యేసు ప్రశ్న: దావీదు కుమారుడా లేక దావీదు ప్రభువా? | మార్కు 12:35-37 ధ్యానం


యేసు ప్రశ్న - దావీదు ప్రభువు ఎవరు? (మార్కు 12:35-37 సంక్షిప్త ధ్యానం)


యేసు దేవాలయములో బోధించుచు, "క్రీస్తు దావీదు కుమారుడని ధర్మశాస్త్రబోధకులు  ఎట్లు చెప్పుచున్నారు?" దావీదే పవిత్రాత్మ ప్రేరణతో ఇట్లు వచించెను: "నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి ప్రక్కన కూర్చుండుము అని ప్రభువు, నా ప్రభువుతో పలికెను." ఆయనను  తన ప్రభువు  అని సంబోధించిన దావీదునకు ఆయన కుమారుడు ఎట్లగును?" అని ప్రశ్నించెను. జనసమూహములు  ఆయన బోధలను సంతోషముతో ఆలకించుచుండిరి. 

ధ్యానం: యేసు ప్రభువు దేవాలయంలో బోధిస్తున్నారు. ఆ సమయంలో ధర్మ శాస్త్ర బోధకులు మెస్సీయ్య దావీదు కుమారుడు అని ఎలా చెప్పుచున్నారు? అని అడుగుతున్నారు. ఎందుకు ఈ ప్రశ్నను ప్రభువు అడుగుతున్నారు?  మెస్సీయా నుండి ఏమి ఈ ప్రజలు, ధర్మ శాస్త్ర బోధకులు కోరుకుంటున్నారు? కాని అసలు మెస్సీయ్య ఎవరు? ప్రజలు, ధర్మ శాస్త్ర బోధకులు మెస్సీయ్యను ఈలోకమున ఒక  రాజుగా చూశారు. కేవలం వారికి బాహ్యమైన విషయాలలో సహాయం చేసేవానిగా మాత్రమే చూశారు. కాని క్రీస్తు దేవుని కుమారుడని, దేవుడని గ్రహించలేక పోయారు. దావీదు మాత్రం క్రీస్తును తన ప్రభువుగా గ్రహించాడు. క్రీస్తు రాజకీయ,సైనిక, అనారోగ్య, కరువు, కటకాల విమోచకునిగా మాత్రమే కాదు మనం చూడవలసినది. ఎందుకంటే అవన్నీ క్రీస్తును పూర్తిగా ఆవిష్కరించలేవు. దేవుణ్ణి పూర్తిగా మనం ఎప్పుడు అర్ధం చేసుకోలేక పోయాము. 


మత నాయకులతో (కైసరు పన్ను, పునరుత్థానం,వంటి గొప్ప   విషయాలపై) జరిగిన  చర్చల మధ్య, యేసు ప్రభువు దేవాలయ ప్రాంగణంలో బోధిస్తూ ధర్మశాస్త్ర బోధకులను ఒక కీలకమైన ప్రశ్న అడిగారు: క్రీస్తు దావీదు కుమారుడని ధర్మశాస్త్రబోధకులు  ఎట్లు చెప్పుచున్నారు?" దావీదే పవిత్రాత్మ ప్రేరణతో ఇట్లు వచించెను: "నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడి ప్రక్కన కూర్చుండుము అని ప్రభువు, నా ప్రభువుతో పలికెను." ఆయనను  తన ప్రభువు  అని సంబోధించిన దావీదునకు ఆయన కుమారుడు ఎట్లగును? ఈ ప్రశ్న మనం యేసు ప్రభువును అర్ధం చేసుకోలేదు అని తెలియజేస్తుంది. ధర్మ శాస్త్ర బోధకులుగాని, పరిసయ్యులుగాని ప్రజలుగాని క్రీస్తుని క్రీస్తులా అర్ధం చేసుకోలేకపోయాం.
   

 సంకుచితమైన మానవ అంచనాలు

యేసు ప్రభువు  అడిగిన ప్రశ్నను  అర్థం చేసుకోవాలంటే, నాటి యూదుల సామాజిక, రాజకీయ పరిస్థితులను గమనించాలి. శతాబ్దాలుగా బాబిలోనియ, పర్షియా, గ్రీసు మరియు రోమన్ సామ్రాజ్యాల అణచివేతకు గురైన యూదా ప్రజలు, దావీదు వంశం నుండి ఒక గొప్ప రాజు (మెస్సీయ) వస్తాడనే దేవుని వాగ్దానాన్ని (2 సమూయేలు 7:16) గట్టిగా నమ్మారు.

వారి ఊహల్లో మెస్సీయ అంటే:

  • దావీదు లాంటి ఒక గొప్ప సైనిక వ్యూహకర్త, యోధుడు.

  • రోమన్ల కాడిని ముక్కలు చేసి, ఇశ్రాయేలుకు రాజకీయ స్వాతంత్య్రాన్ని, సార్వభౌమాధికారాన్ని తెచ్చేవాడు.

  • అవినీతిమయమైన దేవాలయాన్ని శుద్ధి చేసే ఒక విప్లవకారుడు.

పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు , చివరికి యేసు ప్రభువుని  శిష్యులు కూడా (మార్కు 10:35-37లో యాకోబు, యోహానులు అధికార స్థానాలు అడగడం దీనికి నిదర్శనం) మెస్సీయను ఈ సంకుచిత స్వభావంతోనే వారు చూశారు.

యేసు ప్రభువు  తాను ‘దావీదు కుమారుడు’ కాదు  అని ఖండించడం లేదు. మత్తయి, లూకా సువార్తలు ఆయన వంశవృక్షాన్ని స్పష్టంగా నమోదు చేశాయి; అపొస్తలుడైన పౌలు కూడా దీనిని ధృవీకరించాడు (రోమీయులు 1:3). అయితే, మెస్సీయను కేవలం ఒక లౌకిక, రాజకీయ వంశ క్రమానికి మాత్రమే కుదించివేయడాన్ని యేసు తప్పుబడుతున్నారు. ధర్మశాస్త్ర బోధకులు   లేఖనాల్లో ప్రావీణ్యం సంపాదించి, దేవుని  వాగ్దానాన్ని తమ స్వార్థ జాతీయవాద ప్రణాళికలకు అనుకూలంగా మార్చుకున్నారు.  క్రీస్తు కేవలం రాజకీయ విమోచకుడు కాదు, ఆయన పరలోక రాజ్యాన్ని ఇచ్చేవాడు. నిత్య జీవాన్ని ఇచ్చేవాడు. 

మన జీవితాలకు అన్వయం:

మనం కూడా తరచుగా మన స్వంత అంచనాలతోనే యేసు వద్దకు వస్తాము. మనకు కావలసిన పద్ధతిలో సమస్యలను పరిష్కరించే ఒక రాజకీయ రక్షకుడిగానో, కేవలం మానసిక ఆందోళనలను నయం చేసే వైద్యుడిగానో, లేదా ఆరోగ్యం-ఐశ్వర్యం ఇచ్చే 'వానిగానో  యేసు ప్రభువును వాడుకోవాలని చూస్తాము. కానీ ఆయన , అంచనాలకు అతీతుడు. ఇవన్నీ ఇవ్వగలడు కాని ఆయన వీటన్నింటికంటే గొప్పవాడు. ఈరోజు నుండి ప్రభువును నేను దేవునిగా మరియు నా ఈలోక సహచరునిగా ఉండటానికి పరలోకమునుండి వచ్చిన వానిగా చూడాలి. 

 కీర్తన 110:1 – పరలోక సింహాసన సత్యం

తమ వాదనను నిరూపించడానికి యేసు ప్రభువు దావీదు చెప్పిన  కీర్తన 110:1ను ఉదహరించారు. ప్రారంభ క్రైస్తవ సంఘం దీనిని మెస్సీయ పట్టాభిషేక కీర్తనగా గుర్తించింది. ఇశ్రాయేలు చరిత్రలోనే అత్యంత గొప్ప రాజు, దేవుని హృదయానుసారుడైన దావీదు, పరిశుద్ధాత్మ ప్రేరణతో భవిష్యత్తులో రాబోయే మెస్సీయను గురించి , ఆయనను తనకంటే ఉన్నతుడిగా భావిస్తూ "నా ప్రభువు" అని సంబోధించాడు. దావీదు మెస్సీయ్యను ప్రభువు అని సంబోధించడం సాధారణం విషయం కాదు, పవిత్రాత్మ ప్రేరణతోనే ఇది జరిగినది. తన కంటే గొప్పవాడని మెస్సీయ్యను గుర్తించడం. 

యూదయ సంస్కృతి ప్రకారం:

  • ఏ తండ్రి లేదా పూర్వీకుడు తన కుమారుడిని లేదా వారసుడిని "ప్రభువు" (యజమాని) అని పిలవడు.

  • కానీ దావీదు అలా పిలిచాడంటే, ఆ మెస్సీయ కేవలం మానవ సంబంధమైన వారసుడు మాత్రమే కాదు; ఆయన అపరిమితమైన దైవత్వము కలవాడు.

మెస్సీయ  మానవ రాజ్యం స్థాపనకు  కాదు వచ్చినది, ఆయన దైవ రాజ్యంను ఈ లోకమున నెలకొల్పడానికి వచ్చాడు.  దేవుని "కుడి పక్కన " అనేది విశ్వ పాలనకు, దైవ రాజ్యమునకు  చిహ్నం. యేసు ప్రభువు  దావీదు  కీర్తనను చెప్పి తాను   సాధారణ దావీదు కుమారుడిని  కాదని, పాపం, సాతాను, మరణం వంటి సమస్త శక్తులను తన పాదాల క్రింద అణచివేసే విశ్వ సార్వభౌముడనని స్పష్టం చేస్తున్నారు. యేసు ప్రభువును క్రీస్తును , మెస్సీయ్యను చూడవలసిన విధం ఇదనీ చెబుతున్నాడు. 

 సామాన్య ప్రజల ఆనందం – విముక్తికరమైన స్పందన

ధర్మశాస్త్ర బోధకులు  యేసు ప్రభువు ప్రశ్నలతో అయోమయంలో పడగా, సామాన్య జనసమూహం మాత్రం ఆయన మాటలను ఎంతో ఆనందంగా విన్నారు. ఎందుకంటే, యేసు ప్రభువు  వారిని సంకుచితమైన, జాతీయవాద, సైనిక నిరీక్షణల నుండి విడిపించారు. అబద్ధ మెస్సీయల వల్ల, విఫలమైన రాజకీయ తిరుగుబాట్ల వల్ల అలసిపోయిన ఆ ప్రజలకు, తమకు ఆహారం పెట్టి, స్వస్థతనిచ్చిన నజరేయుడైన యేసు కేవలం ఒక రాజకీయ మెస్సీయ్య  కాదు, సాక్షాత్తూ ‘దావీదే  ప్రభువు అని ’ తెలిపిన మెస్సీయ్య అని తెలిసి వారి హృదయాలు తేలికపడ్డాయి. ఆయన దేవుని కుమారుడు అని తెలుసుకొనుటకు సిద్దమవుతున్నాయి. 

 కొన్ని సార్లు మత ఆచారాలు మనలను కేవలం  నేను తగినంత భక్తి కలిగిఉన్నానా? దేవుడు నాపై కోపంగా ఉన్నాడా? నా సమస్యలు ఎప్పుడు తీరుతాయి? అనే ఆందోళనలతో, సమస్యలతో  నిండి ఉంటాయి.  కానీ నిజమైన విశ్వాసం అంటే మనం దేవుని కోసం ఒక సింహాసనాన్ని నిర్మించాల్సిన అవసరం లేదని, ఆయన ఇప్పటికే తండ్రి కుడిపార్శ్వాన ఆశీనుడై ఉన్నాడనే సత్యాన్ని గుర్తించడం. మన పాత్ర యుద్ధం చేయడం కాదు, ఆయనను ఆరాధించడం; ఆయనను నియంత్రించడం కాదు, ఆయన దైవత్వానికి ముగ్ధులవడం. ఆయన దైవత్వాన్ని ఆనందించడం. 

ఇది నిష్క్రియాత్మకత కాదు. విశ్వ ప్రభువు నాకోసం ప్రాణమిచ్చాడని నమ్మినప్పుడు, మన జీవితాలు భయం నుండి ప్రేమకు, ఆందోళన నుండి ఉదారతకు, హింస నుండి శాంతికి మారుతాయి. దేవుని రక్షణ ప్రణాళిక కేవలం ఒక దేశానికి పరిమితమైనది కాదు, అది విశ్వవ్యాప్తమైనదని గ్రహించినప్పటి ఆనందం అది. క్రైస్తవునిగా ఎల్లలు లేని ప్రేమను, ఆనందమును, ఇతరులతో పంచుకోవడం. 

 ఇప్పటికీ ప్రతిధ్వనిస్తున్న ప్రశ్న

రెండు వేల సంవత్సరాల తర్వాత కూడా, "మెస్సీయ దావీదు కుమారుడు మరియు దావీదు ప్రభువు ఎలా అవుతాడు?" అనే ప్రశ్న మన హృదయాలలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. 

మానవత్వం (దావీదు కుమారుడు)దైవత్వం (దావీదు ప్రభువు)
ఆయన సంపూర్ణ మానవుడుఆయన సంపూర్ణ దేవుడు
మన వలె ఆకలి, కన్నీళ్లు, మరణం రుచి చూశాడుసమస్త సృష్టి ఆయన ముందు మోకరిల్లుతుంది
మన సహోదరుడు, విమోచకుడుమన రాజు, మన న్యాయాధిపతి

ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వడం అంటే కేవలం దైవశాస్త్ర సూత్రాలను వల్లించడం కాదు, సామాన్య ప్రజలలాంటి ఆనందాన్ని కలిగి ఉండడం. యేసు ప్రభువును  మనకు నచ్చిన చిన్న ప్రణాళికలకు పరిమితం చేయడం మానేసి, విశ్వ ప్రభువుగా ఆయన ముందు మోకరిల్లడం. ఆయన చెప్పినట్లు జీవించాలి. మార్కు 12:35-37 మనల్ని మన సంకుచిత అంచనాల నుండి యేసుప్రభువు  యొక్క అద్భుతమైన వాస్తవికతలోకి ఆహ్వానిస్తోంది. ఆయన మన మానవ సహచరుడు (దావీదు కుమారుడు) మరియు దైవ సార్వభౌముడు (దావీదు ప్రభువు). 

ప్రార్ధన: ప్రభువా! మీరు ఎంత ఉన్నతులు, దావీదు, తండ్రి దేవుని మనసుకు నచ్చిన రాజు మిమ్ములను తన ప్రభువుగా అర్ధం చేసుకున్నారు. నేను అనేక సార్లు మిమ్ములను కేవలం నా సమస్యలను తీర్చేవాణిగానే చూస్తున్నాను, మీరు దేవుడు అని తెలిసిన, తండ్రి కుడి ప్రక్కన ఉంటారు అని తెలిసిన, మీతో ఉన్నతమైన బంధమును ఏర్పరచలేకపోయాను. మీరు కేవలం రాజకీయ రక్షకుడు కాదు కాని,  మీరు పాపము సాతను  మరణము నుండి  నన్ను రక్షించువాడవని తెలుసుకొనుటకు కావలనసిన అనుగ్రహాలు దయచేయండి. ఆమేన్.

Author

Fr. Amruth Raju Vellaturi, OCD

కార్మెల్ సన్యాసి, ఆధ్యాత్మికత అధ్యాపకుడు. తెలుగు క్రైస్తవులకు బైబిల్ సందేశాలను మరియు కార్మెల్ సభ ఆధ్యాత్మికత అందించడమే లక్ష్యం.

Comments

Post a Comment