తండ్రిని తెలుసుకొనుటయే నిత్య జీవము: యోహాను 17:1-11 ధ్యానం | కార్మెల్ శోభ

 యోహాను 17:1-11 

యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లు ప్రార్ధించెను: "తండ్రి ! గడియ వచ్చినది. నీకుమారుడు నిన్ను మహిమపరుచుటకు నీవు నీ కుమారుని మహిమ పరుపుము. నీవు నీ కుమారునకు అప్పగించిన వారందరకు ఆయన నిత్య జీవము ప్రసాదించుటకు నీవు ఆయనకు మానవులందరిపై అధికారమును ఒసగితివి. ఏకైక సత్య దేవుడవగు నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును వారు తెలిసికొనుటయే నిత్య జీవము. నీవు నాకు అప్పగించిన పనిని పూర్తి చేసి, నిన్ను ఈ లోకమున మహిమపరచితిని. ఓ తండ్రీ! లోక ఆరంభమునకు పూర్వము నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనొ, ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ సమక్షమున మహిమ పరుపుము. ఈ లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన వారికి నిన్ను తెలియజేసితిని. వారు నీ వారు. నీవు వారిని నాకు అనుగ్రహించినదంతయు నీ నుండియేనని వారు ఇపుడు గ్రహించిరి. నీవు నాకోసగిన సందేశమును వారికి అందజేసితిని. వారు దానిని స్వీకరించి, నేను నిజముగ నీ యొద్ద నుండి వచ్చితినని తెలిసికొని నీవు నన్ను పంపితివని విశ్వసించిరి. నేను వారి కొరకు ప్రార్ధించుచున్నాను. లోకము కొరకుకాక నీవు నాకు అనుగ్రహించిన వారి కొరకు ప్రార్ధించుచున్నాను. ఎలయన వారు నీ వారు . నా సర్వస్వము నీది. నీది అంతయు నాది. నేను వారి యందు మహిమపరుపబడితిని. నేను ఇక ఈ లోకమున ఉండను. కాని, వారు ఉందురు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పవిత్రుడవైన తండ్రీ!మన వలె వారును ఒకరుగ ఐక్యమై ఉండునట్లు నీవు నాకు ఒసగినవారిని నీ నామమునందు సురక్షితముగా ఉంచుము.

ధ్యానము: దైవిక సంభాషణ – ప్రధాన యాజకునిగా క్రీస్తు ప్రార్థన

ఈ సువిశేష భాగం యేసుక్రీస్తు  తన భూలోక పరిచర్య ముగింపు దశలో, తన ప్రియ శిష్యుల కోసం పరలోకపు తండ్రి సన్నిధిలో చేసిన అత్యంత పవిత్రమైన, మరియు మహిమాయుక్తమైన ప్రార్థన.  దీనిని "ప్రధాన యాజకుని ప్రార్థన"  అని పిలుస్తారు. పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించి, ప్రజల పాప పరిహారార్థం రక్తాన్ని ప్రోక్షించి ప్రార్థించేవాడు. అయితే ఇక్కడ, నూతన నిబంధన ప్రధాన యాజకుడైన యేసు ప్రభువు, తనను తాను సిలువ యాగంగా అర్పించుకోవడానికి కొన్ని గంటల ముందు, తండ్రి దేవుడు తనకు అప్పగించిన శిష్యుల  కొరకు మధ్యవర్తిగా నిలబడి విజ్ఞాపన చేస్తున్నారు.

యేసు ప్రభువు ప్రార్థన చేసిన ప్రతిసారీ ఆయన ఆకాశము వైపు కన్నులెత్తి ప్రార్థించడం మనం సువిశేషాలలో చూస్తాము. ఇది కేవలం ఒక శారీరక భంగిమ కాదు, ఇది పరలోకపు తండ్రిపై ఉన్న సంపూర్ణ విధేయతకు, దైవిక అధికారానికి మరియు భూమికి పరలోకానికి మధ్య ఉన్న సజీవ సంబంధానికి నిదర్శనం. లాజరును సమాధి నుండి లేపేటప్పుడు కూడా ఆయన ఇలాగే కన్నులెత్తి తండ్రికి కృతజ్ఞతలు చెల్లించారు. ఇప్పుడు తన మరణ గడియ ఆసన్నమైన వేళ, ఆయన హృదయం ఆకాశమనే దేవుని సింహాసనం వైపు చూస్తోంది.

"ఆ గడియ" -  దైవ  ప్రణాళిక సంపూర్ణత

"తండ్రి నా గడియ వచ్చినది" అని క్రీస్తు ప్రభువు  పలుకుతున్నారు. పవిత్ర గ్రంధం  అంతటా "ఆ గడియ" అనే మాట అత్యంత ప్రాధాన్యత కలిగినది. యోహాను సువార్తలో ఈ గడియ గురించిన ప్రస్తావనలు అనేకసార్లు కనిపిస్తాయి. గలిలయలోని కానా అనే ఊరిలో జరిగిన పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు, తల్లి మరియమ్మ ఆయన సహాయాన్ని కోరగా, యేసు "అమ్మా, నాతో నీకేమి పని? నా గడియ ఇంకా రాలేదు" అని సమాధానమిచ్చారు. ఆ తరువాత కూడా ఎరుషలేము దేవాలయంలో ఆయన బోధిస్తున్నప్పుడు, ధర్మ శాస్త్ర బోధకులు, పరిసయ్యులు ఆయనను బంధించాలని చూసినప్పటికీ, "ఆయన గడియ ఇంకనూ రాకపోవుటచే ఎవరును ఆయనను ఏమియు చేయలేకపోయిరి" అని మనం చదువుతాము.

అయితే ఇప్పుడు, యేసు "నా గడియ వచ్చినది" అని స్పష్టంగా ప్రకటిస్తున్నారు. ఏమిటి ఈ గడియ? ఇది లోక రక్షకుడు సిలువపై మరణించవలసిన సమయం. ఇది చీకటి శక్తులపై వెలుగు సాధించే విజయ సమయం. ఇది మానవాళి పాప విముక్తి కోసం దేవుని గొర్రెపిల్లగా ఆయన తన ప్రాణాన్ని ధారబోసే సమయం. మానవ దృష్టిలో సిలువ మరణం అనేది అవమానకరమైనది, శిక్షాత్మకమైనది. కానీ దైవ  దృష్టిలో, క్రీస్తు దృష్టిలో ఆ గడియ తండ్రిని మహిమపరిచే మహోన్నత ఘట్టం. తన మరణం మరియు పునరుత్థానాల ద్వారానే దేవుని ప్రేమ, నీతి లోకానికి వెల్లడికాబోతున్నాయి.

 తండ్రి, కుమారుల ఏకత్వము

ఈ ప్రార్థనలో యేసు ప్రభువు రెండు ముఖ్యమైన విషయాలను వెల్లడి చేస్తున్నారు. మొదటిగా, "నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరుపుము" అని వేడుకుంటున్నారు. ఇక్కడ తండ్రి, కుమారుల మధ్య ఉన్న పరస్పర మహిమను మనం గ్రహించవచ్చు. యేసు ప్రభువు భూమిపై బ్రతికినంత కాలం తన అద్భుతాల ద్వారా, బోధల ద్వారా, నిష్కళంకమైన జీవితం ద్వారా తండ్రి నామాన్ని మహిమపరిచారు. ఇప్పుడు తండ్రి తన కుమారుని మహిమపరచవలసిన సమయం వచ్చింది.

యేసు ప్రభువు అడిగిన విధముగానే, తండ్రి అయిన దేవుడు ఆయనను మహిమపరిచాడు. ఆ మహిమ కేవలం సిలువపైనే కాదు, మూడవ రోజున ఆయనను మరణము  నుండి, సమాధి నుండి సజీవంగా లేపడం ద్వారా (పునరుత్థానం ద్వారా) అత్యున్నతంగా నిరూపించబడింది. ఆ తరువాత ఆయన పరలోకారోహణమై, తండ్రి కుడిప్రక్కన కూర్చుని, లోక ఆరంభమునకు పూర్వము తనకు ఉన్న  మహిమను తిరిగి పొందారు. ఈ పునరుత్థాన మహిమ అనేది యేసు ప్రభువు భూమిపై చేసిన పనులు, చెప్పిన మాటలు, ఆయన దైవత్వం మొత్తం కూడా అక్షరాలా సత్యమని విశ్వానికి చాటిచెప్పిన పరమ సత్యం.

నిత్య జీవము మరియు దైవ  అధికారము

యేసు ప్రభువు రెండవ విషయంగా, తండ్రి తనకు ఇచ్చిన  అధికారాన్ని మరియు నిత్య జీవానికి గల మార్గాన్ని వివరిస్తున్నారు. "నీవు నీ కుమారునకు అప్పగించిన వారందరకు, ఆయన   నిత్య జీవము ప్రసాదించుటకు నీవు ఆయనకు మానవులందరిపై అధికారమును ఒసగితివి" అని చెబుతున్నారు. మానవాళి రక్షణ అంతా  యేసు ప్రభువు తోనే ఉంది. సృష్టిలోని ప్రతి ప్రాణిపై, సమస్త మానవాళిపై యేసుకు సర్వాధికారం ఉంది. ఆ అధికారంతో ఆయన మనకు ఇచ్చే గొప్ప బహుమతి "నిత్య జీవము".

నిత్య జీవము అంటే ఏమిటి? దానికి యేసు ప్రభువు ఇక్కడ అద్భుతమైన నిర్వచనం ఇస్తున్నారు: "ఏకైక సత్య దేవుడవగు నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును వారు తెలిసికొనుటయే నిత్య జీవము." నిత్య జీవము అంటే కేవలం మరణం తర్వాత ఎల్లకాలం జీవించడం మాత్రమే కాదు; అది ఇప్పుడే, ఈ భూమిపైనే ప్రారంభమయ్యే ఒక దైవ  అనుభవం. సృష్టికర్త అయిన దేవుడిని వ్యక్తిగతంగా తెలుసుకోవడం, ఆయన పంపిన రక్షకుడైన యేసుక్రీస్తుతో సజీవమైన సంబంధాన్ని కలిగి ఉండడమే నిజమైన నిత్య జీవం. ఇక్కడ "తెలుసుకోవడం" అంటే కేవలం మేధోపరమైన జ్ఞానం కాదు, ఒకరి హృదయాన్ని మరొకరు పూర్తిగా ఎరిగి ఉండే ఆత్మీయ అనుబంధం.

శిష్యుల పట్ల క్రీస్తుకున్న అనంతమైన ప్రేమ, గొప్ప మనస్సు

ఇక్కడ  మనం యేసు ప్రభువు యొక్క అత్యంత దయామయమైన, విశాలమైన హృదయాన్ని, గొప్ప మనస్సును దర్శిస్తాము. సిలువ మరణానికి వెళ్లే ముందు కూడా ఆయన తన బాధల గురించి ఆలోచించడం లేదు, తన శిష్యుల భవిష్యత్తు గురించి ఆరాటపడుతున్నారు. ఇక్కడ గమనించదగిన అద్భుతమైన విషయమేమిటంటే, యేసు ప్రభువు తన శిష్యులలో ఉన్న బలహీనతలను, వారి పాపాలను, వారి అవిశ్వాసాన్ని తండ్రి దేవుని ఎదుట ప్రస్తావించడం లేదు.

వాస్తవానికి, అదే రాత్రి శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోబోతున్నారు. పేతురు ఆయనను ముమ్మారు ఎరుగనని బొంకబోతున్నాడు. తోమా ఆయన పునరుత్థానాన్ని అనుమానించబోతున్నాడు. వారిలో ఎన్నో లోపాలు ఉన్నాయి, ఆత్మీయ అపరిపక్వత ఉంది. అయినప్పటికీ, క్రీస్తు ఒక ఉత్తమ మధ్యవర్తిగా, ప్రేమగల కాపరిగా వారి తప్పులను తండ్రి ఎదుట దాచిపెడుతున్నారు. వారిని తండ్రి ఎదుట ఎంతో గొప్పవారిగా, యోగ్యులుగా తీర్చిదిద్దుతున్నారు. "నీవు నాకోసగిన సందేశమును వారికి అందజేసితిని, వారు దానిని స్వీకరించి, నేను నీ యొద్ద నుండి వచ్చితినని విశ్వసించిరి" అని వారిలోని విశ్వాసాన్ని, విధేయతను మాత్రమే తండ్రికి వివరిస్తున్నారు. మన పాపాలను కప్పివేసి, మనలోని మంచిని దేవుని సన్నిధికి చేర్చే క్రీస్తు ప్రేమకు ఇది పరాకాష్ట.

దేవుని ప్రత్యక్షత – వారు నీ వారు

యేసు ప్రభువు తన పనుల ద్వారా, తన పవిత్ర జీవితం ద్వారా దేవుడు ఎలాంటివాడో శిష్యులకు పూర్తిగా తెలియజేశారు. పాత నిబంధనలో దేవుడు దూరంగా, భయంకరుడిగా కనిపించగా, యేసుక్రీస్తు ఆయనను "అబ్బా... తండ్రి" అని పిలిచేంత ఆత్మీయుడిగా పరిచయం చేశారు. దేవుని కరుణ, క్షమాపణ, ప్రేమను తన అద్భుతాల ద్వారా, రోగులను స్వస్థపరచడం ద్వారా, పాపులను చేరదీయడం ద్వారా నిరూపించారు.

ఇప్పుడు యేసు తన శిష్యులను "వారు నీ వారు" అని తండ్రికి అప్పగిస్తున్నారు. తనకు తండ్రి వారిని బహుమతిగా ఇచ్చాడని, వారు ఈ లోకానికి చెందినవారు కాదని, పరలోక రాజ్య వారసులని స్పష్టం చేస్తున్నారు. విశ్వాసులైన మనమందరం తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తుకు ఇచ్చిన అమూల్యమైన బహుమతులం. క్రీస్తుకు మనమంటే ఎంత ప్రేమో ఈ మాటల్లో తెలుస్తుంది. తన చేతికి అప్పగించబడిన మందలో నుండి ఒక్క గొర్రెపిల్లను కూడా కోల్పోవడానికి ఆయన సిద్ధంగా లేరు. మనమందరం సురక్షితంగా పరలోక తీరానికి చేరాలన్నదే క్రీస్తు యొక్క నిరంతర అభిలాష, ఆకాంక్ష.

లోకం కొరకు కాక, శిష్యుల కొరకు ప్రత్యేక ప్రార్థన

"నేను వారి కొరకు ప్రార్ధించుచున్నాను. లోకము కొరకుకాక నీవు నాకు అనుగ్రహించిన వారి కొరకు ప్రార్ధించుచున్నాను" అని యేసు స్పష్టంగా చెప్తున్నారు. ఇక్కడ "లోకము" అంటే దేవునికి వ్యతిరేకంగా, పాపంలో జీవించే వ్యవస్థ అని అర్థం. యేసు లోకాన్ని ద్వేషించడం లేదు, ఎందుకంటే లోకాన్ని రక్షించడానికే ఆయన వచ్చారు. కానీ, ఈ నిర్దిష్ట సమయంలో ఆయన హృదయం తనను నమ్ముకున్న చిన్న మంద కొరకు తపిస్తోంది. ఎందుకంటే ఆయన ఇక ఈ లోకంలో శారీరకంగా ఉండరు, కానీ శిష్యులు ఈ లోకంలోనే ఉండాలి. లోకంలోని శోధనలను, హింసలను, సాతాను శక్తులను వారు ఎదుర్కోవాలి.

యేసు ప్రభువు తన శిష్యుల కొరకు ఇంతగా ఎందుకు తపిస్తున్నారు? దానికి కారణం ఆయన కోరుకునే "ఐక్యత". "మన వలె వారును ఒకరుగ ఐక్యమై ఉండునట్లు... వారిని నీ నామమునందు సురక్షితముగా ఉంచుము" అని ప్రార్థిస్తున్నారు. తండ్రి, కుమారుడు, పవిత్రాత్మ ఏ విధంగానైతే ప్రేమలో, సంకల్పంలో ఏకమై ఉన్నారో, విశ్వాసులైన మనమందరం కూడా అలానే ఏక హృదయంతో, ఏక ఆత్మతో ఐక్యమై ఉండాలని క్రీస్తు ఆశడుతున్నారు. విభేదాలు, ద్వేషాలు లేని ఆత్మీయ ఐక్యతే సంఘానికి శ్రీరామరక్ష. ఆ ఐక్యతలోనే దేవుని నామానికి మహిమ కలుగుతుంది. శిష్యులు ఈ లోకంలో ఉన్నంతకాలం దేవుని నామపు శక్తిలోనే, సత్యములోనే సురక్షితంగా ఉంటారని యేసు నమ్ముతున్నారు.

ప్రార్ధన : ప్రభువా ! మీరు తండ్రితో మాకోరకు ప్రార్ధించారు. మీ జీవితం మొత్తం కూడా మీరు మీ గడియ కోసం ఎదురు చూశారు. ఆ గడియ మీ మరణం మరియు పునరుత్థానం. దీని ద్వారా మీరు తండ్రి మీకు ఇచ్చిన భాధ్యతను సంపూర్ణంగా పూర్తి చేస్తున్నారు, మరియు మమ్ములను మీరు రక్షిస్తున్నారు. ఈ గడియ ద్వారా మీ తండ్రి మిమ్ములను మహిమపరుస్తున్నారు. మీరు చేసినది మరియు చెప్పినది మొత్తం నిజము అని మిమ్ములను తండ్రిని తెలుసుకోవడం నిత్య జీవం అని తెలుసుకుంటున్నాము. మేము మీ వాక్కును పొందామని, మీ మాటను పాటించామని, మేము మీరు తండ్రి చేత మీకు ఇవ్వబడ్డామని, మేము తండ్రికి చెందిన వారిమని నీవు తెలియజేస్తున్నావు. మా కోసం ప్రార్ధిచుచున్నావు , మేము మీరు కోరుకుంటున్నట్లు, మీతోనూ తండ్రితోనూ ఐక్యమై జీవించేలా మమ్ము దీవించండి.

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబిల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పవిత్రుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

📲 మా WhatsApp Channel జాయిన్ అవ్వండి!

ప్రతి నిత్య పోస్ట్ మీ WhatsApp కు నేరుగా వస్తుంది

Join WhatsApp Channel

Comments

మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:

Post a Comment

కామెంట్‌లు