మత్తయి 5:17-19 వివరణ - యేసు ప్రభువు ధర్మశాస్త్రాన్ని ఎలా సంపూర్ణమొనర్చారు? | Carmel Shobha
మత్తయి 5: 17-19
నేను ధర్మ శాస్త్రమును , ప్రవక్తల ప్రభోదమును రద్దు చేయ వచ్చితినని తలంపవలదు. "నేను వచ్చినది వానిని సంపూర్ణ మొనర్చుటకే గాని, రద్దుచేయుటకు కాదు. పరలోక భూలోకములు గతించినను ధర్మ శాస్త్రములోని ఒక అల్పాక్షరమైనను, ఒక పొల్లు అయినను వర్ధముకాక అంతా నెరవేరునని నొక్కి వక్కాణించుచున్నాను. కాబట్టి ఎవరైన ఈ ఆజ్ఞలలో ఏ అత్యల్పమైన దానినైనను భంగపరచి, అట్లు జనులకు బోధించినచో, వాడు పరలోక రాజ్యమున అత్యల్పుగ పరిగణింపబడును. ధర్మ శాస్త్ర బోధకుల కంటే, పరిసయ్యుల కంటే మీరు నీతిమంతమైన జీవితము జీవించిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను."
యేసు ప్రభువుని కొండమీది ప్రసంగం (మత్తయి 5-7) యేసు ప్రభువు బోధలన్నింటిలో అత్యంత ముఖ్యమైన బోధన. అందులో మత్తయి 5:17-19 కీలకమైనది. ఈ మూడు వచనాలు లేకుండా మిగిలిన ప్రసంగాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేం. యేసు ప్రభువు ఇక్కడ ఒక్క మాటలో తన రాకడ యొక్క ఉద్దేశ్యాన్ని స్పష్టంగా ప్రకటిస్తున్నాడు: "నేను ధర్మశాస్త్రాన్ని రద్దు చేయుటకు కాదు, దానిని సంపూర్ణ మొనర్చుటకు వచ్చితిని."
ఈ వాక్యం మనకు మూడు గొప్ప సత్యాలను వెల్లడిస్తుంది. మొదటిగా : పాత మరియు క్రొత్త నిబంధనలు రెండు ఒకే దేవుని వాక్యం. రెండవదిగా : ఆ వాక్యానికి శాశ్వతమైన ప్రామాణికత ఉంది. మూడవదిగా : మనం ఆ వాక్యాన్ని మన జీవితంలో పాటించడానికి పిలవబడ్డాం.
యేసు ప్రభువే ధర్మశాస్త్రపు పరిపూర్ణత
"నేను ధర్మ శాస్త్రమును , ప్రవక్తల ప్రభోదమును రద్దు చేయ వచ్చితినని తలంపవలదు. "నేను వచ్చినది వానిని సంపూర్ణ మొనర్చుటకే గాని, రద్దుచేయుటకు కాదు." యేసు ప్రభువు ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఆయన బోధలు వింటున్న యూదులకు, పరిసయ్యులకు ఒక అనుమానం కలిగింది. "యేసు ప్రభువు మోషే ధర్మశాస్త్రాన్ని తిరస్కరిస్తున్నాడా?" అనే అనుమానాన్ని తొలగించేందుకు యేసుప్రభువు వెంటనే తన నిజమైన ఉద్దేశ్యాన్ని స్పష్టపరిచాడు.
"నెరవేర్చుట" లేక "సంపూర్ణమొనర్చుట" అనే పదం (గ్రీకులో plērōsai) అత్యంత అర్థవంతమైనది. ఒక పాత్రను నింపడం, ఒక వాగ్దానాన్ని పూర్తిచేయడం, ఒక నీడకు రూపాన్నివ్వడం ఆ పదం యొక్క అర్ధం . పాత నిబంధన అంతా యేసు ప్రభువు వైపు చూపిస్తుంది. ఆయన వచ్చినప్పుడు, పాత నిబంధనకు సంపూర్ణత వచ్చింది.
కాతొలిక సంప్రదాయం ఈ సత్యాన్ని ఎల్లప్పుడూ విశ్వసించింది. రెండవ వాటికన్ మహాసభ (Dei Verbum, 16) ఈ విధంగా బోధిస్తుంది: దేవుడు రెండు నిబంధనలను ఒకే ప్రణాళికతో రచించాడు. క్రొత్త నిబంధన పాత నిబంధనలో దాగి ఉంది; పాత నిబంధన క్రొత్త నిబంధన ద్వారా వెల్లడవుతుంది. తిరుసభ పాత నిబంధనను ఎన్నడూ తిరస్కరించలేదు. పవిత్ర బలిపూజలో మనం ప్రతి ఆదివారం పాత నిబంధన నుండి చదువుతాము, కీర్తనలు పాడతాం, ప్రవక్తల గ్రంధలను వింటాం, ఎందుకంటే అవి యేసు ప్రభువు వైపు చూసే మార్గదీపాలు. యేసు ప్రభువుని గురించి ఆలోచన లేకుండా పాత నిబంధన పూర్తిగా అర్ధం చేసుకోవడం జరుగదు. పాత నిబంధన మొత్తం పూర్తి అయ్యింది యేసు ప్రభువుతోనే.
యేసు ప్రభువు ఆ ధర్మశాస్త్రాన్ని మూడు విధాలుగా నెరవేర్చాడు.
ప్రవక్తల ప్రవచనాలు నేరవేర్పు : ఇమ్మాన్యూయేలు జన్మము , బేత్లెహేములో జన్మించడం, ఈజిప్టు నుండి రావడం , గెత్సెమనే తోటలో బాధ, సిలువ మరణం ఇవన్నీ ప్రవక్తలు ముందు చెప్పినవే.
ఆచార పరిపూర్ణత: యిస్రాయేలు పాస్కా గొర్రెపిల్ల బలి , వారి ఆచారాలు అన్నికూడ యేసు అనే దేవుని గొర్రెపిల్లలో నెరవేరాయి. ఆలయ బలులు ఆయన సిలువ బలిలో పరిపూర్ణతను పొందింది. తనను తాను అర్పించుకున్న ఒకే ఒక బలి ద్వారా యేసు ప్రభువు శాశ్వత బలిని ఇచ్చాడు.
నైతిక పరిపూర్ణత : ఏ మానవుడూ పూర్తిగా నెరవేర్చలేకపోయిన ధర్మశాస్త్రాన్ని యేసు తన నిష్కళంక జీవితంతో సంపూర్ణంగా ఆచరించాడు. యేసు ప్రభువు నిష్కపటం, నిష్కలత్వం, మాత్రమే కాక ఇతరులను అర్ధం చేసుకోవడం మరియు నైతికతను కలిగిఉండటం మనం ఎక్కడ చూడలేము. పాత నిబంధన లేక క్రొత్త నిబంధనలో కాని ఎక్కడ ప్రభువు వలె జీవించిన పరిపూర్ణమైన వ్యక్తి ఉండరు.
మనం బైబిలు చదివేటప్పుడు ఒక ముఖ్యమైన అలవాటు అలవరచుకోవాలి. పాత నిబంధన చదివినప్పుడు "ఇక్కడ క్రీస్తు ఎక్కడ ఉన్నాడు?" అని వెతకడం నేర్చుకోవాలి. అప్పుడు దావీదు, మోషే, ఏలీయా, యెషయా వీరందరి జీవితాలు క్రీస్తు వైపు చూపే దారులుగా కనిపిస్తాయి.
దేవుని వాక్యం చెదరని కొండ లాంటిది. (వచనం 18)
"పరలోక భూలోకములు గతించినను ధర్మ శాస్త్రములోని ఒక అల్పాక్షరమైనను, ఒక పొల్లు అయినను వర్ధముకాక అంతా నెరవేరునని నొక్కి వక్కాణించుచున్నాను."
"అంతా నెరవేరునని నొక్కి వక్కాణించుచున్నాను" ఈ పదం ఆ కాలంలో అత్యంత అసాధారణమైనది. ప్రవక్తలు "యావే సెలవిచ్చేను " అని చెప్పేవారు. కానీ యేసు తన స్వంత అధికారంతో "నేను మీతో చెప్పుచున్నాను" అన్నాడు. ఇది ఆయన దైవత్వాన్ని సూచించే ఒక స్పష్టమైన సంకేతం.
"ఒక అల్పాక్షరమైనను, ఒక పొల్లు అయినను " — హీబ్రూ అక్షరమాలలో చిన్నదైన అక్షరం 'యోద్' (י) మరియు అక్షరాల మధ్య తేడా చూపే చిన్న గుర్తులు (కెరైయా). ఆకాశం, భూమి నశించినా, ఈ చిన్న గుర్తులు కూడా నశించవు అంటున్నాడు. ఇది దేవుని వాక్యం నెరవేరును అని చెప్పుటకు యేసు ప్రభువే స్వయంగా ఇచ్చిన ధృవీకరణ.
తిరుసభ ఈ సత్యాన్ని "దేవుని వాక్కు "గురించి ఎల్లప్పుడూ నొక్కిచెప్పింది. Dei Verbum చెప్పినట్లు: "పవిత్ర లేఖనాలు తప్పులేనివి ఎందుకంటే దేవుడే రచయిత; మన రక్షణకు అవసరమైన సత్యాన్ని అవి నమ్మకంగా బోధిస్తాయి." ఆ వాక్యం చదివినప్పుడు మన హృదయాలు తెరుచుకుంటే, దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యాన్ని ఎప్పుడు మన రక్షణ వాక్యముగా దేవుడు మనతో మాటలాడుతున్నట్లుగానే చదవాలి మరియు అర్ధం చేసుకోవాలి.
ఈ రోజు ప్రపంచం మనకు ఎన్నో మారుతున్న సత్యాలను నేర్పుతోంది. నైతిక సాపేక్షతావాదం "పాపం" అనే పదాన్నే తొలగించాలని చూస్తోంది. "ఏది సత్యమో మీరే నిర్ణయించుకోండి" అని చెబుతోంది. కానీ యేసు ప్రభువు చెప్పింది: దేవుని వాక్యం ఒక్క చిన్న పొల్లు కూడా రద్దు కాదు. ఆ వాక్యం మనకు నీతి నియమాలను ఇస్తుంది. ఈ ప్రపంచం లేక లోకం పాప పుణ్యాలు మన ఆలోచనలు అని చెపుతుంది కాని దేవుని వాక్యం మనకు పాపం ఏమిటో పవిత్ర గ్రంధం ద్వారా తెలుపుతూనే ఉంది. ఈ వాక్కు మనం పాటిస్తే నిత్య జీవం కలుగుతుంది.
రోజు దేవుని వాక్యాన్ని చదవకపోతే, ప్రపంచపు గొంతులు , చెడు భావాలు మన మనసులో నిండిపోతాయి. కాబట్టి రోజూ కొద్ది సమయం అయిన దేవుని వాక్కు చదివితే , ప్రార్ధన చేస్తే అది మన ఆధ్యాత్మిక జీవితానికి ఊపిరి వంటిది అవుతుంది.
3. విధేయత మరియు సాక్ష్యం — మన పిలుపు (వచనం 19)
"ఈ ఆజ్ఞలలో ఏ అత్యల్పమైన దానినైనను భంగపరచి, అట్లు జనులకు బోధించినచో, వాడు పరలోక రాజ్యమున అత్యల్పుగ పరిగణింపబడును."
ఈ వచనంలో యేసు ప్రభువు రెండు రకాల శిష్యులను గురించి తెలియజేస్తున్నాడు.
మొదటి రకం: దేవుని ఆజ్ఞలను "చిన్నవి" అని లెక్కచేయనివాడు. ఒక ఆజ్ఞను తన అనుకూలముగా, అనుగుణంగా మార్చుకొని, ఇతరులకు కూడా అలాగే బోధించేవాడు. ఇది "అనుకూల క్రైస్తవత్వం" ప్రేమ, కరుణ వంటివి నచ్చుతాయి; పరిశుద్ధత, పశ్చాత్తాపం, క్షమ ఇష్టం లేకపోతే వాటిని పక్కన పెడతాడు. అలాంటివాడు దేవుని రాజ్యంలో "అల్పుడు" అనబడతాడని యేసు హెచ్చరిస్తున్నాడు. దేవుని వాక్యములో దేనిని తక్కువగా చూడకూడదు.
రెండవ రకం: "వాటిని బోధించువాడు." వీరు మొదట దేవుని వాక్కును వారు వారి జీవితంలో పాటిస్తూ, ఇతరులకు దానిని బోధిస్తారు. ఇది ఒక వ్యక్తి తన జీవితముతో ఇచ్చే సాక్ష్యం వంటిది. తాను నమ్మినది, తాను పవిత్ర గ్రంధంలో చదివినది, తాను జీవించేది ఇతరులకు బోధించేవారు. వీరు దేవుని రాజ్యంలో గొప్పవారుగా ఉంటారు. జీవిత సాక్ష్యం అన్నింటికంటే చాలా ముఖ్యమైనది.
యేసు ప్రభువే మనకు ఈ విషయంలో ఆదర్శం. ఆయన ప్రేమ గురించి బోధించాడు; దాని కంటే ముందే ఆయన దానిని చూపించాడు. సేవ గురించి బోధించి శిష్యుల కాళ్ళు కడిగాడు; క్షమ గురించి బోధించి సిలువపై "తండ్రీ, వారిని క్షమించు" అన్నాడు. అందుకే ఆయన బోధనలో జీవశక్తి ఉంది. ఆయన మాటలు రాళ్ళపై చెక్కిన అక్షరాల వంటివి కావు. జీవితంలో జీవించిన సత్యాలు.
చిన్న తెరేసమ్మ అన్న మాట ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు : "ప్రేమ అనేది క్రియలో రుజువవుతుంది, అనుభావాల్లో కాదు." చిన్న చిన్న క్రియలు, ఒక నవ్వు, ఒక సహాయం, ఒక క్షమాపణ, ఒక మౌన ప్రార్థన ఇవే మన జీవిత సాక్ష్యలు.
"పరలోకరాజ్యంలో గొప్పవాడు" అంటే ప్రపంచం నిర్వచించిన గొప్పతనం కాదు, ధనం, పదవి, ప్రభావం కాదు. వాటి బదులుగా, వినయంతో దేవుని చిత్తాన్ని అనుసరించి, మరొకరికి దానిని చూపించేవాడే దేవుని రాజ్యంలో గొప్పవాడు.
క్రీస్తు ప్రభువు మన ధర్మం, మన జీవితం
ఈ మూడు వచనాలు మనకు ఒక అద్భుతమైన సత్యాన్ని తెలియజేస్తున్నాయి.
మన స్వశక్తితో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం మనకు సాధ్యం కాదు. పౌలు రోమియుల కు రాసిన లేఖలో (3:23) చెప్పినట్లు "మానవులందరు పాపము చేసితిరి అందరు దేవుని మహిమకు కొరతబడిరి." కాబట్టి మన రక్షణ ధర్మశాస్త్ర ఆచరణపై ఆధారపడదు, అది పూర్తిగా క్రీస్తు కృపపై ఆధారపడుతుంది. ఆయన మన తరపున ధర్మశాస్త్రమంతా నెరవేర్చాడు; ఆయన రక్తంతో మనకు రక్షణను ప్రసాదించాడు.
కానీ రక్షింపబడిన వారిగా, కృతజ్ఞతా ఫలంగా, మనం ఆ ఆజ్ఞలను ప్రేమతో అనుసరిస్తాం. భయంతో కాదు, ప్రేమతో. శిక్ష తప్పించుకోవడానికి కాదు, మన తండ్రికి సంతోషం కలిగించడానికి. పరిశుద్ధాత్మ మనలో నివసిస్తూ, ఆ ధర్మాన్ని నెరవేర్చే శక్తిని అనుదినం ఇస్తున్నాడు.
ఈ రోజు ఒక ప్రశ్న మన హృదయంలో ఉంచుకోవాలి: "నేను నమ్మే సత్యాన్ని నా జీవితం ద్వారా నిరూపిస్తున్నానా?"
పరలోకరాజ్యంలో "గొప్పవాడు" అనబడడం అనే పిలుపు ప్రతి ఒక్కరికీ ఉంది. పెద్ద పదవి అక్కరలేదు, గొప్ప ప్రసంగాలు అక్కరలేదు. వినయంగా, నమ్మకంగా, ప్రేమతో, దేవుని వాక్యాన్ని జీవించడం సరిపోతుంది.
"ప్రభువా, నీ వాక్యాన్ని నా హృదయాల్లో స్థిరపరచుము. నీ పరిశుద్ధాత్మ ద్వారా దానిని నా జీవితంలో సాకారం చేయుము. నా జీవితాన్ని నీ మహిమకు సాక్ష్యంగా మారనిమ్ము." ఆమెన్.
Comments
మీ అభిప్రాయాలు, ప్రశ్నలు క్రింద రాయండి:
Post a Comment