మీ మాట అవునంటే అవును కాదంటే కాదు | మత్తయి 5:33-37! carmel shobha
మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు"
మత్తయి
5:33-37
"నీవు ప్రభువునకు చేసిన ప్రమానములను భంగము చేయక నెరవేర్చవలయును అని పూర్వీకులకు చెప్పబడినది మీరు వినియున్నారుకదా! కాని, నేనిప్పుడు మీతో చెప్పునదేమనగా, మీరు ఎంత మాత్రము ఒట్టు పెట్టు కొనకూడదు. పరలోకముపై ఒట్టు పెట్టుకొనకునరాదు. ఏలన అది దేవుని సింహాసనము. భూలోకముపై ఒట్టు పెట్టుకొనరాదు. ఏలన, అది ఆయన పాదపీఠము. యెరూషలేముపై ఒట్టు పెట్టుకొనకూడదు. ఏలన అది ఆ మహారాజు నగరము. నీ తల వెంట్రుకను ఒక్కదానినైనను నల్లగ గాని లేక తెల్లగా గాని చేయజాలని నీవు నీ తలపైన ఒట్టు పెట్టుకొనకుము. మీరు చెప్పదలచినది 'ఔను', లేదా 'కాదు' అనుటతో సరిపుచ్చవలెను. అంతకు మించిన పలుకులు దుష్టుని నుండి వచ్చునవే"
కొండమీది
ప్రసంగపు సత్యమే మన జీవన విధానం
యేసుప్రభువు
ఈ భూమిపై పరిచర్య చేసిన కాలంలో అందించిన బోధనలన్నింటిలో ‘కొండమీది ప్రసంగం’
(మత్తయి 5-7 అధ్యాయాలు) అత్యంత ముఖ్యమైనది. ఇది కేవలం ఒక నైతిక
ఉపదేశం కాదు; పరలోక రాజ్య పౌరుల
జీవన విధానాన్ని ప్రతిబింబించే ఒక దివ్య ప్రణాళిక. ధర్మశాస్త్రాన్ని కేవలం
అక్షరార్థంగా కాకుండా, దాని వెనుక ఉన్న
దేవుని హృదయాన్ని, ఆత్మను యేసు ప్రభువు ఇక్కడ ఆవిష్కరించారు.
ఈ వచనాలలో ఆయన చేసిన బోధన మానవ సమాజపు ఆలోచన విధానాలను పరీక్షించుకొమ్మంటున్నది.
"మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను; దీనికి మించినది దుష్టుని నుండి వచ్చునవే." అనే ఈ మాటలు చాలా సరళంగా కనిపించినప్పటికి ఈ ఒక్క వాక్యంలో దైవిక నైతికత, మానవ సంబంధాల
విశ్వసనీయత మరియు ఆధ్యాత్మిక జీవన విధానం మొత్తం దాగి ఉన్నది. నేటి సమాజంలో
అబద్ధం అనేది ఒక జీవన శైలిగా, వ్యాపార సూత్రంగా
మారిపోయిన తరుణంలో, యేసు ప్రభువు పలికిన ఈ
మాటలు మన ఆంతరంగిక
జీవితాన్ని మేల్కొలిపే సత్య దీపికలు.
యూద సమాజంలోని లొసుగులు
యేసు ప్రభువు ఈ మాటలు
పలికిన కాలంలో యూద సమాజంలో ఓ ప్రమాదకరమైన ధోరణి వ్యాపించి ఉండేది. పాత
నిబంధన గ్రంథం అబద్ధ ప్రమాణాలను, దేవుని నామమును
వ్యర్థంగా ఉచ్చరించడాన్ని స్పష్టంగా నిషేధించింది.
- "నా పేరెత్తి అసత్య ప్రమాణములను చేయకుడు, నా నామమును అమంగళము చేయకుడు, నేను ప్రభుడను" (లేవీయకాండము 19:12).
- " మీరు మీ దేవుడైన యావే నామమును వ్యర్థముగా
ఉచ్చరింపకూడదు" (నిర్గమకాండము 20:7).
అయితే, ఆ కాలపు మత పెద్దలైన పరిసయ్యులు, ధర్మ శాస్త్ర బోధకులు దేవుని పవిత్రమైన ఆజ్ఞలను తమ స్వార్థానికి, కపటత్వానికి అనుకూలంగా మార్చుకున్నారు.
వారు ఒక కొత్త లొసుగుల సిద్ధాంతాన్ని సృష్టించారు. వారి బోధనల ప్రకారం:
- దేవుని
ప్రత్యక్ష నామమును (యావే) ఉపయోగిస్తూ ఒట్టు పెట్టుకుంటేనే అది దేవునికి
చెల్లుతుంది, దానిని తప్పక
నెరవేర్చాలి.
- ఒకవేళ ఆకాశం
తోడు, భూమి తోడు, యెరూషలేము తోడు లేదా తమ తల తోడు
అని ప్రమాణం చేస్తే, అందులో
దేవుని నామం నేరుగా లేదు కాబట్టి, ఆ
వాగ్దానాన్ని ఉల్లంఘించినా పాపం లేదు.
ఈ విధంగా వారు
అబద్ధాన్ని చట్టబద్ధం చేయడానికి, మోసాన్ని దైవసమ్మతం
చేయడానికి మతాన్ని ఒక కవచంగా వాడుకున్నారు. ఈ కపట భక్తిని, లొసుగుల విధానాన్ని యేసు ప్రభువు తీవ్రంగా ఖండించారు.
దైవిక
అధికారంతో కూడిన బోధన
యేసు ప్రభువు ఈ సందర్భంలో ప్రవక్తల వలె "యావే సెలవిచ్చుచున్నాడు" అని అనలేదు. బదులుగా, "నేను మీతో
చెప్పుచున్నాను" అని ప్రకటించారు. ఈ మాటలలో ఆయన అధికారం స్పష్టంగా
కనపడుతుంది . ధర్మశాస్త్రాన్ని
ఇచ్చిన దేవుడే మానవ రూపంలో వచ్చి, దాని అసలు ఉద్దేశాన్ని ఇక్కడ వివరిస్తున్నారు.
ధర్మశాస్త్రం కేవలం బాహ్య క్రియలను మాత్రమే కాదు, హృదయ
అంతరంగాల పవిత్రతను కోరుకుంటోందని యేసు ప్రభువు తెలుపుతున్నాడు.
నాలుగు ఒట్లు — ఒకే అర్ధం : సృష్టిలో దేవుని సార్వభౌమత్వం
పరిసయ్యులు దేవుని
నామానికి దూరంగా ఉన్నాయని భావించిన నాలుగు విషయాలను యేసు ప్రభువు ఇక్కడ ప్రస్తావించి, సృష్టిలో దేవుని సార్వభౌమత్వాన్ని దాటి
ఏదీ లేదని తెలియజేస్తున్నాడు.
పరలోకముపై ఒట్టు పెట్టుకొనకునరాదు: అది దేవుని సింహాసనం
"పరలోకముపై ఒట్టు పెట్టుకొనకునరాదు, అది దేవుని సింహాసనము" (మత్తయి 5:34). యెషయా ప్రవక్త ద్వారా దేవుడు
సెలవిచ్చినట్లు, "ఆకాశము నా సింహాసనము
భూమి నా పాదపీఠము" (యెషయా 66:1). ఆకాశం వైపు చూసి
ఒట్టు పెట్టుకున్నప్పుడు, రాజు లేని సింహాసనం
ఉండదు గనుక, పరోక్షంగా ఆ
సింహాసనంపై ఆశీనుడై ఉన్న సర్వాధికారియైన దేవునిపైనే ప్రమాణం చేసినట్లు అవుతుంది.
కాబట్టి ఆకాశాన్ని సాక్షిగా పెట్టి అబద్ధమాడటం దేవుని రాజరికాన్ని అవమానించడమే.
భూమిలోకముపై ఒట్టు పెట్టుకొనరాదు: అది ఆయన పాదపీఠం
"భూమిలోకముపై ఒట్టు పెట్టుకొనరాదు, అది ఆయన పాదపీఠము" (మత్తయి 5:35). సృష్టిని సృష్టికర్త నుండి వేరు చేయడం
అసాధ్యం. మనం నడుస్తున్న, నివసిస్తున్న ఈ భూమి
దేవుని పాదపీఠం. ఆయన సృష్టించిన భౌతిక ప్రపంచాన్ని మన స్వార్థపూరిత, కపట వాగ్దానాలకు వాడుకోవడం దైవద్రోహం.
యెరూషలేము పై ఒట్టు పెట్టుకొనరాదు: అది ఆమహారాజు పట్టణం
"యెరూషలేము తోడు అనియు చేయవద్దు, అది మహారాజు పట్టణము" (మత్తయి 5:35). యెరూషలేము కేవలం ఇశ్రాయేలీయుల రాజధాని
మాత్రమే కాదు; అది దేవుని ఆలయం ఉన్న
పవిత్ర స్థలం, మహారాజైన యావే యెహోవా
నివాసం ఉండటానికి ఇష్టపడిన పట్టణం. దేవుని పవిత్రతకు నిలయమైన నగరాన్ని మానవ
అపవిత్రతకు సాధనంగా మార్చడాన్ని యేసు సహించలేదు.
నీ తలపైన ఒట్టు పెట్టుకొనకుము : దేవుని సార్వభౌమ అధికారం
"నీ తల వెంట్రుకను ఒక్కదానినైనను నల్లగ గాని లేక తెల్లగా గాని చేయజాలని నీవు నీ తలపైన ఒట్టు పెట్టుకొనకుము." (మత్తయి 5:36). ఇక్కడ యేసు మానవుని పరిమితిని, దేవుని సార్వభౌమత్వాన్ని వివరించారు. మన
శరీరం, మన శ్వాస, మన ఆయుష్షు మనవి కావు. అవి దేవుడు
ఇచ్చిన అనుగ్రహము. మన తలపై ఉన్న ఒకే ఒక్క వెంట్రుక రంగును కూడా మార్చలేని అల్పులము
మనం. మన ఆధీనంలో లేని, మన సొత్తు కాని మన
జీవాన్ని పణంగా పెట్టి ప్రమాణాలు చేయడం కేవలం మూర్ఖత్వమే కాదు, దేవుని సృజనాత్మక అధికారంలో జోక్యం
చేసుకోవడమే అవుతుంది.
ఈ సృష్టిలో దేవుని
పరిధిలోకి రాని స్థలమంటూ ఏదీ లేదు. మీరు
దేనిపై ఒట్టు పెట్టుకున్నా, అది అంతిమంగా
సర్వవ్యాపియైన దేవుని ఎదుటే జరుగుతుంది. కాబట్టి ఒట్ల వెనుక దాక్కోవడం ఆపండి.
సత్యమునే మాట్లాడుట —
క్రైస్తవ వ్యక్తిత్వం
పరిసయ్యుల కపట
ప్రమాణాల పద్ధతిని కొట్టివేసిన తర్వాత, యేసు దైవరాజ్య
పౌరులకు ఒక ఉన్నతమైన ప్రమాణాన్ని నిర్దేశించారు: "మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను." ఈ
చిన్న సూత్రంలో క్రైస్తవ జీవితపు పునాదియైన మూడు నైతిక విలువలు ఇమిడి ఉన్నాయి.
మొదటిది:
ఖచ్చితత్వం మరియు సరళత
దేవుని పిల్లల మాటలలో
ఎలాంటి సందిగ్ధత, ద్వంద్వార్థాల, లొసుగులు ఉండకూడదు. కొందరు మనుషులు తాము
చెప్పే అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో మెలికల భాషను మాట్లాడుతుంటారు. కానీ
సత్యం ఎల్లప్పుడూ సరళంగా ఉంటుంది. అవును అంటే స్పష్టంగా, నిష్కపటంగా ‘అవును’ అని, కాదు అంటే ధైర్యంగా ‘కాదు’ అని
చెప్పగలగడమే ఆత్మీయ ఖచ్చితత్వం.
రెండవది:
నమ్మకత్వం మరియు సాక్ష్యం
సమాజంలో ఒక
క్రైస్తవుని ప్రవర్తన, చరిత్ర ఎలా ఉండాలంటే
— అతని నోటి నుండి ఒక మాట వచ్చిందంటే చాలు,
దానికి
మరే ఇతర ఆధారాలు, కాగితాలు, ఒట్లు అవసరం ఉండకూడదు. "ఇతడు
క్రీస్తు శిష్యుడు, ఇతడు ప్రాణం పోయినా
మాట తప్పడు" అనే నమ్మకం అవిశ్వాసులలో కలగాలి. మన మాట యొక్క నాణ్యత (Value) మన క్యారెక్టర్ మీద ఆధారపడి ఉండాలి కానీ, మనం పెట్టుకునే ఒట్ల మీద కాదు.
మూడవది:
నిజాయితీ
చాలా సార్లు మనుషులు
ఇతరులను సంతోషపెట్టడానికో, లేదా క్షణికంగా ఆ
క్షణంలో ఉన్న సమస్య నుండి తప్పించుకోవడానికో తాము చేయలేని వాగ్దానాలు
చేసేస్తుంటారు. ఆ తర్వాత వాటిని నెరవేర్చలేక అబద్ధాల పాలు అవుతుంటారు. ఒక
విషయాన్ని మనం చేయగలిగితేనే ‘అవును’ అనాలి;
చేయలేకపోతే
ప్రేమపూర్వకంగా, వినయంగా ‘కాదు’ అని
చెప్పేయాలి. అలా చెప్పడానికి ఎంతో ఆత్మీయ ధైర్యం, నిజాయితీ
అవసరం.
"దుష్టుని వలన
కలుగును" —హెచ్చరిక
యేసు ప్రభువు ఈ బోధనను చాలా భయంకరమైన, హెచ్చరికతో
ముగించారు: "దీనికి మించినది దుష్టుని వలన కలుగును." దీని వెనుక ఉన్నసత్యం
మనల్ని నడిపిస్తుంది.
పవిత్ర గ్రంథం దేవునిని "సత్యస్వరూపియైన దేవుడు" అని పిలుస్తోంది. ఆయన అబద్ధమాడడు (తీతుకు 1:2). దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట సత్యం. మరోవైపు, సాతాను గురించి యేసు యోహాను 8:44 లో స్పష్టంగా చెప్పారు:"అతడు మొదటి నుండి నరహంత సత్యమునకు నిలిబడడు, ఎలన సత్యమనునది వానిలో లేదు అబద్ధమాడుట వానికి స్వభావ సిద్దము. ఎలన వాడు అసత్య వాది అసత్యమునకు తండ్రి."
కాబట్టి, మనం ఎప్పుడైన మన ‘అవును’ ని ‘కాదు’ గానీ, ‘కాదు’ ని ‘అవును’ గానీ మార్చడానికి
ప్రయత్నించినప్పుడు, లేదా మన మాటను
నమ్మించడానికి అదనపు ఒట్లు వేస్తూ, లొసుగులు
వెతికినప్పుడు, మనం పరోక్షంగా సాతాను (దుష్టుని) స్వభావాన్ని చూపిస్తున్నాము. ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట పట్ల
అత్యంత జాగ్రత్తగా ఉంటాం.
నేటి ఆధునిక జీవితంలో అన్వయం
యేసు ప్రభువు
కొండమీది ప్రసంగంలో చెప్పిన ఏ సత్యమైనా కేవలం పుస్తకాల్లో దాచుకోవడానికి కాదు; అది నిత్య జీవితంలో మన అనుభవంలోకి రావాలి.
నేటి ఆధునిక సమాజంలో ఈ "అవునంటే అవును,
కాదంటే
కాదు" అనే సూత్రాన్ని మనం మూడు ముఖ్య రంగాలలో అన్వయించుకోవాలి.
కుటుంబ
జీవితంలో
కుటుంబం అనేది నైతిక
విలువలు నేర్చుకునే మొదటి పాఠశాల. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎన్నో వాగ్దానాలు
చేస్తుంటారు. "నువ్వు బాగా చదివితే అది కొనిస్తా, ఇది ఇప్పిస్తా" అని చెప్పి, ఆ తర్వాత మర్చిపోతుంటారు లేదా
నిర్లక్ష్యం చేస్తుంటారు. పిల్లలు మన మాటలలోని అస్థిరతను చూసినప్పుడు, వారు కూడా అబద్ధాలు ఆడటం, మాట తప్పడం చాలా సహజమైన విషయంగా
భావిస్తారు. భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య ఎలాంటి
ఒట్లు అవసరం లేని నమ్మకమైన, వాతావరణం
ఉండాలి.
వ్యాపార, ఉద్యోగ రంగాలలో
నేటి వ్యాపార ప్రపంచంలో మాట తప్పడం, తప్పుడు నివేదికలు ఇవ్వడం, లాభాల
కోసం సత్యాన్ని దాచడం సర్వసాధారణం అయిపోయింది. అయితే, ఒక నిజమైన క్రైస్తవుడు తన మాటకు
కట్టుబడి ఉండాలి.
- ఇచ్చిన సమయానికి
పని పూర్తి చేయడం,
- నాణ్యత విషయంలో
రాజీ పడకపోవడం,
- ఆర్థిక
లావాదేవీలలో పారదర్శకత కలిగి ఉండటం — ఇవన్నీ
"అవునంటే అవును" అనే జీవితపు రోజువారీ ఆచరణాత్మక రూపాలు. నష్టం
వచ్చినా సరే సత్యానికే కట్టుబడటమే దైవభక్తి.
నేడు మనం జీవిస్తున్న యుగంలో అబద్ధాలు వ్యాప్తి చెందడానికి పెద్ద వేదికలుగా కోకొల్లలుగా ఉన్నాయి, వాటిలో మనం కూడా భాగం అవుతున్నాము. సంచలనం కోసం తప్పుడు సమాచారాన్ని , అతిశయోక్తులను వ్యాప్తి చేయడం విశ్వాసులకు తగదు.
ముగింపు: సత్యసంధతే
మన పరమార్థ ఆరాధన
మన రక్షకుడైన యేసుక్రీస్తు కేవలం సత్యాన్ని బోధించిన వాడు మాత్రమే కాదు; ఆయన తానే సత్యమై ఉన్నాడు. "నేనే మార్గమును, సత్యమును, జీవమును" (యోహాను 14:6).
అపొస్తలుడైన పౌలు
కొరింథీయులకు రాస్తూ క్రీస్తును గురించి ఒక అద్భుతమైన సత్యాన్ని ప్రకటిస్తాడు: "దేవుని వాగ్దానములన్నీటికి ఆయనయే అవును అను సమాధానం" (2 కొరింథీయులకు
1:20). ఆయనలో ‘అవును’ అని
చెప్పి ‘కాదు’ అనే అస్థిరత లేదు. ఆయన సిలువపై మానవాళి రక్షణ కొరకు ఇచ్చిన ప్రతి
వాగ్దానాన్ని తన ప్రాణాన్ని పణంగా పెట్టి నెరవేర్చాడు.
ఆ సత్యస్వరూపుడైన
దేవుని చెందిన వారిగా ఈ కపటత్వంతో నిండిన లోకంలో మనం సత్య దీపికలుగా వెలగాలి. మన అంతరంగ జీవితం మరియు
బహిరంగ జీవితం ఒకేలా ఉండడమే నిజమైన ఆధ్యాత్మికత. దేవుని సన్నిధిలో నటనకు, ముసుగులకు తావు లేదు. మన హృదయాలలో ఉన్న
యథార్థత మన పెదవుల ద్వారా, మన క్రియల ద్వారా
ప్రవహించాలి.
మన జీవితాలే లోకానికి
ఒక ప్రమాణముగా మారాలి. అదనపు ఒట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేని విధంగా, మన మాటే మన వ్యక్తిత్వంగా గుర్తింపు ఉండాలి. సమాజం మనల్ని చూసి, "వీరు దేవుని అనుచరులు, వీరి మాట సత్యం" అని
సాక్ష్యమిచ్చినప్పుడే దేవుని నామానికి మహిమ కలుగుతుంది.
ప్రార్థన
"పరలోకమందున్న మా తండ్రీ, ఈ లోకపు కపటత్వం, అబద్ధాలు మమ్మల్ని తాకకుండా మీ వాక్యపు
సత్యముతో మమ్మల్ని పవిత్రపరచండి. మా నోటి మాటలను, మాహృదయ
అంతరంగాలను, మీ ఆత్మ శక్తితో శుద్ధి చేయండి. పరిసయ్యుల వలె లొసుగుల వెనుక
దాక్కోకుండా, 'అవునంటే అవును, కాదంటే కాదు' అనే నిష్కపటమైన సత్యముతో, నమ్మకత్వంతో జీవించే కృపను మాకు
దయచేయండి. మా జీవితాల ద్వారా మీ సత్యం మహిమపరచబడును గాక. ఆమేన్!"
Comments
మీ అభిప్రాయాలు, ప్రశ్నలు క్రింద రాయండి:
Post a Comment