ఐదు రొట్టెలు, రెండు చేపలు అద్భుతం | యోహాను 6:1-15 ధ్యానం

 యోహాను 6:1-15 

ఆ పిదప యేసు తిబేరియా అనెడి గలీలియ సరస్సు దాటి ఆవలి తీరమునకు వెళ్ళెను. రోగుల పట్ల ఆయన చేసిన అధ్బుత కార్యములను చూచి గొప్ప జనసముహము ఆయనను వెంబడించేను. యేసు పర్వతమునెక్కి శిష్యులతో అక్కడ కూర్చుండెను. యూదుల పాస్క పండుగ సమీపించినది. యేసు కనులేత్తి గొప్ప జనసముహము తన యొద్దకు వచ్చుట చూచి, పిలిప్పుతో వీరు భుజింపవలసిన అహర పదార్ధములను మనమెక్కడ నుండి కొని తెచ్చెదము? అనెను. పిలిప్పును పరీక్షించుటకై యేసు అట్లు పలికెను. ఏలన, తానేమి చేయబోవుచున్నది ఆయనకు తెలియును. ఒక్కొక్కరికి కొంచెము వడ్డించుటకైన రెండువందల వరహాల రొట్టెలు కూడ చాలవు అని పిలిప్పు ఆయనకు సమాధానము ఇచ్చెను. ఆయన శిష్యులలో ఒకడు  సీమోను పేతురు సోదరుడు, అంద్రెయ : ఇక్కడ ఒక బాలుని యొద్ద ఐదు యవ (గోదుమ) రొట్టెలు, రెండు చేపలు కలవు. కాని, ఇంత మందికి ఇవి ఏమాత్రము? అని పలికెను. యేసు "అందరను భోజనమునకు కూర్చుండబెట్టుడు" అనెను. అచట ఇంచుమించు  ఐదు వేల మంది పురుషులు ఉండిరి. వారు అక్కడ పచ్చిక మీద కూర్చుండిరి. అపుడు యేసు రొట్టెను తీసికొని, ధన్యవాదములు అర్పించి, కూర్చున్న వారికి వడ్డించేను. అట్లే చేపలను కూడ వారికి తృప్తి కలుగునంతగ వడ్డించేను. వారు తృప్తిగా భుజించిన పిదప, యేసు శిష్యులతో "ఏమి వ్యర్ధము కాకుండా మిగిలిన ముక్కలను ప్రోవు చేయుడు" అని చెప్పెను. వారు భుజించిన పిదప ఐదు యవల రొట్టెలలో మిగిలిన ముక్కలను పండ్రెండు గంపలకు నింపిరి. ప్రజలు యేసు చేసిన ఈ అధ్భుతమును చూచి, వాస్తవముగ ఈ లోకమునకు రానున్న ప్రవక్త ఈయనయే" అని చెప్పిరి. ప్రజలు తనను బలవంతముగ రాజును చేయనున్నారని తెలిసికొని, యేసు మరల ఒంటరిగా పర్వతము పైకి వెళ్ళెను. 


మానవ అవసరాలను ఎరిగిన దైవం

యేసు  ప్రభువు రోగుల పట్ల చేసిన అనేక అద్భుత కార్యములను కండ్లారా చూసిన ప్రజలు, ఆయనపై అపారమైన నమ్మకంతో ఆయన్ను అనుసరిస్తూ అరణ్య మార్గంలోకి వచ్చారు. ఈ జనసమూహం దేవుని దగ్గరకు రావడానికి వెనుక రకరకాల అంతర్గత కారణాలు ఉండి ఉండవచ్చు.

  • కొంతమంది తమ జీవితాలలో, శరీరాలలో ఉన్న దీర్ఘకాలిక వ్యాధుల నుండి స్వస్థత లభిస్తుందనే ఆశతో వచ్చి ఉండవచ్చు.

  • మరికొంతమంది ఆత్మను తృప్తి పరిచే దేవుని అమృత వాక్కులను వినాలనే ఆకలితో వచ్చి ఉండవచ్చు.

  • ఇంకొంతమంది అసాధ్యమైన అద్భుతాలు చేస్తున్న ఈ నజరేయుడు అసలు ఎవరు అని తెలుసుకోవాలనే కుతూహలంతో వచ్చి ఉండవచ్చు.

కానీ, వారు ఎటువంటి ఉద్దేశాలతో, ఎలాంటి మానసిక స్థితితో వచ్చినప్పటికీ — కరుణామయుడైన యేసు ప్రభువు వారిని ఎంతో ఆదరిస్తున్నారు, ప్రేమతో స్వీకరిస్తున్నారు. ఆధ్యాత్మిక బోధనలు చేయడమే కాకుండా, శారీరకంగా అలసిపోయిన ఆ ప్రజల ఆకలిని కూడా ఆయన గమనించారు. "వీరు తినుటకు ఏమైనా దొరుకుతుందా?" అని శిష్యులను అడగడం ద్వారా, దేవుడు మన ఆత్మలనే కాదు, మన దైనందిన భౌతిక అవసరాలను కూడా పట్టించుకునే జీవము గల దేవుడని రుజువు చేస్తున్నారు. ప్రభువు ఎల్లప్పుడూ మన అవసరాలను ముందే గ్రహించి, వాటిని సరైన సమయంలో తీర్చడానికి ఎంతో ఇష్టపడతారు.

మానవ పరిమితులు  దైవ  సమృద్ధి

యేసు ప్రభువు పిలిప్పును చూసి, "వీరు భుజించుటకు కావలసిన ఆహార పదార్థాలను మనము ఎక్కడ నుండి తీసుకొనిరావాలి?" అని ప్రశ్నించారు. ఇది పిలిప్పు యొక్క విశ్వాస పరిమితులను పరీక్షించడానికి అడిగిన ప్రశ్న మాత్రమే. ఎందుకంటే, సృష్టికర్తయైన యేసుకు తాను తదుపరి క్షణంలో ఏమి చేయబోతున్నారో ముందే తెలుసు.

దానికి పిలిప్పు లౌకిక కోణంలో ఆలోచించి... ఒకవేళ వీరికి కడుపు నిండా కాకపోయినా, కొద్దికొద్దిగా రుచి చూపించడానికైనా కనీసం "రెండు వందల వరహాల రొట్టెలు" అవసరమవుతాయని, అయినా అవి చాలవని చేతులెత్తేశాడు. అక్కడ కేవలం పురుషులు మాత్రమే ఐదు వేల మంది ఉన్నారు. నాటి సామాజిక ఆచారం ప్రకారం స్త్రీలను, పిల్లలను విడిగా ఉంచడం వల్ల వారిని లెక్కించలేదు కానీ, వారందరినీ కలిపితే ఆ సమూహం దాదాపు పది నుండి పదిహేను వేల మంది వరకు ఉండవచ్చు.

అంత పెద్ద జనసమూహానికి, అదీ ఏ వసతులు లేని ఒక నిర్జన ప్రదేశంలో, సాయంకాలపు వేళ ఆహారం ఏర్పాటు చేయడం మానవ మాత్రులకు అసాధ్యం. కానీ, యేసు ప్రభువు లౌకిక లెక్కలను చూడటం లేదు; ఆయన ప్రజల ఆకలిని చూస్తున్నారు. వారు అరకొరగా కాదు, సమృద్ధిగా, తృప్తిగా భుజించాలని ఆయన ఆశపడుతున్నారు.

ఆలోచించదగిన సత్యం: యేసు ప్రభువు చేసిన ఏ అద్భుతము కూడా తన స్వంత ప్రతిష్టను పెంచుకోవడానికో లేక తన మహిమను ప్రదర్శించుకోవడానికో చేయలేదు. కేవలం ప్రజల కష్టాలను, అవసరాలను హృదయపూర్వకంగా గ్రహించి, వారి తక్షణ సమస్యను తీర్చడానికి మాత్రమే ఆయన అద్భుతాలు చేశారు. ఇక్కడ కూడా ప్రజలు ఎంతో ఆకలితో ఉన్నారు, అరణ్యంలో వారు సొమ్మసిల్లి పడిపోకూడదనే ఏకైక తపనతోనే ఆయన ఈ కార్యానికి సిద్ధపడ్డారు.

బాలుని సమర్పణ  శిష్యుల సందేహం

ఇంతలో అంద్రేయ అనే శిష్యుడు ఒక చిన్న బాలుని ముందుకు తీసుకొని వచ్చి, "ఇక్కడ ఒక బాలుని దగ్గర ఐదు రొట్టెలు, రెండు చేపలు కలవు" అని చెప్పాడు. అయితే వెంటనే తన మానవ బలహీనతను బయటపెడుతూ... "కాని, ఇంత మందికి ఇవి ఏమాత్రము?" అని నిరాశను వ్యక్తం చేశాడు. అంటే మానవ దృష్టిలో ఆ ఐదు రొట్టెలు వేలాది మంది ఆకలి తీర్చడానికి ఏ మూలకూ సరిపోవు.

కానీ యేసు ప్రభువు ఆ చిన్న బాలుని ఉదారతను చూశారు. ఆకలితో ఉన్న వేలాది మంది ప్రజల ఆకలి తీర్చడానికి ప్రభువు ఏమి చేయాలో ఆయనకు ముందే ప్రణాళిక ఉంది. అందుకే అందరినీ క్రమశిక్షణతో పచ్చిక మీద భోజనానికి కూర్చోమని చెప్పారు. ఆ ఐదు రొట్టెలను, రెండు చేపలను తన పవిత్ర హస్తాలలోకి తీసుకొని, పరలోకపు తండ్రి వైపు కన్నులెత్తి, కృతజ్ఞతాస్తుతులు (ధన్యవాదములు) అర్పించి దీవించారు. ఆ తర్వాత శిష్యుల ద్వారా అందరికీ వడ్డించారు.

అక్కడ ఉన్నవారందరూ తమకు కావలసినంత, తృప్తిగా భుజించారు. ఇది కేవలం కడుపు నింపే ఒక అద్భుతం మాత్రమే కాదు. యేసు ప్రభువు మన జీవితాలలో, మన కుటుంబాలలో ఉంటే మన ఆత్మీయ, భౌతిక జీవితాలకు ఎలా సమృద్ధి దొరుకుతుందో తెలియజేసే దివ్య సత్యం. పాత  నిబంధన ప్రవచనాల ప్రకారం మెస్సీయ్యా  ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రజలందరూ సమృద్ధిని పొందుతారు, ఆకలి తీరి తృప్తి చెందుతారు అనే వాగ్దానం ఇక్కడ అక్షరాలా నెరవేరుతోంది. నిజమైన సమృద్ధి మరియు ఆత్మ తృప్తి అనేది కేవలం యేసు ప్రభువుతోనే సాధ్యం అవుతుంది.

మిగిలిన ముక్కలు - దేవుని అపరిమితమైన ప్రేమ

ప్రజలందరూ తృప్తిగా భుజించిన తర్వాత, యేసు ప్రభువు శిష్యులతో... "ఏమి వ్యర్థము కాకుండా మిగిలిన ముక్కలను ప్రోవు చేయుడు" అని చెప్పారు. వారు ఆ ముక్కలను సేకరించగా, ఐదు యవల రొట్టెల నుండి మిగిలిన ముక్కలే పండ్రెడు గంపల నిండా వచ్చాయి!

యేసు ప్రభువు వద్ద ప్రతి ఒక్కరికీ స్థానం ఉంటుంది. ఆయన ప్రేమ కేవలం కొంతమందికో, లేదా ఎన్నుకొనబడిన ఐశ్వర్యవంతులకో మాత్రమే పరిమితమైనది కాదు. కులమత భేదాలు లేకుండా, ప్రతి ఒక్కరూ ఆయన వద్ద స్థానం పొందవచ్చు, ఆయన నుండి రక్షణను, దీవెనలను ఉచితంగా పొందవచ్చు.

 చిన్న బాలుని ఆదర్శం

యేసు ప్రభువు చేసిన ఈ అద్భుతం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతోంది: ఆయన అద్భుతాలు చేయడానికి మన నుండి కూడా చిన్న సహకారాన్ని ఆశిస్తున్నారు.

ఆనాడు ఆ వేలాది మందిలో ఎందరి దగ్గరో ఆహారం ఉండి ఉండవచ్చు, కానీ వారు దాచుకున్నారు. అయితే ఆ చిన్న బాలుడు మాత్రం తన వద్ద ఉన్న ఐదు రొట్టెలను, రెండు చేపలను దాచుకోకుండా, నిస్వార్థంగా ప్రభువు చేతుల్లో పెట్టాడు. మన దగ్గర ఉన్నది ఎంత కొద్దిదైనప్పటికీ, దానిని మనం సంపూర్ణ విశ్వాసంతో ప్రభువుకు సమర్పించగలిగితే, ఆయన దానిని ఆశీర్వదించి, కోట్లాది మందికి ఉపయోగపడేలా ఎన్నో అద్భుతములను చేస్తారు. క్రీస్తు అనుచరులుగా మనం ఎల్లప్పుడూ మన సమయాన్ని, తలాంతులను, సంపదను దైవకార్యాల కొరకు సహకరించడానికి సిద్ధంగా ఉంచాలి.

నిగర్వియైన క్రీస్తు మనకు ఆ దర్శం

యేసు ప్రభువు చేసిన స్వస్థతలు గానీ, అద్భుతాలు గానీ ఏవీ కూడా లౌకిక పరమైన కీర్తి ప్రతిష్టల కోసం చేసినవి కావు. కేవలం ప్రజల శ్రేయస్సు, వారి మేలు కోసమే ఆయన ప్రతి కార్యాన్ని చేశారు. రొట్టెల అద్భుతాన్ని చూసిన ప్రజలు ఉద్వేగానికి లోనై, ఈయనే మనల్ని రోమన్ల పరిపాలన నుండి రక్షించే రాజు అని భావించి, ఆయనను బలవంతంగా రాజును చేయాలని ప్రయత్నించారు.

కానీ, యేసు ప్రభువు ఈ లోక సంబంధమైన సింహాసనాలను ఆశించలేదు. ప్రజలలో రానున్న మెస్సీయ్యా తానే అయినప్పటికీ, సిలువ మరణం ద్వారా దేవుని ప్రణాళిక నెరవేరే తన సమయం  వచ్చేంతవరకు ఆయన ఓపికతో వేచి చూశారు గానీ, లౌకిక మహిమను కోరుకోలేదు. అందుకే ఆయన ఆ జనసమూహం నుండి తప్పించుకొని, ఒంటరిగా ప్రార్థన చేయడానికి పర్వతము పైకి వెళ్ళిపోయారు.

యేసు ప్రభువు నుండి మనం ఈ గొప్ప మాతృకను (ఆదర్శాన్ని) నేర్చుకోవాలి. ఆయన చేయవలసిన మేలును, సహాయాన్ని డాంబికము లేకుండా  చేసి, ఇతరుల నుండి ఎటువంటి పొగడ్తలను గానీ, ప్రతిఫలాన్ని గానీ ఆశించకుండా అక్కడ నుండి వెళ్ళిపోతున్నారు. క్రైస్తవులమైన మనం కూడా సమాజంలో సేవ చేస్తున్నప్పుడు, ఇతరులకు మంచి చేస్తున్నప్పుడు స్వార్థాన్ని, కీర్తి కండూతిని వీడి, దేవుని మహిమ కొరకే జీవించడానికి ప్రయత్నించాలి.

ప్రార్ధన

ప్రభువా! మీరు మీ జీవితంలో చేసిన ప్రతి అద్భుతము మానవుని మేలు కొరకు, స్వస్థత కొరకు, మరియు వారి ఆకలి తీర్చుటకు మాత్రమే చేశారు. మా జీవితములలో కూడా మేము మా గొప్పతనమును, మా అహంకారాన్ని లేక మా ఆధిపత్యాన్ని ప్రదర్శించుటకు కాక, తోటి ఇతరులకు నిస్వార్థంగా మంచి చేయడం కోసం పనిచేసే ఉత్తమమైన, పవిత్రమైన మనసును మాకు దయచేయండి. ఆనాడు ఒక చిన్న బాలుడు సమర్పించిన ఐదు రొట్టెలను, రెండు చేపలను దీవించి, అక్కడ ఉన్న వేలాది మంది సంతృప్తిగా భుజించునట్లు అద్భుతం చేశారు. మా దగ్గర ఉన్న కొద్దిపాటి మంచి గుణాలను, తలాంతులను మీ పాద సన్నిధిలో సమర్పిస్తున్నాము. వాటిని మీ పరిశుద్ధాత్మతో అభిషేకించి, పరిపూర్ణమయ్యేలా దీవించండి. మా ఆత్మిక, ఆర్థిక జీవితాలలో ఉన్న లేమినంతటిని తీసివేసి, మీ దివ్య సమృద్ధిని మాకు దయచేయండి. మన ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ వేడుకోలు సమర్పిస్తున్నాము.ఆమెన్ 


Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబిల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పవిత్రుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

📲 మా WhatsApp Channel జాయిన్ అవ్వండి!

ప్రతి నిత్య పోస్ట్ మీ WhatsApp కు నేరుగా వస్తుంది

Join WhatsApp Channel

Comments

మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:

Post a Comment

కామెంట్‌లు