క్రీస్తు పిలుపు - మత్తయి విధేయత: మత్తయి 9:9-13 | కార్మెల్ శోభ
మత్తయి 9:9-13
తరువాత యేసు అటనుండి వెల్లుచు, సుంకపు మెట్టుకడ కూర్చున్న మత్తయి అనువానితో "నన్ను అనుసరింపుము" అనెను. అతడు అట్లే లేచి ఆయనను అనుసరిస్నెను. ఆ ఇంటిలో యేసు భోజనమునకు కూర్చుండినపుడు సుంకరులును, పాపులును అనేకులు వచ్చి ఆయనతోను, ఆయన శిష్యులతోను పంక్తియందు కూర్చుండిరి. అది చూచిన పరిసయ్యులు "మీ బోధకుడు ఇట్లు సుంకరులతో, పాపులతో కలిసి భుజించుచున్నాడేమి?" అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. ఆ మాటలను ఆలకించిన యేసు, "వ్యాధిగ్రస్తులకేగాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు గదా!నాకు కారుణ్యము కావలయునుగాని, బలి అవసరము లేదు అను లేఖనమునందలి అర్ధమును మీరు గ్రహింపుడు. నేను పాపులను పిలువవచ్చితిని కాని, నీతిమంతులను పిలుచుటకు రాలేదు" అని పరిసయ్యులకు ప్రత్యుత్తరమిచ్ఛెను.
1. మత్తయి పిలుపు: విధేయత – సంసిద్ధత
మత్తయి అను సుంకరిని యేసు ప్రభువు పిలుస్తున్నారు, యేసు ప్రభువు పిలుపుకు మత్తయి వెంటనే స్పందిస్తున్నారు. నాకు వేరె పని ఉంది అని కాని , లేక ఇంటి వద్ద చెప్పి వస్తాను అని కాని ఏమి చెప్పలేదు. యేసు ప్రభువు అడిగిన వెంటనే యేసు ప్రభువును అనుసరిస్తున్నారు. యేసు ప్రభువుని శిష్యుడు కావాలి అంటే ఇది ప్రధానమైన లక్ష్యం. యేసు ప్రభువుని శిష్యుడు ఎప్పుడు విధేయుడగా , సంసిద్ధుడుగా ఉండాలి. విధేయత మరియు సంసిద్ధత రెండు మనం మత్తయిలో చూస్తున్నాము. విధేయత యేసు ప్రభువు అప్పజెప్పిన పని చేయడానికి మరియు మన కర్తవ్యం మీదనే దృష్టి మరల్చకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. సంసిద్దత మనలను ఎప్పడూ కర్తవ్య నిర్వహణ చేయడానికి, వెనుకడుగు వేయకుండా వుండటానికి ఉపయోగపడుతుంది. యేసు ప్రభువును అనుసరించే వారు ఎల్లప్పుడు ఈ విధానంగానే ఉండాలి. అడిగిన వెంటనే మారు మాటలేకుండా ప్రభువును అనుసరించడానికి సిద్దపడటమే క్రీస్తు నిజమైన శిష్యుడు చేస్తాడు.
లోకసంబంధమైన లాభాలను తృణీకరించడం
మత్తయి కేవలం ఒక సాధారణ వ్యక్తి కాదు; అతడు రోమా ప్రభుత్వానికి పన్నులు వసూలు చేసే ఒక 'సుంకరి'. ఆ కాలంలో సుంకరి ఉద్యోగం ఆర్థికంగా ఎంతో లాభదాయకమైనది, సమాజంలో భౌతిక రక్షణను ఇచ్చేది. అయినప్పటికీ, యేసు ప్రభువు "నన్ను అనుసరింపుము" అని పలికిన ఒక్క మాటకే అతడు తన సుంకపు మెట్టును, లెక్కింపబడని ధనాన్ని, లౌకిక హోదాను క్షణాల్లో వదిలిపెట్టాడు. లోకం వైపు చూసే వ్యక్తి ఎప్పుడూ 'నా భవిష్యత్తు ఏమిటి?', 'నా ఆస్తి ఏమిటి?' అని ఆలోచిస్తాడు. కానీ మత్తయి క్రీస్తు రూపంలో పరలోక ధనాన్ని చూశాడు.
విధేయతలో దాగి ఉన్న రహస్యం
క్రీస్తు శిష్యత్వంలో మొదటి మెట్టు సంపూర్ణ విధేయత. విధేయత అంటే ఎటువంటి నిబంధనలు విధించకుండా లోబడటం. మత్తయి తన పాత జీవితానికి, నూతన జీవితానికి మధ్య ఎటువంటి సంకోచాన్ని ఉంచుకోలేదు. దేవుని పిలుపు వచ్చినప్పుడు మానవ ఆలోచనలు, సాకులు అడ్డురాకూడదని మత్తయి జీవితం మనకు నేర్పుతుంది.
సంసిద్ధత యొక్క ప్రాముఖ్యత
సంసిద్ధత అనేది హృదయ అంతరంగ స్థితిని తెలియజేస్తుంది. మన హృదయం ఎప్పుడూ దేవుని స్వరానికి సిద్ధంగా ఉంటేనే, పిలుపు రాగానే అడుగు ముందుకు వేయగలం. మత్తయి అంతఃకరణంలో మార్పు కోసం ఏనాడో సిద్ధపడి ఉన్నాడు, అందుకే యేసు పిలవగానే ఏ మారుమాటా లేకుండా లేచి నడిచాడు.
2. సుంకరులు, పాపులతో సహవాసం: దైవిక సంకల్పం
"మీ బోధకుడు ఇట్లు సుంకరులతో , పాపులతో కలిసి భుజించుచున్నాడేమి?" అని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. నీతి మంతుడైన పరగణించపడుతున్న ఒక వ్యక్తి ఎందుకు పాపులు, సుంకరులతో కలసి భుజించుచున్నాడు అని వారు యేసు ప్రభువును అడుగుతున్నారు. ఎందుకు యేసు ప్రభువు సుంకరులు, పాపులతో భుజించడానికి కారణం ఆయన వారి కోసం వచ్చారు. సుంకరులు , పాపులు దేవునికి దూరంగా ఉన్నారు. వీరు చేసిన పనుల ద్వారా వారు దేవునికి దూరంగా ఉన్నారు. కాని దేవుడు వీరికి కరుణ చూపించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నారు. దేవుడు వీరి దగ్గరకు వస్తున్నారు. వారిని తండ్రి దగ్గరకు తీసుకువెళ్ళడానికి యేసు ప్రభువు సిద్ధంగా ఉన్నానని తెలియజేయడానికి వస్తున్నారు. వీరు పాపములో ఉన్న దేవునికి దూరంగా ఉన్న వీరిని మరల తండ్రి దగ్గరకు పోవుటకు అర్హులుగా చేయడానికి వీరితో కలసి భుజిస్తున్నారు. వీరితో కలసి భుజించడం వల్ల యేసు ప్రభువు వారిని తనతో కలసి ఉండటానికి వారి పాత జీవితం వదలి వేయడానికి ఆహ్వానం ఇస్తున్నాడు.
పంక్తి భోజనం – అంగీకారానికి ప్రతీక
ఆనాటి యూదా సంస్కృతిలో ఒకరితో కలిసి భోజనం చేయడం అంటే వారిని సంపూర్ణంగా అంగీకరించడం, వారితో సమానత్వాన్ని ప్రకటించడం అని అర్థం. సమాజం ఎవరినైతే అంటరానివారిగా, పాపాత్ములుగా ముద్రవేసి దూరంగా ఉంచిందో, వారిని యేసు ప్రభువు ఆదరించారు. వారి ఇళ్లకు వెళ్లడమే కాకుండా, వారితో కలిసి ఒకే పంక్తిలో కూర్చున్నారు. ఇది దేవుని అనంతమైన ప్రేమకు, తండ్రి యొక్క హృదయ వైశాల్యానికి నిదర్శనం.
పాపుల కొరకైన క్రీస్తు అన్వేషణ
యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది కేవలం నీతిమంతులను మెచ్చుకోవడానికి కాదు, తప్పిపోయిన వారిని వెతికి రక్షించడానికి. సుంకరులు లంచగొండితనంతో, స్వార్థంతో దేవుని ధర్మానికి దూరమయ్యారు. ప్రజలు వారిని అసహ్యించుకున్నారు. కానీ యేసు వారి ఆత్మల విలువను ఎరిగినవాడు. పాపాన్ని అసహ్యించుకుంటూనే, పాపిని ప్రేమించే దైవిక తత్వాన్ని యేసు ఇక్కడ కనబరిచారు.
పునరుద్ధరణ మరియు నూతన జీవితం
క్రీస్తుతో భోజన పంక్తిలో కూర్చోవడం అనేది ఒక ఆధ్యాత్మిక మార్పుకు నాంది. ఆ పంక్తిలో కూర్చున్న ప్రతి పాపి క్రీస్తు పవిత్రతను, ఆయన కరుణను చూసి తమ పాత జీవితాన్ని వదిలిపెట్టడానికి ప్రేరేపించబడ్డారు. దేవునికి దూరమైన మానవాళిని, తిరిగి పరలోక తండ్రి సన్నిధికి చేర్చడమే క్రీస్తు యొక్క పరమార్థం.
3. పరిసయ్యుల అపార్థం – మతపరమైన గుడ్డితనం
ఇది పరిసయ్యులు సరిగా అర్ధం చేసుకోలేకపోయారు. యేసు ప్రభువును అపార్ధం చేసుకొని వారు శిష్యులను ప్రశ్నిస్తున్నారు. పరిసయ్యులు బహిరంగంగా దేవుని ఆజ్ఞలును దిక్కరించిన వారితో ఎప్పుడు కూడా భుజించరు. కాని యేసు ప్రభువు వారితో కలసి భుజిస్తున్నారు. ఇక్కడ యేసు ప్రభువు హ్ోషయ ప్రవక్త మాటలను గుర్తుచేస్తున్నారు. "నాకు కారుణ్యము కావలయునుగాని, బలి అవసరము లేదు" హ్ోషయ ప్రవక్త 6:6 . దేవునికి కావలసినది కారుణ్యము , బలులు కాదు. ఎవరికి ఈ కారుణ్యము మనం చూపించాలి అంటే అది ఎవరు అయితే పాపం చేసి దేవునికి దూరముగా ఉన్నారో వారికి కరుణ చూపించాలి. ఎవరు అయితే ఆకలితో ఉన్నారో వారికి కరుణ చూపించాలి. ఎవరు అయితే అనారోగ్యంతో ఉన్నారో వారికి కరుణ చూపించాలి. ఎవరు అయితే అవసరంలో ఉన్నారో వారికి కరుణ చూపించాలి. యేసు ప్రభువు చూపించిన కరుణ ఇటువంటి వారికి. వీరికి నిజానికి సమాజంలో ఒక స్థానం లేదు, యేసు ప్రభువు వీరితో ఉండటం వలన వీరికి సమాజంలో ఒక స్థానం ఇస్తున్నాడు. సమాజం వీరికి విలువ ఇచ్చే విధంగా చేస్తున్నారు.
బాహ్య భక్తి - అంతరంగ కరుణ
పరిసయ్యులు నియమ నిబంధనలకు, ఆచారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. తాము పవిత్రులమని, ఇతరులు పాపులని తీర్పు తీర్చడమే వారి పనిగా ఉండేది. వారు ధర్మశాస్త్రాన్ని అక్షరాలా పాటించారు కానీ, దాని వెనుక ఉన్న 'ప్రేమ, కరుణ' అనే ఆత్మను మరిచిపోయారు. యేసు వారి ఆలోచనా విధానాన్ని పూర్తిగా తప్పుబట్టారు. కేవలం బలులు అర్పించడం, దేవాలయ ఆచారాలు పాటించడం దేవునికి ఇష్టం లేదు; తోటి మానవుని పట్ల కరుణ చూపడమే దేవుడు కోరే నిజమైన ఆరాధన.
హొషేయ ప్రవక్త
యేసు హొషేయ 6:6 వాక్యాన్ని ఉటంకించడం ద్వారా పరిసయ్యుల మత గుడ్డితనాన్ని నిలదీశారు. "నాకు కారుణ్యము కావలయునుగాని, బలి అవసరము లేదు" అనే దేవుని వాక్యం, ఆచారాల కంటే మానవత్వమే మిన్న అని స్పష్టం చేస్తోంది. పాపంలో పడిపోయిన వారిని చూసి ఈసడించుకోవడం కాదు, వారిని కరుణతో లేవనెత్తడం దేవుని చిత్తం.
సామాజిక పునఃప్రతిష్ఠ
యేసు ప్రభువు చేసిన కార్యం కేవలం ఆధ్యాత్మికమైనది మాత్రమే కాదు, అది ఒక సామాజిక విప్లవం. సమాజంలో అట్టడుగున ఉన్నవారికి, వెలివేయబడిన వారికి ఆయన గౌరవాన్ని ఇచ్చారు. నిరాశ్రయులకు, రోగులకు, పాపులకు క్రీస్తు తోడుగా నిలవడం ద్వారా, సమాజం వారిని తిరిగి అంగీకరించేలా చేశారు. క్రీస్తు రాజ్యంలో ఎవరూ తక్కువ కాదు, ఎవరూ అస్పృశ్యులు కారు అని ఆయన తన క్రియల ద్వారా నిరూపించారు.
4. ఆధునిక క్రైస్తవ జీవితానికి అన్వయం
మత్తయి పిలుపు, పరిసయ్యుల ప్రశ్న, యేసు ప్రభువు ఇచ్చిన సమాధానం ఈనాడు మన దైనందిన జీవితానికి ఎంతో అవసరం. నేడు మనం కూడా అనేకసార్లు పరిసయ్యుల వలె ఇతరులను తీర్పు తీరుస్తూ ఉంటాం. సమాజంలో బలహీనులను, పాపంలో ఉన్నవారిని చూసి దూరంగా ఉంటాం. కానీ క్రీస్తు మనకు నేర్పిన మార్గం 'కరుణా మార్గం'.
మన పిలుపును గుర్తుచేసుకోవడం
మనం కూడా ఒకప్పుడు పాపులమే, దేవునికి దూరమైనవారమే అని గ్రహించాలి. దేవుడు మన పవిత్రతను చూసి మనల్ని పిలవలేదు, ఆయన కృపను బట్టే మనల్ని రక్షించాడు. కాబట్టి, ఇతరుల పట్ల మనం కూడా అదే కృపను, కరుణను చూపించాలి.
స్వయం-నీతి ప్రమాదం
"నేను నీతిమంతుడిని, నేను క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తాను, చర్చికి వెళ్తాను" అనుకుంటూ ఇతరులను తక్కువగా చూడటం పరిసయ్యుల లక్షణం. యేసు స్పష్టంగా చెప్పారు: "నేను నీతిమంతులను పిలువ రాలేదు, పాపులనే పిలువ వచ్చితిని." మనం మన పాప స్థితిని ఒప్పుకున్నప్పుడే దేవుని రక్షణ మనకు అందుతుంది.
ప్రార్ధన
ప్రభువా! అనేక సార్లు మీరు నన్ను పిలిచిన కాని నేను మీ మాట వినక, నన్ను ఎందుకు దేవుడు పిలుస్తాడు అని అనుకున్నాను. మీరు మత్తయిని పిలిచినట్లుగా మీచేత పిలువబడడానికి మీరు నా పవిత్రతని చూడరని, నేను అపవిత్రంగా ఉన్న నన్ను పిలుచుటకు వెనుకాడని మీ ప్రేమకు కృతజ్ఞతలు. మత్తయిని పిలిచినట్లుగానే నన్నును మంచి జీవితానికి పిలువండి. మత్తయి వలె నేను కూడా మీరు పిలిచిన వెంటనే మారు మాటలాడకుండా నేను మిమ్ము అనుసరించే విధంగా చేయండి. ప్రభువా మీరు వచ్చినది నన్ను పిలువడానికని , నాకు మీ ప్రేమను అందించడానికని, నా పాపములు క్షమించడానికని తెలుసుకొని వీటిని మీ నుండి వాటిని పొందుటకు నన్ను సిద్దపర్చండి. ప్రభువా మీరు ఈ లోకానికి వచ్చినది నా కోసం అని తెలుసుకొని నేను మీ దగ్గరకు రావడానికి నన్ను సిద్దపరచండి. మిమ్ము ఎప్పటికీ కోల్పోకుండ నన్ను దీవించండి. ఆమెన్.
Comments
మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:
Post a Comment