కనికరించే యేసు హృదయం - మత్తయి 9:36-10:8 దైవసందేశం | Telugu Sermon| carmelshobha

 


కనికరించే ప్రభువు – ఆయన శిష్యుల బాధ్యత

మత్తయి సువార్త 9:36 - 10:8

నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు, కాపరిలేని గొర్రెలవలె చెదరియున్న  జనసమూహమును చూచినప్పుడు ఆయనకు కనికరము కలిగెను. అపుడు యేసు తన శిష్యులతో "పంట మిక్కుటము, కాని కోతగాండృ తక్కువ. కావున పంటను కోయుటకు కావలసిన కోతగాండృను పంపవలసినదని పంట యజమానునికి  మనవిచేయుడు" అని పలికెను. యేసు తన పన్నిద్దరు శిష్యులను చెంతకు పిలిచి, అపవిత్రాత్మలను పారద్రోలుటకు, సకల వ్యాధిబాధలను పోగొట్టుటకు, వారికి అధికారము ఇచ్చెను. ఆ పన్నిద్దరు అపోస్తులుల పేర్లు ఇవి: అందు మొదటివాడు పేతురు అనబడు సీమోను, తదుపరి అతని సోదరులు అంద్రేయ, జెబదాయి కుమారుడగు యాకోబు, అతని సోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరియగు మత్తయి, ఆల్ఫాయి కుమారుడగు యాకోబు, తద్దయి, కనానీయుడగు సీమోను, ఆయనను అప్పగించిన యూదా ఇస్కారియోతు. యేసు ఈ పన్నిద్దరు శిష్యులను  పంపుచు వారికి ఆజ్ఞనిచ్చెను " అన్య జనులుండు  ఏ ప్రదేశములలోను అడుగుమోపవలదు. సమరీయుల ఏ పట్టణమునను ప్రవేశింపరాదు. కాని, చెదరిపోయిన గొర్రెల వలె నున్న యిస్రాయెలు ప్రజల వద్దకు వెళ్ళి, పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు. వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు; మరణించిన వారిని జీవముతో లేపుడు; కుష్టరోగులను శుద్దులను గావింపుడు, దయ్యములను వెడలగొట్టుడు. మీరు ఉచితముగ పొందితిరి. ఉచితముగానే ఒసగుడు. 


 సువిశేష భాగం  క్రైస్తవ జీవితానికి, పరిచర్యకు అత్యంత కీలకమైనది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం నుండి 10వ అధ్యాయం 8వ వచనం వరకు ఉన్న ఈ వచనాలు  మనకు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక  ప్రయాణాన్ని చూపిస్తాయి. ఈ భాగం కొన్ని  ముఖ్యమైన అంశాలను మన ముందుకు తెస్తుంది వాటిలో ముఖ్యముగా కనికరించే యేసుప్రభువు హృదయం,  ప్రార్థన ద్వారా వచ్చే పిలుపు, మరియు ఆ పిలుపుతో పాటు లభించే  అధికారం మరియు  బాధ్యత వంటి విషయాలు మనం ఇక్కడ చూడవచ్చు.

మన రక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకంలో కేవలం బోధకుడిగా మాత్రమే కాదు, మన బలహీనతలను ఎరిగిన ప్రధాన యాజకుడిగా, ఒక కాపరిగా జీవించారు. ఆయన అడుగుజాడల్లో నడవవలసిన మనకు ఈ వాక్య భాగం ఎలాంటి సవాళ్లను విసురుతుందో ఈ ముఖ్యమైన అంశాల ద్వారా ధ్యానిద్దాం.

కనికరించే యేసు హృదయం (మత్తయి 9:36)

నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు, కాపరిలేని గొర్రెలవలె చెదరియున్న  జనసమూహమును చూచినప్పుడు ఆయనకు కనికరము కలిగెను.

యేసు ప్రభువు ప్రజలను చూశాడు. కానీ ఆ చూపు మన మామూలు చూపు వంటిది కాదు. మనం మనుషుల బాహ్య రూపాన్ని, వారి అంతస్థులను చూస్తాము. కానీ యేసు ప్రభువు ప్రజల హృదయ లోతుల్లో దాగిన వేదనను, భయాలను, ఒంటరితనాన్ని చూశాడు.

ఆయన ఆనాటి ప్రజలను కాపరిలేని గొర్రెలు” అని పిలిచాడు. ఆ కాలంలో ఇశ్రాయేలీయులకు మత నాయకులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులకు కొరత లేదు. కానీ వారు ప్రజల ఆత్మలను పోషించే కాపరులుగా కాకుండా, వారిపై మోయలేని ధర్మశాస్త్ర భారాలను మోపే స్వార్థపరులుగా మారారు. అందుకే ప్రజలు ఆధ్యాత్మికంగా బడలిపోయి, దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

ఇక్కడ ఉపయోగించిన గ్రీకు పదాలు  చాలా శక్తివంతమైనవి. దీని అర్థం ‘ప్రేగులు కదిలిపోయేంతటి గాఢమైన వేదన’. చర్మం వలిచివేయబడినట్లు గాయపరచబడిన స్థితిని, చెల్లాచెదురుగా విసిరివేయబడిన దైన్య స్థితిని  ఇక్కడ గ్రీకు బాషలో వాడిన పదాలు చూసిస్తాయి. యేసు ప్రభువు ప్రజల ప్రతి బాధను ఆయన అనుభవించిన విధంగా, లేక అంతలా వారి బాధను చూశాడు. కాని ధర్మ శాస్త్ర బోధకులు అలా ప్రజలను చూడలేక పోయారు. ఈ కాపరుల తీరు  యెహెజ్కేలు ప్రవక్త 34వ అధ్యాయంలో దేవుడు హెచ్చరించిన ‘చెడ్డ కాపరుల’ తీరును గుర్తుకు తెస్తుంది.

యేసు ప్రభువు ద్వారా ఇక్కడ మనం నేర్చుకొనవలసినది మన చుట్టూ ఉన్న ప్రజలను - మన కుటుంబ సభ్యులను, స్నేహితులను, సమాజాన్ని యేసు ప్రభువు  చూపుతో చూస్తున్నామా? లేదా వారిని కేవలం సమస్యలుగా, మన ఎదుగుదలకు అడ్డంకులుగా చూస్తున్నామా? నిజమైన క్రైస్తవ సేవ కనికరం లేకుండా ప్రారంభం కాదు. కనికరం లేని సేవ వ్యర్థమైనది.

 కోత విస్తారం – ప్రార్థన ఆవశ్యకత (మత్తయి 9:37-38)

పంట మిక్కుటము, కాని కోతగాండృ తక్కువ. కావున పంటను కోయుటకు కావలసిన కోతగాండృను పంపవలసినదని పంట యజమానునికి  మనవిచేయుడు

యేసు ప్రభువు ఇక్కడ పంటకోత ఉపమానాన్ని వాడుతున్నారు. పాత నిబంధనలో (యోవేలు, యెషయా గ్రంథాల్లో) ‘కోత’ అనేది దేవుని తీర్పుకు సాదృశ్యంగా ఉంది. కానీ ఇక్కడ యేసు ప్రభువు దానిని రక్షణ కోణంలో, ఆత్మల రక్షణ కొరకు ఉపయోగిస్తున్నారు. దేవుని వాక్యాన్ని స్వీకరించడానికి హృదయాలు సిద్ధంగా ఉన్నాయి, కానీ సమస్య ఏమిటంటే - ‘పనివారు కొద్దిగా ఉన్నారు’. ప్రభువుని వాక్కును ప్రకటించేవారు లేకపోయారు. 

ఈ లోకంలో ఆధ్యాత్మిక ఆకలితో ఉన్నవారు కోట్ల మంది ఉన్నారు, కానీ వారికి దేవుని ప్రేమను నిజాయితీతో అందించే సేవకులు తక్కువగా ఉన్నారు. పరిసయ్యుల కాఠిన్యం ప్రజలను దేవునికి దూరం చేసింది. కాబట్టి యేసు ప్రభువు ఒక  ప్రార్థన విజ్ఞాపనను శిష్యుల ముందు ఉంచారు: పంట యజమానునికి  మనవిచేయుడు’.

ఇక్కడ ఒక అద్భుతమైన సత్యాన్ని మనం గమనించాలి. ఎవరినైతే ప్రార్థించమని యేసు ప్రభువు  చెప్పాడో (9:38), వారే తరువాత  వచనంలో (10:1) పరిచర్యకు పంపబడ్డారు! ప్రార్థన చేసే హృదయమే పరిచర్యకు పంపబడుతుంది.  ఎవరైతే ప్రార్దన లేకుండా ఉంటారో, వారు దేవునికి దూరంగానే ఉంటారు, కేవలం మాటలు చెప్పేవారిగా, లేక ధర్మశాస్త్ర బోధకులుగానే వుంటారు. కాని ప్రభువు చెప్పినట్లు ప్రార్దన చేస్తూ ఉంటారో వారు దైవ సేవకు వెళ్ళినప్పుడు ప్రవక్తలు వెళ్ళినప్పుడు జరిగిన మార్పు, శిష్యులు వెళ్ళినప్పుడు జరిగిన మార్పు జరుగుతుంది. 

మనం కొత్త కార్యక్రమాలు, వ్యూహాలు ఆలోచించే ముందు, మొదట మోకాళ్లపై వంగి ప్రార్థించాలి. మనలో చాలామంది సమస్యలను చూసి ఆందోళన చెందుతారు, చర్చిస్తారు, కానీ ప్రార్థించడం మాత్రం మర్చిపోతారు. ప్రార్థనే దైవిక పరిచర్యకు మొదటి అడుగు.

పన్నెండుమంది అపొస్తలుల పిలుపు, అధికారం (మత్తయి 10:1-4)

యేసు తన పన్నిద్దరు శిష్యులను చెంతకు పిలిచి, అపవిత్రాత్మలను పారద్రోలుటకు, సకల వ్యాధిబాధలను పోగొట్టుటకు, వారికి అధికారము ఇచ్చెను. ఆ పన్నిద్దరు అపోస్తులుల పేర్లు ఇవి.”

 మత్తయి సువార్తలో ఇక్కడే మొదటిసారిగా ‘శిష్యులు’ అనే పదం అపొస్తలులు’గా మారుతుంది.

  • శిష్యుడు’ అంటే నేర్చుకునేవాడు, గురువును అనుసరించేవాడు.
  • అపొస్తలుడు’ అంటే అధికారికంగా పంపబడిన వాడు 

యేసు ప్రభువు ఏర్పాటు చేసుకున్న ఈ ‘పన్నెండు’ అనే సంఖ్య ఇశ్రాయేలు యొక్క పన్నెండు గోత్రాలను సూచిస్తుంది. ప్రభువు  ఈ పన్నెండుమంది ద్వారా ఒక నూతన ఇశ్రాయేలును, దేవుని కొత్త నిబంధన ప్రజలను స్థాపిస్తున్నారు.

ఈ పన్నెండుమంది జాబితాను చూస్తే వారిలో ఎంత వైవిధ్యం ఉందో అర్థమవుతుంది:

  • పేతురు, అంద్రెయ: సాదాసీదా జాలరులు.
  • మత్తయి: రోమా ప్రభుత్వానికి పన్ను వసూలు చేసే సుంకరి (సమాజం తృణీకరించిన వ్యక్తి).
  • సీమోను (కనానీయుడు): రోమా పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడే తీవ్ర జాతీయవాది (Zealot).

సాధారణ లోకంలో మత్తయి, సీమోను ఒకరినొకరు చంపుకునేంత శత్రువులు. కానీ యేసు తన ప్రేమ శక్తితో ఈ శత్రువులను సహోదరులుగా మార్చాడు. చివరగా, యూదా ఇస్కరియోతు పేరు వస్తుంది. అతను  ‘ఆయనను  అప్పగించినవాడు’ అనే వివరణతో అతను చేసిన గురుద్రోహం మనకు గుర్తు చేస్తుంది, దేవుని పిలుపు పొందిన వారు పరిపూర్ణులు కాదు, అందరిలోనూ బలహీనతలు ఉంటాయి. అయినప్పటికీ యేసు ప్రభువు  తన పని కొరకు అసంపూర్ణులైన మనుషులనే ఎంచుకుంటాడు. ఆయన బాధ్యతలతో పాటు అపవిత్రాత్మలపై, వ్యాధులపై అధికారాన్ని కూడా అనుగ్రహిస్తాడు. మన బలహీనతలను లేక బలాలను బట్టికాక మనమీద ప్రేమతో ఆయన మనలను ఎన్నుకుంటాడు, అధికారమును ఇస్తాడు. 

పరిచర్య పరిధి – నియమాలు (మత్తయి 10:5-6)

అన్య జనులుండు  ఏ ప్రదేశములలోను అడుగుమోపవలదు. సమరీయుల ఏ పట్టణమునను ప్రవేశింపరాదు. కాని, చెదరిపోయిన గొర్రెల వలె నున్న యిస్రాయెలు ప్రజల వద్దకు వెళ్ళి, పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు.

ఈ వచనం చదివినప్పుడు కొందరికి ఆశ్చర్యం కలగవచ్చు. యేసు అన్యజనుల వద్దకు వెళ్లవద్దని ఎందుకు ఆంక్షలు విధించారు? ఇది శాశ్వత నియమం కాదు, ఎందుకంటే యేసు పునరుత్థానం తర్వాత మీరు వెళ్లి సకల జాతి  జనులకు పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానమోసగుచు వారిని నా  శిష్యులనుగా చేయుడు” (మత్తయి 28:19) అని ఆజ్ఞాపించారు. మరి ఎందుకు ఇక్కడ ఒక పరిధి ఏర్పాటు చేశారంటే  దేవుడు అబ్రాహాముతో, దావీదుతో చేసిన నిబంధన ప్రకారం, రక్షణ సందేశం మొదట ఇశ్రాయేలు జాతికే చేరాలి. పౌలు కూడా రోమా పత్రికలో ముందు యూదునికి, తరువాత గ్రీకువానికి’ అని అంటాడు. ఇది వివక్ష కాదు, దేవుని ప్రణాళిక యొక్క వ్యూహాత్మక ప్రారంభం.

నేటి సందర్భంలో, ఇతరుల గురించి మాటలాడే ముందు ఈ సువార్తను మన ఇంటివారికి అందిచామా? అని చూడాలి. మనం ప్రపంచ సువార్తీకరణ గురించి మాట్లాడే ముందు, మన ఇంట్లో, మన వీధిలో ఉన్న ఆధ్యాత్మిక అవసరాలను గుర్తించాలి. సువార్త సేవ మన ఇరుగుపొరుగు నుండే ప్రారంభం కావాలి.

 పరిచర్య సందేశం – ఉచితమైన కృప (మత్తయి 10:7-8)

పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు. వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు; మరణించిన వారిని జీవముతో లేపుడు; కుష్టరోగులను శుద్దులను గావింపుడు, దయ్యములను వెడలగొట్టుడు. మీరు ఉచితముగ పొందితిరి. ఉచితముగానే ఒసగుడు. .”

శిష్యులు ప్రకటించాల్సిన సందేశం చాలా స్పష్టమైనది: పరలోకరాజ్యము సమీపించియున్నది’. ఇది ఏదో ఒక భౌతిక స్థలం గురించి కాదు. ఇది దేవుని పాలన, దేవుని రాజరికం గురించి. ఈ రాజ్య ప్రకటనకు రుజువుగా యేసు వారికి నాలుగు రకాల అద్భుతాలు చేసే శక్తిని శిష్యులకు ఇచ్చారు:

  1. రోగములను స్వస్థపరచడం: దేవుని రాజ్యంలో రోగాలకు చోటు లేదని చూపడానికి.
  2. చనిపోయినవారిని లేపడం: మరణంపై జీవాధిపతియైన దేవుని విజయాన్ని చాటడానికి.
  3. కుష్ఠరోగులను శుద్ధి చేయడం: సమాజం వెలివేసిన వారిని దేవుడు చేరదీస్తాడని నిరూపించడానికి.
  4. దయ్యములను వెళ్లగొట్టడం: సాతాను సామ్రాజ్యంపై దేవుని రాజ్య విజయానికి సాదృశ్యం.

ఈ అద్భుతాలన్నిటి వెనుక ఉన్న అతి ప్రాముఖ్యమైనది : మీరు ఉచితముగ పొందితిరి. ఉచితముగానే ఒసగుడు. శిష్యులు ఈ వరాలను తమ యోగ్యత వల్ల పొందలేదు. దేవుడు తన కృప చేత ఉచితంగా ఇచ్చాడు. కాబట్టి దేవుని సేవను వ్యాపారంగా మార్చకూడదు. ఆత్మీయ వరాల ద్వారా ధనార్జన చేయకూడదు.

ఆవిలాపురి తెరేసమ్మ  గారు చెప్పినట్లు, దేవుడు పెద్ద పనులను చిన్న, బలహీనమైన పాత్రల ద్వారానే జరిగిస్తాడు. దేవుని దృష్టిలో మన అర్హత కంటే ఆయనకు మనం ప్రామాణీకముగా ఉండటము ముఖ్యము. 

ఈ  సువిశేష భాగం మనకు 

  •  యేసు  ప్రభువు వలె మన చుట్టూ ఉన్న ప్రజల వేదనను చూసి కనికరపడటం.
  • ఆ కనికరంతో పంట  యజమానునికి ప్రార్థించడం.
  • ఆయన ఇచ్చిన పిలుపును, అధికారాన్ని అందుకొని సేవ చేయడం నేర్పుతుంది.

మనం మన హృదయాలను పరీక్షించుకుందాం. నా చుట్టూ ఉన్న ‘కాపరిలేని గొర్రెలను’ నేను చూస్తున్నానా? దేవునితో  వారి కోసం   నేను ప్రార్థిస్తున్నానా? దేవుడు నాకు ఉచితంగా ఇచ్చిన అనుగ్రహాలను , ప్రేమను నేను ఇతరులకు ఉచితంగా పంచిపెడుతున్నానా?

కనికరించే యేసుప్రభువు ఇప్పటికీ మన మధ్యే ఉన్నారు. ఆయన ఇప్పటికీ ప్రజలను చూసి జాలిపడుతున్నారు. ఆయన వలె మారుతు సువార్తను ప్రకటిద్దాం.

 

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభౄద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబిల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పవిత్రుల జీవితాలు అందించడే ఈ బ్లాగ్ లక్ష్యం.

🔪 మా WhatsApp Channel జాయిన్ అవ్వండి!

ప్రతి నితన పోస్ట్ మీ WhatsApp కు నేరుగా వస్తుంది

Join WhatsApp Channel

Comments

మీ అభిప్రాయాలు, ప్రశ్నలు క్రింద రాయండి:

Post a Comment

కామెంట్‌లు