యూదా జీవిత చరిత్ర: పతనం నుండి పరివర్తన వైపు సాగిన ఒక అద్భుతమైన బైబిల్ గాథ
యూదా జీవిత చరిత్ర
ప్రాముఖ్యత, కుటుంబం, గొప్పతనం, పతనం మరియు నిబద్ధత
ఆదికాండము గ్రంథంలో యాకోబు పన్నెండు మంది కుమారులలో నాలుగవవాడైన యూదా, పాత నిబంధన చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైన, అదే సమయంలో అత్యంత సంక్లిష్టమైన వ్యక్తిత్వాలలో ఒకడు. అతని జీవితం, తీవ్రమైన నైతిక పతనం నుండి ఆరంభమై, క్రమంగా త్యాగపూర్వక నాయకత్వం, నిజాయితీగల పశ్చాత్తాపం వైపు పరిణమించిన ఒక అద్భుతమైన మార్పు చెందుతూ, పరిణితి పొందిన గాథ. యూదా కథ, మానవ హృదయంలో దాగిన బలహీనతలు ఎంత లోతైనవైనా, దేవుని కృప, వ్యక్తిగత పరివర్తన ద్వారా, ఆ బలహీనతలను అధిగమించి, గొప్ప ఉద్దేశ్యాన్ని నెరవేర్చగలదని చూపే శాశ్వత సాక్ష్యం.
యూదా జీవిత చరిత్ర, ఆదికాండము 29వ అధ్యాయంలో అతని జననంతో మొదలై,
37, 38, 43, 44, 46, 49 అధ్యాయాలలో విస్తరించి కనిపిస్తుంది.
అతని కథ, కేవలం వ్యక్తిగత జీవిత చరిత్రగా మాత్రమే
కాక, ఇశ్రాయేలు జనుల భవిష్యత్తుకు, ముఖ్యంగా
రాజరిక వంశానికి, మెస్సీయ రాకడకు పునాది వేసిన చారిత్రక
గాథగా కూడా నిలుస్తుంది.
యూదా జీవితం మనకు గొప్ప నమ్మకాన్ని ఇస్తుంది. అది ఏమిటంటే, గతంలో ఎంత తీవ్రమైన పాపం చేసినా, దేవుని ముందు నిజాయితీగా నిలబడి, తన తప్పును ఒప్పుకొని, జీవితాన్ని మార్చుకున్నప్పుడు, దేవుడు ఆ వ్యక్తిని కూడా గొప్ప ఉద్దేశ్యాల కొరకు వినియోగించుకుంటాడని. ఆవిలా పురి తెరేసమ్మ చెప్పినట్లు, 'దేవుడు మన గతాన్ని బట్టి కాక, మన వర్తమాన హృదయ స్థితిని బట్టి మనలను అంగీకరిస్తాడు' అనే సత్యానికి యూదా జీవితం ఒక చక్కని నిదర్శనం.
యూదా ప్రాముఖ్యత - ఇశ్రాయేలు చరిత్రలో అతని స్థానం
యూదా, యాకోబు
మొదటి భార్య లేయా నలుగురు కుమారులలో నాలుగవవాడు. అతని పేరు 'దేవుని
స్తుతించుట' అనే
అర్థాన్ని కలిగి ఉంది. లేయా అతని జననం
సందర్భంగా 'ఈసారి దేవుని స్తుతింతును' అని
పలికినందున ఈ పేరు పెట్టబడింది (ఆదికాండము 29:35). ఈ
పేరు, యూదా జీవితం మొత్తంలో, ముఖ్యంగా అతని
చివరి దశలో, అతని వంశం ద్వారా వచ్చిన స్తుతి, మహిమలకు ప్రవచనాత్మకంగా సూచిస్తుంది.
పన్నెండు గోత్రాలలో యూదా గోత్రం అత్యంత
ముఖ్యమైనదిగా, అత్యంత శక్తివంతమైనదిగా అభివృద్ధి
చెందింది. యాకోబు తన మరణశయ్యపై తన కుమారులను ఆశీర్వదిస్తూ, యూదాకు
రాజరిక ప్రవచనాన్ని అందించాడు. హక్కు
గల రాజు వచ్చు వరకు సకల జాతుల వారు విధేయులై యుండు వరకు, రాజదండము యూదా చేతి నుండి
చేజారిపొదు. రాజ ధ్వజము అతని సంతతి నుండి తొలగిపోదు' (ఆదికాండము
49:10). ఈ ప్రవచనం, తరువాత
దావీదు రాజవంశంలో, అంతిమంగా యేసుక్రీస్తులో నెరవేరింది. యేసు ప్రభువును 'యూదా
గోత్రపు సింహము' అని దర్శన గ్రంథం అభివర్ణిస్తుంది (దర్శన 5:5).
యూదా ప్రాముఖ్యత, కేవలం అతని వంశపారంపర్య స్థానం వల్ల మాత్రమే కాదు, అతని వ్యక్తిగత జీవితంలో కనిపించే నాయకత్వ లక్షణాల వల్ల కూడా. సోదరులలో రూబేను జ్యేష్ఠుడైనా, అతని నైతిక వైఫల్యం, తన పినతల్లితో శయనించడం (ఆదికాండము 35:22; 49:3-4) కారణంగా జ్యేష్ఠత్వపు హక్కు కోల్పోయాడు. షిమ్యోను, లేవి కూడా షెకెము నగర హింసాకాండ కారణంగా (ఆదికాండము 34; 49:5-7) తండ్రి ఆగ్రహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో, యూదా క్రమంగా సోదరులలో వాస్తవిక నాయకుడిగా ఎదిగాడు, ముఖ్యంగా యోసేపు విషయంలో, ఐగుప్తు ప్రయాణాలలో అతని నిర్ణయాలు, మాటలు నిర్ణయాత్మక పాత్ర పోషించాయి.
యూదా కుటుంబ నేపథ్యం - జననం మరియు తొలి జీవితం
యూదా, యాకోబు,
లేయాలకు రూబేను, షిమ్యోను, లేవిల
తరువాత నాలుగవ కుమారుడిగా (ఆదికాండము 29:31-35) జన్మించాడు. అతనికి తండ్రి ద్వారా పదకొండు మంది
సోదరులు, ఒక సోదరి (దీనా) ఉన్నారు. వీరిలో అతని స్వంత తల్లి లేయా ద్వారా జన్మించిన
సోదరులు రూబేను, షిమ్యోను, లేవి,
ఇస్సాఖారు, జెబూలూను, మరియు
సోదరి దీనా. యాకోబుకు నాలుగుగురు భార్యలు (లేయా, రాహేలు,
బిల్హా, జిల్పా) ఉన్నందున, యూదా
తన సోదరులతో సంక్లిష్టమైన, పోటీతత్వంతో కూడిన కుటుంబ వాతావరణంలో
పెరిగాడు.
యాకోబు కుటుంబంలో రాహేలు పట్ల, ఆమె కుమారుడైన యోసేపు పట్ల
ప్రత్యేక ప్రేమ చూపడం, లేయా కుమారులలో, ముఖ్యంగా
యూదాలో అసూయ, అసంతృప్తికి కారణమైంది (ఆదికాండము 37:3-4).
ఈ కుటుంబ నేపథ్యం, యూదా జీవితంలో తరువాత జరిగే అత్యంత
ముఖ్యమైన సంఘటనకు యోసేపును బానిసగా
అమ్మివేసే కుట్రకు నేపథ్యంగా నిలుస్తుంది.
బైబిలు యూదా బాల్యం గురించి వివరాలను
అందించదు, అయితే అతను తన సోదరులతో కలిసి తండ్రి
మందలను కాచుకుంటూ, గొర్రెల కాపరుల జీవితాన్ని గడిపాడని
స్పష్టమవుతుంది. ఈ నేపథ్యం, అతనిని ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకునే,
వ్యావహారిక జ్ఞానం కలిగిన వ్యక్తిగా తీర్చిదిద్దింది.
లేయా, తన భర్త ప్రేమను రాహేలుతో పంచుకోవలసి వచ్చిన బాధలో కూడా, తనకు లభించిన ప్రతి కుమారుని విషయంలో దేవుని పట్ల కృతజ్ఞత చూపింది. రూబేను (చూచెను), షిమ్యోను (వినేను ), లేవి (జతపరచును) పేర్లు ఆమె భర్త ప్రేమ కొరకు ఆరాటాన్ని ప్రతిబింబిస్తే, యూదా పేరు మాత్రం, ఆమె ఆ బాధలన్నీ దాటి, పరిస్థితులతో నిమిత్తం లేకుండా దేవుని స్తుతించే పరిపక్వతకు చేరుకున్నదని చూపిస్తుంది. ఈ పేరు, తరతరాలుగా యూదా వంశస్థులకు, మరియు తరువాత 'యూదులు' అనే మొత్తం జనసమూహానికి పేరుగా నిలిచిపోయింది.
యూదా తొలి పతనం – యోసేపు అమ్మివేసిన కుట్ర
యూదా జీవితంలో నమోదైన మొదటి ప్రధాన సంఘటన,
అతని అత్యంత తీవ్రమైన నైతిక వైఫల్యాన్ని బహిర్గతం చేస్తుంది. యాకోబు
తన ప్రియ కుమారుడైన యోసేపుకు ప్రత్యేకమైన రంగురంగుల చొక్కాని ఇచ్చి, అతనిపై ప్రత్యేక ప్రేమ చూపినప్పుడు, సోదరులలో
తీవ్రమైన అసూయ రేకెత్తింది (ఆదికాండము 37:3-4). యోసేపు
తనకు వచ్చిన కలలను సోదరులకు చెప్పి, భవిష్యత్తులో వారు
తన అధికారంలో ఉంటారని సూచించినప్పుడు,
ఈ అసూయ మరింత తీవ్రమైంది (ఆదికాండము 37:5-11).
సోదరులు దోతానులో మందలు కాచుకుంటుండగా,
తండ్రి యోసేపును వారి వద్దకు పంపగా యోసేపు వారిని వెతుక్కుంటూ
వచ్చినప్పుడు, సోదరులు అతనిని చంపే కుట్ర పన్నారు
(ఆదికాండము 37:18-20). ఈ పరిస్థితిలో, రూబేను
యోసేపును రహస్యంగా అతనిని రక్షించాలనే ఉద్దేశ్యంతో ఒక గోతిలో పడవేయమని సూచించాడు,
(ఆదికాండము 37:21-22). అయితే రూబేను
అక్కడ లేని సమయంలో, మిద్యాను వర్తకులు ఆ మార్గం గుండా
వెళుతుండగా చూసిన యూదా, మనము మన సహోదరుని చంపి అతని రక్తమును
కప్పిపుచ్చుటవలన మనకేమి లాభము? రండి, అతనిని
ఇష్మాయేలీయులకు అమ్మి వేయుదము, అని వారికి చెప్పి ఒప్పించాడు. (ఆదికాండము
37:26-27).
సోదరులు యూదా సూచనను అంగీకరించి, యోసేపును ఇరువది వెండి నాణెములకు బానిసగా అమ్మివేశారు (ఆదికాండము 37:28).
ఈ చర్య, యూదా జీవితంలో అత్యంత చీకటి అధ్యాయంగా
నిలుస్తుంది. అతను తన స్వంత సోదరుని హత్య
నుండి రక్షించాడని చూసినా, వాస్తవానికి అతను హత్యకు బదులు
బానిసత్వాన్ని ఎంచుకున్నాడే తప్ప, యోసేపును పూర్తిగా రక్షించడానికి,
తండ్రికి నిజం చెప్పడానికి ఏ ప్రయత్నం చేయలేదు. పైగా, సోదరులు యోసేపు అంగీని మేక రక్తంతో తడిపి, అతను
క్రూర మృగంచే చంపబడ్డాడని తండ్రిని మోసగించే కుట్రలో యూదా కూడా భాగస్వామి అయ్యాడు
(ఆదికాండము 37:31-35), తన తండ్రి హృదయవిదారక దుఃఖాన్ని చూస్తూ
కూడా మౌనంగా ఉండిపోయాడు.
ఈ సంఘటనలో యూదా వ్యక్తిత్వం, నైతిక సాపేక్షవాదానికి ఒక ప్రమాదకరమైన ఉదాహరణగా నిలుస్తుంది 'హత్య కంటే బానిసత్వం మేలు' అనే వాదన, పైకి కరుణాపూర్వకంగా అనిపించినా, వాస్తవానికి తీవ్రమైన అన్యాయాన్ని తక్కువ తీవ్రమైన అన్యాయంగా సమర్థించుకునే ఆత్మవంచనే. ఆర్థిక లాభం (ఇరవై వెండి నాణెములు) కూడా ఈ నిర్ణయంలో పాత్ర పోషించిందనే నిజం, యూదా ఆనాటి నైతిక స్థితిని మరింత స్పష్టం చేస్తుంది. అతని సోదరుని ప్రాణాన్ని కేవలం ఆర్థిక లావాదేవీగా, వ్యాపార నిర్ణయంగా చూశాడు.
యూదా వివాహం మరియు తొలి సంతానం
యోసేపును అమ్మివేసిన సంఘటన తరువాత,
యూదా తన సోదరుల నుండి, తండ్రి కుటుంబం
నుండి దూరమై, అదుల్లాము వాసియైన హీరా అనే వ్యక్తితో దగ్గర
ప్రత్యేకంగా జీవించడం ఆరంభించాడు
(ఆదికాండము 38:1). ఈ దూరమవడం, అతని
అపరాధభావం నుండి పారిపోవాలనే ప్రయత్నంగా వ్యాఖ్యానించవచ్చు, లేదా కుటుంబం
నుండి స్వతంత్రంగా జీవించాలనే కోరికగా కూడా చూడవచ్చు.
అక్కడ యూదా షూవ అనే కనానీయుని కుమార్తెను
వివాహం చేసుకొని, ముగ్గురు కుమారులను కన్నాడు, వారికి ఏరు, ఓనాను, షేలా అని పేర్లు పెట్టాడు. (ఆదికాండము 38:2-5). కనానీయ స్త్రీని వివాహం చేసుకోవడం, అబ్రాహాము,
ఇస్సాకు, యాకోబుల సంప్రదాయానికి భిన్నమైనది. వారు తమ కుమారులకు కనానీయ స్త్రీలను కాక,
తమ బంధువుల నుండి భార్యలను తీసుకువచ్చారు (ఆదికాండము 24;
28:1-2). యూదా ఈ సంప్రదాయాన్ని పాటించకపోవడం, అతను
తండ్రి కుటుంబం విలువల నుండి ఎంతగా దూరమయ్యాడో సూచిస్తుంది.
యూదా తన పెద్ద కుమారుడైన ఏరుకు తామారు అనే స్త్రీని వివాహం చేశాడు, అయితే ఏరు దేవుని దృష్టికి దుష్టుడైనందున దేవుడు అతనిని చంపివేశాడు (ఆదికాండము 38:6-7). అప్పటి 'లెవిరేటు వివాహం' ఆచారం ప్రకారం (సోదరుడు మరణిస్తే, అతని సోదరుడు వితంతువును వివాహం చేసుకొని, మృతుని పేరిట సంతానం కలిగించాలనే నియమం), యూదా తన రెండవ కుమారుడైన ఓనానును తామారును వివాహం చేసుకొని సంతానం కలిగించమని ఆజ్ఞాపించాడు. అయితే ఓనాను, ఆ సంతానం తనకు కాకుండా అన్నకు చెందుతుందని తెలిసి, ఉద్దేశపూర్వకంగా సంతానోత్పత్తికి బదులు తన రేతస్సును నేలపై పారవేసేవాడు. ఈ దుష్ట చర్యకు దేవుడు అతనిని చంపివేశాడు (ఆదికాండము 38:8-10).
యూదా, తామారు సంఘటన - మరో నైతిక పతనం
ఇద్దరు కుమారులను కోల్పోయిన యూదా,
తన మూడవ కుమారుడైన షేలాను కూడా అదే విధిలో కోల్పోతానేమోనని భయపడి,
తామారుతో 'నా కుమారుడైన షేలా పెద్దవాడయ్యేవరకు నీ
తండ్రి యింట విధవరాలిగా ఉండుము' అని చెప్పి, ఆమెను
తన ఇంటికి పంపివేశాడు (ఆదికాండము 38:11). వాస్తవానికి,
షేలా పెద్దవాడైన తరువాత కూడా, యూదా
ఆమెకు అతనిని వివాహం చేయాలనే తన వాగ్దానాన్ని నెరవేర్చలేదు. ఇది తామారు పట్ల యూదా చేసిన మరో అన్యాయం.
కాలం గడిచిన తరువాత, యూదా భార్య మరణించింది. తనకు జరిగిన అన్యాయాన్ని గ్రహించిన తామారు,
ఒక సాహసోపేతమైన పథకం రచించింది. ఆమె వేశ్య వేషధారణతో యూదా గొర్రెల ఉన్నాయి కత్తి రించుటకు తిమ్నతు
వెల్లుతున్నాడాని తెలుసుకొని ప్రయాణ మార్గంలో కూర్చుంది, యూదా, ఆమెను తన కోడలని తెలియకుండా, ఆమె వెలియాలు అని అనుకోని , ఆమెతో
శయనించుటకు అడుగగా ఆమె ఏమి ఇత్తువు అని
అడిగినది అందుకు ప్రతిఫలంగా
ఒక మేకపిల్లను ఇస్తానని వాగ్దానం చేస్తూ, అప్పటి వరకు ఆమె కొరినట్లుగా తన ముద్రికను, త్రాడు,
చేతికఱ్ఱలను తాకట్టుగా ఇచ్చాడు. (ఆదికాండము 38:12-18). ఆమె ఆ విధముగా గర్భము దాల్చినది. అటు తరువాత ఆ కుదువ పెట్టిన వస్తువులను
తీసుకొనుటకు మిత్రుడుతో మేక పిల్లను ఇచ్చి పంపిన ఆమె కనపడలేదు. ఈ సంఘటన, యూదా నైతిక జీవితంలో మరో తీవ్రమైన
పతనాన్ని చూపిస్తుంది. తన సొంత కోడలితో సంబంధం,
అతని నైతిక ప్రమాణాలు ఎంతగా క్షీణించాయో బహిర్గతం చేస్తుంది.
మూడు నెలల తరువాత, తామారు
గర్భవతి అని యూదాకు తెలిసినప్పుడు, అతను తీవ్ర ఆగ్రహంతో ఆమెను వ్యభిచారం
నేరానికి కాల్చివేయమని ఆజ్ఞాపించాడు (ఆదికాండము 38:24) ఇది తన స్వంత తప్పును గుర్తించకుండా,
మరొకరిని కఠినంగా శిక్షించాలనుకునే ద్వంద్వ నీతికి స్పష్టమైన ఉదాహరణ.
అయితే తామారు, యూదా తనకు తాకట్టుగా ఇచ్చిన ముద్రికను,
త్రాడు, చేతికఱ్ఱలను చూపిస్తూ, 'ఈ వస్తువులు ఎవనివొ నేను అతని వలననే గర్భవతినైతిని'
అని అన్నప్పుడు , యూదా తన వస్తువులను గుర్తించి, బహిరంగంగా
ఒప్పుకున్నాడు, 'ఈమె నాకంటె నీతిమంతురాలు, ఏలయనగా
నా కుమారుడైన షేలాకు ఆమెను అప్పగింపనైతిని' అన్నాడు. (ఆదికాండము 38:25-26). తరువాత
ఎన్నడు ఆమెను యూదా కూడలేదు.
లెవిరేటు వివాహం అనే ఆచారం, పురాతన మధ్యప్రాచ్య సమాజాలలో విస్తృతంగా ఆచరించబడేది, మరియు తరువాత మోషే ధర్మశాస్త్రంలో అధికారికంగా క్రోడీకరించబడింది (ద్వితీయోపదేశకాండము 25:5-10). ఈ ఆచారం వెనుక ఉద్దేశ్యం, మృతుడైన భర్త వంశనామం, ఆస్తి హక్కులు కొనసాగించడం, అలాగే వితంతువుకు సామాజిక, ఆర్థిక భద్రత కల్పించడం. యూదా, ఈ బాధ్యతను తన కుమారుడు ద్వారా నెరవేర్చడానికి నిరాకరించడం ద్వారా, తామారుకు తీవ్రమైన అన్యాయం చేశాడు. ఆమెను తన తండ్రి ఇంటికి 'విధవరాలిగా' పంపడం ద్వారా, ఆమెకు పునర్వివాహం చేసుకునే హక్కును కూడా నిరాకరించాడు, ఎందుకంటే ఆమె సాంకేతికంగా ఇంకా యూదా కుటుంబానికి చెందినదానిగానే పరిగణించబడేది.
యూదా తొలి పశ్చాత్తాపం మరియు పెరెసు, సెరల జననం
ఈ సంఘటనలో యూదా చూపిన ప్రతిస్పందన,
అతని జీవితంలో ఒక కీలక మలుపుగా నిలుస్తుంది. బహిరంగంగా తన తప్పును
ఒప్పుకోవడం, తన స్వంత అనైతిక ప్రవర్తనను దాచుకోకుండా
అంగీకరించడం, తామారు తనకంటే నీతిమంతురాలని ప్రకటించడం,
ఇవి యూదా వ్యక్తిత్వంలో మొదటిసారి కనిపించే నిజాయితీ, వినయపు
సంకేతాలు. ఇది, యోసేపుకు సంబందించిన కుట్రలో అతను చూపిన మౌనం, మోసానికి
పూర్తి భిన్నంగా నిలుస్తుంది.
తామారు కవలలకు జన్మనిచ్చింది, పెరెసు,
సెరలు ఆమెకు జన్మించారు. (ఆదికాండము 38:27-30) ఈ
జననం సందర్భంగా జరిగిన విశేష సంఘటన సెర మొదట తన చెయ్యి బయటకు చాపగా, మంత్రసాని అతని చేతికి ఎర్రని దారము కట్టింది, అయితే
అతను చెయ్యి వెనక్కి తీసుకోగా, పెరెసు మొదట బయటకు వచ్చాడు. ఇది దేవుని
ప్రణాళికలో, మానవ నిరీక్షణలకు భిన్నంగా, ఎవరు మొదట వస్తారో నిర్ణయించే దైవ సార్వభౌమత్వాన్ని సూచిస్తుంది.
పెరెసు వంశం, బైబిలు
చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైనదిగా నిలిచింది.
రూతు గ్రంథం చివరిలో ఇవ్వబడిన వంశావళి ప్రకారం, పెరెసు
నుండి బోయజు, ఓబేదు, యిషాయి,
దావీదు రాజు జన్మించారు (రూతు 4:18-22). ఈ
విధంగా, యూదా అత్యంత సిగ్గుపడదగిన సంఘటన నుండి
పుట్టిన పెరెసు వంశమే, తరువాత దావీదు రాజవంశానికి, మరియు మత్తయి సువార్త ప్రకారం యేసుక్రీస్తు వంశావళికి (మత్తయి 1:3) మూలాధారంగా నిలిచింది. ఇది దేవుడు మానవ వైఫల్యాలను, తప్పులను కూడా తన గొప్ప రక్షణ ప్రణాళికలో ఉపయోగించుకోగలడని చూపే
అద్భుతమైన ఉదాహరణ.
ఈ సంఘటన నుండి మనం నేర్చుకోగల మరో ముఖ్యమైన అంశం, దేవుని ఎన్నిక మానవ నైతిక ప్రమాణాల ఆధారంగా జరగదని. సెర మొదట చెయ్యి బయటకు చాపగ , మంత్రసాని అతను పెద్దవాడు అని చెప్పిన, దేవుని ప్రణాళికలో పెరెసే ముందు జన్మించాడు. ఇది ఏసావు, యాకోబుల జీవితాలలో కూడా కనిపించిన విషయం. జ్యేష్ఠత్వం, దేవుని ఎన్నికకు హామీ కాదు. దేవుడు తరచూ, మానవ అంచనాలకు, సంప్రదాయాలకు భిన్నంగా, తన చిత్తానుసారంగా తనకు కావలసిన వారిని ఎన్నుకుంటాడు.
యూదా గొప్పతనం - బెన్యామీను కొరకు హామీ
యూదా జీవితంలో అతని నిజమైన మార్పును స్పష్టంగా చూపే సంఘటన, ఐగుప్తులో
కరువు కాలంలో జరిగింది. యాకోబు కుటుంబం ఆహారం కొరకు ఐగుప్తు వెళ్ళినప్పుడు, వారికి
తెలియకుండానే, యోసేపు వారిని పరీక్షించడానికి, తమ తమ్ముడైన
బెన్యామీనును తీసుకురమ్మని షరతు పెట్టాడు (ఆదికాండము 42:15-20). యాకోబు మొదట బెన్యామీనును పంపడానికి తీవ్రంగా నిరాకరించాడు, ఎందుకంటే యోసేపును కోల్పోయిన తరువాత, రాహేలు
ద్వారా మిగిలిన ఏకైక కుమారుడైన బెన్యామీనును కూడా కోల్పోతానేమోనని అతని భయం
(ఆదికాండము 42:36-38).
ఈ కీలక సందర్భంలో, యూదా
ముందుకు వచ్చి, తండ్రికి వ్యక్తిగత హామీ ఇచ్చాడు. అది ఏమిటంటే “తమ్మునకు నేను పూచీగా నుందును. భారమంత నాది. అతనిని తిరిగి తీసికొని
వచ్చి, నీకప్పగింపకున్న నేను బ్రతికినన్నాళ్ళు ఆ పాపము నా నెత్తికి చుట్టుకొనును.” (ఆదికాండము
43:8-9). ఆ మాటలు
విన్న తరువాత యాకోబు బెన్యామినును
పంపుటకు ఒప్పుకున్నాడు. యోసేపును బానిసగా అమ్మివేసిన అదే యూదా,
ఇప్పుడు మరో సోదరుని రక్షణ కొరకు తన స్వంత జీవితాన్ని, గౌరవాన్ని పణంగా పెట్టడానికి సిద్ధపడటాన్ని , అతని హృదయంలో వచ్చిన గొప్ప
మార్పుకు స్పష్టమైన రుజువు.
యూదా హామీ, కేవలం
మాటలకే పరిమితం కాలేదు. ఐగుప్తులో, యోసేపు తన వెండి పాత్రను బెన్యామీను సంచిలో దాచి,
అతనిని దొంగగా నిందించి, తనతో బానిసగా
ఉంచుకుంటానని ప్రకటించినప్పుడు (ఆదికాండము 44:1-17), యూదా
ముందుకు వచ్చి, ప్రతి
హృదయాన్ని స్పర్శించే వాక్కులతో
యోసేపుతో విన్నవించుకున్నాడు (ఆదికాండము 44:18-34). అతను తన తండ్రి
వృద్ధాప్యాన్ని ప్రస్తవిస్తూ బెన్యామీనును
కోల్పోతే తండ్రి హృదయం విరిగిపోతుందని,
తాను తండ్రికి ఇచ్చిన వ్యక్తిగత హామీని వివరిస్తూ, చివరకు అత్యంత త్యాగపూర్వకమైన ప్రతిపాదన చేశాడు. ఆ వాఖ్యలను ఇక్కడ చూడవచ్చు. “ యూదా అతని దగ్గరకు
వెళ్లి "ప్రభూ! నా మనవి చిత్తగింపుడు. ఏలినవారితో ఒక్కమాట చెప్పుకొననిండు.
ఈ దాసునిపై కోపపడకుడు. మీరు ఫరో ప్రభువు వంటివారు."మీకు తండ్రి ఉన్నాడా? తమ్ముడు న్నాడా?" అని
మీరడిగితిరి.ముదుసలియైన తండ్రి, ఆయనకు ముసలితనమున పుట్టిన కుమారుడున్నాడు. వాడు
చిన్నవాడు. అతని సోదరుడు చనిపోయెను. వాని తల్లికి వాడొక్కడే మిగిలెను. వాడన్నచో
తండ్రికెంతో గారాబమని మేము చెప్పితిమి.తరువాత , "నేనతనిని చూడవలెను.
నా దగ్గరకతనిని తీసికొని రండు" అని ఏలినవారు చెప్పితిరి.అంతట మేము "ఆ
చిన్నవాడు తండ్రిని వదలి రాలేడు. వాడు కంటబడనిచో తండ్రికి ప్రాణములు నిలువవు"
అని చెప్పితిమి.కాని, మీరు “మీ తమ్ముడు మీతోపాటు ఇక్కడకి రానిచో, మీరు మీ ముఖము నాకు
చూపవలదు? అంటిరి.మేము తిరిగివెళ్లి మీ దాసుడైన మా తండ్రికి ఏలినవారు
చెప్పిన మాటలన్ని చెప్పితిమి.పిమ్మట, "మరల వెళ్లి ఆహార పదార్ధములు కొని, తీసికొనిరండు' అని మా తండ్రి
చెప్పెను.మేము అక్కడికి వెళ్లలేము. తమ్ముడు లేకుండ మేము ఆయన ఛాయలకే పోరాదు.
తమ్ముడు మా వెంట వచ్చినచో వెళ్ళెదము' అంటిమి.దానికి మా తండ్రి మీకు తెలియనిదేమున్నది? నా భార్య కుమారులను
యిద్దరను కన్నది.వారిలో ఒకడు నన్నొదలిపోయెను. ఏదో మృగము తప్పక వానిని ముక్కలుగా
చీల్చివేసి యుండునని అనుకొంటిని. వాడు ఈనాటి వరకు కనబడలేదు.ఉన్న ఈ ఒక్క కొడుకును
కూడ మీరు నాకు దూరము చేయుదురా? వానికి ఏ హాని కలిగినను, ముదుసలినై తల
నరసియున్న నేను దిగులుతో క్షీణించి, చావవలసినదే అని అనెను.ఇప్పుడుకాని ఈ చిన్నవాడు
లేకుండ నేను మా తండ్రి దగ్గరకు వెళ్లినచో, మా తండ్రి
ప్రాణమితనితో ముడిపడి ఉన్నది. కనుక, జరగబోవునది ఒక్కటియే.తమ్ముడు మా వెంట రాలేదని
తెలిసిన వెంటనే మా తండ్రి మరణించును. మీ దాసులమైన మేమే ముదుసలియై తల నరసియున్న మా
తండ్రి దిగులుతో చనిపోవుటకు కారణమగుదుము.ప్రభూ! మా తమ్మునికై మా తండ్రికి పూచీ
ఇచ్చినది నేనే. "నేను తమ్ముని తిరిగి తీసికొనిరానిచో, బ్రతికినన్నాళ్లు ఆ
పాపము నా నెత్తికి చుట్టుకొనును" అని మా తండ్రితో చెప్పితిని.మా తమ్మునకు
బదులుగా, నేను ఏలినవారి బానిసనగుదును. సోదరులతో పాటు అతనిని
వెళ్లనిండు.తమ్ముడు లేకుండా, నా తండ్రి దగ్గరకు ఎట్లు వెళ్ళెదను? నా తండ్రికి
దాపురించు విపత్తును నేను చూడజాలను" అనెను.
ఈ మాటలు, యూదా జీవితంలో అత్యున్నతవిగా నిలుస్తాయి. ఒకప్పుడు తన సొంత సోదరుని బానిసత్వానికి అమ్మివేసిన వ్యక్తి, ఇప్పుడు మరో సోదరుని స్థానంలో తానే బానిసత్వాన్ని స్వీకరించడానికి సిద్ధపడ్డాడు. ఈ పరిపూర్ణ త్యాగ సంసిద్ధత, యోసేపు హృదయాన్ని కరిగించి, తనను తాను సోదరులకు బహిర్గతం చేసుకునేలా చేసింది (ఆదికాండము 45:1-4) - యూదా మాటలు, రక్షణ చరిత్రలో ఒక కీలక మలుపుకు ప్రత్యక్ష కారణమయ్యాయి.
యూదా తన మాట నిలబెట్టుకున్న తీరు
యూదా జీవితంలో అత్యంత విశేషమైన లక్షణం,
అతను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం. ముఖ్యంగా అతని జీవితపు తరువాతి
దశలో ఈ లక్షణం స్పష్టంగా కనిపిస్తుంది. తండ్రి యాకోబుకు బెన్యామీను కొరకు హామీ
ఇచ్చినప్పుడు, యూదా వాడిన మాటలు అత్యంత నిర్దిష్టమైనవి,
షరతులు లేనివి - 'తమ్మునకు నేను పూచీగా నుందును. భారమంత నాది. అతనిని తిరిగి తీసికొని
వచ్చి, నీకప్పగింపకున్న నేను బ్రతికినన్నాళ్ళు ఆ పాపము నా నెత్తికి చుట్టుకొనును. (ఆదికాండము
43:9). ఇది ఒక సాధారణ వాగ్దానం కాదు, తన
మొత్తం గౌరవాన్ని, భవిష్యత్తును పణంగా పెట్టిన ప్రమాణం.
ఈ ప్రమాణాన్ని యూదా అక్షరాలా
నెరవేర్చాడు. బెన్యామీను దొంగతనం నేరానికి గురైనప్పుడు, యూదాకు
తప్పించుకునే అవకాశాలు అనేకం ఉన్నవి. అతను బెన్యామీను నిజంగా దొంగతనం చేశాడని
వాదించవచ్చు, లేదా యోసేపు దయను అభ్యర్థించి, తప్పించుకోవడానికి ప్రయత్నించవచ్చు. అయితే యూదా, తాను తండ్రికి ఇచ్చిన మాటను గుర్తుచేసుకుంటూ, తన
ప్రమాణానికి కట్టుబడి, తానే స్వయంగా బానిసత్వాన్ని
స్వీకరించడానికి ముందుకు వచ్చాడు (ఆదికాండము 44:33). ఇది
మాట నిలబెట్టుకోవడంలో అత్యున్నత మాతృకగా నిలుస్తుంది.
ఈ లక్షణం, తామారు
సంఘటనలో కూడా భిన్నమైన రూపంలో కనిపిస్తుంది. యూదా తామారుకు తాకట్టుగా ఇచ్చిన ముద్రిక,
త్రాడు, చేతికఱ్ఱలను చూసినప్పుడు, అతను వాటిని తనవి కావని బొంకే అవకాశం ఉన్నా, వెంటనే
వాటిని గుర్తించి, 'ఆమె నాకంటె నీతిమంతురాలు' అని బహిరంగంగా ఒప్పుకున్నాడు (ఆదికాండము 38:26). ఒక వ్యక్తి తన మాటకు, తన చేతికి కట్టుబడి ఉండటం అంటే, తనకు నష్టం కలిగించే సత్యాన్ని కూడా ఒప్పుకోవడానికి సిద్ధపడటమని ఈ
సంఘటన బోధిస్తుంది.
సామెతలు గ్రంథం చెప్పినట్లు, 'నిజాయితీపరుడు నష్టము
వచ్చినను ప్రమాణము తప్పడు' . యూదా జీవితంలోని ఈ లక్షణం, అతని అనేక నైతిక వైఫల్యాల మధ్య కూడా, అతనిని
విశ్వసనీయమైన వ్యక్తిగా నిలబెట్టింది. యాకోబు తన కుటుంబాన్ని ఐగుప్తుకు నడిపించడానికి యూదానే ఎన్నుకోవడం (ఆదికాండము 46:28),
అతని మాట, చేతలపై కుటుంబం మొత్తానికి ఉన్న
నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. మాట తప్పకపోవడం, చేసిన
వాగ్దానాన్ని ఎంత కష్టమైనా నెరవేర్చడం, యూదా వ్యక్తిత్వంలో అత్యంత గౌరవనీయమైన,
అనుకరణీయమైన లక్షణం.
ఈ లక్షణం, యేసుక్రీస్తు బోధించిన నీతికి కూడా ప్రతిబింబంగా నిలుస్తుంది, 'మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని యుండవలెను' (మత్తయి 5:37). యూదా, ఈ సూత్రాన్ని పరిపూర్ణంగా పాటించకపోయినా (తామారుకు ఇచ్చిన వాగ్దానం విషయంలో), తన జీవితపు కీలక క్షణంలో మాత్రం, ఈ సూత్రాన్ని అత్యున్నత స్థాయిలో ఆచరించి చూపించాడు. ఇది మనకు, స్థిరత్వం క్రమంగా పెరుగుతుందని, ఒక్క తప్పిదం మనలను శాశ్వతంగా అస్థిరులుగా ముద్రవేయదని గుర్తుచేస్తుంది.
తామారు వ్యక్తిత్వం - యూదా పతనానికి అద్దం
యూదా జీవితంలో తామారు పాత్రను ప్రత్యేకంగా పరిశీలించడం అవసరం,
ఎందుకంటే ఆమె వ్యక్తిత్వం, యూదా వైఫల్యాలను
మరింత స్పష్టంగా చూపిస్తాయి. తామారు, తనకు జరిగిన
అన్యాయాన్ని, అంటే షేలానుతో వివాహం చేయాలనే వాగ్దానం నెరవేర్చకపోవడంతో ఎంతో సాహసోపేతమైన, ప్రమాదకరమైన
మార్గాన్ని ఎంచుకుంది. ఆమె చర్య, ఆధునిక నైతిక దృష్టితో చూసినప్పుడు
సమస్యాత్మకంగా అనిపించినా, ఆనాటి సాంస్కృతిక సందర్భంలో, ఆమె లెవిరేటు వివాహ హక్కును పొందడానికి, తన
న్యాయమైన స్థానాన్ని కుటుంబంలో నిలుపుకోవడానికి చేసిన ప్రయత్నంగా అర్థం
చేసుకోవచ్చు.
యూదా స్వయంగా తామారును 'నాకంటె నీతిమంతురాలు' అని ప్రకటించడం (ఆదికాండము 38:26) విశేషమైనది. ఇది తామారు చర్య కంటే, యూదా తన బాధ్యతను నెరవేర్చకపోవడమే పెద్ద తప్పు అని అతనే గుర్తించడాన్ని చూపిస్తుంది. తామారు, మత్తయి సువార్త వంశావళిలో పేరు పేర్కొనబడిన నలుగురు స్త్రీలలో ఒకరిగా చోటు సంపాదించుకుంది (మత్తయి 1:3). వీరందరూ, ఏదో ఒక విధంగా వివాదాస్పదమైన, సవాలుతో కూడిన నేపథ్యం నుండి వచ్చినవారే, అయినా దేవుని రక్షణ ప్రణాళికలో ప్రాముఖ్యమైన పాత్ర పోషించారు.
రూబేను, యూదా - నాయకత్వ మార్పిడి
యాకోబు కుటుంబంలో నాయకత్వం రూబేను నుండి యూదాకు
మారడం, ఒక క్రమమైన ప్రక్రియ ద్వారా జరిగింది. రూబేను, జ్యేష్ఠుడైనప్పటికీ,
తన తండ్రి ఉపపత్ని బిల్హాతో సంబంధం పెట్టుకోవడం ద్వారా (ఆదికాండము 35:22)
తీవ్రమైన నైతిక అపరాధానికి పాల్పడ్డాడు, మరియు
యోసేపు కథలో కూడా, అతను యోసేపును రక్షించాలని ప్రయత్నించినా,
తుది నిర్ణయాత్మక క్షణంలో స్థానంలో లేకపోవడం, తరువాత
తండ్రికి బెన్యామీను భద్రత కొరకు తన స్వంత ఇద్దరు కుమారుల ప్రాణాలను పణంగా పెట్టే
అసంబద్ధమైన ప్రతిపాదన చేయడం (ఆదికాండము 42:37), ఇవన్నీ అతని నాయకత్వ లోపాన్ని బహిర్గతం
చేస్తాయి.
యూదా, దీనికి
పూర్తి భిన్నంగా, తనను తానే బెన్యామీను స్థానంలో
అర్పించుకోవడం ద్వారా, వ్యావహారికమైన, త్యాగపూర్వకమైన
నాయకత్వాన్ని ప్రదర్శించాడు. ఈ వ్యత్యాసం, యాకోబు తన అంతిమ
ఆశీర్వాదంలో స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. రూబేనుకు 'నీవు
అస్థిరుడవు గనుక నీవు శ్రేష్ఠత్వము పొందవు' అని
చెప్పబడితే (ఆదికాండము 49:4), యూదాకు రాజరిక ప్రవచనం లభించింది. ఇది,
నాయకత్వం జన్మహక్కు ద్వారా కాక, వ్యక్తిత్వం,
బాధ్యత, విశ్వసనీయత ద్వారా సంపాదించబడుతుందని
బోధించే ముఖ్యమైన సూత్రం.
ఈ సూత్రం, నేటి కుటుంబ, సంఘ, సామాజిక నిర్మాణాలలో కూడా ప్రాముఖ్యమైనది. వయసు, హోదా, లేదా జన్మతః వచ్చిన స్థానం, నాయకత్వానికి అర్హతనివ్వదు. బదులుగా, సంక్షోభ సమయాలలో బాధ్యతాయుతంగా వ్యవహరించడం, ఇతరుల శ్రేయస్సు కొరకు వ్యక్తిగత త్యాగానికి సిద్ధపడటం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం, ఇవే నిజమైన నాయకత్వానికి గీటురాళ్ళు. యూదా జీవితం, ఈ సూత్రాన్ని ఆచరణాత్మకంగా నిరూపించిన చారిత్రక ఉదాహరణగా నిలుస్తుంది.
యూదా నాయకత్వం - ఈజిప్టుకు వలస, గోషెను ఏర్పాటు
యూదా నాయకత్వ లక్షణాలు, యాకోబు కుటుంబం మొత్తం ఈజిప్టుకు శాశ్వతంగా వలస వెళ్ళే సమయంలో మరింత
స్పష్టంగా కనిపిస్తాయి. యాకోబు, తన కుటుంబాన్ని గోషెను ప్రాంతానికి
నడిపించడానికి, యోసేపుకు మార్గం చూపడానికి ముందుగా
యూదాను పంపాడు (ఆదికాండము 46:28). ఇది కుటుంబంలో జ్యేష్ఠుడైన రూబేను
కాకుండా యూదా వాస్తవిక నాయకుడిగా గుర్తించబడ్డాడని స్పష్టం చేస్తుంది.
ఈ నియామకం, యూదా జీవితంలో వచ్చిన పరివర్తనకు ఆచరణాత్మక ఫలితంగా చూడవచ్చు. తన సోదరుని బానిసత్వానికి అమ్మివేసిన వ్యక్తి, ఇప్పుడు కుటుంబం మొత్తం భద్రతతో కొత్త దేశానికి వలస వెళ్ళడానికి మార్గదర్శిగా, నమ్మదగిన నాయకుడిగా ఎంచుకోబడ్డాడు. ఇది దేవుని కృప, క్షమాపణ ఒక వ్యక్తి జీవితాన్ని ఎంతగా మార్చగలదో, గతంలో విఫలమైనవారిని కూడా భవిష్యత్తులో నమ్మదగిన బాధ్యతలకు ఎలా సిద్ధం చేయగలదో చూపే చక్కని ఉదాహరణ.
యాకోబు అంతిమ ఆశీర్వాదం - యూదాకు రాజరిక ప్రవచనం
యూదా జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన,
శాశ్వతమైన ప్రభావం చూపిన సంఘటన, యాకోబు
తన మరణశయ్యపై తన పన్నెండు మంది కుమారులను ఆశీర్వదిస్తూ, ప్రవచించిన
మాటలలో కనిపిస్తుంది (ఆదికాండము 49వ అధ్యాయం). రూబేను, షిమ్యోను, లేవిలకు వారి గత తప్పిదాల కారణంగా
తీవ్రమైన మందలింపులు, పరిమిత ఆశీర్వాదాలు లభించగా, యూదాకు లభించిన ఆశీర్వాదం పూర్తి భిన్నమైనది, అత్యంత
ఘనమైనది.
యాకోబు యూదాను ఇలా ఆశీర్వదించాడు: 'యూదా! నీ సహోదరులు నిన్ను ప్రశంసింతురు,
నీవు పగ వారినెదుర్కోని, వారి మెడలు విరుతువు. తొడబుట్టిన వారు నీ ముందు సాగిలబడుదురు.
యూదా! నీవు సింహాపు పిల్లవు. వేటాడి విడిదికి తిరిగి వచ్చేదవు. నీవు సింహము వలె పొంచి,
నేలపై పరుండెదవు. ఆడు సింహము వలె నిన్ను రెచ్చ గొట్టగల సాహసి ఎవడు? (ఆదికాండము 49:8-10).
ఈ ప్రవచనం అనేక లోతైన అర్థాలను కలిగి
ఉంది. మొదటిది, 'సింహపు పిల్ల' అనే
పోలిక, యూదా వంశానికి రాజరిక శక్తిని, గౌరవాన్ని
ఆపాదిస్తుంది. సింహం, పురాతన కాలంలో రాజరికానికి, అధికారానికి సార్వత్రిక చిహ్నంగా ఉండేది. రెండవది, 'రాజదండము యూదాను విడిచిపోదు' అనే వాక్యం,
యూదా వంశం నుండి శాశ్వతమైన రాజరికం వస్తుందని స్పష్టం చేస్తుంది.
ఈ ప్రవచనం, యూదా
జీవితంలోని అన్ని పతనాలను, తప్పులను అధిగమించి, అతని వంశానికి శాశ్వతమైన, అత్యున్నతమైన
గౌరవాన్ని అందించింది. ఇది దేవుని కృప మానవ వైఫల్యాల కంటే ఎంతో గొప్పదని, మరియు దేవుని ప్రణాళికలు మానవ తప్పిదాల ద్వారా కూడా అడ్డుకోబడవని
చూపే శక్తివంతమైన సందేశం.
'సింహపు పిల్ల' అనే పోలిక కూడా లోతైన అర్థాన్ని కలిగి ఉంది. ఇది కేవలం శక్తిని సూచించడమే కాక, పరిపక్వతతో కూడిన, నిదానమైన, అయినా అప్రతిహతమైన అధికారాన్ని సూచిస్తుంది. యువ సింహం వేటాడి, తృప్తిగా విశ్రమించే దృశ్యం (ఆదికాండము 49:9), యూదా వంశపు రాజరికం భద్రమైనది, స్థిరమైనది అని చూపిస్తుంది. ఇతర గోత్రాలు దానిని కదిలించడానికి 'తెగించలేరు' అని యాకోబు స్పష్టం చేశాడు.
యూదా వంశావళి - దావీదు నుండి యేసుక్రీస్తు వరకు
యూదా ప్రాముఖ్యత, అతని
జీవితకాలంలో మాత్రమే పరిమితం కాలేదు. అతని
వంశం, బైబిలు చరిత్ర మొత్తంలో అత్యంత కీలకమైన పాత్రను పోషించింది. తామారు
ద్వారా జన్మించిన పెరెసు వంశం, రూతు గ్రంథంలో వివరించబడిన వంశావళి
ప్రకారం, నష్షోను, సల్మోను,
బోయజు, ఓబేదు, యిషాయి
ద్వారా కొనసాగి, చివరకు
దావీదు రాజు వరకు చేరింది (రూతు 4:18-22; 1 దినవృత్తాంతములు 2:3-15).
దావీదు రాజవంశం స్థాపించబడిన తరువాత,
యూదా వంశం ఇశ్రాయేలు, యూదా రాజ్యాల చరిత్రలో నిరంతరం రాజరిక
అధికారాన్ని కలిగి ఉంది, బబులోను చెరకు వెళ్ళే వరకు. మత్తయి
సువార్త ఆరంభంలో ఇవ్వబడిన యేసుక్రీస్తు వంశావళి, అబ్రాహాము
నుండి, యూదా ద్వారా, దావీదు ద్వారా, చివరకు
యోసేపు వరకు వస్తుంది, యేసు ప్రభువును 'దావీదు
కుమారుడు' గా, తద్వారా
యూదా వంశస్థుడిగా చూపిస్తుంది. (మత్తయి 1:1-16).
హెబ్రీయులకు వ్రాసిన పత్రిక, యేసు 'యూదా గోత్రములో పుట్టెను' అని స్పష్టంగా పేర్కొంటుంది (హెబ్రీయులకు 7:14), మరియు దర్శన గ్రంథం యేసును 'యూదా గోత్రపు
సింహము, దావీదు వేరు' అని
అభివర్ణిస్తుంది (దర్శన 5:5). ఇది యాకోబు యూదాకు ఇచ్చిన ప్రవచనాత్మక
ఆశీర్వాదపు నేరవేర్పు. ఈ విధంగా, యూదా జీవితంలోని తీవ్రమైన నైతిక పతనాలు,
అతని వంశం ద్వారా లోక రక్షకుడు వచ్చే ప్రణాళికను అడ్డుకోలేదు. ఇది దేవుని కృపకు అత్యంత శక్తివంతమైన సాక్ష్యం.
యూదా వంశం, దావీదు తరువాత కూడా, సొలొమోను మొదలుకొని రెహబాము, అబీయా, ఆసా, యెహోషాపాతు వంటి యూదా రాజ్యపు రాజులందరి ద్వారా కొనసాగింది, వీరిలో హిజ్కియా, యోషీయా వంటి సంస్కరణ రాజులు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగినవారు. బబులోను చెర సమయంలో కూడా, యెహోయాకీను వంశావళి కొనసాగింపు ద్వారా, యూదా రాజవంశం పూర్తిగా అంతరించిపోలేదని 1 రాజుల దినచర్య గ్రంధం 3వ అధ్యాయం నమోదు చేస్తుంది. చెర నుండి తిరిగి వచ్చిన తరువాత, దావీదు వంశస్థుడు నాయకత్వంలో దేవాలయ పునర్నిర్మాణం జరగడం, ఈ వంశపు కొనసాగింపుకు మరో సాక్ష్యం. చివరకు, మత్తయి, లూకా సువార్తలు ఇచ్చిన రెండు వేర్వేరు వంశావళులు రెండూ యూదా, దావీదుల ద్వారానే యేసు ప్రభువు వద్దకు చేరుకుంటాయి, ఇది ఈ వంశపు ప్రాముఖ్యతను రెండింతలు ధృవీకరిస్తుంది.
యూదా వ్యక్తిత్వం - పతనం నుండి పరివర్తన వరకు
యూదా జీవితాన్ని మొత్తంగా
పరిశీలించినప్పుడు, అతని వ్యక్తిత్వంలో స్పష్టమైన పరిణామ
క్రమం కనిపిస్తుంది. తొలి దశలో, అతను స్వార్థపూరిత నిర్ణయాలు తీసుకునే,
సోదరుని బాధను లాభానికి మార్చుకునే, తండ్రిని
మోసగించే మనిషిగా కనిపిస్తాడు. తామారు సంఘటనలో, అతను
నైతిక ద్వంద్వ ప్రమాణాలు కలిగిన, తన బాధ్యతలను నెరవేర్చని వ్యక్తిగా కనిపిస్తాడు. ఇతరులను
కఠినంగా చూసే వ్యక్తిగా కనిపిస్తాడు.
అయితే ఈ తామారు సంఘటనలోనే, యూదా వ్యక్తిత్వంలో మొదటి నిజమైన మార్పు కనిపిస్తుంది. అది తన తప్పును బహిరంగంగా ఒప్పుకునే ధైర్యం. ఈ
నిజాయితీ, తరువాత బెన్యామీను సంఘటనలో పరిపూర్ణ రూపం
దాల్చింది. అక్కడ యూదా, కేవలం తన తప్పును ఒప్పుకోవడమే కాక, గత
తప్పిదాన్ని సరిదిద్దుకోవడానికి చురుకుగా, త్యాగపూర్వకంగా
చర్య తీసుకున్నాడు. ఒకప్పుడు సోదరుని అమ్మివేసిన వ్యక్తి, ఇప్పుడు
మరో సోదరుని రక్షించడానికి తన స్వంత స్వేచ్ఛను త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు.
ఈ పరివర్తన, యూదా
జీవితాన్ని బైబిలు గ్రంథంలో అత్యంత శక్తివంతమైన పశ్చాత్తాప, రూపాంతర
గాథలలో ఒకటిగా నిలుపుతుంది. ఇది కేవలం మాటల పశ్చాత్తాపం కాదు, చర్యలలో వ్యక్తమైన నిజమైన హృదయపరివర్తన. ఇదే
నిజమైన పశ్చాత్తాపానికి బైబిలు ఇచ్చే నిర్వచనం.
యూదా, యోసేపు - పోలిక మరియు వ్యత్యాసం
యూదా, యోసేపుల
జీవితాలను పోల్చి చూసినప్పుడు ఆసక్తికరమైన అంశాలు వెల్లడవుతాయి. యోసేపు, తన బాల్యం నుండే నైతికంగా స్థిరమైన, దేవుని
పట్ల విశ్వసనీయమైన వ్యక్తిగా జీవించాడు. పోతీఫరు భార్య శోధనను తిరస్కరించడం
(ఆదికాండము 39:7-12) ఇందుకు ఒక ఉదాహరణ. యూదా, దీనికి పూర్తి భిన్నంగా, తీవ్రమైన నైతిక
వైఫల్యాల ద్వారా జీవితాన్ని గడిపి, క్రమంగా పరివర్తన చెందిన వ్యక్తిగా
చిత్రించబడ్డాడు.
అయితే ఆసక్తికరంగా, రాజరిక వాగ్దానం, మెస్సీయ వంశావళి యోసేపు ద్వారా కాక,
యూదా ద్వారా కొనసాగించబడింది. యోసేపుకు, రాజరిక
అధికారం ఇవ్వబడలేదు. ఇది దేవుని ఎన్నిక, మానవ నైతిక పరిపూర్ణతపై ఆధారపడి ఉండదని, దేవుని
చిత్తం ప్రకారమే జరుగుతుందని చూపే మరో ఉదాహరణ.
ఈ పోలిక, మనకు
ఒక ముఖ్యమైన సత్యాన్ని బోధిస్తుంది. దేవుని
రాజ్యంలో, నిజాయితీగా పశ్చాత్తాపపడి మారిన పాపి,
ఎన్నడూ తప్పు చేయని నీతిమంతునికి సమానంగా, కొన్నిసార్లు
అంతకంటే ఎక్కువగా, దేవుని ఉద్దేశ్యాల నెరవేర్పులో పాత్ర
పోషించగలడు.
అయితే దీనిని తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఇది పాపం చేయడం మంచిదని కాదు, లేదా నీతిమంతమైన జీవితం విలువలేనిదని కాదు. బదులుగా, ఇది దేవుని కృప పరిధిని, ఆయన తెలియజేస్తుంది. యోసేపు నీతిమంతమైన జీవితం, తనకు తానుగా గొప్ప ఆశీర్వాదం, మరియు అతని ద్వారా ఐగుప్తు, ఇశ్రాయేలు రెండూ కరువు నుండి రక్షింపబడ్డాయి. యూదా పరివర్తన, భిన్నమైన మార్గంలో, భిన్నమైన ఉద్దేశ్యానికి దేవుడు అతనిని సిద్ధం చేసిన విధానం. ఇద్దరి కథలు కలిపి, దేవుడు తన ప్రజలలో వైవిధ్యభరితమైన వ్యక్తిత్వాలను, భిన్నమైన జీవిత మార్గాలను, తన ఏకైక గొప్ప ప్రణాళిక నెరవేర్పు కొరకు ఎలా ఉపయోగించుకుంటాడో చూపిస్తాయి.
యూదా వ్యక్తిత్వ లక్షణాలు
యూదా జీవితాన్ని పరిశీలించినప్పుడు,
అతని వ్యక్తిత్వంలో అనేక విరుద్ధమైన, అయినా
వాస్తవికమైన మానవ లక్షణాలు కనిపిస్తాయి. మొదటిది, ఆచరణాత్మక
నాయకత్వ దృష్టి. యోసేపును చంపే బదులు అమ్మివేయాలనే అతని సూచన, నైతికంగా సమస్యాత్మకమే అయినా, ఇది
అతని ఆచరణాత్మక, పరిష్కారాత్మక ఆలోచనా విధానాన్ని
చూపిస్తుంది. సోదరులు హత్యకు సిద్ధపడిన
పరిస్థితిలో, అతను తక్షణమే ప్రత్యామ్నాయ మార్గాన్ని
సూచించగలిగాడు. ఇదే లక్షణం, తరువాత బెన్యామీను సంఘటనలో, అతను తండ్రి భయాలను, యోసేపు డిమాండ్లను బేరీజు వేసుకుంటూ,
ఆచరణాత్మక పరిష్కారాన్ని కనుగొనడంలో కూడా కనిపిస్తుంది.
రెండవది, భావోద్వేగలు
, వాక్చాతుర్యం. ఆదికాండము 44వ అధ్యాయంలో యూదా
ఇచ్చిన ప్రసంగం, బైబిలు గ్రంథంలో యూదా వాక్చాతుర్యానికి
ఉదాహరణగా నిలుస్తుంది. అతను తండ్రి
వృద్ధాప్యాన్ని, యోసేపు కోల్పోయిన బాధను, బెన్యామీను కోల్పోతే తండ్రికి కలిగే మరణప్రాయమైన దుఃఖాన్ని అత్యంత
హృదయవిదారకంగా వర్ణించాడు. ఈ వాక్చాతుర్యం, కేవలం
మాటల నైపుణ్యం కాదు, నిజమైన భావోద్వేగ అవగాహన, తండ్రి పట్ల ప్రేమ నుండి
ఉద్భవించింది.
మూడవది, స్వీయ
విమర్శకు సిద్ధపడే వినయం. ఇది అతని
జీవితపు తరువాతి దశలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. తామారు సంఘటనలో తన తప్పును వెంటనే
ఒప్పుకోవడం, బెన్యామీను ప్రసంగంలో తన గత వైఫల్యాలను
పరోక్షంగా అంగీకరిస్తూ మాట్లాడటం. ఇవి, తన స్వంత అహంకారాన్ని
పక్కనబెట్టి, సత్యాన్ని అంగీకరించే సామర్థ్యాన్ని
చూపిస్తాయి. ఇది, తన తప్పులను ఎన్నడూ ఒప్పుకోని సౌలు వంటి
వ్యక్తులతో పోల్చినప్పుడు, యూదా వ్యక్తిత్వంలోని అరుదైన, అమూల్యమైన లక్షణంగా నిలుస్తుంది.
నాలుగవది, ఇతరుల బాధను గుర్తించి, దానికి తగినట్లుగా స్పందించే సామర్థ్యం. బెన్యామీను సంఘటనలో, యూదా తన సొంత ప్రయోజనాన్ని కాక, తన తండ్రి భావోద్వేగ స్థితిని కేంద్రంగా చేసుకొని నిర్ణయం తీసుకున్నాడు. ఇది, తొలి దశలో సోదరుని బాధను పట్టించుకోని అదే యూదాలో వచ్చిన గణనీయమైన మార్పు. ఇతరుల స్థానంలో ఉండి, ఇతరుల శ్రేయస్సును గురించి ఆలోచించే విధంగా మార్పు చెందిన వ్యక్తిత్వం.
ముగింపు
యూదా జీవితం, తీవ్రమైన
నైతిక పతనం నుండి, గొప్ప త్యాగపూర్వక నాయకత్వం వరకు సాగిన
అద్భుతమైన గాథ. అతను తన సోదరుని బానిసత్వానికి అమ్మివేశాడు, తన
కోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, తండ్రిని
మోసగించాడు. అయినప్పటికీ, అతను తన తప్పులను గుర్తించి, వాటిని
సరిదిద్దుకునే అవకాశం వచ్చినప్పుడు, పూర్తి హృదయంతో,
త్యాగపూర్వకంగా స్పందించాడు. ఈ పరివర్తనే, అతనిని
రాజరిక వంశానికి, మెస్సీయ వంశావళికి మూలపురుషునిగా
నిలబెట్టింది.
కర్మెలీయ ఆధ్యాత్మిక సంప్రదాయపు దృష్టితో
చూసినప్పుడు, యూదా జీవితం మనకు గొప్ప నమ్మకమును,
ఓదార్పును అందిస్తుంది. మన గతం ఎంత చీకటిమయమైనా, దేవుని కృప ముందు నిజాయితీగా నిలబడి, మన
తప్పులను ఒప్పుకొని, వాటిని సరిదిద్దుకోవడానికి చర్యలు
తీసుకున్నప్పుడు, దేవుడు మనలను కూడా గొప్ప ఉద్దేశ్యాల
కొరకు వినియోగించుకోగలడు. తెరేసమ్మ, తన స్వంత
అసంపూర్ణతలను ఎరిగి కూడా, దేవుని అపారమైన కృపపై పూర్తి
నమ్మకముంచినట్లే, యూదా కథను ధ్యానిస్తూ, మనం కూడా మన గతాన్ని దేవుని కృపకు అప్పగించి, భవిష్యత్తులో
ఆయన ఉద్దేశ్యాల కొరకు నమ్మకంగా జీవించే వరము కొరకు యాచిద్దాం.
ప్రార్థన
ప్రభువైన దేవా, యూదా
జీవితం నుండి మేము నేర్చుకొనవలసిన పాఠాలను గ్రహించు జ్ఞానాన్ని దయచేయుము. మా గత
తప్పిదాలు ఎంత తీవ్రమైనా, నీ కృప ముందు వాటిని దాచుకోకుండ, నిజాయితీగా ఒప్పుకొను ధైర్యాన్ని మాకు అనుగ్రహించుము. మా తప్పులను
సరిదిద్దుకునే అవకాశం వచ్చినప్పుడు, యూదా వలె
త్యాగపూర్వకంగా, పూర్తి హృదయంతో స్పందించు వరమును
దయచేయుము.
మేము ఇచ్చిన మాటకు, చేసిన వాగ్దానానికి కట్టుబడి ఉండు విశ్వసనీయతను మాకు దయచేయుము,
అది మాకు ఎంత నష్టం కలిగించినా సరే. మా కుటుంబ సభ్యుల పట్ల, మా చుట్టూ ఉన్నవారి పట్ల నిజాయితీగా, బాధ్యతాయుతంగా
జీవించు కృపను మాకు అనుగ్రహించుము. మా గతమెంత చీకటిమయమైనా, నీవు
మమ్మును విడిచిపెట్టవని, నీ ప్రణాళికలో మాకు ఇంకా స్థానం ఉందని
నమ్మే విశ్వాసాన్ని దయచేయుము. కన్యకామరియ, తెరేసమ్మల
మధ్యవర్తిత్వము ద్వారా ఈ ప్రార్థనను వినుము. ఆమెన్
Comments
మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:
Post a Comment