పేద విధవరాలి కానుక - మార్కు 12:38-44 ఆత్మీయ సందేశం
మార్కు 12: 38-44
యేసు ఇట్లు ఉపదేశించుచు "మీరు ధర్మ శాస్త్ర బోధకుల విషయమై కడు జాగరూకులై మెలగుడు. వారు నిలువుటంగిలను ధరించి తిరుగుటను, అంగడి వీదులలో వందనములు అందుకొనుటను కోరుకొందురు. ప్రార్ధన మందిరములందు ప్రధానాసనములను, విందులయందు అగ్రస్థానములను కాంక్షింతురు. వారు దీర్ఘ జపములను చేయునట్లు నటించుచు, వితంతువుల ఇండ్లను దోచుకొనుచున్నారు. వారు కఠినతరమగు శిక్షకు గురికాగలరు" అనెను. పిమ్మట, యేసు కానుకల పెట్టె యొద్ద కూర్చుండి, అందు ప్రజలు కానుకలు వేయు రీతిని పరీక్షించుచుండెను. ధనికులు అనేకులు అందులో ఎక్కువ డబ్బు వేయుచుండిరి. అప్పుడు ఒక పేద విధవరాలు వచ్చి రెండు రాగి నాణెములను మాత్రమే వేసెను. ఆయన శిష్యులను పిలిచి, "ఈ కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరి కంటే ఈ పేద విధవరాలు ఎక్కువ వేసేనని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను" అనెను. "ఎలన, వారందరు తమ సమృద్ది నుండి కానుకలు వేసిరి. కాని ఈమె తన లేమి నుండి తనకు ఉన్నదంత, అనగా జీవనాధారమంతయు త్యాగము చేసినది" అనెను.
ఈ కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరి కంటే ఈ పేద విధవరాలు ఎక్కువ వేసేనని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను—
మార్కు 12:43
ప్రభువును ప్రేమించుట
సన్యాసి
అయినా, సంసారి అయినా, ఒకే
ప్రశ్నను ఎదుర్కొంటాడు: "నేను నా ప్రభువుకు నిజంగా నన్ను నేను సమర్పించుకుంటున్నానా? ?" ఈ ప్రశ్నకు మార్కు సువార్తలోని
నిరుపేద విధవరాలు మాటలతో కాక, తనకున్న రెండు కాసులతో అద్భుతమైన సమాధానం చెప్పింది.
ఈ విధవరాలు
కూడా దారిద్రము నిస్సహాయత ఉన్నప్పటికీ దేవుని వైపు తిరిగి తన సర్వస్వం అర్పించింది.
ధర్మ శాస్త బోధకుల వేషం — బాహ్య ఆరాధన యొక్క ప్రమాదం
ధర్మశాస్త్ర బోధకులు పొడుగాటి వస్త్రాలు ధరించారు, ప్రజల
నమస్కారాలను కోరుకున్నారు, సభామందిరాలలో
మొదటి ఆసనాలు ఆక్రమించారు. ఇవన్నీ బాహ్య గుర్తులు మాత్రమే. కానీ లోపల వారు
విధవరాళ్ళ ఆస్తులు భక్షిస్తూ, దీర్ఘ ప్రార్థనలు చేసేవారు. దేవుని ఆరాధన ఒక వృత్తిగా మారినప్పుడు, అది ఆరాధన కాక నాటకం అవుతుంది.
కార్మెలైట్
ఆత్మీయత ఈ ప్రమాదాన్ని గురించి స్పష్టంగా హెచ్చరిస్తుంది. సిలువ యోహాను (San Juan de la
Cruz) దీనిని "ఆత్మీయ గర్వం" (spiritual
pride) అనే వ్యాధిగా
పేర్కొన్నాడు. ఇది బాహ్యంగా చాలా భక్తిగా కనిపిస్తూ, లోపల దేవుని కంటే తమ పేరు, ప్రఖ్యాతుల మీద శ్రద్ధ పెట్టడం. ఈ
హెచ్చరిక నేటికీ వర్తిస్తుంది. మన ప్రార్థనలు ఎవరు చూస్తున్నారనే ఆలోచన, మన దానం గురించి ఇతరులు
తెలుసుకోవాలనే తపన, కమిటీలలో
పదవుల ప్రాధాన్యత—ఇవన్నీ ధర్మ శాస్త్ర బోధకుల వస్త్రాల వంటి బాహ్య ప్రదర్శనలే.
విధవరాలి మార్గం — 'నాదా '
యొక్క ఆత్మీయత
సిలువ
యోహాను రాసిన అత్యంత ప్రసిద్ధ సూత్రం: "నాదా , నాదా, నాదా — తోదో , తోదో , తోదో " (ఏమీ వద్దు, ఏమీ వద్దు, ఏమీ వద్దు — సర్వస్వం ఆయనే, సర్వస్వం ఆయనే, సర్వస్వం ఆయనే). ఆ విధవరాలు ఈ
సూత్రాన్ని తన జీవితంలో అన్వయించుకుంది.
ఆమెకు
పేరు, స్థానం, సంఘంలో గౌరవం, రేపటి భరోసా ఏవీ లేవు. ఆమె పూర్తిగా 'నాదా'
(శూన్యత) లో జీవిస్తోంది. ధర్మ శాస్త్ర బోధకులు తమ
వస్త్రాలను, పేరు ప్రఖ్యాతులను పెంచుకొంటూ వారి ఆత్మలను దేవునికి దూరం చేసుకున్నారు. విధవరాలికి ఆదారపడటానికి ఏమీ లేదు. ఆమె తన చేతిలో మిగిలిన చివరి
రెండు కాసులను దేవుని ముందు అర్పించి పూర్తిగా పూర్తిగా దేవుని వశమైనది.
"ఆత్మ
తనను తాను పూర్తిగా ఖాళీ చేసుకున్నప్పుడు మాత్రమే దేవుడు దానిని తనతో నింపగలడు"
అని సిలువ యోహాను అంటాడు. ఆమె ఏమీ లేకపోవడమే ఆమె సంపద అయింది, ఆమె అభద్రతే దేవునిపై నమ్మకానికి
సాక్ష్యమైంది.
యేసు ప్రభువు చూపు
యేసు ప్రభువు ఆ కానుకల పెట్ట వద్ద ఉన్నవారినందరిని గమణిస్తున్నాడు. కానుకల పెట్టెకు ఎదురుగా కూర్చుని చూస్తున్నాడు. ఈ వాక్యం యేసు ప్రభువు కేవలం
పరిశీలకుడు మాత్రమే, కాదు. ఆయన
ప్రేమతో ప్రతి మనిషి హృదయంలోకి చూస్తున్నాడని చెప్తుంది. ధనవంతుల నాణేల పెద్ద
చప్పుడు, మధ్య ఆ విధవరాలి రెండు చిన్న కాసుల చప్పుడు ఎవరికీ వినిపించలేదు. కానీ
ప్రతి హృదయాన్ని శోధించే యేసు ప్రభువు దృష్టి ఆ చిన్న కానుకలను చూసి ఆగిపోయింది. తన సర్వస్వం అయిన ఆ రెండు కాసులు దేవునికే అర్పించి, దేవుని మీదనే ఆమె ఆధారపడుతుంది.
అవీలా
తెరేసమ్మ (Santa Teresa de Ávila) తన ఆత్మకథలో (The Book of Her Life) ఒక అద్భుతమైన అనుభవాన్ని వర్ణించింది. ఒకరోజు ఆమె
యేసు ప్రభువు స్వరూపాన్ని చూసినప్పుడు, ఆయన తన
వైపు ప్రేమతో చూస్తున్నట్లు అనిపించి, ఆ చూపు ఆమె జీవితాన్ని మార్చివేసింది. విధవరాలి విషయంలోనూ అదే
జరిగింది; ఆమె
యేసు ప్రభువును చూడకపోయినా, యేసు ప్రభువు ఆమెను చూశాడు. యేసు ప్రభువును ఆ ఒక్క చూపు రెండు వేల సంవత్సరాలుగా ఆమె కథను అమరంగా నిలిపింది. మన
జీవితంలో ఎవరూ పట్టించుకోని క్షణాలు, రహస్య ప్రార్థనలు, నిశ్శబ్ద
త్యాగాలను కూడా యేసు ప్రభువు చూస్తున్నాడనే సత్యమే మనకు నిజమైన ఓదార్పు. మనం చేసే ప్రతి మంచిని చెడును ప్రభువు ఎప్పుడు చూస్తూనే వున్నాడు. ఆయన మీద భారం వేసి మంచినే చేయడానికి ప్రయత్నించాలి.
పరమ గీతం మరియు సంపూర్ణ సమర్పణ
కార్మెలైట్
సన్యాసులు పరమగీతాన్ని ఆత్మకు, దేవునికి
మధ్య ఉన్న అన్యోన్యమైన ప్రేమ కావ్యంగా చదువుతారు. "నా ప్రియుడు నావాడు,
నేనతని దానను"
(పరమ గీతం 2:16) అనే వాక్యం ఈ ప్రేమను
ప్రతిబింబిస్తుంది. నిజమైన ప్రేమలో ప్రేమికుడు లెక్కలు వేయడు, "నాకు ఎంత మిగులుతుంది" అని
ఆలోచించడు. తన సర్వస్వాన్ని ఆనందంగా, స్వేచ్ఛగా ఇచ్చివేస్తాడు.
ఆ
విధవరాలు తన రెండు కాసులు వేసినప్పుడు, ఆమె ఈ ప్రేమనే ఆచరించి చూపింది. రేపటి గురించి ఆలోచించకుండా, మనుషుల అభిప్రాయాలను పట్టించుకోకుండా,
"నేను నీకు చెందినదాన్ని" అని ఆ
రెండు కాసుల ద్వారా చాటిచెప్పింది. అవీలా తెరేసమ్మ తన జీవితాంతం వెదికినది ఈ
ప్రేమనే. ఆమె "ప్రభువా, నీవు నాకు ఇచ్చిన ప్రతిదీ నీకే ఇస్తాను — నా
సర్వస్వం నీకే" అని రాసింది. విధవరాలు ఆ మాటలను చదవకపోయినా,
తన జీవితం ద్వారా జీవించి
చూపించింది.
మన 'రెండు
కాసులు' ఏమిటి?
మనల్ని ఈ సువిశేష భాగం ఆత్మపరిశీలనకు పిలుస్తుంది. కార్మెలైట్ ఆత్మీయ జీవితంలో ప్రతి రోజు సాయంకాలం చేసుకునే 'ఆత్మపరిశీలన' చాలా ముఖ్యమైనది. "ఈ రోజు నేను దేవునికి ఏమి ఇచ్చాను? నా జీవితంలో నేను దేవునికి ఇవ్వడానికి భయపడుతున్న అహంకారం, సమయం, సంపద లేదా పేరు ప్రతిష్టలు ఏమైనా ఉన్నాయా? అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దైవ సన్నిధిలో మనలను మనం ప్రభువు ముందు ఆవిష్కరించాలి.
నేడు మన 'రెండు కాసులు' వేరు వేరు రూపాల్లో ఉండవచ్చు:
- ఒక
తల్లికి—అలసిపోయినా పిల్లల సంరక్షణ కోసం సమయం కేటాయించడం.
- ఒక
రోగికి—తీవ్రమైన నొప్పిలో కూడా దేవునిపై విశ్వాసంతో చేసే చిన్న ప్రార్థన.
- ఒక
పేదవాడికి—తనకున్న కొద్దిపాటి చివరి భోజనాన్ని ఇతరులతో పంచుకోవడం.
- ఒక సాధారణ
విశ్వాసికి—రోజువారీ పనుల ఒత్తిడిలో దేవుని కోసం నిశ్శబ్దంగా గడిపే ఒక గంట.
- ఒక సన్యాసికి - ప్రభువులో లీనమవడం.
ధనవంతులు
తమ సమృద్ధిలో నుండి ఇచ్చారు, కాబట్టి
వారికి ఏమీ తగ్గలేదు. కానీ విధవరాలు తన లేమిలో నుండి ఇవ్వడం వల్ల తనకున్నదంతా
కోల్పోయింది. మన దానం మన జీవనశైలిని, మన ప్రార్థన మన సోమరితనాన్ని, మన సేవ మన సమయాన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తున్నాయో గమనించినప్పుడే
అది నిజమైన సమర్పణ అవుతుంది.
ఆ విధవరాలి పేరు, ఊరు, ఆ తర్వాత ఆమె జీవితం ఏమైందో మనకు తెలియదు. కానీ యేసు ఆమెను చూశాడు, ఆ చూపు ఈనాటికీ మనల్ని వెలిగిస్తోంది. మన జీవితంలో ఎంత మిగిలిందో కాదు, ఎంత ప్రేమతో ఇచ్చామో దేవుడు లెక్కిస్తాడు. మన పేరు ఎంత పెద్దదో కాదు, మన హృదయం ఎంత వినయంగా ఉందో ఆయన చూస్తాడు. దేవుని హృదయాన్ని తాకడానికి మన హృదయపూర్వక "రెండు కాసులు" చాలు.
ప్రార్థన
సమస్తాన్ని చూసే ప్రభువా, నేను బోధకుల వలె బాహ్య
ప్రదర్శనలలో, లోక
ఆకర్షణలలో మునిగిపోకుండా నన్ను కాపాడుము. ఆ నిరుపేద విధవరాలి మాదిరిగా,
నాకున్న స్వల్పాన్ని కూడా నీకు
సంపూర్ణంగా సమర్పించే వినయాన్ని నాకు ప్రసాదించుము. నా జీవితంలోని 'రెండు కాసులేమిటో' నేను గుర్తించేలా చేసి, వాటిని నీ పీఠం ముందు ఉంచే
ధైర్యాన్ని నాకు దయచేయుము. మరియమాత వలె, "ఇదిగో నేను నీ దాసురాలను, నీ చిత్తమే జరుగును గాక"
అని పూర్ణహృదయంతో చెప్పడానికి నా అంతరంగాన్ని తెరవుము. — ఆమెన్.
Comments
మీ అభిప్రాయాలు, ప్రశ్నలు క్రింద రాయండి:
Post a Comment