అంత దినములు ఎలా ఉండును? - లూకా 17:26-37 ఆత్మీయ ధ్యానం
అంత దినములు ఎలా ఉండును
యేసుప్రభువు అంత్యదినాల గురించి హెచ్చరిస్తూ, మానవ చరిత్రలో జరిగిన రెండు అతిపెద్ద వినాశనాలను ఉదాహరణలుగా తీసుకున్నారు. ఒకటి నోవా కాలం, రెండవది లోతు కాలం. ఈ రెండు కాలాలలోనూ ఒక ఉమ్మడి శైలి కనిపిస్తుంది. ప్రజలు పాపంలో మునిగి తేలుతూ, దేవుని ఉనికిని పూర్తిగా మరచిపోయారు.
లౌకిక ఆకర్షణలు - ఆత్మీయ అంధత్వం: నోవా, లోతు రోజుల్లో ప్రజలు చేసిన పనులు (తినడం, తాగడం, వివాహాలు చేసుకోవడం, కొనడం, అమ్మడం, ఇళ్ళు కట్టడం) పాపభరితమైనవి కావు. అవి మానవ జీవితంలో దైనందిన అవసరాలు. అయితే, సమస్య ఎక్కడ వచ్చింది అంటే, వారు ఆ లౌకిక పనులలో ఎంతగా మునిగిపోయారంటే, తమ ఆత్మల రక్షణను, దేవుని నీతిని పూర్తిగా విస్మరించారు. ఎవరు చెప్పిన వినేటువంటి పరిస్థితులలో వారు లేరు. అంతేకాకుండా మంచి జీవితము జీవిస్తూ దేవునికి దగ్గరగా జీవించే వారిని హేళన చేసే జీవితంలోనికి వారు ప్రవేశించారు. దాని మూలముగా నోవా ఏమి చేస్తున్నది వారు పట్టించుకొనుట లేదు. అతను ఒక పిచ్చి వాడు అనే ఆలోచనలో వారు ఉండిపోయారు. కాని చివరి రోజు ప్రళయం వచ్చినప్పుడు నోవా వారికి అందుబాటులో ఉండటం లేదు. కేవలం లౌకిక విషయముల మీద మాత్రమే దృష్టి పెట్టి, ఇది మాత్రమే జీవితము అనుకునే వారికి వచ్చి పరిస్తితి ఇలానే ఉంటుంది.
తెలియని పరిణామం: ప్రళయం వచ్చే ముందు వరకు అంతా సవ్యంగానే ఉందనే భ్రమలో వారు బ్రతికారు. దేవుని తీర్పు ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా, అకస్మాత్తుగా వారిపై పడింది. నేటి సమాజం కూడా సరిగ్గా ఇదే స్థితిలో ఉంది. సాంకేతికత, ఆధునిక ఆడంబరాలలో మునిగిపోయి, ప్రభువు రెండవ రాకడను ఒక కట్టుకథగా కొట్టిపారేసే ప్రమాదం ఉంది. ఎటువంటి హెచ్చరిక లేకుండా ఏమి రాకడ రాదు, కాని ఈ లౌకిక విషయాలలో ఉన్నప్పుడు ఆ హెచ్చరికలను మనము పట్టించుకొము. వాటిని సాధారణ విషయాల వలె తీసి వేస్తాము. కొన్ని సమయాలలో మనం చిక్కుల్లో పడేది మనకు తెలియక కాదు కేవలం వాటిని తేలికగా తీసుకోవడం వలనే. కనుక ప్రతి నిమిషము ప్రభువుని రాకకు సిద్దముగా ఉండటము మంచిది.
దేవుని హెచ్చరికలు: ప్రేమతో కూడిన పిలుపు
ప్రభువు దయామయుడు. ఆయన ఎవ్వరూ నాశనం కావడం ఇష్టపడడు. అందుకే శిక్షించబోయే ముందు ఎల్లప్పుడూ హెచ్చరిస్తాడు.
"ప్రభువురోజు ఎటువంటి హెచ్చరిక లేకుండా వస్తుందా? ప్రభువు అనేక రోజులకు ముందుగానే హెచ్చరిస్తారు."
నోవా కాలపు హెచ్చరిక: నోవా ఓడను నిర్మిస్తున్నంత కాలం (దాదాపు 120 సంవత్సరాలు) అది ప్రజలకు ఒక నిశ్శబ్ద హెచ్చరిక. నోవా నీతిని ప్రకటించాడు, రాబోయే వినాశనం గురించి చెప్పాడు. కానీ ప్రజలు అతనిని చూసి నవ్వుకున్నారు, పిచ్చివాడిగా జమకట్టారు. దేవుని మాట కంటే తమ సొంత ఆలోచనలకే ప్రాధాన్యత ఇచ్చారు.
లోతు కాలపు హెచ్చరిక: సొదొమ, గొమొఱ్ఱా పట్టణాల పాపం పండినప్పుడు, దేవుడు దేవదూతలను పంపి లోతు ద్వారా హెచ్చరించాడు. లోతు తన అల్లుళ్ళతో ఈ విషయం చెప్పినప్పుడు, వారు అతనిని చూసి ఎగతాళి చేశారు.
ఈ రోజుల్లో కూడా పరిశుద్ధ గ్రంథం ద్వారా, సంఘం ద్వారా, సేవకుల ద్వారా దేవుడు మనల్ని నిరంతరం హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఈ హెచ్చరికలను పెడచెవిన పెట్టడం అంటే మన వినాశనాన్ని మనమే కొనితెచ్చుకోవడమే.
రక్షణ వ్యక్తిగతం: లోతు భార్య ఉదాహరణ
ఈ సువిశేష భాగంలో యేసుప్రభువు ఇచ్చిన అతి ముఖ్యమైన హెచ్చరిక: "లోతు భార్యను గుర్తు చేసుకొనుడు." ఇది ప్రతి విశ్వాసి గుండెల్లో నాటుకోవలసిన మాట.లోతు భార్య వృత్తాంతం మనకు నేర్పే పాఠాలు:
పాపపు లోకంపై మోహం: సొదొమ నుండి ఆమె శరీరం బయటపడింది కానీ, ఆమె హృదయం అక్కడి ఆస్తిపాస్తులు, ఆడంబరాలపైనే ఉండిపోయింది. అందుకే దేవుడు "వెనకకు చూడవద్దు" అని ఆజ్ఞాపించినా, ఆమె లోక ఆశను చంపుకోలేక వెనక్కి తిరిగింది.
ఆత్మీయ వారసత్వం రక్షించలేదు: ఆమె ఒక నీతిమంతుడైన లోతుకు భార్య కావచ్చు, దేవదూతల చేత చెయ్యి పట్టి నడిపించబడి ఉండవచ్చు. కానీ, అంతిమంగా ఆమె సొంత నిర్ణయం, అవిధేయత ఆమెను నాశనం చేశాయి. మన కుటుంబంలో భక్తులు ఉన్నంత మాత్రాన మనం రక్షించబడం. ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత రక్షణ కొరకు భయముతోను, వణకుతోను సిద్దపడాలి.
వేరుచేయబడటం: తీర్పు దినపు తీవ్రత
"ఆ రాత్రి ఒకే పడకమీద ఉన్న యిద్దరిలో ఒకడు కోనిపోబడును... ఇద్దరు స్త్రీలు తిరుగలి త్రిప్పుచుండ, ఒకరు కొనిపోబడును." ఈ వాక్యాలు అంత్యదినాన జరగబోయే విభజనను స్పష్టం చేస్తున్నాయి.
సాన్నిహిత్యం రక్షణకు గ్యారెంటీ కాదు: ఒకే మంచంపై పడుకునే భార్యాభర్తలు కావచ్చు, ఒకే చోట పని చేసే స్నేహితులు కావచ్చు. లోక సంబంధంగా వారు ఎంత దగ్గరి వారైనా, ఆత్మీయంగా వారి స్థితులు వేరువేరుగా ఉండవచ్చు.
అంతరంగీక పరిశీలన: దేవుడు బాహ్య రూపాన్ని చూడడు, హృదయాన్ని చూస్తాడు. ఒకరు దేవుని కొరకు సిద్ధంగా ఉంటే, మరొకరు లోక సంబంధిగా ఉంటారు. కాబట్టి, తీర్పు దినమున దేవుని సంకల్పం ప్రకారం నీతిమంతులు నిత్యజీవానికి కొనిపోబడతారు, అపనమ్మకస్థులు విడిచిపెట్టబడతారు. ఎవరి ఆత్మీయ బాధ్యత వారిదే.
నిజమైన సిద్ధపాటు: మనం ఏం చేయాలి?
కొన్ని సమయాలలో దేవుని రాకడ తీర్పు దినముగా, శిక్షించే రోజుగా చూస్తాము. కాని ప్రభువు రాకడ అనేది భయపెట్టే రోజు కాదు, అది విశ్వాసులకు ఆనంద దినం. అది తనను నమ్మి, తన ఆజ్ఞలను పాటించిన వారికి దేవుడు బహుమానం ఇచ్చే రోజు. కనుక ఆ రోజు కొరకు పెండ్లికుమారుని కొరకు ఎదురుచూసే పెండ్లికుమార్తెలా మనం సిద్ధపడాలి. ఆ సిద్ధపాటు ఎలా ఉండాలంటే:
వాక్య విధేయత: నోవా వలె లోకం ఏమనుకున్నా సరే, దేవుని ఆజ్ఞలకు లోబడాలి. సమాజం పాప మార్గంలో వెళ్తున్నా, మనం మాత్రం పవిత్రతను కాపాడుకోవాలి.
అప్రమత్తత (మెలకువగా ఉండటం): లౌకిక చింతలు, ధన మోహం, జీవపు డ్రాంబాల ద్వారా మన హృదయాలు మందగించకుండా చూసుకోవాలి. ప్రతి రోజును ప్రభువు రాకడ రోజైనట్లుగా జీవించాలి.
మారుమనస్సు - పశ్చాత్తాపం: మన జీవితాల్లో ఎక్కడైనా లోతు భార్య లాంటి వెనక చూపులు, లోక ఆశలు ఉంటే వాటిని ఇప్పుడే కడిగివేసుకోవాలి. క్షమాపణ పొంది, ప్రతి నిమిషం దేవుని అనుగ్రహానికి పాత్రులుగా మారాలి.
రక్షకుడవైన ప్రభువా! మీ రాకడకు నేను ఎప్పుడు సిద్ధముగా ఉండుటకు నోవా,లోతుల వలె మీ ఆజ్ఞలకు ఎప్పుడు బద్ధుడనై జీవించే విధంగా నన్ను మలచమని వేడుకుంటున్నాను. నా జీవితాన్ని ఇతరులతో పోల్చుకోకుండా మీ ఆజ్ఞలను నేర్చుకుంటూ, మీ మాటను పాటించుటకు కావలసిన అనుగ్రహాలు దయచేయండి. ప్రభువా మీరు నా జీవితంలో అనేక హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. కాని వాటిని కొన్ని సమయాలలో తెలుసుకోలేకపోతున్నాను. ఈ లోక ఆశలకు, కోరికలకు వాటి బంధనాలకు లోను కాకుండా మీ మీద ప్రేమ కలిగి, మిమ్ములను తెలుసుకొని, జీవించుటకు కావలసిన అనుగ్రహము దయచేయండి. నా జీవితమును పవిత్రీకరించుకొనుటకు మీ అనుగ్రహాలు దయచేమని వేడుకుంటున్నాను. ఆమెన్
Comments
మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:
Post a Comment