బాప్తిస్మ యోహాను జీవిత చరిత్ర మరియు ప్రాముఖ్యత | Life of John the Baptist| కార్మెల్ శోభ
బాప్తిస్మ యోహాను జీవితం మరియు ప్రాముఖ్యత
క్రైస్తవ చరిత్రలో బాప్తిస్మ యోహానుస్థానం అత్యంత ప్రత్యేకమైనది. ఆయన పాత నిబంధన యుగానికి ముగింపు, కొత్త నిబంధన యుగానికి ఆరంభంగా పవిత్ర గ్రంధంలో కనపడుతారు. దేవుని ప్రణాళికలో ఆయన ఒక మహోన్నతమైన వ్యక్తి. "ఎడారిలో ప్రభువుని మార్గం సిద్దం చేయుడు అరణ్య భూమిలో మన దేవునికి రాజ పధమును తయారు చేయుడు” అని కేకలువేయు స్వరము" (యెషయా 40:3). యేసుక్రీస్తు స్వయంగా ఆయన గురించి "మానవులందరిలో స్నాపకుడగు యోహనుకంటే అధికుడగు వాడు ఎవ్వడును పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. " (మత్తయి 11:11) అని సాక్ష్యమిచ్చాడు. ఇంతటి గొప్ప వ్యక్తి జీవితం నుండి మనం ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలను నేర్చుకోవచ్చు.
యోహాను కేవలం చారిత్రక వ్యక్తి కాదు; ఆయన ప్రతి విశ్వాసికి ఒక ఆదర్శం. ఆయన జీవితం మనకు వినయం, ధైర్యం, సత్యనిష్ఠ, పశ్చాత్తాపం, మరియు దేవుని పట్ల సంపూర్ణ సమర్పణ వంటి అమూల్యమైన ఆధ్యాత్మిక గుణాలను బోధిస్తుంది.
1. అద్భుత జననం - దేవుని ప్రణాళిక ఆరంభం
యోహాను జననం ఒక అద్భుతం. ఆయన తల్లిదండ్రులు జెకర్యా మరియు ఎలిశబెతమ్మ వృద్ధులు, ఎలిశబేతమ్మ గొడ్రాలు, పిల్లలు లేని కారణంగా అవమానాలు పొందింది. జెకార్య యాజకుడు, ప్రతి నిత్యము దేవుని ఆలయములో ఉండేవాడు. వారి వృద్దాప్యంలో దేవుడు వారికి ఒక కుమారుడిని ప్రసాదించాడు. ఇది మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది: దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మానవుడు ఎదుర్కొనే అవమానములను శాశ్వతముగా తీసివేసే శక్తి కలవాడు దేవుడు.
జెకర్యా ప్రార్థనలు దేవుడు విన్నాడు. ఎన్నో సంవత్సరాలు ఎదురుచూసిన ఆ దంపతుల ఆశ ఫలించింది. కొన్నిసార్లు మన జీవితాల్లో ఎదురుచూపులు చాలా కాలం పాటు కొనసాగుతాయి. మనం నిరాశ చెందుతాము. కానీ యోహాను జననం మనకు గుర్తు చేసేది ఏమిటంటే దేవుని సమయం మన సమయం కంటే భిన్నమైనది. ఆయన ప్రణాళికలో మనకు అత్యుత్తమమైనదానిని అనుగ్రహిస్తాడు.
గాబ్రియేలు దేవదూత జెకర్యాకు కనిపించినప్పుడు, ఆయన అవిశ్వాసం చూపించాడు దేవదూత చెప్పే మాటలు తన ఆలోచనకు భిన్నంగా ఉండటం వలన వాటిని నమ్మలేక పోయాడు. దాని ఫలితంగా అతను మాటరానివాడయ్యాడు. ఇది మనకు ఒక హెచ్చరిక, దేవుని మాటను అనుమానించవద్దు. దేవుడు చెబితే, అది జరిగి తీరుతుంది. మనం మన పరిమితుల ఆధారంగా దేవుని సామర్థ్యాన్ని కొలవకూడదు.
యోహాను పేరు అర్థం "యావే కృప చూపించాడు." ఆయన జననం దేవుని కృపకు సజీవ సాక్ష్యం. ప్రతి విశ్వాసి జీవితం కూడా దేవుని కృపకు సాక్ష్యంగా ఉండాలి. మనం ఉనికిలో ఉన్నదే దేవుని కృప వల్ల. మనం ప్రతిరోజు జీవించడం ఆయన కృప వల్లనే అనే విషయం మనం తెలుసుకోవాలి.
2. ఎడారి జీవితం - ఏకాంతం యొక్క ప్రాధాన్యత
యోహాను తన బాల్యాన్ని, యవ్వనాన్ని ఎడారిలో గడిపాడు. "ఆ బాలుడు వృద్ది చెందుచు ఆత్మ యందు బల సంపన్నుడాయేను. యిశ్రాయేలు ప్రజలకు ప్రత్యక్షముగ ప్రబోధించు వరకు అతడు ఎడారిలోఉండెను" (లూకా 1:80). ఎడారి అంటే శూన్యం, ఏకాంతం, నిశ్శబ్దం, పరీక్ష. అక్కడే యోహాను దేవుని స్వరం వినడం నేర్చుకున్నాడు.
ఈ ఎడారి జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని ఇస్తుంది: ఆధ్యాత్మిక బలం ఏకాంతంలో వృద్ధి చెందుతుంది. ప్రపంచపు అలజడి , గందరగోళాల మధ్య దేవుని స్వరాన్ని వినడం కష్టం. మనకు ఒక "ఎడారి " అవసరం. ప్రార్థనకు, ధ్యానానికి, దేవునితో సన్నిహిత సమయానికి కేటాయించిన స్థలం అది. అది భౌతికంగా ఎడారి కానవసరం లేదు; మన హృదయం మౌనంగా దేవుని వైపు తిరిగె ఏకాంత స్థలం చాలు.
యోహాను జీవనశైలి అత్యంత కటినమైనది . ఒంటె వెంట్రుకల వస్త్రం, తోలు నడికట్టు యోహాను బట్టలుగా ఉండేవి. మిడతలు, అడవి తేనె అతని అహరం, వీటితోనే యోహాను జీవించాడు. ప్రపంచపు విలాసాలకు, భోగాలకు ఆయన దూరంగా ఉన్నాడు. ఇది మనకు ఒక సవాలు: మనం ఎంతవరకు ప్రపంచపు ఆకర్షణలకు దూరంగా ఉండగలం? ఆడంభరాలు లేని జీవితం ఆధ్యాత్మిక దృష్టిని పెంచుతుంది. ఎక్కువ భౌతిక సంపద, భౌతిక ఆశలు ఎక్కువ అశాంతిని ఇస్తూ, నిగ్రహాన్ని కోల్పోయేలా చేస్తాయి. యోహాను తన దుస్తులు, ఆహారం, అలవాట్ల ద్వారా తాను ప్రపంచానికి చెందినవాడు కాదని, దేవుని రాజ్యానికి చెందినవాడని చాటిచెప్పాడు.
ఎడారిలో యోహాను ఆయన ఆత్మ బలపడింది. మన ఆత్మను బలపరచడానికి మనం ఏమి చేస్తున్నాము? పవిత్ర గ్రంథ పఠనం, ప్రార్థన, ఉపవాసం, ధ్యానం మొదలగునవి ఆత్మను బలపరిచే సాధనాలు. యోహాను ఎడారి అనుభవం మనకు ఆధ్యాత్మిక సాధనల ప్రాధాన్యతను తెలియజేస్తుంది.
3. పశ్చాత్తాపం యొక్క సందేశం
యోహాను తన పరిచర్యను ప్రారంభించినప్పుడు, ఆయన సందేశం స్పష్టంగా ఉండేది: “పరలోక రాజ్యము సమీపించినది మీరు హృదయ పరివర్తన చెందుడు" అని ప్రకటించాడు. (మత్తయి 3:2) ఇది కేవలం ఒక సలహా కాదు; ఇది అత్యవసరమైన పిలుపు. హృదయ పరివర్తన చెందడం అంటే దేవుని వైపు తిరగడం.
ఇక్కడ వాడబడియం గ్రీకు పద్యం "మెటానోయ" దీనికి "మనసు మార్చుకోవడం" అని అర్థం. ఇది కేవలం పాపానికి విచారించడం కాదు; జీవిత విధానంలో పూర్తి మార్పుతీసుకురావడం. పాపం నుండి దూరంగా తిరిగి, దేవుని వైపు తిరగడం. ఇది ఒకేసారి జరిగే సంఘటన కాదు; ఇది నిరంతర ప్రక్రియ.
యోహాను పరిసయ్యులను , సద్దూకయ్యులను కఠినంగా మందలించాడు: “తన వద్ద బప్తిస్మము పొందుటకు పరిసయ్యులు, సద్దుకయ్యులు అనేకులు వచ్చుట చూచి యోహాను వారితో ఓ సర్పసంతానమా, రానున్న కోపాగ్నినుండి పారి పొమ్మని మిమ్ము హెచ్చరించినదేవరు?మీరిక హృదయ పరివర్తన కలిగి తగిన పనులు చేయుడు. " (మత్తయి 3:7-8). కపటభక్తిని, బాహ్య ఆచారాలను మాత్రమే ఆధారం చేసుకొని జీవిస్తున్న వారి జీవితాలను తీవ్రంగా ఖండించాడు. వారు మారు మనస్సు పొంది పూర్తిగా దేవుని వైపు తిరగవలసిన ఆవశ్యకతను తెలియజేశాడు.
ఈ మాటలు మనకు కూడా వర్తిస్తాయి. మనం బాహ్యంగా భక్తిగా కనిపించవచ్చు. చర్చికి వెళ్ళవచ్చు, బైబిల్ చదవవచ్చు, ప్రార్థించవచ్చు, కానీ మన హృదయాలు నిజంగా మారిపోయాయా? పశ్చాత్తాపం యొక్క నిజమైన ఫలాలు మన జీవితాల్లో కనిపిస్తున్నాయా? మనం ప్రేమగలవారమా? క్షమించేవారమా? వినయవంతులమా? ఇవే పశ్చాత్తాపం యొక్క నిజమైన సూచికలు.
యోహాను ప్రజలకు ఆచరణాత్మకమైన సలహాలు ఇచ్చాడు. రెండు అంగీలు ఉన్నవాడు లేనివానికి ఒకటి ఇవ్వాలి. సుంకరులు నిర్ణయించిన దానికంటే ఎక్కువ వసూలు చేయకూడదు. సైనికులు అన్యాయంగా ఎవరినీ బాధించకూడదు, తమ జీతాలతో తృప్తిపడాలి. పశ్చాత్తాపం అనేది ప్రతిరోజు జీవితంలోని చిన్న చిన్న విషయాలలో కనిపించాలి. మన సంబంధాలలో, మన పనిలో, మన ప్రవర్తనలో యోహాను పాటించమని చెప్పిన విషయాలు ఆచరణ అసాధ్యాలు కాదు. స్వార్ధం, లోభితనం ఉన్నప్పుడు ఆచరించలేము.
4. వినయం - గొప్పతనానికి మూలం
యోహాను గొప్పతనానికి కారణం ఆయన వినయం. ఆయన అనేక మంది అనుచరులను కలిగి ఉన్నాడు. ప్రజలు ఆయనను మెస్సీయగా భావించారు “ఇది చూచిన ప్రజలు ఈ యోహానే క్రీస్తేమో! అని తమలో తాము ఆలోచించుకొను చుండగా యోహను వారితో ఇట్లనెను: “నేను నీటితో మీకు బప్తిస్మము ఇచ్చుచున్నాను. కాని, నా కంటే అధికుడు ఒకడు రానున్నాడు. నేను ఆయన పాద రక్షల వారును ఇప్పుటకైనను యోగ్యుడను కాను. ఆయన మిమ్ము పవిత్రాత్మతో, అగ్నితో జ్ఞాన స్నానము చేయించును.”(లూకా 3:15-16). అని చెప్పాడు. యోహాను ఎప్పుడూ తనను తాను గొప్పగా చూపించుకోలేదు. బదులుగా, తన తర్వాత వచ్చేవాడు తనకంటే గొప్పవాడని ప్రకటించాడు.
యేసు ప్రభువు ఆయన వద్దకు బాప్తిస్మం పొందడానికి వచ్చినప్పుడు, యోహాను వినయంగా ఇలా అన్నాడు: "నీవు నా యొద్దకు వచ్చుచున్నావా? నేనే నీ చేత బాప్తిస్మము పొందవలసినవాడను" (మత్తయి 3:14). యోహానుకు తన స్థానం తెలుసు. ఆయనకు తాను ఎవరో, తాను ఎవరికి సేవ చేస్తున్నాడో తెలుసు. ఈ వినయమే యోహనును గొప్పవానిగా చేసింది.
యేసు ప్రభువు పరిచర్య ప్రారంభించిన తర్వాత, యోహాను శిష్యులు, యోహనుతో: "బోధకుడా! “ యవర్ధను నది ఆవలి తీరమున ఎవడు నీతో ఉండెనొ, ఎవనిని గురించి నీవు సాక్ష్యమిచ్చితివొ, ఆయన ఇప్పుడు బాప్తిస్మము ఇచ్చుచున్నాడు; అందరు ఆయన యొద్దకు వెల్లుచున్నారు” అని చెప్పారు. (యోహాను 3:26). యోహాను ప్రజాదరణ క్షీణిస్తుంటే, ఆయన సంతోషించాడు. ఆయన హెచ్చింపబడాలి- నేను తగ్గింపబడాలి అని ఆనందంగా ప్రకటించాడు. (యోహాను 3:29-30).
ఇది నిజమైన వినయం. యోహాను తన స్వంత గౌరవం, ప్రజాదరణ, శిష్యులను కోల్పోతున్నప్పటికీ, ఆయన ఆనందించాడు. ఎందుకంటే ఆయనకు తన జీవిత ధ్యేయం తెలుసు. యేసు ప్రభువును మహిమపరచడం అది . మనం కూడా ఈ మనస్తత్వాన్ని అలవరచుకోవాలి. మనం తగ్గి, క్రీస్తు హెచ్చింప బడాలి. మన స్వంత గుర్తింపు, ప్రశంసలు, సౌకర్యాలను వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇది కష్టమైన పని, కానీ ఇదే నిజమైన ఆధ్యాత్మిక పరిపక్వత.
5. సత్యం కోసం ధైర్యం
యోహాను సత్యాన్ని ప్రకటించడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. పాలకులైనా, ప్రజలైనా, మతాధికారులైనా , సత్యంతో వారు నడుస్తున్నారా లేదా మాత్రమే కొలమానంగా తీసుకున్నాడు. వారు పాటించవలసిన జీవితం పాటించకపోతే ఆయన వారిని ఖండించాడు. ఆయన ధైర్యానికి అత్యుత్తమ ఉదాహరణ హేరోదు విషయంలో కనిపిస్తుంది.
హేరోదు తన సోదరుడు ఫిలిప్పు భార్య హేరోదియాను వివాహం చేసుకున్నాడు. ఇది యూదా ధర్మశాస్త్రానికి వ్యతిరేకం (లేవీయకాండము 18:16; 20:21). ఎవరూ ఈ విషయాన్ని ప్రస్తావించడానికి సాహసించలేదు. కానీ యోహాను ధైర్యంగా హేరోదుతో "నీవు నీ సోదరుని భార్యను ఉంచుకొనుట న్యాయము కాదు" (మార్కు 6:18) అని చెప్పాడు.
ఈ ధైర్యమే ఆయనకు జైలు జీవితమునకు గురి చేసింది. చివరికి మరణం తెచ్చిపెట్టింది. కానీ యోహాను సత్యం కోసం నిలబడ్డాడు. ప్రాణభయం ఆయనను ప్రశ్నించకుండ చేయలేకపోయింది. ఇది మన అందరికీ ఒక సవాలు లాంటిది మనము ఎలా జీవిస్తున్నాము. సత్యమునకు సాక్షులుగా జీవిస్తున్నామా? లేదా? అని మనమే చూడాలి. మనం తరచుగా సత్యాన్ని ప్రకటించడానికి భయపడుతున్నామా? చిన్నచిన్న అబద్ధాలను, అన్యాయాలను చూసి మౌనంగా ఉండిపోతాము. యోహాను మనకు ధైర్యాన్నబోధిస్తున్నాడు.
సత్యం ప్రకటించడం వల్ల కష్టాలు వస్తాయని యోహాను జీవితం మనకు గుర్తు చేస్తుంది. ప్రవక్తలకు, క్రైస్తవులకు ఇది సర్వసాధారణం. యేసు ప్రభువే స్వయంగా ఇలా అన్నారు: "నా నామము నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు , మిమ్మును హింసించినపుడు నిందారోపణ గావించినపుడు మీరు ధన్యులు" (మత్తయి 5:11). సత్యం కోసం ఇవన్నీ భరించినప్పుడు దేవుని దృష్టిలో మనం పొందే గౌరవం లోకంలో ఏదీ లేదు.
6. సందేహం మరియు విశ్వాసం
యోహాను జీవితంలో ఒక ఆసక్తికరమైన ఘట్టం ఉంది. ఆయన జైలులో ఉన్నప్పుడు, తన శిష్యులను యేసు ప్రభువు వద్దకు పంపి ఇలా అడిగించాడు: "రాబోవువాడవు నీవా! లేక మేము మరొకని కొరకు ఎదురు చూడవలేనా? " (మత్తయి 11:3). యోహాను చాలా నిష్టలతో జీవించాడు. కఠిన మైన సాధనలు చేశాడు. కాని యేసు ప్రభువు అలా చేస్తున్నట్లు కనపడలేదు యోహానుకు కనుక ఆయనకు అనుమానం వచ్చి ఉండవచ్చు కాని తరువాత యోహాను అర్ధం చేసుకున్నాడు. యోహాను పెళ్లి కుమారుని గురించి చెప్పున మాటలు ఇక్కడ అర్ధం చేసుకోవచ్చు.
రానున్న వాడవు నీవేనా అని అడిగించిన విషయాన్ని కొందరు యోహాను సందేహంగా భావిస్తారు. కానీ ఇది మనకు ఒక గొప్ప విషయాన్ని నేర్పుతుంది, గొప్ప విశ్వాసులకు కూడా సందేహాలు వస్తాయి. యోహాను యేసు ప్రభువుకు స్వయంగా బాప్తిస్మం ఇచ్చాడు, ఆయనపై పరిశుద్ధాత్మ దిగడం రావడం చూశాడు, ఆకాశం నుండి స్వరం విన్నాడు. కాని కష్టాల సమయంలో, ఎదురుదెబ్బలు తగిలినప్పుడు, మన విశ్వాసం కూడా కదిలిపోతుంది. సందేహం అనేది విశ్వాసం లేకపోవడం కాదు; అది విశ్వాసంలో భాగమె. మనం సందేహాలతో ఏమి చేస్తాము అనేది ముఖ్యము. ఎలా ఎదుర్కుంటాము అనేది ముఖ్యము.
యోహాను తన సందేహాన్ని నేరుగా యేసు ప్రభువు వద్దకు తీసుకువెళ్ళాడు. తన శిష్యులను పంపి యేసు ప్రభువును అడిగించాడు. ఇదే మనం కూడా చేయాలి. మన సందేహాలను, ప్రశ్నలను దేవుని ముందు ఉంచాలి. ఆయన మనల్ని తిరస్కరించడు. యేసు ప్రభువు యోహాను శిష్యులకు జరుగుతున్న అద్భుతాలను చూపించాడు, మరియు వారికి చెప్పాడు. అవి గ్రుడ్డివారు చూడడం, కుష్ఠరోగులు శుద్ధి కావడం, చెవిటివారు వినడం, మృతులు లేవడం. అదే విధంగా ప్రభువు అపనమ్మకము వదలమని చెప్పాడు. "నన్ను ఆటంకముగా భావింపని వాడు ధన్యుడు" (మత్తయి 11:6).
యేసు ప్రభువు యోహానును తిరస్కరించలేదు. బదులుగా, ఆయన యోహాను గురించి గొప్ప సాక్ష్యం పలికాడు. అక్కడ ఉన్న వారితో ప్రభువు , మీరు ఏమి చూడడానికి ఎడారికి వెళ్ళితిరి? గాలికి కదిలాడు రెల్లునా?... అయితే మీరు ఏమి చూడడానికి వెళ్ళితిరి? ప్రవక్తనా? అవును, ప్రవక్త కంటె గొప్ప వానినే. ... స్త్రీ కన్నవారిలో బాప్తిస్మ యోహానుకంటె గొప్పవాడు లేడు అని చెప్పాడు. (మత్తయి 11:7-11).
7. మరణం - సత్యానికి సాక్ష్యం
యోహాను మరణం దారుణమైనది, కానీ ఆయన జీవితం వలె ఆయన మరణం కూడా అర్థవంతమైనది. ఆయన సత్యం కోసం, నీతి కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. హేరోదియా కుట్ర, సలోమి నృత్యం, హేరోదు ప్రమాణం, ఇవన్నీ ఆయన మరణానికి దారితీశాయి.
యోహాను శిరచ్ఛేదం చేయబడ్డాడు (మార్కు 6:27). ఇది అవమానకరమైన, క్రూరమైన మరణం. కానీ క్రైస్తవ చరిత్రలో ఇది అత్యంత గౌరవనీయమైన మరణాలలో ఒకటి. యోహాను తన విశ్వాసం కోసం, సత్యం కోసం ప్రాణాలర్పించాడు. అతను ప్రాణాలను కాపాడుకోవడం కంటే, సత్యాన్ని కాపాడుకోవడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు.
మనం ఎంత తరచుగా మన సౌకర్యాన్ని, ప్రాణాలను, గౌరవాన్ని కాపాడుకోవడానికి సత్యాన్ని త్యాగం చేస్తాము? యోహాను జీవితం మనకు ఒక సవాలు. ఎంత నష్టమైన భరించి సత్యం కోసం నిలబడటం నేర్చుకోవాలి. దీని వలన నాకు ఏమి వస్తుంది అని అనుకోకూడదు, సత్యానికి సాక్ష్యంగా నిలబడటం అంటే దేవునికి సాక్షిగా నిలబడటమే.
8. యోహాను ప్రాముఖ్యత - నేటి క్రైస్తవులు నేర్చుకొనవలసినవి
పశ్చాత్తాపం యొక్క ఆవశ్యకత
యోహాను ప్రధాన సందేశం "పశ్చాత్తాపం". ఇది నేటికీ మన జీవితాలలో ముఖ్యమైనదే. ప్రపంచం ఇంకా ఎక్కవగా భౌతిక ఆనందాలకోసం ప్రాకులాడుతూ ఆధ్యాత్మికంగా చనిపోతున్న ఈ రోజుల్లో, పశ్చాత్తాపం యొక్క పిలుపు మరింత ముఖ్యమైంది. మనం మన పాపాలను ఒప్పుకొని, దేవుని వైపు తిరగాలి. పశ్చాత్తాపం అనేది ఒక్కసారి మాత్రమే కాదు; ప్రతి రోజు నన్ను నేను మార్చుకుంటూ, సంస్కరించుకుంటూ ప్రభువు వైపు తిరగాలి. ఆయన మార్గమును అనుసరించాలి.
వినయం - నిజమైన గొప్పతనం
యోహాను "ఆయన హెచ్చించబడాలి నేను తగ్గించబడాలి " అన్నాడు. ఇది ప్రతి క్రైస్తవుని జీవిత సూత్రంగా ఉండాలి. మనం క్రీస్తు కోసం జీవిస్తున్నామా, లేక మన కోసమా? క్రీస్తు కోసం జీవించడం అంటే ఒక వ్యక్తి కోసం జీవించడం కాదు. ఒక సిద్దాంతము కోసం జీవించడం. మంచి కోసం జీవించడం. ఇతరుల విడుదల కోసం జీవించడం. ఇతరుల ఉన్నతి కోసం జీవించడం. అప్పుడు నా జీవితం ఏముంటుంది? నా జీవితం క్రీస్తు జీవితం అవుతుంది. నేను క్రీస్తు పోలీకను అవుతాను. నేను దైవ ప్రతినిదిని అవుతాను. యోహాను జీవిత గొప్పతనం ఇది. క్రీస్తు సత్యమైతే ఆ క్రీస్తు సత్యమునకు సాక్షిగా జీవించాడు. మన గౌరవం, మన ప్రశంసలు, మన స్వార్థం, ఇవన్నీ తగ్గాలి. క్రీస్తు మన ద్వారా హెచ్చించబడాలి. ఆ వినయం గొప్పతనానికి మార్గం అవుతుంది.
ధైర్యం - సత్యం కోసం నిలబడటం
యోహాను హేరోదు ముందు సత్యాన్ని ప్రకటించిన ధైర్యం మనకు ఆదర్శం. నేడు అనేక సత్యాలు ప్రశ్నించబడుతున్నాయి. నైతిక విలువలు క్షీణిస్తున్నాయి. క్రైస్తవులు సత్యం కోసం నిలబడాలి. ప్రాణభయం, అవమాన భయం, ఒంటరితనం భయం. వీటిని అధిగమించి, సత్యాన్ని ప్రకటించాలి. యోహాను వలె, మనం కూడా సత్యం కోసం ఏమి కోల్పోవడానికైన సిద్ధంగా ఉండాలి. నీవు సత్యం కోసం నిలబడితే ఏమేమి కోల్పోయిన పరవలేదు అని తెలుసుకొని జీవించాలి.
యేసు వైపు చూపడం
యోహాను తన శిష్యులను యేసు వైపు నడిపించాడు. అదే మన కర్తవ్యం. మనం కూడా ఇతరులను యేసు వైపు నడిపించాలి. మనం మన గురించి కాదు, క్రీస్తు గురించి ప్రకటించాలి. మన జీవితాలు యేసును సూచించే అద్దాలుగా ఉండాలి. నేను సత్యమునకు సాక్ష్యమియ్య వచ్చితనే కాని నేను సత్యమును కాదు అని బాహాటముగా యోహాను ప్రకటించాడు. యేసు ప్రభువును గురించి తెలిసిన వ్యక్తి, క్రీస్తును తెలియపరచడానికే వచ్చిన వ్యక్తి. తన జీవిత లక్ష్యమే క్రీస్తును చూపించడంగా తెలిసి దానిని పూర్తిగా చేసిన వ్యక్తి యోహాను. ఈ రోజు మనం ఎవరిని ఇతరులకు చూపిస్తున్నాము? ఏమి ఇతరులకు చూపిస్తున్నాము?
ఏకాంతం - ఆధ్యాత్మిక బలం
యోహాను ఎడారిలో ఆధ్యాత్మిక బలాన్ని పొందాడు. మనకు కూడా దేవునితో ఏకాంత సమయం అవసరం. ప్రార్థన, బైబిల్ పఠనం, ధ్యానం, ఇవి మన ఆత్మను బలపరుస్తాయి. యేసు ప్రభువును ఇతరులకు చూపించాలి అంటే ముందు ఆయనను తెలుసుకోవాలి. ఆయన రక్షకుడు అని తెలుసుకోవాలి. అది తండ్రి దేవుడే తెలియ పరుస్తాడు యోహనుకి. కాని ఈ మెస్సీయాను ఇతరులకు చూపించడానకి యోహాను ముందుగా ఆయనను తెలుసుకున్నాడు. ఆయన కోసం సిద్దపడ్డాడు. ప్రభువును పవిత్ర గ్రంధం చదివి అక్షరార్ధ రూపేణ తెలుసుకోవడం కాదు, లేక ఇతరులు చెప్పుట వలన తెలుసుకోవడం కాదు. యోహాను అనుభవ రూపేణ తెలుసుకున్నాడు. దానికి ఆయన ఎడారి, ఒంటరి జీవితం జీవిస్తూ, నియమ నిష్టలతో జీవిస్తూ ప్రభువును తెలుసుకున్నాడు. తన తల్లి గర్భంలో ఉండే మెస్సీయా రాకను తెలుసుకొనే ఆనందంతో గెంతులు వేసిన యోహాను మరల ఆ మెస్సీయ్య ఎవరు, అని ఎప్పుడు మార్చి పోకుండా ఉండుటకు ఈ ఎడారి జీవితం ఉపయోగపడింది అందుకే ఆయనను చూడగానే ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చూపించాడు. లోక ఆశలతో, అలజడులతో ఉంటే ప్రభువును గుర్తించడం కష్టం, దేవుడు యోహానుకు ఇచ్చినట్లు ప్రత్యేకం అనుగ్రహం ఇచ్చి తల్లి గర్భంలో ఉండగానే మెస్సీయ్యను గుర్తించేలా చేసిన యోహాను వలె తగిన విధముగా మనం సిద్దపడక పోయినట్లయితే ప్రభువును గురించలేము. ఈ ఎడారి అనుభవం ప్రభువును గురించుటకు, తెలుసుకొనుటకు అవసరం.
9. పాత మరియు కొత్త మధ్య వారధి
యోహాను పాత నిబంధన ముగింపు మరియు కొత్త నిబంధన ఆరంభాన్ని సూచిస్తాడు. ఆయన పాత నిబంధన ప్రవక్తల వారసుడు, కానీ కొత్త నిబంధన సువార్త యొక్క మార్గదర్శి. ఇది మనకు గుర్తు చేస్తుంది: దేవుని ప్రణాళిక నిరంతరం సాగుతుంది. పాత నిబంధన మరియు కొత్త నిబంధన ఒకే దైవ ప్రణాళికలో భాగాలు.
యోహాను తాను "వెలుగు" కాదని, "వెలుగునకు సాక్షి" అని చెప్పుకున్నాడు (యోహాను 1:8). ఇది మనకు ఒక గొప్ప సత్యం: మనం కూడా వెలుగు కాదు, వెలుగునకు సాక్షులు. మనం క్రీస్తు అనే సత్య వెలుగును ప్రతిబింబిచాలి. వెలుగైన ఆ ప్రభువును మనం ఇతరులకు పరిచయం చేయాలి.
ముగింపు
బాప్తిస్మ యోహానుజీవితం మనకు అనేక అమూల్యమైన పాఠాలను బోధిస్తుంది. ఆయన అద్భుత జననం దేవుని శక్తిని, ప్రణాళికను చూపిస్తుంది. ఆయన ఎడారి, ఏకాంత జీవితం, మరియు ఆధ్యాత్మిక జీవితం నియమ నిష్టాలతో కూడిన సాధనల ప్రాధాన్యతను నేర్పుతుంది. ఆయన పశ్చాత్తాప సందేశం నేటికీ వర్తిస్తుంది. ఆయన వినయం, ధైర్యం, సత్యనిష్ఠ అన్నీ మనకు ఆదర్శాలు.
యోహాను జీవితంలో అత్యంత ముఖ్యమైన పాఠం: నేను తగ్గించబడాలి, క్రీస్తు హెచ్చించబడాలి. మనం తగ్గి, ఆయన పెరగాలి. మన అహంకారం, స్వార్థం, గర్వం ఇవన్నీ తగ్గాలి. క్రీస్తు మన ద్వారా ప్రకాశించాలి.
యోహాను తన శిష్యులకు యేసు ప్రభువును చూపించి వారు ఆయనను అనుసరించేలా చేశాడు. నా శిష్యులు తగ్గిపోతారు అనుకోలేదు. ఇతరులు శ్రేష్టమైన వాటిని అనుసరించడానికి, వాని గురించి వివరించడానికి ఎప్పుడు సిద్దముగా ఉన్నాడు. మన జీవితాలు, మాటలు, ప్రవర్తనలు యేసు ప్రభువును మరియు శ్రేష్టమైన ఆధ్యాత్మిక విషయాలను సూచించేలా ఉండాలి. యోహాను వలె, మనం కూడా యేసు ప్రభువును ఇతరులకు చూపిస్తూ "ఇదిగో దేవుని గొర్రెపిల్ల" అని ప్రకటించేవారిగా ఉండాలి. యోహాను మరణం మనకు సత్యం కోసం, ఏమి కోల్పోవడానికైనా సిద్దంగా ఉండాలని, చివరికి అది ప్రాణాన్ని అర్పించేందుకైన సిద్దంగా ఉండాలి. ప్రాణం కంటే సత్యం ఎక్కువ విలువైనదని ఆయన చూపించాడు. ఈ విశ్వాసమే క్రైస్తవులను ప్రత్యేకమైన వ్యక్తులుగా చేస్తుంది. "క్రీస్తు హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి అనేది క్రైస్తవుని జీవిత ధ్యేయం; " (యోహాను 3:30) ఇది యోహాను జీవిత మంత్రం. ఇదే మన జీవితాల మంత్రంగా ఉండాలి. అప్పుడే మనం నిజంగా యోహాను వలె దేవునికి సమర్థులైన సేవకులుగా మారగలము.
బాప్తిస్మ యోహాను గార మా కొరకు ప్రార్థించండి. మా హృదయాలు పశ్చాత్తాపంతో నింపండి. మేము వినయంగా, ధైర్యంగా, సత్యంగా జీవించేలా మాకు సహాయం చేయండి. మా జీవితాల ద్వారా క్రీస్తు ప్రకాశించేలా చేయండి. ఆమెన్.
Comments
మీ అభిప్రాయాలు, ప్రశ్నలు క్రింద రాయండి:
Post a Comment