పవిత్ర గ్రంధంలో ఉపవాసం Telugu | Fasting in Bible Telugu | కార్మెల్ శోభ




 లూకా 5: 33-39


"యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు, ప్రార్ధనలు చేసెదరు. అటులనే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కాని, మీ శిష్యులు మాత్రము తిని త్రాగుచున్నారేల?" అని కొందరు యేసును ప్రశ్నించిరి. అందుకు యేసు "పెండ్లి కుమారుడు ఉన్నంతవరకు విందునకు వెళ్ళినవారు ఉపవాసము చెయుదురా? పెండ్లి కుమారుడు తమ వెంట ఉన్నంత వరకు ఆ ఇంటి వారిచేత ఉపవాసము చేయింపగలరా? పెండ్లి కుమారుడు వారిని ఎడబాయుకాలము వచ్చును. అపుడు వారు ఉపవాసము చేయుదురు" అని వారితో పలికెను. యేసు వారికి ఇంకను ఈ ఉపమానమును చెప్పెను: "ప్రాత గుద్దకు మాసికవేయుటకు క్రొత్త గుడ్డను ఎవరు చింపుదురు? అటుల చేసిన యెడల క్రొత్త గుడ్డ చినిగి పోవుటయేకాక, అది ప్రాత గుద్దకు అతుకుకొనదు. అట్లే కొత్త ద్రాక్షారసమును ప్రాత తిత్తులలో ఎవరును పోయరు. అటుల పోసిన యెడల ఆ ప్రాత తిత్తులు పిగులును, ఆ రసము నేలపాలగును, తిత్తులు నశించిపోవును. కనుక, క్రొత్త రసమును క్రొత్త తిత్తులలోనే ఉంచవలయును. ప్రాత రసమునకు అలవడినవాడు క్రొత్త రసమును తాగుటకు ఇష్టపడడు. అతడు ప్రాతరసమే మేలు అనును".


ఉపవాసం : పశ్చాత్తాపం వ్యక్తం చేయుటకు, దేవుని రాకకు సిద్దపడుటకు

దేవుని అనుగ్రహం కోసం పవిత్ర గ్రంథంలో అనేక మంది ఉపవాసం చేసేవారు. కేవలం దేవుని అనుగ్రహం పొందడం కోసమే కాక పశ్చాత్తాపమును వ్యక్తము చేయుటకు కూడా ఉపవాసం చేసేవారు. దేవుని పండుగలను కొనియాడేముందుగా ఆ పండుగ కోసం ఆయత్తపడుట లేక సిద్ద పడుట కోసం ఉపవాసం చేస్తారు. కొంతమంది మెస్సియ్యా రాకడను కాంక్షిస్తూ, దానికి సిద్దపడుతూ ఉపవాసం చేసేవారు. ఈ విధంగా పవిత్ర గ్రంథంలో అనేక మంది ఉపవాసం చేయడం మనము చూస్తాము. యోహాను శిష్యులు చేసే ఉపవాసం మెస్సియ్యా రాకడను కాంక్షిస్తూ, అందుకు సిద్ద పడుటకు చేసే ఉపవాసము. ఎందుకంటే యోహాను ఈ మెస్సియ్యా రాకడను గురించి అందరు సమాయత్తపడాలని బోధించాడు. అంతేకాక యోహాను కొమరను సంఘం గురించి తెలిసినవాడని వీరు మెస్సియ్యా రాకడకు సిద్దపడే సంఘం కాబట్టి వారితో కలసి జీవించాడు అనే నమ్మకం కూడ కొంత మందిలో ఉండేది. వీరు ప్రార్ధన, ఉపవాసములతో జీవించారు. యోహాను కూడా అతి స్వల్పమైన ఆహారముతోనే జీవించాడు. యోహాను జీవితం ప్రభువు రాకడకు సిద్ధపాటు జీవితంగా సాగింది.

యేసు ప్రభువు సాన్నిధ్యం సంతోషదాయకం 

యేసు ప్రభువు దగ్గరకు కొందరు వచ్చి యోహాను శిష్యులు, పరిసయ్యుల శిష్యులు తరచుగా ఉపవాసం, ప్రార్థనలు చేస్తారు కాని మీ శిష్యులు తిని త్రాగుచున్నారేలా? అని ప్రభువును వారు ప్రశ్నించారు. అయితే ప్రభువు ఎందుకు ఆయన శిష్యులు ఉపవాసం చేయడం లేదో వారికి వివరిస్తున్నారు. యేసు ప్రభువు పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు పెండ్లికి వచ్చిన వారు ఉపవాసం చేయుదురా అని అడుగుతున్నారు. ప్రభువు ఎందుకు ఇలా అడుగుతున్నారంటే యేసు ప్రభువే మెస్సియా. యోహాను లేక అతని శిష్యులు ఉపవాసం చేసేది ఈ మెస్సియా కోసమే. అందుకే యోహాను శిష్యులలో కొంతమంది యేసు ప్రభువే మెస్సియా అనే సత్యం తెలుసుకున్న తరువాత యేసు ప్రభువు శిష్యులుగా మారిపోతున్నారు. ఒక వ్యక్తి మెస్సియా రాకడకొరకు, లేక రక్షకుని ఆహ్వానించడానికి ఉపవాసం చేసినట్లయితే ఇప్పుడు ఆ పని చేయనవసరం లేదు. ఆ రక్షకుడు వారి దగ్గరనే ఉన్నారు, ఆయనే యేసు ప్రభువు. శిష్యులు దేవుని అనుగ్రహం కోసం ఉపవాసం చేయవలసి వస్తే అది అవసరం లేదు, దేవుడే వారితో ఉన్నారు. కనుక ప్రభువు రూపంలో సమస్తము వారి దగ్గరనే ఉన్నవి.

ఈ సందర్భాన్ని మనం మరింత లోతుగా పరిశీలిస్తే, యూదా సంస్కృతిలో "పెండ్లి కుమారుడు" (Bridegroom) మరియు "విందు" (Wedding Feast) అనే పదాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. పాత నిబంధన గ్రంథంలో దేవునికి, ఇశ్రాయేలు ప్రజలకు మధ్య గల నిబంధన బంధాన్ని ప్రవక్తలు తరచుగా వివాహ బంధంతో పోల్చారు. యెషయా, హోషేయ ప్రవక్తల గ్రంథాలలో దేవుడే ఇశ్రాయేలుకు భర్తగా, పెండ్లి కుమారుడిగా అభివర్ణించబడ్డాడు. ఇప్పుడు నూతన నిబంధనలో యేసుక్రీస్తు తానే ఆ పరలోకపు పెండ్లి కుమారుడనని ప్రకటించుకుంటున్నారు. దేవుడే స్వయంగా మానవరూపంలో తన వధువైన సంఘాన్ని (ప్రజలను) కలుసుకోవడానికి వచ్చినప్పుడు, అక్కడ దుఃఖానికి, ఉపవాసానికి తావులేదు. అది కేవలం సంబరాలకు, ఆనందానికి సమయం.

శిష్యులు పాప క్షమాపణ కోసమో లేక పశ్చాతాపము వ్యక్తపరచడానికో ఉపవాసము చేయవలసి వస్తే వారిని ప్రభువు తన సాన్నిధ్యంతో పవిత్రులను చేస్తున్నారు అందుకు కూడా వారు ఉపవాసం చేయనవసరం లేదు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట మరియు దేవునితో సత్సంబంధము నెలకొల్పుకొనుట. ప్రభువే వారితో ఉంటున్నారు కనుక దేవునితో వారికి మంచి సంబంధము ఉంది. ప్రతి రోజు, ప్రతి నిముషం వారు ప్రభువు తోనే ఉంటున్నారు. ప్రభువుతో వారు మాట్లాడుతూనే ఉన్నారు.

క్రొత్త నిబంధన - నూతన జీవన విధానం (ఉపమానాల అంతరార్థం)

పరిసయ్యులు, యోహాను శిష్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా యేసు కేవలం పెండ్లి కుమారుడి ఉదాహరణ మాత్రమే కాక, రెండు అద్భుతమైన ఉపమానాలను కూడా చెప్పారు.

  1. ప్రాత గుడ్డ - క్రొత్త మాసిక

  2. ప్రాత తిత్తులు - క్రొత్త ద్రాక్షారసము

ఈ ఉపమానాల ద్వారా యేసు ఒక సరికొత్త ఆధ్యాత్మిక విప్లవాన్ని ప్రకటిస్తున్నారు. పాత నిబంధన యొక్క ఆచారాలు, కఠినమైన నియమాలు, కేవలం బాహ్య భక్తిని ప్రదర్శించే ఉపవాసాలు "పాత గుడ్డ" మరియు "పాత తిత్తులు" వంటివి. యేసుక్రీస్తు ద్వారా వచ్చిన కృప, సత్యము, విముక్తి మరియు సంతోషం "కొత్త ద్రాక్షారసము" మరియు "కొత్త గుడ్డ" వంటివి.

ముఖ్య గమనిక: పాత చట్టబద్ధమైన (Legalistic) మనస్తత్వంలోకి ఈ సరికొత్త సువార్త సత్యాన్ని ఇమడ్చడం సాధ్యం కాదు. పాత తిత్తులలో కొత్త రసాన్ని పోస్తే, ఆ రసము యొక్క వీర్యానికి, పొంగుకు పాత తిత్తులు పగిలిపోతాయి. రసము నేలపాలవుతుంది, తిత్తులు పాడవుతాయి. అనగా, కేవలం బాహ్య నియమాలకు పరిమితమైన యూదా మతాచారాల పరిధిలో క్రీస్తు తెచ్చిన స్వేచ్ఛను, ఆనందాన్ని ఇరికించలేము.

యేసుక్రీస్తు తన శిష్యులకు బాహ్య శృంఖలాల నుండి విముక్తిని ప్రసాదించారు. హృదయపూర్వకమైన మార్పు లేకుండా కేవలం ఇతరులకు చూపించుకోవడం కోసం చేసే ఉపవాసాలు నిష్ప్రయోజనమని ఆయన స్పష్టం చేశారు. "ప్రాత రసమునకు అలవడినవాడు క్రొత్త రసమును తాగుటకు ఇష్టపడడు" అని అనడంలో మానవ నైజాన్ని యేసు ఎత్తిచూపారు. మనుషులు తరచుగా తమ పాత అలవాట్లకు, సంప్రదాయాలకు, మూఢనమ్మకాలకు కట్టుబడి ఉండటానికే ఇష్టపడతారు. మార్పును అంగీకరించడం కష్టం. కానీ క్రీస్తు సాన్నిధ్యం మన హృదయాలను సరికొత్త తిత్తులుగా మార్చాలని కోరుకుంటుంది.

పెండ్లి కుమారుడు ఎడబాయు కాలము

పెండ్లి కుమారుడు వారి నుండి ఎడబాయు కాలము వచ్చును అప్పుడు వారు ఉపవాసము చేయుదురు అని ప్రభువు చెబుతున్నారు. యేసు ప్రభువు తన శిష్యులతో ఉన్నంత కాలము వారు దేవుని సాన్నిధ్యాన్ని అనుభవిస్తున్నారు. వారు ఉపవాసము చేయనవసరం లేదు. కాని వారి వద్ద నుండి ఆయన వెళ్ళిపోతారు. అప్పుడు వారు తప్పకుండా ఉపవాసం చేయవలసి వస్తుంది.

ఇక్కడ యేసుక్రీస్తు తన మరణాన్ని, పునరుత్థానాన్ని మరియు పరలోక ఆరోహణను ప్రవచిస్తున్నారు. క్రీస్తు సిలువ వేయబడినప్పుడు, ఆయన సమాధి చేయబడినప్పుడు శిష్యులు తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయారు. ఆ సమయంలో వారు ఉపవాసం ఉండి, ప్రార్థించారు. పాత నిబంధనలో దైవ మందసము యిస్రాయేలు నుండి తీసివేయబడింది. అపుడు ఆ ప్రజలు బాధలలో నిండిపోయారు. అందుకే ఏలి కోడలు, ఏలి దేవుని మహిమ యిస్రాయేలును విడిచిపోయినది అని చెబుతున్నారు. దైవ సన్నిధి దూరమవడం అనేది ఆత్మకు కలిగే అతిపెద్ద నష్టం.

మన జీవితంలో ప్రభువు లేని సమయం - ఉపవాసం సమయం

ప్రభువు మనతో లేనప్పుడు మనము ఉపవాసం చేయవలసిన సమయం. అది శిష్యుల జీవితంలో కూడా వస్తుంది. ఆయన వారి వద్ద నుండి వెళ్ళిపోతారు. ఎప్పుడు ప్రభువు మన వద్ద నుండి వెళ్ళిపోతారు? పవిత్ర గ్రంథంలో దేవుని సాన్నిధ్యం ఎప్పుడు యిస్రాయేలు ప్రజలకు దూరం అవుతుంది అంటే యిస్రాయేలు ప్రజలు వారికి ఇష్టమైన విధంగా జీవిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో అపవిత్రంగా ఉన్నప్పుడు, దైవ సన్నిధిలో ఉండి అక్కడ సేవ చేసేవారిని బాధించినప్పుడు, దైవ సాన్నిధ్యాన్ని అపవిత్ర పరచినప్పుడు, యిర్మీయా చెబుతున్నట్లు, గర్వంతో ఉంటూ, మంచి జీవితం జీవించకుండా నాకు ఏమి కాదు నేను దేవుని సన్నిధిలో ఉన్నాను అనుకునే సమయాల్లో దేవుడు దూరమవుతారు. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఉపవాసం చేయవలసి ఉంటుంది. ఆ ఉపవాసం మరల ప్రభువుతో కలసి ఉండుటకు.

మన దైనందిన జీవితంలో కూడా మనం పాపంలో పడిపోయినప్పుడు, స్వార్థానికి లోనైనప్పుడు, దేవుని వాక్యానికి దూరంగా జీవిస్తున్నప్పుడు దైవ సాన్నిధ్యాన్ని కోల్పోతాము. అటువంటి సమయాల్లో ఉపవాసం అనేది కేవలం ఆహారాన్ని విడిచిపెట్టడం కాదు, మన అహంకారాన్ని, మన పాపపు అలవాట్లను విడిచిపెట్టడం.

ఉపవాసము యొక్క నిజమైన ఉద్దేశాలు:

  • ఆధ్యాత్మిక పునరుజ్జీవనం: దేవునితో తెగిపోయిన బంధాన్ని తిరిగి బలపరచుకోవడం.

  • శరీర అణచివేత: శారీరక ఆశలపై ఆత్మకు విజయాన్ని చేకూర్చడం.

  • పశ్చాత్తాపం: మన తప్పులను ఒప్పుకొని, దేవుని వైపు తిరిగి రావడం.

ప్రవక్త యోవేలు గ్రంథంలో దేవుడు సెలవిచ్చినట్లు: "మీ వస్త్రములను కాదు మీ హృదయములను చింపుకొని మీ దేవుడైన యెహోవా వైపు తిరుగుడి." (యోవేలు 2:13). ఇటువంటి అంతరంగిక మార్పును కలిగించే ఉపవాసమే దేవునికి ఇష్టమైనది. అది మనల్ని మరల క్రీస్తు అనే పెండ్లి కుమారుని విందుసారంలో పాలిభాగస్థులను చేస్తుంది.

సంభాషణ మరియు ప్రార్ధన ప్రభువా! మీరు శిష్యులతో ఉన్నంత కాలం శిష్యులు ఎంతో ఆనందంగా ఉన్నారు. వారు మీతో కలసి ఉండటం వలన, మిమ్ములను పొందటం వలన, మీ సహచర్యంలో జీవించడం వలన వారి జీవితంలో ఒక మధురానుభూతిని పొందుతున్నారు. అనేక మంది దీర్ఘదర్శులు ఈ ప్రభువు సాన్నిధ్యం అనుభవించాలని కోరుకున్నారు. కాని వారందరికీ దొరకని ఈ గొప్ప అవకాశం మీ శిష్యులకు అనుగ్రహించారు. ఆ ధన్యతను మీ శిష్యులు పూర్తిగా తెలుసుకున్న, తెలుసుకోలేక పోయిన అది స్వర్గీయ అనుభూతి. అందుకే వారిలో కొందరైనా మీ సాన్నిధ్యం విలువ తెలుసుకొనవలెననేమో మీరు ముగ్గురితో రూపాంతరీకరణ చెందుతున్నారు. ప్రభువా! మీ సహాచర్యము మనిషిని ఎంత ఉన్నతునిగా తీర్చిదిద్దుతుందో సాధారణ జాలరులు, సుంకరులుగా ఉన్న వారు, ఎంతటి ఉన్నత కార్యాలు చేయగలిగారో తెలుసుకోగలిగితే అర్థమౌతుంది. ప్రభువా! మీ సాన్నిధ్యం కోల్పోవడం అంటే మేము పాపంలో కూరుకుపోవడమే. మేము ఎల్లప్పుడు పవిత్రంగా ఉంటూ, చెడు క్రియల జోలికి పోకుండా, గర్వం దరిచేరనివ్వకుండ, మీ మహిమ మమ్ములను ఎప్పటికి విడిపోకుండా మమ్ము దీవించండి. అంతేకాక మా చెడు జీవితం వలన మిమ్ము దూరం చేసుకొన్న సమయాలలో మీతో కలసి ఉండాలనే కోరికతో మేము చేసే ఉపవాసమును, మీతో సత్సంబంధమును ఏర్పరుచుకొనుటకు మేము చేసే ప్రార్ధనను ఆలకించి మమ్ము అనుగ్రహించండి. ఆమెన్

Fr. Amruth

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబిల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పవిత్రుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

📲 మా WhatsApp Channel జాయిన్ అవ్వండి!

ప్రతి నిత్య పోస్ట్ మీ WhatsApp కు నేరుగా వస్తుంది

Join WhatsApp Channel

Comments

మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:

Post a Comment

కామెంట్‌లు