యోసేపు మహోన్నత జీవిత గాథ: ద్రోహం నుండి సింహాసనం వరకు| కార్మెల్ శోభ

 


యోసేపు మహోన్నత జీవిత గాథ: ద్రోహం నుండి సింహాసనం వరకు

పరిచయం: ఒక విశేషమైన దైవ  వ్యూహం

పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌లోని ఆదికాండము 37వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు యోసేపు ఉంటుంది. ఇది కేవలం ఒక వ్యక్తి యొక్క జీవిత కాలక్రమం కాదు. ఇది మానవ హృదయాలలోని కుళ్లును, కుటుంబ ద్రోహాన్ని, అపారమైన సహనాన్ని, అంతకుమించిన దేవుని  ముందస్తు ప్రణాళికను ప్రదర్శించే ఒక మహా కావ్యం.

కనాను దేశంలో తండ్రికి అత్యంత ప్రియమైన కుమారునిగా స్వేచ్ఛా వాయువులు పీల్చిన ఒక పదిహేడేళ్ల బాలుడు, రాత్రికి రాత్రే బానిసగా మారిపోయాడు. పరాయి దేశంలో నమ్మకద్రోహానికి గురై, చీకటి చెరసాలలో మగ్గిపోయాడు. అయితే, ఏ శక్తులూ అతనిని అణచలేకపోయాయి. చివరికి అజేయమైన ఐగుప్తు  సామ్రాజ్యానికే మహామంత్రిగా, ఫరో తర్వాత అంతటి సర్వాధికారిగా ఎదిగాడు. మానవులు మనకు తలపెట్టే కీడును సైతం దేవుడు తన సార్వభౌమత్వంతో ఎలా మహా మేలుగా మారుస్తాడో చాటిచెప్పడానికి యోసేపు జీవితం , సార్వకాలలకు ఒక సజీవ నిదర్శనం.

1. యోసేపు బాల్యం: పక్షపాతపు రంగులు – పరలోకపు కలలు

యాకోబు కుటుంబ నేపథ్యం

ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబుకు పన్నెండు మంది కుమారులు. వారిలో యోసేపు పదకొండవ వాడు. యాకోబు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అతని భార్య రాహేలు, సుదీర్ఘకాలం గర్భఫలం లేక నిందాస్పదమైన స్థితిలో ఉన్న తర్వాత, దేవుని  కృప వల్ల యోసేపు జన్మించాడు. యాకోబుకు   వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడైనందున, రాహేలు జ్ఞాపకార్థంగా యోసేపును తన మిగిలిన పిల్లలందరికంటే మిన్నగా ప్రేమించాడు.


రంగుల చొక్కా – అసూయకు ఆజ్యం

యాకోబు యోసేపుపై ఉన్న పక్షపాత ప్రేమను బహిర్గతం చేస్తూ, అతనికి ఒక ప్రత్యేకమైన "రంగుల చొక్కా"ను కుట్టించి ఇచ్చాడు. ఆ కాలంలో ఇటువంటి, రంగురంగుల వస్త్రాలను కేవలం రాజకుమారులు, ఉన్నత వంశీయులు, శారీరక కష్టం చేయనివారే ధరించేవారు. ప్రతిరోజూ పొలాల్లో, ఎండలో గొర్రెలు కాస్తూ కష్టపడే మిగిలిన పదిమంది సోదరులకు ఈ చొక్కా నిరంతరం కళ్లమందే తిరుగుతూ, వారి హృదయాలలో అసూయ, ద్వేషాల మంటను రగిలించింది. దీనికి తోడు, సోదరులు చేసే తప్పులను, వారి దుర్మార్గాన్ని యోసేపు గమనించి తండ్రికి చేరవేసేవాడు. ఇది వారి పగను మరింత తీవ్రతరం చేసింది.

ఆదికాండము 37:4 – "తమ కంటే, ఎక్కువ తండ్రి అనురాగమునకు పాత్రుడగుటచే యోసేపును అతని సోదరులు ద్వేషింపసాగిరి. అతనితో ప్రియముగా మాట్లాడరైరి."

దైవ  దర్శనాలు: రెండు కలల మర్మం

ఈ ఉద్రిక్త వాతావరణంలో, యోసేపుకు దేవుని నుండి రెండు  కలలు వచ్చాయి. యోసేపు అమాయకత్వంతో ఆ కలలను తన సోదరుల ముందే వివరించాడు:

  • మొదటి కల (కంకుల పనలు ): పొలంలో అందరూ కలిసి కంకుల పనలు  కడుతుండగా, యోసేపు పన  నిటారుగా నిలబడింది. సోదరుల కట్టలన్నీ చుట్టూ చేరి యోసేపు కట్టకు సాష్టాంగ నమస్కారం చేశాయి.
  • రెండవ కల (ఖగోళ నక్షత్రాలు): సూర్యుడు, చంద్రుడు, మరియు పదకొండు నక్షత్రాలు యోసేపుకు మోకరిల్లి నమస్కరించాయి.

ఈ కలల అంతరార్థం ఏమిటంటే, ఒకరోజు యోసేపు అందరిపై పాలకుడు కాబోతున్నాడు, కుటుంబమంతా అతని పాదాల చెంత మోకరిల్లబోతోంది. ఈ కలలు సోదరుల పగను హత్యాప్రయత్నంగా మార్చగా, తండ్రియైన యాకోబు మాత్రం ఈ మాటలను తన మనస్సులో భద్రపరచుకున్నాడు.

2. దొతానులో కుట్ర: బావిలో  నుండి బానిసత్వానికి

సోదరుల క్షేమ సమాచారం

ఒకరోజు యాకోబు తన మందలను మేపుతున్న కుమారుల క్షేమ సమాచారాన్ని తెలుసుకోవడానికి యోసేపును షెకెము ప్రాంతానికి పంపాడు. యోసేపు తన రంగుల చొక్కా ధరించి, తండ్రి ఆజ్ఞకు విధేయుడై బయలుదేరాడు. అక్కడ వారు కనిపించకపోవడంతో, ఒక వ్యక్తి సహాయంతో వారు దొతానుకు వెళ్లారని తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు .

హత్యకు పథకం – రూబేను వ్యూహం

రంగుల చొక్కాతో దూరం నుండి నడిచి వస్తున్న యోసేపును చూడగానే, సోదరులలోని పాత పగ ఒక్కసారిగా బద్దలైంది. "ఇదిగో! కలలు కనువాడు  వచ్చుచున్నాడు." రండి, వీనిని   చంపి గోతిలో  పారవేసి  అడవి మృగం అతనిని తినేసిందని తండ్రితో చెబుదాం, అప్పుడు అతని కలలు ఏమవుతాయో చూద్దాం, అని కుట్ర పన్నారు.

కానీ, పెద్దవాడైన రూబేను తండ్రి దుఃఖాన్ని తట్టుకోలేక మన సోదరుని రక్తం మన చేతులకు అంటడం వద్దు. ప్రాణహాని చేయకుండా, ఈ అరణ్యంలోని ఎండిపోయిన బావిలో పడవేయండి  అని సలహా ఇచ్చాడు. వారు రూబేను మాటలకు అంగీకరించారు.

ఇరవై వెండి నాణేల ద్రోహం

యోసేపు దగ్గరకు రాగానే, సోదరులు అతనిపై  విరుచుకుపడ్డారు. అతని ఒంటిపై ఉన్న రంగుల చొక్కాను దారుణంగా విప్పేసి, నీరు లేని  చీకటి బావిలోకి నెట్టివేశారు. ఆ బావి లోపల నుండి యోసేపు  వారి దయ కోరుతూ, ఏడుస్తూ పెట్టిన కేకలను వారు ఏమాత్రం పట్టించుకోలేదు.

సరిగ్గా వారు భోజనానికి కూర్చున్న సమయంలో, గిలాదు నుండి ఐగుప్తు దేశానికి సుగంధ ద్రవ్యాలు, విలువైన నూనెలు తీసుకువెళ్తున్న ఇష్మాయేలీయుల (మిద్యానీయుల) వ్యాపార బృందం కనిపించింది. అప్పుడు యూదా మనస్సు మారి, మన సోదరుడిని చంపి అతని రక్తాన్ని దాచడం వల్ల మనకు వచ్చే లాభం ఏముంది? అతడు మన స్వంత మాంసం కదా, కనుక  అతనిని ఈ వ్యాపారులకు అమ్మేద్దాం అన్నాడు. అందరూ ఒప్పుకున్నారు. కేవలం 20 వెండి నాణేలకు (ఒక బానిస వెల) యోసేపును పరాయి దేశస్థులకు అమ్మేసారు.


యాకోబు అంతులేని శోకం

తమ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి సోదరులు ఒక మేకను కోసి, దాని రక్తంలో యోసేపు రంగుల చొక్కాను ముంచారు. దానిని తండ్రి వద్దకు తీసుకెళ్లి, "ఇది మాకు దొరికింది, ఇది నీ కుమారుని చొక్కాయేనా?" అని అడిగారు. యాకోబు ఆ రక్తపు చొక్కాను గుర్తుపట్టి, "నా కుమారుని దుష్టమృగం ముక్కలు ముక్కలుగా చీల్చివేసింది!" అని గుండెలు బాదుకున్నాడు. తన వస్త్రాలను చించుకుని, గోనెపట్ట కట్టుకుని, అనేక రోజులు ఓదార్పు లభించని ఘోర శోకంలో మునిగిపోయాడు.

3. ఐగుప్తులో పోతీపరు ఇల్లు: నీతికి దక్కిన జైలు శిక్ష

బానిస నుండి గృహనిర్వాహకుడి వరకు

ఐగుప్తుకు తీసుకురాబడిన యోసేపును, ఫరో రాజు యొక్క అంగరక్షకుల అధిపతి అయిన పోతీపరు కొనుగోలు చేశాడు. కన్నవారికి, మాతృభూమికి దూరమై, భాష కూడా తెలియని ఆ అపరిచిత దేశంలో యోసేపు కుంగిపోలేదు. అతను నమ్మకంగా, కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు.

అన్నిటికంటే ముఖ్యంగా, దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. యోసేపు ముట్టుకున్న ప్రతి పనిని దేవుడు ఆశీర్వదించడం పోతీపరు గమనించాడు. దాంతో పోతీపరుకు యోసేపుపై నమ్మకం కుదిరి, తన సమస్త ఆస్తికి, సేవకులకు, గృహ వ్యవహారాలన్నింటికీ యోసేపును ముఖ్య అధికారిగా (గృహనిర్వాహకుడు) నియమించాడు. యోసేపు అడుగుపెట్టడం వల్ల పోతీపరు ఇల్లు దేవుని  దీవెనలతో నిండిపోయింది.

పోతీపరు భార్య ప్రలోభం – యోసేపు నైతిక విజయం

యోసేపు సుందర రూపం, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం గల యువకుడు. పోతీపరు భార్య అతనిపై కన్నువేసి, రోజురోజుకూ తనతో వ్యభిచరించమని, పాపకార్యానికి ఒడిగట్టమని తీవ్రమైన ఒత్తిడి తీసుకురాసాగింది.  యోసేపు తన నైతిక విలువలను, దేవుని పట్ల ఉన్న భయాన్ని వదులుకోలేదు.

ఆదికాండము 39:9 – "...నేనింత దుష్కార్యమునకు ఓడిగట్టుదును?ఇది దైవ ద్రోహము గదా!అనెను ."

అతను ఆమెతో, నా యజమాని నన్ను నమ్మి ఈ ఇంట్లో ఉన్న సమస్తాన్ని, నిన్ను తప్ప, నా చేతికి ఇచ్చాడు, . ఎందుకంటే నువ్వు అతని భార్యవి. కాబట్టి నేను నా యజమానికి, నా దేవునికి ద్రోహం చేయలేనని ఖచ్చితంగా చెప్పాడు.

అబద్ధపు ఆరోపణ – అన్యాయమైన జైలు శిక్ష

ఒకరోజు ఇంట్లో సేవకులెవరూ లేని సమయం చూసి, ఆమె యోసేపు వస్త్రాన్ని గట్టిగా పట్టుకుని బలాత్కరించబోయింది. యోసేపు పాపానికి లొంగక, తన పైవస్త్రాన్ని ఆమె చేతిలోనే వదిలేసి, దిగంబరుడిగా బయటకు పారిపోయాడు. తీవ్ర అవమానానికి, కోపానికి గురైన ఆ స్త్రీ, ఆ వస్త్రాన్ని సాక్ష్యంగా వాడుకుని అబద్ధపు కథ అల్లింది.

తన భర్త రాగానే, ఆ హెబ్రీ బానిస నన్ను అవమానించడానికి వచ్చాడు, నేను కేకలు వేయడంతో తన వస్త్రాన్ని వదిలి పారిపోయాడని నింద మోపింది. పోతీపరు ఆగ్రహంతో రగిలిపోయి, యోసేపుకు ఎలాంటి వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వకుండా, రాజు ఖైదీలను ఉంచే చీకటి చెరసాలలో వేయించాడు.

4. చెరసాలలో కాంతి

జైలులో సాక్ష్యం

నీతిగా జీవించినందుకు యోసేపుకు దక్కిన బహుమతి జైలు శిక్ష. అయినా యోసేపు దేవునిని నిందించలేదు, తిరుగుబాటు చేయలేదు. అక్కడ కూడా దేవుని కృప యోసేపును వెంబడించింది. జైలు అధికారికి యోసేపుపై దయ కలిగి, జైలులోని ఖైదీలందరినీ, రోజువారీ పనులన్నింటినీ పర్యవేక్షించే పూర్తి బాధ్యతను యోసేపుకే అప్పగించాడు. దేవుడు తోడుంటే చెరసాల కూడా సింహాసనానికి దారి తీస్తుందని యోసేపు నిరూపించాడు.

ఇద్దరు అధికారుల కలలు

కొంతకాలానికి, ఫరో రాజుకు అపరాధం చేసిన ఇద్దరు ఉన్నత అధికారులు జైలుకు వచ్చారు. ఒకరు ఫరోకు ద్రాక్షారసం అందించే ప్రధాన పానపాత్రుడు, మరొకరు రాజుకు ఆహారం సిద్ధం చేసే ప్రధాన భోజన సంపాదకుడు (రొట్టెలు కాల్చేవాడు). ఒక రాత్రి వీరిద్దరికీ, విచిత్రమైన కలలు వచ్చాయి. మరుసటి రోజు ఉదయం వారి ముఖాలు విచారంగా ఉండటం చూసి, యోసేపు ప్రేమతో వారిని పరామర్శించాడు. వారు తమ కలలను వివరించారు. 

ప్రవచనం నెరవేరడం – పానపాత్రుని మతిమరపు

యోసేపు ఆ కలల వివరాలను నిష్పక్షపాతంగా, ధైర్యంగా చెప్పాడు. అలాగే పానపాత్రునితో, "నీకు మేలు జరిగినప్పుడు దయచేసి నన్ను జ్ఞాపకం ఉంచుకో. నేను హెబ్రీయుల దేశం నుండి అన్యాయంగా అపహరించబడ్డాను, ఇక్కడ జైల్లో ఉండటానికి నేనే తప్పూ చేయలేదు. నా గురించి ఫరోతో మాట్లాడని వేడుకున్నాడు.

మూడవ రోజున ఫరో పుట్టినరోజు వచ్చింది. యోసేపు చెప్పిన ప్రవచనం అక్షరాలా నెరవేరింది. భోజన సంపాదకుడు ఉరితీయబడ్డాడు, పానపాత్రుడు తిరిగి తన పదవిని పొందాడు. కానీ, ఐగుప్తు రాజభోగాలలో పడిన పానపాత్రుడు, తనకు జైల్లో ఉపకారం చేసిన యోసేపును పూర్తిగా మరిచిపోయాడు. యోసేపు మరో రెండు సుదీర్ఘ సంవత్సరాలు ఆ చీకటి జైల్లోనే వేచి ఉండవలసి వచ్చింది.

5. ఫరో కలలు: జైలు నుండి ప్రధాని పీఠం వరకు

రాజును కలవరపరిచిన రాత్రి దర్శనాలు

రెండు సంవత్సరాల తర్వాత, స్వయంగా ఐగుప్తు చక్రవర్తి అయిన ఫరోకు ఒకే రాత్రి రెండు కలలు వచ్చాయి.

  1. మొదటి కల: నైలు నది నుండి ఏడు బలిసిన, అందమైన ఆవులు బయటకు వచ్చి మేస్తుండగా, ఆ వెనుకే వచ్చిన ఏడు చిక్కిపోయిన, వికారమైన ఆవులు ఆ బలిసిన ఆవులను పూర్తిగా మింగివేశాయి.
  2. రెండవ కల: ఒకే కాండం మీద పెరిగిన ఏడు నిండుగా పండిన కంకులను, ఆ పక్కనే తూర్పు గాలికి ఎండిపోయిన ఏడు సన్నని కంకులు మింగివేశాయి.

ఉదయాన్నే ఫరో మనస్సు తీవ్రంగా కలవరపడింది. ఐగుప్తులోని మంత్రగాళ్లను, జ్ఞానులను, జ్యోతిష్యులను పిలిపించి కలలు చెప్పాడు. కానీ, సామ్రాజ్యంలో ఏ ఒక్కరూ దానికి అర్థం చెప్పలేకపోయారు.

యోసేపుకు పిలుపు – కలల  వివరణ

ఆ క్లిష్ట సమయంలో ప్రధాన పానపాత్రునికి జైల్లో ఉన్న యోసేపు గుర్తుకువచ్చాడు. అతడు భయపడుతూనే ఫరోతో, రాజా, నేను నా తప్పును ఒప్పుకుంటున్నాను. జైల్లో ఉన్నప్పుడు ఒక హెబ్రీ యువకుడు మా కలలకు కచ్చితమైన అర్థం చెప్పాడు, అది అలాగే జరిగింది అన్నాడు. వెంటనే ఫరో ఆజ్ఞతో యోసేపును జైలు నుండి త్వరగా బయటకు రప్పించారు. అతను క్షవరం చేసుకుని, బట్టలు మార్చుకుని రాజు సముఖంలో నిలబడ్డాడు. ఫరో, "నువ్వు కలలు వివరిస్తావని విన్నాను" అనగా, యోసేపు వినయంతో, "నేను కాదు రాజా, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చును" అన్నాడు.

ఫరో కలలు విని, యోసేపు ఇలా వివరించాడు: "రాజా, ఈ రెండు కలలు ఒక్కటే. దేవుడు తాను చేయబోయే కార్యమును ఫరోకు ముందుగానే చూపిస్తున్నాడు. రాబోయే ఏడు సంవత్సరాలు ఐగుప్తు దేశమంతటా అపారమైన పంట సమృద్ధి కలుగుతుంది. ఆ వెంటనే ఏడు సంవత్సరాలు భయంకరమైన కరువు వస్తుంది. ఆ కరువు ఎంత తీవ్రంగా ఉంటుందంటే, ముందున్న సమృద్ధి అంతా ప్రజలు మరిచిపోతారు. దేశం నాశనమవుతుంది. ఈ కార్యం దేవుని వల్ల నిశ్చయించబడింది, ఇది త్వరలోనే జరుగుతుంది" అని వివరించాడు. 

యోసేపు వ్యూహం – ఐగుప్తు రక్షణ ప్రణాళిక

యోసేపు కలల అర్థం చెప్పడమే కాకుండా, కరువు నుండి దేశాన్ని రక్షించడానికి ఒక అద్భుతమైన ప్రణాళికను ఫరో ముందు ఉంచాడు:

  • ఐగుప్తు దేశంపై ఒక బుద్ధి, జ్ఞానము గల అధికారిని నియమించాలి.
  • ఏడు సమృద్ధి సంవత్సరాలలో ఐగుప్తు అంతటా పండే పంటలో ఐదవ వంతు  సేకరించి, ప్రతి నగరంలోని ప్రభుత్వ గిడ్డంగులలో భద్రపరచాలి.
  • ఆ ఆహారాన్ని రాబోయే ఏడు కరువు సంవత్సరాలలో వాడుకుంటే దేశం ఆకలితో అంతరించిపోకుండా ఉంటుంది.

ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి

యోసేపు యొక్క అసాధారణ జ్ఞానాన్ని, పరిపాలనా దక్షతను చూసి ఫరో మరియు అతని సేవకులు ఆశ్చర్యపోయారు. ఫరో తన సింహాసనం నుండి లేచి, "దేవుని ఆత్మ కలిగిన ఇటువంటి వ్యక్తిని మనం ఎక్కడ కనుగొనగలం? దేవుడు ఇవన్నీ నీకు తెలియజేశాడు గనుక నీకంటే వివేకము, జ్ఞానము గలవాడు ఎవడూ లేడు" అని ప్రకటించాడు. ఫరో తన చేతి ఉంగరాన్ని యోసేపు వెలికి పెట్టాడు,మెడలో బంగారు గొలుసు వేశాడు. జాపేనత్- పానేయా అని నామకరణం చేసి అసెనత్ అనే వివాహం చేశాడు. 

ఫరో తన రాజ్యంలో రెండవ రథం మీద యోసేపును ఎక్కించి, అతనికి సాష్టాంగపడమని ప్రజలకు ఆజ్ఞాపించాడు. కేవలం సింహాసనం విషయంలో మాత్రమే ఫరో యోసేపుకంటే పెద్దవాడు, మిగిలిన సమస్త అధికారం యోసేపు హస్తగతమైంది. అప్పుడు యోసేపు వయస్సు కేవలం 30 సంవత్సరాలు. పదిహేడేళ్ల వయసులో బానిసగా అమ్మబడిన యువకుడు, పదమూడేళ్ల శ్రమల తర్వాత సామ్రాజ్య అధినేత అయ్యాడు.

6. సమృద్ధి – కరువు- కనాను నుండి సోదరుల ఆగమనం

ధాన్యపు రాశులు – కుమారుల జననం

ప్రధానమంత్రిగా యోసేపు ఐగుప్తు దేశమంతటా సంచరించి, ఏడు సమృద్ధి సంవత్సరాలలో పండిన ధాన్యాన్ని సముద్రపు ఇసుక రేణువులంతగా కూడబెట్టాడు. అది లెక్కకు మించిపోవడంతో చివరికి లెక్కించడం కూడా మానేశారు. ఈ సమృద్ధి కాలంలో యోసేపుకు ఇద్దరు కుమారులు జన్మించారు:

  1. మనష్షే: "దేవుడు నా కష్టాలన్నింటినీ, నా తండ్రి ఇంటిని నేను మరచిపోయేలా చేశాడు."
  2. ఎఫ్రాయిము: "నేను శ్రమపడిన దేశంలో దేవుడు నా పొలమును ఫలంపజేశాడు."

ఆ తర్వాత, యోసేపు చెప్పినట్లే ఏడు సంవత్సరాల కరువు ప్రారంభమైంది. ప్రపంచంలోని అన్ని దేశాలలో అన్నార్తులు అలమటించారు కానీ, ఐగుప్తు గిడ్డంగులలో ధాన్యం సమృద్ధిగా ఉంది. ప్రజలు ఆహారం కోసం ఫరో వద్దకు రాగా, ఫరో "మీరు యోసేపు వద్దకు వెళ్ళండి, అతడు చెప్పినట్లు చేయండి" అని పంపాడు.

మొదటి సందర్శన – గూఢచారులనే నింద

కరువు కనాను దేశాన్ని కూడా తాకింది. ఐగుప్తులో ధాన్యం దొరుకుతుందని తెలిసి యాకోబు తన పదిమంది కుమారులను అక్కడికి పంపాడు. రాహేలు రెండవ కుమారుడైన చిన్నవాడు బెంజమీనును మాత్రం, యోసేపులాగే అతనికి కూడా ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని భయపడి ఇంట్లోనే ఉంచుకున్నాడు.

సోదరులు ఐగుప్తుకు వచ్చి, దేశ పాలకునిగా సింహాసనంపై ఉన్న యోసేపు ముందు సాష్టాంగ పడ్డారు. యోసేపు తన సోదరులను వెంటనే గుర్తుపట్టాడు కానీ, ఐగుప్తు రాజవస్త్రాలలో, ఉన్న యోసేపును వారు గుర్తుపట్టలేకపోయారు. ఇరవై ఏళ్ల క్రితం తాను కన్న కలలు నెరవేరడం యోసేపు కళ్లారా చూశాడు.

యోసేపు వారి హృదయ స్థితిని పరీక్షించడానికి కఠినంగా మాట్లాడాడు. "మీరు దేశపు రహస్యాలు చూడటానికి వచ్చిన గూఢచారులు" అని నిందించాడు. వారు భయపడుతూ, "కాదు ప్రభువా, మేము ఒకే తండ్రి కుమారులం, నిజాయితీపరులం. మాకు ఒక చిన్న తమ్ముడు తండ్రి వద్ద ఉన్నాడు, ఒకడు లేడు" అని చెప్పారు. యోసేపు వారిని మూడు రోజులు జైల్లో ఉంచాడు.

మూడవ రోజున యోసేపు, "నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతకాలంటే ఒక పని చేయండి. మీలో ఒకరిని (సిమ్యోనును) ఇక్కడ జైల్లో ఉంచి, మిగిలిన వారు ధాన్యం పట్టుకెళ్లి, మీ చిన్న తమ్ముడిని నా ముందుకు తీసుకురండి. అప్పుడే మీ మాటలు నిజమని నమ్ముతాను" అన్నాడు.

వారు  తమలో తాము, నాడు మన తమ్ముడు (యోసేపు) బావిలో నుండి ఏడుస్తూ ప్రాధేయపడినప్పుడు మనం కనికరించలేదు, అందుకే ఈ ఘోరమైన విపత్తు మనపైకి వచ్చిందని  హెబ్రీ భాషలో మాట్లాడుకున్నారు. వారికి ఆ భాష తెలుసని యోసేపుకు గుర్తున్నా, తెలియనివానిలా నటించి పక్కకు వెళ్లి బిగ్గరగా ఏడ్చాడు. ఆ తర్వాత సిమ్యోనును వారి కళ్ల ముందే బంధించి, వారి సంచులలో ధాన్యం నింపి, వారు ఇచ్చిన డబ్బును కూడా రహస్యంగా సంచులలోనే తిరిగి పెట్టించి పంపించివేశాడు. దారిలో డబ్బును చూసిన సోదరులు, దేవుడు మనకు ఎందుకు ఈ శిక్ష వేస్తున్నాడని వణికిపోయారు. యాకోబు ఈ వార్త విని, బెంజమీనును పంపడానికి నిరాకరిస్తూ తీవ్రంగా రోదించాడు.

రెండవ సందర్శన – యూదా తీసుకున్న బాధ్యత

కరువు మరింత ఘోరంగా మారింది, తెచ్చిన ధాన్యం అయిపోయింది. మళ్లీ ఐగుప్తు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు యూదా తన తండ్రితో, ఆ పాలకుడు చిన్న తమ్ముడు లేకపోతే నా ముఖం చూడవద్దని ఖచ్చితంగా చెప్పాడు. బెంజమీనును నాతో పంపించు, అతని ప్రాణానికి నేనే పూర్తి పూచీ ఉంటున్నాను. ఒకవేళ నేను అతనిని తిరిగి తీసుకురాకపోతే ఆ పాపం నా జీవితాంతం నాపైనే ఉంటుందని యాకోబును ఒప్పించాడు. యాకోబు విధిలేక కానుకలతో, రెట్టింపు డబ్బుతో బెంజమీనును పంపాడు.

7. చివరి పరీక్ష: వెండి కప్పు – యూదా అద్భుత ప్రసంగం

యోసేపు ఇంట్లో విందు

సోదరులు బెంజమీనుతో కలిసి ఐగుప్తుకు రావడం చూసి యోసేపు మనస్సు ఉప్పొంగిపోయింది. తన గృహనిర్వాహకునితో, "వీరందరినీ నా ఇంటికి తీసుకెళ్లి గొప్ప విందు సిద్ధం చేయి" అని ఆజ్ఞాపించాడు. యోసేపు అంతఃపురంలోకి వెళ్తుండటంతో సోదరులు భయపడ్డారు. మొదట తాము తెచ్చిన డబ్బు సంచులలో దొరికిన విషయం గృహనిర్వాహకునికి వివరించారు. అతడు, "మీకు శాంతి కలుగును గాక, భయపడకండి. మీ దేవుడే ఆ ధనాన్ని మీ సంచులలో ఉంచాడు, మీ డబ్బు నాకు అందింది" అని ఓదార్చి, సిమ్యోనును విడిపించి వారి ముందుకు తెచ్చాడు.

విందు సమయంలో యోసేపు రాగానే వారు కానుకలు సమర్పించి మోకరించారు. యోసేపు వారి క్షేమ సమాచారం అడుగుతూ, "మీరు చెప్పిన ఆ ముసలి తండ్రి క్షేమంగా ఉన్నాడా? ఇంకా జీవించే ఉన్నాడా?" అని అడిగాడు. వారు, "నీ సేవకుడైన మా తండ్రి క్షేమంగా ఉన్నాడు" అని నమస్కరించారు.

యోసేపు కళ్లు తన స్వంత తమ్ముడైన బెంజమీనుపై పడ్డాయి. "మీరు చెప్పిన మీ చిన్న తమ్ముడు ఇతడేనా?  అని అతనితో నాయనా, దేవుడు నిన్ను కరుణించును గాక" అనగానే యోసేపు గొంతు పెగలలేదు. కన్నీళ్లు ఆపుకోలేక త్వరత్వరగా లోపలి గదిలోకి వెళ్లి కాసేపు బిగ్గరగా ఏడ్చి, ముఖం కడుక్కుని, తనను తాను నిగ్రహించుకుని బయటకు వచ్చాడు. విందులో ఐగుప్తీయుల ఆచారం ప్రకారం వేర్వేరుగా కూర్చున్నారు. యోసేపు  సోదరులు వారి వయస్సు ప్రకారం  కూర్చోవటం చూసి ఆశ్చర్యపోయారు. యోసేపు తన బల్ల మీది నుండి భోజన పదార్ధాలను పంపుతూ, బెంజమీనుకు మిగిలిన వారికంటే ఐదింతలు ఎక్కువగా వడ్డించాడు.

వెండి కప్పు పరీక్ష

మరుసటి రోజు ఉదయం వారు స్వదేశానికి ప్రయాణమయ్యే ముందు, యోసేపు తన సేవకునికి ఒక రహస్య ఆజ్ఞ ఇచ్చాడు: "వీరి సంచులలో వీలైనంత ధాన్యం నింపండి, అందరి డబ్బును సంచులలోనే పెట్టండి. కానీ, నా ప్రత్యేకమైన వెండి కప్పును మాత్రం చిన్నవాడైన బెంజమీను సంచిలో ఉంచండి."

వారు నగరం దాటి కొంతదూరం వెళ్లగానే, యోసేపు సేవకులు వారిని వెంబడించి గుర్రాలపై వచ్చి ఆపారు. "మా యజమాని చేసిన మేలుకు కీడు ఎందుకు చేశారు? ఆయన ద్రాక్షారసం త్రాగే, శకునము చూసే వెండి కప్పును ఎందుకు దొంగిలించారు?" అని నిందించారు.

సోదరులు ఆశ్చర్యపోతూ, "మేము అలాంటి తప్పు ఎన్నటికీ చేయము. ఒకవేళ మాలో ఎవరి సంచిలోనైనా ఆ కప్పు దొరికితే వారు మరణశిక్షకు అర్హులు, మిగిలిన మేమంతా బానిసలమవుతాము" అని చెప్పాడు. సేవకులు సంచులను పెద్దవాని నుండి చిన్నవాని వరకు వెతకడం ప్రారంభించారు. చివరకు బెంజమీను సంచిలో ఆ వెండి కప్పు బయటపడింది.

ఒక్కసారిగా సోదరుల గుండెలు ఆగిపోయినంత పనైంది. దుఃఖంతో,  తమ వస్త్రాలను చింపుకుని, గాడిదలపై సామాను వేసుకుని కన్నీళ్లతో నగరానికి తిరిగి వచ్చారు.

యూదా విన్నపం 

యోసేపు ఎదుట సోదరులందరూ నేలపై పడి రోదించారు. యోసేపు కఠినంగా నటిస్తూ, "మీరు చేసిన పని ఏమిటి?" అనగా, యూదా ముందుకు వచ్చి నిలబడ్డాడు. యూదా మాటలాడుతూ ...నా ప్రభువా, నీ సేవకుడనైన నాపై కోపపడక ఒక్క మాట వినండి. మీరు ఫరోతో సమానులు. మా ముసలి తండ్రికి వృద్ధాప్యంలో పుట్టిన ఏకైక చిన్న కుమారుడు ఈ బాలుడు. ఇతని అన్న చనిపోయాడు, అతని తల్లికి ఇతడొక్కడే మిగిలాడు. ఈ బాలుడు లేకపోతే మా తండ్రి బ్రతకలేడు. 'నేను ఈ బాలుడిని తిరిగి తీసుకురాకపోతే ఆ పాపం నాపై ఉంటుంది' అని మా తండ్రికి నేను హామీ ఇచ్చాను. కాబట్టి, దయచేసి ఈ బాలునికి బదులుగా నన్ను బానిసగా ఉంచుకుని, ఇతన్ని సోదరులతో పంపించివేయండి. బాలుడు లేకుండా నేను మా తండ్రి వద్దకు వెళ్ళలేను; మా తండ్రి దుఃఖంతో మరణించడం నేను చూడలేను అని విన్నవించాడు. 

8. క్షమాపణ – సయోధ్య: దైవ సంకల్పం బహిర్గతం

యోసేపు తనను తాను బయలుపరుచుకొనుట

యూదా ప్రసంగంలో ఉన్న నిజాయితీ, తండ్రి పట్ల ఉన్న ప్రేమ, తమ్ముని కోసం తన ప్రాణాన్ని బానిసగా ఇవ్వడానికి సిద్ధపడిన త్యాగ నిరతిని చూసిన యోసేపు హృదయం పూర్తిగా కరిగిపోయింది. తన సోదరులు మారిపోయారని, నాడు తన పట్ల చూపిన క్రూరత్వం నేడు వారిలో లేదని గ్రహించాడు. ఇక ఏమాత్రం తన్నుతాను అదుపు చేసుకోలేకపోయాడు.

అతడు బిగ్గరగా, "నా చుట్టూ ఉన్న ఐగుప్తీయులందరూ బయటికి వెళ్లండి!" అని కేక వేశాడు. గదిలో కేవలం సోదరులు మాత్రమే మిగిలి ఉన్నప్పుడు, యోసేపు బిగ్గరగా ఏడ్చాడు. అతని ఏడుపు శబ్దం రాజభవనమంతటా వినబడింది. అతడు తన సోదరులను చూసి హెబ్రీ భాషలో, "నేను యోసేపును! నా తండ్రి ఇంకా సజీవంగానే ఉన్నాడా?" అన్నాడు.

ఆ మాట వినగానే సోదరులు భయంతో, ఆశ్చర్యంతో స్తంభించిపోయారు. ఐగుప్తు సామ్రాజ్యాధినేత, నాడు తాము  అమ్మేసిన తమ స్వంత తమ్ముడే అని తెలిసి వారి కాళ్లు వణికాయి. ప్రతీకారం తీర్చుకుంటాడేమోనని దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.

గాయాలను మాన్పిన దైవ  దృక్పథం

యోసేపు వారి భయాన్ని గమనించి ప్రేమతో, "దయచేసి నా దగ్గరకు రండి" అని పిలిచాడు. వారు దగ్గరకు రాగా, అతడు వారితో ఎంతో మధురంగా మాట్లాడాడు. మానవ ద్రోహాన్ని దైవ సంకల్పంగా మార్చిన ఆ అద్భుత మాటలు ఆదికాండము 45:5-8  లో చూస్తాము. నేను మీరు  ఐగుప్తునకు అమ్మివేసిన మీ తమ్ముడైన యోసేపును. అయితే నన్ను ఇక్కడికి అమ్మినందుకు దుఃఖపడకుడి... ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకంటె ముందుగా నన్ను పంపించెను... కాబట్టి నన్ను ఇక్కడికి పంపినది మీరు కాదు దేవుడే అని చెప్పాడు. 

యోసేపు,  వారితో ఇంకా ఐదు సంవత్సరాల కరువు ఉంది. భూమిపై మీ వంశాన్ని సజీవంగా ఉంచడానికి దేవుడే నన్ను మీకంటే ముందుగా పంపాడు. మీరు త్వరగా మా తండ్రి వద్దకు వెళ్లి, యోసేపు ఐగుప్తుకు పాలకుడయ్యాడని చెప్పి, ఆలస్యం చేయకుండా కుటుంబ సమేతంగా ఇక్కడికి తీసుకురండి. మీకు, మీ పశువులకు గోషెను దేశంలో నేను ఆహారం అందిస్తానని  అన్నాడు.

ఆ తర్వాత యోసేపు బెంజమీను మెడపై పడి ఏడ్చాడు, బెంజమీను కూడా ఏడ్చాడు. సోదరులందరినీ ముద్దుపెట్టుకుని, వారి కన్నీళ్లు తుడిచాడు. ఆ తర్వాతే సోదరులకు ధైర్యం వచ్చి అతనితో మాట్లాడగలిగారు.

9. కుటుంబ పునరుద్ధరణ: గోషెనులో స్థిరపడటం

ఫరో రాజు రాజ ఆతిథ్యం

యోసేపు సోదరులు వచ్చిన వార్త ఫరో అంతఃపురానికి చేరింది. ఫరో కూడా ఎంతో సంతోషించి, యోసేపుతో, "నీ సోదరులను కనాను దేశానికి వెళ్లి, వారి తండ్రిని, భార్యాపిల్లలను తీసుకురమ్మను. ఐగుప్తు దేశంలోని శ్రేష్టమైన వస్తువులు, పండ్లు వారికి ఇస్తాను. ప్రయాణం కొరకు ఐగుప్తు రాజ బండ్లను తీసుకెళ్లమనండి" అని ఆజ్ఞాపించాడు.

యోసేపు తన తండ్రి కొరకు 20 గాడిదలపై ఐగుప్తు రాజభోగ వస్తువులను, ప్రయాణ ఆహారాన్ని పంపాడు. బెంజమీనుకు ప్రత్యేకంగా 300 వెండి నాణేలు, ఐదు జతల శ్రేష్టమైన దుస్తులు బహూకరించాడు. 

యాకోబు ఆత్మ పునరుజ్జీవనం

వారు  కనానుకు తిరిగి వచ్చి, "యోసేపు ఇంకా సజీవంగానే ఉన్నాడు, అతడే ఐగుప్తు దేశమంతటికీ పాలకుడు" అని చెప్పినప్పుడు యాకోబు గుండె ఆగిపోయినంత పనైంది. అతడు నమ్మలేకపోయాడు. కానీ, యోసేపు పంపిన మాటలను విని, తన్ను తీసుకెళ్లడానికి వచ్చిన ఐగుప్తు రాజ బండ్లను చూసినప్పుడు, వృద్ధుడైన యాకోబు ఆత్మ ఒక్కసారిగా పునరుజ్జీవింపబడింది. "ఇక చాలు! నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు. నేను మరణించకముందు వెళ్లి అతనిని చూస్తాను" అని ఇశ్రాయేలు చెప్పాడు.

గోషెనులో కన్నీటి కలయిక

యాకోబు తన పన్నెండు మంది కుమారులు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లు, సమస్త ఆస్తిపాస్తులతో ఐగుప్తుకు ప్రయాణమయ్యాడు. ఐగుప్తులో అడుగుపెట్టిన యాకోబు వంశస్థుల మొత్తం సంఖ్య 70 మంది.

యోసేపు తన రాజ రథాన్ని సిద్ధం చేసుకుని, తండ్రిని కలవడానికి గోషెను వెళ్లాడు. ఇరవై ఏళ్ల తర్వాత తండ్రీకొడుకులు కలుసుకున్నారు. యోసేపు తండ్రి మెడను కౌగిలించుకుని చాలాసేపు కన్నీళ్లు కార్చాడు. యాకోబు, "నిన్ను సజీవంగా చూశాను, ఇక నేను ప్రశాంతంగా చనిపోవచ్చు" అన్నాడు.

ఆ తర్వాత యోసేపు తన తండ్రిని ఫరో రాజుకు పరిచయం చేశాడు. వృద్ధుడైన యాకోబు ఫరోను ఆశీర్వదించాడు. యోసేపు తన కుటుంబానికి ఐగుప్తులోనే అత్యంత సారవంతమైన, పశుగ్రాసం గల గోషెను ప్రాంతంలో స్థిరనివాసం కల్పించి, కరువు కాలమంతటా వారిని పోషించాడు.

10. యాకోబు, యోసేపుల చివరి రోజులు: 

కరువు రోజులలో యోసేపు ఆర్థిక సంస్కరణలు

కరువు తీవ్రమవడంతో ప్రజల వద్ద డబ్బు అయిపోయింది. యోసేపు ధాన్యం ఇచ్చి ఐగుప్తులోని డబ్బునంతా ఫరో ఖజానాకు చేర్చాడు. ఆ తర్వాత ప్రజలు తమ పశువులను ఇచ్చి ధాన్యం కొన్నారు. చివరికి వారి భూములను, తమ్ము తాము కూడా ఫరోకు బానిసలుగా అమ్ముకున్నారు.

యోసేపు ఐగుప్తు భూములనన్నింటినీ ఫరో కొరకు కొనుగోలు చేసి, ప్రజలకు విత్తనాలు ఇచ్చి సాగు చేయించాడు. పంటలో ఐదవ వంతు (20%) ఫరోకు పన్నుగా ఇవ్వాలని, మిగిలిన 80% ప్రజల సొంత అవసరాలకు ఉంచుకోవాలని చట్టం చేశాడు. కేవలం యాజకుల భూములు మాత్రం ఫరో వశం కాలేదు. యోసేపు అద్భుతమైన ఆర్థిక సంస్కరణల వల్ల ఐగుప్తు సామ్రాజ్యం అత్యంత ధనవంతమైన దేశంగా మారింది.

ఎఫ్రాయిము, మనష్షేల దీవెన

యాకోబు ఐగుప్తులో 17 సంవత్సరాలు సుఖంగా జీవించి, 147 సంవత్సరాల వయస్సులో మరణశయ్యపైకి చేరాడు. తాను చనిపోయాక తనను ఐగుప్తులో కాకుండా, కనానులోని మక్పేలా గుహలో ఉన్న తమ పితరుల సమాధిలోనే పాతిపెట్టాలని యోసేపు చేత ప్రమాణం చేయించుకున్నాడు.

యోసేపు తన ఇద్దరు కుమారులు మనష్షే, ఎఫ్రాయిములను తండ్రి దీవెనల కొరకు తీసుకువచ్చాడు. వృద్ధుడైన యాకోబుకు కళ్లు కనబడవు. యోసేపు పెద్దవాడైన మనష్షేను యాకోబు కుడిచేతి వైపు, చిన్నవాడైన ఎఫ్రాయిమును ఎడమచేతి వైపు నిలబెట్టాడు. కానీ, యాకోబు ప్రవచన ఆత్మతో తన చేతులను మార్చి కుడిచేతిని చిన్నవాడైన ఎఫ్రాయిము తలపై, ఎడమచేతిని మనష్షే తలపై ఉంచాడు.

                   

యోసేపు అది చూసి తండ్రి చేతిని మార్చబోగా యాకోబు నిరాకరించి, "నాకు తెలుసు నా కుమారుడా, పెద్దవాడు కూడా గొప్ప జనమవుతాడు, కానీ అతని చిన్న తమ్ముడు అతనికంటే గొప్పవాడవుతాడు" అని ప్రవచించి, ఎఫ్రాయిమును ముందు ఉంచాడు. ఆ తర్వాత తన 12 మంది కుమారులను పిలిచి, వారి భవిష్యత్తును ప్రవచిస్తూ ఆశీర్వదించాడు. యోసేపును "నీటి బుగ్గ దగ్గర ఉన్న ఫలవంతమైన కొమ్మ" అని జగజ్జేతగా దీవించాడు.

యాకోబు మహా ఖననం

యాకోబు ప్రాణం విడిచిన తర్వాత యోసేపు తీవ్రంగా దుఃఖించాడు. ఐగుప్తు వైద్యులచే తండ్రి శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూయించాడు. ఐగుప్తీయులు యాకోబు కొరకు 70 రోజులు సంతాపం ప్రకటించారు (ఫరో రాజు చనిపోతే చేసేంత ఘనమైన సంతాపం ఇది). ఆ తర్వాత ఫరో అనుమతితో యోసేపు, అతని సోదరులు, ఐగుప్తు రథాలు, గుర్రాల సైన్యం, ఐగుప్తు పెద్దలంతా కలిసి కనాను దేశానికి వెళ్లి, అబ్రాహాము కొనుగోలు చేసిన మక్పేలా గుహలో యాకోబును అత్యంత ఘనంగా పాతిపెట్టారు.

11.సోదరుల భయాందోళనలు పరిపూర్ణ క్షమాగుణం

పాత పగపై మళ్లీ అనుమానం

తండ్రి చనిపోగానే సోదరులలో మళ్లీ భయం మొదలైంది. "తండ్రి బ్రతికున్నంత కాలం యోసేపు మనల్ని ఏమీ అనలేదు. ఇప్పుడు తండ్రి లేడు కాబట్టి, నాడు మనం చేసిన కీడుకు ప్రతీకారం తీర్చుకుంటాడేమో" అని అనుమానించారు. వారు యోసేపు వద్దకు ఒక వర్తమానం పంపారు: "నీ తండ్రి చనిపోయే ముందు, నీ సోదరుల అతిక్రమణలను, పాపాలను క్షమించమని నీకు ఆజ్ఞాపించాడు. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని సేవకులమైన మా తప్పులను క్షమించు." అని వేడుకున్నారు. 

ఆ మాటలు వినగానే యోసేపు మనస్సు వికలమై ఏడ్చాడు. సోదరులు స్వయంగా వచ్చి అతని పాదాలపై పడి, "ఇదిగో మేము నీ బానిసలం" అన్నారు.

యోసేపు అమూల్యమైన సమాధానం

ఆదికాండము 50:19-21 – "భయపడకుడు నేను  దేవుడనా యేమి ? మీరు నాకు కీడు తలపెట్టితిరి కాని దేవుడు ఆ  కీడును మేలుగా చేసెను. ఈనాడు జరిగినట్లుగా బహు ప్రజలు  జీవించుటకై దేవుడిట్లు చేసెను. మీరేమి భయపడవలదు, నేను మిమ్ము మీ పిల్లలను ఆదరింతును " అని యోసేపు వారికి చెప్పాడు.

ఈ మాటల ద్వారా యోసేపు పరిపూర్ణ క్షమాగుణానికి ఆదర్శంగా నిలిచాడు. అధికారం ఉన్నా ప్రతీకారం తీర్చుకోకుండా, దేవుని సార్వభౌమత్వాన్ని అంగీకరించాడు.

12.  యోసేపు వారసత్వం – ఆధ్యాత్మిక పాఠాలు

యోసేపు చివరి శ్వాస

యోసేపు ఐగుప్తులో 110 సంవత్సరాలు జీవించాడు. ఎఫ్రాయిము, మనష్షేల మూడవ తరం పిల్లలను చూసే భాగ్యం అతనికి దక్కింది. అతడు మరణశయ్యపై ఉన్నప్పుడు తన సోదరులను పిలిచి, విశ్వాసంతో తాను  చనిపోతున్నాను, అని చెప్పి  దేవుడు  అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం చేసిన వాగ్దాన దేశానికి (కనాను) మిమ్మల్ని నడిపిస్తాడు. మీరు ఇక్కడి నుండి వెళ్లేటప్పుడు నా ఎముకలను కూడా మీతో పాటు తీసుకువెళ్లాలని ప్రమాణం చేయించుకున్నాడు.

యోసేపు మరణించాక, అతని శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూసి, ఐగుప్తులో ఒక శవపేటికలో భద్రపరిచారు. వందల సంవత్సరాల తర్వాత, మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తును వీడి వెళ్లేటప్పుడు , యోసేపు ఎముకలను మరువకుండా వెంట తీసుకెళ్లారు. చివరకు అవి వాగ్దాన దేశంలోని షెకెము ప్రాంతంలో ఖననం చేయబడ్డాయి.

యోసేపు జీవితం నుండి నేర్చుకోవలసిన 5 ముఖ్యమైన ఆధ్యాత్మిక పాఠాలు

క్రమసంఖ్య

ఆధ్యాత్మిక పాఠం

యోసేపు జీవితంలో ఉదాహరణ

1

దైవ సంకల్పం 

మనుషులు చేసిన కీడును దేవుడు లోకరక్షణ కొరకు మేలుగా మార్చాడు.

2

నైతిక సమగ్రత 

పోతీపరు భార్య ఎంత ప్రలోభపెట్టినా, ఒంటరిగా ఉన్నా దేవునికి విరోధంగా పాపం చేయనని నిరాకరించాడు.

3

సహనం  నిరీక్షణ 

బావిలో, బానిసత్వంలో, జైలులో 13 సంవత్సరాలు ఉన్నా దేవునిపై విశ్వాసం కోల్పోలేదు.

4

పరిపూర్ణ క్షమాగుణం 

సర్వాధికారాలు ఉన్నా, తన్ను అమ్మేసిన సోదరులను ప్రేమతో క్షమించి, ఆదరించాడు.

5

వినయం 

కలల అర్థం చెప్పేటప్పుడు ఎక్కడా తనను తాను హెచ్చించుకోకుండా, దేవునికే మహిమ ఇచ్చాడు.

చారిత్రక కోణంలో చూస్తే, అబ్రాహాము సంతతి ఐగుప్తు దేశంలోనికి ఎలా ప్రవేశించిందో, ఆ తర్వాత మోషే ద్వారా నిర్గమనం జరగడానికి దేవుడు వేదికను ఎలా సిద్ధం చేశాడో వివరించడానికి యోసేపు చరిత్ర అత్యంత ప్రాముఖ్యమైనది. యోసేపు జీవితం మనకు నేర్పే పరమార్థం ఒక్కటే: "మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత చీకటిగా ఉన్నా, మనుషులు మనకు ఎంత ద్రోహం చేసినా, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన సమస్తాన్ని మన మేలు కొరకే  జరిగిస్తాడు."

 

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభౄద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబిల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పవిత్రుల జీవితాలు అందించడే ఈ బ్లాగ్ లక్ష్యం.

📲 మా WhatsApp Channel జాయిన్ అవ్వండి!

ప్రతి నితన పోస్ట్ మీ WhatsApp కు నేరుగా వస్తుంది

Join WhatsApp Channel

Comments

మీ అభిప్రాయాలు, ప్రశ్నలు క్రింద రాయండి:

Post a Comment

కామెంట్‌లు