దైవ దృష్టిలో మానవుడు: సృష్టికి మకుటం| కార్మెల్ శోభ
దేవుని దృష్టిలో మానవుని విలువ -సృష్టికే మకుటం
1. దేవుని సృష్టికి కిరీటం
ఆదికాండము మొదటి అధ్యాయం
ప్రకారం, దేవుడు ఆరు రోజులలో సృష్టిని నిర్మించాడు. మొదటి
ఐదు రోజులు కాంతి, భూమి, వృక్షాలు, నక్షత్రాలు
మరియు జంతువులను సృష్టించినప్పుడు "అది బాగుగా ఉన్నదని" దేవుడు చూశాడు.
అయితే, ఆరవ రోజున దేవుడు తన సృష్టి ముగింపుగా మానవుణ్ణి
సృష్టించిన తర్వాత, తాను చేసిన సమస్తమును చూసి
"అది చాలా బాగుగా ఉండెను" అనిఅనుకున్నాడు. ఈ "చాలా బాగుగా
ఉండటం" అనేది సృష్టి క్రమంలో మానవునికి గల అత్యున్నత మరియు ప్రత్యేక
స్థానాన్ని (సృష్టికి మకుటం/కిరీటం) సూచిస్తుంది. సృష్టి మొత్తానికి మరియు భూమికి మానవుణ్ణి అధికారిగా చేశాడు దేవుడు.
అంటే సృష్టిలో ప్రతిది మానవుని ఆధీనంలో ఉంచాడు.
2. మానవుడు దేవుని రూపంలో, పోలీకలో సృష్టించబడినవాడు
మానవుని అత్యున్నత విలువకు ప్రాథమిక కారణం, అతను దేవుని
రూపంలో మరియు పోలీకలో సృష్టించబడటమే
(ఆదికాండము 1:26-27).
దేవుడు ఆత్మ స్వరూపి (యోహాను 4:24) కాబట్టి, ఆయన రూపం
అంటే భౌతిక రూపం కాదు. అది మానవునిలోని ఆధ్యాత్మిక సామర్థ్యం, మంచి-చెడులను
గుర్తించే నైతిక స్పృహ, తెలివి, సృజనాత్మకత
మరియు సృష్టిని ఏలడానికి దేవుడు ఇచ్చిన పాలనా అధికారాన్ని సూచిస్తుంది. అందువల్ల, జాతి, వర్ణం, లింగం, సామాజిక
స్థితితో నిమిత్తం లేకుండా ప్రతి మానవుడూ అమూల్యుడేనని కీర్తనలు 8:5 గుర్తుచేస్తుంది.
రూపం, పోలిక అనేది దేవుని ప్రతినిధులుగా మరియు ప్రతిరుపములుగా ఉండుటకు దేవుడు మానవుణ్ణి
చేశాడు.
3. మానవుని సృష్టి – ఒక ప్రత్యేక ప్రక్రియ
దేవుడు సృష్టిని మొత్తాన్ని కేవలం తన వాక్కుతోనే
సృష్టించాడు. ఇది జరుగును గాక అని అనగానే ప్రతిది అలానే జరిగినది. కానీ
మానవుని సృష్టి ప్రక్రియ దేవుడు ప్రత్యేకముగా చేసినది. ఆదికాండము 2:7 ప్రకారం, దేవుడు మట్టితో
(ఆదామా) మానవుణ్ణి నిర్మించి, అతని నాసికారంధ్రములలో
జీవశ్వాసను (నిష్మత్) ఊది మానవుణ్ణి సృష్టించాడు. దేవుడు తన శ్వాసను ఊదడం ద్వారా మానవుడు కేవలం
భౌతిక జీవిగా కాక, దేవునితో బంధాన్ని ఏర్పాటు చేసుకోగల
ఆధ్యాత్మిక జీవిగా మారాడు. మానవుడు దేవునికి ప్రత్యేకమైన వాడు కనుకనే ప్రత్యేకముగా
మానవుణ్ణి చేశాడు దేవుడు. అటువంటి ప్రాముఖ్యత మిగిలిన సృష్టికి దేవుడు ఇవ్వలేదు.
4. మానవుని త్రివిధ స్వభావం (ఆత్మ, ప్రాణం, శరీరం)
బైబిల్ ప్రకారం మానవున్ని మూడు విభాగాలగ చూడవచ్చు.
(1 థెస్సలొనీకయులకు 5:23):
- శరీరం : భూమి మట్టితో చేయబడిన
భౌతిక భాగం, ఇది భూమిపై జీవించడానికి
అవసరం.
- ప్రాణం/జీవాత్మ మానవుని మనస్సు, భావోద్వేగాలు మరియు
సంకల్పానికి (చిత్తానికి) కేంద్రం, ఇక్కడే మనిషి
వ్యక్తిత్వం ఉంటుంది.
- ఆత్మ: దేవుని శ్వాస ద్వారా
వచ్చిన ఆధ్యాత్మిక భాగం, ఇది దేవునితో
అనుసంధానమవుతుంది. మరణానంతరం శరీరం భూమికి చేరినా, ఆత్మ దేవుని యొద్దకు చేరుకుంటుంది (ఉపదేశకుడు 12:7).
ఈ మూడింటి కలయికతో ఏర్పడిన జీవి మానవుడు కాబట్టే, క్రైస్తవ
విశ్వాసంలో ఆత్మ రక్షణతో పాటు 'శరీర పునరుత్థానం' కూడా అంతే
ప్రాధాన్యత కలిగి ఉంది.
5. బైబిల్ మానవునికి ఇచ్చే ప్రాముఖ్యత మరియు బాధ్యతలు
మానవునికి దేవుడు ఇచ్చిన స్థానం ఏమిటి అంటే :
- దేవుని సంతానం: యేసు ప్రభువు మనలను దేవుని
సంతానాన్ని చేసున్నాడు. యేసు ప్రభువుని ద్వారా మనము దేవుని మనలను అవుతున్నాము. ఆయన శ్రమలు మరణంతో ఇది సాధ్యమవుతుంది. మనం ఆయనలో జీవిస్తున్నాము, చలిస్తున్నాము
(అపొస్తలుల కార్యములు 17:28).
- దేవుని సహకారి & మహిమకు
ప్రతీక: భూమిని సంరక్షించే
బాధ్యతను దేవుడు మానవునికి అప్పగించాడు (ఆదికాండము 1:28) మరియు మానవుడు దేవుని మహిమను ప్రదర్శించడానికి సృష్టించబడ్డాడు (యెషయా
43:7). అంతే కాదు దేవునికి స్నేహితులము,
సలహదారులం అవుతున్నాము, మంచి జీవితం జీవించడం వలన.
- దేవుని ఆలయం: విశ్వాసి శరీరం దేవుడు నివసించే ఆలయం (1 కొరింథీయులకు 6:19).
దేవుడు మానవునికి ఇంతటి ఉన్నత విలువను
ఇచ్చినందుకు మానవుడు నెరవేర్చవలసిన మూడు ముఖ్యమైన బాధ్యతలు ఉన్నాయి: దేవుని
ఆరాధించడం (యోహాను 4:24), తోటి మానవులను తనవలె తానే
ప్రేమించడం (మత్తయి 22:39), మరియు ప్రకృతిని, సృష్టిని
సంరక్షించడం (ఆదికాండము 2:15).
6. పాపపు ప్రభావం మరియు వికృతీకరణ
ఆదికాండము 3వ అధ్యాయంలో
ఆదాము, అవ్వల అవిధేయత (ఆది పాపం) వల్ల మానవజాతి
పతనమైంది. దీనివల్ల మానవుడు దేవునితో ఉన్న సహవాసాన్ని కోల్పోయాడు, ఆధ్యాత్మికంగా
మరణించాడు మరియు అతనిలోని దేవుని రూపం మారింది. (కానీ
పూర్తిగా నాశనం కాలేదు). పాపం వల్ల మానవుడు దేవుని మహిమను కోల్పోయినప్పటికీ
(రోమీయులకు 3:23), దేవుని దృష్టిలో అతని విలువ తగ్గలేదు. అందుకే
దేవుడు లోకాన్ని ప్రేమించి, తన కుమారుడైన యేసు క్రీస్తును
రక్షకునిగా లోకానికి పంపాడు (యోహాను 3:16). మానవునిలో ఉన్న ఆ దేవుని రూపమును పూర్తిగా పునరుద్దరించాలి
అప్పుడు మరల దేవునితో సహవాసం చేయగలడు మానవుడు.
7. మానవుణ్ణి మానవుడు చూసే విధానం
మానవుడు మాత్రం మరియొక మానవుణ్ణి దేవుడు చూసినట్లు
చూడటంలో విఫలం చెందుతున్నాడు. మానవుణ్ణి కేవలం ఒక వస్తువు వలె చూస్తున్నాడు. మానవ
జీవితం యొక్క విలువను ఎలా కొలవాలనే ప్రశ్న చరిత్ర పొడవునా సాగుతూనే ఉంది. మానవ
సమాజం ఎల్లప్పుడూ మనుష్యులను సంపద, హోదా, విద్య, అందం, కులం, వృత్తి
మరియు బాహ్య రూపాల ఆధారంగా వర్గీకరిస్తూ వచ్చింది, ఇది తీవ్ర
అసమానతలకు దారితీసింది. బైబిల్లో దీనికి కొన్ని స్పష్టమైన ఉదాహరణలు ఉన్నాయి:
- యాకోబు పక్షపాతం: యాకోబు తన కుమారుడైన
యోసేపుపై చూపిన ప్రత్యేక ప్రేమ, సహోదరుల మధ్య అసూయను
పెంచి, చివరికి యోసేపును బానిసగా అమ్మేసే
పరిస్థితికి తెచ్చింది.
- లాబాను వ్యత్యాసం: లాబాను తన కుమార్తెలైన
లేయా, రాహేలుల మధ్య బాహ్య రూపాన్ని బట్టి
వ్యత్యాసం చూశాడు. కానీ మనుష్యులు తృణీకరించిన లేయా పట్ల దేవుడు కరుణ
చూపించాడు.
- యాకోబు పత్రిక ఖండన: సమాజంలో కేవలం మంచి వస్త్రాలు, బంగారు ఉంగరాలు ఉన్న
ధనవంతులకు అగ్రస్థానం ఇచ్చి, పేదవారిని తృణీకరించే
ధోరణిని బైబిల్ తీవ్రంగా ఖండిస్తుంది (యాకోబు 2:2-4).
మనుష్యుడు వెలుపటి రూపాన్ని చూస్తాడు, కానీ దేవుడు
హృదయాన్ని చూస్తాడు (1 సమూయేలు 16:7). దైవ దృష్టి
శాశ్వతమైనది, ప్రేమపూరితమైనది. ఎందుకు మానవుడు మరియొక మానవుణ్ణి దేవుడు
చూసినట్లు చూడలేక పోతున్నాడు. కారణం మానవుడు తనలో ఉన్న దేవుని రూపాన్ని మార్చు కుంటు
దానికి అనేక వికృతమైన భావాలను కలుపుకుంటూ పోతున్నాడు. అప్పుడు తనకు నిజముగా ఉన్న దేవుని
రూపము ఎప్పటికీ తనకి కనపడకుండా పోయే అవకాశం ఉంది, దాని నుండి బయట పడాలంటే ముందుగా మనం
వికృత భావాలను కలపడం ఆపాలి. యేసు ప్రభువుని
అనుసరించి ఆయన వలె జీవించుట మొదలుపెడితే మరలా దేవుని రూపాన్ని మనలో చూడవచ్చు.
8. యేసుక్రీస్తు బోధనలు – కొత్త ఒడంబడిక
యేసుక్రీస్తు తన పరిచర్యలో సమాజం తృణీకరించిన
పన్నులు వసూలు చేసేవారు, కుష్ఠురోగులు, పాపులు, స్త్రీలు
మరియు పేదల పట్ల ప్రత్యేక కరుణ చూపాడు.
- తప్పిపోయిన గొఱ్ఱె ఉపమానం: తొంభైతొమ్మిది గొఱ్ఱెలను విడిచిపెట్టి, తప్పిపోయిన ఒక్క గొఱ్ఱెను కాపరి వెతకడం ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి
దేవునికి ఎంత అమూల్యుడో యేసు వివరించాడు.
- తప్పిపోయిన కుమారుని ఉపమానం: సర్వస్వం కోల్పోయి పాపంలో మునిగిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు
తండ్రి క్షమించి కౌగిలించుకోవడం, దేవుని అపారమైన ప్రేమను
సూచిస్తుంది.
- సమరయ స్త్రీ ఉదంతం: సామాజిక, నైతిక సరిహద్దులను దాటి యేసు ప్రభువు సమరయ స్త్రీతో మాట్లాడి, ఆమెకు గౌరవాన్ని ఇచ్చాడు.
9. సిలువ – మానవ విలువ
మనుష్యుని విలువను దేవుడు కేవలం మాటలతో కాకుండా, సిలువపై తన
స్వంత కుమారుని ప్రాణాన్ని ధారపోయడం ద్వారా నిరూపించాడు (రోమీయులకు 5:8). వస్తువు
విలువ దాని ధరను నిర్ణయిస్తుంది. దేవుడు ప్రతి మనిషి కొరకు క్రీస్తు రక్తము అనే
అత్యున్నతమైన వెలను చెల్లించాడు (1 పేతురు 1:18-19). సిలువపై
ఉన్న నేరస్థునికి చివరి క్షణంలో యేసు ఇచ్చిన వాగ్దానం, దైవ కృపకు
నిదర్శనం.
యేసుక్రీస్తు "రెండవ ఆదాముగా" వచ్చి
తన విధేయత ద్వారా మానవాళికి జీవమును ఇచ్చాడు (రోమీయులకు 5:18-19). క్రీస్తును
విశ్వసించినప్పుడు మానవుడు "క్రొత్త సృష్టిగా" మార్చబడతాడు (2 కొరింథీయులకు
5:17).
10. అపొస్తలుల బోధనలు మరియు అంతిమ గమ్యం
- అపొస్తలుడైన పౌలు క్రీస్తునందు యూదుడు, గ్రీసుదేశస్థుడు, దాసుడు, స్వతంత్రుడు, స్త్రీ, పురుషుడు అనే భేదాలు లేవని, అందరూ ఒక్కటే అని ప్రకటించాడు
(గలతీయులు 3:28). బానిసయైన
ఒనేసిమును సహోదరుడుగా స్వీకరించమని ఫిలేమోనును కోరాడు.
- మత్తయి 25 లోని అంతిమ తీర్పు
ఉపమానంలో యేసు ప్రభువు ఆకలిగొన్నవారికి, రోగులకు, పరదేశులకు చేసిన సహాయాన్ని తనకే చేసినట్లుగా ప్రకటించి, దీనులలో తనను తాను గుర్తించుకోవడం ద్వారా మానవ విలువను అత్యున్నత స్థాయికి
తీసుకెళ్లాడు.
మానవుని జీవితం ఇక్కడితో ముగిసిపోయేది కాదు; దేవుడు
మానవుణ్ణి నిత్య జీవం కోసం సృష్టించాడు.
మరణంలో శరీరం బలహీనమైనదిగా ఉన్న, పునరుత్థానంలో అది మహిమగల
ఆత్మసంబంధ శరీరముగా లేపబడుతుంది (1 కొరింథీయులకు 15:42-44). దర్శన గ్రంధం
21:3-4 ప్రకారం, విమోచించబడిన
మానవుని అంతిమ గమ్యం దేవునితో కలిసి దుఃఖం లేని లోకంలో నిత్యం జీవించడమే.
నేటి సవాళ్లు
నేటి ఆధునిక యుగంలో మతం, వర్గం, కులం,
ప్రాంతం, ధనం , హోదా , విజయాలు , సంపదలు ఎక్కువ మంది స్నేహితులు, అనుచరులు, ఎక్కువ మందికి
తెలిసినవారు అనే కొలమానలతో మనుష్యుల
విలువను కొలిచే తప్పుడు ధోరణి పెరిగింది. కానీ బైబిల్ ప్రకారం మన విలువ వీటి మీద ఆధారపడి
లేదు, అది దేవుని రూపంలో. పూర్తిగా ఆయన పోలీకలో మారడంలో
దాగి ఉంది.
మనిషి దేవునికి ఎంత విలువైనవాడో "క్రీస్తు మనుషునిగా
ఈ లోకానికి రావడం " (యోహాను 1:14) నిరూపిస్తోంది. దేవుడు
మానవుణ్ణి తన కంటిపాపలా ప్రేమిస్తున్నాడు (జెకర్యా 2:8). కాబట్టి, మనం మన తోటి
మనుష్యుల బాహ్య రూపాన్ని బట్టి కాక, వారిలో దేవుని రూపాన్ని
చూస్తూ, క్రీస్తు వలె ప్రతి ఒక్కరినీ ప్రేమిస్తూ, గౌరవిస్తూ
జీవించినప్పుడే నిజమైన దేవుని సంతానంగా ప్రకాశిస్తాము.
Comments
మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:
Post a Comment