సత్య స్వరూపియైన ఆత్మ మిమ్ము నడిపించును: యోహాను 16:12-15 | కార్మెల్ శోభ

 యోహాను  16:12-15 


సువిశేషం :

నేను మీకు అనేక విషయములు చెప్పవలసి ఉన్నది. కాని, ఇప్పుడు మీరు వానిని భరింపలేరు. ఆయన, సత్య స్వరూపి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సంపూర్ణ సత్యమునకు నడిపించును. ఆయన తనంతట తాను ఏమి బోధింపక తాను వినిన దానినే బోధించును. జరుగబోవు విషయములను మీకు తెలియ చేయును. ఆయన నన్ను మహిమ పరుచును . ఏలన , ఆయన నాకున్న దానిని , నా నుండి గైకొని దానిని మీకు తెలియ చేయునని చెప్పితిని. తండ్రికి ఉన్నదంతయు నాది. అందుచేత నానుండి గైకొని మీకు తెలియచేయును అని చెప్పితిని.

1. "ఇప్పుడు మీరు వానిని భరింపలేరు" – శిష్యుల మానసిక స్థితి మరియు మానవ బలహీనత

యేసు ప్రభువు తన భూలోక పరిచర్య ముగింపు దశకు వచ్చినప్పుడు, తన ప్రియ శిష్యులతో అన్న మాటలు ఇవి. "ఇప్పడు మీరు వానిని భరింపలేరు" అని ఆయన అన్నప్పుడు, దాని వెనుక ఎంతో ప్రేమ, కనికరం మరియు దైవిక వివేచన ఉన్నాయి. శిష్యులు యేసు ప్రభువు చెప్పే రాబోవు సత్యాలను, కష్టాలను భరించలేకపోవడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే, వారు రాబోయే శోధనలను, అవమానాలను మరియు శారీరక, మానసిక కష్టాలు పొందటానికి ఇంకా ఆత్మీయంగా సిద్ధంగా లేరు.

ఇది యేసు ప్రభువు తన శిష్యులకు ఇచ్చిన 'వీడ్కోలు ఉపదేశం'. ఈ సంభాషణ ఎప్పుడు జరుగుతుందో మనం గమనించాలి. ప్రజలందరూ యేసు ప్రభువును ఒక రాజుగా భావించి, ఖర్జూర మట్టలు చేతబట్టుకుని, "ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక" అని జయ జయ నినాదాలతో, ఎంతో వైభవంగా యెరుషలేము నగరములోనికి ఆహ్వానించిన తర్వాత ఈ సంఘటన జరుగుతుంది. శిష్యుల మనస్సులలో ఆ సమయాన ఒక బలమైన నమ్మకం ఏర్పడింది. వారు యేసు ప్రభువును రోమా సామ్రాజ్యం నుండి తమ్మును విడిపించబోయే ఒక వీరోచితమైన, రాజకీయ, సైనిక రాజుగా చూస్తున్నారు. ఆయన సింహాసనాన్ని అధిష్టిస్తే, తాము ఆయనకు ఇరుపక్కలా కూర్చుని అధికారాన్ని చలాయించవచ్చని వారు ఆశపడ్డారు.

కాని, యేసు ప్రభువు ఆలోచనలు, ప్రణాళికలు లౌకికమైనవి కావు. ఆయన వారికి రాబోయే కష్టముల గురించి, తాను పొందబోయే సిలువ మరణం గురించి చెబుతున్నారు. ఆయన వెళ్ళిన తరువాత వారి జీవితాలలో సంభవించబోయే ఘోరమైన హింసల గురించి, లోక ద్వేషం గురించి యేసు ప్రభువు వారికి ఆ సమయంలో పూర్తిగా వివరించడం లేదు. ఎందుకంటే, ఆ లౌకిక విజయ ఆనందంలో ఉన్న శిష్యులు, రాబోయే ఆధ్యాత్మిక యుద్ధాన్ని, శ్రమలను అప్పుడే జీర్ణించుకోలేరు. మానవ స్వభావం ఎప్పుడూ కష్టాల కంటే సుఖాలకే మొగ్గు చూపుతుంది. శిష్యులు ఇంకా క్రీస్తు పునరుత్థానాన్ని, పవిత్రాత్మ శక్తిని పొందుకోలేదు కాబట్టి, వారి మానసిక, ఆత్మీయ స్థితి చాలా బలహీనంగా ఉంది. అందుకే యేసు వారి బలహీనతను ఎరిగి, ఈ విషయమును ప్రేమతో వెల్లడిచేస్తున్నారు.

గమనిక: దేవుడు ఎల్లప్పుడూ మన ఆత్మీయ పరిపక్వతను బట్టే మనకు విషయాలను బయలుపరుస్తాడు. మన శక్తికి మించిన భారాన్ని ఆయన మనపై ఉంచడు.

2. శ్రమల గురించిన దైవిక ప్రణాళిక మరియు పవిత్రాత్మ తర్ఫీదు కాలం

ఎందుకు యేసు ప్రభువు వారికి వారు పొందబోవు శ్రమల గురించి పూర్తిగా ముందే చెప్పడం లేదు? దీని వెనుక దేవుని అపారమైన కరుణ దాగి ఉంది. యేసు ప్రభువు వారి నుండి అదృశ్యమైన తరువాత, శిష్యులు సమాజ మందిరాల నుండి వెలివేయబడ్డారు, చెరసాలల్లో బంధించబడ్డారు మరియు చాలా క్రూరమైన, అమానుషమైన హింసలకు గురిఅయ్యారు. ఆయా కాలాల్లో వారు వాటన్నింటినీ ధైర్యంగా భరించారు. కానీ, యేసు ప్రభువు బ్రతికి ఉన్న కాలంలో, ఇంకా సిలువ కార్యం సమాప్తం కాకముందు, వీరికి ఇటువంటి దారుణమైన హింసలను తట్టుకునే మానసిక ఆత్మస్థైర్యం గానీ, ఆత్మీయ శక్తి గానీ లేదు.

మన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మనలను మనం భరించ లేని కష్టాలకు, మన శక్తికి మించిన శోధనలకు గురిచేయడు. (1 కొరింథీయులకు 10:13 ప్రకారం, మన శక్తికి మించిన శోధనను ఆయన మనకు రానియ్యడు). అందుకే వారు పొందబోయే హింసలు, కష్టాలు అన్నింటినీ ఒకేసారి చెప్పి వారిని నిరాశలో పడేయడం యేసుకి ఇష్టం లేదు. ఇవన్నీ సమయానుకూలంగా వారికి తెలియజేయడానికి, మరియు ఆ భయంకరమైన కష్ట కాలంలో వారిని ఆదరించి, బలపరచడానికి "ఆదరణకర్త" అయిన పవిత్రాత్మ వారికి సహాయం చేస్తుందని యేసు వాగ్దానం చేశారు.

యేసు ప్రభువు తండ్రి దగ్గరకు పోయేంత వరకు శిష్యులతో గడిపిన సమయమంతా ఒక విద్యాభ్యాసం లాంటిది. రాబోవు కఠినమైన పరిస్థితులను, తుఫానులను తట్టుకొనే విధంగా వారికి ఇది ఒక అద్భుతమైన 'తర్ఫీదు కాలం' అవుతుంది. అంతే కాదు, శ్రమలు వచ్చినప్పుడు, అధికారులు మరియు రాజుల ఎదుట నిలబడినప్పుడు ఆ సమయాల్లో వారు ఏమి చేయాలో, ఏ విధంగా సమాధానం చెప్పాలో కూడా పవిత్రాత్మ దేవుడే వారికి అంతఃప్రేరణ ద్వారా తెలియ జేస్తాడు.

దీనిని మనం లూకా సువార్తలో మరియు అపోస్తుల కార్యాలలో స్పష్టంగా చూడవచ్చు. యేసు ప్రభువును సిలువ వేసే సమయంలో భయంతో పారిపోయిన పేతురు, యోహానులు... పవిత్రాత్మను పొందుకున్న తర్వాత ఎంత ధైర్యశాలులుగా మారారో మనకు తెలుసు. వారు యూదా అధికారులు, పాలకులైన అన్నా, కయప మరియు పెద్దల ముందు నిలబడినప్పుడు ఎటువంటి దైవిక జ్ఞానంతో, నిరక్షరాస్యులైనప్పటికీ ఎంతటి అధికారంతో మాట్లాడారో మనం అపోస్తుల కార్యాల గ్రంథంలో చదువుతాము. ఆ జ్ఞానాన్ని చూసి ఆనాటి పండితులే ఆశ్చర్యపోయారు. దీనికంతటికి తోడ్పాటునిచ్చి, శక్తినిచ్చి, నడిపించినది కేవలం పవిత్రాత్మ దేవుడే.

3. సత్య స్వరూపియైన ఆత్మ మరియు సంపూర్ణ సత్యము వైపు నడిపింపు

"ఆయన సత్య స్వరూపి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సంపూర్ణ సత్యమునకు నడిపించును" : యేసు ప్రభువు భూమిపై ఉన్నప్పుడు తానే సత్యమై ఉన్నారు. అయితే ఆయన వెళ్ళిపోయిన తర్వాత, ఆయన వలెనే సత్యమును బోధించుటకు, సత్యము వైపు మానవాళిని నడిపించుటకు ఇప్పుడు పవిత్రాత్మ యొక్క ఆవశ్యకత శిష్యులకు ఎంతైనా ఉంది.నిజానికి, లోక సహజంగా సత్యం మనకు అంతగా ఇష్టం ఉండదు. ఎందుకంటే సత్యం ఎప్పుడూ నిష్కర్షగా ఉంటుంది; అది మన హృదయాలలో ఉన్న పాపమును, మన రహస్య దోషాలను ఎత్తి చూపిస్తుంది. మన చెడు జీవితమును, మన ముసుగులను మనకు స్పష్టంగా తెలుపుతుంది. ఈ ఆధునిక రోజుల్లో కూడా మనం ఏది మన స్వార్థానికి, మన శరీరానికి అనుకూలంగా ఉంటుందో, దాన్నే దేవుని వాక్యంగా మార్చుకుని పాటించుటకు ఇష్ట పడుతున్నాము. కానీ, కఠినమైన దైవిక సత్యమును, ఆజ్ఞలను పాటించుటకు ఇష్టపడుటలేదు.

కానీ వాక్యం సెలవిస్తోంది: "సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును" (యోహాను 8:32). సత్యం మనలను అనేక పాప బంధనముల నుండి, శాపాల నుండి మరియు సాతాను క్రియల నుండి విముక్తులను చేస్తుంది. ఇక్కడ 'సత్యం' అంటే కేవలం కొన్ని నిజాలు మాట్లాడటం కాదు; సత్యం అంటే స్వయంగా యేసు ప్రభువే! ఎందుకంటే యేసు ప్రభువు, "నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు" అని స్పష్టంగా చెప్పారు. కాబట్టి, సంపూర్ణ సత్యమునకు నడిపించడం అంటే, మనలను యేసు క్రీస్తు యొక్క సంపూర్ణ స్వరూపంలోనికి నడిపించడమే.

4. పవిత్రాత్మ కార్యాలు మరియు క్రీస్తు మార్గంలో మార్గదర్శకత్వం

పవిత్రాత్మ కేవలం ఒక శక్తి కాదు, ఆయన 'సత్య స్వరూపియైన దేవుడు'. అంటే ఆయన పరిశుద్ధుడు, మనలను ఎన్నటికీ తప్పు మార్గంలో లేదా చేడుగా నడిపించడు. అట్లయితే, ఆయన మనలను ఎక్కడకు నడిపించాలి? మన అంతిమ గమ్యం ఏమిటి? దీనికి సమాధానం క్రీస్తే. యేసు ప్రభువు "నేనే మార్గమును" అని చెబుతున్నారు కాబట్టి, మన ఆత్మీయ ప్రయాణ మార్గం ఆయనే. ఖచ్ఛితముగా పవిత్రాత్మ దేవుడు మనలను యేసు ప్రభువు దగ్గరికే నడిపిస్తుంది. ఎందుకంటే యేసు ప్రభువే సత్యమై ఉన్నారు.

పవిత్రాత్మ చేసే పరిచర్యలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయన తగ్గింపు స్వభావం. యేసు ప్రభువు తన భూలోక పరిచర్యలో తన గురించి స్వయంగా చెప్పుకునేటప్పుడు, "నా అంతట నేను ఏమి చెప్పుటలేదు, నా తండ్రి యొద్ద నేను చూసిన దానిని, వినిన దానినే నేను చెబుతున్నాను" అని పదే పదే చెప్పారు. అదే రీతిగా, పవిత్రాత్మ దేవుడు కూడా తనంతట తాను స్వతంత్రంగా ఏమి చేయడు, తాను త్రిత్వ దేవుని నుండి వినిన దానినే, క్రీస్తు సంకల్పాన్నే సభలకు, విశ్వాసులకు బోధించును. పవిత్రాత్మ ఎప్పుడూ క్రీస్తును దాటి కొత్త సిద్ధాంతాలను తీసుకురాడు, క్రీస్తు బోధనలనే మనకు జ్ఞాపకం చేస్తాడు.

5. సంఘానికి సహాయకుడిగా పవిత్రాత్మ మరియు అపోస్తలుడైన పౌలు అనుభవం

"జరుగబోవు విషయములను మీకు బోధించును": ఈ మాట కేవలం భవిష్యత్తు ప్రవచనాల గురించే కాదు, ఆదిమ క్రైస్తవ సంఘం ఏ విధంగా ముందుకు సాగాలో ఆయా కాలాల్లో నడిపించడాన్ని సూచిస్తుంది. పవిత్రాత్మ క్రైస్తవ సంఘానికి ఉత్తమ 'సహాయకునిగా' (Paraclete), ఆదరణకర్తగా ఉంటూ, సంఘంలో తలెత్తిన అనేక సిద్ధాంతపరమైన, పరిపాలనాపరమైన సమస్యలను తీర్చుటలో అపోస్తలులకు ఎంతగానో సహాయ పడింది. ఎరుషలేము కౌన్సిల్ (అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయం) లో అన్యజనుల రక్షణ విషయంలో వచ్చిన పెద్ద సమస్యను పవిత్రాత్మ సహాయంతోనే వారు పరిష్కరించుకున్నారు.

అనేక సార్లు విపత్కర పరిస్థితులలో పవిత్రాత్మ దేవుడు వారికి ఏమి చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో (ఉదాహరణకు మాసిదోనియా పిలుపు) స్పష్టంగా నేర్పుతూ వచ్చారు. దీనికి అపోస్తలుడైన పౌలు గారి జీవితమే ఒక గొప్ప ఉదాహరణ. పౌలు గారు పూర్వం క్రైస్తవులను హింసించినవాడు కాబట్టి, ఆయన మారుమనస్సు పొందిన కొత్తలో సంఘంలోని వారందరూ ఆయనను నమ్మక, ఆయన మీద వ్యతిరేకంగా ఉండి, భయపడ్డారు. అయినప్పటికీ, పవిత్రాత్మ ఆయన మీదకు వస్తుంది, ఆయనను ప్రత్యేకపరుస్తుంది. ఎందుకంటే సజీవుడైన ప్రభువే ఆయన్ను అన్యజనుల కొరకు ఒక ప్రత్యేక పాత్రగా ఎన్నుకున్నారు కాబట్టి.

యూదుల నుండి, అన్యజనుల నుండి పౌలుకు ఎన్నో ఆటంకాలు, ప్రాణాపాయాలు ఎదురైనా, పవిత్రాత్మ ఆయనను బలపరుస్తూ వచ్చింది. అపోస్తలులు మరియు పౌలు గారు పవిత్రాత్మ నడిపింపులో ఉన్నప్పుడు, వారు లౌకిక జ్ఞానాన్ని కాక, దైవికమైన "యేసు ప్రభువు జ్ఞానం" కలిగి ఉన్నారు. శోధకులు, తత్వవేత్తలు వారిని ప్రశ్నించినప్పుడు, వారు ఎప్పుడు, ఏ స్థలంలో, ఏమి చెప్పాలో పవిత్రాత్మ వారికి నోటి బలమును, వాక్చాతుర్యాన్ని అనుగ్రహించింది.

6. క్రీస్తు మహిమ పరచబడటం మరియు పవిత్రాత్మ తత్వం

"ఆయన నాకున్న దానిని గైకొని మీకు తెలియజేయును" : ఇక్కడ యేసు ప్రభువు పవిత్రాత్మ యొక్క పరమ తత్వాన్ని, ఆయన విధిని చాలా స్పష్టంగా తెలియ జేస్తున్నారు. పవిత్రాత్మ దేవుడు క్రీస్తుకు వేరుగా పని చేయడు. ఆయన క్రీస్తు నొద్ద తెలుసుకున్నదానిని, వినిన దానిని తీసుకొని విశ్వాసులమైన మీకు తెలియజేయును గానీ, తనంతట తాను స్వంతంగా ఏ మహిమను కోరడు. యేసు ప్రభువు ఇంకా వివరిస్తూ, "తండ్రికి ఉన్నదంతయు నాది, అందుచేతనే ఆయన (పవిత్రాత్మ) నా నుండి గైకొని మీకు ఇస్తాడు, తెలియ జేస్తాడు" అని సెలవిచ్చారు.

సువార్తికుడైన యోహాను కూడా తన పత్రికలలో మరియు సువార్తలో, తండ్రి అయిన దేవుడు సమస్తమును, సర్వాధికారమును కుమారునికి ఇచ్చెనని సాక్ష్యమిచ్చారు. ఆ క్రీస్తు సంపదను, దైవిక సత్యాలను మనకు ఆత్మీయంగా తెలియ పరచడానికి, అనుభూతి చెందించడానికి పవిత్రాత్మ మనకు నిరంతరం సహాయం చేస్తుంది. విశ్వంలో ఉన్న సమస్త వస్తువుల మీద, శక్తుల మీద యేసు ప్రభువుకు సర్వాధికారం ఉన్నదట్లు, మరియు అంతా ఆయనదే అని పవిత్రాత్మ దేవుడు విశ్వాసుల హృదయాలలో ముద్రవేసి తెలియజేస్తుంది.

అంతేకాదు, సిలువపై యేసు క్రీస్తు కార్చిన రక్తం ద్వారా లభించే ఉచిత 'రక్షణ' గురించిన గొప్ప నిరీక్షణను పవిత్రాత్మ మనకు తెలియ జేస్తుంది. ఆ రక్షణను కాపాడుకోవడానికి, దేవుని రాజ్య వారసులం కావడానికి మనం ఈ లోకంలో ఏ విధంగా జీవించాలో, ఏ క్రియలు చేయాలో కూడా పవిత్రాత్మ ప్రతిరోజూ మన మనస్సాక్షి ద్వారా హెచ్చరిస్తూ తెలియ జేస్తుంది. ఇవన్నీ చేయడం ద్వారా, అంటే క్రీస్తును హెచ్చించడం ద్వారా పవిత్రాత్మ యేసు ప్రభువును మహిమ పరుస్తాడు. ఎందుకంటే పవిత్రాత్మ యొక్క ముఖ్య ఉద్దేశం క్రీస్తును మహిమపరచడమే. పవిత్రాత్మ ఎప్పటికీ క్రీస్తుకు గానీ, దేవుని వాక్యానికి గానీ వ్యతిరేకముగా ఏమి చెప్పడు, చెప్పబోడు.

యేసు ప్రభువు అంతయు తండ్రి దగ్గర నుండి పొందుతున్నాడు, అలాగే తండ్రిని చేరుకోవడానికి ఆయనే ఏకైక మార్గమై ఉన్నాడు. యేసు ప్రభువు శారీరకంగా ఈ భూమిని విడిచి తండ్రి దగ్గరకు పోతున్నప్పుడు, తన భూలోక పరిచర్య బాధ్యతను, తన సంఘాన్ని నడిపించే బాధ్యతను పవిత్రాత్మకు అప్పగిస్తున్నారు. ఇప్పుడు విశ్వాసులమైన మనం యేసు ప్రభువును ఆత్మీయంగా తెలుసుకోవడానికి, ఆయనను అనుభవించడానికి పవిత్రాత్మయే ఏకైక మార్గం అవుతుంది. అంతేకాదు, యేసు ప్రభువు భూమిపై ఉన్నప్పుడు చెప్పిన ప్రతి మాటను, ఆజ్ఞను మనకు సమయానుకూలంగా గుర్తుచేస్తూ, తెలియజేస్తూ, క్రీస్తు యొక్క ప్రతి శిష్యుడిని అంతిమ విజయం వైపు నడుపుతుంది. పవిత్రాత్మ మన నిత్య జీవిత ప్రయాణంలో శ్రేష్ఠమైన మార్గదర్శి మరియు 'మార్గ చూపరి' అవుతుంది.

ప్రార్ధన :

ప్రభువా ! మీరు తండ్రి దగ్గరకు వెళుతున్నప్పుడు మీ శిష్యులకు తోడుగా ఉండుటకు, మరియు వారికి మీ వద్దకు నడిపించుటకు పవిత్రాత్మను వారికి సహాయంగా పంపారు. పవిత్రాత్మ వారికి అన్ని విధాలుగా సహాయ పడుతూ , సంపూర్ణ సత్యమగు మీ వైపు నడిపినది, కాని ప్రభువా ఈ లోకంలో జీవిస్తూ మీ దరి చేరాలని కోరిక ఉన్న అనేక సార్లు చెడు మార్గాలలో నడుస్తున్నము ప్రభువా, అటువంటి అపదల నుండి మాకు సహయం చేయుటకు మాకు తోడుగా ఉండుటకు పవిత్రాత్మను మాకు అనుగ్రహించండి. ఆమెన్

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబిల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పవిత్రుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

📲 మా WhatsApp Channel జాయిన్ అవ్వండి!

ప్రతి నిత్య పోస్ట్ మీ WhatsApp కు నేరుగా వస్తుంది

Join WhatsApp Channel

Comments

మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:

Post a Comment

కామెంట్‌లు