దేవుని సహనం - పరిశుద్ధాత్మ నిట్టూర్పులు | 16వ సామాన్య ఆదివారం (16th Ordinary Sunday )| కార్మెల్ శోభ

 


దేవుని సహనం, పరిశుద్ధాత్మ నిట్టూర్పులు, పరలోక వృద్ధి

దేవుని దయ - మానవ బలహీనత - దైవరాజ్య వృద్ధి

పరిశుద్ధ గ్రంథ పఠనాలు:

  • మొదటి పఠనం: జ్ఞానగ్రంథం 12:13, 16-19 (దేవుని సాత్వికత, సహనంతో కూడిన శక్తి)
  • రెండవ పఠనం: రోమీయులకు 8:26-27 (బలహీనతలో పరిశుద్ధాత్మ విజ్ఞాపన)
  • సువార్త పఠనం: మత్తయి 13:24-43 (గోధుమలు-కలుపు, ఆవ గింజ, పులిసిన పిండి ఉపమానాలు)

1. ఆధ్యాత్మిక జీవనంలో దేవుని కార్యాచరణ

ఈ రోజు మన ముందున్న మూడవ పఠనాలు మన ఆధ్యాత్మిక ప్రయాణానికి ముఖ్యమైన ఒక సత్యాన్ని మనకు అందిస్తున్నది. ఆ సత్యమే "దేవుని సహనం".

మనం జీవిస్తున్న ఈ ఆధునిక ప్రపంచంలో అంతా "క్షణాల్లో" జరిగిపోవాలి. ఇన్స్టంట్ కాఫీ, ఇన్స్టంట్ మెసేజ్లు, తక్షణ ఫలితాలు కోరుకునే సంస్కృతి మనది. ఈ ఆతురత, తొందరపాటు మన ఆధ్యాత్మిక జీవితంలోకి, ప్రార్థనా జీవితంలోకి కూడా ప్రవేశించాయి. మనం ప్రార్థించిన వెంటనే జవాబు రావాలి; మనం అనుకోగానే ఎదుటివారు మారిపోవాలి; సంఘంలో గానీ, సమాజంలో గానీ ఉన్న చెడు వెంటనే నాశనం అయిపోవాలి అని మన హృదయాలు  తాపత్రయ పడుతుంటాయి.

కానీ ఈనాటి దైవవచన పఠనాలు  ఇటువంటి ఆలోచనలకు పూర్తి భిన్నమైన, లోతైన సత్యాన్ని ప్రకటిస్తున్నాయి.  "నీవు మహాబలవంతుడవు అయినను, కరుణగల న్యాయాధిపతివి. నీవు కోరుకొనిన వెంటనే దండింపగల శక్తికల వాడవు. అయినను నీవు మమ్ము ఓర్పుతో సహించి ఊరకుందువు."

ఈ రోజు మనకు ఇవ్వబడిన మూడు పఠనాలు ఒకదానితో ఒకటి అద్భుతంగా ముడిపడి ఉన్నాయి:

  1.  సోలోమోను జ్ఞానగ్రంథం దేవుని స్వభావాన్ని వివరిస్తుంది: ఆయన సర్వశక్తిమంతుడైనప్పటికీ, శిక్షించడానికి తొందరపడక సహనంతో, మృదుత్వంతో పాలిస్తాడు.
  2. రోమీయులకు రాసిన లేఖ మన హృదయంతరాన్ని చూపిస్తుంది: మనం ప్రార్థించలేని బలహీనస్థితిలో ఉన్నప్పుడు, దేవుని ఆత్మ మనలో ఉండి నిట్టూర్పులతో ప్రార్థిస్తూ మనలను ఆ సహనవంతుడైన తండ్రికి అర్పిస్తుంది.
  3. మత్తయి సువార్త దేవుని రాజ్య విస్తరణను స్పష్టం చేస్తుంది: మంచి, చెడు కలిసి పెరిగే ఈ లోకంలో దేవుని రాజ్యం ఆవ గింజలా, పులిసిన పిండిలా మౌనంగా, నిశ్శబ్దంగా, రహస్యంగా ఎదుగుతుంది.

ఈ మూడు పఠనాలు మనకు అందించే సమగ్ర సందేశం ఏమిటంటే:  సర్వశక్తిగల దేవుడు మన పట్ల సహనంతో వేచి ఉంటాడు; బలహీనులమైన మనలను పరిశుద్ధాత్మ  మన లోపలి నుండి బలపరుస్తాడు; ఆ బలముతో మనం లోకంలో చెడు మధ్యలోనే మంచి విత్తనాలుగా ఎదిగి దైవరాజ్యాన్ని విస్తరింపజేయాలి.

ఈ సత్యాలను మనం ఒక్కొక్కటిగా లోతుగా ధ్యానిద్దాం.

2. దేవుని శక్తి మరియు ఆయన సాత్వికత ( సోలోమోను జ్ఞానగ్రంథం 12:13, 16-19)

లోకంలో అధికారం ఉన్నవారు లేదా శక్తిమంతులు ఎలా ప్రవర్తిస్తారు?  ఈ ప్రశ్నను ఈ నాటి రాజకీయాలను చూసే వారికి చాలా స్పష్టంగా కనపడుతుంది. తమ శక్తిని నిరూపించుకోవడానికి ఇతరులను బెదిరిస్తారు, అణచివేస్తారు, చిన్న తప్పు చేసినా వెంటనే శిక్షిస్తారు. బలవంతుడు తన కోపాన్ని, రాజదండాన్ని చూపిస్తేనే లోకం భయపడుతుంది అనుకుంటాడు. ఆ విధంగానే చేస్తుంటాడు.  కానీ సోలోమోను  జ్ఞానగ్రంథ రచయిత దేవుని శక్తికి ఒక విప్లవాత్మకమైన నిర్వచనం ఇస్తున్నాడు:

"అన్ని ప్రాణులను కాపాడునది నీవే. నీవుతప్ప మరొకదైవము లేడు. కనుక నీ తీర్పు న్యాయమైనదేయని నీ వెవరికిని నిరూపింపనక్కరలేదు...నీ నీతికి నీ బలమే కారణము. నీవందరికి అధిపతివి కనుక అందరిని దయతో కాపాడుదువు."

దేవుని సహనానికి గల మూడు ముఖ్య కారణాలు:

  1. ఆయన శక్తికి తిరుగులేదు: దేవుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా తన చేతి నుండి తప్పించుకుపోతారనే భయం ఆయనకు లేదు. అందుకే ఆయన తీర్పు తీర్చడానికి తొందరపడడు. లోకంలో బలహీనుడే భయంతో వెంటనే దాడి చేస్తాడు; నిజమైన బలవంతుడు శాంతంగా ఉంటాడు.
  2. మన నీతికి  దేవుడు ఆదర్శం:      దేవుడు తన ప్రజలకు ఒక  పాఠంనేర్పించాలనుకుంటున్నాడు. అదేమిటంటే  "నీతిమంతుడైనవాడు మానవప్రేమికుడై ఉండాలి." దేవుడు మన పట్ల కనికరం చూపాడు కాబట్టి, మనం కూడా ఇతరుల పట్ల కనికరం చూపడం నేర్చుకోవాలి.
  3. పశ్చాత్తాపానికి అవకాశం ఇచ్చే దయ: దేవుడు పాపి నాశనాన్ని కోరుకోడు. పాపి మారుమనస్సు పొంది జీవించాలన్నదే ఆయన ఉద్దేశం. దేవుడు ఇచ్చే ప్రతి రోజు, ప్రతి నిమిషం శిక్షించడానికి వాయిదా కాదు; అది మారుమనస్సు పొందడానికి ఆయన ఇస్తున్న అమూల్యమైన అవకాశం!

అనుసంధాన ఆలోచన: దేవుడు తన సృష్టి పట్ల, పాపుల పట్ల ఇంతటి సహనాన్ని, దయను కలిగి ఉన్నాడని తెలుసుకున్నప్పుడు, సహజంగానే మనం కూడా ఆయన వలె జీవించాలి. కాని  మన హృదయంలో ఒక ప్రశ్న తలేత్తుతుంది.    "దేవుడు  సహనవంతుడే, కానీ మనుష్యులమైన మనం ఆయన ఎదుట నిలబడటానికి ఎంతో బలహీనులం కదా!  మన ప్రార్థనలే సరిగ్గా చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ దేవుని సహనాన్ని మనం ఎలా అనుభవించగలం?" ఈ ప్రశ్నకు ఈ  నాటి రెండవ పఠనం సమాధానం ఇస్తుంది. 


3. మన బలహీనతలో ఆత్మ విజ్ఞాపనం (రోమీయులకు 8:26-27)

సోలోమోను జ్ఞానగ్రంథంలో బయట ఉన్న దేవుని సహనాన్ని చూశాం. ఇప్పుడు పౌలు గారు రోమీయులకు రాసిన లేఖలో మన లోపల పనిచేసే పరిశుద్ధాత్మ దేవుని ఉనికిని చూపిస్తున్నారు.

మన ఆధ్యాత్మిక జీవితంలో చాలాసార్లు ఒక రకమైన నిరాశ లేదా అలసట ఆవరిస్తుంది. కష్టాలు, శోధనలు, అనారోగ్యం, కుటుంబ సమస్యలు లేదా మన సొంత బలహీనతలు మనలను చుట్టుముట్టినప్పుడు "దేవునికి ఎలా ప్రార్థించాలో" కూడా మనకు తోచదు. నోటి వెంట మాటలు రావు, హృదయం భారంతో నిండిపోతుంది. అటువంటి బలహీన సమయాల్లో పౌలు గారు మనకు ఒక గొప్ప ఓదార్పును అందిస్తున్నారు:

"అదే విధముగా బలహీనులమైన మనకు ఆత్మ కూడ సాయపడును. ఏలయన, మనము యుక్తముగా ఎట్లు ప్రార్థింపవలెనో మనకు తెలియదు. మాటలకు సాధ్యపడని మూలుగుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుని ప్రార్థించును.హృదయాంతరంగములను పరిశీలించు దేవుడు ఆత్మ భావమును ఎరుగును. ఏలయన, దేవుని సంకల్పానుసారముగ దైవప్రజలకొరకై ఆత్మ దేవుని ప్రార్ధించును."

ఈ  వచనాలలో  ఉన్న మూల సత్యాలు


  • దేవుని ఆత్మ మన అసహాయతలో  "సహాయం" చేయడం : ఆత్మ మనకు సంబంధం లేకుండా సహాయం చేయదు. మనలో ఉండి చేస్తుంది.  పరిశుద్ధాత్మ దేవుడు పక్కన నిలబడి చూస్తూ ఉండే ప్రేక్షకుడో, లేదా మన బదులు ఆయనే మోసేసే వ్యక్తి కాదు. ఆయన మనతో కలిసి, మన లోపల ఉండి మన భారంలో భాగస్వామి అవుతాడు.
  • మాటలకు సాధ్యపడని  మూలుగులు : మన మానవ భాష చాలా పరిమితమైనది. మన హృదయంలోని అత్యంత లోతైన వేదనను లేదా దేవుని పట్ల ఉన్న తపనను  మన మాటలు  సరిగ్గా వ్యక్తపరచలేవు. అప్పుడు మన కంటి నీరు, మన మౌనం, మన హృదయంతర నిట్టూర్పులే ప్రార్థనగా మారుతాయి. పరిశుద్ధాత్మ ఆ మౌనాన్ని పరలోక తండ్రికి అర్థమయ్యే భాషలోకి మారుస్తాడు!
  • తండ్రి-పుత్ర-ఆత్మ సామరస్యం: హృదయాలను పరిశోధించే  తండ్రియైన  దేవునికి పరిశుద్ధాత్మ ఆలోచన ఏంటో తెలుసు. ఎందుకంటే ఆత్మ దేవుని చిత్తానుసారంగా నీతిమంతుల కోసం విజ్ఞాపన చేస్తాడు.

అనుసంధాన ఆలోచన: దేవుడు బయట సహనంతో వేచి ఉన్నాడు, లోపల పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతలో మనలను మోస్తూ ప్రార్థిస్తున్నాడు. మరి ఈ దైవ  కార్యం మన అనునిత్య జీవితంలో, లోకంలో ఎలా వ్యక్తమవుతుంది? దేవుని రాజ్యం ఈ లోకంలో ఎలా విస్తరిస్తుందిదీనిని యేసు ప్రభువు ఉపమానాల ద్వారా మనకు స్పష్టం చేస్తున్నారు. అదే మన మూడవ పఠనం.

 

4. పరలోక రాజ్య రహస్యమైన వృద్ధి (మత్తయి 13:24-43)

మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభువు దేవుని రాజ్యాన్ని అర్థం చేసుకోవడానికి మూడు విభిన్నమైన, అద్భుతమైన ఉపమానాలను మన ముందుకు తెస్తున్నారు.

1. గోధుమలు - కలుపు మొక్కల ఉపమానం (సహజీవనం మరియు దేవుని తీర్పు)

ఒక రైతు తన పొలంలో మంచి గోధుమ విత్తనాలు చల్లాడు. కానీ రాత్రికి రాత్రే శత్రువు వచ్చి అందులో కలుపు మొక్కల  విత్తనాలు చల్లి వెళ్లాడు. మొక్కలు మొలిచి గింజలు కాసే సమయానికి కలుపు కూడా కనిపించింది. పనివారు వచ్చి: అయ్యా! కలుపును వెంటనే పీకివేయుదుమా ? అని అడుగుతున్నారు. 

కానీ యజమాని ఏమన్నాడో తెలుసా? "వద్దు! కలుపును పీకే తొందరలో మీరు గోధుమ మొక్కలను కూడా పెరికివేస్తారేమో. కోతకాలం వరకు రెండింటినీ కలసి పెరగనివ్వండి."

  •  లోకమనే పొలంలో మంచివారు (దేవుని పిల్లలు), చెడ్డవారు కలిసి జీవిస్తుంటారు. మన మానవ ఆలోచన ఏంటంటే చెడును, చెడ్డవారిని నాశనం చేసేయాలి. కానీ దేవుని ఆలోచన భిన్నమైనది. ఆయన గోధుమ వంటి మంచివారి రక్షణను కోరుకుంటాడు.
  • తీర్పు దేవునిది: ఎవరు గోధుమ? ఎవరు కలుపు? అని నిర్ధారించే శక్తి మనుష్యులమైన మనకు లేదు. ఈ రోజు కలుపులా కనిపిస్తున్న వ్యక్తి దేవుని సహనం వల్ల రేపు గోధుమగా మారవచ్చు! కోతకాలంలో  దేవుని దూతలే ఆ వేరుచేసే పని చేస్తారు. తీర్పు మన పని కాదు. 

2. ఆవ గింజ ఉపమానం

ఆవ గింజ విత్తనాలన్నింటిలో చాలా చిన్నది. కానీ అది నేలలో పడి పెరిగినప్పుడు ఒక పెద్ద చెట్టుగా మారి, ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల్లో గూళ్లు కట్టుకుంటాయి.

  • దైవరాజ్య ఆరంభం ఎప్పుడూ చాలా అల్పంగా, చిన్నదిగా ఉంటుంది. యేసు ప్రభువు 12 మంది సాధారణ శిష్యులతో ఈ రాజ్యాన్ని ప్రారంభించారు. ప్రపంచం దృష్టిలో అది చాలా చిన్నది. కానీ ఈ రోజు ఆ రాజ్య వృక్షం ప్రపంచమంతటా విస్తరించింది. నీ జీవితంలో నువ్వు చేసే చిన్న మంచి పని, చిన్న ప్రార్థన వ్యర్థం కావు; అవి దేవుని కృపలో పెద్ద చెట్టులా పెరుగుతాయి.

3. పులిసిన పిండి ఉపమానం (ఆంతరంగిక గుణాత్మక పరివర్తన)

ఒక స్త్రీ మూడు తూముల పిండిలో కొద్దిగా పులిసిన పిండిని కలిపింది. అది కంటికి కనిపించకుండా నిశ్శబ్దంగా లోపలి నుండి మొత్తాన్ని  పులియబెట్టింది.

  • ఆధ్యాత్మిక పాఠం: పులిసిన పిండి బయట నుండి ఏ బలప్రయోగామూ చేయదు. అది పిండిలో కలిసిపోయి, లోపలి నుండి మార్పు తీసుకొస్తుంది. దైవరాజ్యం కూడా లోకంలో లేదా మన హృదయాలలో ఆర్బాటం లేకుండా, మౌనంగా ప్రవేశించి, మన ఆలోచనలను, ప్రవర్తనను పూర్తిగా మార్చివేస్తుంది.

5. మూడు పఠనాల అంతర్గత అనుసంధానం

ఈ మూడు పఠనాలను ఒకచోట చేర్చి చూస్తే, మనకు దేవుని రక్షణ ప్రణాళిక కళ్లముందు సాక్షాత్కరిస్తుంది:

పఠనం

దేవుడు 

ప్రకటింపబడిన సత్యం

మానవ జీవితంపై ప్రభావం

 సోలోమోను జ్ఞానగ్రంథం

పిత దేవుడు 

దేవుని సాత్వికత, సహనంతో కూడిన నీతి

మనం కూడా కనికరంతో, ఓపికతో ఉండాలి

రోమీయులకు

పరిశుద్ధాత్మ దేవుడు

మన బలహీనతలో ఆత్మ నిట్టూర్పులు, విజ్ఞాపన

లోపలి శక్తి, ప్రార్థనా బలము పొందుతాం

సువార్త

పుత్రుడైన యేసు 

 పరలోక రాజ్య రహస్య వృద్ధి (గోధుమ, ఆవాలు, పిండి)

విశ్వాసంతో, నిరీక్షణతో వేచి ఉండటం

  1. తండ్రి మన పట్ల సహనం చూపుతున్నాడు.
  2. ఆత్మ మనలోని బలహీనతను మోస్తూ మనలను బలపరుస్తున్నాడు.
  3. పుత్రుడు మన ద్వారా లోకంలో తన రాజ్యాన్ని విస్తరింపజేస్తున్నాడు.

ఈ  దేవుని  ప్రేమ చక్రంలో మనం ఉన్నప్పుడు, మనం లోకాన్ని గానీ, మన తోటివారిని గానీ కఠినమైన కళ్లతో చూడలేం. దేవుని దృష్టితో, సహనంతో చూడటం నేర్చుకుంటాం.

6. నేటి సమాజానికి ఈ సందేశం ఎందుకు అవసరం?

నేటి సమాజంలో "సహనం" అనే పదం కనుమరుగైపోతోంది. సామాజిక మాధ్యమాలు  వచ్చిన తర్వాత, మనుష్యులు ప్రతి చిన్న విషయానికి విమర్శించడం, తీర్పులు  ఇవ్వడం, ఒకరినొకరు గేలి చేయడం, సంఘం నుండి వేలివేయడం ఎక్కువైపోయింది.

ఈ ప్రస్తుత పరిస్థితిలో దేవుని వాక్యం మన సమాజానికి మూడు ముఖ్యమైన హెచ్చరికలను ఇస్తోంది:

  1. త్వరితగతిన తీర్పులు తీర్చకండి: ఒక వ్యక్తిలో ఉన్న లోపాన్ని చూసి, అతడు శాశ్వతంగా "చెడ్డవాడు" అని ముద్ర వేయకండి. దేవుడు అతనికి ఇంకా సమయం ఇస్తున్నప్పుడు, తీర్పు తీర్చడానికి నువ్వు ఎవరు?
  2. ప్రమాదకరమైన వాదాన్ని నివారించండి: సువార్తలోని పనివారిలాగ "కలుపును ఇప్పుడే పీకేద్దాం" అని తీవ్రవాద ధోరణితో ప్రవర్తిస్తే, సమాజంలో మంచి మనుష్యులు కూడా నష్టపోతారు. సంఘంలో గానీ, కుటుంబంలో గానీ సహనంతో కూడిన సంభాషణ (Dialogue), క్షమ ముఖ్యం.
  3. చిన్న విషయాల శక్తిని నమ్మండి: సమాజంలో పెద్ద మార్పులు పెద్ద పెద్ద విప్లవాల వల్ల రావు. ఒక కుటుంబంలో చూపించే చిన్న ప్రేమ, ఒక వ్యక్తికి చేసే చిన్న సహాయం, ఒక క్షమాపణ ఇవి పులిసిన పిండిలా, ఆవ గింజలా ముందడుగు వేసి సమాజాన్ని మారుస్తాయి.

7.  మన అనుదిన  జీవితంలో ఈ వాక్యాన్ని ఎలా జీవించాలి?

ఈ పఠనాల వెలుగులో మన అనుదిన జీవితంలో అనుసరించాల్సిన 5 ఆచరణాత్మక అడుగులు:

  1. ఇంట్లో మరియు పనిస్థలంలో సహనాన్ని అభ్యసించండి:

మీ పిల్లలలో, మీ జీవిత భాగస్వామిలో లేదా మీతో పనిచేసే వారిలో లోపాలు కనిపిస్తే వెంటనే కోపపడకండి. దేవుడు మీ పట్ల చూపుతున్న సహనాన్ని గుర్తుచేసుకుని, ఓపికతో వారిని సరిదిద్దండి.

  1. మీ ఆధ్యాత్మిక ఎదుగుదలలో నిరాశపడకండి:

మీలో ఇంకా కొన్ని పాత అలవాట్లు లేదా బలహీనతలు (కలుపు మొక్కలు) ఉండి మిమ్మల్ని వేధిస్తుంటే నిరాశ చెందకండి. దేవుడు మీతో ఇంకా పనిచేస్తున్నాడు. ఆయన మిమ్మల్ని వదిలిపెట్టలేదు.

  1. ప్రార్థనలో ఆత్మపై ఆధారపడండి:

ప్రార్థన చేయడానికి మాటలు రానప్పుడు, బాధతో ఉన్నప్పుడు ప్రార్థన చేయడం మానకండి. మౌనంగా ప్రభువు సన్నిధిలో కూర్చోండి. మీ హృదయపు నిట్టూర్పులను పరిశుద్ధాత్మ దేవుడే తండ్రికి సమర్పిస్తాడని నమ్మండి.

  1. చిన్న మంచి పనులను నిర్లక్ష్యం చేయకండి:

మీరు చేసే చిన్న ప్రార్థన, ప్రతిరోజూ చదివే కొద్దిపాటి బైబిలు వాక్యం, ఇతరులకు చేసే చిన్న మేలు.  ఆవ గింజలాగా మీ జీవితంలో, మీ కుటుంబంలో దైవరాజ్యాన్ని పెద్దగా విస్తరింపజేస్తాయి.

  1. తీర్పు తీర్చే అధికారాన్ని దేవునికి వదిలేయండి:

ఎవరిపైనా పగ, ద్వేషం పెంచుకోకండి. అందరికీ మారుమనస్సు పొందే అవకాశం ఇవ్వండి. తుది తీర్పు దేవుని చేతిలో ఉందనే నిశ్చయతతో శాంతితో జీవించండి.

8. నమ్మకముగా  వేచియుండటం

దేవుని సహనం అంటే " ఏమి చేయకుండ ఉండటం కాదు." అది "నమ్మకంతో కూడిన శ్రద్ధాపూర్వక వేచియుండటం."

ఒక రైతు విత్తనం నాటిన తర్వాత రోజూ "మొక్క ఎందుకు రాలేదు?" అని తవ్వి చూడడు,  తొందరపడడు. అతడు నీరు పోస్తాడు, ఓపికగా వేచి ఉంటాడు. ఎందుకంటే దేవుడు సరైన సమయంలో పంటను ఇస్తాడని అతనికి తెలుసు. మన విశ్వాస జీవితం కూడా అంతే! మనం ప్రేమ విత్తనాలను చల్లుదాం, పరిశుద్ధాత్మ బలాన్ని పొందుదాం, దేవుని సహనాన్ని అనుకరిద్దాం.

 మన జీవితంలో ఎవరినైనా తీర్పు తీర్చాలని అనిపించినప్పుడు, ఒక్క క్షణం ఆగి తండ్రి అయిన దేవుని సహనాన్ని తలంచుకుందాం. మన ప్రార్థన మందగించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని నిట్టూర్పులకు మన హృదయాలలో చోటు ఇద్దాం. ఆవ గింజలా, పులిసిన పిండిలా మన కుటుంబాలలో, మన సంఘంలో దేవుని రాజ్యం మౌనంగా వృద్ధి చెందును గాక! ఆమెన్.

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబిల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పవిత్రుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

📲 మా WhatsApp Channel జాయిన్ అవ్వండి!

ప్రతి నిత్య పోస్ట్ మీ WhatsApp కు నేరుగా వస్తుంది

Join WhatsApp Channel

Comments

మీ అభిప్రాయాలను, ప్రశ్നలను క్రింద రాయండి:

Post a Comment

కామెంట్‌లు