మానవుడు దేనిని వెదకాలి? మెస్సయ్యాను కనుగొనడం | యోహాను 1:35-42 ధ్యానం - కార్మెల్ శోభ
మానవుడు దేనిని వెదకాలి
యోహాను 1: 35-42
మరునాడు మరల యోహాను తన శిష్యులలో ఇద్దరితో నిలుచుని ఉండగా, ఆ సమీపమున నడచిపోవుచున్న యేసును చూచి "ఇదిగో'!దేవుని గొర్రె పిల్ల" అనెను. అది విని, ఆ యిద్దరు శిష్యులు యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తనను అనుసరించుటను చూచి, "మీరేమి వెదకుచున్నారు?" అని అడిగెను. "రబ్బీ! నీవు ఎక్కడ నివసించుచున్నావు?"అని అడిగిరి. "వచ్చి చూడుడు" అని యేసు సమాధానమిచ్ఛెను. వారు వెళ్ళి ఆయన నివాసస్థలమును చూచి, ఆనాడు ఆయనతో గడిపిరి. అది యించుమించు సాయంకాలము నాలుగు గంటల వేళ. యోహాను చెప్పినది విని యేసును వెంబడించిన ఆ ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు సోదరుడు ఆంద్రెయ. అతడు మొదట తన సహోదరుడగు సీమోనును కనుగొని "మేము మెస్సయ్యాను కనుగొంటిమి" అని చెప్పెను. అతడు సీమోనును యేసు వద్దకు తీసుకొనిరాగా, యేసు అతనిని చూచి "నీవు యోహాను కుమారుడవగు సిమోనువు. నీవు కేఫా అని పిలువ బడుదువు" అనెను. కేఫా అనగా రాయి అని అర్ధము.
మానవుడు దేనిని వెదకాలి
యోహాను 1: 35-42
బాప్తిస్మమిచ్చు యోహాను సాక్ష్యం: నిస్వార్థమైన పరిచర్య
యోహాను యేసు ప్రభువును తన శిష్యుల ఎదుట మరియు ప్రజల ఎదుట దేవుని గొర్రె పిల్ల అని ప్రకటించుటకు ఏనుకడుగు వేయుట లేదు. యేసు ప్రభువును చూసిన ప్రతి సారి ఆయనను ప్రకటించడానికి ఎంతగానో ఆనందపడుతున్నారు. యేసు ప్రభువు ఆ సమీపమున నడచిపోవుచున్నప్పుడు ఆయనను చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని యోహాను చెబుతున్నాడు.
ఈ ప్రకటన వెనుక యోహాను యొక్క అపారమైన నిస్వార్థత, దైవచిత్తానికి లోబడే గుణం కనిపిస్తాయి. ఆ రోజుల్లో యోహానుకు సమాజంలో ఎంతో గొప్ప పేరు ఉండేది. అనేకమంది ఆయన బోధలను వినడానికి, బాప్తిస్మం పొందడానికి వచ్చేవారు. అయినప్పటికీ, తనకంటే శక్తిమంతుడు, లోక పాపములను మోసే రక్షకుడు వచ్చాడని తెలిసిన వెంటనే, తన ప్రాముఖ్యతను తగ్గించుకోవడానికి ఆయన సిద్ధపడ్డాడు. "ఆయన హెచ్చవలసియున్నది, నేను తగ్గవలసియున్నది" (యోహాను 3:30) అన్న తన మాటలకు కట్టుబడి, క్రీస్తు వైపు ప్రజల దృష్టిని మళ్లించాడు. నిజమైన దైవసేవకుడి లక్షణం ఇదే—తమ వైపునకు కాక, ప్రజలను క్రీస్తు వైపునకు నడిపించడం.
దేవుని గొర్రెపిల్ల: పాత నిబంధన ముంగుర్తులు - నూతన నిబంధన నెరవేర్పు
గొర్రె పిల్లను యూదులు, వారికి బదులుగా, వారి పాపాలను పరిహరించుటకు బలి ఇచ్చేవారు. వారి పాపములను ఆ గొర్రె మొస్తుంది అని వారు నమ్మేవారు. అందుకే యోహాను మానవుల పాపములను మోసే గొర్రె పిల్లగా యేసు ప్రభువును చూస్తున్నారు. ఆయన మన పాపములను మోసే గొర్రెపిల్ల. మనకు బదులుగా శిక్షను అనుభవించడానికి మన వద్దకు వచ్చాడు. வாస్తవానికి గొర్రె పిల్ల రక్తం వారిని రక్షించలేదు, కేవలం యేసు ప్రభువు రక్తం మాత్రమే మనలను రక్షించగలదు అని పూర్తిగా తెలిసిన యోహాను, యేసు ప్రభువును దేవుని గొర్రె పిల్లగా ప్రకటిస్తున్నారు.
పాత నిబంధన కాలంలో ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయుల విముక్తి కొరకు పస్కా గొర్రెపిల్ల రక్తాన్ని ద్వారబంధాలకు పూశారు. ఆ రక్తం చూసి సంహారక దూత వారిని దాటిపోయాడు. అలాగే, ప్రతిరోజూ ఉదయము, సాయంకాలము పాపపరిహారార్థ బలులుగా నిర్దోషమైన గొర్రెపిల్లలను అర్పించే ఆచారం ఉండేది. అయితే, ఈ జంతు బలులు మానవుని అంతఃకరణను పూర్తిగా శుద్ధి చేయలేకపోయాయి; అవి కేవలం రాబోవు నిజమైన బలికి ఛాయగా మాత్రమే ఉన్నాయి. యోహాను ఈ సత్యాన్ని గ్రహించాడు. యెషయా ప్రవక్త పలికినట్లు, "వధకు తేబడు గొర్రెపిల్ల వలె ఆయన నడిపింపబడెను" (యెషయా 53:7) అనే ప్రవచనం యేసుక్రీస్తు నందే నెరవేరిందని యోహాను స్పష్టంగా చూశాడు. కల్వరి సిలువపై కార్చబడే క్రీస్తు రక్తం మాత్రమే మానవాళిని పాపపు శాపం నుండి, నిత్య మరణం నుండి విడిపించగలదని యోహాను ఇక్కడ రూఢీపరుస్తున్నాడు.
"మీరేమి వెదకుచున్నారు?" – క్రీస్తు అడిగే ఆత్మీయ ప్రశ్న
యేసు ప్రభువును దేవుని గొర్రె పిల్లగా ప్రకటిస్తున్నప్పుడు యోహనుతో ఆయన శిష్యులు కూడా ఉన్నారు. ఇది రెండవ సారి యోహాను, యేసు ప్రభువును గొర్రె పిల్లగా ప్రకటించడం. యోహాను శిష్యులకు తమ గురువు పదేపదే యేసు ప్రభువు గురించి ప్రకటిస్తున్నారు కనుక ఆయన గురించి తెలుసుకోవలనుకుంటున్నారు. అందుకే ఆ శిష్యులు ఇద్దరు కూడా ఆయనను వెంబడించడం మొదలుపెట్టారు. అది గమనించిన యేసు ప్రభువు వారితో మీరేమి ఎదుకుచున్నారు అని ప్రశ్నిస్తున్నారు.
యేసు ప్రభువు అడిగిన ఈ ప్రశ్న—"మీరేమి వెదకుచున్నారు?" అనేది కేవలం ఆ ఇద్దరు శిష్యులకే కాదు, నేటి మానవాళి అంతటికీ అన్వయిస్తుంది. మానవుడు పుట్టినప్పటి నుండి ఏదో ఒకదాని కొరకు వెతుకుతూనే ఉంటాడు. కొందరు ధనం కొరకు, కొందరు కీర్తి ప్రతిష్ఠల కొరకు, మరికొందరు లౌకిక సుఖాల కొరకు వెతుకుతారు. కానీ, యేసు అడిగే ప్రశ్న లోతైన ఆత్మీయ పరిశీలనను కోరుతోంది: "మీరు నా దగ్గరకు ఏ ఉద్దేశంతో వస్తున్నారు? కేవలం శారీరక అవసరాల కోసమా, అద్భుతాల కోసమా, లేక నిత్యజీవము కొరకా?" అని ఆయన అడుగుతున్నారు. హృదయాలను ఎరిగిన దేవుడు మన అన్వేషణ వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని ప్రశ్నిస్తున్నారు.
మానవుని అంతరంగ అన్వేషణ: మెస్సీయ కొరకు తపన
యేసు ప్రభువు అడిగిన ప్రశ్నకు వారు జవాబు ఇవ్వడం లేదు. కాని మరొక ప్రశ్న అడుగుతున్నారు. నీవు ఎక్కడ నివసించుచున్నావు అని వారు అడుగుతున్నారు. కారణం ఏమిటి అంటే వారికి ఏమి అడగాలో కూడా తెలియదు. ఆనాటి యోహాను శిష్యులు మాత్రమే కాదు, దేవుని మీద నమ్మకం ఉన్న వారు, దేవుని ఆజ్ఞల మీద నమ్మకం ఉన్నవారు ఎదురు చూసేది, వేదికేది కేవలం రక్షకుడిని మరియు మెస్సీయ్యాను. ఇది వారు చెప్పక పోయిన, వారు కూడా తెలియకుండా చేసేది కూడా అదే.
మానవ హృదయంలో దేవుడు ఒక శూన్యతను ఉంచాడు. ఆ శూన్యతను లోకంలోని ఏ వస్తువూ, ఏ ఆనందమూ పూరించలేదు. శిష్యులకు యేసును చూడగానే ఒక వింతైన ఆకర్షణ, ఆత్మీయ నిమ్మళత్వం కలిగాయి. లౌకిక పరమైన కోరికలేవీ వారి మనసులో లేవు కాబట్టే, వారు నేరుగా "నీవు ఎక్కడ నివసిస్తున్నావు?" అని అడిగారు. అంటే, వారు ఆయనతో కలిసి ఉండాలని, ఆయన జీవన విధానాన్ని చూడాలని, ఆయన వ్యక్తిత్వాన్ని పూర్తిగా గ్రహించాలని ఆశపడ్డారు. శతాబ్దాలుగా ప్రవక్తలు ప్రవచించిన ఆ రక్షకుడు, తమ కళ్ల ముందే ఉన్నాడనే అంతర్గత సత్యాన్ని వారి ఆత్మ గుర్తించింది. మానవుని నిజమైన అన్వేషణ భగవంతునితో సహవాసం చేయడమే అనే సత్యం ఇక్కడ వ్యక్తమవుతోంది.
"వచ్చి చూడుడు" – క్రీస్తు ఆత్మీయ ఆహ్వానం
"రబ్బీ! నీవు ఎక్కడ నివసించుచున్నావు?"అని అడిగిరి. "వచ్చి చూడుడు" అని యేసు సమాధానమిచ్ఛెను. వారు వెళ్ళి ఆయన నివాసస్థలమును చూచి, ఆనాడు ఆయనతో గడిపిరి. అది యించుమించు సాయంకాలము నాలుగు గంటల వేళ. రబ్బీ! నీవు ఎక్కడ నివసించుచున్నావు అని వారు అడుగుతున్నారు. యేసు ప్రభువు వారికి తాను ఎక్కడ నివసించుచున్నది చెప్పడం లేదు, కాని వారిని వచ్చి చూడమని ఆహ్వానిస్తున్నారు. వారు దానికి మారు మాటలాడకుండా ఆయనను అనుసరిస్తున్నారు. ఆరోజు వారు ఆయనతో గడుపుతున్నారు.
యేసుక్రీస్తు ఎప్పుడూ సిద్ధాంతాలను బోధించే గురువు మాత్రమే కాదు, ఆయన అనుభవపూర్వకమైన దేవుడు. "వచ్చి చూడుడు" అనే పిలుపులో ఒక గొప్ప ఆత్మీయ సవాలు, అంతే గొప్ప ప్రేమ ఉన్నాయి. దేవునిని తెలుసుకోవడం అంటే పుస్తకాలు చదవడం లేదా ఇతరుల మాటలు వినడం మాత్రమే కాదు; ఆయనతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండడం. ఆ శిష్యులు యేసు నివాసానికి వెళ్లారు. అక్కడ లగ్జరీ భవనాలు లేవు, సామాన్యమైన జీవితం ఉంది. కానీ, ఆ నివాసంలో పరలోకపు శాంతి ఉంది, దైవికమైన జ్ఞానం ఉంది. సాయంకాలం నాలుగు గంటల నుండి ఆ రోజంతా వారు ఆయనతో గడిపిన ఆ సమయం, వారి జీవితాలనే మార్చివేసింది. క్రీస్తుతో గడిపే ప్రతి క్షణం మానవుని ఆలోచనా విధానాన్ని, జీవిత గమనాన్ని మార్చగలదు.
అనుభవపూర్వకమైన జ్ఞానం: వినికిడి నుండి అనుభవంలోనికి
ఆయనతో గడపటం వలన వారు అనుభవపూర్వకంగా, యేసు ప్రభువు మెస్సీయ్యా అని తెలుసుకుంటున్నారు. యోహాను వారికి యేసు ప్రభువు దేవుని గొర్రె పిల్ల అని చెప్పారు కాని ఇప్పుడు వారికి ఆయన కేవలం పాపములను మోసె గొర్రెపిల్ల మాత్రమే కాదు, దేవుడు ఏర్పరిచిన రక్షకుడు అని వారు తెలుసుకుంటున్నారు.
ఆత్మీయ జీవితంలో రెండు దశలు ఉంటాయి: మొదటిది, ఇతరులు చెప్పగా వినడం (Hear-say faith); రెండవది, స్వయంగా అనుభవించడం (Experiential faith). బాప్తిస్మమిచ్చు యోహాను సాక్ష్యం ద్వారా వారు యేసు వద్దకు వచ్చారు. కానీ, ఆయనతో గడిపిన తర్వాత వారి విశ్వాసం సొంత అనుభవంగా మారింది. వారు కేవలం ఒక ప్రవక్తనో లేదా ఒక నైతిక బోధకుడినో చూడలేదు; శతాబ్దాలుగా ఇశ్రాయేలు ప్రజలు కనిపెట్టుచున్న అభిషిక్తుడైన 'మెస్సీయ'ను వారు దర్శించారు. నేడు క్రైస్తవ జీవితంలో కూడా మన పితరుల భక్తి లేదా ఇతరుల సాక్ష్యాలు మనల్ని దేవుని వైపు నడిపించవచ్చు, కానీ మనం స్వయంగా క్రీస్తు ప్రేమను రుచిచూడనంత వరకు ఆ భక్తి పరిపూర్ణమవ్వదు. "యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి" (కీర్తనలు 34:8) అన్న వాక్యం ఇక్కడే నెరవేరుతుంది.
కనుగొన్న సత్యాన్ని పంచుకోవడం: ఆంద్రెయ సువార్త సేవ
యోహాను చెప్పినది విని యేసును వెంబడించిన ఆ ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు సోదరుడు ఆంద్రెయ. అతడు మొదట తన సహోదరుడగు సీమోనును కనుగొని "మేము మెస్సయ్యాను కనుగొంటిమి" అని చెప్పెను. అతడు సీమోనును యేసు వద్దకు తీసుకొనిరాగా, యేసు అతనిని చూచి "నీవు యోహాను కుమారుడవగు సిమోనువు. నీవు కేఫా అని పిలువ బడుదువు" అనెను. కేఫా అనగా రాయి అని అర్ధము.
ఆంద్రెయ చరిత్రలో ఒక గొప్ప ప్రత్యేకత ఉంది. బైబిల్‌లో ఆంద్రెయ ఎప్పుడు కనిపించినా, ఎవరినో ఒకరిని యేసు వద్దకు నడిపిస్తూనే ఉంటాడు (ఐదు రొట్టెలు, రెండు చేపలు ఉన్న చిన్నవాడిని తెచ్చింది ఆంద్రెయే; గ్రీకు దేశస్థులను యేసు వద్దకు తెచ్చింది కూడా ఆంద్రెయే). ఇక్కడ క్రీస్తును కనుగొన్న వెంటనే, ఆ సంతోషాన్ని తనలోనే దాచుకోలేకపోయాడు. మొట్టమొదట తన స్వంత సహోదరుడైన సీమోను వద్దకు పరిగెత్తాడు. సువార్త పరిచర్య ఎప్పుడూ మన ఇరుగుపొరుగు నుండి, మన కుటుంబం నుండే ప్రారంభం కావాలి. "మేము మెస్సయ్యాను కనుగొంటిమి" అన్న ఆంద్రెయ మాటల్లో ఎంతో నిశ్చయత, ఆనందం ధ్వనిస్తున్నాయి.
సత్య అన్వేషణలోని జ్ఞానం మరియు దైవిక వెల్లడి
యోహాను శిష్యులు ఆయనను వదలి యేసు ప్రభువును అనుభవపూర్వకంగా మెస్సీయ్యా అని, సిఖారు పట్టణ వాసుల వలె, ఎవరో చెప్పినందుకు కాక, ఆయనతో ఒక రోజు గడిపి తెలుసుకున్నారు. ఈయనే నిజమైన మెస్సీయ్యా అని తెలుసుకున్న ఈ శిష్యులలో ఒకరు, సీమోను సోదరుడు అయిన ఆంద్రెయ. ఆయన తన సోదరుడు అయిన సీమోను పేతురుతో మేము మెస్సీయ్యాను కనుగొన్నాము అని చెప్పాడు. మెస్సీయ్యాను కనుగొనుట అనేది జ్ఞానంతో కూడిన ఒక ప్రక్రియ. అనేక మంది మంచి పనులు చేసిన వారు, దేవుడు గురించి చెప్పిన వారు ఉండవచ్చు కాని అందరు మెస్సీయ్యా కాదు. యోహానుకు మాత్రమే నిజమైన మెస్సీయ్యా తెలుసు, ఎందుకంటే దేవుడు ఆయనకు మెస్సీయ్యా ఎవరు, ఎలా ఉంటారు అని చెప్పాడు, ఆయన శిష్యుడైన ఆంద్రెయకు మెస్సీయ్యాను కనుగొనుట సాధ్యమే. తన గురువు ఆయన గురించి చెప్పాడు మరియు ఆయన యేసు ప్రభువుతో గడిపి ఆ విషయం తెలుసుకుంటున్నాడు.
లోకంలో ఎందరో తత్వవేత్తలు, సంస్కర్తలు ఉండవచ్చు. కానీ, పాప పరిహారం చేసి, మానవునికి నిత్యజీవాన్ని ఇవ్వగలిగే మెస్సీయ ఒక్కడే. ఈ సత్యాన్ని గ్రహించడానికి కేవలం మానవ జ్ఞానం సరిపోదు; దైవికమైన వెల్లడి (Divine Revelation) అవసరం. బాప్తిస్మమిచ్చు యోహానుకు దేవుడు ఆత్మ ద్వారా యేసును బయలుపరిచాడు. ఆ సత్యోపదేశాన్ని పొందిన ఆంద్రెయ, క్రీస్తుతో గడిపిన సమయం ద్వారా ఆ జ్ఞానాన్ని స్థిరపరుచుకున్నాడు. ఇది ఒక క్రమశిక్షణతో కూడిన ఆత్మీయ ప్రయాణం.
బలహీనతను బలముగా మార్చే క్రీస్తు స్పర్శ
ఆయన పేతురును యేసు ప్రభువు దగ్గరకు తీసుకొని వస్తున్నాడు. యేసు ప్రభువు ఆయనను కేఫా అని పిలుస్తున్నారు. ఆయన అంతగట్టివాడు కాకపోయినప్పటికి, అంత గట్టిగా ఆయనను చేస్తాడు యేసు ప్రభువు.
సీమోను యేసు వద్దకు వచ్చినప్పుడు, యేసు ఆయనను చూచిన చూపు ఎంతో ప్రత్యేకమైనది. యేసు కేవలం సీమోను యొక్క వర్తమానాన్నే కాదు, ఆయన భవిష్యత్తును కూడా చూశాడు. అప్పటికి సీమోను చంచల స్వభావుడు, తొందరపాటుతనం కలిగినవాడు, ఆవేశపరుడు. కానీ యేసు, "నీవు కేఫా (రాయి/పేతురు) అని పిలవబడుదువు" అన్నాడు. లోకం మనుషుల బలహీనతలను చూసి వారిని తక్కువ చేస్తుంది; కానీ క్రీస్తు మనలో దాగి ఉన్న ఆత్మీయ సామర్థ్యాన్ని చూసి, మనల్ని రూపాంతరపరుస్తాడు. చంచలుడైన సీమోనును, సంఘానికి పునాది రాయిగా, పెంతుకోస్తు దినమున వేలాది మందిని ప్రభువు వైపు తిప్పగలిగే గట్టి బండగా మార్చాడు. క్రీస్తు హస్తాలలో మన జీవితాలను పెడితే, ఆయన మన బలహీనతలను తన మహిమార్థమై బలముగా మారుస్తాడు.
ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన: ప్రభువా! మీరు మా పాపములను మోసే దేవుని గొర్రె పిల్ల అని యోహాను ద్వారా తెలుసుకుంటున్నాం. యోహాను తన శిష్యులు మిమ్ములను అనుసరిస్తున్నందుకు ఎంతగానో ఆనందపడుతున్నాడు. తనను వీడిపోతున్నారు అనే బాధలేకుండా మిమ్ములను తెలుసుకుంటున్నారు అనే సంతోషం ఆయనలో ఉన్నది. మేము కూడా మా జీవితాలలో అటువంటి భావాలు కలిగి జీవించే అనుగ్రహం మాకు దయచేయండి. యోహాను చెప్పినందుకే కాకుండా మిమ్ములను అనుసరించి, మీ దగ్గర ఉండి, మీరు ఎంత గొప్ప వారో, మరియు మీరు రక్షకుడు అని వారు తెలుసుకుంటున్నట్లుగా మేము కూడా అనుభవ పూర్వకంగా మిమ్ములను తెలుసుకునే భాగ్యం మాకు దయచేయండి. ప్రభువా! మీరు ఏమి వెదకుచున్నారు అని శిష్యులను అడుగుతున్నారు. మేము కూడా మా జీవితములలో చాలా वेదకూచున్నాము. శిష్యుల వలె రక్షకుడను వేదకుట లేదు. ఏమి వెదకాలో మాకు తెలియదు. మిమ్ములను వెదికే జ్ఞానము మాకు దయచేయండి. సీమోను వలె మమ్ములను గట్టివారిగా చేయమని వేడుకుంటున్నాము. ఆమెన్
Comments
మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:
Post a Comment