మత్తయి 11:25-27 వివరణ: పసిబిడ్డల వంటి దీనులకే దైవ రహస్యాలు | కార్మెల్ శోభ
మత్తయి 11:25-27
ఆ సమయమున యేసు ఇట్లనెను: “పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రీ! విజ్ఞులకు, వివేకవంతులకు వీటిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి. కనుక నిన్ను స్తుతించుచున్నాను.అవును తండ్రీ! ఇది నీ అభీష్టము.” 'నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి యున్నాడు. తండ్రి తప్ప మరెవ్వరును కుమారుని ఎరుగరు. కుమారుడు తప్ప మరెవ్వరును తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఉద్దేశించునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు.”
పవిత్ర గ్రంధములో యేసు క్రీస్తు పలికిన ప్రతి మాట ఒక అమూల్యమైన రత్నం. అయితే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 25 నుండి 27 వరకు ఉన్న వచనాలు అత్యంత ప్రత్యేకమైనవి, మనోహరమైనవి. ఎందుకంటే, ఇక్కడ యేసు ప్రభువు కేవలం ప్రజలతో మాట్లాడటం లేదు; ఆయన తన తండ్రితో సంభాషిస్తూ, పరలోకపు మర్మాలను భూమిపైకి కుమ్మరిస్తున్నాడు. ఈ వచనాలు దేవుని శక్తిని మానవవినయాన్ని, పిత,పుత్రపవిత్రాత్మలబంధాన్నితెలుపుతున్నాయి.
ఒకవైపుఅద్భుతాలు చూసి కూడా హృదయాలను కఠినం చేసుకున్న నగరాలు, మరోవైపు యేసు ప్రభువును వెంబడిస్తున్న సామాన్యులు. ఈ వైరుధ్యాల మధ్య నుండి పుట్టిన యేసు క్రీస్తు కృతజ్ఞతా ప్రార్థన, నేటి మన ఆధునిక జీవితాలకు, మన సమాజానికి దిక్సూచిగా నిలుస్తుంది.
11. వైఫల్యం మరియు తిరస్కారాల మధ్య
పుట్టిన ఆనంద ధ్వని
ఏదైనా ఒక దైవ సత్యాన్ని అర్థం
చేసుకోవాలంటే, అది ఏ పరిస్థితులలో పలకబడిందో గ్రహించడం ఎంతో
ముఖ్యం. యేసు క్రీస్తు గలిలయ ప్రాంతంలోని కొరాజీను, బెత్సయిదా, కఫర్నము వంటి పట్టణాలలో ఎన్నో అద్భుతాలు చేశాడు.
కుంటివారు నడిచారు, గ్రుడ్డివారికి చూపు వచ్చింది, దైవ రాజ్య సందేశాన్ని శక్తివంతంగా
ప్రకటించబడింది. సాధారణంగా ఇంతటి అద్భుతాలు చూసిన తర్వాత ఆయా ప్రాంతాల ప్రజలు
పశ్చాత్తాపపడి, దేవుని వైపు తిరగాలి. కానీ, ఆ నగరాలలోని వారు అహంకారంలోనే
ఉండిపోయారు. వారు యేసు ప్రభువును, ఆయన సందేశాన్ని
తిరస్కరించారు.
మానవీయ కోణంలో చూస్తే ఇది ఒక
పెద్ద వైఫల్యం. మనమైతే మన పరిచర్యలోనో, జీవితంలోనో ఇంతటి
తిరస్కారాన్ని ఎదుర్కొంటే నిరాశ చెందుతాం, లేదా ఆగ్రహిస్తాం. కానీ, యేసు క్రీస్తు ఆ నిరాశాజనక వాతావరణంలో తండ్రిని
స్తుతించడం ప్రారంభించాడు. లూకా సువార్త 10:21లో ఇదే సందర్భాన్ని వివరిస్తూ, ఆయన "పవిత్రాత్మ యందు ఆనందించెను" అని
రాయబడింది. అంటే, లోకపు తిరస్కారం దేవుని ప్రణాళికను ఆపలేదనే
సత్యాన్ని యేసు ప్రభువు ఇక్కడ మనకు
చూపిస్తున్నాడు.
యేసు ప్రభువు ప్రార్ధిస్తూ, "పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రీ" అని ప్రారంభించాడు. ఈ సంబోధన చాలా లోతైనది. ఇది ఆదికాండంలో అబ్రాహామును ఆశీర్వదించిన మెల్కీసెదెకు దేవుడిని పిలిచిన విధానాన్ని గుర్తుచేస్తుంది. దేవుడు కేవలం ఒక చిన్న సమూహానికి పరిమితమైనవాడు కాదు; ఆయన సృష్టి అంతటికీ సర్వాధికారి. గలిలయ నగరాలు ఆయనను తిరస్కరించినంత మాత్రాన ఆయన అధికారానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఈ విశ్వప్రభువు తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి లోకపు పద్ధతులను కాకుండా, ఒక విప్లవాత్మకమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆ మార్గమే విజ్ఞులకు మరుగుచేసి, పసిబిడ్డలకు బయలుపరచడం.
2. దేవుని విప్లవాత్మక ఎంపిక:
జ్ఞానుల గ్రుడ్డితనం – దీనుల వెలుగు
సృష్టికర్త అయిన దేవుడు తన
రక్షణ ప్రణాళికను లోకానికి వెల్లడి చేయాలనుకున్నప్పుడు, ఆయన ఎంచుకున్న పద్ధతి లోక జ్ఞానాన్ని
తలక్రిందులు చేసింది. "నీవు విజ్ఞులకు, వివేకవంతులకు వీటిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి" అని యేసు ప్రభువు తండ్రిని స్తుతిస్తున్నాడు. ఇక్కడ మనం రెండు
వర్గాల ప్రజలను చూస్తాం: ఒకరు జ్ఞానులు, రెండు పసిబిడ్డలు.
జ్ఞానులు మరియు వివేకులు ఎవరు?
యేసు ప్రభువు కాలంలో "జ్ఞానులు" అంటే మోషే
ధర్మశాస్త్రాన్ని ఔపోసన పట్టిన పరిసయ్యులు, ధర్మ శాస్త్ర
బోధకులు మరియు సద్దూకయ్యులు. వారు సమాజంలో అత్యున్నత
పీఠాలపై కూర్చున్నారు. తమ స్వంత బుద్ధి బలంపై, పాండిత్యంపై వారికి అమితమైన నమ్మకం ఉండేది. వారు దేవుని వాక్యాన్ని ఒక
అధికార సాధనంగా మార్చుకున్నారు. వారి హృదయాలు గర్వంతో నిండిపోవడం వల్ల, సాక్షాత్తూ దేవుని కుమారుడు వారి కళ్ల ముందే
తిరుగుతున్నా, వారు ఆయనను గుర్తించలేకపోయారు. వారి జ్ఞానమే వారికి ఒక ఆధ్యాత్మిక
గ్రుడ్డితనంగా మారింది.
పసిబిడ్డలు (Nēpioi) ఎవరు?
గ్రీకు మూల భాషలో ఇక్కడ
వాడబడిన పదం ‘పసిబిడ్డలు’ అంటే కేవలం వయసులో చిన్నవారు కాదు; కపటము లేనివారు, ఏ శక్తీ లేనివారు, పూర్తిగా తల్లిదండ్రులపై
ఆధారపడేవారు అని అర్థం. ఆధ్యాత్మిక కోణంలో వీరు దేవుని యెదుట తమ శూన్యతను లేక ఏమిలేని తనాన్ని ఒప్పుకునే దీనులు. యేసు ప్రభువును వెంబడించిన గలిలయ జాలరులు, సమాజం అసహ్యించుకున్న సుంకరులు, పాపులు, అక్షరాస్యులు కాని సామాన్య
ప్రజలే ఈ పసిబిడ్డలు. వారికి ధర్మశాస్త్రపు లోతుపాతులు తెలియకపోవచ్చు, కానీ వారి హృదయాలు దేవుని స్వరానికి స్పందించేలా
సిద్ధంగా ఉన్నాయి.
అపొస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన లేఖ 1:21లో ఇదే సత్యాన్ని ధృవీకరిస్తూ, " దేవుడు. తన జ్ఞాన మందు సంకల్పించిన విధమున లోకము తన జ్ఞానము చేత ఆయనను ఎరుగక పోయెను. అందువలన మనము చేయు సువార్త ప్రకటనను వెర్రితనము చేత విశ్వసించు వారిని రక్షించుట ఆయనకు ఇష్టమయ్యేను. " అంటాడు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడనే (యాకోబు 4:6) అనే వాఖ్యలు ఇక్కడ అక్షరాలా నెరవేరింది. జ్ఞానం అనేది శాపం కాదు, కానీ జ్ఞానం వల్ల కలిగే గర్వం మనిషిని దేవునికి దూరం చేయకూడదు.
3. పసిబిడ్డ మనస్తత్వం: నిజమైన
ఆధ్యాత్మికతకు మూలస్తంభం
జ్ఞానులకు మరుగై పసిబిడ్డలకు
బయలుపరచబడిన ఈ సూత్రం నుండి, ఒక విశ్వాసిగా మనం కలిగి
ఉండవలసిన అంతరంగిక స్వభావాన్ని యేసు ప్రభువు స్పష్టం చేస్తున్నాడు. ఒక పసిబిడ్డలో ఉండే
ముఖ్యమైన లక్షణాలు మూడు:
- పూర్తి ఆధారపడటం: ఒక పసిబిడ్డకు తనంతట తానుగా
జీవించే శక్తి ఉండదు. ఆహారం కోసం, రక్షణ కోసం అది పూర్తిగా
తల్లిదండ్రులపైనే ఆధారపడుతుంది. ఆధ్యాత్మిక పసిబిడ్డలు కూడా "దేవా, నా
స్వంత నీతి, నా స్వంత జ్ఞానం నన్ను రక్షించలేవు; నీ
కృప లేకపోతే నేను క్షణకాలం కూడా జీవించలేను" అని దేవునిపై ఆధారపడతారు.
- నిష్కపటమైన విశ్వాసం: పసిబిడ్డలు
అనుమానించరు. తండ్రి చెయ్యి పట్టుకుంటే ఎక్కడికైనా ధైర్యంగా నడుస్తారు.
వారిలో కుయుక్తి, వంచన ఉండవు. దేవుని
వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నమ్మే గొప్పతనం వారి సొంతం.
- క్షమాగుణం మరియు గర్వరాహిత్యం: పిల్లలు
గొడవ పడినా మరుక్షణమే కలిసిపోతారు. వారి మనసులో పగ, కక్షలు
దాచుకోరు. అలాగే తాము గొప్పవారమనే అహంకారం వారికి తెలియదు.
మత్తయి 18:3లో యేసు ముందే చెప్పాడు: "మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోకరాజ్యములో ప్రవేశింపరని నిజముగా మీతో వక్కాణించు చున్నాను." మనం ఎంతగా బైబిల్ చదివినా, ఎన్ని డిగ్రీలు సంపాదించినా, దేవుని సన్నిధికి వచ్చేసరికి మనం ఒక చిన్న పసిబిడ్డలా మారాలి. మన హృదయం శూన్యంగా ఉన్నప్పుడే దేవుడు దానిని తన దైవిక జ్ఞానంతో నింపగలడు. నిండిన పాత్రలోకి ఏమీ వంపలేనట్లే, అహంకారంతో నిండిన హృదయంలోకి దేవుని వాక్యం ప్రవేశించలేదు.
4. సమాజములో సమానత్వం
యేసు ప్రభువు పలికిన ఈ మాటలు కేవలం
పరలోకపు సిద్ధాంతాలు కావు; ఇవి నాటి యూదా సమాజంలోనూ, నేటి మన సమాజంలోనూ ఒక గొప్ప సామాజిక
విప్లవానికి నాంది పలికాయి. నాటి సమాజంలో మత పెద్దలు సామాన్యులను
" ఈ ప్రజలు ధర్మశాస్త్రము ఎరుగరు, కనుక వీరు శాపగ్రస్తులు " (యోహాను 7:49) అని హీనంగా చూసేవారు. యేసు ప్రభువు ఆ వ్యవస్థ పునాదులను
కదిలిస్తూ, దేవుని దయ ఆ ఉన్నత వర్గాలకు కాక, ఈ పీడితులకు దక్కిందని ప్రకటించాడు.
నేటి మన సామాజిక పరిస్థితులను పరిశీలిస్తే, ఈ వాక్యం ఎంత ఆధునికమైనదో మనకు అర్థమవుతుంది. మన
సమాజం ఇప్పటికీ కుల వ్యవస్థలు, వర్గ విభేదాలు, విద్యా-ఆర్థిక అసమానతలతో విడిపోయి ఉంది. లోకపు
దృష్టిలో "విజ్ఞులు" అనగా ఉన్నత కులాలలో పుట్టినవారు, పెద్ద చదువులు చదివినవారు, సామాజిక హోదా ఉన్నవారు మాత్రమే దేవుని
ఆశీర్వాదాలకు అర్హులనే ఒక అలిఖిత నియమం ఉంటుంది.
కానీ దేవుని రాజ్యంలో లెక్కలు
వేరేలా ఉన్నాయి:
- గ్రామాల్లో
ఉండే నిరక్షరాస్యులైన కూలీలు,
- అడవుల్లో
నివసించే ఆదివాసులు,
- సమాజం
చేత వెలివేయబడిన వారు ,
- అణచివేతకు
గురవుతున్న మహిళలు,
వీరంతా హృదయపూర్వకంగా యేసు ప్రభువును నమ్మినప్పుడు, లోకంలోని మేధావులకు సైతం అర్థం కాని పరలోక సత్యాలను వారు అనుభవపూర్వకంగా గ్రహిస్తున్నారు. సమాజం ఎవరినైతే తృణీకరించిందో, దేవుడు వారినే తన రాజ్యానికి వారసులుగా ఎంచుకున్నాడు. ఇది సామాజిక న్యాయం, సమానత్వం యొక్క దైవ ప్రకటన. దేవుని యెదుట అందరూ సమానులే అనే సత్యం ఇక్కడ రూఢీ అవుతుంది.
5. దైవ కృప: "అవును
తండ్రీ, ఇది నీ అభీష్టమాయెను"
ఈ విధంగా జ్ఞానులకు మరుగుచేసి
పసిబిడ్డలకు బయలుపరచడం వెనుక ఉన్న అంతిమ కారణాన్ని యేసు ప్రభువు 26వ వచనంలో బయలుపరుస్తున్నాడు: "అవును తండ్రీ! ఇది నీ అభీష్టము."
ఇక్కడ మూల భాషలో వాడబడిన
గ్రీకు పదం "Eudokia". దీని అర్థం "దేవునికి అమితమైన ఆనందాన్ని
కలిగించే సంకల్పం" లేదా "అభీష్టం". రక్షణ అనేది మనిషి
యొక్క తెలివితేటల వల్లనో, సంపాదన వల్లనో వచ్చేది కాదు; అది కేవలం దేవుని ఉచిత కృప మరియు ఆయన ఇష్టంపై ఆధారపడి ఉంటుంది.
|
లోకపు కొలమానం |
దేవుని రాజ్యాంగం |
|
జ్ఞానం, పాండిత్యం |
వినయం, విధేయత |
|
సామాజిక హోదా, కులం |
హృదయ శుద్ధి, దీనత్వం |
|
స్వయం సమృద్ధి |
దేవునిపై సంపూర్ణ ఆధారం |
యేసు ప్రభువు "అవును తండ్రీ" అనడంలో దేవుని నిర్ణయానికి సంపూర్ణంగా లోబడటం కనిపిస్తుంది. మన జీవితాల్లో కూడా మనం అర్థం చేసుకోలేని అనేక సంఘటనలు జరుగుతుంటాయి. నీతిమంతులకు శ్రమలు రావచ్చు, భక్తిహీనులు వర్ధిల్లవచ్చు. అలాంటి సమయాల్లో మానవ జ్ఞానంతో దేవుడిని ప్రశ్నించకుండా, "అవును తండ్రీ, ఇది నీ అభీష్టం, నీ చిత్తం మేలైనది" అని అంగీకరించే మనస్తత్వాన్ని యేసు ప్రభువు ఇక్కడ మనకు నేర్పుతున్నాడు. దేవుని ఆలోచనలో విశ్రమించడమే నిజమైన విశ్వాసం.
6. తండ్రి-కుమారుల అనన్య బంధం
మరియు ఏకైక మధ్యవర్తిత్వం
దేవుని కృపను గూర్చి మాట్లాడిన తర్వాత, యేసు ప్రభువు తన దైవత్వాన్ని మరియు తండ్రితో తనకున్న ప్రత్యేక సంబంధాన్ని బాహాటంగా ప్రకటించాడు. "నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి యున్నాడు. తండ్రి తప్ప మరెవ్వరును కుమారుని ఎరుగరు. కుమారుడు తప్ప మరెవ్వరును తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఉద్దేశించునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు.”
ఈ వచనం ద్వారా మూడు ముఖ్యమైన సత్యాలు మనకు వ్యక్తమవుతున్నాయి:
ఎ) సమస్త అధికారము క్రీస్తుదే:
"సమస్తము నాకు అప్పగింపబడియున్నది" అని
చెప్పడం ద్వారా యేసు ప్రభువు సృష్టిపై, చరిత్రపై, రక్షణపై తనకు ఉన్న సర్వాధికారాన్ని స్పష్టం
చేస్తున్నాడు. మత్తయి 28:18లో పునరుత్థానుడైన యేసు
చెప్పిన మాటలకు ఇది ముందస్తు ప్రకటన. ఆయన కేవలం ఒక ప్రవక్త లేదా బోధకుడు కాదు; ఆయన తండ్రి యొక్క సర్వ సంపదలకు, అధికారానికి వారసుడు.
బి) పరస్పర అనన్య జ్ఞానం
తండ్రికి కుమారుడు, కుమారునికి తండ్రి తప్ప మరొకరికి వీరి అంతరంగిక
బంధం పూర్తిగా తెలియదు. ఇది పవిత్ర త్రిత్వము లోని అనంతమైన ప్రేమానురాగాలను చూపిస్తుంది. యోహాను సువార్త 10:15లో కూడా యేసు ప్రభువు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తాడు.
మానవ మేధస్సుతో దేవుని పూర్తిగా విశ్లేషించలేము, కానీ దానిని విశ్వాసంతో అంగీకరించగలం.
సి) యేసే ఏకైక మార్గం:
"కుమారుడు ఎవరికి ఎరిగింప ఉద్దేశించునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు." ఈ మాట అత్యంత ముఖ్యమైనది. దేవుడిని చేరుకోవడానికి లోకంలో ఎన్నో మార్గాలు, తపస్సులు, ఉన్నాయి. కానీ, నిజముగా తండ్రి అయిన దేవుడిని ఎరగాలంటే క్రీస్తు అనుగ్రహం తప్ప వేరే మార్గం లేదు. యోహాను 14:6లో "నా ద్వారానే తప్ప ఎవడును తండ్రియొద్దకు రాలేడు " అన్న మాటకు ఇది పరిపూర్ణ సమన్వయం. దేవుని దయ మనకు కలగాలంటే, మనం క్రీస్తును పసిబిడ్డలా ఆశ్రయించక తప్పదు. పునీత చిన్న తెరేజమ్మ దేవుని మీద ఈ నమ్మకం కలిగిఉండేవారు. నేను ఎప్పటికీ దేవుని యందు చిన్న బిడ్డలా ఉంటాను అనే భావంలో ఉండే వారు.
7. మన అంతరంగ శోధన
మత్తయి 11:25-27 వచనాల ధ్యానం మనలను ఆత్మశోధనకు
గురిచేయాలి. ఈ రోజు మనం ఆధ్యాత్మిక జీవితంలో ఏ స్థానంలో ఉన్నాం? జ్ఞానుల వర్గంలోనా, లేక పసిబిడ్డల వర్గంలోనా? ఈ వచనాలు మన దైనందిన జీవితానికి మూడు ముఖ్యమైన
సవాళ్లను విసురుతున్నాయి:
- ఆధ్యాత్మిక గర్వాన్ని విడనాడాలి: మనకు ఎన్ని పవిత్ర గ్రంధ వచనాలు కంఠతా
వచ్చు అనేవి దేవునికి ముఖ్యం కాదు. మన జ్ఞానం ఇతరులను తక్కువ చేసి చూపేలా
ఉంటే, మనం దేవుని రహస్యాలకు దూరంగా ఉన్నామని అర్థం.
ప్రతిరోజూ మోకాళ్లపై దేవుని వాక్యం యెదుట పసిబిడ్డలా కూర్చోవడం నేర్చుకోవాలి.
- కృపపై మాత్రమే ఆధారపడాలి: మన రక్షణ మన భక్తి క్రియల వల్ల రాలేదు, అది కేవలం దేవుని "అభీష్టం" (Eudokia) వల్లనే సాధ్యమైంది. కాబట్టి, మన జీవితాల్లో గర్వించడానికి ఏమీ లేదు.
- సమాజంలో క్రీస్తు మనస్సును కలిగి ఉండాలి: దేవుడు
సమాజంలోని దీనులను, అణగారినవారిని ప్రేమించి
వారికి తన సువార్తను బయలుపరిచినప్పుడు, విశ్వాసులుగా మనం కూడా ఆయా
వర్గాల ప్రజలను ప్రేమించాలి. కుల, మత, ఆర్థిక
భేదాలను పక్కనపెట్టి, అందరినీ క్రీస్తు ప్రేమతో
చేరదీయాలి. అప్పుడే మనం నిజమైన పరలోక రాజ్య ప్రతిరూపంగా మారుతుంది.
మత్తయి 11:25-27 వచనాలు దేవుని హృదయాంతరాళాలను మనకు విప్పి చూపే
అద్భుతమైన భాగం. లోకపు తిరస్కారాలు, అపజయాల మధ్య కూడా దేవుని
ప్రణాళిక ఎన్నడూ విఫలం కాదు అనడానికి ఈ వచనాలే నిదర్శనం. జ్ఞానుల అహంకారాన్ని
పక్కనబెట్టి, దీనులైన పసిబిడ్డలను తన మర్మాలకు
వారసులుగా చేసుకోవడం దేవుని కృపకు నిదర్శనం.
ప్రభువా ! ఈ లోక సంబంధమైన వ్యర్థ జ్ఞానాన్ని, అహంకారాన్ని విడిచి, మీరు చూపిన సాత్వికాన్ని, దీనమనస్సును ధరించుకొని, ఒక పసిబిడ్డలా మీ మీద ఆధారపడుతూ, మీరు బయలుపరిచిన రక్షణ ఆనందంలో జీవిస్తూ, ఆ వెలుగును ఇతరులకు పంచుతూ, చిన్న తెరేజమ్మలా ఎల్లప్పుడు మీ దృష్టిలో పసి బిడ్డల ఉండేలా అనుగ్రహించండి. ఆమెన్
Comments
మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:
Post a Comment