మార్కు 12:18-27 పునరుత్థాన సత్యం మరియు దేవుని శక్తి

 

మార్కు 12  : 18-27 

అప్పుడు పునరుత్థానమును అంగీకరింపని సద్దుకయ్యులు కొందరు యేసు వద్దకు వచ్చి, "బోధకుడా ! ఒకడు సంతానము లేక మరణించిన యెడల, అతని భార్యను అతని సోదరుడు వివాహమాడి అతనికి కలుగజేయ వలేనని మోషే ఆజ్ఞాపించెను కదా! ఒకానొకప్పుడు ఏడుగురు అన్నదమ్ములుండిరి. అందు మొదటి వాడు పెండ్లాడి సంతానము లేకయే మరణించేను. రెండవ వాడు ఆ వితంతువును వివాహమాడెను. కాని అతడు సంతానము లేకయే మరణించేను. మూడవవాడు అట్లే మరణించేను. అట్లే ఏడుగురికి సంభవించేను. తుట్టతుదకు మరణించేను. ఆ ఏడుగురు సోదరులు ఆమెను వివాహమాడిరి కదా! పునరుత్థాన కాలమున ఆమె ఎవరి భార్య అగును?" అని ప్రశ్నించిరి. అందుకు యేసు " మీరు లేఖనములనుదేఆమె వుని శక్తిని ఎరుగక పొరపడుతున్నారు. పునరుత్థానమైన పిదప మానవులు వివాహము చేసికొనరు. వివాహము చేయబడరు. పరలోక మందలి దూతల వలె ఉందురు. "నేనే అబ్రహాము  దేవుడను, ఈసాకు దేవుడను, యాకోబు దేవుడను అని మండుచున్న పొదనుండి దేవుడు పలికన దానిని మోషే గ్రంధము నందు మీరు చదువలేదా? ఇది మృతుల పునరుత్థాన  ప్రస్తావన కదా! ఆయన సజీవులకే  దేవుడు కాని మృతులకు కాదు. మీరు పూర్తిగ పొరబడుచున్నారు." అని ప్రత్యుత్తర మిచ్చేను.

పునరుత్థాన సత్యం

మార్కు సువిశేషంలోని ఈ  వచనాలు మనకు ఒక ముఖ్యమైన సత్యాన్ని బోధిస్తాయి.  అది ఏమిటి అంటే సద్దూకయ్యులు — పునరుత్థానం లేదని వాదించే మతనాయకులు వారు యేసు ప్రభువును ఒక తెలివైన ప్రశ్నతో పరీక్షించడానికి వచ్చారు. వారి ఉద్దేశ్యం పునరుత్థాన విశ్వాసాన్ని హాస్యాస్పదంగా చూపించడమే. కాని  యేసు వారి తర్కాన్ని తప్పు అని, దేవుని స్వభావాన్ని మరియు నిత్యజీవితపు మహిమను తెలియజేస్తున్నాడు.  ఈ సువిశేషంలో  మనం మూడు ప్రధాన అంశాలను చూస్తాము

  1. సద్దూకయ్యుల తప్పిదం — దేవుని శక్తిని అర్థం చేసుకోని మానవ తర్కం
  2. పునరుత్థాన జీవితం యొక్క స్వభావం — భూలోకానికి భిన్నమైన పరలోక వాస్తవికత
  3. దేవుడు జీవించేవారి దేవుడు — మరణాన్ని జయించిన శాశ్వత సంబంధం

సద్దూకయ్యుల ప్రశ్న — మానవ తర్కం యొక్క పరిమితి

సద్దూకయ్యులు ఆ కాలంలో ప్రభావశాలి వర్గం. వారు యూదా సమాజంలో ఉన్నత వర్గానికి చెందినవారు, ప్రధాన యాజక కుటుంబాల నుండి వచ్చినవారు. వారు మోషే ధర్మశాస్త్రాన్ని మాత్రమే ప్రమాణంగా అంగీకరించేవారు. పునరుత్థానం, దేవదూతలు, ఆత్మ యొక్క శాశ్వతత్వం అనేవి మోషే ధర్మ శాస్త్రంలో స్పష్టంగా లేవని వారి వాదన. వారు నమ్మినది: "చనిపోయిన వ్యక్తి పూర్తిగా నశించిపోతాడు. మరణం తర్వాత జీవితం లేదు. దేవుడు ఈ భూమిపై మాత్రమే తన న్యాయాన్ని నెరవేరుస్తాడు." ఇటువంటి వాదనలతో వారు జీవిస్తూ, ఇతరులు అజ్ఞానములో ఉన్నారు అనుకునేవారు. వారి వాదననలకు ఊతం ఇచ్చేందుకు అనేక కథలు అల్లుకున్నారు.  అపరమితమైన దేవుని శక్తికి వారు పరిమితులు పెట్టుకున్నారు. 

వారి కల్పిత కథ: ఏడుగురు సోదరులు

వారు యేసు ప్రభువుకు  ఒక సంక్లిష్టమైన ఉదాహరణ ఇస్తారు:

  • ఒక స్త్రీ ఏడుగురు సోదరులను వరుసగా వివాహం చేసుకుంటుంది (దేవర వివాహ నియమం ప్రకారం — ద్వితీయోపదేశకాండము 25:5-10)
  • ప్రతి సోదరుడూ సంతానం లేకుండా మరణిస్తాడు
  • చివరకు స్త్రీ కూడా మరణిస్తుంది
  • ప్రశ్న: "పునరుత్థానంలో ఆమె ఎవరి భార్య అవుతుంది?"

వారి తర్కం: పునరుత్థానం నిజమైతే, ఆమె ఎవరి భార్య అవుతుంది?  ఇటువంటి ప్రశ్నలతో వారు పునరుత్థానము లేదు అని చెప్పేవారు. 

నేటి సందర్భంలో సద్దూకయ్యులు

మనం కూడా తరచుగా సద్దూకయ్యుల్లాగే ప్రవర్తిస్తాము:

  • దేవున్ని మన మానవ తర్కంతో కొలవడానికి ప్రయత్నిస్తాము
  • "దేవుడు ఇలా చేయలేడు" అనే పరిమితులను ఆయనపై రుద్దుతాము
  • బైబిల్ చదువుతాము కానీ దేవుని శక్తిని అనుభవించము
  • విశ్వాసాన్ని ఒక సిద్ధాంతంగా మార్చుకుంటాము, జీవిత అనుభవంగా కాదు, ఇటువంటి సమయాలలో మనం కూడా ఈ సద్దుకయ్యులమే. 

ఆత్మపరిశీలన : నేను దేవుని దగ్గరకు సత్యాన్ని తెలుసుకోవడానికి వస్తున్నానా, లేక నా అభిప్రాయాలను సమర్థించుకోవడానికి వస్తున్నానా? దేవుడు ఇలానే ప్రవర్తించాలి అనే కోరుకుంటున్ననా?

యేసు  ప్రభువు సమాధానం — దేవుని శక్తిని తెలుసుకోవడం

"మీరు లేఖనాలు గానీ, దేవుని శక్తిని గానీ తెలుసుకోరు"

యేసు ప్రభువు  సద్దూకయ్యులకు రెండు విషయాలు లోపించాయని చెప్పాడు:

1. లేఖనాల యొక్క నిజమైన అర్థాన్ని గ్రహించలేకపోవడం

  • వారు వాక్యాన్ని చదివారు, కానీ హృదయంతో స్వీకరించలేదు. కేవలం ఒక చరిత్ర పుస్తకంలానే వారు దేవుని వాక్యాన్ని చూశారు. 
  • వారికి దేవుని వాక్యంలోని లోతైన సత్యాలు తెలియవు
  • కార్మెలైట్ సంప్రదాయం ప్రకారం, దేవుని గురించి తెలుసుకోవడం కంటే దేవునిని తెలుసుకోవడం ముఖ్యం

2. దేవుని శక్తిని అనుభవించకపోవడం

  • వారికి దేవుడు ఎవరో గ్రంథస్థంగా తెలుసు, కానీ సజీవ దేవుని అనుభవం లేదు
  • వారి మతం ఆచారాలకు పరిమితమైంది,  దేవునితో సంబంధానికి  ఏర్పాటు చేసుకొనుటకు కాదు
  • వారు పునరుత్థానాన్ని విశ్వసించలేదు ఎందుకంటే వారు దేవుని సర్వశక్తిని నమ్మలేదు. దేవునికి అసాధ్యం అనేది లేదు అని వారు గ్రహించలేకపోయారు. 

పునరుత్థాన జీవితం యొక్క స్వభావం

"పునరుత్థానంలో వివాహం చేసుకోరు, వివాహం చేసుకోబడరు; వారు పరలోకంలో దేవదూతల వలె ఉంటారు." యేసు ప్రభువు  ఇక్కడ ఒక కీలకమైన సత్యాన్ని బోధిస్తున్నాడు: పరలోకం భూలోకం లాగా కాదు. భూలోకంలో వివాహం ఉంది. పరలోక జీవితంలో దేవునితో పూర్తి ఐక్యత ఉంటుంది. ఈ లోకంలో విడపోవడాలు , మరణించడం ఉంటుంది. పరలోకం అనేది శాశ్వతం అక్కడ మరణం లేదు.  అక్కడ విడిపోవడం లేదు దేవునితోనే పూర్తి ఐక్యత ఉంటుంది. ఈ లోకంలో ప్రేమ  అసంపూర్ణంగా ఉంటుంది. పరలోకములో  పరిపూర్ణమైన ప్రేమ ఉంటుంది. ఈ లోకంలో సృష్టించబడిన వారితో సంబంధం ఉంటుంది. పరలోకంలో సృష్టికర్తతో ఐక్యత ఉంటుంది.

యేసు ప్రభువు రెండవ సమాధానం: మోషే గ్రంథం నుండి ఇస్తున్నారు. 

దేవుడు అబ్రాహాముని దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పాడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఆయన మృతుల దేవుడు కాదు, జీవించేవారి దేవుడు అని స్పష్టం చేస్తున్నాడు. 

ఈ వాక్యంలోని లోతైన సత్యం

  1. దేవుడు వర్తమాన కాలంలో మాట్లాడుతున్నాడు
    • అబ్రాహాము మరణించి వందల సంవత్సరాలు గడిచాయి
    • దేవుడు "నేను అబ్రాహాము దేవుణ్ణి" (భూతకాలం "నేను ఉండేవాడిని" కాదు) అని చెప్పాడు, దేవుడు నేను ఉన్నవాడను అని చెప్పాడు. 
    • దేవుని దృష్టిలో అబ్రాహాము ఇప్పటికీ జీవించే ఉన్నాడు
  2. మరణం దేవుని సంబంధాన్ని అంతం చేయదు
    • దేవుడు ఆదాముతో "నీవు ఎక్కడ ఉన్నావు?" అని అడిగినప్పుడు అది ప్రేమను చూపిస్తుంది
    • ఆయన మృతులను కాకుండా జీవించేవారిని వెతుకుతాడు
    • మన ఆత్మలు ఆయన చేతిలో సురక్షితంగా ఉన్నాయి
  3. పునరుత్థానం 
    • నా ప్రియమైన వారు మరణించినా, వారు దేవుని హృదయంలో జీవించే ఉన్నారు
    • నా కష్టాలు, గాయాలు, విఫలయత్నాలు — ఇవేవీ అంతిమ మాటలు కావు
    • దేవుడు ప్రతిదానిని నూతనంగా సృష్టించగల శక్తి కలిగినవాడు
    • మన జీవితంలో ఉన్న అన్నీ లోపాలు, అపజయాలు, ఆశలు, ఆశయాలు అన్నింటికీ ఒక చోటనే న్యాయం జరిగేది అది కేవలం పునరుత్థానము. 

 

నేను ఎలాంటి  సద్దూకయ్యుడను?

 నేను దేవుని ముందు వినయంగా నిలుచుంటున్నానా, లేక నా బుద్ధిని ప్రదర్శించడానికి వస్తున్నానా? నేను కేవలం  బైబిల్ ను చరిత్ర పుస్తకంలా  చదువుతున్నానా, లేక దేవుని స్వరాన్ని వింటున్నానా? దేవుడు నాకు ఇస్తున్న ఒక సందేశంలా చదువుతున్ననా? నేను పునరుత్థానాన్ని భవిష్యత్తు ఆశగా మాత్రమే చూస్తున్నానా, లేక ఇప్పుడు నాలో పనిచేస్తున్న వాస్తవికతగా చూస్తున్నానా?

పునరుత్థానం ఇప్పుడు ప్రారంభమవుతుంది

పునరుత్థానం కేవలం మరణం తర్వాత జరిగే సంఘటన కాదు. అది ప్రతిరోజు నాలో జరుగుతుంది:

  • ప్రతి సారి నేను పాపం నుండి తిరిగినప్పుడు → పునరుత్థానం
  • ప్రతి సారి నేను క్షమించినప్పుడు → పునరుత్థానం
  • ప్రతి సారి నేను నిరాశను జయించినప్పుడు → పునరుత్థానం
  • ప్రతి సారి నేను ప్రేమించడానికి ఎంచుకున్నప్పుడు → పునరుత్థానం

ఎప్పుడైతే మనకు పునరుత్థానం మీద పూర్తి నమ్మకం ఉంటున్నదో అప్పుడు మన జీవితంలో భయం ఉండదు. ఆ భయాలు మొత్తం మారిపోతాయి. 

  • భవిష్యత్తు గురించి భయం
  • మరణం గురించి భయం
  • ఒంటరితనం గురించి భయం
  • విఫలమవుతాననే భయం
  • ఇవి మొత్తం పోయి నేను పూర్తి స్వేచ్ఛగా జీవించగలుగుతాను. 

ఎందుకంటే  ఈ భయాలన్నీ మృత్యువుకు చెందినవి. నాలో జీవం  ఉంది, మరణం కాదు, ఆ జీవం ప్రభువే "

 ప్రార్థన: 

"జీవించేవారి దేవా, అబ్రాహాము దేవా, ఇసాకు దేవా, యాకోబు దేవా — నీవే నా దేవుడవు. ఈ రోజు నేను నీ ముందు నిలుచుంటున్నాను. నా చేతులు ఖాళీగా ఉన్నాయి. నా హృదయం బరువుగా ఉంది. నా మనస్సులో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ప్రభూ, నేను సద్దూకయ్యులలాంటివాడిని అవ్వకుండా కాపాడు. వారికి దగ్గర నీ వాక్కు  ఉంది, కానీ నీ శక్తి లేదు. వారు నీ గురించి మాట్లాడారు, కానీ నీతో మాట్లాడలేదు. వారి మతం ఆచారాలకు పరిమితమైంది, మీతో సంబంధానికి కాదు. నేను చదివే ప్రతి వాక్యం నా హృదయాన్ని తాకేలా చేయి. నేను చేసే ప్రతి ప్రార్థన నిజంగా నీతో సంభాషణగా మారాలి. ప్రభూ, నా భయాలను నీ చేతుల్లో ఉంచుతున్నాను. నా రేపటి గురించి భయం, నీకు అప్పగిస్తున్నాను. నా ఆరోగ్యం గురించి భయం — నేను నీకు అర్పిస్తున్నాను. నా సంబంధాల గురించి భయం — నేను నీ ముందు ఉంచుతున్నాను. నేను విఫలమవుతాననే భయం నీకు ఇస్తున్నాను.  నీవు నాకు బలముగా ఉండు. ప్రభూ, నీవు నన్ను ప్రేమిస్తున్నావు. నీవు అబ్రాహాము పేరును ప్రేమతో పలికినట్లు, నా పేరును కూడా ప్రేమతో పలుకు. నేను నీకు చెందినవాడిని. మరణం కూడా నన్ను నీ నుండి వేరుచేయలేదు. నీ ప్రేమలో నేను సురక్షితంగాఉండేలా చెయ్యి . ఆమెన్."


Author

Fr. Amruth Raju Vellaturi, OCD

కార్మెల్ సన్యాసి, ఆధ్యాత్మికత అధ్యాపకుడు. తెలుగు క్రైస్తవులకు బైబిల్ సందేశాలను మరియు కార్మెల్ సభ ఆధ్యాత్మికత అందించడమే లక్ష్యం.

Comments

Post a Comment