మత్తయి 9:18-26 వ్యాఖ్యానం: విశ్వాసంతో యేసును తాకడం ఎలా?
మత్తయి 9:18-26
మత్తయి సువార్త 9:18-26 లోని అద్భుతాలు క్రీస్తు హృదయాన్ని, ఆయన అపరిమితమైన దైవ శక్తిని చూపిస్తాయి.
ఈ సువిశేషం భాగం ద్వారా ఆయన మన దైనందిన జీవితాల్లో ఉంటే మన జీవితాలలో ఎదురయ్యే సమస్యలు ఎలా దూరం అవుతాయో చూడవచ్చు.
1. ఇద్దరు
వ్యక్తులు – ఒకే గమ్యం
మత్తయి సువార్త 9వ అధ్యాయంలో యేసుప్రభువు కేవలం ఒక బోధకుడిగా కాక, సమస్త
సృష్టిని, ప్రకృతాన్ని, రోగాలను, చివరకు మరణాన్ని కూడా శాసించగల సర్వాధికారిగా మనకు కనిపిస్తారు. ఈ 18-26 వచనాలలో, దేవుడు రెండు విభిన్నమైన జీవితాలను ఒకే చోట ముడివేసి, ఒక అద్భుత ఘట్టాన్ని అందిస్తున్నారు.
- యాయీరు: సమాజంలో అత్యంత గౌరవనీయుడైన యూదుల ప్రార్ధన మందిర
అధికారి. ధనవంతుడు, ప్రతీ ఒక్కరూ తలవంచి
నమస్కరించే ఉన్నత స్థానంలో ఉన్నవాడు.
- రక్తస్రావ
రోగమున్న స్త్రీ: సమాజంలో పూర్తిగా
బహిష్కరించబడిన అనామకురాలు. పన్నెండేళ్లుగా అశుద్ధురాలిగా ముద్రపడి, ఆర్థికంగా
సర్వస్వం కోల్పోయి, ఎవరూ తాకడానికి కూడా
ఇష్టపడని ఒక దీనురాలు.
ఒక వైపు సమాజనికి మధ్యన ఉన్న అత్యున్నత శిఖరం (యాయీరు), మరోవైపు సమాజపు అంచున అట్టడుగున ఉన్న అగాధం (ఆ స్త్రీ). వారిద్దరి జీవితాల్లో ఉన్న నిరాశ ఉంది, ఒకరికి కుమార్తె స్వస్థత కావాలి, ఒకరికి ఆమె స్వస్థత కావాలి. లోక మొత్తం ఏతికారు కాని ఎక్కడ వారికి స్వస్థత దొరకలేదు. ఆ స్వస్థత యేసు ప్రభువు మాత్రమే ఇవ్వగలరు. వారు ఇద్దరు ప్రభువునే ఆశ్రయించవలసి వచ్చింది. పన్నెండేళ్ల వయసున్న కూతురు మరణ శయ్యపై ఉండటం వల్ల ఆ తండ్రి హృదయం రోదిస్తోంది; పన్నెండేళ్లుగా నిరంతర రక్తస్రావంతో ఆ స్త్రీ దేహం, ఆత్మ క్షీణించిపోతున్నాయి. జీవితపు రెండు వేర్వేరు ధ్రువాల్లో ఉన్న వీరిద్దరూ ఒకే రక్షకుని పాదాల చెంతకు చేరారు. మన జీవితాలలో అనేక తారతమ్యాలు ఉండవచ్చు. ఎవరికి ఏ సమస్య అయిన ప్రభువు తీర్చకపోతే అది ఎప్పటికీ తీరదు. అందరు ప్రభువును ఆశ్రయించవలసిన వారమే అని మారువకూడదు.
2. క్రీస్తు వాస్తవ రూప దర్శనం
వచనాలు 18-19: గర్వాన్ని
జయించిన పితృహృదయం
"ఇట్లు మాట్లాడుచున్న యేసు వద్దకు పాలనాధికారి ఒకడు వచ్చి, ఆయన ముందు మోకరించి," నా కోమార్తె ఇపుడు మరణించినది..."
యాయీరు ఒక ప్రార్దన మందిర అధికారి. ఆ రోజుల్లో పరిసయ్యులు, యూదుల అధికారులు యేసును తృణీకరిస్తున్నారు, ఆయనను ఒక ప్రవక్తగా అంగీకరించడానికి నిరాకరిస్తున్నారు. కానీ, తన పన్నెండేళ్ల ఏకైక కుమార్తె మరణం తన కళ్ల ముందు కనపడుతున్నప్పుడు, యాయీరుకు తన పదవి గుర్తుకు రాలేదు, సమాజం ఏమనుకుంటుందో అనే భయం కలగలేదు. ఆయన యేసు పాదాల మీద పడ్డాడు. నిజానికి యేసు ప్రభువును అనుసరించినవారు మొదటి నుండి ఇలానే అనుసరించారు. తర్కం వలనో, లేక గొప్ప ఆలోచనలు వారు యేసు ప్రభువును అనుసరించలేదు. లోక తీర్చలేని వారి సమస్యలకు , ప్రభువులో సమాధానం వారు కనుకొన్నారు.
ఇక్కడ వాడిన గ్రీకు పదం "ప్రోస్కునేఓ" (προσκυνέω) ఉపయోగించబడింది, దీని అర్థం కేవలం నమస్కరించడం కాదు, సాష్టాంగపడి ఆరాధించడం. ఒక ఉన్నత అధికారి, ఒక సాధారణ వడ్రంగి కుమారుడిగా లోకం చూస్తున్న నజరేయుడైన యేసు ముందు మోకరిల్లడం ద్వారా, ఆయనలో ఉన్న దైవత్వాన్ని , దైవ అధికారాన్ని బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఆయన దేవుడు అని తెలుసుకున్నారు. అస్వస్థతతో ఉన్న నా కుమార్తె అని కాదు అతను చెబుతున్నది, మరణించిన నా కుమార్తెను బ్రతికించమని వేడుకుంటున్నాడు.
మన హృదయాల స్పందన
మన సమస్యలు, మన వేదనలు
మనల్ని క్రీస్తు పాదాల చెంతకు నడిపిస్తున్నాయా? లేదా మన అహంకారం, మన చదువు, మన అంతస్తు ఆయన ఎదుట మోకరిల్లకుండా మనల్ని అడ్డుకుంటున్నాయా? యాయీరు వలె మనం గర్వాన్ని విడిచిపెట్టి ఆయన పాదాలను ఆశ్రయించినప్పుడు, అద్భుతానికి
ద్వారాలు తెరువబడతాయి. యేసు ప్రభువు వెంటనే లేచి అతని వెంట వెళ్లాడు. మన దేవుడు మన
పిలుపుకు తక్షణమే స్పందించే కరుణామయుడు.
వచనాలు 20-21: నిశ్శబ్ద
రోదనలో మొలకెత్తిన రహస్య విశ్వాసం
"...అప్పుడు పండ్రేండేండ్ల నుండి ఎడతెగక రక్తస్రావముచే బాధపడుచున్న ఒక స్త్రీ, వెనుక నుండి వచ్చి యేసు అంగీ అంచును తాకెను.."
యేసు ప్రభువు, యాయీరు
ఇంటికి వెళ్తుండగా, ఒక పెద్ద జనసమూహం ఆయనను చుట్టుముట్టి నెట్టుకుంటూ వెళ్తోంది. ఆ గుంపులో ఒక
స్త్రీ ఉంది. ఈమె రక్త స్రావ వ్యాధితో ఉన్నది కనుక లేవీయకాండం 15:25-27 ప్రకారం, ఆమె అపవిత్రురాలు. ఆమె ఎవరిని తాకినా వారు అపవిత్రులవుతారు. ఆమె
దేవాలయానికి వెళ్లడానికి వీల్లేదు, ప్రార్థనల్లో పాలుపంచుకోవడానికి వీల్లేదు. పన్నెండేళ్లుగా ఆమె పొందిన
వేదన, ఒంటరితనం, శారీరక బలహీనత వర్ణనాతీతం.
కానీ ఆమె
హృదయంలో ఒక అగ్ని లాంటి విశ్వాసం రగులుకుంది: " యేసు వస్త్రమును తాకినంత మాత్రమున నేను ఆరోగ్యవతిని అగుదును అని ఆమె తలచుచుండెను." ఆమెకు యేసు ప్రభువు తనపై చేతులు ఉంచి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, ఆయన తనను చూసి మాట్లాడాల్సిన పని లేదు. ఆయన
వస్త్రపు చెంగును తాకినా చాలు, ఆ చెంగులో ఉన్న పవిత్రత నా అపవిత్రతను మింగివేస్తుంది అని ఆమె నమ్మింది.
యూదుల
సాంప్రదాయం ప్రకారం, వస్త్రపు చెంగు దేవుని ఆజ్ఞలను, ఆయన పవిత్రతను సూచిస్తుంది. ఆ స్త్రీ యేసు ప్రభువు పవిత్రతను విశ్వసించింది.
వచనం 22: అపవిత్రతను
పవిత్రతగా మార్చిన అద్భుత స్పర్శ
"యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, "కుమారీ! ధైర్యము వహింపుము. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను" ..
ధర్మశాస్త్రం ప్రకారం అపవిత్రమైనది పవిత్రమైన దాన్ని తాకితే, పవిత్రమైనది కూడా అపవిత్రమవుతుంది. కానీ ఇక్కడ అద్భుతం జరిగింది! అపవిత్రురాలైన స్త్రీ, పవిత్రుడైన క్రీస్తును తాకగానే, క్రీస్తు అపవిత్రుడు కాలేదు; కానీ క్రీస్తులో నుండి ప్రవహించిన దైవ జీవం, పవిత్రత ఆ స్త్రీలోకి ప్రవహించి ఆమె రోగాన్ని తక్షణమే తీసివేసింది
యేసు ఆమెను రహస్యంగా వెళ్ళిపోనివ్వలేదు. ఎందుకు అంటే? ఆమె పొందింది కేవలం శారీరక స్వస్థత మాత్రమే కాదు, ఆమె సమాజం చేత తిరస్కరించబడిన స్త్రీ. అందుకే ఆమెను యేసు ప్రభువు "కుమారీ" అని పిలిచాడు. సువార్తలలో యేసు ప్రభువు ఏ స్త్రీని కూడా నేరుగా "కుమారీ" అని పిలిచిన దాఖలాలు లేవు, ఒక్క ఈమెను తప్ప! ఆమెకు దేవుని కుటుంబంలో స్థానాన్ని, కోల్పోయిన గౌరవాన్ని, అంతర్గత శాంతిని, సమాధానాన్ని యేసు తిరిగి ప్రసాదించాడు. అదే విషయాన్ని కుమారీ అని చెప్పడం వలన ఆమె పవిత్రురాలు అని ప్రకటిస్తున్నాడు.
వచనాలు 23-26: మరణపు
అంధకారాన్ని చీల్చిన జీవాధిపతి
యేసు ప్రభువు ఆ అధికారి ఇంటికి వచ్చేసరికి, అక్కడ పరిస్థితి భయంకరంగా ఉంది. పిల్లనగ్రోవులు వాయించేవారు, ఏడ్చేవారు, గొల్లుమనే జనసమూహం అక్కడ ఉన్నారు. అది మరణాన్ని ధృవీకరిస్తోంది. నిరాశ నిండిన ఆ వాతావరణంలోకి యేసు ప్రభువు ప్రవేశించి, "మీరందరు ఆవలికి పొండు. ఈ బాలిక మరణించలేదు, నిదురించుచున్నది" అని చెబుతున్నాడు.
లోకం దేన్ని
చూసి భయపడుతుందో, దేన్ని చూసి అంతం అనుకుంటుందో, యేసు ప్రభువు దానిని కేవలం "నిద్ర" అని పిలిచారు. ఎందుకంటే, నిద్రపోయిన
వాడిని తట్టి లేపడం ఎంత సులువో, మరణించిన వారిని బ్రతికించడం జీవాధిపతి అయిన యేసు ప్రభువుకు అంతకంటే సులువు! కానీ
అక్కడ ఉన్న వారు ఆయనను అపహసించారు. అవిశ్వాసం ఎల్లప్పుడూ దేవుని శక్తిని ఎగతాళి
చేస్తుంది.
"...యేసు లోపలకు వెళ్ళి ఆ బాలిక చేతిని పట్టుకొనగ ఆ బాలిక లేచెను."
యేసు ప్రభువు ఆ అపహాసకులను బయటకు పంపివేశారు. పరిశుద్ధమైన కార్యం జరగడానికి పవిత్రమైన, విశ్వాసమున్న వాతావరణం అవసరం. ఆయన చనిపోయిన ఆ చిన్నబిడ్డ చేతిని పట్టుకున్నారు. శవమును ముట్టుకుంటే అపవిత్రత వస్తుంది అనే నియమాన్ని దాటి, జీవము గల దేవుడు మరణాన్ని తాకాడు. అంతే! మరణం పారిపోయింది, జీవం తిరిగి వచ్చింది. ఆ చిన్నది తక్షణమే లేచింది.
3. మన హృదయాలను క్రీస్తు వైపుకు ఎత్తడం
ఈ సంఘటనల ద్వారా దేవుడు మన హృదయాలను క్రీస్తు వైపుకు త్రిప్పుతూ, కొన్ని ముఖ్యమైన సత్యాలను మనకు చెబుతున్నారు.
|
అంశము |
యాయీరు
కుమార్తె వృత్తాంతం |
రక్తస్రావ
రోగమున్న స్త్రీ వృత్తాంతం |
మన
జీవితాలకు పాఠం |
|
సమస్య |
మరణం
(పూర్తి నిస్సహాయత) |
దీర్ఘకాలిక
వ్యాధి (సామాజిక దూరం) |
లోకంలో ఏ
సమస్యకైనా క్రీస్తే పరిష్కారం |
|
విశ్వాస
ప్రకటన |
బహిరంగంగా
మోకరిల్లి ఆరాధించడం |
అంతరంగంలో
రహస్యంగా తాకడం |
విశ్వాసం
ప్రకటనలోనైనా, అంతరంగంలోనైనా క్రీస్తు గుర్తిస్తాడు |
|
క్రీస్తు
స్పందన |
ఆమె
చేతిని పట్టుకుని జీవాన్ని ఇచ్చాడు |
"కుమారీ"
అని పిలిచి ఆత్మను ఆదరించాడు |
ఆయన మన
శరీరాలనే కాదు, మన ఆత్మలను కూడా స్వస్థపరుస్తాడు |
క్రీస్తు వైపు మన హృదయాలను ఎత్తవలసిన సమయం
ఈ రోజు నీవు ఏ స్థితిలో ఉన్నావు?
- పన్నెండేళ్లుగా
ఆ స్త్రీ పడిన వేదన లాంటి సుదీర్ఘమైన సమస్యతో, నిరాశతో, ఒంటరితనంతో
బాధపడుతున్నావా? మనుషులు నిన్ను తృణీకరించారా? నీవు
చేసిన ప్రార్థనలకు ఇంకా జవాబు రాలేదని కృంగిపోతున్నావా?
- లేదా
యాయీరు వలె, నీ కళ్ల ముందే నీ ఆశలు, నీ
కలలు, నీ భవిష్యత్తు చనిపోతుంటే చూస్తూ ఏమీ చేయలేని
నిస్సహాయ స్థితిలో ఉన్నావా?
ఇలాంటి సమయంలోనే మనం మన కళ్లను లోకం వైపు నుండి తిప్పి, క్రీస్తు వైపుకు ఎత్తాలి. ఆయన నిన్న, నేడు, ఒకే రీతిగా ఉన్న దేవుడు. ఆ రోజు కఫర్నాము వీధుల్లో నడిచిన యేసు, ఈ రోజు పరిశుద్ధాత్మ ద్వారా మన చెంతనే ఉన్నాడు. ఆయన వస్త్రపు అంచును విశ్వాసంతో తాకడానికి, ఆయన చేతి స్పర్శను అనుభవించడానికి నీ హృదయాన్ని సిద్ధం చేసుకో.
4. ప్రార్థన:
"ప్రభువా, మాతోనే
ఉండుము"
ప్రభువా, ఈ నాడు మేము ఎన్నో రకాల మానసిక, శారీరక, ఆధ్యాత్మిక రోగాలతో, సమస్యలతో నీ సన్నిధికి వస్తున్నాము. లోకంలో ఎందరో వైద్యులను, ఎన్నో మార్గాలను వెతికి అలసిపోయిన ఆ స్త్రీ లాంటి స్థితి మాకు ఉన్నప్పుడు, నీవే మాకు ఏకైక శరణ్యమని ఒప్పుకుంటున్నాము. మా అంతరంగంలో ఎవరికీ చెప్పుకోలేని వేదనలు, అపవిత్రతలు, గాయాలు ఉన్నాయి తండ్రి. దయతో నీ పరిశుద్ధ హస్తాన్ని చాపి మమ్మల్ని తాకండి. ఆ రోజు ఆ దీనురాలిని "కుమారీ" అని పిలిచి ఎలాగైతే ఆదరించావో, ఈ రోజు మమ్మల్ని కూడా నీ బిడ్డలుగా స్వీకరించి, నీ అద్భుతమైన శాంతిని మా హృదయాలలో నింపండి.
యాయీరు వలె
మా కలలు, మా ఆశలు మా కళ్ల ముందే సమాధి అయిపోతున్నప్పుడు మేము అధైర్యపడకుండా
ఉండేందుకు సహాయం చేయండి. లోకం మమ్మల్ని చూసి నవ్వినా, అపహసించినా, "ఇక అంతా
అయిపోయింది" అని తీర్పు తీర్చినా... నీ దృష్టిలో అది కేవలం నిద్ర మాత్రమే అని, నీవు ఒక్క
మాట సెలవిస్తే చనిపోయిన స్థితి నుండి కూడా జీవం పుడుతుందని నమ్మే పూర్ణ
విశ్వాసాన్ని మాకు దయచేయండి. మా అవిశ్వాసాన్ని క్షమించండి తండ్రి.
యేసయ్యా, మా అనుదిన జీవిత యాత్రలో నీ సన్నిధి మాకు ఎంతో అవసరం. నువ్వు లేని జీవితం చీకటిమయం, మరణప్రాయం. దయచేసి మా హృదయాలలో, మా కుటుంబాలలో నీవు నివాసముండండి. మా చేయి పట్టుకుని నడిపించండి. మేము ఒంటరి వాళ్లము కాదనే ధైర్యాన్ని మాకు ఇవ్వమని వేడుకుంటున్నాము. ఆమెన్
Comments
మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:
Post a Comment