సువార్తకారుడైన పునీత యోహాను చరిత్ర మరియు విశిష్టత | కార్మెల్ శోభ
సువార్త కారుడైన యోహాను - ప్రియమైన శిష్యుడు
యోహాను 20: 2-8
అంతట ఆమె సీమోను పేతురువద్దకు, యేసు ప్రేమించిన మరియొక శిష్యుని యొద్దకు పరుగెత్తుకొని పోయి, "వారు ప్రభువును సమాధినుండి ఎత్తుకొనిపోయిరి. ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము"అని చెప్పెను. అపుడు పేతురు, ఆ శిష్యుడు సమాధివైపునకు సాగిపోయిరి. ఆ ఇద్దరును పరుగెత్తుచుండిరి. కాని, ఆ శిష్యుడు పేతరుకంటే వేగముగా పరుగెత్తి ముందుగ సమాధియొద్దకు చేరెను. అతడు వంగి నారవస్త్రములు అచట పడియుండుటను చూచెను. కాని, లోనికి వెళ్లలేదు. ఆ తరువాత సీమోను పేతురు వచ్చి, సమాధిలో ప్రవేశించి, అచట పడియున్న నారవస్త్రములను, ఆయన తలకు కట్టిన తుండుగుడ్డను చూచెను. ఆ తుండుగుడ్డ నారవస్త్రములతోపాటు కాక, విడిగచుట్టి ఉంచబడెను. సమాధి యొద్దకు మొదట వచ్చిన శిష్యుడు కూడ లోనికి వెళ్ళి చూచి నమ్మెను.
పునీత యోహాను గారి మహోన్నత వ్యక్తిత్వం – సువార్త ప్రత్యేకత
ఈ రోజు క్రీస్తుసభ ఎంతో భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో సువార్తకారుడైన పునీత యోహాను గారి పండుగను కొనియాడుతున్నది. యేసుప్రభువుకు అత్యంత ప్రియమైన శిష్యునిగా, అద్భుతమైన దైవజ్ఞానాన్ని మనకు అందించిన సువిశేషకునిగా యోహాను గారి స్థానం అద్వితీయమైనది. ఈ పునీతుని గొప్పతనం, ఆయన రాసిన యోహాను సువార్తను మనం లోతుగా చదివి, ధ్యానించినప్పుడు స్పష్టంగా అవగతమవుతుంది.
మత్తయి, మార్కు, లూకా అనే మిగిలిన ముగ్గురు సువిశేషకారులు రాసిన సువార్తలను 'సమదృష్టి సువార్తలు' (Synoptic Gospels) అంటారు. ఎందుకంటే అవి యేసుప్రభువు భూలోక జీవితాన్ని, ఆయన మానవత్వాన్ని, ఆయన బోధలను ఒకే రకమైన దృక్కోణంలో చూపిస్తాయి. కానీ, యోహాను రాసిన సువిశేషం వీటన్నింటికంటే ఎంతో భిన్నమైనది, ఆధ్యాత్మిక లోతు కలిగినది మరియు ప్రత్యేకత సంతరించుకున్నది. యోహాను గారు కేవలం యేసుప్రభువు చరిత్రను రాసిన చరిత్రకారుడు మాత్రమే కాదు; ఆయన యేసుప్రభువు హృదయ స్పందనలను పంచుకున్న అంతరంగిక శిష్యుడు. అందుకే ఆయన సువార్తలో ప్రతి వాక్యమూ దైవిక రహస్యాలను విప్పుతుంది.
గ్రద్ద గుర్తు – దైవిక దృష్టికి ప్రతీక
క్రిస్టియన్ సాంప్రదాయంలో మరియు బైబిల్ చిత్రకళలో ప్రతి సువిశేషకారునికి ఒక ప్రత్యేకమైన గుర్తు (చిహ్నం) ఇవ్వబడింది.
మత్తయి సువార్తకు 'మానవుడు లేదా దేవదూత' గుర్తు (క్రీస్తు వంశావళి, మానవ అవతారాన్ని బట్టి),
మార్కు సువార్తకు 'సింహం' గుర్తు (ఎడారిలో గర్జించే స్వరంతో ప్రారంభమవ్వడాన్ని బట్టి),
లూకా సువార్తకు 'ఎద్దు లేదా బలిపశువు' గుర్తు (జెకర్యా బలిపీఠం వద్ద ప్రార్థించడంతో ప్రారంభమవ్వడాన్ని బట్టి) ఇవ్వబడ్డాయి.
కానీ యోహాను సువిశేషమునకు 'గ్రద్ద' (Eagle) గుర్తుగా ఇవ్వబడింది. ఎందుకు యోహాను గారికి గ్రద్ద గుర్తు ఇవ్వబడింది అని మనం ఒకసారి లోతుగా పరిశీలించినట్లయితే, గ్రద్ద స్వభావంలో ఒక అద్భుతమైన రహస్యం మనకు తెలుస్తుంది. గ్రద్ద ఆకాశంలో ఎక్కడో మేఘాల పైన, కంటికి అందనంత ఎత్తులో విహరిస్తున్నప్పటికి, భూమిమీద ఉన్న అతి చిన్న కీటకాన్ని కాని, లేదా అది ఏ ఆహారాన్ని పట్టుకోవాలనుకున్నదో దానిని అత్యంత ఖచ్చితత్వంతో చూస్తుంది. ఎంత ఎత్తులో ఉన్నా దాని దృష్టి చెదరదు. అది పైనుండి క్రిందికి దూసుకువచ్చి, ఎటువంటి పొరపాటు లేకుండా తన లక్ష్యాన్ని పట్టుకోగలదు. గ్రద్దకు అంతటి ఖచ్చితమైన గురి, నిశితమైన దృష్టి ఉన్నాయి.
పునీత యోహాను గారి ఆధ్యాత్మిక దృష్టి కూడా అటువంటిదే. ఆయన లౌకిక విషయాలలో చిక్కుకుపోకుండా, పరలోక మర్మాలను, దైవత్వపు లోతులను ఎంతో ఎత్తు నుండి దర్శించారు. భూమిపై నడుస్తున్న క్రీస్తులో దాగి ఉన్న పరలోక దేవుని మహిమను ఆయన తన నిశితమైన విశ్వాస నేత్రాలతో చూశారు. అందుకే ఆయనను 'గ్రద్ద'తో పోలుస్తారు.
ఆదిలోనే దైవత్వ ప్రకటన
మిగిలిన సువిశేష కారులు యేసుప్రభువు భూలోక పుట్టుకతోటి (మత్తయి, లూకా) లేదా ఆయన బహిరంగ జీవిత ప్రారంభమైన జ్ఞానస్నానంతోటి (మార్కు) తమ సువార్తలను మొదలు పెడుతున్నారు. వారు క్రింది నుండి పైకి, అంటే యేసు మానవత్వం నుండి ఆయన దైవత్వం వైపు ప్రయాణించారు.
కానీ యోహాను మాత్రం తన సువిశేషాన్ని పైనుండి క్రిందికి ప్రారంభించారు. ఆయన నేరుగా పరలోకానికి, సృష్టికి పూర్వ కాలానికి వెళ్ళిపోయారు. "ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవునితో ఉండెను, వాక్కు దేవుడై ఉండెను" (యోహాను 1:1) అంటూ యేసుప్రభువు మానవుడిగా రాకముందు ఎలా తండ్రితో కలిసి ఉన్నాడనే నిగూఢ సత్యాన్ని ప్రకటించారు. ఏవిధముగా ఆయన దేవుడు అనే విషయాన్ని సువిశేషం మొదటి నుండి స్పష్టం చేస్తున్నారు. లోకంలో ఏ జ్ఞానీ గ్రహించలేని త్రిత్వ రహస్యాన్ని, క్రీస్తు నిత్యత్వాన్ని యోహాను గారు మొదటి వాక్యంలోనే గురి తప్పని గ్రద్దలాగా మనకు ఆవిష్కరించారు.
యోహాను సువార్త మూల ఉద్దేశ్యం: విశ్వాసం మరియు నిత్యజీవం
యోహాను సువిశేషం కేవలం చదివి ఆనందించడానికి రాసింది కాదు. తాను ఎందుకు ఈ సువిశేషాన్ని రాయవలసి వచ్చిందో ఆ ఉద్దేశ్యాన్ని యోహాను గారు స్వయంగా గ్రంథంలో స్పష్టం చేశారు. ఆయన తన సువిశేష ఉద్దేశ్యం ఏమిటి అనే విషయాన్ని మూడు సార్లు (సువిశేష మొదటిలో, మధ్యలో మరియు చివరిలో) విభిన్న రీతుల్లో గుర్తుచేస్తూ వస్తారు.
ముఖ్యంగా సువార్త ముగింపులో ఆయన ఇలా అంటారు: "యేసే దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు విశ్వసించునట్లును, విశ్వసించి ఆయన నామమువలన జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను" (యోహాను 20:31).
ఈ సువిశేషం యొక్క పరమ ఉద్దేశ్యం ఒక్కటే: యేసు ప్రభువును అందరు రక్షకునిగా, దేవునిగా విశ్వసించాలి. అలా విశ్వాసించిన వారికి పాపక్షమాపణ, మరియు అంతిమంగా 'నిత్యజీవం' ప్రసాదించబడుతుంది.
యోహాను సువార్త నిర్మాణం: రెండు అద్భుతమైన భాగాలు
ఆధ్యాత్మిక పండితులు యోహాను సువార్తను రెండు ప్రధాన భాగాలుగా విభజించారు.
సూచనల గ్రంథం (Book of Signs - అధ్యాయాలు 1 నుండి 12): ఇందులో క్రీస్తు దైవత్వాన్ని నిరూపించే అద్భుతాలు ఉంటాయి.
మహిమ గ్రంథం (Book of Glory - అధ్యాయాలు 13 నుండి 21): ఇందులో క్రీస్తు సిలువ మరణం, పునరుత్థానం ద్వారా వ్యక్తమైన దైవ మహిమ ఉంటుంది.
మొదటి భాగం: 7 అద్భుతాలు (దైవిక సూచనలు)
సువిశేష మొదటి భాగంలో యోహాను గారు యేసుప్రభువు చేసిన ఏడు అద్భుతాలను ఎంపిక చేసి ప్రస్తావించారు. యోహాను వీటిని 'అద్భుతాలు' అనడం కంటే 'సూచనలు' (Signs) అని పిలిచారు. ఒక మైలురాయి ఎలాగైతే గమ్యస్థానాన్ని చూపిస్తుందో, ఈ అద్భుతాలు అలా యేసుప్రభువు దేవుడనే సత్యాన్ని చూపిస్తాయి. ఈ ఏడు అద్భుతాలు కూడా సాధారణ మానవుడు చేయగలిగేవి కావు, కేవలం దేవుడు మాత్రమే చేయగలిగేటువంటి అద్భుతాలు:
కానా విందులో నీటిని ద్రాక్షారసముగా మార్చుట: ఇది ప్రకృతిపై, సృష్టిపై ఆయనకున్న అధికారానికి సూచన.
అధికారి కుమారుని స్వస్థపరచుట: కేవలం మాట ద్వారా, సుదూర ప్రాంతంలో ఉన్న వ్యక్తిని స్వస్థపరిచిన దైవిక శక్తి.
బేతెస్ద కోనేరు వద్ద ముప్పదియెనిమిది ఏండ్ల రోగిని స్వస్థపరచుట: కాలముపై, దీర్ఘకాలిక వ్యాధులపై క్రీస్తుకు గల అధికారం.
ఐదు రొట్టెలు, రెండు చేపలతో ఐదు వేల మందికి భోజనం పెట్టుట: సృష్టిని వృద్ధి చేయగల దేవుడు ఆయనే అని నిరూపించుట.
సముద్రముపై నడచుట: ప్రకృతి శక్తులను, గాలిని, నీటిని తన ఆధీనంలో ఉంచుకున్న దేవుడు.
పుట్టుగ్రుడ్డివానికి చూపు ప్రసాదించుట: శూన్యం నుండి కంటిని సృష్టించగల సృష్టికర్త ఆయనే అని చాటుట.
చనిపోయిన లాజరును బ్రతికించుట: మరణముపై విజయం సాధించిన జీవాధిపతి ఆయనే అని నిరూపించుట.
ఎంతటి గొప్ప ప్రవక్త లేదా రాజు అయినప్పటికీ, దేవుడు కాకపోతే ఆయన చేసిన ఇటువంటి అద్భుతాలు ఎవరూ చేయలేరు. ఈ సూచనల ద్వారా యేసుప్రభువు కేవలం ఒక బోధకుడు మాత్రమే కాదు, స్వయంగా దేవుడే మానవరూపంలో వచ్చాడని యోహాను నిరూపించారు.
యేసుప్రభువు స్వయం ప్రకటనలు (నేనే...)
యేసు ప్రభువు ఎవరు అనే విషయాన్ని యోహాను సువిశేషకారుడు యేసుప్రభువు ఇచ్చే అనుగ్రహమును బట్టి, ఆయన నోటి నుండి వచ్చిన స్వయం ప్రకటనల (I AM statements) ద్వారా తెలియజేస్తున్నాడు. పాత నిబంధనలో దేవుడు మోషేకు తన్ను తాను "నేను ఉన్నవాడను అనువాడను" అని ఎలా ప్రకటించుకున్నారో, యేసుప్రభువు కూడా నూతన నిబంధనలో యోహాను సువార్త ద్వారా తన్ను తాను దేవునిగా ప్రకటించుకున్నారు:
యేసు ప్రభువు జీవ జలం: "నేను ఇచ్చు నీరు త్రాగువాడు ఎన్నడును దప్పిగొనడు." (యోహాను 4:14)
యేసు ప్రభువే జగజ్యోతి: "నేను లోకమునకు వెలుగును, నన్ను అనుసరించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగియుండును." (యోహాను 8:12)
యేసు ప్రభువే జీవహారం: "పరలోకమునుండి దిగివచ్చిన జీవాహారము నేనే." (యోహాను 6:51)
యేసు ప్రభువే జీవ వాక్కు: ఆయన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి.
యేసు ప్రభువే తండ్రి వద్దకు మార్గము: "నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు." (యోహాను 14:6)
ఈ విధంగా క్రీస్తు మానవాళికి ఆత్మీయ అవసరాలన్నింటినీ తీర్చే సర్వస్వం అని యోహాను అద్భుతంగా వివరించారు.
రెండవ భాగం: మహిమ పుస్తకం (దేవునితో సాన్నిహిత్యం)
ఈ సువిశేష రెండవ భాగాన్ని 'మహిమ పుస్తకం' అంటారు. లోక దృష్టిలో సిలువ అనేది అవమానం, శిక్ష. కానీ యోహాను దృష్టిలో సిలువ అనేది యేసుప్రభువు మహిమపరచబడిన సింహాసనం. ఈ భాగంలో ఎలా యేసు ప్రభువు తండ్రి, పవిత్రాత్మలతో కలసి ఉన్నది అనే త్రిత్వ రహస్యం బయల్పరచబడింది. మనం ఎలా దేవునితో కలసి ఉండవచ్చు అనే విషయములు కూడా చాలా లోతుగా తెలుసుకుంటాము.
ముఖ్యంగా 15వ అధ్యాయంలో ద్రాక్షావల్లి ఉపమానం ద్వారా, "నాలో నిలిచియుండుడి, నేను మీలో నిలిచియుందును. కొమ్మ ద్రాక్షావల్లిలో నిలిచియుంటేనే తప్ప ఎలా ఫలింపదో, అలాగే నాలో నిలిచియుంటేనే తప్ప మీరును ఫలింపలేరు" అని క్రీస్తు చెప్పారు. దీని ద్వారా మనం దేవునితో అనుక్షణం ఎలా కనెక్ట్ అయి ఉండాలో నేర్పుతుంది.
శిష్యులతో యేసు ప్రభువు ఎటువంటి అంతరంగిక సాన్నిహిత్యాన్ని కోరుకుంటున్నారు, ఎలా దానిని శిష్యులు పొందవచ్చు అనే విషయం మనం ఇక్కడే తెలుసుకుంటాము. శిష్యులను ప్రభువు కేవలం సేవకులుగా కాక, స్నేహితులుగా చూశారు. శిష్యులను ప్రభువు ఎంతలా ప్రేమిస్తున్నారు అనే విషయము కూడా ఈ సువిశేషం ద్వారానే మనం అత్యంత స్పష్టంగా నేర్చుకుంటాము. తన వారిని ఆయన అంతం వరకు ప్రేమిస్తూనే ఉన్నారు.
ఎవరు ఈ యోహాను? – క్రీస్తు హృదయానికి అంటుకట్టబడిన శిష్యుడు
ఎవరు ఈ యోహాను? ఈయన గలిలయ సముద్ర తీరంలో చేపలు పట్టుకునే జబదాయి కుమారుడు. యాకోబుకు సోదరుడు. యేసుప్రభువు పిలువగానే వలలను, పడవను, తండ్రిని విడిచిపెట్టి అనుసరించిన త్యాగధనుడు. శిష్యులందరిలోకి ఈయన వయసులో చాలా చిన్నవాడు.
ఈయన కడపటి భోజన (రాత్రి భోజన) సమయమున యేసు ప్రభువు రొమ్మున (హృదయమునకు) ఆనుకొని, ఎంతో దగ్గరగా ఉన్నాడు. ఆ సాన్నిహిత్యమే ఆయనకు ప్రత్యేకతను ఇచ్చింది. ఆయన యేసు ప్రభువుకు అంతా దగ్గరగా ఉన్నాడు కనుకనే, దేవుని గురించి ఇతర సువిశేషకారులు తెలుపని నిగూఢ విషయాలను, పరలోక మర్మాలను వివరిస్తున్నారు. యేసు హృదయ స్పందనలను విన్న శిష్యుడు కనుకనే, "దేవుడు ప్రేమాస్వరూపి" అని అంత ఖచ్చితంగా చెప్పగలిగారు.
హృదయము దగ్గరగా ఉన్నాడు అంటే ప్రభువు చేత కూడా ఈ శిష్యుడు అమితంగా ప్రేమించబడ్డాడు. అందుకే తన సువార్తలో ఎక్కడా తన పేరు రాసుకోకుండా, వినమ్రతతో "యేసు ప్రేమించిన శిష్యుడు" అని మాత్రమే పేర్కొన్నారు. ఆ ప్రేమ ఆయనకు ఒక అపారమైన ధైర్యాన్ని ఇచ్చింది.
సిలువ క్రింద నిలిచిన నమ్మకమైన శిష్యుడు
యేసుప్రభువును తోటలో బంధించినప్పుడు భయంతో శిష్యులు అందరు పారిపోయినను, ఈ శిష్యుడు మాత్రము ధైర్యంగా ఆయనను అనుసరిస్తూనే ఉన్నాడు. ప్రధాన యాజకుని ఇంతి లోపలికి వెళ్ళాడు. అంతటితో ఆగక, ప్రాణభయం ఉన్నప్పటికీ, కల్వరి కొండపై యేసుప్రభువు సిలువ క్రింద మరియమాతతో పాటు విశ్వాసంగా నిలిచాడు. క్రీస్తు కష్టకాలంలో, శ్రమలలో తోడుగా ఉన్న ఏకైక శిష్యుడు యోహాను.
అందుకే యేసుప్రభువు సిలువపై నుండి మరణించే ముందు, భూమిపై తనకు అత్యంత ప్రియమైన ఇద్దరిని ఒకరికొకరు అప్పగించుకున్నారు. తన తల్లిని తన ప్రియయమైన శిష్యునకు అప్పగిస్తూ, "అమ్మా, ఇదిగో నీ కుమారుడు" అని మరియమాతతోను, "ఇదిగో నీ తల్లి" అని యోహానుతోను చెప్పారు. ఆ గడియ నుండి యోహాను మరియమాతను తన స్వగృహమునకు చేర్చుకొని ఆదుకున్నాడు. క్రీస్తు ప్రేమకు ప్రతిరూపంగా మారాడు.
అలాగే, పునరుత్థాన ఉదయాన మరియ మగ్దలేన సమాధి ఖాళీగా ఉందని చెప్పినప్పుడు, పేతురు కంటే వేగంగా పరుగెత్తి, సమాధిని చూసి, యేసుప్రభువు పునరుత్థానాన్ని మొదటగా 'చూచి నమ్మిన' వాడు కూడా ఈ ప్రియమైన శిష్యుడే.
ఈ విధంగా పునీత యోహాను గారి జీవితం, ఆయన సువార్త మనకు దేవుని ప్రేమను, విశ్వాసాన్ని, దైవత్వపు లోతులను నేర్పిస్తున్నాయి. ఆయన పండుగ రోజున ఆయన చూపిన భక్తి మార్గంలో, క్రీస్తు హృదయానికి దగ్గరగా జీవించడానికి మనం పిలవబడుతున్నాము.
ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్దన: ప్రభువా మీరు ప్రేమించిన మీ శిష్యున్ని జ్ఞానంతో నింపారు. కేవలం జ్ఞానంతో నింపటమే కాకుండా దేవుని గురించితెలుకొని నేర్పే వానిగా తీర్చిదిద్దారు. మీ మీరు చేసిన ప్రతి పని మీరు దేవుడు అని తెలియజేస్తున్నది అని తెలుసుకోలేకపోయాము. మీ శిష్యుడు మిమ్ములను మాత్రమే పరిలించే విధంగా మీరు చేశారు కనుక మిమ్ములను మాత్రమే ధ్యానిస్తూ.మీగురించి నిగూడ సత్యాలను తెలుసకొనుటకు అవకాశం ఇస్తున్నారు. ప్రభువా మీరు చేసిన అధ్భుతాల ద్వారా మీరు దేవుడు అనే విషయాన్ని మాకు తెలియజేస్తున్నారు. అంతె కాక మేము ఏ విధంగా మీతో కలసి ఉండాలో చెబుతున్నారు. మీరు లేకుండా మేము ఏమి చేయలేము అని చెబుతున్నారు. మేము మీతో కలసి ఉండాలి అని కోరుతున్నారు. ప్రభువా! మమ్ములను కూడా మీ ప్రియమైన శిష్యున్ని ప్రేమించినట్లుగానే ప్రేమించండి. మమ్ములను కూడా మీ హృదయమునకు దగ్గరగా ఉండనివ్వండి. దాని ద్వారా యోహాను వలె మేము కూడా మీ గురించి ఎక్కువగా తెలుసుకొని మీతో ఐక్యం అయ్యేలా మమ్ము దీవించండి. ఆమెన్.
Comments
మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:
Post a Comment