ప్రేమ కొరకు ఖడ్గం: మత్తయి 10:34–11:1 ఆధ్యాత్మిక ధ్యానం | ఆత్మ సాధన

 మత్తయి సువార్త 10:34 – 11:1


ప్రపంచమున శాంతిని నెలకొల్పుటకు నేను వచ్చినట్లు భావింపవలదు. ఖడ్గమునే కాని, శాంతిని నెలకొల్పుటకు నేను రాలేదు. నా రాక, తండ్రిని కుమారుడు, తల్లిని కుమార్తె, అత్తను కోడలు ప్రతిఘటించునట్లు చేయును. తన కుటుంబము వారే తనకు శత్రువులు అగుదురు. తన తండ్రిని గాని, తల్లిని గాని నా కంటె మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడుకాడు. తన కుమారునిగాని, కుమార్తెను గాని నా కంటె మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడుకాడు. తన, సిలువనెత్తుకొని నన్ను అనుసరింపనివాడు నాకు యోగ్యుడుకాడు. తన ప్రాణమును దక్కించుకొన యత్నించువాడు దానిని కోల్పోవును; నా కొరకు తన ప్రాణమును కోల్పోవువాడు దానిని దక్కించుకొనును. మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు. నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు. ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించువాడు, ప్రవక్త బహుమానమును పొందును. నీతిమంతుని నీతిమంతుడుగా గుర్తించి స్వీకరించు వాడు, నీతిమంతుని బహుమానమును పొందును. నా శిష్యుడని ఈ చిన్నవారలలో ఒకనికి ఎవడేని ఒక గ్రుక్కెడు మంచి నీరొసగువాడు తన బహుమానమును పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.” యేసు పండ్రెండుమంది శిష్యులకు తన ఆదేశములను ఒసగిన పిదప, ఆయా పట్టణములలో బోధించుటకును, ప్రసంగించుటకును బయలుదేరెను.

ప్రేమ కొరకు ఖడ్గం


 మత్తయి సువిశేషంలోని ఈ వాక్యభాగం ధ్యానం చేసినప్పుడు  మొదట మనకు కొంచెం అలజడి కలుగుతుంది. “ఖడ్గము,” “విభజన,” “సిలువ” మాటలు  సమాధనం  కోరుకునే హృదయానికి కఠినంగా వినిపించే మాటలు. కానీ యేసు మాటలు ఎప్పుడూ మనలను భయపెట్టడానికి కాదు, మనలను  స్వేచ్చా జీవులుగా  చేయడానికి పలుకబడ్డాయి. ఈ వాక్యాలను మౌనంలో, ప్రార్థనలో వాటిని మళ్ళీ మళ్ళీ నెమరువేసుకుంటే, వాటిలో దాగిన ప్రేమ నెమ్మదిగా వెల్లడవుతుంది. ఈ రోజు మనం ఈ వాక్యభాగాన్ని విశ్లేషణగా కాక, ఒక ప్రార్థనగా చూద్దాం.

ఇది మత్తయి సువార్తలోని రెండవ ప్రధాన ఉపన్యాసం ముగింపు భాగం. యేసు ప్రభువు తన పన్నెండుమంది శిష్యులను పరిచర్యకు పంపుతూ, వారికి ఇచ్చిన చివరి హెచ్చరికలు, వాగ్దానాలు ఇవి. ఈ మాటలు వినడానికి కఠినంగా ఉన్నా, వాటి వెనుక ఒక తండ్రి హృదయం దాగి ఉంది.  తన పిల్లలు ఎదుర్కోబోయే కష్టాలను ముందుగానే తెలియజేస్తూ, వారిని ఒంటరిగా వదిలిపెట్టని ఒక ప్రేమ కలిగిన తండ్రి మాటలు ఇవి. మనం కూడా ఈ మాటలను అదే హృదయంతో స్వీకరిద్దాం.  

ఖడ్గము — ప్రేమ యొక్క నిజాయితీ


నేను భూమిమీదికి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి; ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు” అని యేసు ప్రభువు అంటున్నప్పుడు, ఆయన మనలను యుద్ధానికి పిలవడం లేదు. ఆయన మనలో నిజాయితీకి పిలుస్తున్నాడు. మన హృదయంలో ఎన్నో అబద్ధపు శాంతులు దాగి ఉంటాయి. రాజీపడిన మౌనాలు, భయంతో దాచిన సత్యాలు, “బాధపెట్టకూడదు” అనే సాకుతో మనం ఎప్పటికీ చెప్పని మాటలు. ఇవి శాంతిలా కనిపించినా, అవి నిజమైన శాంతి కాదు; అవి నిద్రావస్థలో ఉన్న అశాంతి మాత్రమే.
యేసు ప్రభువు  తెచ్చిన ఖడ్గం మనలను చంపడానికి కాదు, మనలో ఏది నిజమో, ఏది అబద్ధమో వేరుచేయడానికి వచ్చింది. హెబ్రీయులకు రాసిన లేఖలో  చెప్పినట్టు, దేవుని వాక్యం “రెండు వైపులా పదునుగల  ఖడ్గముకంటెను వాడిగా” ఉండి, “ఆత్మను ప్రాణమును... వేరుపరచుచున్నది.” ఈ ఖడ్గం మన లోపలికి  మొదటిగా  వస్తుంది.   మన స్వంత హృదయంలోకి వస్తుంది. అది మనలో ఉన్న అర్ధమనసుని, రెండు దేవుళ్ళను సేవించాలనుకునే మన ప్రయత్నాలను  బయటపెడుతుంది. మీకా ప్రవక్త కాలంలో సమాజం చెడిపోయినప్పుడు కుటుంబాలలో నమ్మకం విచ్ఛిన్నమైనట్టే, సత్యం వెలుగులోకి వచ్చినప్పుడు, ఎంత సన్నిహిత సంబంధమైనా పరీక్షకు లోనవుతుంది. ఇది యేసు  ప్రభువు కోరుకున్నది కాదు.అటువంటి అర్ధమనస్సును తొలగించుకోవాలి. 

ప్రభూ, నా హృదయంలోని అర్ధమనసుతనాన్ని నీ ఖడ్గం వెల్లడించుగాక. నేను ఎక్కడ రాజీపడి, దానిని శాంతి అని పిలుచుకుంటున్నానో, అక్కడ నాకు ధైర్యాన్ని దయచేయుము.

కుటుంబంలో వచ్చే విభజన — ఒక బాధాకరమైన వాస్తవం


తండ్రిని కుమారుడు, తల్లిని కుమార్తె... ప్రతిఘటించునట్లు చేయును” అని యేసు ప్రభువు చెప్పినప్పుడు, ఆయన మనకు ఒక వాస్తవాన్ని ముందుగానే హెచ్చరిస్తున్నాడు, తప్పించుకోలేని ఒక బాధను సిద్ధపరుస్తున్నాడు. ఎంతోమంది విశ్వాసులకు ఇది కేవలం సిద్ధాంతం కాదు.  ఇది వారి సొంత జీవితకథ. తమ విశ్వాసం కారణంగా ఇంటి నుండి దూరమైనవారు, తమ కుటుంబ సభ్యుల అపార్థానికి గురైనవారు, తమ నిర్ణయాలను ఎవరూ అర్థం చేసుకోని ఒంటరితనంలో నడిచినవారు ఎందరో ఉన్నారు. యేసు  ప్రభువు ఈ బాధను తేలికగా తీసుకోడు; ఆయన దానిని ముందుగానే పలుకుతూ, “నేను నీతో ఉన్నాను, నీవు ఒంటరివి కావు” అని పరోక్షంగా చెబుతున్నాడు.

ఈ మాటలు కుటుంబాన్ని ద్వేషించమని బోధించడం లేదు. అలా అనుకుంటే అది యేసుప్రభువు   హృదయాన్ని అపార్థం చేసుకోవడమే. ఆయనే సిలువపై ఉండి తన తల్లిని శిష్యునికి అప్పగించి, ఆమెను జాగ్రత్తగా చూడమని కోరాడు. కుటుంబ ప్రేమ పవిత్రమైనది; కానీ సత్యం కోసం నిలబడేటప్పుడు ఆ ప్రేమే కొన్నిసార్లు పరీక్షకు లోనవుతుందని యేసు ప్రభువు  ముందే మనకు తెలియజేస్తున్నాడు. ఈ వాస్తవాన్ని ఎరిగినవాడు, అది వచ్చినప్పుడు నిరాశపడడు; బదులుగా, దానిని కూడా దేవుని చేతిలో ఉంచి ప్రార్థనతో ముందుకు సాగుతాడు.

ప్రభూ, నా కుటుంబంలో నా విశ్వాసం వలన కలిగే ఏ అపార్థాన్నైనా, ఏ దూరాన్నైనా సహనంతో, ప్రేమతో భరించే శక్తిని నాకు దయచేయుము. నేను ఎవరినీ ద్వేషించకుండా, అందరి కొరకూ ప్రార్థిస్తూ, రాజీ లేని సత్యంతో నిలబడేలా నన్ను బలపరచుము.

ప్రేమ క్రమం 


తండ్రిని గాని, తల్లిని గాని నా కంటె మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడుకాడు” అనే మాట వినగానే, మన హృదయం కొంచెం బిగుసుకుపోతుంది. మనం ప్రేమించే వారిని, మనలను పెంచిన వారిని, మన రక్తసంబంధాలను యేసు ప్రభువు  తిరస్కరిస్తున్నాడా అని అనిపిస్తుంది. కానీ ఇది తిరస్కరణ కాదు. ఏ ప్రేమనైనా సరైన స్థానంలో ఉంచనప్పుడు, అది క్రమేణా బరువుగా, భయంకరంగా మారిపోతుంది. తల్లిదండ్రుల ప్రేమను, పిల్లల ప్రేమను దేవుని స్థానంలో ఉంచినప్పుడు, ఆ ప్రేమే మనలను బంధిస్తుంది; అదే ప్రేమను దేవుని వెలుగులో ఉంచినప్పుడు, అది స్వేచ్ఛగా, స్వచ్ఛంగా విరబూస్తుంది.

సిలువ యోహాను తన రచనలలో చెప్పినట్టు, ఆత్మ దేవుని వైపు నడవాలంటే, తాను అంటిపెట్టుకున్న ప్రతి అనుబంధాన్ని,  అది ఎంత మంచిదైనా,  విడిచిపెట్టే ధైర్యం కావాలి. ఇది వస్తువులను వదలడం కాదు; హృదయపు పట్టును వదలడం. అబ్రాహాము ఇస్సాకును బలిపీఠం మీద ఉంచినప్పుడు, ఆయన కుమారుని ద్వేషించలేదు. ఆయన దేవున్ని  మొదటి స్థానంలో ఉంచాడు. అదే క్రమం మనలో కూడా నెలకొల్పబడాలి. దేవుడు మొదట, తరువాత అన్నీ అప్పుడే ప్రతి బంధం దాని నిజమైన అందాన్ని పొందుతుంది.

ఆలోచించి చూస్తే, ఈ క్రమం మనలను పేదవారిని చేయడానికి కాదు, మనలను ధనవంతులను చేయడానికే దేవుడు ఇచ్చాడు. ఒక నదిని దాని మూలం నుండి వేరుచేస్తే అది ఎండిపోయినట్టే, మన ప్రేమలను వాటి మూలమైన దేవుని నుండి వేరుచేస్తే, అవి కూడా క్రమేణా అలసిపోతాయి, భారంగా మారతాయి. తల్లిదండ్రులను, పిల్లలను, స్నేహితులను దేవుని కంటే ఎక్కువగా పట్టుకున్నప్పుడు, మనం తెలియకుండానే వారిపై ఒక అసాధ్యమైన బరువును మోపుతాము. వారు దేవుడు మాత్రమే ఇవ్వగల నిండుదనాన్ని మనకు ఇవ్వాలని ఆశిస్తాము. అది వారికీ, మనకూ కూడా అన్యాయం. కానీ దేవుణ్ణి మొదట ప్రేమించినప్పుడు, మనం మన ప్రియులను ఏమీ ఆశించకుండా, స్వేచ్ఛగా, నిజాయితీగా ప్రేమించగలుగుతాము.

ప్రభూ, నేను నీ స్థానంలో ఉంచిన ప్రతి బంధాన్ని, ప్రతి భయాన్ని గుర్తించే జ్ఞానాన్ని నాకు దయచేయుము. నిన్ను మొదట ప్రేమించడం నేర్పుము, తద్వారా నేను నా ప్రియులను మరింత స్వచ్ఛంగా ప్రేమించగలను.

ప్రతిదిన సిలువ

తన సిలువనెత్తుకొని నన్ను అనుసరింపనివాడు నాకు యోగ్యుడుకాడు.” ఈ మాటలు యేసు  ప్రభువు  సిలువ మోయకముందే పలికాడు. అంటే, సిలువ అనేది ఆయన అనుభవానికి మాత్రమే పరిమితమైనది కాదు; అది ప్రతి శిష్యుని జీవితంలో ఒక నిత్య వాస్తవం. మనం సిలువ అనగానే ఏదో గొప్ప త్యాగాన్ని, నాటకీయమైన బాధను ఊహించుకుంటాం. కానీ చాలాసార్లు సిలువ అనేది చిన్నదిగా, నిశ్శబ్దంగా వస్తుంది. క్షమించాల్సిన సందర్భంలో, ఓర్పు వహించాల్సిన క్షణంలో, సత్యం చెప్పి పరిణామాలను ఎదుర్కోవాల్సిన సమయంలో మనకు సిలువలు వచ్చినప్పుడు వాటిని అందుకోగలగాలి.

తన ప్రాణమును దక్కించుకొన యత్నించువాడు దానిని కోల్పోవును” అనే వైరుధ్యం జీవితమంతా మనలను వెంబడిస్తుంది. మనం మనలను రక్షించుకోవాలని ఎంత ప్రయత్నిస్తామో, అంతగా మనంలో శూన్యత ఏర్పడుతుంది. కానీ ప్రేమతో మనలను మనం ధారపోసినప్పుడు, ఏదో వింత రీతిలో మనం నిండుగా మారతాం. ఇది తర్కానికి అందని రహస్యం, కానీ సిలువ ముందు నిలబడిన ప్రతి హృదయానికి ఇది తెలిసిన సత్యం.  అవిలాపూరి తెరిసమ్మ  చెప్పినట్టు, ఆత్మ తనను తాను మరచిపోయినప్పుడే దేవునిలో నిజంగా తనను తాను కనుగొంటుంది.

మనం తరచుగా సిలువను దూరంగా, భవిష్యత్తులో ఎప్పుడో వచ్చే గొప్ప పరీక్షగా ఊహించుకుంటాం. కానీ యేసు ప్రభువు  “ప్రతిదినము” తన సిలువను ఎత్తుకొనమని చెప్పాడు (లూకా 9:23). నిన్నటి సిలువను ఈ రోజు మోయాల్సిన అవసరం లేదు; ఈ రోజు సిలువ చాలు. అది ఒక్క రోజు మాత్రమే,  ఒక కష్టమైన సంభాషణ, ఒక అపార్థాన్ని ఓపికగా భరించడం, ఒక ప్రలోభాన్ని తిరస్కరించడం, ఒక అలసటలో కూడా ప్రేమతో సేవ చేయడం. ఈ చిన్న, రోజువారీ మరణాలే మనలను నెమ్మదిగా క్రీస్తు పోలికలోకి మలుస్తాయి. వీటిని గుర్తించి, ప్రేమతో స్వీకరించడమే నిజమైన శిష్యత్వం.

ప్రభూ, నా జీవితంలోని చిన్న సిలువలను  నిశ్శబ్దమైన త్యాగాలను, గుర్తించబడని ఓర్పులను,  ప్రేమతో స్వీకరించే శక్తిని నాకు దయచేయుము. నేను నన్ను నేను కాపాడుకోవాలని కాక, నిన్ను వెతుకుతూ నన్ను నేను మరచిపోయేలా నడిపించుము.

చిన్న ప్రేమ కార్యాల మహిమ


ఈ కఠినమైన మాటల తరువాత, యేసు ప్రభువు  అనూహ్యంగా మృదువుగా మాట్లాడుతాడు: “ఈ చిన్నవారలలో ఒకనికి ఎవడేని ఒక గ్రుక్కెడు మంచి నీరొసగువాడు తన బహుమానమును పోగొట్టుకొనడు.” ఖడ్గం, సిలువ, త్యాగం అనే భారీ మాటల మధ్య, ఒక్కసారిగా ఒక గ్లాసు నీటి చిత్రం మనకు కనిపిస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు. యేసు ప్రభువు మనకు   ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడూ నాటకీయమైన వీరత్వంలో మాత్రమే వ్యక్తం కాదు; అది తరచుగా అతి సామాన్యమైన దయా కార్యాలలో నివసిస్తుంది అని గుర్తుచేస్తున్నాడు. 

దాహంతో ఉన్నవానికి ఒక గ్లాసు నీరు ఇవ్వడం. ఇది ఎవరూ గమనించని పని కావచ్చు, కానీ దేవుని కళ్ళలో అది మరచిపోబడదు. ఇది మనకు ఒక గొప్ప సాంత్వననిస్తుంది.  మనం అందరం అబ్రాహాములు కాలేకపోవచ్చు, మనం అందరం ప్రవక్తలుగా పిలవబడకపోవచ్చు, కానీ మనం అందరం ప్రేమతో ఒక చిన్న పని చేయగలం. ఆ చిన్న పనే దేవుని రాజ్యంలో అమూల్యమైనది.

ఇది మనలో చాలామందికి పెద్ద ఊరట. ఎందుకంటే మనలో చాలామంది “నేను ఏమీ చేయలేకపోతున్నాను” అనే భావనతో బాధపడుతుంటాం. మనం మిషనరీలం కాదు, గొప్ప బోధకులం కాదు, అద్భుతాలు చేసేవారం కాదు అని అనుకుంటాం. కానీ యేసు ప్రభువు  మనకు చూపిస్తున్నది వేరే మార్గం  పెద్దగా కనిపించనిమార్గం.  కానీ ప్రేమతో నిండిన జీవితం. ఒక అనారోగ్యంతో ఉన్న పొరుగువారిని పలకరించడం, ఒక ఒంటరి వృద్ధురాలికి కొంత సమయం ఇవ్వడం, పిల్లలకు ఓపికగా బోధించడం, ఒక అలసిన హృదయానికి చిరునవ్వుతో మాట్లాడటం  ఇవన్నీ “గ్రుక్కెడు మంచి నీరు” వంటివే. దేవుని దృష్టిలో పరిమాణం ముఖ్యం కాదు; ప్రేమ యొక్క నిజాయితీయే ముఖ్యం.

ప్రభూ, నా చేతులను చిన్న ప్రేమ కార్యాలకు సిద్ధపరచుము. నేను గొప్ప కార్యాల కొరకు వేచి ఉండకుండా, ఈ రోజు నా ముందున్న చిన్న అవకాశాన్ని ప్రేమతో స్వీకరించేలా నాకు సహాయం చేయుము.

యేసు ముందు నడుస్తాడు


ఈనాటి సువిశేషం చివరిలో  “యేసు... బోధించుటకును ప్రసంగించుటకును బయలుదేరెను” అని మత్తయి రాస్తాడు. శిష్యులను కష్టతరమైన బాధ్యతల వైపు పంపిన తరువాత, యేసు ప్రభువు  తానేమి  విశ్రాంతి తీసుకోలేదు; ఆయనే ముందుకు నడిచాడు. ఇది మనకు గొప్ప ఓదార్పు. యేసు ప్రభువు  మనలను ఎన్నడూ ఒంటరిగా వదిలిపెట్టడు. ఆయన మన నుండి  ఏది కోరుతున్నాడో, దానిని ఆయనే ముందుగా జీవించాడు.  విభజనను, తిరస్కరణను, సిలువను, చివరకు మరణాన్ని కూడా.

కాబట్టి మనం ఈ కఠినమైన మాటలను భయంతో కాక, నమ్మకంతో వినవచ్చు. ఖడ్గం మనలను వేరుచేయవచ్చు, కానీ అది మనలను దేవుని దగ్గరికి తెచ్చే ఖడ్గం. సిలువ మనలను బరువెక్కించవచ్చు, కానీ దానిని మోసేవాడు మన పక్కనే నడుస్తున్నాడు. ప్రేమ యొక్క క్రమం మనలను కష్టపెట్టవచ్చు, కానీ అది మనలను నిజమైన స్వేచ్ఛకు నడిపిస్తుంది.

కర్మెలీయ  ఆధ్యాత్మికతలో మనం తరచుగా వినే ఒక సత్యం ఇదే  ఆత్మ యొక్క ప్రయాణం సౌకర్యమైన మార్గం కాదు, కానీ అది ప్రేమతో నింపబడిన మార్గం. ఏలీయా ప్రవక్త  కార్మెల్ కొండపై ఒంటరిగా నిలబడినప్పుడు, తుఫానులో కాదు, భూకంపంలో కాదు, అగ్నిలో కాదు, “మెల్లని మృదువైన స్వరం”లో దేవుడు అతనికి కనిపించాడు. అదే విధంగా, ఈ వాక్యభాగంలోని కఠినమైన మాటల వెనుక కూడా, నిశ్శబ్దంగా వినిపించే ఒక ప్రేమపూర్వక స్వరం ఉంది.  నేను నీతో ఉన్నాను, నీవు నా కొరకు వదులుకున్నదంతా నేను వందరెట్లు తిరిగి ఇస్తాను అనే వాగ్ధానం ఇక్కడ ఉంది  (మత్తయి 19:29). ఈ వాగ్దానాన్ని హృదయంలో పదిలపరచుకుని, మనం ఈ వాక్యభాగాన్ని భయంతో కాక, ఆశతో ముగించవచ్చు.

 ప్రార్థన


ప్రభువా, నీవు నాకు తెచ్చిన ఖడ్గాన్ని నేను భయపడకుండా స్వీకరించేలా నాకు సహాయం చేయుము. నా హృదయంలోని అబద్ధపు శాంతులను వేరుచేసి, నీలో మాత్రమే దొరికే నిజమైన శాంతిని నాకు అనుగ్రహించుము. నిన్ను అన్నింటికంటే మిన్నగా ప్రేమించే హృదయాన్ని నాకు దయచేయుముతద్వారా నా కుటుంబాన్ని, నా ప్రియులను నేను స్వచ్ఛంగా, స్వేచ్ఛగా ప్రేమించగలను. నా జీవితంలోని చిన్న సిలువలను, నిశ్శబ్దమైన త్యాగాలను, గుర్తించబడని ఓర్పులను, ప్రేమతో మోసే శక్తిని నాకు దయచేయుము. నా చేతులను, నా హృదయాన్ని చిన్న ప్రేమ కార్యాలకు సిద్ధపరచుముదాహంతో ఉన్నవానికి ఒక గ్లాసు నీరు ఇచ్చే వినయాన్ని నాకు నేర్పుము.  నా ముందు నడుస్తున్న నిన్ను నేను అనుసరించేలా, నా భయాలను నీ ప్రేమతో జయించేలా నన్ను బలపరచుము. ఆమెన్  

 

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబిల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పవిత్రుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

📲 మా WhatsApp Channel జాయిన్ అవ్వండి!

ప్రతి నిత్య పోస్ట్ మీ WhatsApp కు నేరుగా వస్తుంది

Join WhatsApp Channel

Comments

మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:

Post a Comment

కామెంట్‌లు