మత్తయి 10:24-33 వ్యాఖ్యానం: నిర్భయ శిష్యత్వం మరియు దేవుని సంరక్షణ| కార్మెల్ శోభ
మత్తయి 10:24-33 – ప్రేషిత కార్య ఉపదేశము
శిష్యుడు గురువు కంటెను అధికుడు కాడు. సేవకుడు యజమానుని కంటెను అధికుడు కాడు.గురువువలె శిష్యుడు, యజమానునివలె సేవకుడు అయిన చాలును, ఇంటి యజమానుడు 'బెల్జబూలు' అని పిలువబడిన యెడల, అతని ఇంటి వారు ఇంకెంత హీనముగా పిలువబడుదురోకదా!”“కాబట్టి మనుష్యులకు భయపడకుడు. దాచబడినది ఏదియు బయలుపడకపోదు. రహస్యమైనదేదియు బట్టబయలు కాకపోదు. చీకటిలో నేను మీకు బోధించు ఈ విషయములనెల్ల మీరు వెలుతురులో బోధింపుడు. చెవిలో మీకు చెప్పబడిన దానిని ఇంటి మీదినుండి ప్రకటింపుడు. శరీరమును మాత్రము నాశనము చేయగలిగి, ఆత్మను నాశనము చేయలేని వారికి భయపడరాదు. ఆత్మను, శరీరమును కూడ నరక కూపమున నాశనము చేయ గలవానికి ఎక్కువగా భయపడుడు. ఒక కాసుతో మీరు రెండు పిచ్చుకలను కొనగలుగుదురు; కాని, మీ తండ్రి సంకల్పములేనిదే వానిలో ఏ ఒక్కటియు నేలకు ఒరగదు. ఇక మీ విషయమున మీ తల వెంట్రుకలన్నియు లెక్కింపబడియేయున్నవి. కావున భయపడకుడు. మీరు అనేక పిచ్చుకలకంటె అతి విలువైనవారు. "కనుక ప్రజలయెదుట నన్ను అంగీకరించు ప్రతివానిని, పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనును అంగీకరింతును.అటులగాక, ప్రజల యెదుట నన్ను తిరస్కరించు ప్రతివానిని పరలోక మందున్న నా తండ్రి సమక్షమున నేనును తిరస్కరింతును.
పరిచయం మరియు చారిత్రక నేపథ్యం
మత్తయి సువార్త 10వ అధ్యాయాన్ని దైవశాస్త్రంలో “ప్రేషిత కార్య ఉపదేశం” అని పిలుస్తారు. యేసుక్రీస్తు తన పన్నెండు మంది శిష్యులను సువార్త ప్రకటనకు పంపిస్తూ, వారు ఎదుర్కొనబోయే హింసలు, అపార్థాలు, మరియు అంతర్గత భయాలను ముందుగానే బయలుపరుస్తూ ఇచ్చిన అద్భుతమైన మార్గదర్శకమిది.
యేసు ప్రభువు గలిలయలో సేవ చేస్తున్న కాలంలో ఈ బోధ చెప్పబడింది. అప్పటికే పరిసయ్యులు ఆయనను "బెల్జెబూలు (దయ్యముల అధిపతి) ద్వారా దయ్యాలను తరిమేస్తున్నాడు" అని నిందించడం ప్రారంభించారు (మత్తయి 9:34). మరోవైపు రోమా రాజ్య పాలనలో రాజకీయ, మతపరమైన తీవ్ర వ్యతిరేకత కూడా పొంచి ఉంది. ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో, క్రైస్తవ శిష్యత్వం అనేది సౌకర్యాల బాట కాదు, అది "సిలువ బాట" అని యేసు ప్రభువు స్పష్టం చేశారు.
ఈ ఉపదేశం కేవలం నాటి శిష్యుల కోసం మాత్రమే కాదు; ఇది భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా విశ్వాసులు ఎదుర్కోబోయే సవాళ్లను ఉద్దేశించిన శాశ్వత బోధ. ఈ వాక్యభాగంలో (మత్తయి 10:24-33) యేసు ప్రభువు శిష్యులను హెచ్చరిస్తూనే, వారిని బలపరిచే మూడు ఓదార్పులను (గురువు-శిష్యుని సాదృశ్యం, దేవుని సంరక్షణ, పరలోక వాగ్దానం) అందిస్తున్నారు. ఈ ఉపదేశమును ఐదు ప్రధాన అంశాలుగా చూద్దాం.
I. శిష్యత్వపు పునాది: శిష్యుడు గురువును మించడు
“శిష్యుడు గురువు కంటెను అధికుడు కాడు... గురువువలె శిష్యుడు, యజమానునివలె సేవకుడు అయిన చాలును.” యేసు ప్రభువు తన శిష్యులకు బాధ్యతలు అప్పగించే ముందు, వారి అంచనాలను సరిచేయడానికి యూదుల రబ్బీ సంప్రదాయంలోని ఒక సాధారణ సత్యాన్ని గుర్తుచేశారు. ఒక పాఠశాలలో విద్యార్థి తన ఉపాధ్యాయుని అధికార పరిధిలో ఉన్నట్లే, ఆధ్యాత్మిక జీవితంలో శిష్యుడు తన గురువును అనుసరిస్తాడు.
1. క్రీస్తు జీవితమే విశ్వాసికి మాతృక
యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు అపహాస్యం పొందాడు, తిరస్కరించబడ్డాడు, చివరకు సిలువ వేయబడ్డాడు. కాబట్టి, ఆయనను అనుసరించే శిష్యులు ఏ విధమైన బాధలు లేకుండా లౌకిక సౌకర్యాలతో ఉంటారని ఆశించడం తార్కికం కాదు. యోహాను 15:20లో యేసు చెప్పినట్లు, "లోకం గురువును హింసించినప్పుడు శిష్యులను కూడా హింసిస్తుంది."
2. 'బెల్జెబూలు' నింద మరియు సాంస్కృతిక ప్రాధాన్యత
పరిసయ్యులు స్వయంగా లోక రక్షకుడినే “దయ్యముల అధిపతితో సాతానును వెళ్ళగోడుతున్నాడు ” అని పిలిచారు. ఇది నాటి సమాజంలో అత్యంత ఘోరమైన అపవాదు. పురాతన మధ్యప్రాచ్య ఆచారాల ప్రకారం, “ఇంటి వారు” అనే పదం కేవలం కుటుంబ సభ్యులనే కాక, సేవకులను, వారిపై ఆధారపడి జీవించేవారిని కూడా సూచిస్తుంది. యజమానునికి జరిగే గౌరవం లేదా అగౌరవం ఆ ఇంటి వారందరికీ వర్తిస్తుంది. కాబట్టి శిష్యులు ఆయనతో పూర్తిగా గుర్తించబడ్డారు. కాబట్టి, ఆయన పట్ల ఉన్న శత్రుత్వాన్ని వీరు కూడా పంచుకోవాల్సి వస్తుంది. లోకంలో విమర్శ, అపార్థం, తిరస్కరణ అనేవి శిష్యత్వానికి మినహాయింపులు కావు, అవి శిష్యరికపు సహజ లక్షణాలు (ఫిలిప్పీయులు 3:10). అయితే, ఈ విధమైన వ్యతిరేకత ఎదురైనప్పుడు శిష్యులు మౌనంగా ఉండిపోవాలా? లేదు, ఇక్కడే యేసు ప్రభువు రెండవ అంశంలోనికి నడిపిస్తున్నారు.
II. శిష్యత్వపు బాధ్యత: నిర్భయ సత్య ప్రకటన
“మనుష్యులకు భయపడకుడు... చీకటిలో నేను మీకు బోధించు ఈ విషయములనెల్ల మీరు వెలుతురులో బోధింపుడు.”
వ్యతిరేకత సహజమని చెప్పిన తర్వాత,
యేసు శిష్యులకు ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. ఈ అధ్యాయంలో ఆయన మూడు
సార్లు “భయపడకుడు” అని హెచ్చరిస్తారు. ఇది యాదృచ్ఛికం కాదు, ఉద్దేశపూర్వకమైన
ఆత్మీయ ప్రోత్సాహం.
1. సత్యం యొక్క అంతిమ విజయం
ప్రస్తుతానికి అబద్ధం విజయం సాధించినట్లు,
దుష్టులు గెలిచినట్లు కనిపించవచ్చు. కానీ దేవుని తీర్పు దినాన ప్రతి
రహస్య విషయం బయటపడుతుంది; సత్యం శాశ్వతంగా దాచబడదు. ఈ నిశ్చయతే
శిష్యుల ధైర్యానికి పునాది.
2. రహస్య శిక్షణ నుండి బహిరంగ సాక్ష్యం వరకు
ఇక్కడ “చీకటిలో” అనేది యేసు ప్రభువు ప్రజలకు ఉపమానాలలో బోధించి, తన శిష్యులకు మాత్రం వ్యక్తిగతంగా, రహస్యంగా వివరించిన సందర్భాలను సూచిస్తుంది (మత్తయి 13:10-17). ఈ విధంగా వారు నేర్చుకున్న ఆత్మీయ రహస్యాలు ఇప్పుడు బహిరంగంగా ప్రకటించబడాలి. నాటి రోజుల్లో యూదుల ఇళ్ల చదునైన పైకప్పుల పై నుండి ప్రజలకు ముఖ్యమైన ప్రకటనలు చేసేవారు. యేసు ప్రభువు ఈ ఉదాహరణను వాడుతూ, సువార్తను భయంతో దాచకుండా ధైర్యంగా, బహిరంగంగా చాటాలని కోరుతున్నారు. మనుష్యుల భయం వల్ల దేవుని రాజ్యం యొక్క సందేశం ఎన్నడూ నిశ్శబ్దం కాకూడదు. అయితే, మనుషులు ప్రాణాలను తీయడానికి కూడా సిద్ధపడే హింసాత్మక పరిస్థితుల్లో ఈ భయాన్ని ఎలా అధిగమించాలి? దానికి సమాధానమే తదుపరి అంశం.
III. శిష్యత్వపు దృక్పథం: ఎవరికి భయపడాలి?
“శరీరమును మాత్రము నాశనము చేయగలిగి, ఆత్మను నాశనము చేయలేని వారికి భయపడరాదు. ఆత్మను, శరీరమును కూడ నరక కూపమున నాశనము చేయగలవానికి ఎక్కువగా భయపడుడు.” భయాన్ని జయించడానికి యేసు ప్రభువు ఒక అద్భుతమైన ఆత్మీయ సూత్రాన్ని ఇస్తున్నారు: తక్కువ శక్తి గల వానికి భయపడటం మానేసి, సర్వశక్తిమంతునికి భయపడటం నేర్చుకోవాలి.
1. మానవ అధికార పరిమితులు
మనుషులు గరిష్టంగా ఏం చేయగలరు? వారు ఉద్యోగాన్ని తీసివేయవచ్చు, జైలుకు పంపవచ్చు, లేదా భౌతిక శరీరాన్ని చంపవచ్చు. పేరు చెడగొట్టవచ్చు, అపకీర్తికి గురిచేయవచ్చు. కానీ, నిత్యమైన ఆత్మ మీద వారికి ఏ అధికారమూ లేదు. మనుషుల అధికారానికి ఒక పరిమితి ఉంది, వారి నష్టం తాత్కాలికం మాత్రమే.
2. దేవుని పట్ల సరైన భయం మరియు 'గెహెన్నా'
దేవుడు మాత్రమే శరీరానికీ ఆత్మకూ, ఈ లోక జీవితానికీ మరియు నిత్యత్వానికి అంతిమ న్యాయాధిపతి. ఇక్కడ “భయం” అంటే ఆందోళనతో కూడిన వణుకు కాదు; అది దేవుని సార్వభౌమత్వాన్ని గుర్తించే అత్యున్నత గౌరవం, భక్తి, మరియు విధేయత. యేసు ప్రభువు ఇక్కడ వాడిన “నరక కూపము” అనే పదం 'గెహెన్నా' (Gehenna) ను సూచిస్తుంది. ఇది యెరూషలేము వెలుపల నిరంతరం చెత్త కాల్చే 'హిన్నోము లోయ'. ఇది శాశ్వత దైవ తీర్పుకు ప్రతీకగా మారింది. దేవునికి సరిగ్గా భయపడేవాడు ఏ మానవ శక్తికీ భయపడనవసరం లేదు. మనుష్యుల భయం నుండి విడుదల పొందాలంటే, ముందుగా దేవుని పట్ల సరైన భయభక్తులు కలిగి ఉండటం అవసరం. దేవుని తీర్పును గురించిన భయం మనల్ని భయబ్రాంతులకు గురిచేయడానికి కాదు, ఆయనపై సంపూర్ణ నమ్మకం ఉంచడానికి ఉద్దేశించబడింది. ఎందుకంటే, న్యాయాధిపతి అయిన దేవుడే మనలను ప్రేమించే పరలోక తండ్రి కూడా. ఈ ప్రేమాస్పద సంరక్షణను నాల్గవ అంశం వివరిస్తుంది.
IV. శిష్యత్వపు భరోసా: దేవుని అపారమైన సంరక్షణ
“ఒక కాసుతో మీరు రెండు పిచ్చుకలను కొనగలుగుదురు; కాని, మీ తండ్రి సంకల్పములేనిదే వానిలో ఏ ఒక్కటియు నేలకు ఒరగదు... మీరు అనేక పిచ్చుకలకంటె అతి విలువైనవారు.” దేవుని భయం మన హృదయంలో స్థిరపడినప్పుడు, ఆయన మన పట్ల చూపించే వ్యక్తిగత శ్రద్ధ మరియు అమూల్యమైన ప్రేమ మనకు ఓదార్పునిస్తాయి. యేసుప్రభువు ఇక్కడ ప్రకృతి నుండి రెండు అద్భుతమైన ఉదాహరణలను తీసుకున్నారు.
1. పిచ్చుకల ఉదాహరణ మరియు నాటి సామెత
నాటి రోమా సంతలలో పిచ్చుకలు అత్యంత చవకైన పక్షులు (ఒక కాసుకు
రెండు). అయినా, విశ్వాన్ని ఏలే దేవుని సంకల్పం లేకుండా
ఒక్క చిన్న పిచ్చుక కూడా నేలకు ఒరగదు. “దేవుని సంకల్పం లేకుండా ఒక పక్షి కూడా
నేలమీద పడదు” అనేది నాటి యూదా సమాజంలో ఒక ప్రసిద్ధ సామెత. యేసు ప్రభువు ఈ
చిన్నదాని నుండి గొప్ప తార్కిక విధానాన్ని
ఉపయోగించి: అల్పమైన పక్షుల పట్లే దేవుడు అంత శ్రద్ధ వహిస్తే, తన రూపంలో సృష్టించబడిన తన బిడ్డల పట్ల ఆయన ఇంకెంత శ్రద్ధ వహిస్తాడో
ఆలోచించమంటున్నారు.
2. తల వెంట్రుకల లెక్కింపు
మనిషి తలపై ఉన్న వేలాది వెంట్రుకలు కూడా దేవునికి తెలుసు, అవి లెక్కించబడి ఉన్నాయి. అంటే మన జీవితంలోని అత్యంత అల్పమైన, చిన్న విషయం కూడా ఆయన దృష్టికి దూరం కాలేదు. మన విలువ మన సంపద లేదా ప్రతిభపై ఆధారపడి లేదు, దేవుడు మనలను ప్రేమిస్తున్నాడనే సత్యంపై ఆధారపడి ఉంది. దేవుని సార్వభౌమత్వం అనేది ఏదో ఒక అగోచరమైన సిద్ధాంతం కాదు; ఇది వ్యక్తిగతమైనది, ప్రేమతో నిండినది. దేవుడు మనలను ఇంతగా సంరక్షిస్తున్నప్పుడు, హింసల పట్ల మనకున్న భయం తొలగిపోతుంది. ఈ ధైర్యంతోనే మనం లోకం ముందు నిలబడి క్రీస్తును ఒప్పుకోగలుగుతాము. ఇది మనల్ని ఈ ఉపదేశం యొక్క ముగింపు మరియు అత్యున్నత శిఖరానికి నడిపిస్తుంది.
V. శిష్యత్వపు ప్రధమ లక్షణం : క్రీస్తును ఒప్పుకోవడం
“ప్రజలయెదుట నన్ను అంగీకరించు
ప్రతివానిని, పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనును
అంగీకరింతును.” ఈ ఉపదేశం అంతిమంగా ఒక నిత్యత్వ తీర్మానానికి దారితీస్తుంది. భూలోకంలో
మనం క్రీస్తు పట్ల చూపే వైఖరి, పరలోకంలో మన నిత్యత్వాన్ని
నిర్ణయిస్తుంది.
1. నిజమైన ఒప్పుకోలు మరియు తిరస్కరణ
క్రీస్తును ఒప్పుకోవడం అంటే కేవలం నోటి
మాటలతో 'విశ్వాసిని' అని
చెప్పుకోవడం కాదు. అది బాప్తిస్మము ద్వారా, పరిశుద్ధ
జీవితం ద్వారా, ప్రతికూల పరిస్థితుల్లో సత్యం కోసం
నిలబడడం ద్వారా, మరియు సువార్తను ప్రకటించడం ద్వారా
వ్యక్తమయ్యే నిరంతర సాక్ష్యం. తండ్రి ఎదుట యేసు ప్రభువు నిలబడి, మనల్ని చూపిస్తూ
“ఇతడు/ఈమె నావాడు” అని చెప్పడం కంటే విశ్వాసికి అత్యంత గొప్ప గౌరవం మరొకటి లేదు.
దానికి విరుద్ధంగా, తాత్కాలిక సౌకర్యం కోసం క్రీస్తును
నిరాకరిస్తే, పరలోకంలో ఆయన కూడా మనల్ని నిరాకరిస్తారు.
2. పేతురు జీవితం – ఒక మినహాయింపు గుర్తింపు
ఇక్కడ ఒక ముఖ్యమైన ఆత్మీయ సత్యాన్ని గమనించాలి. అపొస్తలుడైన పేతురు భయంతో మూడు సార్లు యేసును ఎరుగనని నిరాకరించాడు, కానీ పశ్చాత్తాపపడి మళ్ళీ ప్రభువు కొరకు ప్రాణమిచ్చే అంతగా ఒప్పుకున్నాడు. కాబట్టి, ఈ వచనం బలహీనత వల్ల ఒక్కసారి తడబడిన విశ్వాసిని శాశ్వతంగా వదిలివేయడం గురించి చెప్పడం లేదు. ఇది పశ్చాత్తాపం లేని, నిరంతరాయంగా సాగే తిరస్కరణను మాత్రమే హెచ్చరిస్తుంది. దేవుని కృప పశ్చాత్తాపపడే హృదయాన్ని ఎల్లప్పుడూ స్వీకరిస్తుంది. భూలోక గుర్తింపు పరలోక గుర్తింపుకు, భూలోక తిరస్కరణ పరలోక తిరస్కరణకు దారితీస్తుంది.
ప్రధాన అంశాలు
ఈ ఐదు విషయాలనుండి నాలుగు సత్యాలు కనపడుతున్నాయి.
శిష్యత్వం యొక్క వెల: క్రైస్తవ జీవితం లౌకిక సౌకర్యాలకు మార్గం కాదు, ఇది గురువు యొక్క తిరస్కరణలో పాలుపంచుకోవడానికి కారణం అవుతుంది.
సన్నిహిత దైవ కృప: దేవుని
పాలన సార్వభౌమమైనదే కాక, అత్యంత వ్యక్తిగతమైనది. చిన్న పిచ్చుక
నుండి మన తలవెంట్రుకల వరకు ఆయన నియంత్రణలోనే ఉన్నాయి.
తీర్పు యొక్క నిత్యత్వం : గెహెన్నా
ప్రస్తావన మానవ ఎంపికల యొక్క అంతిమ లక్ష్యమును నొక్కి చెబుతుంది. మానవ హింస తాత్కాలిక భౌతిక
జీవితాన్ని మాత్రమే ముగించగలదు, కానీ నిత్య జీవితం దేవుని చేతుల్లోనే ఉంది.
బహిరంగ సాక్ష్య ప్రాధాన్యత: క్రైస్తవ విశ్వాసం అనేది కేవలం వ్యక్తిగత లేదా రహస్య విషయంగా మిగిలిపోకూడదు. క్రీస్తు అనుచరులు తమ విశ్వాసాన్ని సమాజంలో ధైర్యంగా ప్రకటించే ప్రేషిత స్వభావాన్ని కలిగి ఉండాలి.
ఆచరణాత్మక అన్వయాలు
వీటిని మన నిత్యజీవితంలో ఆచరణలోకి
తీసుకురావడానికి ఐదు మార్గాలు ఉన్నాయి:
వ్యతిరేకతకు సిద్ధపడండి: మీ భక్తి జీవితం వల్ల లేదా సత్యనిష్ఠ వల్ల కుటుంబంలోనో, వెరే చోటునో విమర్శలు, అపార్థాలు
వచ్చినప్పుడు ఆశ్చర్యపోకండి. అది మీరు క్రీస్తు మార్గంలో ఉన్నారనడానికి గుర్తు.
మౌన శిష్యత్వాన్ని వీడండి: కుటుంబంలో, స్నేహితులలో, సమాజంలో,
మరియు నేటి డిజిటల్ వేదికలలో దేవుని వాక్యాన్ని, ప్రేమను నిజాయితీతో పంచుకోండి. 'మౌన
శిష్యత్వం' అనేది బైబిలు పరిభాషలో ఒక విరుద్ధ పదం.
ఆందోళనలను దేవునికి అప్పగించండి: రేపటి గురించిన భయాలు, అనారోగ్యం,
లేదా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు, పిచ్చుకలను
పోషించే తండ్రి మిమ్మల్ని అంతకంటే ఎక్కువగా చూసుకుంటాడనే విశ్వాసంతో స్థిరంగా
ఉండండి.
దేవుని ఆమోదం కోసమే బ్రతకండి: మనుషుల మెప్పు, తాత్కాలిక ప్రశంసల కంటే, నిత్యుడైన దేవుని అనుకూలతను సంపాదించుకోవడానికే మీ ప్రాధాన్యతను
ఇవ్వండి.
క్రియలలో క్రీస్తును ఒప్పుకోండి: కేవలం మాటల్లోనే కాకుండా, మీ పరిశుద్ధ
ప్రవర్తన, సేవ, మరియు
క్షమాగుణం ద్వారా ప్రతిరోజూ లోకానికి క్రీస్తును కనపరచండి.
ముగింపు
మత్తయి 10:24-33 క్రైస్తవ శిష్యత్వానికి
ఒక గంభీరమైన, కాలాతీతమైన పిలుపు. శిష్యుడు తన గురువును
అనుసరించినట్లే, యేసు ప్రభువును ను అనుసరించే ప్రతి
విశ్వాసి ఆయన బాధలను, అవమానాలను పంచుకోవాలి; అప్పుడే ఆయన మహిమలో కూడా పాలుపంచుకోగలుగుతారు.
ప్రార్ధన: ప్రభువా!నేను నిజంగా నిన్ను నా జీవితం ద్వారా ఒప్పుకుంటున్నానా? నా భయాలు మనుష్యుల మీదనా, లేక మీద కేంద్రీకృతమై
ఉన్నాయా? మీ సంరక్షణపై నాకున్న విశ్వాసం ఎంత దృఢమైనది?"
అనే ప్రశ్నలకు నా హృదయాలలో నిజాయితీగా జవాబులు వెతుక్కున్నప్పుడు అనేక
సార్లు నేను సరైన మార్గంలో
లేను అనిపిస్తుంది. పేతురు వలె నిజమైన పశ్చాత్తాపం కలిగి ఉండేలా చేయండి. సిలువను
ఎత్తుకొని, మీకు నమ్మకమైన నిజమైన శిష్యులుగా ఎదిగేలాగా
చేయండి. భూలోక ఒప్పుకోలుకు లభించే పరలోక గుర్తింపు అనే వాగ్దానం నా జీవితంలో ఉండేలా చేయండి. ఆమెన్
Comments
మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:
Post a Comment