పక్షవాత రోగికి స్వస్థత – విశ్వాసం మరియు పాపక్షమాపణ | మత్తయి 9:1-8 ధ్యానం

మత్తయి 9: 1-8 

అంతట యేసు పడవనెక్కి, సరస్సును దాటి తన పట్టణమునకు చేరెను. అపుడు పడకపై పడియున్న పక్షవాత రోగిని ఒకనిని , కొందరు ఆయన యొద్దకు తీసికొనివచ్చిరి. వారి విశ్వాసమును గమనించి, ఆ రోగితో "కుమారా! ధైర్యము వహింపుము . నీ పాపములు పరిహరింపబడినవి" అని యేసు పలికెను. అపుడు ధర్మ శాస్త్ర బోధకులు కొందరు, "ఇతడు దైవ దూషణము చేయుచున్నాడు"అని తమలో తాము అనుకొనిరి. వారి తలంపులను గ్రహించిన యేసు , "మీకు ఈ దురభిప్రాయములు ఏల కలిగెను? నీ పాపములు మన్నింపబడినవనుటయా? లేక నీవు లేచి నడువమనుటయా? ఈ రెండింటి లోను ఏది సులభతరము ? ఈ భూమి మీద మనుష్య కుమారునకు పాపములను క్షమించు  అధికారము కలదని మీకిపుడే తెలియును" అని పలికి,  ఆ రోగితో "నీవు ఇక లేచి, నీ పడకను ఎత్తుకొని యింటికి  పొమ్ము" అనెను. అతడు వెంటనే లేచి తన  యింటికి పోయెను. అది చూచిన జనసమూహములు భయపడి మానవులకు ఇట్టి అధికారమును ఇచ్చిన దేవుని స్తుతించిరి. 

యేసుక్రీస్తు భూమిపై పరిచర్య చేసిన దినాలలో అనేక అద్భుతాలు, సూచక క్రియలు ప్రజలు  కండ్లారా చూశారు. ఆయన గలిలయ సముద్రమును దాటి కఫర్నాము అనే తన  పట్టణమునకు వచ్చినప్పుడు ఈ అద్భుత ఘట్టం చోటుచేసుకుంది. యేసు ప్రభువు కేవలం శారీరక రోగాలను నయం చేసే వైద్యుడు మాత్రమే కాదు, ఆయన మానవాళి ఆత్మలను రక్షించే విమోచకుడు అని నిరూపించడానికి ఈ పక్షవాత రోగి సంఘటన ఒక అద్భుతమైన నిదర్శనం. ఇక్కడ భౌతికమైన స్వస్థత కంటే ముందు ఆధ్యాత్మికమైన విముక్తికి ప్రాధాన్యత ఇవ్వబడింది.

విశ్వాసం యొక్క శక్తి మరియు ఇతరుల పట్ల బాధ్యత

యేసు ప్రభువు పడవ నెక్కి సరస్సు దాటిన తరువాత అవన్నీ పరిశీలిస్తున్న ప్రజలు ఆయన ఎక్కడకు వెళ్ళేది అంచనా వేసుకుంటున్నారు. అక్కడ నుండి ఆ పట్టణము వెళుతున్నాడని తెలుసుకుంటున్నారు. అక్కడ  కొంత మంది పడకపై పడియున్న పక్ష వాత రోగిని తీసుకొని వచ్చారు. అప్పుడు యేసు ప్రభువు "కుమారా ధైర్యం వహింపుము, నీ పాపములు పరిహరింపబడినవి" అని అంటున్నారు. యేసు ప్రభువు మాటలాడిన ఈ మాటలకు  అక్కడ ఉన్నవారు  దైవ దూషణ అని అంటున్నారు. అయితే ఆ పక్ష వాత రోగికి యేసు ప్రభువు ధైర్యాన్ని ఇస్తున్నాడు. నీ పాపములు పరిహరింపబడినవి అని అంటున్నారు. పాపము చేయడం అంటే అతను పాపమునకు బానిసగా ఉన్నాడు. కాని ఇప్పుడు ఆయన పాపము నుండి విముక్తి పొందబోవుతున్నాడు. అతను ఒక స్వతంత్రుడు అవుతున్నాడు. ఇక నుండి ఆయన బానిసగా ఉండడు. కనుక యేసు ప్రభువు ఆ వ్యక్తికి భయ పడ వలదు అని అంటున్నాడు. 

సాధారణంగా పక్షవాత రోగంతో బాధపడే వ్యక్తి, శారీరకంగా పూర్తిగా అశక్తుడు. కదలలేడు, మెదలలేడు, తన పనులను తాను చేసుకోలేడు. సమాజంలో ఇటువంటి వారి పరిస్థితి ఎంతో జాలిగొలిపేదిగా ఉంటుంది. అయితే, ఇక్కడ ఆ రోగికి కేవలం శారీరక బలహీనత మాత్రమే కాదు, అంతర్గతంగా మానసిక కుంగుబాటు, పాపభీతి కూడా ఉన్నట్లు యేసు ప్రభువు  గ్రహించాడు. అందుకే ఆయన మొదటి మాటగా "ధైర్యము వహింపుము" అని పలికాడు. భయం ఉన్న చోట విశ్వాసం పనిచేయదు. అందుకే యేసు ప్రభువు అతని హృదయంలోని భయాన్ని తొలగించి, ఆ తర్వాత అతనికి  పాప క్షమాపణను ప్రకటించాడు.

రోగి తన రోగంతోనే కాదు, తన సమాజం పట్ల కూడా ఆయనకు భయం ఉంది. అందరు ఆయనను పాపిగా పరిగణిస్తున్నారు మరియు ఆ విధంగా చూస్తున్నారు. యూదా సమాజంలో ఆ రోజుల్లో ఒక బలమైన నమ్మకం ఏమిటంటే  ఏదైనా పెద్ద రోగం వస్తే, అది వారు చేసిన పాపము వల్లనో లేదా వారి పితరుల పాపము వల్లనో సంభవించిందని భావించేవారు. ఈ సామాజిక ఆచారాలు, నిందలు ఆ రోగిని మానసికంగా మరింత కృంగదీశాయి. నలుగురిలోకి రావాలన్నా, సమాజంలో తల ఎత్తుకు తిరగాలన్నా అతనికి భయం వేసింది. దేవుడు తనను శపించాడనే భావన అతనిలో ఉండి ఉండవచ్చు. యేసు ప్రభువు మాత్రం ఆయన పాపములను పరిహరిస్తాను అని చెబుతున్నారు. దీని ద్వారా ఆ వ్యక్తికి సమాజం నుండి వచ్చే నిందల నుండి, అంతర్గత దోషభావన నుండి సంపూర్ణ విడుదల లభించింది. బానిసత్వపు సంకెళ్లు తెగిపోయి, అతనికి నూతన జీవన స్వేచ్ఛ లభించింది.

సానుభూతి మరియు నలుగురి విశ్వాసం 

యేసు ప్రభువు ఈ మాటలు మాట్లాడినది ఆ పక్షవాత రోగిని తీసుకొని వచ్చిన వారి విశ్వాసమును చూసి. ఎందుకు వీరి విశ్వాసం చూసి యేసు ప్రభువు మాటలాడుతున్నారు అంటే, వీరు వారి కోసం కాక అవసరంలో, అనారోగ్యంలో ఉన్న ఒక వ్యక్తిని, యేసు ప్రభువు స్వస్థత పరుస్తాడు అని యేసు ప్రభువు దగ్గరకు  తీసుకొని వచ్చారు. లోకంలో చాలామంది తమ స్వంత అవసరాల కోసం, తమ స్వార్థ ప్రయోజనాల కోసం దేవునిని ఆశ్రయిస్తారు. కానీ ఈ నలుగురు స్నేహితులు (లేక బంధువులు) అలా చేయలేదు. తమకు ఏ స్వస్థత అవసరం లేకపోయినా, పక్షవాతంతో మంచానపడ్డ తమ తోటి సహోదరుని వేదనను వారు చూడలేకపోయారు.

వీరు తమ కోసం కాక వేరె వారి కోసం, వారి కష్టాలు తీర్చడం కోసం చేసిన మంచి పనిని చూసి,  యేసు ప్రభువు యందు వారికి గల విశ్వాసం చూసి, ప్రభువు ఆ కుష్టురోగిని   స్వస్థత పరుస్తున్నారు. వీరు విశ్వాసం ఏమిటి  అంటె ఎంతటి విపత్కర పరిస్థితులు ఉన్న కూడా నా దేవుడు నన్ను అవమానమునకు గురికానివ్వడు అనే నమ్మకం ఇక్కడ వారి సొంతం. ఇతర సువార్తలలో (మార్కు, లూకా) వివరించినట్లుగా, యేసు ప్రభువు  ఉన్న ఇంటి వద్ద  జనసమూహం ఎక్కువగా ఉండటం వల్ల వారు లోపలికి వెళ్ళలేక, ఇంటి కప్పు విప్పి, ఆ రోగిని మంచంతో సహా కిందికి దించారు. వారి దారిలో ఎన్నో అడ్డంకులు వచ్చి ఉండవచ్చు,  సమాజం హేళన చేసి ఉండవచ్చు, శ్రమ ఎక్కువై ఉండవచ్చు, కానీ "యేసు ప్రభువు  దగ్గరకు వెళ్తే  వారి స్నేహితునికి స్వస్థత  జరుగుతుంది" అనే దృఢ నిశ్చయమే వారిని నడిపించింది.

ముఖ్యమైన ఆత్మీయ సత్యం: విశ్వాసం మనకు మాత్రమే ఉపయోగపడేది కాదు. అది అందరికి ఉపయోగ పడుతుంది. ఇతరుల శ్రేయస్సును  విశ్వాసం కాంక్షిస్తుంది. ఇక్కడ జరుగుతుంది ఇదియే. దీని ద్వారా లబ్ది పొందిన ఆ వ్యక్తి కూడా ప్రభువును విశ్వసిస్తాడు. మన విశ్వాసం ఇతరులకు ఈ విధంగా ఉపయోగ పడాలి.

క్రైస్తవ జీవితంలో ప్రార్థన మరియు విశ్వాసం కేవలం వ్యక్తిగతమైనవి కావు. అవి సామాజిక బాధ్యతతో కూడుకున్నవి. మనం ఇతరుల కొరకు చేసే మధ్యవర్తిత్వ ప్రార్థన ఎంత శక్తివంతమైనదో ఈ సంఘటన నిరూపిస్తుంది. ఒకరి నమ్మకం మరొకరి జీవితంలో అద్భుతాన్ని సృష్టించగలదు. నేటి సమాజంలో కష్టాల్లో ఉన్నవారిని చూసి జాలిపడటమే కాకుండా, వారిని దేవుని సన్నిధికి నడిపించే ఇటువంటి నిస్వార్థ స్నేహితులు ప్రతి ఒక్కరికీ అవసరం.

ధర్మశాస్త్ర బోధకుల తలంపులు - దైవదూషణ వివాదం

ఆ మాటలు వింటున్న ధర్మ శాస్త్ర బోధకులు యేసు ప్రభువు దైవ దూషణ చేస్తున్నాడు అని అంటున్నారు. ఇక్కడ దైవ దూషణ అని ధర్మ శాస్త్ర బోధకులు అనడానికి కారణం ఏమిటి అంటే యేసు ప్రభువు నీ పాపములు పరిహరింపబడినవి అని చెప్పడం. వారి దృష్టిలో  దేవుడు మాత్రమే పాపములను పరిహరింపగలడు. దేవుడు తప్ప ఎవరు మన పాపములను ఎవరు క్షమించలేరు, అటువంటిది యేసు ప్రభువు నీ పాపములు క్షమించబడినవి అంటున్నారు అని పొరపడుతున్నారు. దేవునికి మాత్రమే సాధ్యమయ్యే దానిని యేసు ప్రభువు చేస్తున్ననంటున్నాడు,   ఇదే వారి పొరపాటు. యేసు ప్రభువు దేవుని కుమారుడు, దేవుడే అని తెలుసుకోలేక పోతున్నారు. 

ధర్మశాస్త్ర బోధకులు యూదా మత చట్టాలను క్షుణ్ణంగా చదువుకున్నవారు. వారి ఆలోచనా విధానం పూర్తిగా అక్షరార్థమైన చట్టాలకే పరిమితమైంది. పాత నిబంధన ప్రకారం, పాప క్షమాపణ అనేది కేవలం యావే  దేవునికి మాత్రమే ఉన్న ప్రత్యేక అధికారం. మానవుడైన ఏ వ్యక్తి కూడా ఇంకొకరి పాపాలను క్షమించలేడు. ఒకవేళ అలా ప్రకటన  చేస్తే అది దైవదూషణ (Blasphemy) అవుతుంది, దానికి శిక్ష రాళ్లతో కొట్టి చంపడం శిక్షగా ఉండేది. 

దైవ  అధికారము మరియు సంపూర్ణ విముక్తి

వీరు యేసు ప్రభువు తనను తాను దేవునికి సమానముగా చేసుకుంటున్నారు అని అనుకుంటున్నారు. ఆయన దేవుడు అని వారు గమనించలేక పోయారు. అంతేకాదు ఆయన గురించి వారు తప్పుగా అనుకుంటున్నారు. యేసుక్రీస్తు కేవలం ఒక ప్రవక్త లేదా బోధకుడు మాత్రమే కాదు, ఆయన మానవ శరీరధారియై ఈ లోకానికి వచ్చిన సాక్షాత్తు దేవుడు అనే సత్యాన్ని గ్రహించడంలో వారు పూర్తిగా విఫలమయ్యారు. వారి కండ్ల ముందే అద్భుతాలు జరుగుతున్నా, వారి హృదయ కాఠిన్యం వల్ల, వారు ఆధ్యాత్మిక గ్రుడ్డితనంలో ఉండిపోయారు.

అందుకే యేసు ప్రభువు పక్ష వాత రోగిని లేచి నడువమని చెబుతున్నారు, దాని ద్వారా వారికి ఆయనకు ఉన్నటువంటి శక్తిని  తెలియజేస్తున్నారు. యేసు  ప్రభువు  వారి అంతరంగ ఆలోచనలను ఎరిగి, "పాపములు క్షమించబడినవి అనడం సులభమా? లేదా లేచి నడువమనడం సులభమా?" అని ప్రశ్నించాడు. మాట్లాడటం చాలా సులభం, ఎందుకంటే పాపాలు క్షమించబడ్డాయో లేదో కంటికి కనిపించదు. కానీ, "లేచి నడువు" అని చెప్పినప్పుడు, ఆ వ్యక్తి నడవకపోతే అది అబద్ధమని వెంటనే తెలిసిపోతుంది. కాబట్టి, కంటికి కనిపించని తన పాప క్షమాపణ అధికారమును నిరూపించడానికి, కంటికి కనిపించే భౌతిక స్వస్థతను యేసు ఒక రుజువుగా ఉపయోగించాడు.

ప్రభువు అధికారం 

ఈ భూమి మీద మనుష్య కుమారునికి  పాపములను క్షమించు అధికారము కలదని మీకిపుడే తెలియును అని పలికి, ఆ రోగితో నీవు ఇక లేచి, నీ పడకను ఎత్తుకొని యింటికి పొమ్ము అనెను. అతడు వెంటనే లేచి తన యింటికి పోయెను. అది చూచిన జనసమూహములు భయపడి మానవులకు ఇట్టి అధికారమును ఇచ్చిన దేవుని స్తుతించిరి." ఇక్కడ మనం అర్ధం చేసుకోవలసిన విషయం ఏమిటి అంటే యేసు ప్రభువు  తనకు ఉన్నటు వంటి శక్తిని చూపుతున్నాడు. అంతేకాదు తాను దేవుడను అనే విషయం తేటతెల్లం చేస్తున్నారు.

యేసుప్రభువు ఇక్కడ ఉపయోగించిన "మనుష్య కుమారుడు" అనే పదం దానియేలు ప్రవచన గ్రంథంలో (దానియేలు 7:13-14) దైవ  అధికారం కలిగిన మెస్సీయను సూచిస్తుంది. భూమి మీద సమస్త అధికారం, న్యాయతీర్పు తీర్చే హక్కు ఆయనకు ఉంది. ధర్మ శాస్త్ర బోధకులు,  మానవుడు చేయలేని పనిని ఇక్కడ యేసు ప్రభువు చేయడం ద్వారా ఈయన దేవుడు అని తెలుసుకోవాలి, కాని వారు ఆ విషయాన్ని పూర్తిగా అర్ధం చేసుకోలేకపోయారు. వారు కేవలం తర్కాలలోనే ఉండిపోయారు తప్ప, దేవుని కృపను రుచిచూడలేకపోయారు.

నిర్మల మనసు ఉంటేనే దేవుణ్ణి గుర్తించగలం 

కాని యేసు ప్రభువు మాటను పాటిస్తున్న ఆ పక్షవాత రోగి తన రోగం నుండి విముక్తి పొందుతున్నాడు. యేసు ప్రభువుని నమ్మి జీవించినప్పుడు మన సమస్యల నుండి విముక్తి పొందుతాము. యేసు ప్రభువు ఒక్క మాట సెలవియ్యగానే, సంవత్సరాలుగా మంచానికే పరిమితమైన ఆ రోగి దేహంలోకి నూతన జీవం, బలం వచ్చాయి. అతడు లేచి, ఏ మంచమైతే ఇన్నాళ్లూ తనను మోసిందో, ఆ మంచాన్నే తాను భుజాన వేసుకుని నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాడు. ఇది దేవుని అపారమైన శక్తికి, సజీవ సాక్ష్యానికి నిదర్శనం. ఆశ్చర్యకరమైన ఈ కార్యాన్ని చూసిన సామాన్య ప్రజలు దేవుని మహిమపరిచారు, ఎందుకంటే వారు ధర్మశాస్త్ర బోధకుల్లా కఠిన హృదయులు కారు; దేవుని హస్తాన్ని గుర్తించగలిగే నిర్మలత్వం, భయభక్తులు వారిలో ఉన్నాయి.

మన దైనందిన జీవితంలో కూడా అనేక రకాల ఆత్మీయ లేదా మానసిక పక్షవాతాలతో మనం బాధపడుతూ ఉండవచ్చు. నిరాశ, నిస్పృహలు, అలవాట్లు, పాపపు బంధకాలు మనల్ని ముందుకు సాగనివ్వకుండా ఒకే చోట కట్టిపడేస్తుంటాయి. సమాజం మనల్ని హీనంగా చూడవచ్చు. కానీ యేసు ప్రభువు సన్నిధికి మనం వచ్చినప్పుడు, లేదా మనల్ని ప్రేమించేవారు ప్రార్థన ద్వారా మనల్ని ప్రభువు చెంతకు చేర్చినప్పుడు సంపూర్ణ విడుదల లభిస్తుంది. యేసు  ప్రభువు అధికారము , ఆయన మాట సృష్టిని మార్చగలదు. మన సమస్యలు ఎంత పెద్దవైనా ఆయన శక్తి కంటే పెద్దవి కావు అనే నమ్మకంతో జీవించడమే నిజమైన విశ్వాసం.

ప్రార్ధన : ప్రభువా! మా జీవితంలో అనేక సార్లు మేము మీ మాటలను నమ్మడంలో , మీ మీద విశ్వాసం ఉంచడంలో విఫలం చెందుతున్నాము. దాని వలన మేము మా బాధల నుండి విముక్తి పొందలేక పోతున్నాము. మీ మాటను ఎల్లప్పుడు పాటిస్తూ మా సమస్యల నుండి మేము విముక్తి పొందే వారిగా మమ్ములను మార్చండి. బాధల్లో, కష్టాలలో ఉన్నవారికి మేము కూడా మా వంతు సాయం చేస్తూ వారికి వారి సమస్యల నుండి విముక్తి పొందేందుకు మేము చేయగలిగె సాయం చేయు వారిగా మమ్ము దీవించండి. మేము మీ శక్తిని తెలుసుకొని ఎల్లప్పుడు మిమ్ములను మీ మీద విశ్వాసం ఉంచి జీవించే వారిగా మమ్ము మార్చండి. ప్రభువా అనేక సార్లు మీ మీద పూర్తిగా విశ్వాసం ఉంచలేదు అటువంటి సమయాలలో మమ్ము క్షమించండి. పక్షవాత రోగి పాపములను క్షమించిన విధముగా మా పాపములను క్షమించండి. అతనికి ఇచ్చిన విముక్తిని మాకును దయచేయ్యండి. ఆమెన్.

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబిల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పవిత్రుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

📲 మా WhatsApp Channel జాయిన్ అవ్వండి!

ప్రతి నిత్య పోస్ట్ మీ WhatsApp కు నేరుగా వస్తుంది

Join WhatsApp Channel

Comments

మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:

Post a Comment

కామెంట్‌లు