అనుగ్రహ పరిపూర్ణురాలు మరియమాత - లూకా 1:26-38 ధ్యానం | Carmel Shobha
లూకా 1:26-38
తదుపరి ఆరవమాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలీయసీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యేసేపునకు ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి, ఆమెతో "అనుగ్రహ పరిపూర్ణురాలా! నీకు శుభము. ఏలినవారు నీతో ఉన్నారు"అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలతచెంది ఆ శుభవచనము ఏమిటొ అని ఆలోచించుచుండగా దేవ దూత "మరియమ్మా! భయపడకుము. నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో! నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై, మహోన్నతుని కుమారుడని పిలువబడును. प्रभुవగు దేవుడు, తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు" అనెను. అంతట మరియమ్మ "నేను పురుషుని ఎరుగను కదా! ఇది ఎట్లు జరుగును?" అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను: "పవిత్రాత్మ నీపై వేంచేయును. సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్రశిశువు 'దేవు
1. గాబ్రియేలు దేవదూత పరంపర – దైవ సందేశ ప్రాముఖ్యత
పవిత్ర గ్రంథంలో గాబ్రియేలు దేవదూత ప్రత్యక్షత ఎల్లప్పుడూ మానవజాతి చరిత్రను మలుపు తిప్పే ఒక మహోన్నతమైన దైవ సంకల్పాన్ని ప్రకటిస్తుంది. పాత నిబంధనలో దానియేలు ప్రవక్తకు దర్శనమిచ్చి అంత్యదినముల గూర్చిన మర్మాలను, మెస్సయా రాకడ సమయాన్ని వివరించిన గాబ్రియేలు దూత, నూతన నిబంధనలో మొదట జెకర్యాకు దర్శనమిచ్చి రక్షకుని మార్గదర్శియైన యోహాను జననాన్ని ప్రవచించాడు. ఆ తదుపరి, మానవ రక్షణ ప్రణాళికలో అత్యంత కీలకమైన ఘట్టాన్ని ప్రకటించడానికి నజరేతు నగరంలో ఉన్న మరియమాత వద్దకు వస్తాడు. ఆయన దర్శనమిచ్చిన ప్రతిసారీ ఒక సాధారణమైన సమాచారాన్ని కాక, యుగయుగాల దేవుని రక్షణ ప్రణాళికకు సంబంధించిన ముఖ్యమైన సందేశమును తీసుకొని వస్తున్నాడు. ఇది దేవుడు తన ప్రజలను విడనాడలేదని, వారి విముక్తికై నిరంతరం కార్యం చేయుచున్నాడని నిరూపిస్తుంది.
2. నజరేతు నగరం మరియు దేవుని ఎంపిక
ఈ సువిశేషభాగంలో దైవదూత గలిలీయ సీమలోని నజరేతునగరంలో ఉన్న మరియమాత వద్దకు వస్తుంది. భౌగోళికంగా, చారిత్రకంగా చూస్తే నజరేతు ఒక వ్యాపార నగరం, రోమా సామ్రాజ్యం నుండి వర్తకానికి అనుకూలంగా ఉండే నగరం. విభిన్న సంస్కృతులు, వ్యాపార లావాదేవీలతో నిండిన ఆ కోలాహల నగరంలోనే సామాన్య జీవితాన్ని గడుపుతున్నారు మరియమ్మ, యోసేపులు. లౌకిక ప్రపంచం దృష్టిలో నజరేతు అంత ప్రాముఖ్యమైనది కాకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో అది ఒక పవిత్రమైన ప్రణాళికకు కేంద్రబిందువైంది. అక్కడ మరియ తల్లికి దేవదూత దర్శనం ఇస్తున్నాడు. లోకపు ఆర్భాటాలకు దూరంగా, నిరాడంబరంగా జీవిస్తున్న ఒక కన్యను లోకరక్షకునికి తల్లిగా ఎన్నుకోవడం ద్వారా, దేవుడు బాహ్య సౌందర్యాన్ని లేదా హోదాను కాక హృదయ శుద్ధిని చూస్తాడని స్పష్టమవుతుంది.
3. మరియమ్మ యవ్వనప్రాయం – పేదరికం మరియు వ్యక్తిత్వం
మరియమ్మ కన్య మరియు యవనప్రాయంలో ఉన్నది, పెళ్లి కాలేదు. కేవలం నిశ్చితార్ధం జరిగినది మాత్రమే. దేవుడు ఒక గొప్ప కార్యానికి ఆమెను ఉపయోగించుకొనుటకు, ఆమెలో వున్న ప్రత్యేకత ఏమిటో ఆమె దేవదూతతో మాటలాడిన మాటలు తెలియజేస్తాయి. సామాన్య మానవ దృక్పథంలో దేవుని కార్యం జరగాలంటే ఎంతో అర్హత, సంపద, లేదా సమాజంలో గొప్ప హోదా ఉండాలనుకుంటారు. కానీ, ఆమెకు ఉన్న పేదరికం, చిన్న వయస్సు ఇవి అన్ని కూడా దేవుని కార్యములో పాలుపంచుకొనుటకు ఆటంకం కాలేదు. దానికి ఆమె వ్యక్తిత్వం, దైవభీతి ఎంతగానో ఉపయోగపడింది. దేవున్ని మనం విశ్వసిస్తే మనకు ఉన్న బలహీనతలు, అడ్డంకులు, లేదా లోకసంబంధమైన కొరతలు ఏవి కూడా, దేవుని అనుగ్రహం పొందుటకు ఆటంకం కావు అని తెలుస్తున్నది. దేవునికి కావలసింది సంపూర్ణమైన హృదయ సమర్పణ మాత్రమే.
ఆత్మీయ సత్యం: మన నిస్సహాయత దేవుని శక్తికి ఆటంకం కాదు; మన అవిశ్వాసమే దేవుని అనుగ్రహానికి అడ్డుగోడ అవుతుంది.
4. దైవ అనుగ్రహం – కీర్తి మరియు సవాళ్లు
దేవుని అనుగ్రహం మనకు వెంటనే కీర్తిని, లౌకిక సుఖాలను తీసుకురాకపోవచ్చు. మరియమాత దేవునికి ఇచ్చిన మాట ఆమెకు వెంటనే సమాజంలో గౌరవాన్ని లేదా కీర్తిని తీసుకురాలేదు. బదులుగా, ఆమెకు అవమానాలు, అనుమానాలు, మరియు తిరస్కారాలు కూడా తీసుకువచ్చింది. నిశ్చితార్థం అయిన కన్య గర్భం దాల్చడం అనేది నాటి యూదా సమాజంలో ఎంతటి భయంకరమైన నిందకు, చట్టపరమైన శిక్షకు దారితీస్తుందో ఆమెకు తెలుసు. అయినప్పటికీ, దేవుని ప్రణాళికకు ఆమె సహకారం, దేవునికి ఆమె చూపిన అచంచలమైన విధేయత, దేవుని చిత్తమే ఆమె జీవితంలో జరగాలి అనే ఆమె కోరిక అన్ని కూడా ఆమె గొప్ప తనాన్ని చాటుతున్నవి.
"నేను దేవుని దాసురాలను" అనే ఆమె మాట, ఆమెకు ఎదురయ్యే వ్యతిరేక పరిస్థితులలో కూడా దేవుని ప్రణాళికే జరగాలని ఆమె నిశ్చయించుకున్నట్లు చూపిస్తుంది. దేవుని ప్రణాళికకు ఆమె విధేయించడం వలన, లోక రక్షణ మార్గం సుగమమైంది. ఆమె చూపిన ఆత్మసమర్పణ ద్వారా యేసు ప్రభువు లోక రక్షకునిగా మనలను పాపముల నుండి రక్షించుటకు వస్తున్నారు.
5. యేసు నామ వైశిష్ట్యం – రక్షణ మరియు నిత్యజీవం
హీబ్రూ భాషలో 'యేసు' అంటే 'దేవుడు రక్షించును' అని అర్థం. దేవదూత ప్రకటించినట్లు, యేసు ప్రభువు తన ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తారు. పాత నిబంధనలో మోషే తదనంతరం యోహోషువా ఇస్రాయేలు ప్రజలను నడిపించి, ఐగుప్తు దాసత్వం నుండి విడిపించి వాగ్ధాన భూమియైన కానానుకు తీసుకుపోతున్నాడు. ఆయన కేవలం ఇహలోక సంబంధమైన రాజ్యానికి నడిపించాడు. కానీ, నూతన యోహోషువాయైన యేసు ప్రభువు మనలను పాపపు దాసత్వం నుండి విడిపించి, పరలోక రాజ్యమైన నిత్య జీవానికి తీసుకెళుతారు.
అందుకే యేసు ప్రభువు పేరు అత్యంత శక్తివంతమైనది. నేటికీ ఆ నామం మీద ప్రజలు పాప క్షమాపణ, శాంతి మరియు వివిధ శారీరక, ఆత్మిక స్వస్థతలు పొందుతున్నారు. ఒక సామాన్య కన్యకకు పురుషుని ప్రమేయం లేకుండా యేసు ప్రభువు పుట్టడం అనేది మానవ మేధస్సుకు, హేతువాదానికి అందని విషయం. సమాజానికి ఈ విషయముల మీద నమ్మకం కలగడం చాలా కష్టముగా ఉండవచ్చు. కానీ, కేవలం విశ్వాసము మాత్రమే మనకు ఈ దైవిక మర్మములపై వెలుగును ఇస్తుంది.
గాబ్రియేలు దేవదూత ఈ అద్భుతాన్ని మరియమ్మకు వివరించిన తీరు విశిష్టమైనది. అది ఏమిటి అంటే, "దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు." సృష్టికర్త అయిన దేవుడు భౌతిక నియమాలకు అతీతుడు. యేసు ప్రభువు, మరియతల్లి కన్య గర్భము ద్వారా, మానవజాతికి సహజంగా సంక్రమించే ఏ పాపమలినం సోకకుండా, పరిశుద్ధునిగా ఈ లోకమునకు వస్తున్నాడు.
6. మరియమాత ఔన్నత్యం మరియు ఎదుర్కొన్న సాహసం
మరియమాత ఔన్నత్యం ఏమిటి? మరియమాత దేవుని ప్రణాళిక జరుగుటకు ఏమి చేసినదో లోతుగా ఆలోచిస్తే ఈ విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. "ఇదిగో నేను దేవుని దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక" అని పలికిన మరియమాత చేసిన సాహసం చాలా గొప్పది మరియు ఊహాతీతమైనది.
సామాజిక తిరస్కారం: ఆమె పురుషుని ప్రమేయం లేకుండా బిడ్డను కన్నది అంటే, ఆ కాలంలో ఎవరూ నమ్మరు.
కుటుంబ సమస్యలు: తన భర్త కాబోయే యోసేపు తనను అర్థం చేసుకోక, రహస్యంగానో లేదా బహిరంగంగానో విడిచిపెడితే, ఆమె ఘోరమైన అవమానం పొందవచ్చు. తన తండ్రి, తల్లి మరియు బంధువులు కూడా ఆమెను పాపిగా చూసి పక్కన పెట్టే ప్రమాదం ఉంది. అప్పుడు ఆమె సమాజంలో ఒక అనాథలా మారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.
మరణ శిక్ష భయం: ధర్మశాస్త్రం ప్రకారం, నిశ్చితార్థం జరిగిన స్త్రీ ఇతరుల వల్ల గర్భవతి అయితే ఆమెను ఊరి వెలుపలికి తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపాలి. యోసేపు ఈ విషయమును మత పెద్దల వద్దకు తీసుకువెళితే, ఆమెకు మరణ శిక్ష విధించే అవకాశం లేకపోలేదు.
ఇటువంటి భయంకరమైన పరిస్థితులు తన కళ్లముందు కనిపిస్తున్నప్పటికీ, ప్రాణ సంకటాన్ని కూడా లెక్కచేయకుండా, "దేవుని చిత్తము నా జీవితంలో జరగాలి" అని ఆమె దృఢంగా నిర్ణయించుకున్నది. ఈ ఆత్మత్యాగమే ఆమెను సర్వతరముల వారికీ ధన్యురాలిగా మార్చింది.
7. అవిశ్వాసానికి, విశ్వాసానికి మధ్య వ్యత్యాసం
దేవునికి అసాధ్యం అయ్యేది ఏది లేదు అని గాబ్రియేలు దేవదూత చెప్పిన మాటలను మరియమాత సంపూర్ణంగా నమ్మింది. బైబిల్ చరిత్రలో దేవుని వాగ్దానాలను విన్నప్పుడు వేర్వేరు వ్యక్తులు వేర్వేరుగా స్పందించారు.
పాత నిబంధనలో అబ్రాహాము భార్యయైన సారా పెద్దావిడ అయినప్పటికీ, ఆ వయసులో ఆమె గర్భం దాల్చుతుందని దూత చెప్పినప్పుడు, ఆమె దేవుని మాటను నమ్మక నవ్వుతుంది.
నూతన నిబంధనలో అర్చకుడైన జెకర్యా దేవుని మాటను నమ్మక, వృద్ధాప్యంలో ఇది ఎలా సాధ్యం అని సందేహించి, దేవుని ద్వారా మూగవాడిగా మార్చబడ్డాడు.
కానీ మరియమాత మాత్రం, పురుషుని ప్రమేయం లేకుండా ఇది ఎలా సాధ్యం అనే సహజమైన సందేహాన్ని వెల్లడిచేసినప్పటికీ, దూత ఇచ్చిన వివరణతో తృప్తి చెందింది. దేవునికి అసాధ్యం అయ్యేది ఏమీ లేదని గ్రహించి, ఎటువంటి అపనమ్మకం లేకుండా, "నీవు చెప్పినట్లు నాకు జరుగునుగాక" అని తలవంచింది. తాను దేవుని దాసురాలనని, తాను దేవుని చిత్తం నెరవేర్చడానికి ఏ త్యాగానికైనా, అవమానానికైనా సిద్ధం అని తెలియజేస్తుంది. దేవుని నమ్మే ప్రతి వ్యక్తి కూడా తన జీవితాన్ని దేవుని చేతుల్లో ఇలా సమర్పించుకున్నట్లయితే, లోక దృష్టిలో వారు ఏ స్థితిలో ఉన్నా, దేవుని రాజ్యంలో గొప్ప వారిగా మిగిలిపోతారు.
ప్రభువుతో సంభాషణ మరియు ప్రార్ధన: ప్రభువా! మీరు ఎంత ప్రేమమయులు, మీరు మమ్ములను రక్షించుటకు, మీ దూతను, మీ దాసురాలీ దగ్గరకు పంపి, మీ ప్రణాళికను తెలుపుతున్నారు. మీరు ఎప్పుడు మానవుడు రక్షించబడాలి, ఉన్నత జీవతం జీవించాలని కోరుకుంటున్నారు. ప్రభువా! మీరు ఎప్పుడు మరియమాతతో ఉన్నారు. ఆమెతో ప్రతిక్షణం మీరు ఉన్నారు. ఆమెతో మీరు ఉండుట వలన ఎటువంటి తప్పు లేకుండా జీవించకలిగి, మీకు ఇష్టమైన జీవితం జీవించినది. ప్రభువా! మరియమాతతో ఉన్నట్లు మాతో కూడా ఎల్లప్పుడు ఉండండి. మేము కూడా మీకు ఇష్టమైన జీవితం జీవించేలా చేయండి. ప్రభువా! దేవదూత మరియమాత దగ్గరకు వచ్చి అనుగ్రహపరిపూర్ణురాల అని చెబుతుంది. ఆమె ఎలా అనుగ్రహ పరిపూర్ణురాలు అయ్యిందో, మమ్ములను కూడా మీ అనుగ్రహములతో నింపండి. ప్రభువా! మరియమాత, గాబ్రియేలు దేవదూతతో, "నేను దేవుని దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక" అని చెబుతుంది. ఆ తల్లి దేవుని చిత్తము తన జీవితంలో జరుగుటకు తనను తాను, దేవుని దాసురాలుగ మార్చుకుంది. మీ చిత్తం చేయడమే తన జీవితంలా అనుకున్నది. మేము కూడా మీ చిత్తం నెరవేర్చడానికి, మమ్ములను మేము మీ దాసులుగా చేసుకునేలా చేయండి. ఆమెన్.
Comments
మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:
Post a Comment