తప్పిపోయిన గొర్రె ఉపమానం దైవ ధ్యానం (మత్తయి 18) | కార్మెల్ శోభ

 మత్తయి  18:12-14

ఒకడు తనకున్న నూరు గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో, తక్కిన తొంబదితొమ్మిదింటిని ఆ పర్వత ప్రాంతముననే విడిచి దానిని వెదకుటకు పోడా? అది దొరికినపుడు తప్పిపోని తక్కిన తొంబది తొమ్మిదింటికంటే దాని విషయమై ఎక్కువగా సంతసించును అని నిశ్చయమముగా చెప్పుచున్నాను. ఆ రీతిగా ఈ పసిబాలురలో ఒకడైనను నాశమగుట పరలోకమదుండు మీ తండ్రి చిత్తము కాదని తెలిసికొనుడు. 

1. ఇశ్రాయేలు సంస్కృతిలో "కాపరి" – ప్రవక్తల దర్శనం

పాత నిబంధన కాలం నుండి ఇశ్రాయేలు ప్రజల చరిత్ర, ఆత్మీయ జీవితం గొర్రెల కాపరుల సంస్కృతితో ముడిపడి ఉన్నది. అందుకే వారు దేవునికి, తమకు ఉన్న సంబంధాన్ని 'కాపరి-గొర్రెలు' బంధంగా చూశారు. పరిశుద్ధ గ్రంథంలోని ప్రవక్తలు, ముఖ్యంగా యెహెజ్కెలు, యెషయా, మరియు యిర్మీయా అనేక పర్యాయాలు యావే  దేవుని ఒక నమ్మకమైన కాపరిగా సంబోధించారు.

నిజమైన కాపరి లక్షణం ఏమిటంటే, మందలోని గొర్రెలు ఏవైనా దారి తప్పిపోతే, వాటిని అలాగే వదిలేయడు. అడవులలో, కొండలలో వెదకి, సింహాల నోటి నుండి, ముళ్ళ పొదల నుండి వాటిని విడిపించి మరల తన మందలోనికి క్షేమంగా తీసుకొని వస్తాడు. ఇశ్రాయేలీయుల నమ్మకం ప్రకారం, రాబోయే మెస్సయ్యా  కూడా లోకంలో తప్పిపోయిన, నలిగిపోయిన ఇశ్రాయేలు ప్రజలను మరల దేవుని దగ్గరకు సమకూర్చే ఒక ఉత్తమ కాపరిగా వస్తాడు. యేసు ప్రభువు ఈ భూమిపైకి వచ్చినప్పుడు అదే పరిచర్యను ప్రారంభించారు.

అయితే, ఇక్కడ ఒక ముఖ్యమైన సత్యాన్ని మనం గమనించాలి. యేసు ప్రభువు కేవలం తాను  కాపరిగా మాత్రమే ఉండిపోలేదు. తప్పిపోయిన వారిని వెదకి, వారిని రక్షించి, తిరిగి యేసు ప్రభువు వద్దకు నడిపించే బాధ్యతను తన శిష్యులకు, సంఘానికి అప్పగించారు. కాబట్టి, ఎవరైతే నశించిపోతున్న ఆత్మలను క్రీస్తు వైపు నడిపిస్తారో, వారందరూ దేవుని పరిచర్యలో "సహ-కాపరులుగా" ఉంటారు. యేసు ప్రభువు కేవలం ఒక సమూహం వద్దకో, లేదా కొందరు ప్రత్యేక వ్యక్తుల వద్దకో రాలేదు; ఆయన ప్రతి ఒక్క వ్యక్తి అంతరంగాన్ని ఎరిగినవాడు. ప్రతి ఒక్కరి వ్యక్తిగత సమస్యలను, పాపపు భారాలను తీర్చి, వారిని పరలోకపు తండ్రి అయిన దేవుని యొద్దకు చేర్చడానికి  శ్రమలన్నింటినీ భరించి  సిలువపై మరణించారు.

2. తప్పిపోయిన వారు ఎవరు? వారు దారి తప్పడానికి గల కారణాలు

ఈ ఉపమానంలో "తప్పిపోయిన గొర్రె" అంటే ఎవరు? నీతిని తప్పి, దేవుని ఆజ్ఞలను అతిక్రమించి, పరలోక రాజ్య ఆశీర్వాదాలకు దూరంగా జీవిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి తప్పిపోయిన వారే. లోక ఆశల వైపు, పాపపు ఊబి వైపు వెళ్ళిపోయిన వారందరినీ ప్రభువు ప్రేమిస్తూ, తన వద్దకు చెర్చుకొని, వారికి పరలోక రాజ్యంలో శాశ్వత స్థానాన్ని కల్పిస్తున్నారు.

ప్రజలు దేవుని నీతిని తప్పి,  దారి తప్పి పోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. పవిత్ర గ్రంధంను పరిశీలిస్తే, ఎక్కువ సార్లు ప్రజలు తప్పిపోవుటకు నాటి ఇశ్రాయేలు మత నాయకులు, అధికారులే ముఖ్య కారణం అయ్యారు. వారు దేవుని గొర్రెలను సరైన మార్గంలో నడిపించడంలో విఫలమయ్యారు.

ప్రజలు తప్పిపోవడానికి గల ముఖ్యమైన కారణాలను మనం మూడు విధాలుగా విభజించవచ్చు:

  • అవకాశాలు లేనివారు మరియు బహిష్కరించబడినవారు: నాటి సమాజంలో పేదలు, రోగులు, సుంకరులు, పాపులుగా ముద్రవేయబడిన వారికి దేవునికి సంబంధించిన ఆరాధనల్లో, ధర్మశాస్త్ర విషయాలలో ఎటువంటి అవకాశం ఇచ్చేవారు కాదు. వారిని దేవునికి దూరంగా పెట్టడం జరిగింది. దీనివల్ల వారు నిరాశతో దారి తప్పిపోయారు.

  • తాత్కాలిక లోక సుఖాలు: మరికొంతమంది తమ స్వల్ప కాలిక శారీరక ఆనందం కోసం, లోక భోగాల కోసం దేవునికి  దూరంగా  వెళ్ళిపోయారు. కానీ ఆ తర్వాత పాపపు బంధకాల నుండి తిరిగి రాలేక, మార్గం తెలియక తప్పిపోయారు.

  • ఆత్మీయ పోషణ లేకపోవడం: నాయకుల స్వార్థం వల్ల ప్రజలకు సరైన వాక్య బోధన అందలేదు.

ఎటువంటి భయంకరమైన కారణాలతో వారు దేవునికి దూరంగా ఉన్నప్పటికీ, వారిని త్రోసివేయకుండా యేసు ప్రభువు మరల దేవుని దగ్గరకు తీసుకొని వస్తున్నారు. ఎందుకంటే, ఎవరినీ కోల్పోవడం పరలోకపు తండ్రికి గానీ, యేసు ప్రభువుకు గానీ ఇష్టం లేదు. అందుకే యేసు ప్రభువు తన పరిచర్య ముగింపులో తండ్రితో ప్రార్థిస్తూ"నీవు నాకు ఇచ్చిన వారిలో ఎవరిని నేను కోల్పోలేదు" (యోహాను 17:12) అని ఎంతో నమ్మకంగా చెప్పారు. ఆయన నిరంతరం వారి రక్షణ కోసం తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తున్నారు.

3. పాత నిబంధన ప్రవచనాలు – ఇశ్రాయేలు కాపరుల వైఫల్యం

దేవుని హృదయం ఎలాంటిదో ప్రవక్త  యెషయా ప్రవక్త  40వ అధ్యాయం 11వ వచనంలో ఎంతో మధురంగా వివరించాడు:

"ఆతడు  కాపరివలె తన మందను మేపును. గొర్రె పిల్లలను తన చేతులలోనికి తీసుకొని, రొమ్ముమీద పెట్టుకొని  మోసికొనిపోవును."

ఈ వాక్యం దేవుని కరుణామయ స్వరూపాన్ని చూపిస్తుంది. ఆయన తన మందను కేవలం నడిపించడం మాత్రమే కాదు, బలహీనమైన గొర్రె పిల్లలను తన వడిలో పెట్టుకొని ఆడిస్తూ, వాటిని రొమ్మునకు హత్తుకొని మోసుకొని పోతాడు.

కానీ, దీనికి పూర్తి విరుద్ధంగా నాటి ఇశ్రాయేలు నాయకులు (కాపరులు) ప్రవర్తించారు. యెహెజ్కెలు గ్రంథం 34వ అధ్యాయం 2 వ వచనంలో దేవుడు ఆ దుష్ట కాపరులను గద్దిస్తూ ఇలా అన్నాడు:

"యిస్రాయేలు కాపరులారా మీకు అనర్ధము తప్పదు. మీరు మీ కడుపు నింపుకొనుచున్నారేగాని గొర్రెలమందలను మేపుటలేదు… తప్పిపోయిన వానిని వెదకి తొలుకొని వచ్చుట లేదు పైగా వారి పట్ల క్రూరముగా, కఠినముగా ప్రవర్తించుచున్నారు."

దేవుడు ఇచ్చిన అధికారంతో వారు తమ స్వంత కడుపులు నింపుకున్నారు తప్ప, ఆకలితో ఉన్న మందను మేపలేదు. గాయపడిన గొర్రెలకు కట్టుకట్టలేదు, తప్పిపోయిన వాటిని వెదకలేదు.

పరిశుద్ధ గ్రంథంలోని 23వ కీర్తన—"యావే  నా కాపరి, నాకు లేమి కలుగదు"—అనే కీర్తన అంటే మనకందరికీ ఎంతో ఇష్టం. ఎందుకంటే, ఆ కీర్తనలో ప్రభువు మనలను ఎంతగా కాపాడుతాడో, పచ్చిక గల చోట్ల, ప్రశాంతమైన జలముల యొద్దకు ఎలా నడిపిస్తాడో చూస్తాము. ప్రభువు మనకు కాపరి అయితే, మన జీవిత ప్రయాణంలో ఎటువంటి చీకటి లోయలు (కష్టాలు) ఎదురైనా, ఆయన ఏ బాటలో మనలను తీసుకుపోతున్నా చింత లేకుండా, భయం లేకుండా ఉండవచ్చు.

కానీ ఇశ్రాయేలు కాపరులు దేవుని మనస్సును కలిగి లేరు. తప్పిపోయిన పాపుల పట్ల, బలహీనుల పట్ల ఈ కాపరులు కఠినముగా వ్యవహరించారు. వారిని ఆదరించాల్సింది పోయి, సమాజంలో వారిని తక్కువగా చూడటం మొదలుపెట్టారు, అగౌరవపరిచారు, వారిపై 'అపవిత్రులు' అనే ముద్ర వేశారు. ఇటువంటి హృదయహీనమైన పరిస్థితులే యేసు ప్రభువు ఈ భూమిపై ఉన్న సమయంలో కూడా సమాజంలో స్పష్టంగా కనిపిస్తూ ఉండేవి.

4. నూరవ గొర్రె కొరకైన తపన – సమాజంపై దాని ప్రభావం

యేసు ప్రభువు దృష్టిలో ప్రతి ఒక్క ఆత్మ ఎంతో విలువైనది.  ఒక్క వ్యక్తిని కోల్పోవడం కూడా యేసు ప్రభువుకి అస్సలు ఇష్టం లేదు. నాటి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, ఇతర మత నాయకులు కేవలం సమాజంలో తమకున్న హోదా, గౌరవం, మరియు అధికారాల గురించి మాత్రమే ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చేవారు. సామాన్య ప్రజలను పట్టించుకోవడాన్ని లేదా ఒక కాపరిగా సేవ చేయడాన్ని వారు అంత గొప్ప పనిగా చూసేవారు కాదు.

కానీ యేసు ప్రభువు లోక రక్షకుడు మాత్రమే కాదు, ఆయన ఒక "మంచి కాపరి". వంద గొర్రెలు ఉన్న ఒక మంద నుండి కేవలం ఒకే ఒక్క గొర్రె బయటకు పోయినా, మిగిలిన తొంభై తొమ్మిది ఉన్నాయి కదా అని ఆయన ఉపేక్షించడు. ఆ ఒక్క గొర్రె తప్పిపోతే మంద మొత్తము పోయినట్లుగా ఆయన హృదయం ఎంతో వేదన పడుతుంది. అది దొరికినంత వరకు ఆయన అరణ్యాలలో, కొండలలో, ముళ్ళ పొదలలో దాని కోసం వెదకుతారు. దొరికినంత వరకు వేదకుతానే ఉంటారు.

యేసు ప్రభువు ఆ ఒక్క ఆత్మ కోసం అంతగా ఎందుకు వెదకుతున్నారు? దానికి ఒక సామాజిక కారణం కూడా ఉంది. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా, నైతికంగా తప్పిపోయి చెడిపోతే, అతని వల్ల సమాజం మొత్తం దాని దుష్పరిణామాలను, బాధను అనుభవిస్తుంది. ఎందుకంటే ఆ తప్పిపోయిన వ్యక్తి కూడా దేవుని సృష్టే, దేవుని బిడ్డే. ఒక కుటుంబంలో గానీ, సమాజంలో గానీ ఒక వ్యక్తి తప్పు చేయడం వలన ఆ కుటుంబం మరియు సమాజం మొత్తం దాని పర్యవసానాన్ని అనుభవించాల్సి వస్తుంది. గతంలో ఇశ్రాయేలు రాజులు, నాయకులు తప్పు చేసినప్పుడల్లా, వారి పాపాల వలన సాధారణ ప్రజలందరూ దేశ బహిష్కరణ, యుద్ధాలు వంటి అనేక కష్టాలు, బాధలు అనుభవించాల్సి వచ్చింది. అందుకే ఒక్క ఆత్మను రక్షించడం అంటే, ఆ వ్యక్తి ద్వారా సమాజంలో రాబోయే నాశనాన్ని ఆపడమే.

5. చిన్న పిల్లలు మరియు బలహీనుల పట్ల క్రీస్తు కరుణ

యేసు ప్రభువు చెప్పిన ఈ తప్పిపోయిన గొర్రె ఉపమానం కేవలం పాపుల గురించి మాత్రమే కాదు; సమాజంలో నిర్లక్ష్యం చేయబడిన చిన్న పిల్లల మీద, దీనులు, మరియు బలహీనులుగా ఉన్న వారి మీద దేవుని కరుణ ఎలా ఉన్నదో కూడా మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ ఉపమానానికి ముందు, వెనుక ఉన్న సందర్భాలను చూస్తే, పరలోక రాజ్యంలో ఎవరు గొప్ప అనే ప్రశ్న వచ్చినప్పుడు యేసు ఒక చిన్న బిడ్డను మధ్యలో నిలబెట్టి మాట్లాడారు.

సమాజంలో ఉన్న అధికారులు, నాయకులు, లేదా పెద్దలు ఎవరు కూడా తమ ప్రవర్తన ద్వారా గానీ, కఠినమైన నియమాల ద్వారా గానీ ఈ చిన్న బిడ్డలను, విశ్వాసంలో బలహీనులైన వారిని అభ్యంతరపరచకూడదు, వారు నాశనమవడానికి కారణం కాకూడదు అని ప్రభువు గట్టిగా కోరుతున్నారు.

అయితే, ఈ తప్పిపోయిన వారిని ఎలా మరలా దేవుని సన్నిధిలోనికి, సంఘం లోనికి తీసుకొని రావాలి? వారిని ప్రేమతో, క్షమాపణతో చేరదీయాలి. వారు పశ్చాత్తాపపడి తిరిగి దేవుని సంఘంలోనికి వచ్చినప్పుడు వారిని చేర్చుకోవడానికి ఎవ్వరూ కూడా అడ్డుకోవద్దని ప్రభువు ఖచ్చితంగా చెబుతున్నారు. అందుకే యేసు ప్రభువు నాటి సమాజ నియమాలను పక్కన పెట్టి, స్వయంగా తప్పిపోయిన వారి వద్దకే వెళ్ళారు. లోకం చీదరించుకునే పాపులు, సుంకరులు, వ్యభిచారిణులు మొదలగువారితో కలిసి భోజనం చేశారు, వారితో ప్రేమగా మాట్లాడారు. వారిని దేవుని రాజ్యానికి వారసులుగా మార్చారు. యేసు ప్రభువు చేస్తున్న ఈ కారుణ్య పరిచర్యను చూసి, వారిని అడ్డుకోవాలనుకున్న పరిసయ్యులను, ధర్మశాస్త్ర బోధకులను యేసు ప్రభువు  గద్దిస్తూ, వారి కఠిన హృదయాలను హెచ్చరించారు. దేవుని ప్రేమ చట్టాల కంటే, నిబంధనల కంటే గొప్పదని నిరూపించారు. 

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన: ప్రభువా ! మీరు మంచి కాపరి. మీరు తప్పి పోయిన మమ్ములను వెదకి మరలా తండ్రి వద్దకు చేర్చుటకు చాలా కృషి చేశారు. ప్రభువా నేను తప్పి పోవుట మీకు ఇష్టం లేదు అని తెలుసుకొని ఎంతో ఆనందంగా ఉన్నాము. ప్రభువా మీరు ఎలా అయితే ఎటువంటి కారణాలతో తప్పిపోయిన మమ్ము చీదరించుకోకుండా మేము మీతో ఉండాలిన కోరుకుంటున్నారు. కొన్ని సార్లు మా స్వార్ధం కోసం, అవసరాల కోసం కూడా మేము దూరంగా వెళ్ళి పోతున్నాము, అటువంటి సమయాలలో మీ ప్రేమను గురించే అనుగ్రహం మాకు దయచేయండి. మీ ప్రేమను గుర్తించి, మీ వద్దకు తిరిగి వచ్చే వారిని మేము ఎప్పుడు అడ్డుతగలకుండా ఉండే మంచి మనసు మాకు దయచేయండి. ఎవరు మీ నుండి తప్పి పోవుటకు మేము కారణం కాకుండా మా జీవితాలను మలచండి. ప్రభువా తప్పి పోయిన వారిని తిరిగి పొందినప్పుడు మీకు ఉండే ఆనందంలో మమ్ములను కూడా భాగస్వాములను చేయండి. ఆమెన్ 

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబిల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పవిత్రుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

📲 మా WhatsApp Channel జాయిన్ అవ్వండి!

ప్రతి నిత్య పోస్ట్ మీ WhatsApp కు నేరుగా వస్తుంది

Join WhatsApp Channel

Comments

మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:

Post a Comment

కామెంట్‌లు