మార్కు 16:9-15 | యేసు పునరుత్థాన దర్శనాలు మరియు అవిశ్వాసానికి విరుగుడు
మార్కు 16: 9-15
యేసు పునరుత్థానం - అవిశ్వాసనికి విరుగుడు
మగ్ధలా మరియమ్మకు మొదట దర్శనమిచ్చెను: కృపకు దక్కిన ప్రథమ స్థానం
యేసు ప్రభువు పునరుత్థానమైన తర్వాత, తనను తాను మొదటగా ఒక స్త్రీకి దర్శనము ఇచ్చుట ద్వారా లోకపు విలువల కంటే దేవుని కృప ఎంత ఉన్నతమైనదో నిరూపించారు. మొదటి శతాబ్దపు యూదయ సమాజంలో, మరియు యేసు ప్రభువు కాలములో ఒక స్త్రీకి సమాజంలో అంతటి ప్రాముఖ్యత ఉండేది కాదు. న్యాయస్థానాలలో కూడా స్త్రీల సాక్ష్యానికి చట్టబద్ధమైన విలువ ఉండేది కాదు. ఇటువంటి సామాజిక పరిస్థితుల్లో, మానవజాతి చరిత్రలోనే అత్యంత ప్రాముఖ్యమైన "పునరుత్థాన వార్త"ను ప్రకటించే మొదటి సాక్షిగా దేవుడు ఒక స్త్రీని ఎన్నుకోవడం విప్లవాత్మకమైన మార్పు.
మరియు ఈ మరియమ్మ సామాన్యమైన స్త్రీ కాదు, ఒకప్పుడు ఆమె నుండి ప్రభువు ఏడు దయ్యములను వదలకొట్టాడు. తీవ్రమైన వేదన, అపవిత్రత, మానసిక బంధనాల నుండి యేసు ద్వారా ఆమె విముక్తి పొందింది. లోకం ఒక వ్యక్తి యొక్క గతాన్ని బట్టి వారిని అంచనా వేస్తుంది, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. ప్రభువు మనకు దర్శనము ఇవ్వడడానికి మన గత జీవితం ఏమిటి? మనకు సమాజం ఇచ్చే ప్రాముఖ్యత ఏమిటి? అనేవి ఏమి ప్రభువు పరిశీలించరు. ఆయనకు కావలసింది విరిగి నలిగిన హృదయం, కృతజ్ఞతా భావం మాత్రమే.
మనకు ప్రభువు మీద చూపించిన ప్రేమకు కృతజ్ఞత కలిగిఉంటే చాలు. ఆయన మనము మరచిపోలేని మేలులను మనకు చేస్తారు. అంతకంటే ఎక్కువగా, ఆయన పాదాల చెంత చేరిన వారిని లోకం తృణీకరించినా, దేవుడు వారిని హెచ్చిస్తాడు. అంతేకాక మనలను ప్రత్యేక వ్యక్తులుగా తీర్చిదిద్దుతారు. అనేక మందికి ఆదర్శవంతులుగా తయారుచేస్తారు. మగ్ధలా మరియమ్మ జీవితంలో ఇదే జరిగింది. ఒకప్పుడు దయ్యాల బంధనాల్లో ఉన్న ఆమె, పునరుత్థాన ప్రభువుకు మొదటి అపొస్తలురాలిగా (Messenger to the Apostles) మార్చబడింది.
ఈ మరియమ్మ అనేక బంధనాలనుండి విముక్తి పొందింది. ఈ విముక్తి కేవలం శారీరకమైనది లేదా మానసికమైనది మాత్రమే కాదు, అది సంపూర్ణ ఆధ్యాత్మిక స్వతంత్రత. నేడు మన జీవితాలలో కూడా అనేక పాపపు అలవాట్లు, లోకపు విచారాలు, మానసిక ఒత్తిళ్లు మనల్ని బంధిస్తూ ఉండవచ్చు. అయితే, ప్రభువు మాటలకు అణువుగా మనం ఉంటే మన జీవితం కూడా ఎటువంటి లోక శక్తులకు బానిసలు కాకుండా ఎల్లప్పుడు స్వతంత్రులుగా జీవించగలుగుతాం. క్రీస్తు ఇచ్చే స్వతంత్రత మనల్ని సత్యం వైపు నడిపిస్తుంది.
ప్రభువు దర్శనం గురించి నమ్మకపోవుట: భయాలు - సందేహాల ముసుగు
మగ్ధలా మరియమ్మ ఎంతో ఉత్సాహంతో, సంతోషంతో వెళ్లి శిష్యులకు సమాచారం అందించినప్పుడు వారి నుండి ఆశించిన స్పందన రాలేదు. దుఃఖంలో ఉన్న శిష్యులకు ప్రభువు ఓదార్పు ఇవ్వడానికి ఎంతగానో వారికి అనేక పర్యాయాలు కనబడుతున్నప్పటికీ శిష్యులు నమ్మలేదు. ఈ అవిశ్వాసానికి వెనుక ఉన్న కారణాలను మనం లోతుగా పరిశీలించాలి. వారికి నమ్మకము కలుగక పోవడానికి కారణం పకృతి విరుద్ధంగా ఉన్న మరణం నుండి లేవడం అనేది నమ్మదగినదిగ లేకపోవడం. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మరల సజీవంగా తిరిగి రావడం అనేది మానవ మేధస్సుకు, ప్రకృతి నియమాలకు అసాధ్యమైన విషయం.
అంతేకాక ప్రభువే ఇటువంటివి చేశారు. అంతకుముందు లాజరును, యాయీరు కుమార్తెను, నాయీను విధవరాలి కుమారుడిని మరణం నుండి లేపినది యేసు ప్రభువే. ఆయనే మరణించిన తరువాత ఎవరు అలా చేయగలరు? అనే నిస్సహాయత వారిని ఆవరించింది. జీవమునకు మూలమైన దేవుడే సిలువపై మరణిస్తే, ఇక తమకు ఆశ ఎక్కడిది అనే నిరాశలో వారు ఉండిపోయారు. అనేక ప్రశ్నలు వారిలో ఉన్నవి. ఈ మానసిక వేదన వారి కన్నులను, హృదయాలను కప్పివేసింది.
వీరిలో ఉన్న ఈ భయాలు మరియు యేసు ప్రభువు చెప్పిన మాటలు నేను మూడవ రోజున తిరిగి లేస్తాను అని చెప్పిన మాటలు ఆసరాగా తీసుకొని ఎవరైన పుకార్లు పుట్టిస్తున్నారు అనే అనుమానాలు ఇవాన్నీ శిష్యులలో ఉండవచ్చు. బహుశా రోమా సైనికులు లేదా యూదా నాయకులు యేసు దేహాన్ని దొంగిలించి, ఈ విధంగా అబద్ధపు ప్రచారం చేస్తున్నారేమోనని వారు భయపడి ఉండవచ్చు. ఈ భయాలు, అనుమానాలు, ప్రాణభయం కారణంగా వారు తలుపులు మూసుకుని కూర్చున్నారు. అందుకే వారు అన్నింటిని నమ్మలేని పరిస్థితుల్లో లేరు. వారి హృదయాలు గాయపడి ఉన్నాయి, కాబట్టి వారు ఇతరుల సాక్ష్యాన్ని అంత సులభంగా స్వీకరించలేకపోయారు.
ఇద్దరు శిష్యులకు దర్శనం: అంతరంగ ప్రయాణం - సహవాసపు ప్రాముఖ్యత
మగ్ధలా మరియమ్మ సాక్ష్యాన్ని తిరస్కరించిన తర్వాత, యేసు ప్రభువు గ్రామమునకు వెళుతున్న ఇద్దరు శిష్యులకు దర్శనం ఇస్తున్నారు. లూకా సువిశేషంలో ఎమ్మావు వెళుతున్న ఇద్దరు శిష్యులు అని మనం చదువుతాం. వారు యెరూషలేము నుండి నిరాశతో, భారమైన హృదయంతో తమ గ్రామానికి తిరిగి వెళ్తున్నారు. ప్రభువు వారితో మాట్లాడుతున్న సమయంలో వారు ప్రభువును గుర్తించలేకపోయారు. వారి కన్నులు కప్పబడటానికి కారణం వారి అంతరంగంలో ఉన్న నిరాశే. యేసు మోషే, ప్రవక్తల లేఖనాల నుండి తన్ను గూర్చిన విషయాలన్నింటిని వారికి వివరించినప్పుడు వారి హృదయాలు రగిలాయి.
తరువాత రొట్టెను విరిచి ఇస్తున్నప్పుడు వారు ప్రభువును గుర్తించారు. ఆ సహవాసంలో, ఆ రొట్టె విరిచే ప్రక్రియలో వారి ఆత్మ చైతన్యవంతమైంది. ఈ సంఘటన మన వ్యక్తిగత క్రైస్తవ జీవితానికి ఒక గొప్ప హెచ్చరిక. అనేక సార్లు ప్రభువు మనతో ఉన్నప్పుడు మనము ప్రభువును గుర్తించలేపోతున్నాము. మన కష్టాలలో, కన్నీళ్లలో, దైనందిన జీవిత ప్రయాణంలో ఆయన మన పక్కనే నడుస్తున్నప్పటికీ, మనం ఆయన ఉనికిని గ్రహించలేకపోతున్నాం. దీనికి కారణము కేవలం ప్రభువుకు సంబంధించిన విషయాలలో మనం ప్రేక్షకులుగా మాత్రమే ఉంటున్నాము.
మనం ఆదివారం ఆరాధనలకు వెళ్తూ, ప్రార్థనలు వింటూ, కేవలం పైపైన భక్తిని ప్రదర్శిస్తూ ఆత్మీయ జీవితంలో ప్రేక్షకులుగా ఉండిపోతున్నాం. కానీ దేవుడు మన నుండి ఆశించేది అది కాదు. ప్రభువుతో వ్యక్తిగతంగా సంబంధం ఏర్పాటు చేసుకోవాలి. ప్రతిరోజూ ఆయన వాక్యం ధ్యానించడం ద్వారా, ఆయనతో ప్రార్థనలో సమయం గడపడం ద్వారా మాత్రమే మనం ఆయనను గుర్తించగలం.
ఈ ఇద్దరు శిష్యులు కూడా ప్రభువును గుర్తించిన వెంటనే, ఆ రాత్రిలోనే యెరూషలేముకు తిరిగి వచ్చి, తాము చూసిన విషయాలను ఇతర శిష్యులకు చెప్పారు. అయితే, ఆశ్చర్యకరంగా వారు ఇద్దరు తిరిగి వచ్చి తక్కిన వారికి ఈ విషయమును తెలియపరచిరి. కానివారు నమ్మలేదు. శిష్యులు ఏక్కువ నమ్మనది వారికి స్వయంగా ప్రభువు ఇచ్చిన దర్శనమును. వారు స్వయనుభవంకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. తాము స్వయంగా చూస్తేనే కానీ నమ్మమనే ధోరణి వారిలో ఉంది. కానీ ఆత్మీయ జీవితంలో విశ్వాసం అనేది వినికిడి ద్వారా వస్తుంది. ప్రభువు మాత్రము మనకు ఇతరుల సాక్ష్యంను కూడా నమ్మమని చెబుతున్నారు. సంఘ సహవాసంలో ఒకరి అనుభవాలు, సాక్ష్యాలు మరొకరి విశ్వాసాన్ని బలపరచడానికి ఉపయోగపడాలి.
ప్రభువు సందేశం: అవిశ్వాస ఖండన - సార్వత్రిక సువార్త బాధ్యత
చివరగా, యేసు ప్రభువు పదకొండు మంది శిష్యులకు దర్శనము ఇచ్చి వారి అవిశ్వాసమును ఖండించారు. వారు భోజనము చేయుచు కూర్చునియుండగా ఆయన వారికి ప్రత్యక్షమయ్యాడు. యేసు ప్రభువు వారి హృదయ కాఠిన్యము, अविశ్వాసమును గద్దించారు. దేవుడు తన శిష్యులలో అవిశ్వాసాన్ని ఎన్నడూ సహించడు, ఎందుకంటే అవిశ్వాసం అనేది దేవుని శక్తిని, ఆయన వాగ్దానాలను తృణీకరించడమే అవుతుంది.
ప్రస్తుత సమాజంలో కూడా హృదయ కాఠిన్యము చాల మందిలో పెరుగుతున్నది. సాంకేతికత పెరిగి, లోకం స్వార్థం వైపు పరిగెడుతున్న ఈ రోజుల్లో మానవతా విలువలు మృగ్యమవుతున్నాయి. హృదయ కాఠిన్యము పెరిగినప్పుడు మనము దేనికి స్పందించము. పాపము పట్ల భయం ఉండదు, దేవుని వాక్యం పట్ల గౌరవం ఉండదు. సమాజంలో ఇతరుల అవసరములలో ఉన్న, కష్టాలలో ఉన్నా నాకు ఎందుకులే? అనే ధోరణిలో ఉంటాము. పొరుగువారి పట్ల ప్రేమ లేకపోవడం, వారి కష్టాలను చూసి చలించకపోవడం హృదయ కాఠిన్యానికి నిదర్శనం.
క్రీస్తు అనుచరులలో ఉండకూడనిది ఈ హృదయ కాఠిన్యము. యేసు ప్రభువు ప్రేమ స్వరూపి. ఆయన లోకంలో ఉన్నప్పుడు దేనిని చూసినా కనికరపడ్డారు. కాబట్టి, ఆయనను వెంబడించే వారిలో కఠినత్వం ఉండకూడదు. అందుకే దేవుడు యిస్రాయేలుకు వారి రాతి గుండెను తీసి మాంసంతో కూడిన హృదయము వారికి ఇస్తాను అని చెప్పినది (యెహెజ్కేలు 36:26). రాతి హృదయం దేనికీ స్పందించదు, కానీ మాంసపు హృదయం దేవుని స్వరానికి, ఇతరుల వేదనకు స్పందిస్తుంది. క్రైస్తవుల హృదయం ఎప్పుడు ప్రభువు వలె ఇతరుల జీవితాలు చూసినప్పుడు వారి సమస్యలు, లేక సౌఖ్యాల అనుకూలంగా స్పందించ కలగాలి.
తమ తప్పును తెలుసుకొని, హృదయ కాఠిన్యాన్ని విడిచిపెట్టిన శిష్యులకు ప్రభువు ఒక గొప్ప బాధ్యతను అప్పగించారు. ప్రభువు వారితో సకల జాతి జనులకు సువార్తను ప్రకటించండి అని చెబుతున్నాడు. శిష్యులకు ఉన్న ప్రధాన లక్ష్యం సువార్తను ప్రకటించడం. ఇది ఏదో ఒక సమూహానికి పరిమితమైన పని కాదు, ఇది వారి జీవిత శ్వాసగా మారాలి. ఎందుకు ఇది ప్రధానమైన లక్ష్యం అంటే ప్రభువు ఇచ్చే రక్షణ అందరికి, కేవలం ఒక జాతి, ప్రాంతం, వర్గమునకు మాత్రమే చెందినది కాదు. పాత నిబంధన కాలంలో దేవుని రక్షణ కేవలం ఇశ్రాయేలీయులకే పరిమితమనే భావన ఉండేది, కానీ క్రీస్తు సిలువ మరణం మరియు పునరుత్థానం ద్వారా ఆ గోడలు బద్దలయ్యాయి.
రక్షణ అనేది సార్వత్రికమైనది. ఆ విషయం ఈ శిష్యుల ప్రపంచమంతట తిరిగి అందరికి తెలియజేస్తూ, వారు సాక్ష్యం ఇవ్వాలి. ఈ సాక్ష్యం ఇతరుల అనుభవాలు మాత్రమే కాక వారు కూడా స్వయంగా ప్రభువును పునరుత్థానం అయిన తరువాత చూసారు, విన్నారు మరియు ఆయన నుండి వారి कर्తవ్యము ఏమిటో తెలుసుకున్నారు. వారు కనులారా చూసిన పునరుత్థాన సత్యాన్ని లోకానికి చాటిచెప్పే బాధ్యత వారిపై ఉంచబడింది.
ఈ పిలుపు కేవలం నాటి పదకొండు మంది శిష్యులకు మాత్రమే పరిమితమైనది కాదు. వీరు మాత్రమే కాక ప్రభువును తెలుసుకున్న వారు అందరు ఈ కర్తవ్యము కలిగివున్నారు. క్రీస్తు రక్తంలో కడగబడి, ఆయన రక్షణ ఆనందాన్ని పొందిన ప్రతి విశ్వాసి కూడా సువార్త భారమును కలిగి ఉండాలి. వారు అందరు ఆయనను ప్రకటించవలసి బాధ్యత ఉంది. మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన పరిశుద్ధమైన జీవితం ద్వారా పునరుత్థానుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి చూపించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
Comments
మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:
Post a Comment