మనుష్యులను పట్టు జాలరులు: లూకా 5:1-11 | కార్మెల్ శోభ
లూకా 5: 1-11
యేసు ఒక పర్యాయము గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచియుండగా జనసమూహము దేవుని వాక్కును ఆలకించుటకు ఆయనయొద్దకు నెట్టుకొనుచు వచ్చిరి. ఆయన అచట రెండు పడవలను చూచెను. జారరులు వాని నుండి దిగి తమ వలలను శుభ్రపరచుకొనుచుండిరి. అందులో ఒకటి సీమోను పడవ. యేసు ఆ పడవనెక్కి దానిని ఒడ్డుననుండి లోనికి త్రోయమని, అందు కూర్చుండి ప్రజలకు ఉపదేశింప ఆరంభించెను. ఉపదేశించుట ముగించిన పిదప యేసు సీమోనుతో "మీరు పడవను ఇంకను లోతునకు తీసికొని వెళ్లి చేపలకై మీ వలలను వేయుడు" అనెను అందుకు సీమోను "బోధకుడా! మేము రాత్రి అంతయు శ్రమించితిమి. కాని ఫలితము లేదు. అయినను మీ మాట మీద వలలను వేసెదము" అని ప్రత్త్యుత్తరము ఇచ్చెను. వల వేయగనే, వల చినుగునన్ని చేపలు పడెను. అంతట జాలరులు రెండవ పడవలోనున్న తమ తోటి వారికి, వచ్చి సహాయము చేయుడని ప్రాధేయపడగా, వారు వచ్చి రెండు పడవలను చేపలతో నింపగనే పడవలు మునుగునట్లు ఉండెను. సీమోను పేతురు ఇది చూచి యేసు పాదములపై పడి "ప్రభూ ! నేను పాపాత్ముడను. నన్ను విడిచిపొండు" అని పలికెను. ఇన్ని చేపలు పడుట చూచి సీమోను, అతని తోటి వారు ఆశ్చర్యపడిరి. సీమోనుతో ఉన్న జెబదాయి కుమారులు యాకోబు, యోహానులును అట్లే ఆశ్చర్యపడిరి. యేసు అపుడు సీమోనుతో "భయపడవలదు. ఇక నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉందువు"అనెను. ఆజాలరులు పడవలను ఒడ్డునకుచేర్చి తమ సమస్తమును విడిచి పెట్టి యేసును అనుసరించిరి.
దేవుని వాక్కు యొక్క జీవము
దేవుని వాక్కును ఆలకించుటకు ప్రజలు నెట్టుకొనుచు ప్రభువు వద్దకు వస్తున్నారు. ప్రభువు వాక్కు దేవుని వాక్కు. ఆయన వాక్కు అధికారముతోను, సూచక క్రియలతోను, అద్భుతాలతోను, జాలి, దయ మరియు విడుదలతోను కూడి ఉన్నది. దేవుని వాక్కు ప్రజలకు అనేక సందర్భంలో వస్తుంది. కాని యేసు ప్రభువె దేవుని వాక్కు. ప్రజలకు అనేక సంవత్సరాలుగా దేవుని వాక్కును వినిపించే వారు లేరు. యేసు ప్రభువుతోటి మరల దేవుని వాక్కును వింటున్నారు. దేవుని వాక్కును వినుటకు ప్రజలు ఎంతో ప్రేమతో, ఆశతో వస్తున్నారు. ఏమిటి ఈ దేవుని వాక్కు? ఈ వాక్కు ఏమి చేస్తుంది?
దేవుని వాక్కు జీవం అయి ఉన్నది. వాక్కు దేవుడే. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడై మన మధ్య ఉండెను అన్న సత్యం ఇక్కడ మనకు స్పష్టమవుతోంది. ఈ వాక్కు కేవలం జీవం మాత్రమే కాదు మానవునికి భరోసాను ఇస్తుంది. నిరాశలో ఉన్న నిరుపేదకు, కష్టాలలో నలిగిపోతున్న సామాన్యునికి ఆదరణ కలిగిస్తుంది. దేవుని వాక్కు ధైర్యాన్ని ఇస్తుంది. లోకంలో ఎన్ని ఆపదలు చుట్టుముట్టినా, దేవుని వాక్యం హృదయంలో ఉంటే కొండంత అభయం లభిస్తుంది.
"చీకటిలో నడుస్తున్న మానవాళికి వాక్కు వెలుగునిస్తుంది."
అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్న వారికి ఈ వాక్కు వివేకాన్ని ఇస్తుంది. లోక జ్ఞానం కేవలం భౌతిక అవసరాలకు మాత్రమే ఉపయోగపడుతుంది, కానీ దైవజ్ఞానం ఆత్మను రక్షిస్తుంది. ఈ వాక్కు మానవుని వక్ర మార్గాలను సరిచేస్తుంది. లోక ఆశల వైపు, పాపభూయిష్టమైన మార్గాల వైపు నడిచే మానవ హృదయాన్ని దేవుని వైపునకు మళ్ళించే శక్తి కేవలం దైవ వాక్యానికే ఉంది. ఈ వాక్కు మానవుడు చేసిన పాపాలకు ప్రశ్చాత్తాపము పొందేలాగా చేస్తుంది. అది మన అంతరాత్మను మేల్కొల్పుతుంది, మన తప్పులను మనకు గుర్తుచేసి, దేవుని సన్నిధిలో మోకరిల్లేలా చేస్తుంది. ఈ వాక్కు మనలను పాపవిముక్తులను చేస్తుంది. యేసు క్రీస్తు నోటి నుండి వచ్చిన ప్రతి మాట పాపిని పరిశుద్ధునిగా మార్చే అమృతధార. ఈ వాక్యం మనకు మంచినే అనుసరించే శక్తిని ఇస్తుంది. మనకు లోకంలో ఎన్నో ఆకర్షణలు, శోధనలు ఎదురైనప్పటికీ, వాటిని ఎదిరించి కేవలం సత్మార్గాన్ని ఎంచుకునే ఆధ్యాత్మిక బలాన్ని వాక్యం మనకు ప్రసాదిస్తుంది. యేసు ప్రభువు దగ్గరకు ప్రజలు ఈ వాక్కును వినడానికి, పొందడానికి వస్తున్నారు.
దేవుని వాక్కు ద్వారా నూతన జీవము – మానవునితో అనుబంధం
ప్రజలను చూసి వారికి ప్రభువు దేవుని వాక్కును వినిపిస్తున్నారు. దేవుని వాక్కును వింటున్న ప్రజలు ప్రభువు దగ్గర నుండి జీవం పొందుతున్నారు. విశ్వాసం పొందుతున్నారు. అప్పటివరకు విశ్వాసంలో బలహీనపడి, దేవుడు తమను మరచిపోయాడేమోనని భావించిన ప్రజలు, యేసు ప్రభువుని బోధలను విన్నప్పుడు తమ జీవితాలలో దేవునికి వారికి మధ్య ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు, మరియు నుత్నికరించుకుంటున్నారు.
మనుష్యుడు దేవుని రూపంలో, పోలీకలో సృష్టించబడ్డాడు, కానీ పాపం వల్ల ఆ బంధం తెగిపోయింది. యేసు ప్రభువు ఆ తెగిపోయిన బంధాన్ని తిరిగి ముడివేస్తున్నారు. ప్రభువు మాటలు విన్న వారు దేవుని సాన్నిధ్యాన్ని పొందుతున్నారు. ఆ సాన్నిధ్యం హృదయానికి గొప్ప శాంతిని ఇస్తుంది. ప్రభువు వద్ద నుండి ప్రజలు వాక్కును పొందటం ద్వార మరియు ఆయన వద్దకు రావడం ద్వారా దేవునితో సఖ్యతను ఏర్పరుచుకుంటున్నారు.
ప్రభువు దగ్గర వాక్కు వినుట వలన ప్రజలు నూతన జీవాన్ని పొందుతున్నారు. పాత జీవితంలోని నిరాశ, నిస్పృహలు తొలగిపోయి, సరికొత్త ఆశలు చిగురిస్తాయి. ప్రభువు వాక్కును వినడం వలన వారికి కలిగే ప్రయోజనాలు ఆ ప్రజలకు తెలుసు, వారు అనుభవపూర్వకంగా ఇది తెలుసుకున్నారు. ఎంతో మందిని ఆయన స్వస్థ పరచడం జరిగింది. కుష్టు రోగులు శుద్ధి పొందారు, గ్రుడ్డివారు చూపు పొందారు, పక్షవాత రోగులు నడిచారు. ఈ అద్భుతాలన్నీ చూసిన ప్రజలు, ఆయన కేవలం ఒక సాధారణ మనుష్యుడు కాదని, దేవుని శక్తే మానవరూపంలో వచ్చిందని గ్రహించారు. కనుకనే ఆయన మాటలు వినడానికి ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు.
లౌకిక శ్రమ మరియు దైవిక ఆజ్ఞపై విశ్వాసము
అక్కడ ఉన్న జాలరులు ప్రభువుకు తన వాక్కును అందించడానికి, పడవనిచ్చి అక్కడ కూర్చొనడానికి సహాయం చేశారు. యేసు ప్రభువు పరిచర్యకు భౌతిక సాధనాలు అవసరమైనప్పుడు సీమోను పేతురు తన పడవను ఇచ్చి సహకరించాడు. ఇది మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. మనకున్న దేనినైనా ప్రభువు పరిచర్యకు సమర్పించినప్పుడు, ఆయన దానిని ఆశీర్వదించి మనకు వందంతలుగా తిరిగి ఇస్తాడు.
ప్రభువు వాక్కు ఆ జాలరులు కూడా విన్నారు. పడవలో కూర్చుని యేసు ప్రజలకు బోధిస్తున్నప్పుడు, పడవను ఒడ్డున నిలిపి వలలు కడుగుతున్న జాలరులు ఆ మాటలను శ్రద్ధగా ఆలకించారు. ప్రభువు గొప్పవారు అని వారికి తెలుసు. దేవుని వాక్కు వినిన వారికి ఆయన వాక్కు యొక్క శక్తి కూడా తెలుసు. వారు ఆ రాత్రి మొత్తం చేపల కోసం శ్రమించారు అయినప్పటికీ వారికి ఏమి దొరకలేదు. జాలరుల జీవితంలో రాత్రి వేళ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే చేపలు రాత్రి పూట లోతు జలాల నుండి పైకి వస్తాయి, కాబట్టి రాత్రి వేళ చేపలు పట్టడం సులువు. ఆ రాత్రి అంతా వారు ఎంతో కష్టపడ్డారు, నైపుణ్యంతో వలలు వేశారు, శారీరక శ్రమ చేశారు, కానీ ఒక్క చేప కూడా పడలేదు. ఉదయానికి వారు తీవ్రమైన అలసటతో, నిరాశతో, ఖాళీ చేతులతో మిగిలిపోయారు.
అందరి అవసరాలను చూసే ప్రభువు, రోగాలను తగ్గించే ప్రభువు, జీవాన్ని ఇచ్చే ప్రభువు, వీరి అవసరాన్ని గురించలేరా? ఖచ్చితంగా గుర్తించగలడు. మన హృదయ అంతరంగాలను ఎరిగిన దేవుడు మన శ్రమను, మన కన్నీళ్లను ఎన్నటికీ నిర్లక్ష్యం చేయడు. ఆ ప్రభువు వారి అవసరమును, వారి నిరాశను గుర్తించి, వారికి చేపలు పడుటకు వలను ఎక్కడ వెయ్యాలో చెబుతున్నారు. చేపలు పట్టడంలో నిపుణుడైన సీమోనుకు, వృత్తి పరంగా ఎలాంటి అనుభవం లేని ఒక బోధకుడు వల ఎక్కడ వేయాలో చెప్పడం వింతగా అనిపించవచ్చు. కాని దానికి వారు ప్రభువుతో 'మేము రాత్రి మొత్తం శ్రమించాము కాని ఫలితము లేదు' అని తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇది మానవ సహజమైన బలహీనత మరియు నిరాశకు ప్రతీక. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఎంత కష్టపడినా ఫలితం లేనప్పుడు ఇలాగే నిరాశకు గురవుతాము.
అయితే, సీమోను అక్కడ ఆగిపోలేదు. ప్రభువు మీద వున్న విశ్వాసంతో, సముద్రము మీద వారికి ఉన్న అనుభవాన్ని, ఇంతకాలం వారు పనిచేసిన పరిజ్ఞానాన్ని పక్కన పెట్టి, ప్రభువు మాట ప్రకారం, ప్రభువు చెప్పినట్లు తమ వలలను వేస్తున్నారు.
నా అనుభవం శూన్యమని తేలింది, కానీ నీ మాటపై నాకు నమ్మకం ఉంది అనే శరణాగతి భావమే ఇక్కడ అద్భుతానికి కారణమైంది.
వారికీ ఆశ్చర్యకరంగా వారి వల చినుగునన్ని చేపలు పడుతున్నవి. మానవ జ్ఞానం ముగిసిన చోట దేవుని కార్యం ప్రారంభమవుతుంది అనడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం.
దైవిక సమృద్ధి మరియు మానవుని పశ్చాత్తాపము
ప్రభువు మాట వినుట వలన వచ్చే ప్రయోజము ఏమిటో మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ప్రభువు మాట వినుట వలన మనకు ఎప్పుడు సమృద్ధి కలుగుతుంది. దేవుడు ఇచ్చే ఆశీర్వాదం కొద్దిగా ఉండదు, అది మన పాత్రలు నిండి పొర్లిపోయేలా ఉంటుంది. అది ఎటువంటి సమృద్ధి అంటే కేవలం వారికి మాత్రమే కాక అనేక మంది ప్రయోజనం పొందే విధంగా కలుగుతుంది. దేవుని ఆశీర్వాదం స్వార్థపూరితమైనది కాదు. అది సమాజానికి, తోటివారికి కూడా మేలు కలిగిస్తుంది. అందుకే తోటి వారు సహాయము చేయుటకు అక్కడకు వస్తున్నారు. సీమోను ఒంటరిగా ఆ ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోయాడు, రెండవ పడవలోని జాలరులను పిలిచాడు. రెండు పడవలు నిండాయి. మన జీవితంలో దేవుడు ఇచ్చే కృపను మనం కూడా ఇతరులతో పంచుకోవాలనే సత్యాన్ని ఇది బోధిస్తోంది.
పేతురు గారు ఇది చూసి ప్రభువు పాదములపై పడి "నేను పాపాత్ముడను నన్ను విడిచిపెట్టి వెళ్ళండి" అని అంటున్నారు. ఎందుకు పేతురుగారు నేను పాపాత్ముడను నన్ను విడిచిపెట్టి వెళ్ళండి అని అంటున్నారంటే, పేతురుకి తన జీవితం మొత్తం గుర్తుకు వస్తుంది. ఆ రోజు వరకు పేతురు గారు చేపలు పట్టే వృత్తిలోనే ఉన్నాడు. ఎప్పుడు, ఎక్కడ చేపలు ఉంటాయో వారి అనుభవపూర్వకంగా తెలుసు. పేతురుకు తన అనుభవం మీద, తన వృత్తి మీద అపనమ్మకం లేదు. కాని తనకు తెలియని విషయం, తన అనుభవానికి మించిన జ్ఞానము ప్రభువు దగ్గర ఉన్నది అని ఆయనకు తెలుస్తుంది. ప్రకృతిని, సముద్రపు జీవరాశులను సైతం శాసించగలిగే శక్తి యేసుకు ఉందని పేతురు గ్రహించాడు.
ప్రభువు కేవలం ఒక ప్రవక్త కాదని, దేవుని రక్షకుడని, ప్రభువు పావనుడని ఆయనకు తెలుస్తుంది. దేవుని పరిశుద్ధతను చూసినప్పుడు మానవుడు తన స్వంత పాపస్థితిని గుర్తిస్తాడు. వెలుగు వచ్చినప్పుడు చీకటి ఎలా బయటపడుతుందో, యేసు అనే పరిశుద్ధ వెలుగు ముందు పేతురు తన అంతరంగంలోని అపవిత్రతను చూసుకున్నాడు. తన పాప జీవితం లేక తన సాధారణ జీవితం, తాను జీవించే జీవితం అంత పావనమైనది కాదని ఆయన గ్రహించాడు. కనుక ప్రభువు అంతటి పావనుని సహచర్యంలో ఉండుటకు నేను అర్హుడను కాను అని తెలుసుకుంటున్నారు. పరిశుద్ధుడైన దేవుని పక్కన నిలబడే యోగ్యత తనకు లేదని భావించి, భయభక్తులతో "ప్రభువా నన్ను వదలి పొమ్ము" అని అంటున్నారు.
కానీ ప్రభువు మాత్రం పేతురుతో "భయపడవలదు" అని ధైర్యాన్ని ఇస్తున్నాడు. దేవుడు పాపిని దూరంగా నెట్టివేసేవాడు కాదు, పాపాన్ని అసహ్యించుకుని పాపిని ప్రేమించే కరుణామయుడు. పేతురును ప్రభువు మనుషులను పట్టేవానిగా చేస్తాను అని అభయమిచ్చి పేతురును దీవిస్తున్నాడు. సముద్రంలో చనిపోయే చేపలను పట్టే వృత్తి నుండి, లోకమనే సముద్రంలో నశించిపోతున్న మనుషుల ఆత్మలను రక్షించి జీవములోనికి నడిపించే ఉన్నతమైన దైవిక వృత్తికి పేతురును యేసు పిలిచాడు. తరువాత పేతురు ప్రభువు శిష్యునిగా అనేక మందిని ప్రభువు అనుచరులుగా మారుస్తున్నారు. తన సర్వస్వాన్ని విడిచిపెట్టి, క్రీస్తు కొరకు జీవించి, చివరికి సువార్త కొరకు ప్రాణాలర్పించే స్థాయికి పేతురు ఎదిగాడు.
ప్రార్థన
ప్రభువా! మీ వాక్కు ఎంత మధురమైనది. లోకంలోని ఏ సంపద, ఏ పదవి ఇవ్వలేని తృప్తిని మీ మాటలు మాకు ఇస్తున్నాయి. మీ వాక్కు వినుటకు ప్రజలు ఎంతో ఆశతో, ఆకలిగొన్న హృదయాలతో వస్తున్నారు. మీ వాక్కు కేవలం అక్షరాల సమాహారం కాదు, అది హృదయాలను కదిలించే శక్తి. మీ వాక్కు వినుట వలన మాకు జరిగే ప్రయోజనము ఏమిటో మేము తెలుసుకుంటున్నాము. చీకటిలో ఉన్న మా జీవితాలకు మీ మాట వెలుగునిస్తుంది. నిరాశలో ఉన్న మాకు నిరీక్షణను ఇస్తుంది. అందుకు మీ వాక్కు వినుటకు అందరు వస్తున్నారు. ప్రభువా, మీ మాట వినుట వలన మా జీవితంలో ఏమి కలుగుతుందో, మీ మాటను ఆలకించి చేపల కోసం వలను వేసిన వారి ద్వారా తెలుసుకుంటున్నాము. మా స్వంత జ్ఞానము, మా లోకపు అనుభవము విఫలమైన చోట, మీ ఒక్క మాట అద్భుతాలను సృష్టిస్తుంది. పేతురు తన అనుభవాన్ని పక్కన పెట్టి మీ మాటపై విశ్వాసము ఉంచాడు, అందుకే అతని వలలు నిండాయి. మా జీవితాలలో కూడా మా ప్రయత్నాలు విఫలమైనప్పుడు, మీ మాటపై నమ్మకము ఉంచే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. ప్రభువా, మీరు ఓ సాధారణ చేపలు పెట్టె వ్యక్తిని మనుషులను పట్టే వానిగా చేస్తున్నారు. ఒక సామాన్య జాలరిని లోకాన్ని రక్షించు సువార్తికునిగా మార్చిన మీ ప్రేమ అద్భుతమైనది. మా బలహీనతలను చూసి మమ్ములను త్రోసివేయక, మీ పరిచర్య కొరకు మమ్ములను ఎన్నుకునే మీ దయా హృదయానికి వందనములు. మా జీవితాలను కూడా మీ చేతుల్లో పెడుతున్నాము, మమ్ములను మీ చిత్తప్రకారం వాడుకొనండి. ప్రభువా! మీ వద్దకు ప్రజలు దేవుని వాక్కును వినడం కొరకు ఎంతో ఆశతో వస్తున్నారు. మీ దగ్గరకు వచ్చిన వారిని ఎంతో ఆనందంగా మీరు పంపుతున్నారు. వారు వారి వారి సమస్యల నుండి వారికి విముక్తిని ఇస్తున్నారు. తండ్రితో వారి బంధాన్ని నుత్నికరించుకుంటున్నారు. అంతేకాక మీ మాటలు వినుట వలన ఎలా వలల నిండాచేపలు పడ్డాయో చూసి పేతురు మరియు జెబదాయి కుమారులు ఆశ్చర్యపోతున్నారు. మీరు పావనమూర్తి అని తెలుసుకుంటున్నారు. మేము మేము కూడా మిమ్ములను తెలుసుకొని, మా సమస్యల నుండి విముక్తి పొందేలా చేయండి. ఆ జాలరుల వలె మిమ్ము అనుసరించే అనుగ్రహం దయచేయండి ఆమెన్.
Comments
మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:
Post a Comment