Mark 12:28-34 Reflection: Loving God With All Your Heart | Carmel Shobha

 



 పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించుట ఎలా?

ధర్మ శాస్త్ర బోధకులలో ఒకడు వచ్చి వారు తర్కించుట చూచి, ఆయన చక్కగ సమాధనము ఇచ్చేనని గ్రహించి, "ఆజ్ఞలన్నీటిలో ప్రధానమైనది ఏది?" అని ప్రశ్నించెను. అందుకు యేసు "యిశ్రాయేలీ యులారా! వినుడు. మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో ,పూర్ణ మనస్సుతో , పూర్ణ శక్తితో  ప్రేమింపవలెను. ఇది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించు కొనునట్లు నీ పొరుగు వానిని ప్రేమింపుము. ఇది రెండవ ఆజ్ఞ . వీనిని మించిన ఆజ్ఞ మరి యొకటి లేదు" అని సమాధానమిచ్చేను. అప్పుడతడు "బోధకుడా! నీవు యధార్ధమును చెప్పితివి. దేవుడు ఒక్కడే. ఆయన తప్ప మరి యొకడు లేడు. ఆయనను పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రేమించుట, తనను తాను ప్రేమించుకొనునట్లు తన పొరుగు వానిని ప్రేమించుట, సమస్త హోమముల కంటే సమస్త బలుల కంటే ఘనమైనది" అని పలికెను. చక్కగా సమాధనమిచ్చిన ఆ ధర్మ శాస్త్ర బోధకునితో యేసు "దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు" అనెను. అటు తరువాత  ఆయనను ఎవరు ఏమియు అడుగుటకు సాహసింపలేదు. 

ఆజ్ఞలన్నీటికంటే  ముఖ్యమైనది ఏది?

మన దైనందిన జీవితం అనేక ఆజ్ఞలు, నియమాలు, బాధ్యతలతో నిండి ఉంటుంది. చిన్ననాటి నుండి కుటుంబం, సమాజం, దేవాలయం, పని  ఇలా ప్రతి చోటా ఎన్నో  విధులను మనం పాటిస్తూనే ఉంటాం. అయితే, ఈ అన్నిటిలో అత్యంత ముఖ్యమైనది ఏమిటి?  దేవుడు మన నుండి నిజంగా ఏమి కోరుతున్నాడు? మన ప్రార్థనలు, ఉపవాసాలు, సేవాకార్యక్రమాలు , దానధర్మాలు అన్నిటికంటే గొప్పది ఏది? ఈ ప్రశ్నకు సమాధానం మార్కు సువార్త 12:28-34లో యేసు ప్రభువు ఎంతో స్పష్టంగా ఇచ్చాడు. ఒకధర్మశాస్త్ర బోధకుడ యేసు వద్దకు వచ్చి,  అన్ని ఆజ్ఞలలో ప్రధానమైనది ఏది? అని అడిగాడు. యేసు  ప్రభువు ద్వితీయోపదేశకాండము 6:4-5 ఆధారంగా సమాధానం చెప్పాడు.

"యిశ్రాయేలీ యులారా! వినుడు. మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో ,పూర్ణ మనస్సుతో , పూర్ణ శక్తితో  ప్రేమింపవలెను. ఇది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించు కొనునట్లు నీ పొరుగు వానిని ప్రేమింపుము. ఇది రెండవ ఆజ్ఞ . వీనిని మించిన ఆజ్ఞ మరి యొకటి లేదు"  ఈ మాటలు క్రైస్తవ జీవితానికి చాలా ముఖ్యమైనవి.  దేవుడు మన నుండి మొదట కోరేది ప్రేమ. భయం కాదు, ఆచారాలు కాదు—పరిపూర్ణమైన ప్రేమ మాత్రమే.

పరిపూర్ణ ప్రేమకు నాలుగు పునాదులు

యేసు ప్రభువు ద్వితీయోపదేశకాండమును ఉటంకిస్తూ చెప్పిన నాలుగు ప్రాముఖ్యమైన అంకిత భావాలు: పూర్ణ హృదయంతో ప్రేమించుట, పూర్ణ ఆత్మతో  ప్రేమించుట, పూర్ణ మనస్సుతో ప్రేమించుట, పూర్ణ బలముతో ప్రేమించుట 

 

దేవుడు హృదయపూర్వక ప్రేమను కోరుతున్నాడు

పూర్ణ హృదయంతో ప్రేమించుట 

 యేసు ప్రభువు  కేవలం ఒక చట్టాన్ని చెప్పలేదు; ఆయన దేవుని అంతరంగ హృదయాన్ని వెల్లడించాడు. దేవుడు మన నుండి ఎక్కువ పనులను, ఆడంబరాలను కోరడం లేదు. ఆయన మన హృదయాన్ని కోరుతున్నాడు. కొన్ని  మనం దేవునితో ఉన్న సంబంధాన్ని కేవలం ఒక విధిగా చూస్తాము! ప్రార్థన చేస్తాము ఎందుకంటే అది రోజువారీ అలవాటు కాబట్టి. చర్చికి వెళ్తాము ఎందుకంటే అది మన కర్తవ్యం కాబట్టి. బైబిలు చదువుతాము ఎందుకంటే అది మంచిదని మనకు తెలుసు కాబట్టి. యేసు ప్రభువు కేవలం ఇవి చేయాలి కనుక చేస్తున్నవా? నా మీద ప్రేమతో చేస్తున్నవా అని అడుగుతున్నాడు. ప్రేమలేని దైవ ఆరాధన ఒక యాంత్రిక కార్యక్రమమే, ప్రేమలేని ప్రార్ధన ఒక మాటల గారడినే. అందుకే ఆవిలాపూరి తెరేసమ్మ ప్రార్ధన అంటే మనలను ప్రేమిస్తున్నారని తెలిసిన ప్రభువుతో ప్రేమ పూర్వక సంభాషణ అని చెబుతారు. దేవునితో బంధం ఎప్పుడు ప్రేమతో కూడిన బంధమే.  నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించమని ప్రభువు చెబుతున్నారు. హృదయం అంటే తాత్కాలిక భావోద్వేగాలు కావు, పవిత్ర గ్రంధంలో హృదయం అనేది మన అంతరంగం, మన ఆలోచనలు , కోరికలు, భయాలు, ఆశలు మరియు ఆశయాలు, సంకల్పశక్తికి  మూలస్థానం.

ఈ రోజు నా హృదయం ఎక్కడ ఉంది? దేవునిలోనా లేక ప్రపంచ విషయాలలోనా? మనకు సమయం దొరికినప్పుడు మనం దేని గురించి ఆలోచిస్తాము? మనకు బాధ వచ్చినప్పుడు మొదట ఎవరి వద్దకు వెళ్తాము? మనకు సంతోషం వచ్చినప్పుడు దానిని ఎవరితో పంచుకుంటాము? ఈ ప్రశ్నలు మన హృదయం ఎక్కడ ఉందో తెలియజేస్తాయి.

 తరచూమన హృదయం విభజించబడి ఉంటుంది. ఒక భాగం దేవుని వైపు, మరో భాగం లౌకిక విషయాల  వైపు, ఇంకో భాగం గతంలో జరిగిన గాయాల వైపు ఉంటుంది. కానీ "పూర్ణ" అనే పదం మనలను సవాలు చేస్తుంది. హృదయం అనే వేదికపై ఉన్న డబ్బు, గౌరవం, భయం అనే వాటిని  తీసివేసి, ఏకైకదేవుణ్ణి నిలబెట్టడమే పూర్ణ హృదయంతో ప్రేమించడం.

 నీ పూర్ణ ఆత్మతో ప్రేమించుము” – ప్రాణాన్ని పణంగా పెట్టే ప్రేమ

ఆత్మ’ లేదా ‘ప్రాణము’ అంటే మన లోతైన వ్యక్తిత్వం, జీవిత శ్వాస, మన మనుగడ. పూర్ణ ఆత్మతో ప్రేమించడం అంటే నా జీవితపు ప్రతి క్షణాన్ని, ప్రతి పనిని, ప్రతి సంబంధాన్ని దేవుని సన్నిధిగా మార్చుకోవడం. చాలామంది భక్తిని కేవలం ప్రార్థనా గదికి మాత్రమే పరిమితం చేస్తారు. కానీ మనం నడిచే ప్రతి అడుగు ప్రార్థన అవ్వచ్చు.

నీ పూర్ణ మనస్సుతో ప్రేమించుము” – ఆలోచనల ప్రేమ

మనస్సు అంటే తెలివి, యుక్తి, విచక్షణ. భక్తి అనేది బుద్ధిహీనమైన భావోద్వేగం కాదు; దేవుని ప్రేమకు మన బుద్ధి కూడా అవసరం. మనస్సుతో ప్రేమించడం అంటే దేవునిని, ఆయన వాక్యాన్ని లోతుగా తెలుసుకోవాలని కోరుకోవడం. ప్రేమ ఎప్పుడూ అవతలి వ్యక్తిని తెలుసుకోవాలని ఆరాటపడుతుంది. ఒక తల్లి తన బిడ్డ గురించి, ఒక స్నేహితుడు తన స్నేహితుని గురించి తెలుసుకోవాలనుకున్నట్లే, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి ఆయన చిత్తాన్ని వెదకుతాడు. బైబిలు చదవడం, వాక్యాన్ని ధ్యానించడం, ఆధ్యాత్మిక సత్యాలను గ్రహించడం మనస్సుతో ప్రేమించే మార్గాలు. మన  తలంపులు మనలను  దేవుని వైపుకు లాగుతాయా లేక దూరం చేస్తాయా? ద్వేషపూరిత ఆలోచనలు, అపవాదులు మనస్సును కలుషితం చేస్తాయి.

 

నీ పూర్ణ బలముతో ప్రేమించుము – మన పనులతో దేవుణ్ణి ప్రేమించడం  

ప్రేమ అనేది కేవలం మాటలకు లేదా భావోద్వేగాలకు పరిమితమైంది కాదు; ప్రేమ ఒక నిరంతర క్రియ. మన సమయాన్ని, ప్రతిభను, శారీరక శక్తిని, వనరులను దేవుని రాజ్యం కోసం, ఆయన ప్రజల కోసం అంకితం చేయడమే పూర్ణ బలంతో ప్రేమించడం. మనం ప్రేమించే వ్యక్తి కోసం త్యాగం చేయడానికి వెనుకాడం. యేసు ప్రభువు  మన కోసం సిలువపై తన  ప్రాణాన్ని ఇచ్చాడు. అప్పుడు మన ప్రేమ కూడా త్యాగపూరితమైన క్రియగా మారాలి.

 

పొరుగువానిని నీవలె ప్రేమించుము

యేసు ప్రభువు మొదటి ఆజ్ఞతో పాటు రెండవ ఆజ్ఞను కూడా జత చేశాడు. దేవుణ్ణి ప్రేమించడం మరియు మనుష్యులను ప్రేమించడం విడదీయరానివి. మన కంటికి కనిపించే సహోదరుని ద్వేషిస్తూ, కంటికి కనిపించని దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పడం అబద్ధం అవుతుంది. ప్రతి మనిషిలో దేవుని ప్రతిరూపం ఉంది. మన కుటుంబ సభ్యులు, పొరుగువారు, మనతో విభేదించే వ్యక్తులు, మనలను బాధపెట్టినవారు—అందరిలోనూ దేవుని ముఖాన్ని చూడగలగాలి. ఇది మనకు  సహజంగా చాలా కష్టం, కానీ నిజమైన ప్రేమ అక్కడే పరీక్షించబడుతుంది. దీనిలో మనం విజయం సాదించాలి అప్పుడే మనం నిజమైన క్రీస్తు అనుచరులం అవుతాము.

ప్రార్ధన

ప్రభూ, ప్రతి రోజు  నేను ప్రార్థిస్తున్నాను, కానీ నిజంగా నిన్ను ప్రేమిస్తున్నానా? లేక ఇవన్నీ అలవాటుగా చేస్తున్నానా? తెలియడంలేదు.  కొన్నిసార్లు నా హృదయం నీ కంటే ప్రపంచ విషయాల వైపే ఎక్కువగా పరుగెడుతోంది. నా ప్రార్థనలు కూడా స్వార్థపూరితంగా మారుతున్నాయి. ప్రభూ, నేను నిన్ను ప్రేమించకముందే నీవు నన్ను ప్రేమించావు. నేను పాపిగా ఉన్నప్పుడు, నీకు దూరంగా వెళ్లినప్పుడు కూడా నన్ను వెతికావు. నా బలహీనతను నీ పాదాల చెంత ఉంచుతున్నాను. నన్ను క్షమించి, నీ ప్రేమను పొందుకునే భాగ్యాన్ని ఇవ్వు.  ధర్మశాస్త్ర బోధకుని  సమాధానాన్ని చూసి, నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవు అన్నారు ప్రభు, అప్పటి నుండి అందరిని ప్రేమించడం ఆరంబించి ఉండవచ్చు.  నాకు కూడా మిమ్ములను నా పొరుగు వారిని ప్రేమించే శక్తిని ఇవ్వండి. "నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో ప్రేమించుము" అని నీవు నన్ను పిలిచావు. ప్రభువా, నా హృదయాన్ని శుద్ధి చేయుము. నా ఆత్మను నీ ప్రేమతో, నా మనస్సును నీ సత్యంతో వెలిగించుము. నా బలమంతా నీ సేవకే అంకితం చేయుటకు సహాయం చేయుము. నా కుటుంబంలో, నా పనిలో, నా ఆలోచనలలో నీ ప్రేమ ప్రతిబింబించునట్లు చేయుము. నన్ను బాధపెట్టిన వారిని క్షమించుటకు, నాకు ఇష్టంలేని వారిని ప్రేమించుటకు నాకు దైవిక శక్తినివ్వుము. ఆమెన్.


Author

Fr. Amruth Raju Vellaturi, OCD

కార్మెల్ సన్యాసి, ఆధ్యాత్మికత అధ్యాపకుడు. తెలుగు క్రైస్తవులకు బైబిల్ సందేశాలను మరియు కార్మెల్ సభ ఆధ్యాత్మికత అందించడమే లక్ష్యం.

Comments

Post a Comment