సంసోను పూర్తి చరిత్ర: బలవంతుడైన న్యాయాధిపతి వీరగాథ మరియు పతనం| కార్మెల్ శోభ
సంసొను- బలవంతుడైన న్యాయాధిపతి పరిపూర్ణ జీవిత చరిత్ర
బలవంతుడైన న్యాయాధిపతి కథ
పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం (Judges)
పదమూడవ అధ్యాయం నుండి పదహారవ అధ్యాయం వరకు మనకు కనిపించే అత్యంత
విలక్షణమైన, విషాదభరితమైన మరియు అదే సమయంలో
ఆశ్చర్యకరమైన వ్యక్తిత్వం సంసొనుది . ఇశ్రాయేలు జనులు ఫిలిస్తియుల చేతిలో
నలిగిపోతున్న కాలంలో, దేవుడు తన ప్రజలను విడిపించడానికి ఒక
ప్రత్యేకమైన మనిషిని ఎన్నుకున్నాడు. ఆ మనిషి పేరు సంసొను.
హీబ్రూ భాషలో 'షింషోన్'
అంటే 'సూర్యుని వంటివాడు' లేక 'సూర్యకాంతి కలవాడు' అని అర్థం.
సంసొను జీవితం వైరుధ్యాల సమాహారం. అతడు
పుట్టుకకు ముందే దేవునికి ప్రతిష్ఠించబడిన నాజీరియుడు, అయినా
తన కోరికలకు లోబడి తరచూ దేవుని నియమాలను అతిక్రమించిన మనిషి. అతడు వేలాదిమంది
శత్రువులను ఒంటరిగా ఓడించగల అసాధారణ శక్తిని కలిగిన వీరుడు, అయినా
ఒక స్త్రీ మాటలకు లొంగిపోయి తన రహస్యాన్ని వెల్లడించిన బలహీనుడు. అతడు ఇశ్రాయేలు
ప్రజలను ఇరవై సంవత్సరాలు న్యాయాధిపతిగా నడిపించిన నాయకుడు, అయినా
తన వ్యక్తిగత కోరికలు, కోపం, ప్రతీకారవాంఛల
వెంట నడిచిన మనిషి కూడా.
అయితే సంసొను కథ కేవలం ఒక వీరుని కథ కాదు; అది దేవుని కృప, మానవుని బలహీనత, పాపం యొక్క పరిణామాలు, పశ్చాత్తాపం, మరియు అంతిమంగా దేవుని పథకం ఎలా నెరవేరుతుందో తెలియజేసే జీవితం. ఇక్కడ సంసొను జననం నుండి మరణం వరకు జరిగిన ప్రతి ముఖ్య ఘట్టాన్ని కాలానుక్రమంగా పరిశీలిస్తూ, అతని తల్లిదండ్రులు, అతని ప్రేమలు, అతని విజయాలు, అతని శత్రువులు, అతని పతనం, మరియు అతని జీవితాంతం దేవునిపై అతడు చూపిన నమ్మకాన్ని లోతుగా ధ్యానిద్దాం.
ఫిలిస్తియుల అణచివేత
న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలు ప్రజలు
పదే పదే ఒక చక్రంలో చిక్కుకుపోయేవారు. వారు దేవుని నుండి దూరమై విగ్రహారాధనలో పడేవారు,
దాని ఫలితంగా శత్రువుల చేతికి అప్పగించబడేవారు, బాధలో మొరపెట్టుకునేవారు, అప్పుడు దేవుడు ఒక
న్యాయాధిపతిని (Judge) లేపి వారిని విడిపించేవాడు. కానీ
కొంతకాలం తర్వాత ప్రజలు మళ్ళీ పాపంలో పడేవారు. ఈ చక్రం గిద్యోను, యెఫ్తా వంటి న్యాయాధిపతుల కాలంలో అనేకసార్లు పునరావృతమైంది.
సంసొను కాలం నాటికి, ఇశ్రాయేలు ప్రజలు నలభై సంవత్సరాలుగా ఫిలిస్తియుల చేతిలో అణచివేయబడుతున్నారు. ఫిలిస్తియులు సముద్ర తీర ప్రాంతం నుండి వచ్చిన శక్తివంతమైన జాతి, వారికి ఇనుప ఆయుధాలు తయారుచేసే నైపుణ్యం ఉండేది, దాని వలన యుద్ధంలో వారు ఇశ్రాయేలు కంటే బలవంతులుగా ఉండేవారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈసారి పవిత్ర గ్రంధం ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టుకున్నారని స్పష్టంగా చెప్పదు. వారు తమ బానిసత్వానికి అలవాటుపడిపోయినంతగా నిర్లిప్తులైపోయారు. అయినప్పటికీ, దేవుడు తన కృపతో, తన ప్రజల మొర వినకముందే, వారిని విడిపించడానికి ఒక ప్రణాళికను ప్రారంభించాడు. ఆ ప్రణాళికే సంసొను జననం.
సంసొను జననం
దేవదూత వాగ్దానం – మానోవా మరియు అతని భార్య
దాను గోత్రానికి చెందిన జొర్యా అనే ఊరిలో
మానోవా అనే వ్యక్తి నివసించేవాడు. అతని
భార్య గొడ్డురాలు. సంతానం లేకపోవడం ఆ కాలంలో గొప్ప దుఃఖకరమైన
విషయంగా పరిగణించబడేది. అయితే ఒకనాడు యావే దూత ఆమెకు ప్రత్యక్షమై ఒక అద్భుతమైన వార్త
అందించాడు. ఆమె గర్భం దాల్చి ఒక కుమారుని
కంటుందని, మరియు ఆ బిడ్డ పుట్టినప్పటి నుండి
దేవునికి నాజీరియుడుగా ప్రతిష్ఠించబడతాడని చెప్పింది.
నాజీరియుడు అంటే ప్రత్యేకమైన ప్రమాణం
చేసి దేవునికి తనను తాను అంకితం చేసుకున్న వ్యక్తి. ఈ ప్రమాణంలో మూడు ముఖ్యమైన
నియమాలు ఉండేవి: మొదటిది, ద్రాక్షారసం గానీ మద్యం గానీ సేవించకూడదు,
ద్రాక్షతోటకు సంబంధించిన ఏ పదార్థాన్ని కూడా తినకూడదు. రెండవది,
తలపై క్షురకర్మ (గీచుకోవడం) చేయించుకోకూడదు. వెంట్రుకలు స్వేచ్ఛగా పెరగనివ్వాలి. మూడవది,
శవాన్ని తాకకూడదు, ఎందుకంటే అది అపవిత్రతను కలిగిస్తుంది.
సాధారణంగా ఈ ప్రమాణం కొంతకాలం పాటు తీసుకునేవారు, కానీ సంసొను
విషయంలో ఇది జీవితాంతం కొనసాగే ప్రమాణంగా నిర్ణయించబడింది. అది కూడా అతడు
పుట్టకముందే, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే.
దేవ దూత ఇంకా ఇలా చెప్పాడు. ఈ బిడ్డ ఇశ్రాయేలు ప్రజలను ఫిలిస్తియుల చేతిలో నుండి విడిపించడం ప్రారంభిస్తాడని, అంతేకాక, గర్భవతి అయిన ఆ స్త్రీ కూడా ద్రాక్షారసం, మద్యం సేవించకూడదని, అపవిత్రమైన దేనినీ తినకూడదని దూత ఆజ్ఞాపించాడు. ఎందుకంటే బిడ్డ నాజీరియుని ప్రతిష్ఠత గర్భంలో ఉన్నప్పటి నుండే ప్రారంభమవుతుంది. తల్లి యొక్క జీవనశైలి కూడా బిడ్డ ఆధ్యాత్మిక భవితవ్యంపై ప్రభావం చూపుతుందనే సత్యాన్ని తెలియజేస్తుంది. మానోవా భార్య వెంటనే తన భర్త వద్దకు పరుగెత్తి జరిగినదంతా చెప్పింది. మానోహ, తన భార్య చెప్పినదానిని నమ్మలేక కాదు గానీ, ఇంత గొప్ప బాధ్యతను సరిగ్గా నిర్వహించాలనే తపనతో, దేవుని దగ్గర మళ్ళీ ఆ దూత రావాలని, తమకు మరింత మార్గదర్శకత్వం ఇవ్వాలని ప్రార్థించాడు. దేవుడు అతని ప్రార్థన విన్నాడు. దూత మళ్ళీ వచ్చాడు, కానీ ఈసారి కూడా మొదట మానోవా భార్యకే ప్రత్యక్షమయ్యాడు. ఆమె వెంటనే తన భర్తను పిలుచుకువచ్చింది. దేవుడు ఈ విషయంలో పదే పదే స్త్రీకే ముందుగా ప్రత్యక్షమవడం, ఆమె విశ్వాసాన్ని, ఆమె పాత్రను ప్రత్యేకంగా గౌరవించడాన్ని సూచిస్తుంది.
మానోవా ప్రార్థన మరియు దేవ దూత రెండవసారి రావడం
న్యాయాధిపతులు 13:8
మనోవా దేవునికి మనవిచేసి "ప్రభూ!
నీవు పంపిన దివ్యపురుషుడు మరల మాకు దర్శనమిచ్చి ఆ పుట్టబోవు శిశువుకు మేమేమి
చేయవలయునో తెలియజెప్పుగాక!” అని ప్రార్థించెను.
మానోవా యొక్క ఈ ప్రార్థన అతని వినయాన్ని, తన బిడ్డను సరిగ్గా పెంచాలనే తపనను తెలియజేస్తుంది. తండ్రి అయ్యే
ముందే తన బాధ్యతను గుర్తించి దేవుని మార్గదర్శకత్వం కోరడం గొప్ప విషయం. దూత తిరిగి
వచ్చినప్పుడు, మానోవా తనకు ఆతిథ్యం ఇవ్వాలని కోరాడు, కానీ దూత ఆహారం తినడానికి నిరాకరించి, బదులుగా
దహనబలి అర్పించమని సూచించాడు. మానోవా, ఒక
మేకపిల్లను, ధాన్యార్పణను తీసుకువచ్చి బండరాయిపై యావేకు
అర్పించాడు. ఆ బలి అగ్నిజ్వాలలలో పైకి
లేచినప్పుడు, దూత ఆ జ్వాలలలోనే పరలోకానికి
ఆరోహణమయ్యాడు. అప్పుడు మానోవాకు అర్థమైంది. తాము చూసినది సాధారణ మనిషి కాదు,
దేవుని దూతే అని.
ఈ దర్శనం చూసిన మానోవా భయపడిపోయాడు, 'మనం దేవుణ్ణి చూశాము, కాబట్టి మనం చనిపోతాము' అని తన భార్యతో అన్నాడు. కానీ ఆమె జ్ఞానంతో సమాధానం చెప్పింది: 'యావే మనలను చంపాలనుకుంటే, మన చేతుల నుండి దహనబలిని, నైవేద్యాన్ని అంగీకరించి ఉండేవాడు కాదు, ఇవన్నీ మనకు చూపించి ఉండేవాడు కాదు.' ఇది ఆమె విశ్వాసానికి, వివేకానికి నిదర్శనం. కాలం గడిచింది, వాగ్దానం చొప్పున మానోవా భార్య గర్భం దాల్చి ఒక కుమారుని కన్నది. ఆ బిడ్డకు వారు సంసొను అని పేరు పెట్టారు. పవిత్ర గ్రంథం చెబుతున్నట్లు, ఆ బాలుడు పెరుగుతుండగా యావే అతనిని ఆశీర్వదించాడు, మరియు యావే ఆత్మ జొర్యా మరియు ఎష్టాయోలు మధ్య ఉన్న మహనె-దాను అనే ప్రాంతంలో అతనిని ప్రేరేపించడం మొదలుపెట్టింది.
బాల్యం, పెంపకం మరియు నాజరియుని జీవన విధానం
సంసొను దాను గోత్రంలో, జొర్యా
అనే చిన్న గ్రామంలో పెరిగాడు. అతని తల్లిదండ్రులు అతనిని దేవుని వాగ్దానం ప్రకారం
నాజరియుని నియమాలతో పెంచారని మనం ఊహించవచ్చు. వెంట్రుకలు కత్తిరించకుండా, ద్రాక్షాసంబంధమైన పదార్థాలకు దూరంగా ఉంచుతూ, బాల్యం నుండే అతనికి అసాధారణమైన శారీరక బలం
కనిపించి ఉండవచ్చు, అయితే పవిత్ర గ్రంథం అతని బాల్యం గురించి ఎక్కువ వివరాలు
ఇవ్వదు. కానీ ఒక ముఖ్యమైన విషయాన్ని పవిత్ర గ్రంథం నొక్కి చెబుతుంది: 'యావే ఆత్మ అతనిని
ప్రేరేపించడం మొదలుపెట్టింది.' అంటే సంసొను శక్తి కేవలం అతని శరీర
నిర్మాణం వల్ల కాదు, అది దేవుని ఆత్మ అతనిపై వచ్చినప్పుడు
మాత్రమే పని చేసేది. ఈ విషయం అతని జీవితాంతం పదే పదే స్పష్టమవుతుంది. యావే ఆత్మ అతనిపై బలంగా వచ్చినప్పుడు మాత్రమే అతడు
అసాధారణ కార్యాలు చేయగలిగాడు.
ఇది మనకు ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాన్ని బోధిస్తుంది: సంసొను బలం అతని సొంతం కాదు, అది దేవుడిచ్చిన కృపావరం. అతడు దానిని సరిగ్గా ఉపయోగించినా, దుర్వినియోగం చేసినా, ఆ మూలం ఎప్పుడూ దేవుడే. ఈ సత్యాన్ని సంసొను తన జీవితమంతా పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాడు, మరియు అదే అతని పతనానికి ఒక ముఖ్య కారణమైంది.
తిమ్నాతు స్త్రీపై ప్రేమ - మొదటి వివాహ ప్రయత్నం
సంసొను యుక్తవయసుకు వచ్చినప్పుడు,
ఫిలిస్తియుల పట్టణమైన తిమ్నాతు కు వెళ్ళాడు. అక్కడ అతడు ఒక ఫిలిస్తియ
యువతిని చూసి ఆమెను ఇష్టపడ్డాడు. తిరిగి వచ్చి తన తల్లిదండ్రులతో, 'తిమ్నాతులో ఒక ఫిలిస్తియ స్త్రీని చూశాను, ఆమెను
నాకు పెళ్ళికై తీసుకురండి' అని కోరాడు. ఇది మానోహ దంపతులకు తీవ్ర ఆందోళన కలిగించింది. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు తమ చుట్టూ ఉన్న
అన్యజాతుల వారితో వివాహ సంబంధాలు పెట్టుకోకూడదని దేవుని ధర్మశాస్త్రం స్పష్టంగా
చెబుతుంది, ప్రత్యేకించి ఫిలిస్తియుల వంటి శత్రు
జాతులతో సంబంధం పెట్టుకోవడం వారికి
అసహజం. వారు సంసొనుతో, 'నీ స్వజాతిలో, మన
బంధువులలో స్త్రీ లేదా? ఈ సున్నతిలేని ఫిలిస్తియుల నుండే నీవు
భార్యను తీసుకోవాలా?' అని ప్రశ్నించారు.
అయితే సంసొను తన తండ్రితో, 'ఆమెనే నాకు తీసుకురండి, ఆమె నా కళ్ళకు నచ్చింది' అని పట్టుబట్టాడు. ఇక్కడ మనం సంసొను వ్యక్తిత్వంలోని ఒక ముఖ్యమైన బలహీనతను చూస్తాము. తన కోరికలను నియంత్రించుకోలేకపోవడం, తక్షణ ఆకర్షణకు లొంగిపోవడం. ఇది అతని జీవితమంతా పునరావృతమయ్యే ఒక పద్ధతిగా మారుతుంది. అయితే పవిత్ర గ్రంథం ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యను జోడిస్తుంది: ఇది దేవుని నుండి వచ్చినదని, ఎందుకంటే దేవుడు ఫిలిస్తియులకు వ్యతిరేకంగా అవకాశం వెతుకుతున్నాడని. అంటే, సంసొను తన స్వార్థపూరిత కోరికతో నడుచుకున్నప్పటికీ, దేవుడు దానిని కూడా తన గొప్ప ప్రణాళికలో భాగంగా ఉపయోగించుకున్నాడు. మానవుని బలహీనతలను కూడా తన సంకల్పం నెరవేర్చడానికి వాడుకునే దేవుని సార్వభౌమత్వాన్ని ఇది తెలియజేస్తుంది.
సింహాన్ని చీల్చడం - మొదటి పరాక్రమ కార్యం
న్యాయాధిపతులు 14:6
వెంటనే యావే ఆత్మ సంసోనును ఆవేశించెను.
అతడు చేతిలో ఆయుధమేమియు లేకున్నను సింగము మీదబడి మేకపిల్లను చీల్చివేసినట్లు
చీల్చి వేసెను. కాని సంసోను జరిగిన సంగతిని తల్లిదండ్రులకు తెలియజేయలేదు.
తిమ్నాతు కు వెళ్ళే మార్గంలో, ఆ ఊరి ద్రాక్షతోటల దగ్గర, ఒక యువ సింహం సంసొనుపై
గర్జిస్తూ దూకింది. ఆ క్షణంలో యావే ఆత్మ
అతనిపై బలంగా వచ్చింది, మరియు అతని చేతిలో ఎలాంటి ఆయుధం
లేకపోయినా, ఆ సింహాన్ని మేకపిల్లను చీల్చినంత
సునాయాసంగా చీల్చివేశాడు. ఇది సంసొను జీవితంలో మనం చూసే మొదటి అద్భుత పరాక్రమ కార్యం.
అయితే గమనించదగ్గ విషయం ఏమిటంటే, అతడు ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు కూడా
చెప్పలేదు. బహుశా వినయంతోనో, లేదా దీనిని ఒక సాధారణ సంఘటనగానో భావించాడు.
కొన్ని రోజుల తర్వాత, పెళ్ళి కోసం మళ్ళీ ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు, సంసొను ఆ సింహం కళేబరాన్ని చూడటానికి దారి తప్పి వెళ్ళాడు. అక్కడ అతడు ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం చూశాడు . ఆ సింహం శరీరంలో తేనెటీగలు తేనెపట్టును కట్టి ఉన్నాయి. అతడు తన చేతులతో ఆ తేనెను తీసి తింటూ నడిచాడు, తన తల్లిదండ్రులకు కూడా కొంత తేనె ఇచ్చాడు, కానీ అది సింహం కళేబరం నుండి తీసినదని వారికి చెప్పలేదు. ఇక్కడ మనం ఒక సూక్ష్మమైన నియమ ఉల్లంఘనను గమనించవచ్చు. నాజరియుడు శవాన్ని తాకకూడదు, కానీ సంసొను సింహం కళేబరాన్ని తాకి, దాని నుండి ఆహారం తీసుకున్నాడు. ఇది అతని జీవితంలో నియమాలను తేలికగా తీసుకునే ధోరణికి తొలి సంకేతం.
వివాహ విందు మరియు చిక్కుప్రశ్న
సంసొను తిమ్నాతు వివాహ వేడుక కోసం ఏడు రోజుల విందు ఏర్పాటు
చేశాడు, ఇది ఆ కాలపు ఆచారం ప్రకారం జరిగింది.
ఫిలిస్తియులు అతనికి ముప్పై మంది తోడు యువకులను ఇచ్చారు. విందులో సంసొను ఒక
చిక్కుప్రశ్న అడిగాడు, తాను గతంలో సింహాన్ని చీల్చిన సంఘటనను
ఆధారంగా చేసుకుని: సంసోను “తినెడు దానినుండి తినబడునది వచ్చె, బలమైన దానినుండి తీయనిది వచ్చె” అని పొడుపు కథ వేసెను. మూడునాళ్ళు
గడిచినను వారికి జవాబు దొరకలేదు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పగలిగితే, తాను ముప్పై నారబట్టలు, ముప్పై దుస్తులు
బహుమతిగా ఇస్తానని, లేకపోతే వారు తనకు అంతే బహుమతులు
ఇవ్వాలని షరతు పెట్టాడు.
ఏడు రోజులు గడిచినా ఆ ఫిలిస్తియ యువకులకు
సమాధానం దొరకలేదు. చివరికి వారు సంసొను భార్యను బెదిరించారు. 'నీ భర్తను
ఒప్పించి ఆ ప్రశ్నకు సమాధానం రాబట్టు, లేకపోతే నిన్ను,
నీ తండ్రి ఇంటిని అగ్నితో కాల్చివేస్తాము.' భయపడిన
ఆమె ఏడుస్తూ సంసొనును వేధించింది, 'నీవు నన్ను ప్రేమించడం లేదు, నీవు నా ప్రజలకు ఒక ప్రశ్న అడిగావు కానీ నాకు సమాధానం చెప్పలేదు'
అని విందు అంతటా అతనిని బాధపెట్టింది. ఏడవ రోజున, ఆమె పోరు భరించలేక సంసొను ఆమెకు రహస్యం చెప్పేశాడు, ఆమె వెంటనే తన ప్రజలకు తెలియజేసింది.
ఇది సంసొను జీవితంలో మనం చూసే మొట్టమొదటిగా స్త్రీకి లొంగిపోవడం. ఒక స్త్రీ యొక్క పోరుకు లొంగిపోయి తన రహస్యాన్ని వెల్లడించడం. ఈ నమూనా అతని జీవితాంతం, ముఖ్యంగా దెలీలా కథలో, మరింత తీవ్రమైన రూపంలో పునరావృతమవుతుంది. ఆఖరి రోజు సూర్యాస్తమయానికి ముందు, ఆ యువకులు సంసొనుతో, 'తేనె కంటే తియ్యనిది ఏమిటి? సింహం కంటే బలమైనది ఏమిటి?' అని సమాధానం చెప్పారు. సంసొనుకు వెంటనే అర్థమైంది. 'మీరు నా పెయ్యతో దున్నని ఎడల ఈ పొడుపు కథను విప్పి ఉండరు, అని కోపంగా అన్నాడు.
అష్కెలోనులో ముప్పైమంది వధ - మొదటి ప్రతీకారం
ఈ అవమానానికి కోపోద్రిక్తుడైన సంసొనుపై యావే
ఆత్మ బలంగా వచ్చింది. అతడు అష్కెలోను అనే
ఫిలిస్తియ పట్టణానికి వెళ్ళి, అక్కడి ముప్పైమంది పురుషులను చంపి,
వారి వస్త్రాలను తీసుకువచ్చి, చిక్కుప్రశ్నకు
సమాధానం చెప్పినవారికి ఇచ్చాడు. తీవ్ర కోపంతో అతడు తన తండ్రి ఇంటికి తిరిగి
వెళ్ళిపోయాడు, తన భార్యను వదిలేసి. ఇది ఆ కాలపు ఆచారం
ప్రకారం వివాహాన్ని రద్దు చేసినట్లుగా పరిగణించబడింది. తర్వాత సంసొను భార్యను ఆమె తండ్రి, తోడుగా
వచ్చిన స్నేహితునికి ఇచ్చి వివాహం చేశాడు,
బహుశా సంసొను తనను శాశ్వతంగా విడిచిపెట్టాడని భావించి ఈ నిర్ణయం
తీసుకొని ఉంటాడు.
ఇక్కడ మనం సంసొను స్వభావంలో ఒక ముఖ్యమైన లక్షణాన్ని గమనిస్తాము. తీవ్రమైన కోపం, ప్రతీకార వాంఛ, మరియు ఆవేశపూరిత నిర్ణయాలు. అయినప్పటికీ ఈ సంఘటనల వెనుక కూడా దేవుని చేయి ఉంది, ఎందుకంటే ఆయన ఫిలిస్తియులకు వ్యతిరేకంగా అవకాశాలను సృష్టిస్తున్నాడు. మానవ బలహీనతలు, పాపభరిత నిర్ణయాలు కూడా దేవుని విమోచన ప్రణాళికలో భాగంగా మారగలవనే సత్యాన్ని ఇది తెలియజేస్తుంది, అయితే అది ఆ పాపాలను సమర్థించదు.
నక్కల ఉదంతం - పంటలను తగలబెట్టడం
కొంతకాలం తర్వాత, గోధుమ
కోతకాలంలో, సంసొను తన భార్యను కలవడానికి తిమ్నాతుకు
వెళ్ళాడు, ఒక మేకపిల్లను బహుమతిగా తీసుకువెళ్ళాడు. అయితే అతని మామ అతనిని లోపలికి రానివ్వకుండా,
'నీవు ఆమెను పూర్తిగా ద్వేషిస్తున్నావని నేను భావించి, ఆమెను నీ స్నేహితునికి ఇచ్చి వివాహం చేశాను. ఆమె చిన్న చెల్లెలు ఇంకా
అందంగా ఉంది, ఆమెను తీసుకో' అని
చెప్పాడు. ఇది సంసొనుకు మరింత కోపం తెప్పించింది.
కోపోద్రిక్తుడైన సంసొను మూడు వందల
నక్కలను పట్టుకుని, వాటిని జతలుగా తోకలు కట్టి, ప్రతి జత తోకల మధ్య ఒక దివిటీని కట్టాడు. ఆ దివిటీలను వెలిగించి,
ఆ నక్కలను ఫిలిస్తియుల పండిన పంట పొలాల్లోకి, ద్రాక్షతోటల్లోకి,
ఒలీవ తోటల్లోకి వదిలాడు. ఫలితంగా వారి పంటలన్నీ, కుప్పలుగా ఉన్న ధాన్యం, నిలబడి ఉన్న పైరు,
ద్రాక్షతోటలు, ఒలీవ తోటలు అన్నీ దగ్ధమైపోయాయి. ఇది ఫిలిస్తియుల
ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా వ్యవసాయంపై, భారీ దెబ్బగా నిలిచింది. ఈ కార్యం సంసొను యొక్క వ్యూహాత్మక
తెలివితేటలను కూడా ప్రదర్శిస్తుంది. కేవలం భౌతిక బలమే కాక, శత్రువుపై
గరిష్ఠ నష్టం కలిగించే ఆలోచనాశక్తి కూడా అతనికి ఉండేది.
ఫిలిస్తియులు ఈ నష్టానికి కారణం తెలుసుకున్నప్పుడు, సంసొను భార్యను, ఆమె తండ్రిని అగ్నితో కాల్చివేశారు. ఇది వారు ఆమెను మొదట బెదిరించినప్పుడు అనుకున్న శిక్షే, కానీ ఇప్పుడు వేరే కారణంతో అది ఆమెపైనే పడింది. ఇది సంసొనుకు మరింత ఆగ్రహం తెప్పించింది, అతడు 'మీరు ఇలా చేసినందుకు నేను మీపై పగ తీర్చుకుంటాను, ఆ తర్వాతే నేను ఆగిపోతాను' అని ప్రమాణం చేసి, వారిని తీవ్రంగా హతమార్చాడు. తర్వాత అతడు ఏతాము అనే బండ సందులో వెళ్ళి నివసించాడు.
దవడ ఎముకతో వెయ్యిమంది వధ
న్యాయాధిపతులు 15:15-16
“అచ్చట పచ్చిపచ్చిగానున్న గాడిద దవడ ఎముక
యొకటి సంసోను కంటబడెను. అతడు చేయిచాచి ఆ ఎముక నందుకొని దానితో ఫిలిస్తీయులను
వేయిమందిని చంపెను. అతడు గాడిద దవడ ఎముకతో ఫిలిస్తీయులను గాడిదలను కొట్టినట్లుగా
కొట్టితిని, గాడిద దవడ ఎముకతో వేయిమందిని పడగొట్టితిని అనెను. అని పలికాడు.”
ఫిలిస్తియులు అతనిని చూసి కేకలు వేస్తూ
ఎదురు వచ్చినప్పుడు, దేవుని ఆత్మ సంసొనుపై బలంగా వచ్చింది. అతని చేతులకు కట్టిన తాళ్ళు
అగ్నిలో కాలిన నారలాగా కరిగిపోయాయి, బంధాలు అతని చేతుల
నుండి ఊడిపోయాయి. అక్కడ పడి ఉన్న అప్పటికి పచ్చిగానే ఉన్న గాడిద దవడ ఎముకను చేతికి తీసుకుని, దానితోనే వెయ్యిమంది ఫిలిస్తియులను కొట్టి చంపివేశాడు. ఇది సంసొను శక్తికి అత్యున్నత ఉదాహరణలలో ఒకటి. ఎలాంటి సాంప్రదాయ ఆయుధం లేకుండా, కేవలం ఒక ఎముకతో, వెయ్యిమంది శత్రువులను ఓడించడం.
అయితే యుద్ధం తర్వాత సంసొనుకు విపరీతమైన దాహం వేసింది, అతడు మరణించే స్థితికి చేరుకున్నాడు. ఈ క్షణంలో అతడు యావేకు మొరపెట్టుకున్నాడు: 'నీవు నీ సేవకుని చేత ఈ గొప్ప విజయాన్ని అనుగ్రహించావు, ఇప్పుడు నేను దాహంతో చనిపోయి, సున్నతిలేనివారి చేతికి పడవలెనా?' ఇది పవిత్ర గ్రంథంలో సంసొను నోటి నుండి మనం వినే మొదటి నిజమైన ప్రార్థన. తన బలహీనతను ఒప్పుకుని దేవుని సహాయం కోరడం సంసొను చేసిన గొప్ప పని. దేవుడు వెంటనే జవాబిచ్చాడు. ఆ ప్రదేశంలో ఒక బండను చీల్చి నీటిని ఉబికించాడు, సంసొను దానిని తాగి తేరుకున్నాడు. ఆ నీటి బుగ్గకు 'ఏన్ హక్కోరే' అని పేరు పెట్టారు, అంటే 'మొరపెట్టినవాని బుగ్గ' అని అర్థం. ఈ సంఘటన సంసొను జీవితంలో దేవునిపై అతడు చూపిన అరుదైన, స్పష్టమైన ఆధారపడటానికి ఒక చక్కటి ఉదాహరణ. ఈ కాలం తర్వాత సంసొను ఇరవై సంవత్సరాలు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా పరిపాలించాడని పవిత్ర గ్రంథం తెలియజేస్తుంది.
గాజా ద్వారాలు - శారీరక బలం, ఆధ్యాత్మిక బలహీనత
సంసొను ఒకసారి గాజా అనే ఫిలిస్తియ
పట్టణానికి వెళ్ళాడు, అక్కడ అతడు ఒక వేశ్య ఇంటికి వెళ్ళాడని పవిత్ర గ్రంథం చెబుతుంది. ఇది అతని నైతిక
జీవితంలో మరో బలహీనమైన కోణాన్ని బయటపెడుతుంది. శారీరక కోరికలకు అదుపు లేకపోవడం. గాజా ప్రజలకు సంసొను
అక్కడ ఉన్నాడని తెలిసినప్పుడు, వారు అతనిని పట్టుకోవడానికి రాత్రంతా పట్టణ ద్వారం వద్ద పొంచి
ఉన్నారు, తెల్లవారగానే అతనిని చంపాలని పథకం
వేశారు.
అయితే సంసొను అర్ధరాత్రి లేచి, పట్టణ ద్వారం తలుపులను, రెండు వైపుల స్తంభాలతో సహా, గడియతో సహా పెరికివేసి, వాటిని తన భుజాలపై మోసుకుని, హెబ్రోను ఎదుటనున్న కొండ శిఖరం వరకు తీసుకువెళ్ళాడు. ఇది సుమారు నలభై కిలోమీటర్ల దూరం! ఈ కార్యం సంసొను శారీరక బలానికి అత్యున్నత నిదర్శనం, అదే సమయంలో అతని ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న అస్థిరతను కూడా ప్రస్ఫుటం చేస్తుంది. అతని బలం ఇంకా అమోఘంగా ఉన్నా, అతని నైతిక నిర్ణయాలు క్రమంగా బలహీనపడుతున్నాయి. ఈ సంఘటన అతని దెలీలా కథకు ముందు వచ్చే ఒక హెచ్చరిక సంకేతం లాంటిది. శారీరక బలం, ఆధ్యాత్మిక విచక్షణ ఎప్పుడూ ఒకదానితో ఒకటి సమానంగా నడవవని ఇది తెలియజేస్తుంది.
దెలీలా ప్రేమ - పతనానికి నాంది
సొరేకు లోయలో చివరి ప్రేమకథ
ఆ తర్వాత సంసొను సొరేకు లోయలో నివసించే దెలీలా అనే స్త్రీని ప్రేమించాడు. ఆమె
ఫిలిస్తియురాలో, లేక ఇశ్రాయేలీయురాలో పవిత్ర గ్రంథం
స్పష్టంగా చెప్పదు, కానీ ఆమె ఫిలిస్తియుల పక్షాన నిలిచింది
అనేది స్పష్టం. ఫిలిస్తియుల నాయకులు ఆమె వద్దకు వచ్చి ఒక ప్రలోభకరమైన ప్రతిపాదన
చేశారు. సంసొను అపారమైన బలానికి రహస్యం ఏమిటో కనిపెట్టి చెప్పమని, దానికి బదులుగా ప్రతి ఒక్కరూ ఆమెకు 1100 వెండి నాణేలు ఇస్తామని చెప్పారు. ఇది ఆ కాలానికి
అత్యంత భారీ మొత్తం. మొత్తం ఐదుగురు ఫిలిస్తియ
నాయకుల నుండి కలిపి అయిదు వేల ఐదు వందల వెండి నాణేలు.
ఇక్కడ నుండి దెలీలా కపట పన్నాగం మొదలవుతుంది. ఇది ప్రేమ రూపంలో వచ్చిన ద్రోహపు కథ. ఈ కథలో నాలుగుసార్లు పునరావృతమైన ఒక నమూనాను మనం చూస్తాము. దెలీలా సంసొనును అతని బలం రహస్యం అడగడం, అతడు అబద్ధం చెప్పడం, ఆమె ఆ అబద్ధాన్ని పరీక్షించడం, విఫలం కావడం, మళ్ళీ మళ్ళీ పోరు పెట్టడం. ఈ నమూనా సంసొను హృదయంలో ఉన్న ఒక ప్రమాదకరమైన బలహీనతను బహిర్గతం చేస్తుంది. తనను ప్రేమిస్తున్నానని చెప్పే స్త్రీ ఒత్తిడికి లొంగిపోయే స్వభావం, తిమ్నాతు వివాహంలో మనం ఇదివరకే చూసిన అదే బలహీనత, కానీ ఇప్పుడు అది మరింత తీవ్రమైన, ప్రాణాంతకమైన రూపంలో కనిపిస్తుంది.
నాలుగు మోసాలు - దెలీలా పరీక్షలు
మొదటిసారి దెలీలా అడిగినప్పుడు, సంసొను ఆమెతో, 'నన్ను ఏడు అల్లేత్రాడులతో బంధిస్తే నా బలం తగ్గిపోతుంది' అని అబద్ధం చెప్పాడు. ఫిలిస్తియ నాయకులు ఆమెకు ఏడు అల్లే త్రాడులను తీసుకువచ్చారు,
ఆమె సంసొను నిద్రిస్తుండగా అతనిని వాటితో కట్టింది. ఆమె, ' సంసొను, ఫిలిస్తియులు నీపైకి వచ్చారు!' అని కేకవేసినప్పుడు, అతడు వాటిని నారపోగులాగా తెంచివేశాడు.
అతని బలం రహస్యం బయటపడలేదు.
రెండవసారి, సంసొను,
'ఎప్పుడూ వాడని కొత్త తాళ్ళతో నన్ను బంధిస్తే బలహీనుడనవుతాను' అని చెప్పాడు. ఆమె అలాగే చేసినా, అతడు
ఆ తాళ్ళను కూడా దారంలాగా చేతుల నుండి తెంచివేశాడు. మూడవసారి, అతడు, 'నా తలపై ఉన్న ఏడు జడలను మగ్గం నేతతో
అల్లి, మేకుతో బిగిస్తే బలహీనుడనవుతాను' అని
చెప్పాడు. ఆమె అతడు నిద్రిస్తుండగా అలా చేసినా, అతడు
మేలుకొని మగ్గంతో సహా మేకును పెరికివేశాడు.
ప్రతిసారీ మోసపోయిన దెలీలా, సంసొను మరింత తీవ్రంగా, 'నా హృదయం నీతో లేకపోయినా నీవు నన్ను ప్రేమిస్తున్నానని ఎలా చెప్పగలవు? నీవు నాతో మూడుసార్లు ఎగతాళి చేశావు, నీ అపారమైన బలానికి రహస్యం ఏమిటో నాకు చెప్పలేదు' అని ప్రతిరోజూ మాటలతో వేధించడం, పోరు పెట్టడం మొదలుపెట్టింది. ఆమె పోరు అతనికి 'ప్రాణం విసిగించేంతగా' తయారైంది, అతని ఆత్మ చనిపోయేంతగా అలసిపోయింది. ఈ పదజాలం చాలా ముఖ్యమైనది. ఇది సమ్సోను పతనం కేవలం ఒక్క క్షణపు తప్పిదం కాదని, అది నిరంతర ఒత్తిడికి, మానసిక అలసటకు లొంగిపోవడం వల్ల జరిగినదని తెలియజేస్తుంది.
రహస్యం వెల్లడి - వెంట్రుకల కథ
న్యాయాధిపతులు 16:17
సంసొను తన హృదయమంతా ఆమెకు తెరిచి
చెప్పాడు: ఆమె పోరు పడలేక చివరకు తన రహస్యమును చెప్పివేసెను. “ఇంతవరకు క్షురకత్తి
నా తలవెంట్రుకలను తాకలేదు. పుట్టుక నుండి నేను వ్రతతత్పరుడనై జీవించుచుంటిని. నా
తలజుట్టు కత్తిరింతురేని నా బలమంతయు ఉడిగిపోయి సామాన్య నరునివలె అయ్యెదను” అని
చెప్పెను.
ఆమె సంసొనును తన ఒడిలో నిద్రపుచ్చి, ఒక వ్యక్తిని పిలిచి అతని ఏడు జడలను గీయించివేసింది. అతడు నిద్రిస్తుండగానే ఆమె అతనిని బాధించడం మొదలుపెట్టింది, అతని బలం అతనిని విడిచిపెట్టింది. ఆమె, ' సంసొనూ, ఫిలిస్తియులు నీపైకి వచ్చారు!' అని కేకవేసినప్పుడు, అతనికి మెలకువ వచ్చి, 'నేను ఎప్పటిలాగే బయటకు వెళ్ళి నన్ను నేను విడిపించుకుంటాను' అని అనుకున్నాడు. కానీ పవిత్ర గ్రంథం అత్యంత విషాదకరమైన వాక్యాన్ని ఇక్కడ చెపుతుంది. యావే తనను విడిచిపెట్టాడని అతనికి తెలియలేదు.' ఇదే సంసొను కథలో అత్యంత భయంకరమైన క్షణం. అతని బలం, అతని ప్రత్యేకత దేవుని సన్నిధి వల్లనే ఉంది, ఆ సన్నిధి తొలగిపోయిందని అతడు గ్రహించలేదు.
బంధీగా, కళ్ళులేని బానిసగా
ఫిలిస్తియులు వెంటనే సంసొనును
పట్టుకున్నారు, అతని కళ్ళను పీకివేశారు, గాజాకు తీసుకువెళ్ళి ఇత్తడి సంకెళ్ళతో బంధించారు. అతని బలం మాత్రమే
కాదు, అతని దృష్టి కూడా పోయింది. ఇది కేవలం శారీరకమైన శిక్ష మాత్రమే కాదు,
ఒక సంకేతాత్మక వాస్తవం కూడా: సంసొను తన జీవితమంతా తన 'కళ్ళకు నచ్చినదాన్ని' వెంబడించాడు (తిమ్నాతు స్త్రీ విషయంలో అతడు తన తండ్రితో 'ఆమె నా కళ్ళకు నచ్చింది' అని చెప్పిన మాటలు
గుర్తుచేసుకోండి), ఇప్పుడు ఆ కళ్ళే అతని నుండి
తీసివేయబడ్డాయి.
ఫిలిస్తియులు అతనిని చెరసాలలో తిరుగలి తిప్పే పనికి నియమించారు. ఇది బానిసలు, జంతువులు చేసే అత్యంత అవమానకరమైన శ్రమ. ఒకప్పుడు వేలాదిమంది శత్రువులను ఒంటరిగా ఓడించిన మహా వీరుడు ఇప్పుడు అంధుడై, బంధీగా, తిరుగలి రాయిని తిప్పుతూ కాలం గడుపుతున్నాడు. ఇది సంసొను జీవితంలో అత్యంత అధఃపాతాళ స్థితి. అయితే ఇక్కడ పవిత్ర గ్రంథం ఒక చిన్న, కానీ అత్యంత ముఖ్యమైన వివరాన్ని జోడిస్తుంది: 'అయితే అతని తల వెంట్రుకలు గీయబడిన తర్వాత మళ్ళీ పెరగడం మొదలుపెట్టాయి.' ఈ చిన్న వాక్యం ఆశాభావానికి ఒక సంకేతం, దేవుని కృప ఇంకా పూర్తిగా అతనిని విడిచిపెట్టలేదని ఇది సూచిస్తుంది.
దాగోను దేవాలయంలో - చివరి ప్రార్థన, చివరి బలి
న్యాయాధిపతులు 16:28
సంసొను ప్రభు! నన్ను జ్ఞప్తియుంచుకొనుము. ఇంకోక్క మారు నీ
బలము నాకు ప్రసాధింపుము. నా రెండు కన్నులను పెరికివేసినందులకై ఈ పిలిస్తియులపై ఒక్క
దెబ్బతో పగ తీర్చుకొనిమ్ము” అని పార్ధించెను.
'
ఆ దేవాలయం రెండు ప్రధాన స్తంభాలపై
ఆధారపడి నిర్మించబడింది, వాటిపైనే మొత్తం భవనం, పైకప్పు నిలిచి ఉంది. దేవాలయం పైన, పైకప్పుపై
సుమారు మూడు వేలమంది స్త్రీ పురుషులు, ఫిలిస్తియ
నాయకులతో సహా, సంసొనును చూస్తూ నవ్వుతున్నారు. సంసొను
తనను నడిపిస్తున్న సేవకునితో, 'దేవాలయాన్ని పట్టుకున్న స్తంభాల మధ్య
నన్ను నిలబెట్టు, నేను వాటిని ఆనుకుని నిలబడాలనుకుంటున్నాను' అని
కోరాడు.
ఆ క్షణంలో సంసొను తన జీవితంలో అత్యంత హృదయపూర్వకమైన ప్రార్థన చేశాడు. అపుడు సంసొను యావేను స్మరించుకొని “ ప్రభు! నన్ను జ్ఞప్తియుంచుకొనుము. ఇంకోక్క మారు నీ బలము నాకు ప్రసాధింపుము. నా రెండు కన్నులను పెరికివేసినందులకై ఈ పిలిస్తియులపై ఒక్క దెబ్బతో పగ తీర్చుకొనిమ్ము” అని పార్ధించెను. ఈ ప్రార్థనలో మనం సంసొను హృదయంలో జరిగిన లోతైన మార్పును చూస్తాము. అహంకారంతో, స్వశక్తితో పోరాడిన వీరుడు ఇప్పుడు పూర్తిగా దేవునిపై ఆధారపడుతున్నాడు, తనకు తానుగా ఏమీ చేయలేనని ఒప్పుకుంటున్నాడు. అతడు రెండు మధ్య స్తంభాలను చేతులతో పట్టుకుని, 'ఫిలిష్తీయులతోపాటు నేను కూడా చనిపోతాను' అని అంటూ, తన శక్తినంతా ఉపయోగించి ఆ స్తంభాలను నెట్టివేశాడు. దేవాలయం కూలిపోయింది, అందులో ఉన్న నాయకులతో సహా వేలాదిమంది చనిపోయారు. గ్రంథం ముగింపు వాక్యంలో ఇలా చెబుతుంది: 'అతడు తన జీవితకాలంలో చంపినవారి కంటే, తన మరణంలో చంపినవారు ఎక్కువమంది.'
అంతిమ సంస్కారం - విషాదభరిత ముగింపు
సంసొను సోదరులు, అతని
తండ్రి ఇంటివారు వచ్చి అతని శరీరాన్ని తీసుకువెళ్ళి, జొర్యా
మరియు ఎష్టాయోలు మధ్య, అతని తండ్రి మానోవా సమాధి స్థలంలో ఖననం చేశారు. అతడు ఇరవై
సంవత్సరాలు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా పరిపాలించాడు. ఇది సంసొను కథ ముగింపు. విషాదం, పరాక్రమం, మరియు దేవుని కృప కలగలిసిన ఒక అసాధారణ జీవితం. అతడు తన శత్రువులను
పూర్తిగా నిర్మూలించలేకపోయాడు, ఇశ్రాయేలును పూర్తిగా విడిపించలేకపోయాడు. ఆ పని తర్వాతి తరాల వారికి, చివరికి దావీదు రాజుకు మిగిలింది. కానీ అతడు ఫిలిస్తియుల శక్తికి
గట్టి దెబ్బ కొట్టి, ఇశ్రాయేలు విమోచనకు పునాది వేశాడు.
సంసొను ప్రేమలు - మూడు స్త్రీల కథ
సంసొను జీవితంలో ప్రేమ ఒక కేంద్ర
ఇతివృత్తంగా కనిపిస్తుంది, అయితే అది ఎప్పుడూ సుఖాంతం కాలేదు. అతని
జీవితంలో మనకు స్పష్టంగా కనిపించే ముగ్గురు స్త్రీలు, తిమ్నాతు యువతి, గాజా వేశ్య,
మరియు దెలీలా. ఈ ముగ్గురూ ఫిలిస్తియుల ప్రపంచానికి చెందినవారే,
ముగ్గురితోను అతని సంబంధం అతనికి కష్టాలను, చివరికి
వినాశనాన్ని తెచ్చిపెట్టింది. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది సంసొను హృదయంలో ఉన్న ఒక లోతైన బలహీనతను, తన కళ్ళకు నచ్చిన దానిని వెంబడించే స్వభావాన్ని పదే పదే
బయటపెడుతుంది.
తిమ్నాతు యువతితో అతని ప్రేమ ఆకర్షణతో మొదలై, మోసం, ద్రోహంతో ముగిసింది. ఆమె తన సొంత ప్రజల
ఒత్తిడికి లొంగి సంసొను రహస్యాన్ని వెల్లడించింది, చివరికి ఆమె స్వయంగా అగ్నికి బలైపోయింది. గాజాలో వేశ్యతో అతని సంబంధం
కేవలం క్షణిక కామవాంఛకు ఉదాహరణ, ఇందులో ఎలాంటి నిబద్ధత, ప్రేమ కనిపించవు, ఇది అతని నైతిక పతనం ఇంకా లోతుగా సాగుతున్నదని
సూచిస్తుంది. అయితే దెలీలాతో అతని సంబంధం అన్నింటికంటే విషాదకరమైనది. ఈ విషయాన్ని పవిత్ర గ్రంథం'అతడు ఆమెను ప్రేమించాడు' అని స్పష్టంగా చెబుతుంది. ఇది నిజమైన ప్రేమ భావననే
సూచించవచ్చు, కానీ ఆ ప్రేమ తనను గుడ్డివాడిగా చేసింది, తన
అత్యంత పవిత్రమైన రహస్యాన్ని కూడా ఆమెకు వెల్లడించేంతగా అతనిని బలహీనపరిచింది.
ఈ మూడు ప్రేమకథల ద్వారా పవిత్ర గ్రంథం మనకు ఒక హెచ్చరిక ఇస్తుంది. ప్రేమ అనేది గొప్ప, పవిత్రమైన భావన అయినప్పటికీ, అది దేవుని విలువలతో, జ్ఞానంతో మార్గనిర్దేశం చేయబడనప్పుడు, అది మనిషిని పూర్తిగా నాశనం చేసే శక్తిని కూడా కలిగి ఉంటుంది. సంసొను తన ప్రేమలలో ఎప్పుడూ వివేకంతో, దేవుని చిత్తానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోలేదు, దాని ఫలితంగా అతని ప్రేమకథలు అన్నీ విషాదాంతమయ్యాయి.
సంసొను శత్రువులు – ఫిలిస్తియుల ప్రపంచం
సంసొను జీవితాన్ని పూర్తిగా అర్థం
చేసుకోవాలంటే, అతని శత్రువులైన ఫిలిస్తియుల గురించి
కొంత తెలుసుకోవడం అవసరం. ఫిలిస్తియులు
మధ్యధరా సముద్రం నుండి కనాను దేశపు తీరప్రాంతానికి వలస వచ్చిన ఒక శక్తివంతమైన
జాతి. వారు గాజా, అష్కెలోను, అష్డోదు,
గాతు, ఎక్రోను అనే ఐదు ప్రధాన పట్టణాలను
కేంద్రంగా చేసుకుని, ఐదుగురు నాయకుల పరిపాలనలో ఐక్యంగా
ఉండేవారు. వారి సైనిక శక్తికి, ముఖ్యంగా ఇనుప ఆయుధాలు, రథాలు తయారుచేసే సాంకేతిక నైపుణ్యానికి, ఇశ్రాయేలు
ప్రజలు తట్టుకోలేకపోయేవారు.
ఫిలిస్తియులు దాగోను అనే దేవుడిని
ప్రధానంగా ఆరాధించేవారు. ఇది సగం చేప, సగం మనిషి ఆకారంలో
చిత్రించబడే ఒక వ్యవసాయ, సముద్ర దేవత. వారి మతం, సంస్కృతి పూర్తిగా ఇశ్రాయేలు ప్రజల ఏకదైవారాధనకు, ధర్మశాస్త్రానికి భిన్నంగా ఉండేది. ఈ నేపథ్యంలో, సంసొను వారితో పదే పదే వివాహ సంబంధాలు, స్నేహాలు
కోరుకోవడం, దేవుడు ఇశ్రాయేలుకు ఇచ్చిన ప్రత్యేక
ఆజ్ఞలకు నేరుగా విరుద్ధమైనది. అయితే పవిత్ర గ్రంథం ఈ వైరుధ్యాన్ని కూడా దేవుని
ఉద్దేశం నెరవేర్చే మార్గంగా చూపిస్తుంది. సంసొను తన వ్యక్తిగత కోరికల వల్ల ఫిలిస్తియులతో
సన్నిహితంగా ఉన్నా, ఆ సాన్నిహిత్యమే అతనికి వారిపై దాడి
చేయడానికి, వారి బలాన్ని బలహీనపరచడానికి అవకాశాలను
కల్పించింది.
సంసొను వ్యూహాలను గమనిస్తే, అతడు కేవలం ఒక అడవి మనిషిలా బలప్రయోగం చేయలేదని అర్థమవుతుంది. నక్కల ఉదంతంలో అతడు ఫిలిస్తియుల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నాడు; గాజా ద్వారాల సంఘటనలో అతడు వారి రక్షణ వ్యవస్థను అపహాస్యం చేశాడు; దాగోను దేవాలయంలో అతని చివరి కార్యం వారి మతపరమైన, రాజకీయ నాయకత్వాన్నే ఒక్కసారిగా తుడిచిపెట్టింది. ఈ మూడు దాడులు మూడు వేర్వేరు రంగాలను ఆర్థిక, సైనిక, మతపరమైన వాటిని లక్ష్యంగా చేసుకున్నాడు, ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, దేవుని పథకంలో భాగంగా భావించవచ్చు.
సంసొను పరాక్రమం - ఒక సమగ్ర పరిశీలన
సంసొను వీరత్వాన్ని మనం విడివిడిగా చూసిన
సంఘటనలను ఒకచోట చేర్చి చూస్తే, అతని పరాక్రమం యొక్క నిజమైన పరిమాణం
అవగతమవుతుంది. ఖాళీ చేతులతో సింహాన్ని చీల్చడం, ఒంటరిగా
ముప్పైమందిని హతమార్చడం, మూడు వందల నక్కలతో శత్రు పంటలను నాశనం
చేయడం, ఒక్క దవడ ఎముకతో వెయ్యిమందిని కూల్చడం, కట్టివేయబడిన
బలమైన తాళ్ళను, తాజా నరాలను, మేకుతో
బిగించిన మగ్గాన్ని నారపోగుల్లా తెంచడం, పట్టణ ద్వారాలను
స్తంభాలతో సహా భుజాలపై మోసుకుపోవడం,
చివరికి అంధుడైనా దేవాలయపు రెండు ప్రధాన స్తంభాలను కూల్చివేయడం,
ఇవన్నీ కలిపి చూస్తే, పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపించే అత్యంత
అసాధారణ శారీరక పరాక్రమ గాథలలో సంసొను గాథ ముందు వరుసలో నిలుస్తుంది.
అయితే ఈ పరాక్రమాన్ని కేవలం భౌతిక కోణంలో మాత్రమే చూడకూడదు. ప్రతి ఒక్క సందర్భంలోనూ పవిత్ర గ్రంథం 'దేవుని ఆత్మ అతనిపై బలంగా వచ్చింది' అని చెబుతుంది . అంటే సంసొను పరాక్రమం అతని కండరాల బలం వల్ల కాదు, అది దేవుని ఆత్మ అతనిపై పనిచేసినప్పుడు మాత్రమే వ్యక్తమయ్యే దైవ శక్తి. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా సంసొను కథను చదివితే, అది కేవలం ఒక అసాధారణ వీరుని కథగా మిగిలిపోతుంది; కానీ ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని చదివితే, అది దేవుని శక్తి బలహీనమైన, పాపభరితమైన మానవుల ద్వారా కూడా ఎలా వ్యక్తమవుతుందో తెలియజేసే ఒక లోతైన ఆధ్యాత్మిక సాక్ష్యంగా మారుతుంది.
సంసొను వ్యక్తిత్వము - బలాలు మరియు బలహీనతలు
సంసొను జీవితాన్ని లోతుగా పరిశీలిస్తే, అతని వ్యక్తిత్వంలో అనేక పరస్పర విరుద్ధమైన లక్షణాలు కనిపిస్తాయి.
అతని బలాలు: అసాధారణ శారీరక శక్తి, ధైర్యం, తన
ప్రజల పట్ల ప్రేమ (ఫిలిస్తియులపై అతని పోరాటమంతా, ఏదో
ఒక రూపంలో, ఇశ్రాయేలు విమోచనకు దోహదపడింది), మరియు చివరి క్షణంలో దేవునిపై చూపిన లోతైన నమ్మకం.
అతని బలహీనతలు కూడా స్పష్టంగా
కనిపిస్తాయి: నియంత్రణ లేని కోరికలు (తిమ్నాతు స్త్రీ, గాజా వేశ్య,
దెలీలా ఈ ముగ్గురు స్త్రీలతో
అతని సంబంధాలు అతని జీవితంలో మలుపులుగా నిలిచాయి), తీవ్రమైన
కోపం, ప్రతీకార వాంఛ, తన బలాన్ని తేలికగా, గర్వంగా తీసుకోవడం, మరియు దేవుని నియమాలను పదే పదే, చిన్న చిన్న మార్గాల్లో అతిక్రమించడం, శవాన్ని తాకడం, ద్రాక్షతోట విందులో పాల్గొనడం (బహుశా మద్యం సేవించడంతో సహా), చివరికి తన నాజరీయుని చిహ్నమైన వెంట్రుకల రహస్యాన్ని వెల్లడించడం.
అయితే గమనించదగ్గ ముఖ్యమైన విషయం ఏమిటంటే, సంసొను తప్పులు చేసినప్పటికీ, దేవుడు అతనిని పూర్తిగా విడిచిపెట్టలేదు. హెబ్రీయులకు వ్రాసిన లేఖ పదకొండవ అధ్యాయంలో, విశ్వాస వీరుల జాబితాలో సమ్సోను పేరు కూడా చేర్చబడింది. గిద్యోను, బారాకు, యెఫ్తా, దావీదు, సమూయేలు వంటి వారితో పాటు సంసొను పేరు కూడా ఉంది. ఇది మనకు ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని బోధిస్తుంది - దేవుని కృప మన అపరిపూర్ణతలను మించినది, మరియు ఆయన మనలను, మన బలహీనతలతో సహా, తన గొప్ప ప్రణాళికలో ఉపయోగించుకోగలడు.
ఈ కథ నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలు
సంసొను జీవితం మనకు అనేక లోతైన ఆధ్యాత్మిక పాఠాలను
బోధిస్తుంది. మొదటిది, దేవుడిచ్చిన వరాలను, బలాలను మనం ఎలా ఉపయోగించుకుంటున్నాము అనేది చాలా ముఖ్యం. సంసొనుకు
అసాధారణ శక్తి ఉంది, కానీ అతడు దానిని తరచూ వ్యక్తిగత కోరికలు,
కోపం, ప్రతీకారం కోసం వాడాడు, దేవుని మహిమ కోసం వాడలేదు. మనకు దేవుడిచ్చిన ప్రతి వరం తెలివి,
సంపద, ప్రతిభ, అధికారం
వీటిని మనం ఎలా వాడుతున్నాము అనేది మన విశ్వాస జీవితానికి కీలకం.
రెండవది, చిన్న
రాజీలు పెద్ద పతనానికి దారితీస్తాయి. సంసొను ఒక్క రోజులో పూర్తిగా పతనం చెందలేదు. సింహం కళేబరాన్ని తాకడం వంటి చిన్న చిన్న నియమ
ఉల్లంఘనలతో మొదలై, క్రమంగా పెద్ద పాపాలకు దారితీసింది. మన
ఆధ్యాత్మిక జీవితంలో కూడా, చిన్న రాజీలను తేలికగా తీసుకోవడం
ప్రమాదకరం. అవి మెల్లమెల్లగా మన హృదయాన్ని కఠినపరచి,
పెద్ద పతనానికి పునాది వేస్తాయి.
మూడవది, తప్పుడు
సాంగత్యం, తప్పుడు
ప్రేమలు మనలను నాశనం చేయగలవు. సంసొను జీవితంలో మూడు ప్రధాన స్త్రీ సంబంధాలు అతనికి
పదే పదే కష్టాలు తెచ్చిపెట్టాయి, చివరికి దెలీలా అతని పూర్తి పతనానికి
కారణమైంది. మనం ఎవరితో సన్నిహితంగా ఉంటున్నామో, ఎవరి
ప్రభావంలో ఉంటున్నామో అనేది మన ఆధ్యాత్మిక భద్రతకు అత్యంత ముఖ్యమైనది.
నాలుగవది, దేవుని
సన్నిధి మనతో ఉందా లేదా అనే విషయాన్ని మనం గుర్తించగలగాలి. సంసొను అత్యంత
విషాదకరమైన క్షణం ఏమిటంటే, 'యావే తనను విడిచిపెట్టాడని అతనికి తెలియలేదు.'
మనం కూడా కొన్నిసార్లు, పాపంలో కొనసాగుతూ,
దేవుని కృప, శక్తి మనతో ఇంకా ఉన్నాయని అనుకుంటూ,
వాస్తవానికి ఆధ్యాత్మికంగా శూన్యులుగా మారిపోతుంటాము. నిరంతరం
దేవునితో మన సంబంధాన్ని పరీక్షించుకోవడం అవసరం.
ఐదవది, పశ్చాత్తాపం,
పునరుద్ధరణ ఎప్పుడూ సాధ్యమే. సంసొను వెంట్రుకలు మళ్ళీ పెరగడం
ప్రారంభమైన చిన్న వివరణ మనకు గొప్ప ఆశను ఇస్తుంది. మన
అత్యంత అధఃపాతాళ స్థితిలో కూడా, దేవుని కృప మనలను పూర్తిగా
విడిచిపెట్టదు. సంసొను తన అంధత్వంలో,
బానిసత్వంలో, అవమానంలో కూడా, చివరికి
దేవుని వైపు తిరిగి, నిజమైన నమ్రతతో ప్రార్థించగలిగాడు. మన
జీవితంలో ఎంత లోతుగా పడిపోయినా, దేవుని వద్దకు తిరిగి రావడానికి ఎప్పుడూ
ఆలస్యం కాదు.
ఆరవది, దేవుడు
మన బలహీనతలను కూడా తన మహిమ కోసం ఉపయోగించుకోగలడు. సంసొను జీవితమంతా, అతని తప్పులు, అతని పాపాలు కూడా, దేవుని
పథకంలో భాగంగా మారి, ఫిలిస్తియుల శక్తిని బలహీనపరచడానికి,
ఇశ్రాయేలు విమోచనకు దోహదపడ్డాయి. ఇది మనకు ఒక గొప్ప ఓదార్పు. మన
గతంలోని తప్పులు, వైఫల్యాలు కూడా, మనం
పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగినప్పుడు, ఆయన వాటిని కూడా
మన మేలుకు, తన మహిమకు మలచగలడు.
చివరిగా, సంసొను
జీవితం మనకు గుర్తుచేసేది ఏమిటంటే, నిజమైన
శక్తి మన సొంతం కాదు, అది దేవుని నుండి వచ్చేది. మనం ఆ శక్తిని
విన్రమతతో, కృతజ్ఞతతో స్వీకరించి, దేవుని మహిమ కోసం ఉపయోగించినప్పుడు మాత్రమే అది నిజమైన ఫలాన్ని
ఇస్తుంది. అహంకారంతో, స్వార్థంతో దానిని వాడినప్పుడు, అది మనలను నాశనం చేసే ఆయుధంగా మారిపోతుంది. తల్లి గర్భంలో ఉన్నప్పటి
నుండే దేవునికి ప్రతిష్ఠించబడిన సంసొను, తన జీవితాంతం ఆ
ప్రతిష్ఠను పూర్తిగా గౌరవించలేకపోయాడు, కానీ చివరి
క్షణంలో తన నిజమైన శక్తి మూలాన్ని గుర్తించి, దేవుని
వైపు తిరిగాడు. ఈ కథ మనకు ఒక హెచ్చరిక మాత్రమే కాదు, ఒక
ఆహ్వానం కూడా, దేవుడు ఇచ్చిన ప్రతి
వరాన్ని, ప్రతి బలాన్ని, వినయంతో,
విశ్వాసంతో, ఆయన మహిమ కోసమే ఉపయోగించమని.
ఏడవది, మనం
ఎవరికి మన అత్యంత లోతైన రహస్యాలను, మన హృదయపు తలుపులను తెరచి చూపిస్తున్నామో
అనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దెలీలా నాలుగుసార్లు అడిగినా, సంసొను చివరికి ఆమెకు లొంగిపోయాడు. ఎందుకంటే నిరంతర ఒత్తిడి, పోరు
మనిషి మనసును క్రమంగా బలహీనపరుస్తాయి. మనం ఎవరితో సన్నిహిత సంబంధాలు
పెంచుకుంటున్నామో, వారు మనలను దేవుని వైపుకు
నడిపిస్తున్నారా లేక దేవుని నుండి దూరం చేస్తున్నారా అని పరిశీలించుకోవడం అవసరం.
ఎనిమిదవది, తల్లిదండ్రుల ప్రార్థన, వారి భక్తి, పిల్లల భవిష్యత్తుపై శాశ్వతమైన ప్రభావం చూపుతుంది. మానోవా దంపతులు తమ బిడ్డ పుట్టకముందే దేవుని మార్గదర్శకత్వం కోరి, భక్తిగా జీవించారు. వారి విశ్వాసం, వారి విధేయత సంసొను జీవితానికి ఒక పునాదిగా నిలిచింది, అతడు ఆ పునాది నుండి పూర్తిగా తప్పిపోయినప్పటికీ, ఇది తల్లిదండ్రులుగా మనం మన పిల్లల కోసం ప్రార్థించడం, వారికి ఆధ్యాత్మిక పునాది వేయడం ఎంత ముఖ్యమో గుర్తుచేస్తుంది. ఆ తర్వాత వారు ఎలాంటి ఎంపికలు చేసుకున్నా, ఆ పునాది వారి జీవితాంతం వారితోనే ఉంటుంది.
సంసొను ఒక పూర్వఛాయగా - ఆధ్యాత్మిక దృష్టికోణం
క్రైస్తవ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో,
పాత నిబంధనలోని అనేక మంది వ్యక్తులు, సంఘటనలు
రాబోయే క్రీస్తు రక్షణకార్యానికి పూర్వఛాయలుగా పరిగణించబడతాయి. సంసొను జీవితంలో కూడా కొన్ని ఆసక్తికరమైన సారూప్యతలు
మనం గమనించవచ్చు, అయితే ఇవి పోలికలు మాత్రమే, సంసొను ఏ విధంగానూ
క్రీస్తుకు సమానుడు కాదని స్పష్టంగా గుర్తుంచుకోవాలి. మొదటిది, సంసొను జననం కూడా ఒక దేవదూత
వాగ్దానం ద్వారా, అసాధారణ పరిస్థితులలో జరిగింది . ఇది యేసుక్రీస్తు జననానికి ముందు గబ్రియేలు దూత
మరియమ్మకు, జకర్యాకు ఇచ్చిన వాగ్దానాలను
గుర్తుచేస్తుంది. రెండవది, సంసొను జన్మనుండే ఒక ప్రత్యేక ఉద్దేశం కోసం, తన ప్రజలను విడిపించడం కోసం, ప్రతిష్ఠించబడ్డాడు.
ఇది క్రీస్తు తన ప్రజలను పాపం నుండి
విడిపించడానికి పంపబడిన విధానాన్ని పోలి ఉంటుంది.
అత్యంత గాఢమైన సారూప్యత సంసొను మరణంలో
కనిపిస్తుంది. అతడు తన శత్రువులను తన
జీవితకాలంలో కంటే తన మరణంలోనే ఎక్కువమందిని ఓడించాడు. తన
చేతులను చాచి, తన శరీరాన్ని బలిగా అర్పించి, తన మరణం ద్వారానే గొప్ప విజయాన్ని సాధించాడు. ఇది సిలువపై
యేసుక్రీస్తు మరణాన్ని పరోక్షంగా సూచిస్తుందని అనేక క్రైస్తవ వ్యాఖ్యాతలు
భావిస్తారు. క్రీస్తు కూడా తన శారీరక మరణం
ద్వారానే పాపాన్ని, మరణాన్ని, సాతానును
ఓడించాడు, తన చేతులు చాచి సిలువపై బలి అయ్యాడు.
అయితే ఇక్కడ ఒక ప్రాథమిక వ్యత్యాసాన్ని మనం స్పష్టంగా గుర్తించాలి. సంసొను మరణం అతని స్వంత పాపాల పర్యవసానంగా, ప్రతీకార వాంఛతో కూడిన ఒక చివరి కార్యంగా వచ్చింది, కానీ క్రీస్తు మరణం పూర్తిగా నిష్కళంకమైనది, ప్రేమతో,
ఇతరుల పాపాలను తానే భరించడం కోసం స్వచ్ఛందంగా అంగీకరించినది.
ఈ పోలికలను ధ్యానించడం వల్ల మనకు ఒక విషయం స్పష్టమవుతుంది. పాత నిబంధనలోని అసంపూర్ణమైన, పాపభరితమైన విమోచకుల ద్వారా కూడా దేవుడు తన ప్రజలకు పాక్షిక విడుదల ఇచ్చాడు, అయితే ఆ విడుదల ఎప్పుడూ తాత్కాలికమే, అసంపూర్ణమే. సంసొను ఇరవై సంవత్సరాలు పరిపాలించినా, ఫిలిస్తియుల ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. దీనికి భిన్నంగా, క్రీస్తు తీసుకువచ్చిన విడుదల శాశ్వతమైనది, సంపూర్ణమైనది, పాపం మరణంపై శాశ్వత విజయాన్ని ప్రసాదించేది. సంసొను కథ మనకు, పరిపూర్ణమైన విమోచకుని కోసం మానవజాతి ఎదురుచూసిన నిరీక్షణను, మరియు ఆ నిరీక్షణ యేసుక్రీస్తులో ఎలా పరిపూర్ణంగా నెరవేరిందో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.
దాను గోత్రం – సంసొను వారసత్వం
సంసొను దాను గోత్రానికి చెందినవాడు. యాకోబు
కుమారుడైన దాను వంశస్థుడు. ఆసక్తికరంగా, యాకోబు తన
మరణశయ్యపై తన కుమారులను ఆశీర్వదిస్తూ దాను గురించి ప్రవచనాత్మకంగా ఇలా అన్నాడు: 'దాను తన ప్రజలకు ఇశ్రాయేలు గోత్రాలలో ఒకనిగా న్యాయం తీరుస్తాడు,
దాను మార్గంలో పాము వలె, దారిలో సర్పం వలె
ఉండి, గుర్రపు మడమలను కరుస్తాడు.' ఈ ప్రవచనం సంసొను వ్యూహాత్మక, ఆకస్మిక
దాడులలో, అతని పరోక్ష యుద్ధ పద్ధతిలో నెరవేరినట్లు
కనిపిస్తుంది. అతడు పెద్ద సైన్యాలను
నడిపించలేదు, బదులుగా ఒంటరిగా, పాము
వలె అనుకోని క్షణాలలో దాడి చేసేవాడు.
దాను గోత్రం ఇశ్రాయేలులో చిన్న గోత్రాలలో ఒకటి, మరియు వారికి కేటాయించిన భూభాగం ఫిలిష్తీయుల సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉండేది, దాని వలన వారు ఎప్పుడూ ఫిలిష్తీయుల దండయాత్రలకు మొదటి లక్ష్యంగా ఉండేవారు. ఈ నేపథ్యంలో, దేవుడు తన విమోచకుని ఈ చిన్న, బలహీన గోత్రం నుండే ఎన్నుకోవడం విశేషం - ఇది దేవుడు ఎప్పుడూ మానవ దృష్టిలో గొప్పవారిని కాక, తాను ఎన్నుకున్నవారిని ఉపయోగించుకుంటాడనే సత్యాన్ని పునరుద్ఘాటిస్తుంది. సమ్సోను పేరు తర్వాతి కాలంలో కూడా ఇశ్రాయేలు చరిత్రలో అసాధారణ శక్తికి, ధైర్యానికి పర్యాయపదంగా నిలిచిపోయింది, మరియు అతని కథ తరతరాలుగా దేవుని ప్రజలకు హెచ్చరికగా, ప్రేరణగా చెప్పబడుతూనే ఉంది.https://www.carmelshobha.com/2026/07/bible-history-telugubiography-of-judah-from-fall-to-redemption.html
ముగింపు
సంసొను కథ న్యాయాధిపతుల గ్రంథంలో అత్యంత నాటకీయమైన,
హృదయాన్ని కదిలించే కథలలో ఒకటి. ఇది దేవుని విశ్వసనీయత, మానవుని బలహీనత, పాపం యొక్క వినాశకర శక్తి, మరియు పశ్చాత్తాపం ద్వారా వచ్చే పునరుద్ధరణ వీటన్నింటి కథ. సంసొను తన జీవితమంతా అనేక తప్పులు చేసినప్పటికీ,
దేవుడు అతని ద్వారా తన ప్రజలను ఫిలిస్తియుల నుండి విడిపించే పనిని
ప్రారంభించాడు, ఆ పని పూర్తిగా నెరవేరడానికి మరిన్ని
తరాలు, చివరికి దావీదు రాజు అవసరమయ్యాడు.
ఈ కథను ధ్యానిస్తూ, మనం ప్రతి ఒక్కరం మన స్వంత జీవితాలలో సంసొను
వంటి క్షణాలను గుర్తించగలుగుతాము. దేవుడిచ్చిన
వరాలను దుర్వినియోగం చేసే క్షణాలు, చిన్న రాజీలకు లొంగిపోయే క్షణాలు,
కానీ దేవుని కృప మనలను వెతుకుతూ వచ్చే క్షణాలు కూడా. తండ్రి, తల్లి దేవుని ఎదుట మోకరిల్లి ప్రార్థించిన ఆ మానోవా దంపతుల విశ్వాసం నుండి, సంసొను
చివరి క్షణంలో చేసిన నిజమైన, వినయపూర్వకమైన ప్రార్థన వరకు ఈ కథ మొత్తం మనకు దేవుని అనంతమైన కృపను, ఓర్పును, మరియు ప్రేమను చాటి చెబుతుంది. మనం కూడా,
మన బలహీనతలతో సహా, పూర్తిగా దేవునికి అంకితమైనప్పుడు,
ఆయన మన ద్వారా గొప్ప కార్యాలు చేయించగలడు.
Comments
మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:
Post a Comment