దేవుని కార్యములను నెరవేర్చుట ఎలా? | యోహాను 6:22-29
యోహాను 6:22-29
మరునాడు, సరస్సు ఆవలి తీరమున ఉండిపోయిన జనసమూహము, అచటనున్న ఒకే ఒక పడవను చూసిరి. ఆ పడవలో శిష్యులతోపాటు యేసు వెళ్లలేదని శిష్యులు మాత్రమే వెళ్ళుట చూచిరి. అయినను యేసు ధన్యవాదములు సమర్పించి, ప్రజలకు రొట్టెను పంచి ఇచ్చిన స్థలము చెంతకు తిబేరియా నుండి కొన్ని పడవలు వచ్చెను. అక్కడ యేసు గాని, శిష్యులుగాని లేకుండుట చూచి వారు ఆయనను వెదకుచు పడవలపై కఫర్నామునకు పోయిరి. ప్రజలు సరస్సు ఆవలివైపున యేసును కనుగొని "బోధకుడా! నీవు ఎప్పుడు ఇక్కడకు వచ్చితివి?" అని అడిగిరి. మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదకుచున్నారు. నా అద్భుత కార్యములను చూచి కాదు అని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు. నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు. మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఏలన తండ్రి దేవుడు ఆయనపై అంగీకారపు ముద్ర వేసిఉన్నాడు." అని యేసు సమాధానమిచ్ఛెను. అప్పుడు "దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలెను? అని వారడుగగా, యేసు "దేవుడు పంపిన వానిని విశ్వసింపుడు. అదియే దేవుడు మీ నుండి కోరునది." అని చెప్పెను.
ఆత్మీయ అన్వేషణ - నిజమైన ప్రేరణ ఏది?
యేసు ప్రభువును వెదకుచు తిబేరియా నుండి ప్రజలు వస్తున్నారు. వారు, అక్కడ యేసు ప్రభువు లేరని గ్రహించి, అక్కడ నుండి యేసు ప్రభువును వెదకుచు కఫర్నాము వెళ్లారు. వారు ఎందుకు యేసు ప్రభువును వేదకుచు వచ్చారు? వీరు అనేక కారణాలతో యేసు ప్రభువును వెదకుచు వచ్చి వుంటారు. కాని అన్ని కారణాలు కూడా తాత్కాలికమైనవే. వారు యేసు ప్రభువును చూసి "బోధకుడా! నీవు ఎప్పుడు ఇక్కడకు వచ్చితివి? అని అడిగిరి." అందుకు ప్రభువు మీరు నా అధ్భుతములు చూసి కాదు, మీరు సంతృప్తిగా భుజించినందుకు నన్ను వెదకుచున్నారు అని వారితో చెబుతున్నారు. ఆనాటి ప్రజలు యేసు ప్రభువు దగ్గరకు వచ్చినది కూడా వారి యొక్క అవసరాలు తీరుస్తారని, లేక వారి కడుపు నింపుతారని లేక వారి తాత్కాలిక భాదల నుండి వారికి ఉపశమనం కలుగచేస్తారని వారు యేసు ప్రభువు దగ్గరకు వస్తున్నారు. అంతేకాని ఆయన వారికి శాశ్వతమైనవి ఇస్తారు అనే ఆలోచన వారికి లేదు.
మానవ స్వభావం ఎప్పుడూ తక్షణ అవసరాల చుట్టూనే తిరుగుతుంది. శారీరక ఆకలి, శారీరక అనారోగ్యం, మరియు లౌకిక ఇబ్బందులు మనుషులను దేవుని వైపు నడిపించే ప్రాథమిక కారణాలుగా మారుతున్నాయి. ఐదు రొట్టెలు, రెండు చిన్న చేపలతో ఐదు వేల మందికి పైగా ప్రజలకు కడుపు నిండా భోజనం పెట్టిన అద్భుతాన్ని ఆ ప్రజలు కళ్లారా చూశారు, అనుభవించారు. ఆ తృప్తి వారిని యేసు వైపు నడిపించింది. అయితే, ఆ నడిపింపు వెనుక ఉన్న ప్రేరణ ఆత్మీయమైనది కాదు, అది కేవలం లౌకికమైనది. వారు దేవుని అద్భుతం వెనుక ఉన్న దైవిక సందేశాన్ని గ్రహించలేకపోయారు. అద్భుతం చేసిన 'వ్యక్తి' కంటే, ఆ అద్భుతం వల్ల తమకు కలిగిన 'ప్రయోజనం' పైనే వారి దృష్టి నిలిచింది. అందుకే వారు పడవలు ఎక్కి, సరస్సులు దాటి కఫర్నాము వరకు అంత శ్రమకోర్చి వచ్చారు.
మన అనుదిన జీవితంలో కూడా మనం దేవుని కోసం ఎంత ప్రయాసపడుతున్నాం అనే దానికంటే, ఏ ఉద్దేశ్యంతో ప్రయాసపడుతున్నాం అనేది ముఖ్యం. భక్తి వెనుక ఉన్న ప్రేరణ స్వార్థపూరితమైనదా లేక దైవత్వంతో కూడినదా అని పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇహలోక బంధాలు - తాత్కాలిక ఉపశమనాలు
యేసు ప్రభువు నందు వారందరు కేవలం వారికి కావలసిన, తాత్కాలిక ఉపశమనం ఇచ్చే వ్యక్తిని మాత్రమే చూశారు. వారికి అంతకంటే ఎక్కువుగా ఏమి ఉంటుంది అని తెలియదు. ఎందుకంటే వారి ఆలోచనలు ఎప్పుడు ఇహలోక విషయముల గురించి మాత్రమే. నేను కూడా ఈరోజు ఇటువంటి ఆలోచనలు మాత్రమే కలిగిఉన్నానా? అని ఒక సారి ఆలోచిస్తే ఈరోజు ఎక్కువగా దేవాలయము వచ్చేది మరియు ప్రార్ధించేది కూడా ఇటువంటి ఆలోచనలతోనే, తాత్కాలికమైన వాటికోసమే మనం దేవున్ని కోరుకుంటున్నాము.
ఈనాటి క్రైస్తవ సమాజంలో కూడా ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది. ప్రార్థన కూటాలకు, దేవాలయాలకు వచ్చే జనసమూహాలను మనం గమనిస్తే, వారిలో అత్యధికులు ఏదో ఒక తాత్కాలిక సమస్యతో బాధపడుతున్నవారే ఉంటారు.
ఉద్యోగం రాలేదనో,
వ్యాపారంలో నష్టం వచ్చిందనో,
కుటుంబంలో కలహాలు ఉన్నాయనో,
లేదా దీర్ఘకాలిక రోగంతో బాధపడుతున్నారనో
మనం దేవుని సన్నిధికి పరిగెత్తుకు వస్తాం. ఇవన్నీ జీవితంలో అవసరాలే, కాదనలేం. కానీ, దేవునితో మనకున్న బంధం కేవలం వీటికి మాత్రమే పరిమితమైపోతే, మనం ఆనాటి గలిలయ సముద్ర తీరపు ప్రజల కంటే ఏమాత్రం భిన్నమైన వారం కాము.
మనం దేవుడిని ఒక 'సమస్యల పరిష్కర్త'గా (Problem Solver) లేదా అవసరాలు తీర్చే 'దాత'గా మాత్రమే చూస్తున్నాం. ఆయన సృష్టికర్త అని, మన ఆత్మలకు అధిపతి అని, మనకు నిత్యజీవాన్ని ప్రసాదించే రక్షకుడని మరచిపోతున్నాం. లౌకిక ఆశీర్వాదాలు లభించగానే సంతోషించడం, అవి కాస్త ఆలస్యమైతే దేవునిపై విశ్వాసం కోల్పోవడం మన ఆత్మీయ బలహీనతకు నిదర్శనం.
కృతజ్ఞత లేని హృదయాలు - కేవలం స్వస్థత కోసమేనా?
యేసు ప్రభువు స్వస్థ పరచిన అనేక మంది తరువాత ఆయన వెంట ఏమి లేరు, దాని తరువాత వారి పనులలో వారు నిమగ్నమైపోతున్నారు. కాని యేసు ప్రభువు ఎవరు? ఆయన కేవలం ఆరోగ్యాన్ని ఇచ్చేవాడేనా? లేక ఆకలి తీర్చే వాడు మాత్రమేనా? ఆయనను పూర్తిగా అర్ధం చేసుకోలేక పోతున్నాము. అయినప్పటికీ యేసు ప్రభువు అనేక సార్లు ఆయన ఎవరు ఆయన మనకు ఏమి ఇవ్వగలడు అని తెలియజేస్తూనే ఉన్నారు, కాని అది మనం అర్ధం చేసుకోలేకపోతున్నాము.
సువిశేషాలలో మనం చూస్తాం: యేసు పది మంది కుష్ఠ రోగులను స్వస్థపరిస్తే, వారిలో కేవలం ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించాడు. మిగిలిన తొమ్మిది మంది తమ స్వస్థత పొంది, తమ పాత జీవితాల్లోకి, తమ సొంత పనుల్లోకి వెళ్ళిపోయారు. వారికి కావాల్సింది సమాజంలో గౌరవం, శరీరం బాగుపడటం మాత్రమే. ఆ స్వస్థత ఇచ్చిన దేవునితో నిరంతర బంధం వారికి అవసరం లేకుండా పోయింది.
ఈ రోజు మన పరిస్థితి కూడా ఇలాగే ఉందా? మనకు ఒక కష్టం వచ్చినప్పుడు రాత్రంతా కన్నీరు కార్చి ప్రార్థిస్తాం. దేవుడు కరుణించి ఆ కష్టాన్ని తొలగించగానే, లేదా ఆ రోగాన్ని నయం చేయగానే, మరలా మన పాత లోకపు అలవాట్లలోకి, లౌకిక వ్యాపకాల్లోకి మునిగిపోతాం. దేవునికి సమయం ఇవ్వడం తగ్గించేస్తాం. యేసుక్రీస్తు కేవలం మన లౌకిక జీవితాన్ని చక్కదిద్దడానికి రాలేదు; ఆయన మన అంతరంగ స్వభావాన్ని మార్చడానికి, మనలను పాప విముక్తులను చేయడానికి వచ్చారు. ఈ సత్యాన్ని గ్రహించడంలో మనం రోజురోజుకూ విఫలమవుతూనే ఉన్నాం.
అద్భుతాల అంతరార్థం - యోహాను సువిశేష దృక్పథం
నా అధ్భుత కార్యములు చూసికాదు మీరు వచ్చినది అని యేసు ప్రభువు చెబుతున్నారు. యోహాను సువిశేషంలో యేసు ప్రభువు చేసిన ప్రతి అద్భుతం కేవలం ఆయన దేవుడు అని తెలియజేస్తుంది. ఆ అద్భుతాలలో ఇది ఏ మానవు మాతృడు చేయలేడు అనే అర్ధం వస్తుంది. యేసు ప్రభువు ప్రతి అధ్బుతం కూడా ఆయన దేవుడు అని తెలుపుతుంది. అటువంటి प्रभुవును మనము అర్ధం చేసుకోక ఆయన నుండి కేవలం ఇహలోక విషయములను మాత్రమే ఆర్ధిస్తున్నాం. ఆయన మనకు ఏమి ఇవ్వ గలడో మనం పూర్తిగా తెలుసుకోలేక పోతున్నాము. ఇహలోక संबंधమైనవాటిని కాకుండా ఆయన మనకు ఏమి ఇవ్వగలడు? అని ఒక సారి పరిశీలించనట్లయితే యోహాను సువిశేషం మొత్తం కూడా అదే మనకు ఆయన చెబుతున్నాడు.
యోహాను సువిశేషంలో అద్భుతాలను కేవలం "అద్భుతాలు" (Miracles) అని అనరు, వాటిని "సూచకక్రియలు" (Signs) అని పిలుస్తారు. ఒక సూచిక (Signboard) ఎప్పుడూ తనను తాను చూపించుకోదు, అది గమ్యస్థానాన్ని చూపిస్తుంది. అలాగే, యేసు చేసిన ప్రతి సూచకక్రియ ఆయన దైవత్వాన్ని, ఆయన పరలోక అధికారమును చూపిస్తుంది.
నీటిని ద్రాక్షారసముగా మార్చినప్పుడు ఆయన సృష్టిపై అధికారం గల దేవుడని రుజువైంది.
ఐదు రొట్టెలను ఐదు వేల మందికి పంచినప్పుడు ఆయన జీవాహారమైన దేవుడని వ్యక్తమైంది.
లాజరును లేపినప్పుడు ఆయన పునరుత్థానమును, జీవమును ఆయనే అని స్పష్టమైంది.
కానీ ప్రజలు ఆ సూచనలను చూసి, వాటి వెనుక ఉన్న దేవుని మహిమను ఆరాధించాల్సింది పోయి, ఆ సూచనల ద్వారా లభించే భౌతిక ప్రయోజనాలకే పరిమితమయ్యారు. మనం కూడా దేవుని హస్తాన్ని (హస్తం ఇచ్చే దీవెనలను) వెదకుతున్నామే కానీ, దేవుని ముఖాన్ని (ఆయన సన్నిధిని, స్వరూపాన్ని) వెదకడం లేదు. యోహాను సువిశేషం అంతటా యేసు తన్ను తాను బయలుపరచుకుంటూ, "నేనే మార్గమును, సత్యమును, జీవమును", "నేనే జీవాహారము" అని ప్రకటిస్తూ, భౌతికమైన వాటి కంటే ఆత్మీయమైన వాటిపై మన దృష్టిని మళ్లించమని కోరుతున్నారు.
జీవాహారము మరియు నిత్యజీవము
"అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు. నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు. మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించును." యేసు ప్రభువు మనకు ఏమేమి ఇవ్వగలడు మరియు మనము దేనికి శ్రమించాలి అనే విషయాలను ఇక్కడ యేసు ప్రభువు వెల్లడి చేస్తున్నారు. ఏమిటి శాశ్వతమైన భోజనం? ఆ భోజనము ఏమి ఇస్తుంది? యేసు ప్రభువు దీని గురించి తరువాత చెబుతారు, మోషే మీకు పరలోకము నుండి మన్న ఇవ్వలేదు. మనుష్య కుమారుడు మాత్రమే మీకు శాశ్వత భోజనము ఇస్తారు అని. ఆ శాశ్వత భోజనము ఏమి చేస్తుంది? అంటే నిత్య జీవనము ఇస్తుంది. యేసు ప్రభువు ప్రసాధించగలిగి మరలా ఎవరు ప్రసాదించలేనిది ఇదే. అదే నిత్య జీవము. प्रभुవు మనలను తన నుండి దానిని కోరుకోమని చెబుతున్నారు. ఎందుకంటే ఆయన మాత్రమే అది ప్రసాదించగలడు. అంతే కాదు తండ్రి దేవుడు ఆయనకు ఆ అధికారమును ఇచ్చిఉన్నారు.
ఇక్కడ యేసు ప్రభువు భౌతిక ఆహారానికి, ఆత్మీయ ఆహారానికి ఉన్న వ్యత్యాసాన్ని ఎంతో స్పష్టంగా వివరించారు. అరణ్యంలో ఇశ్రాయేలీయులు తిన్న 'మన్నా' తాత్కాలికమైనది. అది తిన్న వారి పితరులు ఆకలి తీర్చుకున్నారు కానీ కాలక్రమేణా మరణించారు. లౌకికమైన ఆహారం శరీరాన్ని మాత్రమే పోషిస్తుంది, కానీ అది మరణాన్ని ఆపలేదు. అయితే యేసు ఇచ్చే శాశ్వత భోజనము ఆత్మను పోషిస్తుంది. ఆ భోజనము మరేదో కాదు, యేసుక్రీస్తు శరీరము మరియు రక్తము, అనగా ఆయన త్యాగము మరియు ఆయన వాక్యము.
దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుకు ఒక ప్రత్యేకమైన ముద్రను, అనగా అధికారాన్ని ఇచ్చారు. ఈ లోకంలో ఏ ప్రభుత్వము, ఏ అధికారి, ఏ సంపద ఇవ్వలేని అత్యున్నత ఈవు 'నిత్యజీవము'. దానిని పొందుకోవడమే మానవ జీవితం యొక్క పరమార్థం. దాని కోసమే మనం నిజంగా శ్రమించాలి, ప్రయాసపడాలి.
దేవుని కార్యం - క్రీస్తునందు విశ్వాసం
దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలెను అని వారు అడిగినప్పుడు యేసు ప్రభువు వారికి తనను విశ్వసించమని చెబుతున్నారు. ఇక్కడ యోహాను సువిశేషం మనకు యేసు ప్రభువును విశ్వసించడం గురించి మనకు అనేక సార్లు గుర్తుచేస్తుంది. ఎందుకంటే యేసు ప్రభువును విశ్వసించే వారు ఎలా నిత్య జీవం పొందుతారో ఈ సువిశేషం మనకు వివరిస్తుంది. యేసు ప్రభువును విశ్వసించే వారు, విశ్వసించుట వలన నిత్య జీవం పొందుతారు, వారికి దేవుని బిడ్డలగు భాగ్యమును ఆయన ప్రసాదించారు. తండ్రి దేవుడు మన నుండి ఆశించేది ఏమిటి అంటే మనం తన కుమారుడయిన యేసు ప్రభువును విశ్వసించాలి అని, ఆ విశ్వాసం ద్వారా మనం రక్షణ పొందాలి దేవుడు ఆశిస్తున్నారు.
యూదులు ఎప్పుడూ క్రియల ద్వారా, ధర్మశాస్త్ర విధులను పాటించడం ద్వారా దేవునిని సంతోషపెట్టవచ్చని భావించేవారు. అందుకే వారు "మేము ఏమి క్రియలు చేయాలి?" అని అడిగారు. కానీ యేసు వారి ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చివేశారు. దేవునికి కావలసింది మానవ ప్రయాసతో కూడిన బాహ్య క్రియలు కాదు, హృదయపూర్వకమైన 'విశ్వాసం'. దేవుడు పంపిన రక్షకుడైన యేసుక్రీస్తును మెస్సయ్యగా, ప్రభువుగా అంగీకరించడమే దేవుని దృష్టిలో అత్యంత ప్రాముఖ్యమైన కార్యం.
విశ్వాసం అనేది కేవలం యేసు ఉన్నాడని నమ్మడం మాత్రమే కాదు; ఆయనను మన జీవితానికి అధిపతిగా స్వీకరించి, ఆయన వాక్యానుసారంగా జీవించడం. యోహాను సువిశేషం 1:12 లో చెప్పబడినట్లు, "తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము ఇచ్చెను." ఈ దైవిక భాగ్యం మనకు లభించాలంటే, మనం లౌకిక ఆశలను పక్కన పెట్టి, క్రీస్తుపై పరిపూర్ణ విశ్వాసం ఉంచాలి. తండ్రి అయిన దేవుని చిత్తమును నెరవేర్చడం అంటే కుమారుని విశ్వసించి, ఆయన ద్వారా నిత్యజీవ రక్షణ భాగ్యాన్ని ఉచితంగా పొందుకోవడమే.
ప్రార్దన : ప్రభువా ! మీరు మా మీద ఎంతో ప్రేమతో మమ్ములను ఎల్లప్పడు మీతో ఉండేలా, నిత్య జీవితాన్ని మాకు ఇవ్వాలి అని మా దగ్గరకు వచ్చి , మీరు అనేక అధ్బుతలు చేసి మీరు మాకు ఏమి ఇవ్వగలరో చూపించన కాని మేము మిమ్ములను అర్ధం చేసుకోవడంలో విఫలం చెందాము, మా తాత్కాలిక భాదలు నుండి సమస్యల నుండి ఉపశమనాన్ని మాత్రమే మిమ్ము కోరుతూ ఉన్నాము. మా అజ్ఞానం మీకు తెలుసు ప్రభువా మేము ఏమి కోరుకోవాలో కూడా తెలుసుకోలేని పరిస్థితులలో మేము ఉన్నాము అటువంటి సమయాలలో మమ్ము క్షమించండి. మేము ఏమి అడగాలో , ఏది శాశ్వతమో అది అశాశ్వతమొ మాకు తెలియజేయండి. మేము ఎల్లప్పుడూ అశాశ్వతమైన వాటి కోసం పని చేసే వారిగా మమ్ములను మలచండి. మీరు మాత్రమే ఇచ్చే ఆ నిత్యం జీవం కోసం పని చేసే వారిగా , మిమ్ము ఎప్పుడు విశ్వసించే వారిగా మమ్ము చేయండి. తండ్రి మా నుండి ఆశించే పనిని చెసేలా మమ్ము ఆశీర్వదించండి. ఆమెన్
Comments
మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:
Post a Comment