పసిబిడ్డలకు దైవజ్ఞానము: లూకా 10:21-24 ధ్యానం | కార్మెల్ శోభ

  లూకా 10:21-24

ఆ గడియలోనే యేసు పవిత్రాత్మ యందు ఆనందించి, "ఓ తండ్రీ! పరలోక భూలోకములకు అధిపతీ! ఈ విషయములను నీవు జ్ఞానులకును, వివేకులకును మరుగుపరచి, పసిబిడ్డలకు వీనిని తెలియపరచినందులకు  నీకు ధన్యవాదములు. అవును తండ్రీ! ఇది నీ అనుగ్రహపూర్వక సంకల్పము. నా తండ్రి  నాకు సమస్తము అప్పగించియున్నాడు. తండ్రి తప్ప మరెవ్వరును కుమారుని ఎరుగరు. కుమారుడు తప్ప మారెవ్వరును   తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికీ ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు" అనెను. అపుడు యేసు శిష్యులవైపు తిరిగి వారిని మాత్రమే ఉద్దేశించి: "మీరు చూచెడి ఈ సంఘటనలను చూడగలిగిన నేత్రములు ఎంత ధన్యమైనవి! ప్రవక్తలు, రాజులు అనేకులు మీరు చూచుచున్నవి చూడగోరిరి. కాని చూడలేకపోయిరి. మీరు వినుచున్నవినగొరిరి, కాని  వినజాలకపోయిరి" అని పలికెను.  


దైవిక కృతజ్ఞత: హృదయపూర్వక ఆనందం

యేసు ప్రభువు ఈ సువిశేష భాగంలో తండ్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. సాధారణంగా మనం లోకంలో విజయాలు సాధించినప్పుడు లేదా అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు సంతోషిస్తాం. కానీ, ఇక్కడ యేసు ప్రభువు కృతజ్ఞతలు తెలియజేయడానికి గల కారణం లోకసంబంధమైనది కాదు, అది సంపూర్ణంగా ఆధ్యాత్మికమైనది. దైవ రాజ్యం యొక్క మర్మములు, పరలోకపు నిగూఢ సత్యాలు కేవలం లౌకిక తెలివిగలవారికో, లోకజ్ఞానులకో, శాస్త్ర పండితులకో మాత్రమే పరిమితం కాకుండా, చిన్న పిల్లల వంటి నిష్కల్మష హృదయం గలవారికి, సమాజంలో సాధారణ ప్రజలుగా జీవిస్తున్న వారికి దేవుడు బయలుపరుస్తున్నాడు.

అందుకు తండ్రికి, ప్రభువు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ విషయం రక్షణ చరిత్రలో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆనాటి యూదయా మత నాయకులు (పరిసయ్యులు, శాస్త్రులు) కాని, ఈ లోకంలోని అహంకారులైన ఆధ్యాత్మిక వేత్తలు కాని దేవుడు కేవలం తమ సొత్తు అన్నట్లు, పరలోక తాళపు చెవులు తమ వద్దే ఉన్నట్లు మాట్లాడటం సర్వసాధారణం. వారు ధర్మశాస్త్ర జ్ఞానాన్ని సామాన్యులకు భారంలా మార్చారు. కానీ యేసు ప్రభువు, దేవున్ని, దైవ జ్ఞానాన్ని ఏ అడ్డుగోడలు లేకుండా సాధారణ మనుషులకు, పామరులకు అందుబాటులోకి తెస్తున్నారు. అందుకె యేసు ప్రభువు దైవ జ్ఞానాన్ని అందరికి పంచి, దేవుని దృష్టిలో ఏ ఒక్కరూ తక్కువ కాదు అని, ప్రతి వ్యక్తి ముఖ్యమే అని స్పష్టం చేస్తున్నాడు.

వినయం కలిగిన హృదయాలకు దైవ ప్రత్యక్షత

ఈ అద్భుతమైన సత్యం కేవలం యేసు పరిచర్యలోనే కాదు, ఆయన పుట్టుకలో కూడా మనం స్పష్టంగా చూడవచ్చు. లోక రక్షకుని జనన మర్మాన్ని దేవుడు మొదటగా ఎవరికి వెల్లడించాడు? సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్న రాజులకో, యాజకులకో కాదు. యేసు ప్రభువుని జననం మొదటిగా తెలుసుకున్నది గొర్రెల కాపరులు. ఎవరు ఈ గొర్రెల కాపరులు అంటే... వీరు ఒక ప్రదేశం నుండి మరియొక ప్రదేశంకు గొర్రెలను మేపుకుంటూ, ఎండనక, వాననక రేయింబగళ్లు పొలాలలోనే తిరుగుతూ ఉండే అట్టడుగు వర్గానికి చెందిన ప్రజలు. సహజంగా వీరు ఊరికి చివర పొలాల్లో ఉండేవారు.

ఆనాటి యూదా సమాజంలో వీరి సాక్ష్యానికి చట్టపరమైన విలువ కూడా ఉండేది కాదు. సమాజం వీరిని దొంగలుగా, అపవిత్రులుగా భావించి ఎటువంటి శుభకార్యములకు, సామాజిక ఉత్సవాలకు వీరిని పిలిచేవారు కాదు. ఇటువంటి అణచబడిన, తృణీకరించబడిన వారికి రక్షకుని జనన విషయము, పరలోక సైన్య సమూహాల స్తుతి గానాల మధ్య మొదటిగా తెలియయజేయడం జరిగినది. దేవుని దయ ఏ అర్హతలను బట్టి రాదు, కేవలం ఆయన ఉచిత కృప ద్వారానే వస్తుందని చెప్పడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం.

సామాన్యుల ఎంపిక: శిష్యుల పిలుపు

యేసు ప్రభువు కేవలం తన జననంలోనే కాదు, తన పరిచర్య అంతటా ఇదే సూత్రాన్ని అవలంబించారు. ఆయన ఎన్నుకున్న శిష్యులు కూడా ఎవరూ గొప్ప పండితులు కాదు. వారు సమాజంలో ఉన్నత విద్యనభ్యసించిన రబ్బీలు కారు, శాస్త్రకోవిదులు కారు. వారు చాలా సాధారణ వ్యక్తులు. కొందరు దైనందిన జీవనం కోసం సముద్రంలో వేటాడే జాలరులు (పేతురు, అంద్రెయ, యాకోబు, యోహాను), మరికొందరు సమాజం చేత దేశద్రోహులుగా, పాపులుగా ముద్రవేయబడిన సుంకరులు (మత్తయి).

ఇటువంటి సాధారణ, బలహీనమైన వ్యక్తులను యేసు ప్రభువు తన శిష్యులుగా ఎన్నుకుంటున్నారు. లోకం ఎవరినైతే పనికిరాని వారని తృణీకరిస్తుందో, దేవుడు వారిని తన మహిమ కొరకు వాడుకుంటాడు. ప్రభువుతో కలిసి జీవించే, ఆయనతో నడిచే, ఆయన బోధలను నేరుగా వినే అమూల్యమైన అవకాశం ఇటువంటి సాధారణ వ్యక్తులకు ఇవ్వడము, దైవ జ్ఞానాన్ని పామరులకు ఉచితంగా అనుగ్రహించడం... ఇవన్నీ కూడా మనకు, మానవాళికి ఇవ్వబడ్డ గొప్ప దైవిక వరాలే. కాబట్టి, దేవుని అనుగ్రహాన్ని, రక్షణ భాగ్యాన్ని పొందడానికి లోకసంబంధమైన డిగ్రీలు, పాండిత్యం అవసరం లేదు. ఎవరు కూడా ఇది కేవలం పండితులు మాత్రమే పొందుతారు అని అనుకొనవసరం లేదు. విరిగి నలిగిన హృదయమే దేవునికి కావలసిన యజ్ఞం.

గర్వాన్ని విడనాడటం: పరిసయ్యత్వానికి హెచ్చరిక

యేసు ప్రభువు తండ్రి గురించి, ఆయన చిత్తాన్ని గురించి ఇంత స్పష్టంగా తెలియపరచిన తరువాత మనం ఎవరుకూడా పరిసయ్యుల వలె జీవించకూడదు. దైవ జ్ఞానం, లేక దైవ రాజ్యం, ఆధ్యాత్మిక జ్ఞానం కేవలం మనకు మాత్రమే ఉంటుంది, మన సాంప్రదాయాలు లేదా మన పద్ధతులే సరైనవి, ఇతరులు దానిని పొందలేరు అనే గర్వం, అజ్ఞానం మనలో అస్సలు ఉండకూడదు అని తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక అహంకారం అనేది మనిషిని దేవునికి దూరం చేస్తుంది. తాము జ్ఞానులమని చెప్పుకుంటూ, ఇతరులను పాపులుగా ముద్రవేసే పరిసయ్యుల కళ్ళు క్రీస్తును గుర్తించలేకపోయాయి.

కానీ, యేసు ప్రభువుతో కలిసి జీవించే గొప్ప అనుభూతిని, పరలోక భాగ్యాన్ని శిష్యులకు, పసిబిడ్డల వంటి అమాయక హృదయం గల సామాన్యులకు ప్రభువు ఇస్తున్నారు. ఇక్కడ యేసు ప్రభువు ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నాడు. అది ఇవి అన్ని సాధారణ ప్రజలకు తెలియజేయడం, దైవ మర్మాలను పామరుల హృదయాలలో ముద్రించడం "తండ్రి సంకల్పం" అని ప్రభువు తెలియజేస్తున్నాడు. ఇది కేవలం ఏదో యాదృచ్ఛికంగా జరిగింది కాదు; ఇది సృష్టికర్త అయిన తండ్రి యొక్క నిత్య సంకల్పం. ఇది తండ్రి సంకల్పం అయితే, తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అని అర్ధమవుతుంది. మన బలహీనతలను, కొరతలను చూసి ఆయన మనల్ని త్రోసివేయక, తన ప్రేమతో మనల్ని ఆకర్షించుకుంటున్నాడు.

కుమారుని సార్వభౌమాధికారం మరియు తండ్రి-కుమారుల అనుబంధం

"నా తండ్రి నాకు సమస్తము అప్పగించి యున్నాడు" అని ప్రభువు సగర్వంగా, దైవిక అధికారంతో తెలియజేస్తున్నాడు. ఈ మాట మరియొక చోట కూడా ప్రభువు చెబుతున్నారు (మత్తయి 28:18 - "పరలోకమందును భూమిమీదను నాకు సమస్తాధికారము ఇవ్వబడియున్నది"). తండ్రి సమస్తం ఆయన కోసమే చేశాడు, ఆయనకే సమస్తాన్ని అప్పగించి యున్నాడు. సృష్టి, పరిపాలన, తీర్పు మరియు రక్షణ... ఇలా సమస్తము మీద ప్రభువుకే సంపూర్ణ అధికారము కలదు. ఇక్కడ మనం నిశితంగా గమనించి తెలుసుకోవలసిన మర్మయుక్తమైన విషయం ఏమిటి అంటే, కుమారుడికి మాత్రమే తండ్రి తెలుసు మరియు తండ్రికి మాత్రమే కుమారుడు తెలుసు. ఇది కేవలం సమాచారం లాంటి జ్ఞానం కాదు, ఇది తండ్రి-కుమారుల మధ్య ఉన్న నిత్యమైన, ప్రేమాస్పదమైన, ఏకత్వ అనుబంధం.

తండ్రి గురించి, దేవుని స్వరూపం గురించి పాత నిబంధన కాలంలో మనకు అనేక మంది ప్రవక్తలు చెప్పారు, ధర్మశాస్త్రం ద్వారా వివరించారు. కాని వాస్తవంగా ఈ లోకంలో ఎవరికి పూర్తిగా తెలియదు, ఎందుకంటే ఎవరూ దేవునిని ముఖాముఖిగా పూర్తిగా చూడలేదు. అనేక మంది తండ్రి గురించి చెప్పారు; వారిలో గొప్ప ప్రవక్తలు ఉన్నారు, మోషే వంటి నాయకులు ఉన్నారు, దావీదు వంటి రాజులు ఉన్నారు. కాని ఎవరు కూడా తండ్రి యొక్క హృదయాన్ని పూర్తిగా ఎరుకపరుచలేదు, ఎందుకంటే వారంతా మనుషులే. కానీ యేసు ప్రభువు మాత్రమే తండ్రిని, ఆయన యొక్క అపరిమితమైన ప్రేమను, కరుణను, వాత్సల్యాన్ని మానవాళికి సంపూర్ణంగా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఆయన తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడు.

సార్వత్రిక రక్షణ: భేదాలు లేని దైవప్రేమ

యేసు ప్రభువు తండ్రిని కొద్దిమందికే పరిమితం చేయకుండా అందరికీ తెలియజేస్తున్నాడు. లోక మత పెద్దలు, సమాజంలోని ఉన్నత వర్గాల వలె కేవలం కొద్ది మందికి మాత్రమే దైవజ్ఞానం సొంతం అని కొంతమందిని వేరుచేయడం లేదు. వర్ణ, వర్గ, లింగ బేధాలు లేకుండా అందరినీ ఆహ్వానిస్తున్నాడు. యేసు ప్రభువు తన శిష్యులకు వారు అనుభవిస్తున్న ఆత్మీయ ఆనందాన్ని, వారు పొందుతున్న గొప్ప భాగ్యం గురించి గుర్తుచేస్తూ తెలియజేస్తున్నాడు.

అది ఏమిటి అంటే... పాత నిబంధన కాలంలో జీవించిన ఎందరో ప్రవక్తలు, దావీదు, సొలొమోను వంటి రాజులు, అనేక గొప్ప భక్తులు మెస్సీయ రోజులను చూడాలి అని, క్రీస్తును చూడాలి అని, ఆయన నోటి మాటలు వినాలి అని ఎంతో ఆశగా ఎదురుచూశారు, అనుకున్నారు. కాని వారి కాలంలో అది సాధ్యపడలేదు. కానీ సామాన్యులైన శిష్యులకు మాత్రమే ఈ క్రీస్తు దైవదర్శన భాగ్యం ఇవ్వబడింది. వారు దేవుని అవతారాన్ని కళ్లారా చూస్తున్నారు, ఆయన చేతులతో తాకుతున్నారు, ఆయన బోధలు వింటున్నారు. ఇది ఎంతటి అమూల్యమైన ధన్యత!

అదేవిధంగా తండ్రికి మాత్రమే కుమారుడు తెలుసు అందుకే తండ్రి, యేసు ప్రభువును గురించి సాక్ష్యమిస్తూ, యొర్దాను నది ఒడ్డున మరియు రూపాంతర కొండ మీద "ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన గురించి నేను సంతసించుచున్నాను" అని పరలోకము నుండి స్వరాన్ని వినిపించి తెలియజేస్తున్నాడు. అంతేకాక "ఈయన చెప్పినట్లు చేయుడు" అని లోకానికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఆదే విధంగా కుమారుని భూలోక జననం గురించి కూడా తండ్రి మౌనంగా ఉండక, తన పరలోక దేవదూతల ద్వారా గొర్రెల కాపరులకు, తూర్పు దేశపు జ్ఞానులకు నక్షత్రం ద్వారా తెలియజేస్తున్నాడు. దేవుడు తన కుమారుడిని మహిమపరిచాడు, కుమారుడు తండ్రిని మహిమపరిచాడు. ఈ దైవిక జ్ఞానం ఇప్పుడు మనకు కూడా వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా అందుబాటులోకి రావడం మన జీవితాల్లో అతి పెద్ద ధన్యత.

ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన : ప్రభువా! మీరు దైవ జ్ఞానాన్ని సాధారణమైన వ్యక్తులకు తెలియజేయటను మీరు ఎంతగానో ఆనందించారు. మీరు ఈవిషయమై  పవిత్రాత్మ యందు కూడా ఆనందిస్తున్నారు. మాకు దైవ జ్ఞానాన్ని  ఇచ్చి , మా మీద ఉన్న ప్రేమతో తండ్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభువా! మీరు తండ్రిని మాకు అందరికీ తెలియపరుస్తున్నారు. ప్రభువా ఎవరికి తెలియని విషయాలు ,గొప్ప వారు అందరు తెలుసుకోవాలనుకున్న విషయాలు మాకు తెలియ పరస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. తండ్రి గురించి మాకు తెలియజేయడం తండ్రి అభీష్టం అని తెలియజేస్తున్నారు,  అందుకు కృతజ్ఞతలు. ప్రభువా ,మీ అనుచరులుగా ఉన్న మేము, ఎప్పుడు కూడా  మీ గురించి మాకే తెలుసు ఇతరులకు తెలియదు, తెలియకూడదు అనే గర్వం మాలో ఉండకుండా మమ్ములను శుద్దిచెయ్యండి. ప్రభువా! అందరికీ దైవ జ్ఞానం ఉండాలనే కోరిక మీ వలె మేము కూడా ఉండేలా చేయండి. ప్రభువా ఎల్లప్పుడు మేము మీతో ఉండే భాగ్యం దయచేయండి. ఆమెన్ 

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబిల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పవిత్రుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

📲 మా WhatsApp Channel జాయిన్ అవ్వండి!

ప్రతి నిత్య పోస్ట్ మీ WhatsApp కు నేరుగా వస్తుంది

Join WhatsApp Channel

Comments

మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:

Post a Comment

కామెంట్‌లు