సౌలు రాజు చరిత్ర: ఇశ్రాయేలు మొదటి రాజు జననం నుండి పతనం వరకు | King Saul History in Telugu| కార్మెల్ శోభ

 ఇశ్రాయేలు మొదటి రాజు సౌలు చరిత్ర 



ఇశ్రాయేలు ప్రజల మొట్టమొదటి రాజైన సౌలు జీవిత చరిత్ర, పాత నిబంధనలోని అత్యంత సంక్లిష్టమైన, ఉత్కంఠభరితమైన మరియు ఆత్మీయ పాఠాలతో కూడిన ఒక చారిత్రక అధ్యాయం సౌలు రాజు చరిత్ర.  1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు విస్తరించి ఉన్న అతని కథను, కాలక్రమానుసారంగా అతని జననం, యవ్వనం, రాజ్యాధికారం, యుద్ధాలు, విజయాలు, పతనం మరియు అంతిమ మరణం అనే వివిధ ఘట్టాల వారీగా వివరించడమైనది.

1. కుటుంబ నేపథ్యం మరియు సౌలు జననం

ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాసత్వం నుండి విడుదల పొంది, అరణ్య ప్రయాణం ముగించి, వాగ్దాన దేశంలో ప్రవేశించిన తరువాత సుదీర్ఘ కాలం పాటు న్యాయాధిపతుల (జడ్జీలు) పరిపాలనలో ఉన్నారు. ఆ కాలంలో దేవుడే వారికి ప్రత్యక్ష రాజుగా ఉండేవాడు. అయితే, కాలక్రమేణా చుట్టుపక్కల ఉన్న అన్య ప్రజల  వలె తమకు కూడా ఒక కనిపించే రాజు కావాలని ప్రజలు కోరుకున్నారు. ఈ చారిత్రక పరివర్తన దశలోనే సౌలు జననం జరిగింది.

  • గోత్ర నేపథ్యం: సౌలు యాకోబు చిన్న కుమారుడైన బెన్యామీను గోత్రానికి చెందినవాడు. బెన్యామీను గోత్రం ఇశ్రాయేలులోని పన్నెండు గోత్రాలలో అత్యంత చిన్నది. గతంలో జరిగిన గిబియా యుద్ధం (న్యాయాధిపతులు 19-21 అధ్యాయాలు) కారణంగా ఈ గోత్రం దాదాపుగా నిర్మూలించబడే స్థితికి చేరుకుని, చాలా బలహీనంగా మారింది.
  • వంశం మరియు తండ్రి: సౌలు తండ్రి పేరు కీషు. ఇతడు బెన్యామీను గోత్రంలో ఒక సంపన్న, పరాక్రమవంతుడైన వ్యక్తిగా గుర్తించబడ్డాడు. సౌలుకు యోనాతాను, అబినాదాబు,మల్కీషూవ,  ఇష్బోషేతు  అనే కుమారులు, మెరిబా, మికాలు అను కుమార్తెలు కలరు. సౌలు భార్య పేరు అహినోవము, యుక్త వయసులోనే రాజుగా అయ్యి 40 సంవత్సరాలు యిశ్రాయేలును పాలించాడు.  
  • భౌతిక రూపం: లేఖనాల ప్రకారం, సౌలు ఇశ్రాయేలీయులందరిలో కెల్లా అందగాడు, 'బలిష్ఠుడైన శ్రేష్ఠ యువకుడు'. అతడు సాధారణ ప్రజలందరి కంటే భుజము మొదలుకొని పైకి ఎత్తుగా ఉండి, బాహ్య రూపంలో ఒక రాజుకు ఉండాల్సిన అన్ని శారీరక లక్షణాలను కలిగి ఉన్నాడు.

2. యవ్వన కాలం మరియు తప్పిపోయిన గాడిదల అన్వేషణ

సౌలు రాజ్యాధికారంలోకి రాకముందు ఒక సామాన్యమైన, వినయపూర్వకమైన జీవితాన్ని గడిపాడు. అతని జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన చాలా సాధారణమైన విషయంతో ప్రారంభమైంది.

  • గాడిదల అన్వేషణ: సౌలు తండ్రియైన కీషుకు చెందిన కొన్ని గాడిదలు తప్పిపోయాయి. వాటిని వెతకవలసిందిగా కీషు తన కుమారుడైన సౌలును ఆజ్ఞాపించగా, సౌలు తన సేవకునితో కలిసి అన్వేషణకు బయలుదేరాడు.
  • సమూయేలు ప్రవక్తతో భేటీ: వారు అనేక ప్రాంతాలు తిరిగినా గాడిదలు దొరకలేదు. ఆ సమయంలో నిరాశ చెందక, దైవజనుడైన సమూయేలు ప్రవక్తను సంప్రదించి దేవుని చిత్తాన్ని అడుగుదామని సేవకుడు సలహా ఇచ్చాడు. వారు రామా పట్టణానికి చేరుకున్నారు.
  • దైవిక ప్రణాళిక: ఈ అన్వేషణ వెనుక దేవుని రహస్య హస్తం ఉంది. సౌలు రాక గురించి దేవుడు ఒక రోజు ముందే సమూయేలు ప్రవక్తకు తెలియజేసి, ఇశ్రాయేలును పరిపాలించడానికి ఇతనినే రాజుగా అభిషేకించాలని ఆజ్ఞాపించాడు.

3. దేవుని ఎన్నిక మరియు రాజరికాభిషేకం

సౌలును రాజుగా నియమించే ప్రక్రియ రెండు దశల్లో జరిగింది: మొదట రహస్యంగా,  ఆ తర్వాత బహిరంగంగా ప్రజల సమక్షంలో అభిషేకించడం జరిగినది. 

రహస్య అభిషేకం (రామా పట్టణంలో)

 గాడిదల కోసం వెదకు సమయంలో సౌలు మరియు అతని సేవకుడు సమూయేలు ధీర్ఘదర్శిని  కలవాలని వచ్చినప్పుడు  సమూయేలు ప్రవక్త అతనిని చూచి,  సౌలును ప్రత్యేక విందుకు ఆహ్వానించి, అతనికి గౌరవ స్థానాన్ని ఇచ్చాడు. మరుసటి రోజు ఉదయం, పట్టణ సరిహద్దుల్లో సౌలును ఒంటరిగా నిలబెట్టి, సమూయేలు తైలపు బుడ్డిని తీసి అతని తలపై పోసి ముద్దు పెట్టుకుని, "యావే  నిన్ను తన ప్రజలపై  అధిపతిగా అభిషేకించియున్నాడు" అని ప్రకటించాడు.

దైవ సూచనలు మరియు మార్పు

 అభిషేకం అయిన తరువాత సౌలులో నమ్మకాన్ని కలిగించడానికి సమూయేలు మూడు భవిష్యత్తు సూచనలను చెప్పాడు. అవి సౌలు  తిరుగు ప్రయాణంలో అక్షరాలా నెరవేరాయి: అవి ఏమిటంటే: "యావే తన ప్రజకు నిన్ను నాయకునిగా అభిషేకించెను. నీవు ప్రభువు ప్రజను పరిపాలించి చుట్టుపట్లనున్న శత్రువుల నుండి వారిని కాపాడవలెను. ప్రభువు తన జనమునకు నిన్ను నాయకునిగా నియమించెననుటకు గుర్తులివియే:నీవు నన్ను వీడిపోవగనే బెన్యామీను పొలిమేరలలోని సెల్సా వద్దగల రాహేలు సమాధిచెంత ఇద్దరు జనులు నిన్ను కలిసికొని “మీరు వెదకబోయిన గాడిదలు దొరకినవి. మీ నాయన వానినిగూర్చి చింతించుట లేదు. కుమారుడు తిరిగివచ్చుటకు ఏమిచేయుదు నాయని రేయింబవళ్ళు నిన్ను గూర్చియే పలవరించు చున్నాడు' అని చెప్పుదురు. అక్కడినుండి నీవు కొంచెము దూరముపోయి తాబోరు సింధూరము చేరగనే దేవుని దర్శించుటకు బేతేలు పోవుచున్న జనులు ముగ్గురు కన్పింతురు. వారిలో ఒకడు మూడు మేకకూనలను, రెండవవాడు మూడు రొట్టెలను, మూడవవాడు తిత్తెడు ద్రాక్షసారాయమును మోసికొని పోవుచుందురు. వారు నీకు దండము పెట్టి రెండు రొట్టెలు కానుక ఇత్తురు. నీవు వానిని గైకొనుము. పిమ్మట నీవు గిబియా, తెలోహీము వెళ్ళెదవు. అచ్చటనే ఫిలిస్తీయుల సైనిక శిబిరము ఉన్నది. నీవు ఆ నగరము చేరునప్పటికి ప్రవక్తలసమాజము ఉన్నత స్థలము దిగి వచ్చుచుండును. వారు సితారా, బాకా, ఫిడేలు, మృదంగము మొదలగు వాద్యములు మ్రోగించు వారి వెంట నడచుచు ఆవేశమునొంది ప్రవచనములు పలుకుచుందురు. అప్పుడు యావే ఆత్మ నిన్ను ఆవేశింపగా వారితోపాటు నీవును ప్రవచనములు పలికెదవు. దానితో నీవు పూర్తిగా మారిపోయి కొత్త వ్యక్తివి అయ్యెదవు. ఈ గురుతులన్ని నెరవేరిన పిదప ఆయా పరిస్థితులకు తగినరీతిగా కార్యములు నడుపుము. యావే నీకు బాసటగా నుండును."

బహిరంగ ఎన్నిక (మిస్పా పట్టణంలో)

సమూయేలు ఇశ్రాయేలు గోత్రాలన్నింటినీ మిస్పాకు పిలిపించాడు. దేవుని చిత్తాన్ని బహిరంగంగా నిరూపించడానికి చీట్ల పద్ధతిని ఉపయోగించారు.

  • మొదట బెన్యామీను గోత్రం, తరువాత మత్రి కుటుంబం, చివరకు కీషు కుమారుడైన సౌలు ఎన్నికయ్యారు.
  • ఆ సమయంలో సౌలు అణకువతో (లేదా భయంతో)     వంట సామానుల మధ్య దాక్కున్నాడు. ప్రజలు అతనిని వెతికి బయటకు తెచ్చినప్పుడు, అతని ఉన్నతమైన విగ్రహాన్ని చూసి ఆనందంతో "రాజు చిరకాలము జీవించునుగాక" అని కేకలు వేశారు.

4. తొలి సైనిక విజయం – అమ్మోనీయులపై యుద్ధం

సౌలు రాజుగా ఎన్నికైనప్పటికీ, కొందరు దుష్ట మనుషులు అతనిని తృణీకరించి, ఇతడు మనలను ఎలా రక్షిస్తాడని పరిహసించారు. అయితే, సౌలు తన మొదటి యుద్ధ విజయంతో తన నాయకత్వాన్ని నిరూపించుకున్నాడు.

  • యాబేషు గిలాదు ముట్టడి: అమ్మోనీయుల రాజైన నాహాషు యాబేషు గిలాదు అనే ఇశ్రాయేలు సరిహద్దు పట్టణాన్ని ముట్టడించాడు. నివాసితులు సంధి కోరగా, నాహాషు అత్యంత క్రూరమైన నిబంధన పెట్టాడు. పట్టణ ప్రజలందరి కుడికన్నులను పెరికివేసి, ఇశ్రాయేలీయులందరికీ అవమానం తెస్తేనే సంధి చేస్తానన్నాడు.
  • సౌలుకు వార్త మరియు దేవుని ఆత్మ కార్యం: ఈ ఘోరమైన వార్త గిబియాలో ఉన్న సౌలుకు చేరినప్పుడు, దేవుని ఆత్మ అతని మీదికి బలంగా వచ్చింది. అతడు తీవ్ర ఆగ్రహంతో రెండు ఎడ్లను ముక్కలుగా నరికి, ఇశ్రాయేలు సరిహద్దులన్నింటికీ పంపి, సమూయేలు, సౌలుల వెంబడి రానివారి ఎడ్లకు ఇదే గతి పడుతుందని హెచ్చరించాడు.
  • యుద్ధం మరియు విజయం: సౌలు హెచ్చరికకు భయపడి దాదాపు మూడు లక్షల ముప్పై వేల మంది సైన్యంగా సమకూడారు. సౌలు ఆ సైన్యాన్ని మూడు భాగాలుగా విభజించి, తెల్లవారుజామునే అమ్మోనీయుల దండుపై ఆకస్మిక దాడి చేశాడు. ఎండ వేడెక్కే సరికి అమ్మోనీయులను పూర్తిగా హతమార్చి, మిగిలినవారు చెల్లాచెదురయ్యేలా గొప్ప విజయాన్ని సాధించాడు.
  • రాజరిక పునరుద్ధరణ: ఈ అఖండ విజయంతో సౌలును వ్యతిరేకించిన వారి నోళ్ళు మూతపడ్డాయి. తనను వ్యతిరేకించిన వారిని చంపాలని ప్రజలు కోరినా, సౌలు దయతో నిరాకరించి, ఈ రోజు దేవుడు రక్షణ కలుగజేశాడని క్షమించాడు. అనంతరం గిల్గాలులో ప్రజలందరూ కూడి సౌలు రాజరికాన్ని అధికారికంగా, ఉత్సవంగా స్థిరపరిచారు.

5. సౌలు కూడ ప్రవక్తలలో ఒకడారెండు భిన్న సందర్భాల సామెత

సౌలు జీవిత కాలంలో దేవుని ఆత్మ ప్రభావం వలన జరిగిన ఒక వింత సంఘటన ఇశ్రాయేలులో ఒక ప్రసిద్ధ సామెతకు దారితీసింది. అతని జీవితంలో ఈ సామెత రెండు వేర్వేరు కాలాల్లో, పూర్తి భిన్నమైన పరిస్థితుల్లో పునరావృతమైంది.

మొదటి సందర్భం (యవ్వన కాలం - ఆశీర్వాదం)

సౌలు రహస్యంగా అభిషేకించబడి గిబియాకు వస్తున్నప్పుడు, సమూయేలు ప్రవచించినట్లు ప్రవక్తల సమూహం అతనికి ఎదురైంది. అప్పుడు దేవుని ఆత్మ అతనిపైకి రాగా, అతడు లోతైన ఆత్మీయ అనుభూతితో వారితో కలిసి ప్రవచించడం ప్రారంభించాడు. ఇది చూసిన పాత స్నేహితులు మరియు ప్రజలు ఆశ్చర్యంతో, "కీషు కుమారునికి ఏమి తటస్థించినది? సౌలు కూడ ప్రవక్తలలో ఒకడా?" అని అనుకున్నారు. ఇది దేవుడు అతనికి ఇచ్చిన ఆత్మీయ సామర్థ్యానికి ప్రతీక.

రెండవ సందర్భం (వృద్ధాప్యం - నిస్సహాయత)

సంవత్సరాల తర్వాత, సౌలు దేవునికి దూరమై, దావీదును చంపాలనే క్రూరమైన ఉద్దేశంతో రామాలోని నాయోతుకు వచ్చాడు. అక్కడ సమూయేలు నాయకత్వంలో ప్రవక్తలు ప్రవచించడం చూసినప్పుడు, దేవుని ఆత్మ సౌలును అడ్డుకోవడానికి అతనిపైకి వచ్చింది. సౌలు తన వస్త్రాలను తీసివేసి, ఆ రోజంతా, రాత్రంతా సమూయేలు ఎదుట వివస్త్రుడై ప్రవసిస్తూ పడిపోయాడు. ప్రజలు మరలా అదే సామెతను ఉపయోగించారు. అయితే ఈసారి అది గౌరవార్థం కాదు; దేవుని సార్వభౌమత్వం ముందు సౌలు దుష్ట సంకల్పం విఫలమై, అతడు నిస్సహాయుడిగా పడిపోవడాన్ని సూచించింది.

6. ఫిలిస్తియులతో నిరంతర యుద్ధాలు మరియు సామ్రాజ్య విస్తరణ

సౌలు సుమారు నలభై సంవత్సరాల పరిపాలనా కాలంలో (క్రీ.పూ. 1050 - 1010) ఎక్కువ భాగం యుద్ధభూమిలోనే గడిచింది. ఇశ్రాయేలుకు ప్రధాన శత్రువులైన ఫిలిస్తియులతో మరియు ఇతర అన్యదేశాలతో అతడు అనేక యుద్ధాలు చేశాడు.

యోనాతాను శౌర్యం - మిక్మషు  యుద్ధం

ఫిలిస్తియులు అసంఖ్యాకమైన రథాలు, గుర్రాలు, ఇసుక రేణువులంత సైన్యంతో మిక్మస్ వద్ద దిగినప్పుడు ఇశ్రాయేలీయులు భయంతో గుహల్లో దాక్కున్నారు. ఆ సమయంలో సౌలు కుమారుడైన యోనాతాను తన ఆయుధాలు మోసే వానితో కలిసి, కేవలం ఇద్దరే వెళ్లి ఫిలిస్తియుల సైనిక దళంపై దాడి చేశారు. దేవుడు ఆ సమయంలో గొప్ప భూకంపం కలిగించి, శత్రువుల దండులో గందరగోళం రేపాడు. దీనిని గమనించిన సౌలు తన సైన్యంతో దాడి చేసి, ఫిలిస్తియులను ఘోరంగా ఓడించాడు.

సర్వదిక్కుల విజయాల సారాంశం

పవిత్ర గ్రంధం  ప్రకారం, సౌలు కేవలం ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా ఇశ్రాయేలు చుట్టూ ఉన్న శత్రువులందరిపై దండయాత్రలు చేసి విజయం సాధించాడు:

శత్రు దేశాలు / రాజులు

యుద్ధ ఫలితం / ప్రాముఖ్యత

మోయాబీయులు

తూర్పు సరిహద్దుల నుండి వచ్చిన ముప్పును అణచివేశాడు.

అమ్మోనీయులు

యాబేషు గిలాదుతో ప్రారంభించి వారిని పూర్తిగా లొంగదీసుకున్నాడు.

ఎదోమీయులు

దక్షిణ ప్రాంత సరిహద్దులను సురక్షితం చేశాడు.

సోబా రాజులు

ఉత్తర దిశగా ఉన్న సిరియన్ రాజ్యాల శక్తులను అడ్డుకున్నాడు.

ఫిలిష్తీయులు

పశ్చిమ తీరప్రాంత పరాక్రమశాలులతో నిరంతరం పోరాడి వారిని వెనక్కి నెట్టాడు.

అమాలేకీయులు

ఇశ్రాయేలును దోచుకునే క్రూరమైన అరణ్య తెగలను ఓడించాడు.

పవిత్ర గ్రంధం సాక్ష్యమిస్తున్నట్లుగా, సౌలు "ఎటు తిరిగినను జయము పొందెను" మరియు ఇశ్రాయేలీయులను దోచుకునేవారి చేతిలో నుండి దేశాన్ని రక్షించాడు.

వృత్తిపరమైన సైన్య వ్యవస్థీకరణ

సౌలుకు ముందు ఇశ్రాయేలులో శాశ్వత సైన్యం ఉండేది కాదు; యుద్ధం వచ్చినప్పుడు మాత్రమే గోత్రాల నుండి మనుషులను పిలిచేవారు. సౌలు ఈ పద్ధతిని మార్చి, ఇశ్రాయేలు చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక క్రమబద్ధమైన, శాశ్వత సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. అతడు దేశంలో ఎక్కడైనా బలవంతుడైన యోధుడిని గాని, పరాక్రమవంతుడైన యువకుడిని గాని చూస్తే, వారిని తన సొంత సైన్యంలో చేర్చుకుని పోషించేవాడు

7. మొదటి ప్రధాన వైఫల్యం – గిల్గాలులో తొందరపాటు బలి

సౌలు సైనిక పరంగా విజయాలు సాధిస్తున్నప్పటికీ, ఆత్మీయంగా దేవుని ఆజ్ఞలను పాటించడంలో విఫలమవడం ప్రారంభమైంది. అతని పతనానికి మొదటి అడుగు గిల్గాలులో పడింది.

  • పరిస్థితి: ఫిలిస్తియులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు, ఇశ్రాయేలు సైన్యం భయంతో చెదిరిపోతోంది. సమూయేలు ప్రవక్త చెప్పిన నిబంధన ప్రకారం సౌలు గిల్గాలులో ఏడు రోజులు వేచి ఉండాలి, ఆ తర్వాత సమూయేలు వచ్చి దహనబలి అర్పించి దేవుని సహాయాన్ని వేడాలి.
  • అవిధేయత: ఏడవ రోజు వస్తున్నా సమూయేలు ప్రవక్త  రావడం ఆలస్యమైంది. సైన్యం చేజారిపోతుందనే భయంతో, పరిస్థితుల ఒత్తిడికి తలవంచి, యాజకులకు మాత్రమే పరిమితమైన దహనబలిని సౌలు స్వయంగా అర్పించి దేవుని ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించాడు.
  • తీర్పు: బలి అర్పించడం పూర్తి కాగానే సమూయేలు వచ్చాడు. సౌలు చెప్పిన సాకులను ("ప్రజలు నా యొద్ద నుండి చెదరిపోవుట చూచితిని") సమూయేలు తృణీకరిస్తూ, నీవు బుద్ధిహీనమైన పని చేసితివి... నీ రాజ్యము నిలువదు, యావే       తన హృదయానుసారుడైన మనుష్యుని (దావీదును) వెదకుకొనెను అని మొదటి దైవ       తీర్పును ప్రకటించాడు.

8. నిర్ణయాత్మక పతనం – అమాలేకీయుల యుద్ధంలో పాక్షిక విధేయత

సౌలు జీవితంలో అత్యంత కీలకమైన మరియు దేవుడు అతనిని పూర్తిగా విస్మరించడానికి కారణమైన సంఘటన అమాలేకీయులతో జరిగిన యుద్ధంలో సంభవించింది.

      దేవుని సంపూర్ణ ఆజ్ఞ (అమాలేకీయులను, వారి పశువులను పూర్తిగా నాశనం చేయాలి

   సౌలు చేసిన పని: పాక్షిక విధేయత (మంచి వాటిని దాచి, బలహీనమైన వాటిని నాశనం చేశాడు

   దేవుని తీర్పు: "విధేయత చూపుట బలి అర్పించుటకంటె శ్రేష్ఠము"  సౌలు  రాజరికం రద్దు


  • దైవ ఆజ్ఞ: ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులు వస్తున్నప్పుడు అరణ్యంలో అమాలేకీయులు చేసిన ద్రోహానికి ప్రతిగా, వారిని, వారి పశువులను, ఆస్తిపాస్తులను పూర్తిగా నిర్మూలించాలని ('హేరెము' లేదా సంపూర్ణ నాశనం) దేవుడు సమూయేలు ద్వారా సౌలుకు స్పష్టమైన ఆజ్ఞ ఇచ్చాడు.
  • సౌలు రాజీ: సౌలు యుద్ధంలో గెలిచాడు కానీ దేవుని ఆజ్ఞను పాక్షికంగానే అమలు చేశాడు. అమాలేకీయుల రాజైన అగగును ప్రాణంతో పట్టుకున్నాడు; అలాగే ఉత్తమమైన గొర్రెలు, పశువులు, క్రొవ్విన దూడలను చంపకుండా దాచి, కేవలం పనికిరాని, బలహీనమైన వాటిని మాత్రమే నాశనం చేశాడు.
  • సమూయేలు గద్దింపు మరియు ప్రసిద్ధ వాక్యం: సమూయేలు వచ్చినప్పుడు సౌలు తాను ఆజ్ఞను నెరవేర్చానని అబద్ధం చెప్పాడు. అయితే పశువుల అరుపులు విన్న సమూయేలు అతనిని గద్దిస్తూ, పవిత్ర గ్రంధంలో అత్యంత ప్రాముఖ్యమైన సత్యాన్ని ప్రకటించాడు: "అందులకు సమూవేలు ఇట్లనెను: “బలులవలన, దహనబలులవలన యావే సంతృప్తి చెందునా? విధేయతవలనగాదా? బలి యర్పించుటకంటె విధేయత మేలు. పొట్టేళ్ళక్రొవ్వు వేల్చుటకంటె అణకువ లెస్స. తిరుగుబాటు సోదె చెప్పించుకొనుట వంటిది. గర్వము విగ్రహములను పూజించుట వంటిది. నీవు యావే మాట త్రోసివేసితివి కనుక యావే నీ రాచరికమును త్రోసివేసెను."
  • రాజ్యం చిరిగిపోవడం: సమూయేలు వెనుతిరిగి వెళ్తుండగా, సౌలు అతని వస్త్రపు అంచును పట్టుకోగా అది చినిగింది. దానికి సమూయేలు, యావే  నేడు ఇశ్రాయేలు రాజ్యమును నీయొద్దనుండి చింపివేసి, నీకంటె శ్రేష్ఠుడైన నీ పొరుగువానికిచ్చును  అని చెప్పి, ఆ తర్వాత తానే స్వయంగా అగగు రాజును నరికి దేవుని న్యాయాన్ని నెరవేర్చాడు.

9. దుష్టాత్మ పీడన, అసూయ మరియు దావీదు వెంటాడటం

అమాలేకీయుల యుద్ధం తర్వాత దేవుని ఆత్మ సౌలును విడిచిపెట్టింది, అతని స్థానంలో ఒక దుష్టాత్మ అతనిని పీడించడం ప్రారంభించింది. ఈ కాలంలోనే యవ్వనస్థుడైన దావీదు సౌలు ఆస్థానంలోకి ప్రవేశించాడు.https://www.carmelshobha.com/2026/04/daaveedu-raju-jeevitha-charitra-king-david-story-telugu.html

  • దావీదు రాక: సౌలు మానసిక ఆందోళనను, దుష్టాత్మ పీడనను తగ్గించడానికి దావీదు వీణ వాయించే సేవకుడిగా చేరాడు. దావీదు వీణ వాయించినప్పుడు సౌలుకు నెమ్మది కలిగేది.
  • అసూయ పుట్టుక: దావీదు గొల్యాతును చంపిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. ఇశ్రాయేలు స్త్రీలు నాట్యం చేస్తూ, "ఒకమారు దావీదు ఫిలిస్తీయులను గెలిచి నగరమునకు తిరిగివచ్చుచుండెను. యిస్రాయేలు పట్టణములనుండి స్త్రీలు తంబురా మొదలైన వాద్యములతో వెడలివచ్చి ఉత్సాహముతో పాడుచు, నాట్యమాడుచు సౌలునకు స్వాగతము పలికిరి. వారు సౌలు వేయిమందిని చంపెను, కాని దావీదు పది వేలమందిని చంపెను.  అని వాద్యములు మీటుచు వంతుపాట పాడిరి. ఆ మాటలు సౌలునకు నచ్చ లేదు. అతనికి అసూయ పుట్టెను. తనలో తాను “వీరు దావీదు పదివేలమందిని చంపెనని పలికి, నేను వేయి మందిని మాత్రమే చంపితినని నుడివిరి. ఇక రాచరిక మొకటి తప్ప అన్ని వైభవములు ఇతనికి అమరినట్లే గదా!” అనుకొనెను." 1 సమూయేలు 18: 6-8.  ఈ మాటలు సౌలు హృదయంలో తీవ్రమైన అసూయను, అభద్రతా భావాన్ని రేకెత్తించాయి. ఆ రోజు నుండి సౌలు దావీదును శత్రువుగా చూడటం ప్రారంభించాడు.
  • హత్యాయత్నాలు మరియు వేట:  అటు తరువాత సౌలు దావీదును చంపుటకు ప్రయత్నించేవాడు. సౌలు ఆవేశంలో దావీదుపైకి రెండుసార్లు ఈటెను విసిరాడు. తన కుమార్తెలైన మెరాబు, మీకాలుల వివాహ విషయాల్లో దావీదును ఫిలిష్తీయుల చేతిలో చంపించాలని కుట్రలు పన్నాడు. చివరకు, దావీదు ప్రాణ రక్షణ కోసం పారిపోగా, సౌలు తన రాజ్య బాధ్యతలను పక్కనబెట్టి, వేలమంది సైన్యంతో ఇశ్రాయేలు అరణ్యాలలో (ఏన్గెదీ, జీపు అరణ్యాలు) దావీదును వేటాడటానికే తన జీవితాన్ని వెచ్చించాడు.
  • దావీదు నీతి - సౌలు తాత్కాలిక పశ్చాత్తాపం: ఏన్గెదీ గుహలో మరియు జీపు అరణ్యపు దండులో దావీదుకు సౌలును చంపే అవకాశాలు వచ్చినా, "యావే       అభిషేకించిన వానిపై చెయ్యి వేయను" అని దావీదు సౌలును విడిచిపెట్టాడు. సౌలుకు ఈ విషయం తెలిసినప్పుడు, అతడు తాత్కాలికంగా కరిగిపోయి, "నీవు నాకంటే నీతిమంతుడవు" అని ఏడ్చినా, అతని హృదయం శాశ్వతంగా మారలేదు.

10. నోబు యాజకుల దారుణ మారణకాండ

సౌలు అంధమైన అసూయ, అనుమానం ఎంతటి క్రూరత్వానికి దారితీశాయో చూపించడానికి నోబు పట్టణంలో జరిగిన ఘటనే నిదర్శనం.

  • నేపథ్యం: దావీదు సౌలు నుండి పారిపోతున్నప్పుడు ఆహారం, ఆయుధం లేక నోబు పట్టణంలోని యాజకుడైన అహీమెలెకు వద్దకు వెళ్లాడు. దావీదు పారిపోతున్నాడనే విషయం తెలియక అహీమెలెకు అతనికి పరిశుద్ధమైన రొట్టెలను, గొల్యాతు కత్తిని ఇచ్చాడు.
  • క్రూరమైన ఆజ్ఞ: ఈ విషయాన్ని ఏదోమీయుడైన దోయేగు అనే పశువుల కాపరి సౌలుకు చేరవేశాడు. సౌలు తీవ్ర ఆగ్రహంతో నోబులోని యాజకులందరినీ పిలిపించాడు. వారు తమ నిర్దోషిత్వాన్ని చాటుకున్నప్పటికీ, సౌలు వారిని చంపమని తన సైనికులను ఆజ్ఞాపించాడు. దేవుని యాజకులపై చేయి వేయడానికి ఇశ్రాయేలు సైనికులు నిరాకరించారు.
  • మారణకాండ: అప్పుడు సౌలు దోయేగును ఆజ్ఞాపించగా, అతడు ఆ ఒక్క రోజే ఏనభై ఐదు మంది యాజకులను దారుణంగా హతమార్చాడు. అంతేకాకుండా, యాజకుల పట్టణమైన నోబులోని పురుషులను, స్త్రీలను, పిల్లలను, పశువులను కత్తి వాతతో    పూర్తిగా నిర్మూలించాడు. ఒకప్పుడు ప్రజలను కరుణించిన రాజు, దేవుని సేవకులనే దారుణంగా చంపే స్థాయికి దిగజారాడు.

11. ఏన్దోరు మంత్రగత్తెను ఆశ్రయించడం – ఆత్మీయ అంతం

సౌలు జీవితపు చివరి రోజుల్లో, ఫిలిస్తియులు గిల్బోవా పర్వతం వద్ద ఇశ్రాయేలుపై యుద్ధానికి మహా సైన్యంతో వచ్చారు. సమూయేలు ప్రవక్త అప్పటికే మరణించాడు.

  • దేవుని నిశ్శబ్దం: భయకంపితుడైన సౌలు దేవుని సహాయం కోసం ప్రార్థించాడు, కానీ దేవుడు కలల ద్వారా గాని, ఊరీము ద్వారా గాని, ప్రవక్తల ద్వారా గాని అతనికి ఏ జవాబును  ఇవ్వలేదు.
  • ధర్మశాస్త్ర ఉల్లంఘన: దేవుని నిశ్శబ్దాన్ని భరించలేక, నిరాశలో మునిగిన సౌలు, తానే స్వయంగా దేశం నుండి వెళ్లగొట్టిన మాంత్రికులను, సోదె చెప్పేవారిని ఆశ్రయించాలని నిర్ణయించుకున్నాడు. అతడు వేషం మార్చుకుని రాత్రి వేళ ఏన్దోరులోని ఒక మంత్రగత్తె వద్దకు వెళ్లాడు.
  • భయంకరమైన ప్రవచనం: మృతుడైన సమూయేలు ఆత్మను రప్పించమని ఆమెను కోరగా, సమూయేలు రూపంలో వచ్చిన సందేశం సౌలుకు తుది తీర్పును ప్రకటించింది: "ప్రభువు నిన్ను, యిశ్రాయేలుయులను ఫిలిస్తియుల  చేతికి అప్పగించును. రేపు నీవు, నీ తనాయులు నన్ను చెరుకొందురు"  అని చెప్పాడు.   ఈ మాటలు విన్న సౌలు భయంతో నేలపై పడిపోయాడు.

12. గిల్బోవా యుద్ధం మరియు సౌలు  మరణం

సమూయేలు చెప్పినట్లే మరుసటి రోజు గిల్బోవా పర్వతంపై ఫిలిస్తియులతో జరిగిన యుద్ధం ఇశ్రాయేలుకు మహా విషాదంగా మారింది.

గిల్బోవా పర్వత యుద్ధం సౌలు  కుమారుల మరణం: యోనాతాను, అబీనాదాబు, మల్కీషూవ యుద్ధంలో హతులయ్యారు.  సౌలుకు గాయం: విలుకాండ్ర బాణాల వల్ల తీవ్రంగా గాయపడ్డాడు.  అంతిమ ముగింపు: శత్రువుల చేతిలో అవమానం భరించలేక తన కత్తిపై పడి ఆత్మహత్య చేసుకున్నాడు. 


  • కుమారుల మరణం: యుద్ధంలో ఫిలిస్తియులు విజృంభించి సౌలు కుమారులైన యోనాతాను, అబీనాదాబు, మల్కీషూవలను చంపివేశారు. తన కళ్ల ముందే కుమారులు మరణించడం సౌలును మానసికంగా దెబ్బతీసింది.
  • ఆత్మహత్య: విలుకాండ్రు సౌలును చుట్టుముట్టి తీవ్రంగా గాయపరిచారు. సున్నతి లేని అన్యుల చేతిలో చిక్కి అవమానాలకు గురికావడం ఇష్టం లేక, తన ఆయుధాలు మోసే వానిని తనను చంపమన్నాడు. అతడు భయపడగా, సౌలు తన సొంత కత్తిని నేలపై నాటి, దానిపై పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
  • మృతదేహాల అవమానం మరియు దహనం: మరుసటి రోజు ఫిలిస్తియులు సౌలు తల నరికి, అతని కవచాన్ని అష్తారోతు గుడిలో ఉంచి, అతని మృతదేహాన్ని బేత్షాను గోడకు వ్రేలాడదీశారు. అయితే, పూర్వం సౌలు చేసిన మేలును  గుర్తున్న యాబేషు గిలాదు వీరులు రాత్రివేళ ప్రాణాలకు తెగించి వెళ్లి, ఆ దేహాలను తీసుకొచ్చి గౌరవప్రదంగా  ఖననం చేశారు.

13. సౌలు పరిపాలన – చారిత్రక మరియు పురావస్తు ఆధారాలు

సౌలు పరిపాలించిన కాలం ఇశ్రాయేలు సమాజంలో న్యాయాధిపతుల కాలం నుండి రాచరిక వ్యవస్థకు మారే సంధి కాలం. అపొస్తలుడైన పౌలు అపొస్తలుల కార్యములు 13:21లో సౌలు నలభై సంవత్సరాలు పరిపాలించాడని ధృవీకరించాడు.

ఆధునిక పురావస్తు శాస్త్రజ్ఞులు సౌలు రాజధాని అయిన గిబియా  ప్రాంతంలో జరిపిన తవ్వకాలలో ఆ కాలానికి చెందిన ఒక సాధారణ కోట అవశేషాలను కనుగొన్నారు. ఇది తరువాత వచ్చిన సొలొమోను రాజు వైభవంతో పోలిస్తే చాలా సాధరణమైనది, ఇది సౌలు పరిపాలన ప్రారంభ దశకు, నిరంతర యుద్ధాల ఒత్తిడికి నిదర్శనం.

14. సౌలు మరియు దావీదు – ఇద్దరు రాజుల తులనాత్మక పరిశీలన

ఇశ్రాయేలు మొదటి ఇద్దరు రాజులైన సౌలు, దావీదుల జీవిత విధానాలు, వారి హృదయ అంతరంగ స్థితిని స్పష్టం చేస్తాయి:

పరిశీలనా అంశం

సౌలు జీవిత విధానం

దావీదు జీవిత విధానం

పాపముపై ప్రతిస్పందన

తప్పు చేసినప్పుడు సాకులు చెప్పాడు, బాధ్యతను ప్రజలపై నెట్టాడు.

తప్పు తెలిసిన వెంటనే ఎలాంటి సాకులు లేకుండా పశ్చాత్తాపపడ్డాడు (కీర్తన 51).

అధికార రక్షణ

తన సింహాసనాన్ని కాపాడుకోవడానికి నిర్దోషులను, యాజకులను చంపాడు.

దేవుని సమయం కోసం వేచి ఉండి, అభిషిక్తుడైన సౌలును చంపడానికి నిరాకరించాడు.

ముఖ్యమైన ప్రాధాన్యత

దేవుని ఆజ్ఞ కంటే ప్రజాభిప్రాయానికి, లోక గౌరవానికి విలువ ఇచ్చాడు.

ఎన్ని తప్పులు చేసినా అంతిమంగా దేవుని హృదయానుసారుడిగా నిలిచాడు.

15. సౌలు జీవితం నుండి నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠాలు

సౌలు జీవిత చరిత్ర కేవలం ఒక రాజు కథ కాదు; ఇది ప్రతి విశ్వాసికి, నాయకునికి ఒక హెచ్చరికల పాఠశాల:

  1. పాక్షిక విధేయత అవిధేయతే: అమాలేకీయుల విషయంలో సౌలు  కొంత దేవుని  ఆజ్ఞను పాటించినా, దేవుడు దానిని పూర్తిగా తిరస్కరించాడు. దేవుడు కోరుకునేది సంపూర్ణ విధేయత.
  2. సాకుల ధోరణి ప్రమాదకరం: తప్పులను ఒప్పుకోకుండా పరిస్థితులను నిందించడం ఆత్మీయ క్షీణతకు దారితీస్తుంది.
  3. అసూయ సర్వనాశనం చేస్తుంది: దావీదుపై సౌలు పెంచుకున్న అసూయ అతని సామ్రాజ్యాన్ని, మానసిక ప్రశాంతతను మరియు చివరకు అతని కుటుంబాన్ని నాశనం చేసింది.
  4. ఆచారాలు విధేయతకు ప్రత్యామ్నాయం కావు: దేవునికి బలులు అర్పించడం కంటే ఆయన ఆజ్ఞలకు లోబడటమే శ్రేష్ఠమైనది.

16. ముగింపు మరియు ప్రార్థన

సౌలు జీవితం గొప్ప ఆశీర్వాదాలు, అద్భుతమైన విజయాలతో ప్రారంభమై, దేవుని ఆజ్ఞల పట్ల నిర్లక్ష్యం, హృదయ కాఠిన్యం వల్ల ఆత్మహత్య అనే విషాదకరమైన ముగింపుకు చేరుకున్నాడు.  దేవుని కృపను పొందడం ఎంత ప్రాముఖ్యమో, ఆ కృపలో నిరంతర వినయంతో, విధేయతతో కొనసాగడం అంతకంటే ప్రాముఖ్యమని సౌలు చరిత్ర మనకు బోధిస్తుంది. 

ముగింపు ప్రార్థన

ప్రభువైన దేవా, సౌలు జీవితం నుండి మేము నిజమైన ఆత్మీయ పాఠాలు నేర్చుకునేలా సహాయం చేయుము. మా హృదయాలలో లోకసంబంధమైన అసూయ, అహంకారము, మరియు సాకులు చెప్పే బలహీనత చోటు చేసుకోకుండా కాపాడుము. నీ ఆజ్ఞలకు పాక్షికంగా కాక, సంపూర్ణంగా విధేయత చూపే మనస్సును దయచేయుము. జోనాతాను వలె నిస్వార్థంగా, సమూయేలు వలె నమ్మకంగా, నీ చిత్తానికి జీవితాంతం లోబడి ఉండే కృపను మాకు అనుగ్రహించుము. ఆమెన్.

 

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబిల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పవిత్రుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

📲 మా WhatsApp Channel జాయిన్ అవ్వండి!

ప్రతి నిత్య పోస్ట్ మీ WhatsApp కు నేరుగా వస్తుంది

Join WhatsApp Channel

Comments

మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:

Post a Comment

కామెంట్‌లు