జీవమునకు పోవు మార్గము: వివేచన, ప్రేమ మరియు త్యాగముల సమ్మేళనం| కార్మెల్ శోభ



 మత్తయి 7:6, 12-14 

పవిత్రమైన దానిని కుక్కల పాలు చేయవలదు. వెలగల ముత్యములను పందులకు పారవేయవలదు. అవి కాళ్లతో త్రొక్కి నీ పైబడి నిన్ను చీల్చివేయును." ఇతరులు మీకేమి చేయవలెనని మీరు కోరుదురో, దానిని మీరు పరులకు చేయుడు; ఇదే మోషే ధర్మ శాస్త్రము, ప్రవక్తల ప్రభోదము." "ఇరుకైన ద్వారమున ప్రవేశింపుడు. ఎలన, విశాలమైన ద్వారము, సులభముగ నున్న మార్గము  వినాశనమునకు చేర్చును. అనేకులు ఆ మార్గమున పయనింతురు. జీవమునకు పోవు ద్వారము ఇరుకైనది. మార్గము కరకైనది. కొద్ది మందే ఈ మార్గమును కనుగొందురు. 


1. పవిత్రతను రక్షించుకోవడం

"పవిత్రమైన దానిని కుక్కల పాలు చేయవలదు. వెలగల ముత్యములను పందులకు పారవేయవలదు. అవి కాళ్లతో త్రొక్కి నీ పైబడి నిన్ను చీల్చివేయును."

కఠిన పదాల వెనుక ప్రేమ మరియు ఆధ్యాత్మిక ఆంతర్యం

ఈ వాక్యం యేసు ప్రేమ స్వరూపానికి విరుద్ధంగా అనిపించవచ్చు. శత్రువులను కూడా ప్రేమించమని, ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించమని చెప్పిన క్రీస్తు, ఇక్కడ కొందరిని "కుక్కలు", "పందులు" అని ఎందుకు సంబోధించారు?

యూదా సంస్కృతిలో కుక్కలు, పందులు అనేవి అపవిత్రతకు, ఆధ్యాత్మిక అజ్ఞానానికి ప్రతీకలు. ఇక్కడ యేసు ప్రభువు  ఎవరినీ వ్యక్తిగతంగా దూషించడం లేదు; బదులుగా, సత్యం పట్ల మనుషులకు ఉండే వైఖరిని  హెచ్చరిస్తున్నారు.

"పవిత్రమైనది- చాలా నిష్టతో కూడిన జీవితం జీవిస్తే దేవుని కృపతో ఒక వ్యక్తి పొందే అనుగ్రహం " మరియు "ముత్యాలు చాలా అరుదుగా దొరికేవి ": ఇవి   దేవుని అపారమైన రక్షణ సువార్త,  ఒక విశ్వాసి యొక్క వ్యక్తిగత ఆధ్యాత్మిక అనుభవాలు. 

కుక్కలు, పందులు: ఇవి దేవుని సత్యాన్ని అపహాస్యం చేసే, పరిశుద్ధతను తృణీకరించే కఠిన హృదయాలకు ప్రతీకలు. ఒక పంది ముందు మీరు వజ్రాన్ని వేసినా, పొట్టును వేసినా దానికి తేడా తెలియదు. అది వజ్రాన్ని తినలేదు కాబట్టి, కోపంతో మీ పైకే దాడి చేస్తుంది. అలాగే, ఆధ్యాత్మిక విలువలు తెలియని వారి ముందు పరలోక రహస్యాలను ఉంచినప్పుడు, వారు వాటిని తొక్కడమే కాకుండా, మిమ్మల్ని కూడా గాయపరుస్తారు.


మన అంతరంగ ముత్యాల రక్షణ

మన దైనందిన జీవితంలో మరియు ఆధ్యాత్మిక జీవితములో ఈ వాక్యం  ఎంతో కీలకం. మన ప్రార్థన అనుభవాలు, దేవుడు మనతో మాట్లాడిన మాటలు, మన హృదయ లోతుల్లోని పవిత్రమైన ఆలోచనలు అందరితో పంచుకోదగినవి కావు.ఆధ్యాత్మిక వివేచన: సువార్తను అందరికీ ప్రకటించాలి, కానీ ఎగతాళి చేసే చోట మౌనంగా ఉండటం వివేకం. అపహాస్యం చేసే మనస్తత్వం ఉన్నవారి ముందు మన ఆధ్యాత్మికతను  ప్రదర్శిస్తే, అది దేవుని నామానికి అవమానంగా మారుతుంది.

ఆరోగ్యకరమైన సరిహద్దులు : ప్రేమించడం అంటే మనల్ని మనం నాశనం చేసుకోవడం కాదు. వివేచనతో కూడిన ప్రేమే క్రైస్తవ లక్షణం. మీ విలువను గుర్తించని చోట, మీ పవిత్రతను పణంగా పెట్టకండి.  ఒక వ్యక్తి రక్షణ కోసం మరణించవచ్చు కాని ప్రభువుని గుర్తించడానికి ఇష్టం లేని వ్యక్తి అవమానించడానికే సిద్దపడుతాడు. ఇవి కావాలి అని చేసే వారికి సానుభూతి చూప వచ్చు కాని మన అధ్యాత్మికతను చూపించకూడదు. 


2. స్వర్ణ శాసనం : మానవత్వపు శిఖరం (మత్తయి 7:12)

"ఇతరులు మీకేమి చేయవలెనని మీరు కోరుదురో, దానిని మీరు పరులకు చేయుడు; ఇదే మోషే ధర్మ శాస్త్రము, ప్రవక్తల ప్రభోదము."

ప్రపంచంలోని అనేక మతాలు, తత్వశాస్త్రాలు ఒక ప్రతికూల అంశాన్ని లేదా సూత్రాన్ని బోధించాయి: "ఇతరులు మీకు ఏది చేయకూడదని అనుకుంటారో, అది మీరు వారికి  చేయకండి. " కానీ యేసు ప్రభువు దీనిని ఒక అనుకూల  ఆజ్ఞగా మార్చారు. "కీడు చేయకుండా ఉండటం" మాత్రమే సరిపోదు, " వెళ్లి మేలు చేయడం" ముఖ్యం అని ఆయన స్పష్టం చేశారు. ఇతరులు మనలను ప్రేమించాలని మనం కోరుకుంటాం, ఇతరులు మన గురించి మంచి చెప్పాలని కోరుకుంటాం, ఇతరులు మనకు మంచి చేయాలని కోరుకుంటాం. ఇతరులు మనలను క్షమించాలని కోరుకుంటాం. దీనినే  మీరు ఇతరులకు చేయండి అని యేసు ప్రభువు చెబుతున్నారు.

ఈ నియమం నెరవేరాలంటే మనిషికి 'సానుభూతి' కావాలి. అంటే, ఎదుటివాని స్థానంలో నిలబడి ఆలోచించే హృదయం.

మనం ఏం కోరుకుంటాం? మనం తప్పు చేసినప్పుడు ఇతరులు మనల్ని క్షమించాలని కోరుకుంటాం, కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలని కోరుకుంటాం, సమాజంలో మనకు గౌరవం దక్కాలని ఆశిస్తాం. కాని యేసు ప్రభువు   "మొదట ఆ క్షమను, ఆ సహాయాన్ని, ఆ గౌరవాన్ని నువ్వే ఇతరులకు ఇవ్వడం ప్రారంభించు." అని చెబుతున్నారు. 

ధర్మశాస్త్ర సారాంశం: పాత నిబంధనలోని వందలాది ఆజ్ఞలను, ప్రవక్తల సుదీర్ఘ బోధనలను యేసు ప్రభువు  ఈ ఒక్క వాక్యంలో ఇమిడ్చారు. మతం అనేది కేవలం బలులు, క్రతువులు, ఆచారాలు కాదు; అది మనుషుల మధ్య ఉండే ప్రేమపూర్వక సంబంధం. ఇది నిస్వార్థమైన, షరతులు లేని 'అగాపే' (Agape) ప్రేమకు పిలుపు. 

మత్తయి సువార్త 7 వ అధ్యాయం 12 వ వచనమును స్వర్ణ శాసనం అంటారు. ఒక వ్యక్తి ఇది చేయగలిగితే క్రైస్తవ జీవితం పరిపూర్ణంగా జీవించినట్లే.


3. ఇరుకు గుమ్మం మరియు కరకైన మార్గం (మత్తయి 7:13–14)

"ఇరుకైన ద్వారమున ప్రవేశింపుడు. ఎలన, విశాలమైన ద్వారము, సులభముగ నున్న మార్గము  వినాశనమునకు చేర్చును. అనేకులు ఆ మార్గమున పయనింతురు. జీవమునకు పోవు ద్వారము ఇరుకైనది. మార్గము కరకైనది. కొద్ది మందే ఈ మార్గమును కనుగొందురు. "

రెండు ద్వారాలు – రెండు గమ్యాలు

యేసు ప్రభువు  ఇక్కడ రెండు భిన్నమైన జీవన విధానాలను, వాటి అంతిమ గమ్యాలను మన ముందు ఉంచుతున్నారు. 

1. విశాలమైన ద్వారము మరియు సులభ మార్గము

ఈ మార్గం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో ప్రవేశించడానికి ఎటువంటి అర్హతలు, ఆంక్షలు అవసరం లేదు.

లక్షణాలు: స్వార్థం, అహంకారం, ఇష్టానుసారమైన జీవితం, ప్రాపంచిక ఆనందాలు, అవినీతి, మరియు సమాజం నడిచే పంథాలోనే వెళ్లడం.

ప్రమాదం: ఇక్కడ "అనేకులు" ఉంటారు కాబట్టి ఇది సరైన మార్గం అని భ్రమపడే అవకాశం ఉంది. ఎక్కువ మంది  ప్రజలు నడుస్తున్నారు కదా అని ఆ మార్గం క్షేమకరం కాదు. ఇది ఆధ్యాత్మిక జీవిత మరణానికి మరియు మన వినాశనానికి దారితీస్తుంది.


2. ఇరుకైన ద్వారము మరియు కష్టమైన  మార్గము

ఈ ద్వారము గుండా వెళ్లడం కష్టం, ఎందుకంటే ఇది మన పాత స్వభావాన్ని, గర్వాన్ని, పాపపు మూటలను శుద్ది చేసుకోవాలి.

లక్షణాలు: త్యాగం, క్షమాగుణం, సత్యం కోసం నిలబడటం, నిందలు భరించడం, మరియు క్రీస్తు కొరకు సిలువను ఎత్తుకొని నడవడం.

ఆశీర్వాదం: ఈ మార్గంలో ప్రయాణించేవారు "కొద్దిమందే". కానీ ఇది ప్రతి అడుగులో దేవుని సన్నిధిని, ఆత్మసంతృప్తిని ఇస్తూ అంతిమంగా నిత్యజీవానికి నడిపిస్తుంది. ఇది కష్టంగా అనిపించినా, దీని గమ్యం అత్యంత మహిమాయుక్తమైనది.


4. మూడు సూత్రాల అంతర్గత ఐక్యత: ఆత్మీయ ప్రయాణ క్రమం

ఈ మూడు వచనాలను విడివిడిగా చూస్తే కేవలం నైతిక బోధలుగా అనిపిస్తాయి, కానీ కలిపి చూస్తే అవి ఒక క్రైస్తవుని ఆత్మీయ ఎదుగుదల దశలను చూపిస్తాయి.

వివేకం - పునాది: మొదట మన ఆత్మీయ జీవితం యొక్క విలువ మనకు తెలియాలి. మనలోని దైవత్వాన్ని, పవిత్రతను లోకపు అపవిత్రత నుండి కాపాడుకోవడమే మొదటి అడుగు.

క్రియలు ప్రయాణం: పవిత్రతను కాపాడుకున్న వ్యక్తి సమాజంలో ఒంటరిగా మిగిలిపోడు. అతడు స్వర్ణ శాసనాన్ని  పాటిస్తూ ఇతరుల పట్ల దయ, ప్రేమను చూపిస్తూ సమాజంలో వెలుగుగా జీవిస్తాడు.

గమ్యం–  ప్రభువును కలుసుకొనుట : పవిత్రతను కాపాడుకుంటూ, ఇతరులను ప్రేమిస్తూ బ్రతకడం అనేది సులభమైన విషయం కాదు. అది ఖచ్చితంగా "ఇరుకు మార్గమే". ఆ ఇరుకు మార్గంలో స్థిరంగా నడిచినప్పుడే జీవ కిరీటం లభిస్తుంది.


లోకంలో 'ముత్యాల' సంరక్షణ

నేటి సోషల్ మీడియా యుగంలో, మనుషులు తమ వ్యక్తిగత జీవితాలను, భావోద్వేగాలను, ఆఖరికి ఆత్మీయ విషయాలను కూడా లైకులు, కామెంట్ల కోసం బహిరంగపరుస్తున్నారు. డిజిటల్ ప్రపంచంలో ఎందరో "అపహాసకులు" ఉన్నారు. మన హృదయ పూర్వక ప్రార్థనలను, దైవిక అనుభవాలను విమర్శించే వారి ముందు ఉంచకూడదు. ఆధునిక కాలంలో పవిత్రతను రక్షించుకోవడం అంటే మన వ్యక్తిగత డిజిటల్ జీవితంలో కూడా వివేచన కలిగి ఉండటమే.


విభజనల ప్రపంచంలో 'స్వర్ణ శాసనం '

కులం, మతం, ప్రాంతం, రాజకీయం పేరిట సమాజం ముక్కలైపోతున్న తరుణంలో, "ఎదుటివాడు నీకు ఏం చేయాలనుకుంటున్నావో, అది నువ్వు చెయ్" అనే క్రీస్తు మాట విప్లవాత్మకమైనది. అవతలి వ్యక్తి ఏ వర్గానికి చెందినవాడైనా, అతనికి గౌరవం, దయ చూపించడం మన బాధ్యత. కార్యాలయాల్లో, కుటుంబాల్లో గొడవలు తగ్గడానికి ఈ ఒక్క సూత్రం అమలు చేస్తే చాలు.


తక్షణ ఆనందాల సంస్కృతిలో 'ఇరుకు మార్గం'

నేటి తరం ప్రతిదీ వేగంగా, సులభంగా లభించాలని కోరుకుంటోంది. కష్టం లేకుండా వచ్చే విజయాలు, త్యాగం లేని ఆనందాలు విశాల మార్గానికి గుర్తులు. కానీ నిజమైన వ్యక్తిత్వం  , ఆత్మీయత, శాశ్వతమైన విజయాలు కేవలం క్రమశిక్షణ, కష్టం అనే ఇరుకు మార్గంలోనే లభిస్తాయి. లోకం చూపే షార్ట్‌కట్‌లను తిరస్కరించి, నీతి మార్గంలో నడవడానికి ఇది మనల్ని ప్రోత్సహిస్తుంది.


మన ముందున్న సవాలు

యేసుక్రీస్తు కొండమీద చేసిన ఈ ప్రసంగం కేవలం చదివి ఆనందించడానికి కాదు, అంతరంగంలో మధించుకొని జీవితాన్ని మార్చుకోవడానికి ఇవ్వబడింది. ఈ భాగం మనల్ని మూడు ప్రశ్నలను అడుగుతుంది.

నేను నా ఆత్మీయ జీవితాన్ని, పరిశుద్ధతను లోకపు ఆకర్షణల పాలవకుండా జాగ్రత్తగా కాపాడుకుంటున్నానా? (వివేచన)

నేను ఇతరుల నుండి ఆశించే ప్రేమను, గౌరవాన్ని మొదట వారికి ఇవ్వగలుగుతున్నానా? (స్వర్ణ శాసనం)

నేను నడుస్తున్న మార్గం ఏది? అనేకులు వెళ్లే సులభమైన నాశన మార్గమా, లేక కొద్దిమంది మాత్రమే నడిచే జీవ మార్గమా? (ఇరుకు గుమ్మం)

జీవితం అనేది దేవుడు మనకిచ్చిన ఒక పవిత్రమైన ప్రయాణం. ఇందులో రాజీ పడకుండా, విశాల మార్గపు ఆకర్షణలకు లొంగిపోకుండా, క్రీస్తు అడుగుజాడల్లో నడవడం కష్టమైనప్పటికీ, ఆ మార్గమే మనల్ని దేవుని మహిమ లోకానికి చేరుస్తుంది.

మనకు లభించిన రక్షణ అనే ముత్యాన్ని కాపాడుకుంటూ, తోటి మానవులను క్రీస్తు ప్రేమతో ప్రేమిస్తూ, ఆ ఇరుకు ద్వారము గుండా ప్రవేశించే ధైర్యాన్ని, కృపను, పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు మనకు ప్రసాదించును గాక. ఆమెన్ 

 
 

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభౄద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబిల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పవిత్రుల జీవితాలు అందించడే ఈ బ్లాగ్ లక్ష్యం.

🔪 మా WhatsApp Channel జాయిన్ అవ్వండి!

ప్రతి నితన పోస్ట్ మీ WhatsApp కు నేరుగా వస్తుంది

Join WhatsApp Channel

Comments

మీ అభిప్రాయాలు, ప్రశ్నలు క్రింద రాయండి:

Post a Comment

కామెంట్‌లు