మనుష్యులను పట్టు జాలరులుగా: మత్తయి 4:18-22 ధ్యానం | కార్మెల్ శోభ

 మత్తయి 4:18-22

గలిలీయసరస్సు తీరమున యేసు నడచుచు, వలవేసి చేపలనుపట్టు పేతురు అను పేరుగల సీమోనును, అతని సోదరుడగు అంద్రెయను చూచెను. వారు జాలరులు. "మీరు నన్ను అనుసరింపుడు. మిమ్ము మనుష్యులను పట్టువారినిగా చేసెదను"అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను అచట విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అచటినుండి పోవుచు యేసు జెబదాయి కుమారులైన యాకోబు, యోహాను అను మరి ఇద్దరు సోదరులను చూచెను. వారు తమ తండ్రితోపాటు పడవలో తమ వలలను చక్కబెట్టుకొనుచుండిరి. యేసు వారిని పిలువగా, వెంటనే వారు పడవను, తమ తండ్రిని వదలి పెట్టి ఆయనను వెంబడించిరి. 

ధ్యానము :  సీమోను, అంద్రెయ అను సోదరులు మరియు యాకోబు, యోహాను అను మరి ఇద్దరు సోదరుల దైవ పిలుపును ఈ సువిశేష భాగంలో  చూస్తున్నాము. యేసు ప్రభువు వారిని తనను అనుసరించమని అడిగిన వెంటనే, వారు ఏమాత్రం సంకోచించకుండా, మారుమాట్లాడకుండా ఆయనను అనుసరిస్తున్నారు. తమ జీవనాధారమైన వలలను, కన్నతండ్రిని, పడవను కూడా వీరు అక్కడే వదలి పెట్టారు.

 వారు యేసులో ఏమి చూశారు?

అసలు ఎందుకు వారు ఇలా చేస్తున్నారు? మానవ సహజమైన ఆలోచనలకు అతీతంగా, ఒకే ఒక్క పిలుపునకు సర్వస్వాన్ని ఎలా త్యాగం చేయగలిగారు? వారు యేసు ప్రభువులో ఏమి చూసారు? ఎందుకు మారుమాట్లాడకుండా ఆయనను అనుసరిస్తున్నారు?

సాధారణంగా లోకంలో ఎవరైనా ఒక కొత్త వ్యక్తిని వెంబడించాలంటే ఎన్నో ప్రశ్నలు, సందేహాలు, భయాలు ఉంటాయి. కానీ ఇక్కడ, యేసు ప్రభువు ఒక వ్యక్తిని తనను అనుసరించమని అడిగినపుడు ఎవరూ కూడా వెనుకకు పోలేదు. యేసు ప్రభువు మాటలు, ఆయన చూపులు, ఆయన పవిత్ర వ్యక్తిత్వము మనలను సైతం ఆయనను అనుసరించేలా చేస్తాయి. ఆ క్రీస్తు ప్రభువు చూపుల్లో ఒక దివ్యమైన ఆకర్షణ ఉంది; ఆ స్వరములో  పరలోకపు తండ్రి ప్రేమ ప్రతిధ్వనించింది.  నన్ను అనుసరించమని అడిగిన ఆ మహోన్నత వ్యక్తి, సృష్టికర్త అయిన దేవుడే మానవరూపంలో వచ్చి మమ్ములను తనను అనుసరించమని అడిగారని ఆ జాలరులు గ్రహించారు. అందుకే, వారు తమ జీవనోపాధి అయిన వృత్తిని, వలలను, బంధువులను, కన్నతండ్రిని కూడా వదలి ప్రభువును అనుసరిస్తున్నారు. పూర్తిగా వారు యేసు ప్రభువు శిష్యులుగా మారిపోతున్నారు.

సంపూర్ణ ప్రభువును అనుసరించుటకు నిర్ణయం  మరియు దైవ విశ్వాసం

యేసు ప్రభువు శిష్యులుగా మారిపోయిన తరువాత వారి జీవితం ఎలా సాగుతుంది, భవిష్యత్తులో ఎలా బ్రతకాలి, ఏం తినాలి అనే లౌకిక విషయాలను వారు ఎంతమాత్రం ఆలోచించుట లేదు. అంటే ప్రభువు మీద వారికి పూర్తి నమ్మకం, అచంచలమైన విశ్వాసం ఉన్నాయి. ఆయన ఎవరో వారికి అంతరాత్మలో తెలుస్తుంది. ఆయన మాటలు వినగానే వారు ఆయనను ఎందుకు అనుసరిస్తున్నారంటే, ఆయన మాటలలో 'జీవం' ఉన్నదని వారికి తెలుసు. క్రీస్తు పలికే ప్రతి మాట హృదయాలను కడిగివేసే సత్యవాక్కు అని వారు గుర్తించారు.

ఆయన చూపులో వారికి వారి జీవితము మొత్తం కనపడుతుంది. క్రీస్తు వారిని చూసినప్పుడు, కేవలం వారి బాహ్య రూపాన్ని మాత్రమే కాదు, వారి అంతరంగంలోని యథార్థతను, భవిష్యత్తులో వారు చేయబోయే అద్భుతమైన దైవకార్యాలను చూశారు. ఆయన స్పర్శ యొక్క శక్తి వారికి తెలుసు. ఎన్నో సంవత్సరాలుగా నయం కాని రోగం కూడా ఆయన ఒక్క స్పర్శతో, ఒక్క మాటతో తొలగిపోతుందని వారు విన్నారు లేదా అనుభవించారు. ఆ మహోన్నతమైన దైవిక వ్యక్తిత్వం వారికి తెలుసు. లోకమంతా రాళ్లతో కొట్టి చంపాలనుకున్న పాపంలో పట్టుబడిన స్త్రీని క్షమించి, ఆదరించిన గొప్ప మనసు కేవలం ఆ యేసు ప్రభువుకే సొంతం. ఇంతటి శ్రేష్టమైన, కరుణామయుడైన గురువు వారిని అనుసరించమని అడిగిన తరువాత వారిలో ఎటువంటి సందేహం లేదు, మరో లోకపు ఆలోచన లేదు. వారికి ఇది ఒక నూతన ఉదయము, ఒక సుదినం. అందుకే వారు సంతోషంగా ప్రభువును అనుసరించడానికి సిద్ధపడుతున్నారు. ఈ పిలుపు ద్వారా సాధారణ వ్యక్తులు, లోకం దృష్టిలో అల్పులైన వారు, మనుషులను పట్టే ఆధ్యాత్మిక జాలరులుగా మారుతున్నారు.

పేతురు, అంద్రెయల జీవితాల పరివర్తన

యేసు ప్రభువు సీమోను, అంద్రెయను తనను అనుసరించమని అంటున్నారు. వారు కేవలం గలిలీయ సరస్సులో చేపలు పట్టుకునే సామాన్య జాలరులు. ఇక్కడ ఒక లోతైన ఆధ్యాత్మిక సత్యాన్ని గమనించాలి. సీమోను అంటే 'రెల్లుకాడ' అని అర్ధం. గాలికి అటు ఇటు ఊగిసలాడే, స్థిరత్వం లేని ఒక సాదాసీదా రెల్లును యేసు ప్రభువు తన  స్పర్శతో, శిక్షణతో గాలికి గాని, లోక తుపానుకు గాని తొణకని, బెదరని ఒక బలమైన 'రాయిగా' (పేతురుగా) మారుస్తున్నారు. క్రీస్తు సంఘానికి పునాది రాయిగా నిలబెడుతున్నారు.

అంద్రెయ జీవితంలో కూడా ఇదే అద్భుతం జరుగుతుంది. అంద్రెయ అంటే 'పౌరుషము' లేదా 'ధైర్యము' అని అర్ధం. ఈయనలో ఉన్న పౌరుషం లోకపరమైనది కాదు, దైవపరమైనది. ఈయన మొట్టమొదట యేసు ప్రభువును కనుగొని, ఆ రక్షకుడిని తన సోదరుడైన పేతురుకు తెలియపరుస్తున్నారు. క్రీస్తు కొరకు బ్రతకడం, క్రీస్తు కొరకు ప్రాణాలర్పించడం అంద్రెయ జీవిత ధ్యేయంగా మారింది. యేసు ప్రభువును అనుసరిస్తూ ఆయన కొరకు మరణించడానికి సిద్ధపడ్డాడు కానీ, పాపంతో గానీ, లోక అధికారాలతో గానీ సఖ్యత పడుటకు ఎంతమాత్రం ఇష్టపడలేదు. ఫలితంగా, క్రీస్తు ప్రేమ సాక్షిగా ఇతనిని 'X' రూపంలో ఉన్న సిలువపై వేసి అమరవీరుడిని చేశారు. ఆ సిలువపై ఉంటూ కూడా ఆయన క్రీస్తు సువార్తను ప్రకటించారంటే ఆయన దైవభక్తి ఎంత గొప్పదో శ్లాఘించదగినది. ఈ రోజు పునీత అంద్రెయ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్న మనము, ఆయన చూపిన త్యాగనిరతిని ధ్యానిస్తూ, ఆయన మాధ్యస్త ప్రార్థనను భక్తితో కోరుదాం.

సాధారణ జాలరుల నుండి అసాధారణ అపొస్తలులుగా...

ఈ నలుగురు శిష్యులు (పేతురు, అంద్రెయ, యాకోబు, యోహాను) కేవలం జాలరులుగానే అప్పటివరకు వీరు బ్రతుకుతున్నారు. సమాజంలో పెద్దగా గుర్తింపు లేని, చదువురాని పామరులుగా అనేక సంవత్సరాలు బ్రతికారు. కానీ, యేసు ప్రభువు వారిని అనుసరించమని అడిగిన వెంటనే, వారు తమ పాత జీవితాన్ని, వలలను అక్కడే వదలి యేసు ప్రభువును అనుసరిస్తున్నారు. వారిని యేసు ప్రభువు "మిమ్మును మనుషులను పట్టేవానిగా చేస్తాను" అని అభయమిస్తూ చెబుతున్నాడు.

ఇక్కడ మనకు ఒక ప్రశ్న తలెత్తుతుంది: అసలు వీరు మనుషులను పట్టే అంతటి గొప్పవారా? వారికి ఆ అర్హత ఉందా? లోక రీత్యా చూస్తే లేదు. ఎందుకంటే, వారు ఎన్నో సంవత్సరాలు జాలరులుగా పని చేసినప్పటికీ, స్వశక్తితో ఎక్కడ చేపలు పడతాయో కూడా పూర్తిగా వారికి తెలియదు. ఒక్కోసారి రాత్రంతా కష్టపడినా ఒక్క చేప కూడా దొరకని పరిస్థితులు వారి జీవితంలో ఉన్నాయి. అందుకే వారికి యేసు ప్రభువు దైవిక జ్ఞానంతో ఎక్కడ వల వేయాలో, ఎలా వేయాలో చెబుతున్నాడు.

అటువంటి పరిమితులు కలిగిన ఈ సాధారణ జాలరులను, మనుషులను పట్టే విశ్వాస వీరులుగా యేసు ప్రభువు ఎలా చేస్తాడు? వీరు లోకమంతటిని ఆకర్షించి, మనుషులను దేవుని వైపు తిప్పే అంత గొప్పవారు ఎలా అయ్యారు అని మనము నిశితంగా పరిశీలిస్తే, ఒక అద్భుతమైన సత్యం బోధపడుతుంది. ఈ రోజు పరిశుద్ధ కతోలిక తిరుసభ ఇంతగా, ఇంత వైభవంగా లోకమంతటా వ్యాపించింది అంటే, నాాడు క్రీస్తు పిలుపును అందుకున్న ఈ సామాన్య జాలరులే ప్రధాన కారణం.

అన్ని సంవత్సరాలు జాలరులుగా ఉన్నా, సరైన లౌకిక విద్య లేకపోయినా, ఎక్కడ చేపలు ఉంటాయో తెలియని ఈ సాధారణ జాలరులు, క్రీస్తు పునరుత్థానం తర్వాత పరిశుద్ధాత్మ శక్తిని పొంది, ప్రపంచ నలుమూలల దైవ రాజ్యాన్ని, క్రీస్తు సువార్తను వ్యాపింపజేయడానికి వారు చేసిన కృషి, చిందించిన రక్తం ఎంతో గొప్పవి. యేసు ప్రభువు ఆ సామాన్య శిష్యులను ప్రపంచ నలుమూలల తన సజీవ వాక్కును, రక్షణ సందేశాన్ని ధైర్యంగా ప్రకటించగల అసాధారణ వ్యక్తులుగా, రాజుల ఎదుట సైతం నిలబడగల ప్రవక్తలుగా మారుస్తున్నారు.

మన జీవితాలకు ఈ సువిశేషం ఇచ్చే సందేశం

యేసు ప్రభువు ఈ సాధారణ వ్యక్తులను ఇంత గొప్ప వ్యక్తులుగా మారుస్తున్నారు అనే సత్యం మనకు ఎంతో ఆదరణను, నిరీక్షణను ఇస్తుంది. లోకం మనల్ని మన బలహీనతలను బట్టి, మన పేదరికాన్ని బట్టి లేదా మన చదువును బట్టి తక్కువ చేసి చూడవచ్చు. కానీ దేవుని పిలుపు అర్హతలను బట్టి రాదు, అది కేవలం ఆయన కృపపై ఆధారపడి ఉంటుంది. యేసు ప్రభువు మాటలు మనము విని, ఆయనకు లోబడి జీవించినట్లయితే, మనలో లోకము ఆశించే అన్ని గొప్ప లక్షణాలు, సామర్థ్యాలు లేకున్నప్పటికీ, ప్రభువు తన దైవిక శక్తితో మనలను ఉన్నతమైన వారిగా, లోకానికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు అనుటకు ఈ నలుగురు శిష్యుల జీవితం ఒక సజీవమైన ఉదాహరణ. మనల్ని మనం క్రీస్తు చేతుల్లో పెడితే, ఆయన మన జీవితాలను ఒక అద్భుత కావ్యంగా మారుస్తాడు.

ప్రభువుతో సంభషణ మరియు ప్రార్ధన  : ప్రభువా మీరు ఎంత గొప్పవారు, చాలా సాధారణ వ్యక్తులను , ఉన్నత వ్యక్తులుగా లోకాన్ని జయించే వారీగా చేస్తున్నారు. ఈ నలుగురు వ్యక్తులను పిలిచినట్లు నన్ను కూడా పిలవండి. వారు ఎలాగైతే మీ మాటకు మారుమాట్లాడకుండా, సర్వమును వదలి మిమ్ములను అనుసరిస్తున్నారో, నన్ను కూడా అలానే మిమ్ములను అనుసరించేలా చేయండి. ప్రభువా ! ఈ శిష్యులు మీములను అనుసరించడానికి తమ వారిని , వారికు ఉన్నదానిని, మొత్తాన్ని వదులు కోవడానికి సిద్ధపడ్డారు. కాని మిమ్ములను అనుసరించడానికి నేను ఈ శిష్యుల వలె ఏమి వదులుకోలేదు. నాకు ఉన్న ఈ లోక ఆశలు, కోరికలు, సంపదలు ఇవి అన్ని కూడా ఆటంకంగా ఉన్నవి. వీటిని వదులు కోవడానికి చాలా పర్యాయాలు నేను ప్రయత్నించినప్పటికీ సఫలీకృతం కాలేక పోయాను. ప్రభువా ! నాకు పూర్తిగా మిమ్ములను అనుసరించాలి అనే కోరిక  ఉన్నది, కాని నాలో ఉన్న ఇతర కోరికలు నన్ను మిమ్ములను అనుసరించుటకు సన్నద్ధం కానివ్వటం లేదు. వీటి మీద నేను విజయం సాధించేలా నాకు మీ అనుగ్రహాలు మీ పునీతులకు ఇచ్చినట్లు ఇవ్వండి తద్వారాఅప్పుడైన  నేను మిమ్ము పూర్తిగా అనుసరించగలేనేమో. ప్రభువా మీరు ఈ శిష్యులను పిలిచినట్లు నన్ను కూడా ఒకసారి పిలవండి. నన్నును మీ సేవకునిగా, అనుచరునిగా చేయండి. ప్రభువా! మీ శిష్యులు వారికి జీవనోఫాది పోయిన , బంధువర్గాలు పోయిన మీరు మాత్రమే చాలు అనుకున్నారు. నేను కూడా ఆలా జీవించేలా చేయండి. ఆమెన్ 

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబిల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పవిత్రుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

📲 మా WhatsApp Channel జాయిన్ అవ్వండి!

ప్రతి నిత్య పోస్ట్ మీ WhatsApp కు నేరుగా వస్తుంది

Join WhatsApp Channel

Comments

మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:

Post a Comment

కామెంట్‌లు