే, వారు భయపడుతున్నారు అంటే దానికి కారణం లేకపోలేదు.
ఎందుకంటే ఆ అలలు చాలా భయంకరమైనవి. వారు అంతకు ముందు తమ జీవితంలో ఎన్నడూ చూడనివి కావచ్చు. ఆ అలల తీవ్రతను బట్టి, ఆ గాలి వేగాన్ని బట్టి వారు దానిని ఒక సాధారణమైన తుఫాను కాదు అని అంచనా వేశారు. సాధారణంగా వచ్చే సుడిగాలులు లేదా వర్షాలను వారు తమ సొంత నైపుణ్యంతో, పడవను నడిపే చాకచక్యంతో తట్టుకోగలరు. కానీ ఈ సారి ప్రకృతి సృష్టించిన బీభత్సం వారి మానవ మేధస్సుకు, వారి శారీరక శక్తికి మించినదిగా ఉంది. పడవ నీటితో నిండిపోతోంది, మునిగిపోయే సమయం ఆసన్నమైంది.
అందుకే వారు యేసు ప్రభువు దగ్గరకు వచ్చారు. సముద్రములో చెలరేగిన ఈ అలలు ఇప్పుడు కేవలం పడవకు మాత్రమే కాదు, వారి జీవితములోనే పెద్ద కల్లోలంగా మారి చెలరేగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వారు ఏమి చేయాలో వారికి తెలియదు. మానవ ప్రయత్నాలన్నీ విఫలమైన క్షణమది. వారు చనిపోతారో, బ్రతుకుతారో తెలియదు. మరణం వారి కళ్లముందు కదలాడుతోంది. వారు యేసు ప్రభువును చూస్తున్నారు. ఆయన ప్రశాంతంగా నిద్రిస్తున్నారు. ఆయన దగ్గరకు వెళ్ళి తమ గురువుకు తాము అనుభవిస్తున్న పరిస్థితిని ఎలా తెలియచేయాలా అని వారు ఒక సందిగ్ధ అవస్థలో ఉన్నారు. ఒకవైపు మరణ భయం, మరోవైపు గురువును నిద్రలేపాలనే తపన వారిని కుదిపేసాయి.
మన జీవితంలో కూడా ఒక్కోసారి మనం ఎంతో అనుభవం ఉన్న రంగాల్లోనే సమస్యలు వస్తుంటాయి. ఆర్థిక విషయాలు కావచ్చు, కుటుంబ సంబంధాలు కావచ్చు, మన ఉద్యోగ వ్యాపారాలు కావచ్చు, మనం తట్టుకోగలము అనుకున్న సమస్యలు ఒక్కోసారి మన శక్తికి మించి ఉప్పెనలా ముంచెత్తుతాయి. అప్పుడు శిష్యులలాగే మనకు కూడా ఏమి చేయాలో తోచని సందిగ్ధ పరిస్థితి ఏర్పడుతుంది.
2. ఆపత్కాలంలో మొర - "రక్షింపుము, మేము నశించుచున్నాము"
"ఆయనను మేలుకొలిపి, ప్రభూ ! మేము నశించుచున్నాము. రక్షింపుము అని" చెబుతున్నారు. ఇక్కడ శిష్యులు చాలా వరకు వారి వాస్తవ పరిస్థితిని అంచనా వేసి, యేసు ప్రభువు దగ్గరకు వెళుతున్నారు. వారి జీవితం ముగుస్తుంది అని వారు అనుకుంటున్నారు. ఈ పరిస్థితిలో వారిని దేవుడు తప్ప ఇంకా ఎవరు కాపాడలేరు అనే పరమార్థాన్ని వారు ఆలస్యంగానైనా గ్రహించారు. ఎందుకంటే వారికి తుఫాను గురించి బాగా తెలుసు. సముద్రం గురించి తెలుసు. ఎప్పుడు సముద్రం తీవ్ర రూపం దాల్చుతుందో, ఎప్పుడు అది మనుషులను బలితీసుకుంటుందో వారికి తెలుసు. వారి వృత్తిపరమైన జ్ఞానం మాత్రమే ఇక్కడ పని చేస్తుంది, కాని వారు ఎవరుతో ఉన్నారు అనే విషయాన్ని మార్చి పోయారు.
ఈ భయానక పరిస్థితిలో వారు జీవించడానికి యేసు ప్రభువు తప్ప ఇంకా ఎవరు వారిని కాపాడలేరు. వారు నాశనం చెందకూడదు అనుకున్నారు. వెంటనే వారు ప్రభువు దగ్గరకు వచ్చారు. మమ్ములను రక్షింపుము అని వేడుకుంటున్నారు. ఈ వేడుకోలులో వారి భయం, ప్రాణం మీద ఆశ అన్నీ అరచేతిలో పెట్టుకొని ఏమి అవుతుందో అని ఆందోళనతో, వణుకుతున్న హృదయాలతో ప్రభువు దగ్గరకు వెళ్లారు. వారిని ప్రభువు రక్షిస్తున్నాడు. ఎందుకంటే ఆయన కేవలం పడవలో ఉన్న ప్రయాణికుడు కాడు, సృష్టి మొత్తాన్ని తన హస్తాలలో ఉంచుకున్న సర్వాధికారి. సముద్రంను ఆయన శాసిస్తున్నాడు. ఆయన మాటను విని సముద్రం శాంతిస్తుంది.
శిష్యుల మొరలో రెండు కోణాలు ఉన్నాయి:
ఆందోళన: "మేము నశించిపోతున్నాము" అనే మాట వారిలో ఉన్న నిరాశను, భయాన్ని చూపిస్తుంది.
చివరి ఆశ: "రక్షింపుము" అనే పిలుపులో యేసు మాత్రమే తమను ఈ మరణ ముఖం నుండి తప్పించగలడనే నమ్మకం దాగి ఉంది.
మన జీవిత ప్రయాణంలో కూడా మనం అపాయంలో పడినప్పుడు, మన స్వయంశక్తి, సంపద, బంధుబలం ఏవీ మనల్ని రక్షించలేనప్పుడు, మనం కూడా శిష్యుల వలె "ప్రభూ, నన్ను రక్షించు!" అని ఆయన పాదాల చెంతకు చేరక తప్పదు.
3. "అల్ప విశ్వాసులారా!" ప్రభువు గద్దింపులోని అంతరార్థం
యేసు వారితో, "ఓ అల్ప విశ్వాసులారా ! మీరు భయపడెదరేల ?" అని అంటున్నారు. యేసు ప్రభువు వారిని 'అల్ప విశ్వాసులారా' అని ఎందుకు అంటున్నారు? వారు ప్రాణభయంతో ఆయనను రక్షించమని అడిగారు కదా, మరి విశ్వాసం లేకపోవడం ఏమిటి? ఇక్కడే మనం ఒక ముఖ్యమైన సత్యాన్ని గ్రహించాలి.
యేసు ప్రభువు చేసిన అనేక పనులకు వీరు సాక్షులు. అంతకుముందే ఆయన కుష్ఠ రోగులను స్వస్థపరచడం, పక్షవాత రోగిని నయం చేయడం, అనేకమంది దయ్యాలు పట్టిన వారిని విడిపించడం వీరు కళ్లారా చూశారు. సముద్రాన్ని, దాని అలలను అంచనా వేయగలిగిన వీరు, వారితో పాటు ఉన్నటువంటి యేసు ప్రభువు ఎవరు అని ఆధ్యాత్మికంగా గ్రహించలేక పోయారు. ఆయన కేవలం ఒక సాధారణ ప్రవక్త లేదా గురువు మాత్రమే కాదు, ఆయన సాక్షాత్తు దేవుని కుమారుడు, ప్రకృతిని సృష్టించిన సృష్టికర్త అనే విషయాన్ని వారు మరువకూడదు.
ఆయన మనతో ఉన్నంత కాలం మనకు ఎటువంటి అపాయం ఉండదు అని వారు గ్రహించలేకపోయారు. విశ్వాసం అంటే అనుకూల సమయాల్లో మాత్రమే దేవుడిని నమ్మడం కాదు, తుఫానులు చుట్టుముట్టినప్పుడు కూడా ఆయన మన పడవలో (జీవితంలో) ఉన్నాడనే ధైర్యంతో ఉండడం. కానీ శిష్యులు భయ పడుతున్నారు. యేసు ప్రభువు చేసిన అనేక అద్భుతమైన పనులను చూసికూడా వీరు క్లిష్ట సమయం వచ్చేసరికి ఆయన యందు పూర్తి విశ్వాసం ఉంచలేక పోయారు. ఆయన పడవలో నిద్రిస్తున్నప్పటికీ, ఆయన ఉనికి ఆ పడవను మునిగిపోనివ్వదు అనే నిశ్చయత వారిలో లోపించింది.పాత నిబంధనలో దావీదు మహారాజు "యావే నా కాపరి, నాకు లేమి కలుగదు... గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, తోడుగా నీవుందువు" అని ఎంతో ధీమాగా అంటున్నారు. యేసు ప్రభువు శిష్యులు కూడా అలానే ఉండాలి. ఆయన మనకు తోడుగా ఉంటే ఇక ఏ కొదవయు ఉండదు, ఏ తుఫాను మనల్ని ఏమీ చేయలేదు అని తెలుసుకోవాలి. ఇక్కడ అది జరుగుటలేదు. ఇది తెలుసుకోవాడంలో వారు విఫలం చెందారు కాబట్టే, యేసు ప్రభువు వారితో "ఓ అల్ప విశ్వాసులారా ! మీరు భయపడెదరేల ?" అని అంటున్నారు.
4. ప్రకృతిని శాసించిన పరమాత్ముడు - దైవత్వానికి నిదర్శనం
అప్పుడు యేసు ప్రభువు లేచి "గాలిని , సముద్రమును గద్దించెను . వెంటనే ప్రశాంతత చేకూరెను. గాలి , సముద్రము సైతము ఈయన ఆజ్ఞకు లోబడినవి. ఈయన ఎంతటి మహానుభావుడు! అని జనులు ఆశ్చర్యపడిరి."
గాలిని, సముద్రమును యేసు ప్రభువు ఒక్క మాటతో గద్దింపు చేయగా, అంతవరకు ఎగసిపడిన సముద్రము వెంటనే మహా ప్రశాంతత దాల్చింది. సాధారణంగా ఒక తుఫాను తగ్గిన తర్వాత కూడా సముద్రపు అలలు ప్రశాంతం కావడానికి చాలా సమయం పడుతుంది. కానీ ఇక్కడ యేసు ప్రభువు గద్దించగానే "వెంటనే" ప్రశాంతత చేకూరింది. ఇది యేసు ప్రభువు యొక్క పరిపూర్ణ దైవత్వాన్ని, ఆయన సృష్టికర్త అనే సత్యాన్ని జగద్విదితం చేస్తుంది.
ఇంతకు ముందు శిష్యులు యేసు ప్రభువు రోగులకు స్వస్థత ఇవ్వడం చూసారు, అద్భుతాలు చేయడం చూసారు. అవి మనుషుల శరీరాలకు లేదా వ్యాధులకు సంబంధించినవి. కానీ ఇక్కడ యేసు ప్రభువుకు ప్రకృతి కూడా లోబడుతుంది. ఆయన మాట వింటున్నది! పంచభూతాలలో ఒకటైన గాలి, అపారమైన జలరాశి కలిగిన సముద్రం ఆయన ఆజ్ఞకు లొంగిపోయాయి. ఆయన చెప్పినట్లు చేస్తున్నాయి.
అప్పుడు అది చూసిన వారు ఆశ్చర్యపడుతున్నారు. ఈయన ఎవరు? ఈయనకు ప్రకృతి కూడా మాట వింటున్నది అని వారు ఒకరితో ఒకరు అనుకుంటున్నారు. ఈ అద్భుతం ద్వారా శిష్యుల విశ్వాసం అల్ప విశ్వాసం నుండి దృఢ విశ్వాసంగా మారడానికి పునాది పడింది.
5. మన నిత్య జీవితానికి అన్వయం
ఇది నేటి మన ప్రతి ఒక్కరి జీవిత ప్రయాణానికి ప్రతిరూపం.
మన జీవిత పడవ: మన సంసారం, మన హృదయం, మన జీవితమే ఆ పడవ.
హఠాత్తుగా వచ్చే తుఫానులు: జీవితం సజావుగా సాగిపోతున్నట్లు అనిపిస్తున్నప్పుడే హఠాత్తుగా అనారోగ్యం, ఉద్యోగం కోల్పోవడం, ప్రియమైన వారి మరణం లేదా మానసిక ఒత్తిడి వంటి తుఫానులు మనల్ని ముంచెత్తుతాయి.
నిద్రిస్తున్నట్లుండే దేవుడు: మన ప్రార్థనలకు వెంటనే సమాధానం రానప్పుడు, దేవుడు మనల్ని పట్టించుకోవడం లేదు, ఆయన నిద్రిస్తున్నాడు అని మనం భావిస్తాము. కానీ ఆయన మనలను ఎన్నడూ విడువడు.
యేసు ప్రభువుతో మన జీవితంలో ఉన్నటువంటి అన్నీ సమస్యలు తీరుతాయి. ఆయన మనతో ఉంటే మనకు ఏ కొదవయు ఉండదు. సమస్యలు రావడం సహజం, కానీ ఆ సమస్యల కంటే మన పడవలో ఉన్న యేసు ప్రభువు గొప్పవాడు అని నమ్మడమే నిజమైన క్రైస్తవ జీవితం. అంతే కాదు, లోకము ఇవ్వలేని పరమ ప్రశాంతత మన జీవితంలో ఎల్లప్పుడు ఉంటుంది. ఆయన మన హృదయాలలో ఉంటే, బయట ఎన్ని తుఫానులు ఉన్నా, లోపల సమాధానం ఉంటుంది.
ప్రార్ధన : ప్రభువా! నా జీవితంలో అనేక సార్లు అనేక కల్లోలాలు వచ్చినవి అటువంటి సమయంలో నేను భయ పడి పోతున్నాను. నాకు నాశనము తప్పదు అని అనుకుంటున్నాను. నిరాశలో జీవిస్తున్నాను. నా జీవితంలో వచ్చే సమస్యలు నన్ను క్రమ్మేస్తున్నాయి. అప్పుడుకూడా నేను భయ పడుతున్నాను. నీవు నాకు తోడుగా ఉన్నావు అని తెలుసుకోలేక పోతున్నాను. నీవు నాకు తోడుగా ఉంటే నాకు ఏ కొదవయు ఉండదు అని తెలుసుకోలేకపోయాను. అటువంటి సమయంలో నన్ను క్షమించండి. నీవు నాకు తోడుగా ఉన్నవన్న విషయాన్ని నేను ఎల్లప్పుడు గుర్తుంచుకునే విధంగా దీవించండి. నా జీవితంలో వచ్చే అనేక అలలను ఎదుర్కోడానికి కావలసిన శక్తిని దయ చేయండి. మీ యందు పూర్తి విశ్వాసం కలిగి జీవించే వానిగా నన్ను చేయండి. ప్రభువా! నీవు సముద్రమును గద్దింపగా అది శాంతించింది. అటులనే నా జీవితంలో మీ మీద విశ్వాసం సన్నగిళ్ళే ప్రతి విషయాన్ని గద్దించండి. మీ మీద ఎప్పుడు విశ్వాసం ఉండే వానిగా చేయండి. ఆమెన్ .
Comments
మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:
Post a Comment