పంట మిక్కుటము కోతగాండ్రు తక్కువ: మత్తయి 9:35-10:8 ధ్యానం | కార్మెల్ శోభ
మత్తయి 9:35-10:1,6-8
నిన్ననే మనం నిష్కలంక మాత పండుగను జరుపుకున్నాం. ఈ పండుగ సందర్భంగా ఈ లోకానికి దేవుడు చెప్పిన మొదటి సువార్తను గురించి ధ్యానిస్తుంటాము. ఏమిటి ఈ మొదటి సువార్త అంటే స్త్రీ కి పుట్టబోయే మెస్సీయా. ఈ మెస్సీయ్యా ద్వారా మనం రక్షించబడుతాము. యేసు ప్రభువు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆయన ప్రకటించేది ఆయన గురించే. ఆయన గురించి ఆయన చెప్పే మాటలు వట్టి మాటలు కాదు, ఎందుకంటే ఆయన ద్వారా అందరు స్వస్థత పొందుతున్నారు. ఇక్కడ యేసు ప్రభువు పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటిస్తున్నారు. ఏమిటి ఈ పరలోక రాజ్యమును గురించిన సువార్త అంటే? అప్పటివరకు యిస్రాయేలు ప్రజలు మెస్సీయాను గురించి ఎదురుచూస్తున్నారు, ఇప్పుడు మెస్సీయా వారి దగ్గరకు వస్తున్నారు. యేసు ప్రభువు చేస్తున్న స్వస్థతలు, ఆయనే మెస్సీయా అని నిరూపిస్తున్నవి. అవి ఆయన మెస్సీయ్యా అనుటకు గుర్తుగా ఉన్నాయి.
1. క్రీస్తు ప్రేమ - శిష్యత్వపు పిలుపు
యేసు ప్రభువుకు, ఆయన పనిలో పాలుపంచుకొనే వారు కావలి. ఆయనను అనుసరిస్తూ ఆయన వలె జీవించేవారు కావలి. వారు ప్రజల బాధలను చూసి, యేసు ప్రభువు ఎలా స్పందిచారో అలానే స్పందించే మనస్సు కలిగిన వారు అయిఉండాలి. ఇది కేవలం యేసు ప్రభువు శిష్యులు మాత్రమే కాదు, ఆయన అనుచరులు అందరు చేయవలసిన పని. ఎవరు అయితే ప్రభువుచేత అనుగ్రహాలు పొందుతున్నారో, స్వస్థతలు పొందుతున్నారో, వారు ఇతరులకు యేసు ప్రభువు చూపించిన ప్రేమను చూపించాలి. మనము ప్రభువు నుండి పొందిన దానికి ఇతరులతో పంచుకోవడానికి వెనుకడుగువేయకూడదు.
యేసు క్రీస్తును అనుసరించడం అంటే కేవలం ఒక మతాన్ని స్వీకరించడం లేదా కొన్ని ఆచారాలను పాటించడం కాదు; అది ఒక నూతన జీవన విధానం. యేసు తన పరిచర్యలో కేవలం మాటలకే పరిమితం కాలేదు. ఆయన హృదయం ప్రజల వేదనలను చూసి చలించింది. నిజమైన శిష్యునికి ఉండవలసిన మొదటి లక్షణం, క్రీస్తు వంటి హృదయాన్ని కలిగి ఉండటం. యేసు కన్నులతో లోకాన్ని చూడటం, ఆయన చెవులతో ఇతరుల రోదనలను వినడం, ఆయన హృదయంతో ఇతరుల పట్ల జాలి పడటం శిష్యత్వానికి మూలస్తంభాలు.
మనం దేవుని నుండి పొందుతున్న ఆశీర్వాదాలు, స్వస్థతలు, పాపక్షమాపణ, శాంతి అన్నీ ఉచితంగా లభించిన కృపలే. దేవుడు మనకు ఇచ్చిన జ్ఞానాన్ని, సంపదను, ఆధ్యాత్మిక వరాలను మన స్వార్థం కోసమే దాచుకుంటే, ఆ కృప నిరర్థకమవుతుంది. "మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగానే ఒసగుడు" అని ప్రభువు చెప్పిన మాటలు ప్రతి విశ్వాసి బాధ్యతను గుర్తుచేస్తున్నాయి. లోకంలో ఎంతోమంది ఆదరణ లేక, ప్రేమ కరువై, నిరాశలో బ్రతుకుతున్నారు. వారికి క్రీస్తు ప్రేమను పంచడం, వారి కన్నీళ్లను తుడవడం మనందరి కర్తవ్యం. ఒక కొవ్వొత్తి మరో కొవ్వొత్తిని వెలిగించినట్లు, మనం పొందిన వెలుగును ఇతరులకు పంచినప్పుడే క్రీస్తు సువార్త సజీవంగా సమాజంలో సాక్ష్యమిస్తుంది.
2. కాపరి లేని మంద - కరుణామయుని హృదయం
ప్రజలను చూచినప్పుడు యేసు ప్రభువు చాలా బాధ పడ్డారు. ఆ కారుణమయుని కడుపు తరుక్కు పోయింది అని చదువుతున్నాము. ప్రజలకు సరైన కాపరులు లేరు అని ప్రభువు చెబుతున్నారు. అందుకే ప్రభువు తన శిష్యులను ఎలా బ్రతకాలో చెబుతున్నారు. ఎలా కాపరులుగా ఉండాలో నేర్పుతున్నారు. ఏహెజ్కెలు ప్రవక్త కూడా యిస్రాయేలు ప్రజలు కాపరి లేని వారి వలె ఉన్నారు అని చెబుతున్నారు. యేసు ప్రభువు కేవలం కాపరిగా మాత్రమే రాలేదు. ప్రభువు మంచి కాపరి. ప్రభువే "నేను నా మంద కోసం నా ప్రాణామును కూడా ధారపోయుదును" అని చెబుతున్నారు. ఆయన ఎటువంటి కాపరి అనేది మనం ఈ సువిశేష భాగంలో చూస్తున్నాము. ప్రభువు కేవలం వారి అనారోగ్యాన్ని మాత్రమే చూడటం లేదు. వారి సమస్యలను చూసి, ప్రభుని కడుపు తరుక్కు పోయింది. అంటే ప్రభువు ప్రజల అన్ని సమస్యలను చూస్తున్నారు. వారి వ్యక్తిత్వాలు, వారి సంబంధాలు, వారి సమస్యలు అన్నింటినీ ప్రభువు చూస్తున్నారు. వాటి ద్వారా వారు పొందే అనేక బాధల నుండి వారిని కాపాడాలని ప్రభువు కోరిక. ఒక మంచి కాపరి మాత్రమే వారిని ఈ సమస్యల నుండి బయటకు తీసుకురాగలరు. ఆ కాపరి ప్రభువు వలె ఉండాలి. ప్రభువు వలె చూడాలి. ప్రభువు వలె వినాలి. ప్రభువు వలె వారి జీవితాలలో పాలుపంచుకోవాలి.
"కడుపు తరుక్కుపోయింది" అనే పదబంధం యేసు హృదయంలో కలిగిన అత్యంత గాఢమైన వేదనను, కరుణను సూచిస్తుంది. గ్రీకు మూల గ్రంథంలో దీనిని 'స్ప్లాంఖ్నిజోమై' (Splagchnizomai) అంటారు, అంటే అంతరింద్రియాల నుండి ఉబికివచ్చే అమితమైన జాలి అని అర్థం. అప్పటి సమాజంలో ధార్మిక నాయకులు, పరిసయ్యులు ప్రజలను కేవలం నియమ నిబంధనలతో హింసించేవారే కానీ, వారి ఆత్మీయ ఆకలిని, మానసిక అలసటను గుర్తించలేదు. అందుకే ప్రజలు దిక్కుతోచని స్థితిలో, శత్రువుల చేతిలో చిక్కుకున్న గొర్రెల వలె చెదరిపోయి ఉన్నారు. పాత నిబంధనలో ఏహెజ్కెలు ప్రవక్త ద్వారా దేవుడు అప్పటి స్వార్థపర కాపరులను గద్దించడం మనం చూస్తాము (ఏహెజ్కెలు 34). ఆ ప్రవచన నెరవేర్పుగా యేసు 'మంచి కాపరి'గా ఈ లోకానికి వచ్చారు.
యేసు మనల్ని పైపైన చూసే దేవుడు కాదు. ఆయన మన అంతరంగాన్ని శోధిస్తాడు. మనుషులు మన బాహ్య రూపాన్ని, మన విజయాలను మాత్రమే చూస్తారు, కానీ యేసు మన ఒంటరితనాన్ని, మన గుప్త వేదనలను, విచ్ఛిన్నమైన మన కుటుంబ సంబంధాలను, ఆర్థిక ఇబ్బందులను, పాపపు భారంతో మనం పడే ఘర్షణలను కూడా చూస్తారు. ఆయన మన బాధను దూరం నుండి చూసి జాలిపడేవాడు కాదు, మన బాధలో పాలుపంచుకునేవాడు. లాజరు మరణించినప్పుడు కన్నీరు కార్చిన ప్రభువు, నాయిన్ ఊరి విధవరాలి కొడుకు చనిపోయినప్పుడు కరిగిపోయిన ప్రభువు, నేడు మన జీవితాల్లోని ప్రతి రోదనను ఆలకిస్తున్నారు. ఒక మంచి కాపరి తన గొర్రెలను పేరు పేరునా పిలుస్తాడు, వాటి గాయాలకు తైలం పూస్తాడు. యేసు నేడు మన సమాజంలో అటువంటి మంచి కాపరులను తయారుచేయాలని ఆశిస్తున్నారు. కేవలం అధికార హోదా కోసం కాకుండా, ఆత్మల రక్షణ కోసం ప్రాణ పెట్టే త్యాగ నిరతి గల కాపరులు నేటి లోకానికి ఎంతో అవసరం.
3. మిక్కుటమైన పంట - కోతగాండ్ర కొరకు ప్రార్థన
ప్రభువు చెప్పినట్లుగా నడుచుకోవడానికి అనేక మంది సిద్దముగా ఉన్నారు. కాని వారికి ప్రభువు మాటలను ఎవరు చెబుతారు. ఎవరు ప్రజలను తన సొంత వారినిగా చూస్తారు. ప్రభువు వలే ఎవరు తన మందను కాపాడుతారు. అందుకే యేసు ప్రభువు కోతగాండ్ర కోసం పార్థన చేయమని అడుగుతున్నారు. దేవున్ని, కోతగాండ్రును పంపించమని ప్రార్ధించమంటున్నారు. అంటే కోతగాండ్ర పని యేసు ప్రభువు వలె ఉండటం. ఇది ఈ లోకంలో ప్రతి కైస్తవుని పని. అప్పుడె లోకం నిజమైన కాపరులు కలిగి ఉంటుంది. అందుకె యేసు ప్రభువు తన శిష్యులను పిలుస్తున్నారు. వారికి అన్ని అధికారాలు ప్రభువు ఇస్తున్నారు. వారు చేయవల్సిన అన్ని పనుల గురించి ప్రభువు వారికి చెబుతున్నారు. వారికి ప్రజలను, అన్ని రకాలైన సమస్యలనుండి కాపాడే శక్తి ఇస్తున్నారు.
యేసు ఈ లోకాన్ని ఒక పెద్ద పంట పొలంతో పోల్చారు. పంట సిద్ధంగా ఉంది, గింజలు రాలిపోతున్నాయి, కానీ ఆ పంటను సకాలంలో సేకరించి యజమానుని ఇంట చేర్చడానికి పనివారు లేరు. ఇక్కడ 'పంట' అనగా దేవుని వాక్యం కోసం, రక్షణ కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఆత్మల సమూహం. ఎంతోమంది హృదయాలు దేవుని వైపు తిరగడానికి సిద్ధంగా ఉన్నాయి, కానీ వారికి మార్గం చూపించే నడిపింపు కరువైంది. ఈ కొరతను తీర్చడానికి యేసు చెప్పిన ఏకైక పరిష్కారం—ప్రార్థన. "పంట యజమానునికి మనవి చేయుడు." పరిచర్య అనేది మనుషుల ప్రణాళికల ద్వారా గాక, కేవలం మోకాళ్ల ప్రార్థన ద్వారా, దైవిక పిలుపు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.క్రీస్తు తన శిష్యులను పిలిచి, వారిని ఖాళీ చేతులతో పంపలేదు. ఆయన వారికి తన దైవిక అధికారాన్ని మరియు శక్తిని అనుగ్రహించాడు. దుష్టాత్మలను పారద్రోలడానికి, వ్యాధులను నయం చేయడానికి ఇచ్చిన ఈ అధికారం, క్రీస్తు పరిచర్య భూమిపై కొనసాగడానికి సాక్ష్యంగా నిలిచింది. ఈనాడు ప్రతి క్రైస్తవుడు ఒక 'కోతగాడు'. మన ఇరుగుపొరుగున, మన కార్యాలయాల్లో, మన కుటుంబాల్లో దేవుని ప్రేమను ప్రకటించే బాధ్యత మనపై ఉంది. యేసు ఇచ్చిన అధికారం కేవలం అద్భుతాలు చేయడానికి మాత్రమే కాదు, లోకంలో ప్రేమను, నీతిని, సమాధానాన్ని స్థాపించడానికి. మనం ప్రార్థనలో కనిపెట్టినప్పుడు, దేవుడు మనల్ని కూడా తన కోత పనిలోకి వాడుకుంటారు, ఆత్మల పంటను పరలోక రాజ్యానికి సమకూర్చే భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తారు.
ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్దన : ప్రభువా! మీరు మా పరలోక రాజ్యమని మేము తెలుసుకున్నాము. మీరు ప్రజలకు సువార్తను ప్రకటిస్తూ, వారి వ్యాధులను, తీసివేస్తూ, స్వస్థతనుఇవ్వడం వలన మీరు మెస్సీయ్యా అని మేము గుర్తిస్తున్నాము. ప్రభువా! ప్రజల బాధలు తట్టుకోలేక మీ కడుపు తరుక్కుపోయింది, ప్రభువా , ఆ ప్రజలను చూసినట్లు మమ్ములను కూడా ఒకసారి చూడండి. మాలో ఉన్న అన్ని సమస్యలను తొలగించండి. ప్రభువా మీ మాటలను పాటించుచు ఎల్లప్పుడు, మీమ్ము అనుసరించే అనుగ్రహం దయచేయండి. ప్రభువా! మీ అనుచరునిగా, మీ వలె జీవిస్తూ , ఉండుటకు సిద్దంగా ఉన్న మమ్ము , మీ శిష్యుల పంపినట్లుగా మీ సందేశాన్ని ఇస్తూ, ప్రజల అవసరాలలో బాధలలో పాలుపంచుకొంటూ, ఎప్పుడు ప్రజలను మీ వైపు తీసుకువచ్చే కాపరులుగా మమ్ము మలచండి. ప్రభువా! ప్రజల సమస్యలు మీ సొంతవి అన్నట్లు మీరు భావించారు అందుకే , మీ కడుపు తరుక్కు పోయింది, తండ్రిని కాపరుల కోసం ప్రార్ధించమని చెబుతున్నారు. ఇతరుల పట్ల , మీరు కనపరచిన మనస్తత్వం, మాకు దయచేయండి. ఆమెన్.
Comments
మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:
Post a Comment