ఈ బ్లాగ్ క్రైస్తవ ఆధ్యాత్మికత, కార్మెల్ సభ ఆధ్యాత్మికత గురించి మరియు దైవ వాక్య సందేశములను గురించి తెలియచేస్తుంది. ఆదివార వాక్య ఉపదేశమును తెలియచేస్తుంది . బైబుల్ సందేశములు మరియు యేసు క్రీస్తు భోధన గురించి తెలియచేస్తుంది.
10, ఫిబ్రవరి 2026, మంగళవారం
అంత దినములు ఎలా ఉండును? - లూకా 17:26-37 ఆత్మీయ ధ్యానం
9, ఫిబ్రవరి 2026, సోమవారం
మరియమాత - దేవుని తల్లి మరియు శ్రీసభ తల్లి | యోహాను 19:25-34 ధ్యానం
మరియమాత -దేవుని తల్లి
యోహాను 19: 25-34
యేసు సిలువ చెంత ఆయన తల్లియు, ఆమె సోదరి, క్లొఫా భార్యయగు మరియమ్మయు, మగ్ధలా మరియమ్మయు నిలువబడి ఉండిరి. తన తల్లియు, తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట యేసు చూచి, యేసు తన తల్లితో, "స్త్రీ! ఇదిగో నీ కుమారుడు!" అనెను. ఆ తరువాత శిష్యునితో "ఇదిగో నీ తల్లి" అనెను. శిష్యుడు ఆ గడియనుండి ఆమెను స్వీకరించి తన స్వంత ఇంటికి తీసికొనిపోయెను. పిదప, యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి, "నాకు దాహమగుచున్నది." అనెను. అక్కడ పులిసిన ద్రాక్షారసముతో నిండిన పాత్ర ఉండెను. వారు నీటి పాచిని ఆ రసములో ముంచి దానిని 'హిస్సోపు' కొలకు తగిలించి ఆయనకు అందించిరి. యేసు ఆ రసమును అందుకొని "సమాప్తమైనది" అని తలవంచి, ప్రాణము విడిచెను. అది పాస్కపండుగకు సిద్దపడు దినము. అందుచే యూదులు పిలాతును, "రేపటి విశ్రాంతి దినము గొప్పదినము. ఆనాడు దేహములు సిలువ మీద ఉండరాదు. కాళ్ళు విరుగగొట్టి వానిని దింపి వేయుటకు అనుమతినిండు" అని అడిగిరి. కావున సైనికులు వెళ్లి, యేసుతో పాటు సిలువవేయబడిన మొదటివాని కాళ్ళను, మరియొకని కాళ్ళను విరుగగొట్టిరి. కాని వారు యేసువద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుటను చూచి, ఆయన కాళ్ళు విరుగగొట్టలేదు. అయితే, సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బళ్లెముతో పొడిచెను. వెంటనే రక్తము, నీరు స్రవించెను.
మరియమాత శ్రీ సభ తల్లి
యేసు ప్రభువు మరణించే ముందు సిలువ మీద ఉన్నప్పుడు తాను ప్రేమించిన శిష్యుడు యోహానును పిలిచి ఇదిగో నీ తల్లి అని, మరియు మరియమాతతో యోహాను చూపిస్తూ ఇదిగో నీ కుమారుడు అని చెబుతున్నాడు. మరియమాత మనకు తల్లిగా తిరుసభను అన్ని విధాలుగా మనలను ఆదరిస్తుంది. ఎప్పుడు తిరుసభకు తోడుగా ఉంటూ, తిరుసభకు అవసరమైన వాటికోసం ప్రార్థిస్తుంది.
ఇదిగో నీ కుమారుడు: పునీత యోహాను యేసు ప్రభువు ప్రేమించిన శిష్యుడు, కడరా భోజన సమయంలో యేసు ప్రభువుని హృదయమునుకు దగ్గరగా ఉన్నవాడు, ప్రభువుని ముఖ్యమైన ముగ్గురు శిష్యులలో ఒకడు. యేసు ప్రభువుని శ్రమల సమయంలో రహస్యంగా ప్రభువును అనుసరించినవాడు. ప్రభువు సిలువ మీద ఉన్నప్పుడు సిలువ క్రింద ఉన్నవాడు. అటువంటి శిష్యుని ప్రభువు తన తల్లికి అప్పగిస్తూ ఇదిగో నీ కుమారుడు అని చెబుతున్నాడు. మరియమాతకు కుమారునిగా ఇచ్చినది కేవలం యోహానును కాదు, తాను ప్రేమించితిన శిష్యుడను, ఇక్కడ ప్రభువుచే ప్రేమించబడిన ఆ శిష్యుడు తిరుసభకు గుర్తు. ప్రభువు మరియమాతకు ఇచ్చినది యోహాను రూపంలో తిరుసభను. యోహాను ప్రభువును విశ్వసించే ప్రతి విశ్వాసికి ప్రతిరూపంగా ఉన్నాడు.
నిన్ను వీడని తల్లి
తల్లిగా మరియమాత ఎప్పుడు తన కుమారున్ని విడువలేదు. యేసు ప్రభువును ఈ లోకములోనికి తీసుకొనిరావడానికి మరియమాత తాను పొందబోయే అవమానమునుకాని కష్టమును కాని ఆమె పట్టించుకొనలేదు. కేవలం ప్రభువును అంటిపెట్టుకొని ఉండుటకు ఆమె ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చింది. యేసు ప్రభువు పసిబాలునిగా ఉన్నప్పుడు హేరోదు ఆయనను చెంపుటకు ప్రయత్నిస్తున్నప్పుడు ఆమె యోసేపుతో కలిసి ప్రభువును కాపాడుటకు రాత్రి పగలు తేడాలేకుండా ప్రభువును తీసుకొని సురక్షితమైన ప్రాంతమునకు పోయేది. యేసు ప్రభువును అన్ని సమయాలలో ప్రభువును గురించే ఆమె ఆలోచించేది. ప్రభువు తన ప్రేషిత కార్యం ప్రారంభించినప్పుడు ఆయన గురించి తెలుసుకొనుటకు ప్రభువు దగ్గరకు వెళుతుంది. ప్రభువు శ్రమలు అనుభవిస్తున్నప్పుడు శిష్యులు అందరు ఆయనను వదలి వెళ్ళిపోయినా తల్లి మాత్రము ఆయనను వెంబడిస్తూనే ఉంది. సిలువ క్రింద ప్రభువు చనిపోయే సమయంలో కూడా ఆమె ఉంది. ప్రభువును ప్రతి క్షణము అంటిపెట్టుకొని ఆమె జీవించేది. అటువంటి ఆమెను యేసు ప్రభువు తాను ప్రేమించిన శిష్యునికి తల్లిగా ఇస్తున్నాడు. ఆయనను ఎలా ఎప్పుడు వెన్నంటివున్నదో అదే విధముగా ఆ శిష్యునికి మరియు ఆయన శిష్యులందరికి ఆమె తోడుగా, వారి బాధలలో ఓదార్పుగా, వారికి ఆదర్శముగా ఉండుటకు ప్రభువు ఆమెను తన శిష్యునికి తల్లిగా ఇస్తున్నాడు.
తల్లిగా శ్రీ సభతో మరియమాత
మరియమాత పెంతుకోస్తు రోజున శిష్యులందరు, యూదుల భయంతో ఉన్నప్పుడు, మరియమాత వారితో ఉండి ప్రార్ధన చేస్తుంది. పవిత్రాత్మతో తిరుసభ పుట్టిన రోజన మరియమాత అక్కడనే ఉన్నది. వారితో పాటు ఉండి వారికి ధైర్యమును ఇస్తుంది. అందరు మనలను అపార్ధం చేసుకున్నాకాని ఎలా దైవ చిత్తమును నెరవేర్చుటకు ధైర్యంగా ఉండాలో నేర్పుతుంది. శిష్యులు భయంతో ఉన్నప్పుడు ఆమె వారికి ధైర్యమును ఇస్తుంది. ప్రభువును పవిత్రంగా ఈ లోకమునకు తీసుకురావడానికి ఆమె కన్యగా గర్భం ధరించడానికి ఆమె ధైర్యంగా ఒప్పుకున్నది. అలానే శిష్యులు ప్రభువు అజ్ఞానుసారం జీవించేలా ఆమె ధైర్యం ఇస్తుంది. ఆమె కేవలం వారికి తోడుగా మాత్రమేకాక తన జీవితం ద్వారా ఆదర్శమును చూపిస్తుంది.
Fr. Amruth
బాహ్య ఆచరణ కాదు హృదయ శుద్ధి ముఖ్యం - మత్తయి 5:20-26 ధ్యానం
దేవుని ఆజ్ఞలు- బాహ్య ఆచరణ, ఆంతరంగిక శుద్ధి
మత్తయి 5: 20-26
ధర్మ శాస్త్ర బోధకులకంటే, పరిసయ్యులకంటే మీరు నీతిమంతమైన జీవితమును జీవించిననేతప్ప పరలోకరాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. "నరహత్యచేయరాదు, నరహత్యకావించు వాడు తీర్పునకు గురియగునని పూర్వులకు శాశింపబడిన మాట మీరు వినియున్నారుగదా!నేను ఇప్పుడు మీతో చెప్పునదేమనగా: తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును. అదే విధముగా తన సోదరుని 'వ్యర్థుడా!' అని అనువాడు నరకాగ్నిలో మ్రగ్గును. కనుక, బలిపీఠసన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్దయున్నట్లు నీకు స్ఫురించినచో, ఆ కానుకను పీఠము చెంతనే వదలిపెట్టి, పోయి, మొదట నీ సోదరునితో సఖ్యపడి, తిరిగివచ్చి నీ కానుకను చెల్లింపుము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగనే అతనితో సత్వరము సమాధానపడుము. లేనిచో నీ ప్రతివాది నిన్ను న్యాయవాదికి అప్పగించును. న్యాయాధిపతి నిన్ను పరిచారకునికి అప్పగించును. అంతట నీవు చెరసాలలో వేయబడుదువు. నీవు చెల్లింపవలసిన ఋణములో కడపటి కాసు చెల్లించువరకు నీవు చెరసాలలోనే ఉందువు అని నొక్కి వక్కాణించుచున్నాను.
ఈ సువిశేషభాగంలో ఆంతరంగిక శుద్దిగురించి, మనం గొప్పవారిగా పరిగణించేవారి కంటే మనం మనం మంచి జీవితం జీవించాలని, సోదర ప్రేమ మరియు క్షమాగుణం కలిగి ఉండాలని, మొదట మనమే మనకు వ్యతిరేకంగా ఉన్నవారితో సఖ్యత ఏర్పరుచుకోవాలని ప్రభువు కోరుతున్నాడు.
మీ నీతి బాహ్య ఆచరణ లేక హృదయ శుద్ధి ఆవిష్కృతమా?
ధర్మ శాస్త్ర బోధకులకంటే, పరిసయ్యులకంటే మీరు నీతిమంతమైన జీవితమును జీవించిననేతప్ప పరలోకరాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. యేసు ప్రభువు ప్రధానమైన బోధ పరలోక రాజ్యము. ఈ రాజ్యములో ప్రతివక్కరికి శాంతి సమాధానము ఉంటుంది. ఈ రాజ్యములో ప్రవేశించడానికి ధర్మ శాస్త్ర బోధకులకంటే పరిసయ్యులకంటే నీతి వంతమైన జీవితం జీవించాలని ప్రభువు చెబుతున్నాడు. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు నీతివంతమైన జీవితంలో ఏమైన లోపమున్నదా? అంటే మరియొక సందర్భంలో ప్రభువు వారు చెప్పునది చెయ్యండి కాని వారు చేసేది కాదని చెప్పారు. ఈ ధర్మశాస్త్ర బోధకులు మరియు పరిసయ్యులు బాహ్యంగా మంచి పేరు పొందాలనే ఆశతో అనేక ఆధ్యాత్మిక పనులు చేస్తూ ఉన్నారు కాని వారి నీతి హృదయపూర్వకమైనది కాదు, కేవలం బయట కనపడుటకు మాత్రమే చేస్తున్నారు. అందుకే ప్రభువు వారితో మీ నీతో వారికంటే గొప్పగా ఉండాలి అని చెబుతున్నారు. దీనికి మనం చేయవలసినది హృదయ పరివర్తన కలిగివుండటం. మనం చేసే పని హృదయపూర్వకంగా చేయడం. దేవుని ఆజ్ఞలను ప్రేమతో పాటించాలి. నీతి అంటే మనం చేయవలసిన పని , లేక బాధ్యతను ఖచ్చితంగా, ఎటువంటి కపటత్వం లేకుండా చేయడం. ఇందుకు మనలోని కోపం, అసూయ, మొహలను త్యజించుకోవాలి.
నీ సోదరుని గౌరవించుట
"నరహత్యచేయరాదు, నరహత్యకావించు వాడు తీర్పునకు గురియగునని పూర్వులకు శాశింపబడిన మాట మీరు వినియున్నారుగదా!నేను ఇప్పుడు మీతో చెప్పునదేమనగా: తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును. అదే విధముగా తన సోదరుని 'వ్యర్థుడా!' అని అనువాడు నరకాగ్నిలో మ్రగ్గును. ఈమాటలు పాత నిబంధనలో ఉన్న నరహత్య చేయరాదు అనే ఆజ్ఞకు నూతన వివరణ ప్రభువు ఇచ్చాడు. ఒక సోదరుని వ్యర్థుడా అని చెప్పిన కూడా అది నేరంగా పరిగణించబడుతుందని ప్రభువు చెబుతున్నాడు. దీనినుండి మనం ఏ వ్యక్తిని కించపరచడం లేక అవమానించడం అనేవి కూడా దేవుడు మన నుండి ఆశించడం లేదు. నరహత్య చేయువాడు తీర్పునకు గురియగును అని పాత నిబంధన చెబుతుంటే ప్రభువు సోదరుణ్ణి వ్యర్థుడా అని సంబోధించినవాడు నరకాగ్నిలో మండును అని చెబుతున్నాడు. మన సోదరులను, బంధుమిత్రులను లేక ఈ లోకంలో ఏ వ్యక్తిని కించపరచడం, అవమానించడం అనేవి మనలను నరకాగ్నిలో మండేలా చేస్తాయి. మన సోదరులను గౌరవిస్తూ, మనకు సాధ్యమైనంత వరకు వారికి మంచి చేయుటకు ప్రయత్నించాలి.
సఖ్యత కలిగి ఉండాలి
బలిపీఠసన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్దయున్నట్లు నీకు స్ఫురించినచో, ఆ కానుకను పీఠము చెంతనే వదలిపెట్టి, పోయి, మొదట నీ సోదరునితో సఖ్యపడి, తిరిగివచ్చి నీ కానుకను చెల్లింపుము. ఈ మాటలు మన సోదరులతో మనకు ఉండవలసిన బాంధవ్యాలను గురించి తెలియజేస్తుంది. పవిత్ర గ్రంథంలో సహోదరుల మధ్యలో అమరికలు ఉండటం ఒకరి నాశనము మరియొకరు కోరుకోవడం ఎప్పుడు హర్షించలేదు. వారిని శిక్షించుటకు వెనుకాడలేదు. దైవ రాజ్యంలో చేరుటకు, దేవుడు మన ప్రవర్తను హర్షించుటకు మరియు మనలను శిక్షించకుండ ఉండుటకు ఏమి చేయవచ్చో యేసు ప్రభువు ఈ సువిశేషభాగంలో తెలియజేస్తున్నాడు. అది ఏమిటంటే మన సోదరులతో ఎప్పుడు సఖ్యత కలిగివుండటం. మన సోదరులకు మన మీద మనస్పర్ధ ఉందని మనకు తెలిస్తే ఆ సోదరునితో మొదటగా సఖ్యపడాలి. సఖ్యత, సమాధానం మన సోదరులతో ఎల్లపుడు మనకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. అది జరిగిన తరువాతనే మనం దేవునికి అర్పించే బలి అర్పించాలని చెబుతున్నారు. అపుడు దేవునికి బలి అర్పించే సమయంలో మన మనసులో ఏ చెడు ఆలోచనకాని, అసూయకాని మనలో ఉండదు. అది మనము పరలోక రాజ్యంలో చేరుటకు అర్హతను సాధిస్తుంది.
నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగనే అతనితో సత్వరము సమాధానపడుము. ఏ వ్యక్తి కూడా నాశనము కావడం ప్రభువుకు ఇష్టంలేదు. కనుక యేసు ప్రభువు మనము ఏమి చేయాలో చెబుతున్నాడు. మన ప్రతివాదులతొ ముందుగానే సమాధాన పడాలి అని చెబుతున్నాడు. దాని ద్వారా మనం రానున్న శిక్షనుండి తప్పించుకొనవచ్చు. ఎల్లప్పుడూ మనం అందరితో సమాధానపడి జీవించుదాం.
ప్రార్థన:
ప్రభువా! మానవులు అందరు మీ రాజ్యంలో ఉండాలని కోరుకున్నారు. అందుకు మేము ఏమిచేయాలో నేర్పుతున్నారు. మా మనసు ఎల్లప్పుడు ఎటువంటి కల్మషం, అసూయా, ఇతరుల చేదు లేకుండా ఉండాలని కోరుతున్నారు. మేము ఎటువంటి కపటత్వం లేకుండా ఉండాలని, హృదయ శుద్ధి కలిగి జీవించాలని కోరుతున్నారు. మా సోదరులలో సఖ్యత కలిగి ఉండాలని, ఎవరిని అవమానించకుండా, గౌరవించాలని నేర్పుతున్నారు. కేవలం చెప్పడమే కాక మీరు మాకు ఎలా జీవించాలో చూపించారు. ప్రభువా మీరు చూపించిన జీవితానికి కృతజ్ఞతలు, మీ మాటలను, జీవితమును ఆదర్శముగా తీసుకొని జీవించే భాగ్యమును మాకు అనుగ్రహించండి. ఆమెన్
8, ఫిబ్రవరి 2026, ఆదివారం
ఆదిమ క్రైస్తవ విశ్వాసం - యేసు నూతన ఆజ్ఞ | యోహాను 13:31-35 ధ్యానం
ఆదిమ క్రైస్తవ విశ్వాసం - నూతన ఆజ్ఞ
పాస్కకాలపు ఐదవ ఆదివారం
సువిశేషం: యూదా వెళ్ళిన పిమ్మట యేసు ఇట్లనెను: “ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమ పరుపబడి ఉన్నాడు. ఆయన యందు దేవుడు మహిమ పరుపబడెను. ఆయన యందు దేవుడు మహిమ పరుపబడిన యెడల, దేవుడు తన యందు ఆయనను మహిమ పరుచును. వెంటనే ఆయనను మహిమ పరుచును. చిన్న బిడ్డలారా !నేను కొంత కాలము మాత్రమే మీతో ఉందును . మీరు నన్ను వేదకెదరు నేను వెళ్ళు స్థలమునకు మీరు రాజాలరు అని యూదులతో చెప్పినట్లే మీతో కూడా చెప్పుచున్నాను. నేను మీకు ఒక నూతన ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరి నొకరు ప్రేమించుకొనుడు. మీరు పరస్పరము ప్రేమ కలిగియున్నచో, దానిని బట్టి మీరు నా శిష్యులని అందరు తెలిసికొందురు."
ఆదిమ క్రైస్తవ జీవిత ఔన్నత్యం
మొదటి పఠనంలో పౌలు మరియు బర్నబాలు, వారి సువార్త పరిచర్యలో అనేక మందిని తమ శిష్యులుగా చేశారు. నూతనముగా క్రైస్తవ విశ్వాసంలోనికి వచ్చిన వారు విశ్వాసంలో జీవించాలని వారిని ప్రోత్సహించి వారికి ఒక ముఖ్యమైన విషయం చెబుతున్నారు. అది ఏమిటి అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు మనము పెక్కు శ్రమలను అనుభవించాలి అని వారికి భోదిస్తున్నారు. అపో 14:22. ప్రియ మిత్రులారా ఇది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే ఈ రోజు మనం అనుకున్నది జరగనప్పుడు, మనం జీవితంలో కష్టం వచ్చినప్పుడు, నేను ఎందుకు దేవుడిని నమ్మాలి , విశ్వాసించాలి అని మనం ప్రశ్నిస్తూ ఉంటాం. అటువంటి ప్రశ్నలకు ఈ మొదటి పఠనం సమాధానం చెబుతుంది.
క్రైస్తవుల మీద రాజ్య హింసలు
ఆదిమ క్రైస్తవులు ఎన్నో కష్టాలు పడి వారి విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారు. ఎటువంటి కష్టాలు వీరు అనుభవించారు అంటే, ఆదిమ క్రైస్తవ చరిత్ర ఒకసారి పరిశీలిస్తే మనకు తెలుస్తుంది. ఆదిమ క్రైస్తవులను రాజులు , రాజ్యాలు, దేశ, రాజ్య వ్యతిరేకులుగా పరిగణించేవారు. కొంత మంది రాజులు చాలా క్రూరంగా క్రైస్తవులను హింసించేవారు. వలెరియన్, డైయక్లేషీన్ అనేటువంటి చక్రవర్తులు ఎక్కువగా క్రైస్తవులను హింసించారు. వీరికి విధించిన శిక్షలు ఏమిటి అంటే, క్రూర మృగాలకు వీరిని ఆహారముగా వేసేవారు, లేక అగ్నిలో కాల్చి చంపేవారు. ఇటువంటి కష్టాలను అనుభవించడానికి కూడా వారు సిద్దపడ్డారు. కానీ వారి విశ్వాసాన్ని కోల్పోలేదు. వీరి జీవితాలను చూస్తే మనకు ఎలియజరు, దానియేలు స్నేహితులు, ఏడుగురు కుమారులు ప్రాణాలను అర్పించడం లాంటివి మనకు గుర్తుకు వస్తాయి.
విశ్వాసానికి కట్టుబడిన జీవితాలు
ఇక్కడ ఆదిమ క్రైస్తవ జీవితాలలో ఒకరు అయిన సీప్రియన్ అనే పునీతుని జీవితాన్ని గమనించినట్లేయితే మనకు వారి విశ్వాసం ఎంత గట్టిదొ తెలుస్తుంది. పునీత సీప్రియన్ ఒక అన్యుడు మరియు చాలా పేరు పొందిన లాయరు. ఆయన గొప్ప లాయరుగా చాలా ప్రసిద్ధి చెందినవారు. ఆయన యేసు ప్రభువును తెలుసుకొని తన జ్ఞానంతో యేసు క్రీస్తు నిజమైన దేవుడు అని క్రైస్తవునిగా మారాడు. అది తెలుసుకున్న అక్కడి పెద్దలు మరల ఆయనను, తన పాత విశ్వాసానికి తిరిగి రావాలని, తన పాత జీవితానికి వచ్చినట్లయితే అతనికి డబ్బులు , సంపదలు, ఇస్తాము అని చెప్పారు. కానీ తాను యేసు ప్రభువును వీడాటానికి సిద్ధపడలేదు. ఎప్పుడైతే వారు ఆయనను మారమని అడుగుతున్నరో ఆయన తన విశ్వసాన్ని ఇంకా ఎక్కువగా వ్యక్తపరిచాడు. వారికి ఆయన ఒక మాట చెప్పాడు. అది ఏమిటి అంటే దేవున్ని తెలుసుకున్న ఒక మంచి ఆత్మను మార్చలేరు. అలానే ఆయన్ను మార్చలేక ఆయన్ను శిక్షించాలని నిర్ణయించి అందరు చూస్తుండగా తన తలను నరికివేయడం జరిగింది.
ఇటువంటి శిక్ష ఉంటుంది అని తెలిసికూడా వారు తమ విశ్వాసాన్ని ప్రకటించారు. ఆదిమ క్రైస్తవ జీవితాలు మనకు మార్గ చూపరిగా ఉంటాయి. ఇంతటి గడ్డుకాలంలో వారు జీవించిన ఇతరులకు కీడు చేయాలి అని వారు అనుకోలేదు. కానీ ఈరోజు మనం మనకు వ్యతిరేకముగా ఏమైనా జరిగితే ఇంకా నేను ఎందుకు దేవాలయం రావాలి ? నేను ఎందుకు దేవున్ని నమ్మాలి అని అనుకుంటాం. వీరు ఎందుకు నమ్మారు దేవున్ని అంటే కేవలం ఈ లోకం కోసం మాత్రమే కాదు అని వారి విశ్వాసం తెలియచేస్తుంది. ఈనాటి సువిశేషం మనం ఇంత గొప్ప జీవితం, జీవించే మార్గం చూపుతుంది.
నూతన ఆజ్ఞ
యేసు ప్రభువు తన శిష్యులను ఒకరి నొకరు ప్రేమించుకొనుడు అని చెప్పారు.యేసు ప్రభువు యొక్క బోధన మోషే ధర్మ శాస్త్రం మీద ఆధారపడి వుంది. ఎందుకంటె ఇది లెవీయా కాండం లో , ద్వితీయోపదేశ కాండంలో ఈమాటలు చెప్పబడ్డాయి. కానీ యేసు ప్రభువు చెప్పే ప్రేమ మొత్తం కూడా మోషే ధర్మ శాస్త్రం చెప్పేదాని కన్నా గొప్పది. ఎందుకంటే యేసు ప్రభువు ప్రజలను తన కన్నా ఎక్కువగా ప్రేమించాడు. యోహను సువిశేషంలో యేసు ప్రభువు ఇతరులను మీ కన్నా ఎక్కువగా ప్రేమించండి అని చెపుతున్నారు. యోహను 13: 34. యేసు ప్రభువు ఒక నూతన ఆజ్ఞ ఇస్తున్నారు.ఇక్కడ అంత క్రొత్త ధనం ఏముంది? ఈ నూతన ఆజ్ఞలో అంటే యేసు ప్రభువు తనను తాను పరిత్యాగం చేసుకుంటున్నారు మన కోసం. ఆయన ప్రేమను తన మరణం ద్వార వ్యక్త పరుస్తున్నారు.
యేసు ప్రభువును అనుసరించే వారి అందరి జీవితాలు కూడా ఇటువంటి ప్రేమ కలిగిఉండాలి అని ఈ నూతన ఆజ్ఞ తెలియ జేస్తుంది. ఈ నూతన ఆజ్ఞ, క్రైస్తవులను తమ పొరుగువారిని, వారికంటే ఎక్కువగా ప్రేమించమని పిలుస్తుంది. ఎవరిని శత్రువులుగా కానీ , ప్రేమకు అనర్హులుగా కానీ చూడదు. ఇది నిజానికి యేసు ప్రభువు యొక్క వీడ్కోలు భోధనలో భాగము అంటే చివరిగా యేసు ప్రభువు తన శిష్యులకు ఇచ్చిన సందేశం. లూకా సువిశేషంలో 10:27 దీనినే మనకు అత్యున్నతమైన ఆజ్ఞగా చెప్పబడుతుంది. ఇక్కడ ఉదాహరణగా మంచి సమరియుని కథను చెప్పబడింది. నీకు సంబందం లేని వారికొరకు కూడా నీవు సహాయం చేయాలి అని తెలియజేస్తుంది.
అత్యున్నత ఆజ్ఞ
యేసు ప్రభువుని ప్రశ్న అడిగిన ధర్మ శాస్త్ర భోదకుడు ద్వితీ 6:5, లెవీ19:18 గురించి మాటలాడుతున్నాడు. మత్తయి సువిశేషంలో పరిసయ్యుడు యేసు ప్రభువును పరీక్షింప కోరి అత్యున్నతమైన ఆజ్ఞ ఏది అని అడిగారు , మత్తయి 22:35 , దానికి యేసు ప్రభువు ద్వితీ 6:5 చెబుతున్నాడు. కాని యోహను సువిశేషంలో యేసు ప్రభువే తన శిష్యులకు బోధిస్తారు,ఈ ఆజ్ఞ గురించి మిగిలిన సువిశేషాలలో, ధర్మ శాస్త్ర భోదకులు యేసు ప్రభువుని ప్రశ్నిస్తారు . దానికి జవాబుగా యేసు ప్రభువు సమాధానం చెబుతారు. ఇక్కడ యేసు ప్రభువు తన శిష్యులను ఒక నూతన సమాజంగా తయారు చేస్తున్నారు. యూదుల వలె కాకుండా వీరి జీవిత విధానం యేసు ప్రభువు వలె ఉండేలా చేయలని ప్రయత్నిస్తున్నారు. అంటే క్రైస్తవులు ఒక ప్రత్యేకమైన సమూహం.
యేసు ప్రభువు స్థాపించే ఈ సమూహంలోని శిష్యులు, యేసు ప్రభువు వారిని ఏవిధంగా ప్రేమించారో, వారుకూడా ఒకరి నొకరు అధేవిధంగా ప్రేమించుకోవాలసి ఉంటుంది. నేను మిమ్ములను ప్రేమించినట్లు మీరును ఒకరి నొకరు ప్రేమించు కోవాలి అంటే యేసు ప్రభువుని ప్రేమ, మన ప్రేమకు కొలమానం కావాలి. పాత నిబందనలో ప్రేమకు కొలమానం ధర్మ శాస్త్రం. కానీ నూతన ఆజ్ఞలో ప్రేమకు కొలమానం యేసు ప్రభువుని ప్రేమ. నూతన ఆజ్ఞ , పరస్పర ప్రేమ కలిగి ఉండాలి అని కోరుతుంది. ప్రేమించడం ప్రేమించబడటం అనేది ఈ నూతన సమూహాన్ని యేసు ప్రభుని నిజమైన అనుచరులనుగా చేస్తుంది. అందుకే యేసు ప్రభువు , తన స్నేహితుని కొరకు తన ప్రాణమును ఇచ్చువాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవ్వడు లేడు అని యోహను 15:13-15 లో చెబుతున్నారు. యేసు ప్రభుని అనుచరులు ఆయన ప్రేమను కొనసాగించేవారిగా ఉండాలి. ప్రేమ ఆజ్ఞను అవలంబించడం ద్వారా శిష్యులు దేవుని ప్రేమకు ప్రతినిధులుగా ఉంటారు. ఈ ఆజ్ఞను అనుసరించడమే క్రీస్తు నాధుని అనుసరణగా వారి జీవితాలు మారాలి.
యేసు ప్రభువు ఎంతగా మనలను ప్రేమించారు
యేసు ప్రభుని ప్రేమ స్వభావం ఏమిటి? ఏలా ఆయన ప్రజలను ప్రేమించారు? ఇది మూడు విధాలుగా జరిగిఉండవచ్చు. మొదటిగా యేసు ప్రభువు తన శిష్యులను తన కంటే తక్కువ ప్రేమించి ఉండాలి, లేక తన వలె ప్రేమించి ఉండాలి లేక తన కంటే ఎక్కువగా ప్రేమించి ఉండాలి. ఆయన జీవితం ద్వారా మనకు తెలిసేది ఏమిటి అంటే ఆయన తన శిష్యులను ఆయన కంటే ఎక్కువగా ప్రేమించారు. యోహను 3:16 లో దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని ఇచ్చెను అని వింటున్నాం. యోహను 15:13 తన స్నేహితుని కొరకు తన ప్రాణమును ఇచ్చువానికంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవరు లేరు అని కేవలం మాటలు చెప్పలేదు, తన ప్రాణమును ధారపోస్తున్నాడు.
ఆయన అనుచరులు ఎందుకు ఈ విధంగా జీవించాలి అంటే వారు పరిపూర్ణులుగా ఉండాలి. మత్తయి 5:46 వ వచనం మిమ్ములను ప్రేమించే వారినే మీరు ప్రేమించినచో మీ ప్రత్యేకత ఏమి ఉంటుంది అని అడుగుతుంది. అందరు అది చేస్తారు కాదా! నీవు ఏ విధంగా జీవించాలో ఒక కొలమానం ఉంది , అది పరిపూర్ణత కలిగి ఉండటం. యేసు ప్రభువు వలె జీవించడం. మత్తయి 5:48లో యేసు ప్రభువు చెప్పే ఈ ప్రేమ, మనకు సాధ్యమా? దీనిని అంత సులువుగా సాధించగలమా? ఇది అంత సులువైన పని ఏమి కాదు, కానీ ఇది యేసు ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ దీనిని పాటించడం వలన అందరు మనం క్రీస్తు అనుచరులం అని గ్రహించ గలుగుతారు. శిష్యులు ఇది చేయగలిగితే వారు లోకములో వెలుగువలె ప్రకాశిస్తారు. మత్తయి 5:15. లోకం అది చూసి వెలుగు దగ్గరకు వస్తుంది. ఈ ఆజ్ఞ ఇచ్చే ముందుగానే యేసు ప్రభువు తన శిష్యులకు ఒక మాతృకను చూపిస్తున్నారు. తాను వారి పాదాలు కడుగుట ద్వారా, ముందుగానే వారిని సిద్ధం చేస్తున్నారు.
యేసు ప్రభువు శిష్యులనుఎలా తెలుసుకోవచ్చు?
నూతన ఆజ్ఞ శిష్యులకు ఒక సవాలు. నిజముగా వారు ఆయన అనుచరులేనా? లేదా? అని తెలుసుకునే సాధనం కూడా. యేసు ప్రభువుకు యూద, తనను శత్రువులకు అప్పగించనున్నాడని తెలిసికూడా ఆయనను కించ పరచలేదు. అతన్ని అగౌరపరచలేదు. ఎటువంటి వ్యత్యాసం చూపించలేదు. తనని శత్రువుగా చూడలేదు. మనం చేయవలసినది కూడా అదే. ఎవరిని శత్రువుగా భావించి, వారికి వ్యతిరేకముగా జీవించనవసరం లేదు. మన జీవితం మనం క్రీస్తు అనుచరులుగా జీవిస్తే చాలు. యోహను మొదటి లేఖలో ఈ నూతన ఆజ్ఞ క్రైస్తవ సంఘానికి ఒక శాసనం అయ్యింది. 1 యోహను 4:7-8 వచనలలో మీరు మీ సోదరి సోదరులను ప్రేమించకుండా దేవున్ని ప్రేమిస్తున్నాం అని చెప్పకూడదు అంటున్నారు.
ఎవరు యేసు ప్రభువు శిష్యులు అవుతారు?
ఎవరు మేము యేసు ప్రభువు అనుచరులం అని చెప్పుకోవడానికి అర్హులు అంటే ఇతరులను ప్రేమించే వారు, ఎవరిని ద్వేషించనివారు, శపించని వారు, ఇతరులను తృణీకరించనివారు, మోసం చేయనివారు, హింసించనివారు.
యేసు ప్రభువును అనుసరించే వారికి, ఆయనను విశ్వసించే వారికి, అందరికి యేసు ప్రభువు ఈ ఆజ్ఞను ఇస్తున్నారు. ఆయన వలె జీవించవలసిన అవసరం ఉంది, ఆయన అనుచరులం అని చెప్పుకున్నప్పుడు. మనం మన పొరుగువారిని ఎక్కువగా ప్రేమించాలి. ఎంత వరకు ప్రేమించాలి అని అంటే మన ప్రాణమును పొరుగువారి కొరకు ఇచ్చేంతగా ప్రేమించాలి. ఆ విధంగా జీవిద్దాం. నిజమైన క్రీస్తు అనుచరులగా నిలుద్దాం.
Fr. Amruth
7, ఫిబ్రవరి 2026, శనివారం
యేసు క్రీస్తును చూచుటయే దేవున్ని చూచుట - యోహాను 14:6-14 ధ్యానం
యేసు క్రీస్తును చూచుటయే దేవున్ని చూచుట
యోహాను 14:6-14
యేసు ప్రభువు దేవున్ని లోకానికి ఎరుక పరిచారు
యేసు ప్రభువే తండ్రికి మార్గం
యేసు ప్రభువు మాత్రమే సత్యం
యేసు ప్రభువే జీవం
యేసు ప్రభువుని చూడటం తండ్రిని చూడటమే
6, ఫిబ్రవరి 2026, శుక్రవారం
కలవరపడకుడు యేసు మీతో ఉన్నాడు - యోహాను 14:1-6 ఆత్మీయ ధ్యానం
కలవరపడకుడు యేసు మీతో ఉన్నాడు
యోహాను 14: 1-6
యేసు వారితో "మీ హృదయములను కలవరపడనియకుడు. దేవుని విశ్వసింపుడు. నన్నును విశ్వసింపుడు. నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు. లేకున్నచో నేను మీతో అటుల చెప్పను. నేను మీకొక నివాసస్థానమును సిద్దము చేయబోవుచున్నాను. నేను వెళ్ళినచో మీకు ఒక నివాసమును సిద్ధపరచి, మరల వత్తును. నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును. నేను వెళ్ళు స్థలమునకు మార్గమును మీరు ఎరుగుదురు." అనెను. తోమా ఆయనతో "ప్రభూ! మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు. ఇక మార్గమేట్లు ఎరుగుదుము?" అనెను. అందుకు యేసు, "నేనే మార్గమును, సత్యమును, జీవమును నా మూలముననే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు.
శిష్యుల ఎందుకు కలవరపడుతున్నారు?
యేసు ప్రభువు తన శిష్యులతో మీ హృదయములను కలవరపడనియకుడు అని చెబుతున్నారు. వీరు కలవరపడవలసిన పరిస్తితి ఎందుకు వచ్చినది? ఎందుకంటే యేసు ప్రభువు వారి నుండి వెళ్లిపోతున్నాను అని చెప్పారు. మూడు సంవత్సరాలు వారు యేసు ప్రభువుతో కలిసి జీవించారు. ఆయన చేసిన అన్ని అద్భుతకార్యములకు, ఆయన చూపిన కారుణ్యమునకు వీరు సాక్షులు. శిష్యులకు ఆయన జీవితం భరోసా అయ్యినది. అటువంటి ప్రభువు ఇప్పుడు వారి నుండి వెళ్లిపోతున్నారు. ఇంకా ఎందుకు వీరు కలవరపడుతున్నారు? యేసు ప్రభువుకి పరిసయ్యులు, ధర్మ శాస్త్ర భోదకులు కొంత మంది సద్దుకయ్యులు శత్రువులుగా మారిపోయారు. ఇప్పుడు యేసు ప్రభువు వీరి నుండి వెళ్లిపోతే యేసు ప్రభువు శిష్యులు వారికి శత్రువులుగా మారి వీరిని, శిక్షిస్తారు అని కలవరం వారికి ఉండవచ్చు. యేసు ప్రభువుకు మరియు శిష్యులకు ఉన్న సంబంధం చాలా అన్యోన్యత కలిగిఉన్నది. ఈ అన్యోన్యత తెగిపోతుంది అని వారు కలవరపడి ఉండవచ్చు.
ఎందుకు ప్రభువు శిష్యులు కలవరపడకూడదు
యేసు ప్రభువుతో పేతురు తన కోసం మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, అందరు వెళ్ళిపోయిన, తాను వదలి వెళ్ళను అని అన్నాడు, దానికి యేసు ప్రభువు, పేతరు తనను ఎరుగనని చెబుతున్నారు ఏమి జరుగబోవుతుందో అని కలవరపడిఉండవచ్చు. తమ గురువును వారే అమ్మబోవుతున్నారు అని యేసు ప్రభువు చెబుతున్నారు, అది తలచుకొని వారు కలవరపడి ఉండవచ్చు. ప్రతి ఒక్కరికీ ఒక్కో కారణం ఉండి ఉండవచ్చు కలవరపడటానికి , అది వారికి యేసు ప్రభువుకు మధ్య ఉన్న అన్యోన్యత మరియు ప్రేమ మీద ఆధారపడుతుంది. యేసు ప్రభువు వీరికి కలవరపడవద్దు అని చెబుతున్నారు. వీరు కలవరపడకుండా ఉండుటకు ఆయన కారణం చెబుతున్నారు. ఆయన వారి నుండి పోవుతున్నది వారి కోసమే అని చెబుతున్నారు. వారు ఎందుకు కలవరపడనవసరం లేదంటే, ఆయన వారి నుండి వెల్లుతున్నది వారికి ఒక నివాసస్థానం ఏర్పాటు చేయడానికి. మరలా ఆయన వారి వద్దకు వచ్చును. ఆయన వుండే చోటునే వీరు కూడా ఉండే విధంగా ఆయన చేస్తారు. కనుక వారు కలవరపడనవసరం లేదు.
యేసుప్రభువు శాశ్వత నివాసము ఏర్పాటు చేయుటకు వెళుతున్నారు.
"నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు. లేకున్నచో నేను మీతో అటుల చెప్పను. నేను మీకొక నివాసస్థానమును సిద్దము చేయబోవుచున్నాను. నేను వెళ్ళినచో మీకు ఒక నివాసమును సిద్ధపరచి, మరల వత్తును. నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును." నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు. యేసు ప్రభువు తన తండ్రి గురించి ఎప్పుడు చెబుతూనే ఉన్నారు. ఇక్కడ కూడా మనం చూసేదీ తండ్రికి మరియు కుమారునికి మధ్యగల సంబంధం, అందుకే ఆయన "నా"తండ్రి గృహమున అనేక నివాసములు కలవు అని చెబుతున్నారు. ఈ సంబంధం గురించి ఆయన అనేక సార్లు చెప్పుటకు కారణం ఏమిటి అంటే తన తండ్రిని ఆయన అంతగా ప్రేమిస్తున్నారు అని తెలియచేయడమే, ఆయనే పనులను మాత్రమే కుమారుడు చేస్తున్నాడు. తండ్రికి తెలియకుండా ఏమి చేయుటలేదు. ఆయన తన తండ్రి గృహమున మనకు ఒక నివాసాన్ని ఏర్పాటుచేయడానికి కల్వరి కొండమీద శిలువ మరణం ద్వారా మనకు సిద్దపరుస్తున్నాడు. మూడు రోజులు భూగర్భంలో ఉండి మనకు నివాసాన్ని ఏర్పాటుచేస్తున్నాడు.
యేసు ప్రభువుతో ఎల్లప్పుడు ఉండుట
"నేను ఉండు స్థలముననే మీరును ఉండునట్లు మిమ్ములను నా యొద్దకు చేర్చుకొందును." యేసు ప్రభువు ఇక్కడ చేసిన ఈ వాగ్ధానం తన శిష్యులకు చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఆయన తన శిష్యులను వదలి వేయడం లేదు. ప్రత్యేకంగా వీరి కొరకు వస్తాను అని చెబుతున్నారు. ఇది లోకాంతంలో కాదు. ఇది తన శిష్యులు ఎప్పుడు కూడా ఆయన సాన్నిధ్యం పొందేలా చేస్తుంది. అంతేకాక వీరిని తన వద్దకు చేర్చుకుంటాను అని చెబుతున్నారు. యేసు ప్రభువు తన శిష్యులను , మరియు తన శిష్యుల ద్వారా ఆయన అనుచరులు అయిన వారికి ఇచ్చిన ఒక గొప్ప వరం ఇది. నేను ఉండు స్థలమునే మీరును ఉండునట్లు నా వద్దకు చేర్చుకొందును అనే వాగ్ధానం మరల ఆయన శిష్యులు ఎవరు నీరుత్సాహంలో లేకుండే చేసే వాగ్ధానం. కాని దీనిని ఎల్లప్పుడు గుర్తుంచుకోవడంలో మనం విఫలం చెందుతున్నాము. యేసు ప్రభువు చేసిన ప్రతి వాగ్ధానం మనం గుర్తు చేసుకొని మనం జీవించినచో మన జీవితంలో ఎటువంటి అపాయంలో కూడా మనం కలవరపడకుండా ఉండగలం.
తోమా ఆయనతో "ప్రభూ! మీరు వెళ్ళు స్థలమేదో మాకు తెలియదు. ఇక మార్గమేట్లు ఎరుగుదుము?" అనెను. తోమస్సు యేసు ప్రభువు చెప్పిన మాటలు అర్ధం చేసుకోలేక పోయాడు. అందుకే ఆయనే వేరే ఎక్కడకు వెళుతున్నారో తెలియదు అని చెబుతున్నారు. తోమసు మొదటి నుండి తనకు అర్ధం కాని విషయములను అడుగుటకు సిగ్గుపడలేదు. ప్రభువు ముందు తనను అప్పుడు గొప్పవాడిగా లేక మొత్తం తెలిసిన వానిగా చూపించుకోవాలని చూడలేదు, తన నిజ స్తితి ఎప్పుడు బహిర్గతం చేస్తునే ఉన్నాడు. అందుకే ప్రభూ మీరు ఎక్కడకు వెళుతున్నారో మాకు తెలియదు, ఇక మార్గం ఎట్లు ఎరగుదుము అని అంటున్నారు. అందుకు ప్రభువు నేనే మార్గము సత్యము జీవము. నా మూలమునే తప్ప ఎవడును తండ్రి దగ్గరకు రాలేడు అని చెబుతున్నాడు.
యేసు ప్రభువు మాత్రమె దేవునికి మార్గం
దేవున్ని మనం ఎలా తెలుసుకోగలము? ఆయన దగ్గరకు మనం ఎలా వెళ్లగలము? ఆయన ఎవరు? అనే ప్రశ్నలకు యేసు ప్రభువు మాటలలో మనకు సమాధానం దొరకుతుంది. అంతేకాక ఆ సమాధానం ఆయనే అవుతున్నారు. యేసు ప్రభువే తండ్రి దగ్గరకు వెళ్ళుటకు మార్గం, మరియు ఆయన మన గమ్యంగా ఉంటారు, ఎందుకంటే ఆయనను చేరుకున్నప్పుడు తండ్రిని చేరుకున్నట్లే, ఆయన తండ్రి యందు తండ్రి ఆయన యందు ఉన్నారు. ఆయనే సత్యము, ఆయన కేవలం సత్యమును తెలియజేయుటకు మాత్రమే రాలేదు, ఆయనే సత్యం, ఆయన మాత్రమే నిత్యుడు, ఆయన మనకు జీవం ఇచ్చువాడు మాత్రమే కాదు ఆయనే జీవము. కనుకనే యేసు ప్రభువు మాత్రమే తండ్రి దేవుని దగ్గరకు మార్గం, ఆయన ద్వారా మాత్రమే మనం తండ్రిని చేరుకోగలం.
5, ఫిబ్రవరి 2026, గురువారం
యేసు ప్రభువుని వ్యక్తపరచుట శిష్యుల కర్తవ్యం | యోహాను 13:16-20 ధ్యానం
యేసు ప్రభువుని వ్యక్త పరచుట- శిష్యుల కర్తవ్యం
యోహాను 13: 16-20
దాసుడు తన యజమానునికంటే గొప్పవాడు కాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులను మీరు ఎరుగుదురు. వీని ప్రకారము నడుచుకొనినచో మీరు ధన్యులు. నేను మీ అందరి విషయమై మాటాడుట లేదు. కాని 'నాతో భుజించువారు నాకు విరుద్ధముగా లేచును. అను లేఖనము నెరవేరుటకై ఇట్లు జరుగుచున్నది. అటుల జరిగినపుడు నేనే ఆయనను అని మీరు విశ్వసించుటకై ఇది జరుగుటకు పూర్వమే మీతో చెప్పుచున్నాను. నేను పంపిన వానిని స్వీకరించువాడు నన్నును స్వీకరించుచున్నాడు. నన్ను స్వీకరించువాడు నన్ను పంపినవానిని స్వీకరించుచున్నాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను."
సువిశేషంలోని ఈ భాగము యేసు ప్రభువునకు మరియు శిష్యులకు ఉన్న బంధమును , తన శిష్యులను స్వీకరించువానికి సంబంధించి బోధిస్తున్నాయి. యేసు ప్రభువుతో ఉండి ఆయనకు వ్యతిరేకంగా యూదా చేయు పనిని తెలియజేస్తూ , తరువాత శిష్యులు దైర్యంగా ఉండుటకు , స్వార్ధం లేకుండ ఉండుటకు ముందుగానే వారిని హెచ్చరిస్తున్నారు. ఎవరు అయితే యేసు ప్రభువును స్వీకరించారో వారు తండ్రిని స్వీకరించారని, యేసు ప్రభువు శిష్యులను స్వీకరించువారు యేసు ప్రభువును స్వీకరిస్తున్నారని ప్రకటిస్తున్నారు. ఇది యేసు ప్రభువు మరియు శిష్యుల అన్యోన్యతను మరియు ప్రభువు తన శిష్యుల ద్వారా ఇతరులకు తెలియపరచబడాలని కోరుకుంటున్నాడు అని తెలియజేస్తుంది.
శిష్యుల ప్రవర్తన ఎలా ఉండాలి
యేసు ప్రభువు తన శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు ఇవి. శిష్యుడు గురువు కంటే గొప్పవాడు కాదు. యేసు ప్రభువును లోకం ఎలా చూసినదో, శిష్యులను కూడా అలానే చూస్తుంది. అప్పుడు ఈ శిష్యులు రాబోయే కష్టాలు, నష్టాలు బాధలు చూసి చెదిరిపోకుండా ఉండాలి. ప్రభువు శ్రమలకు గురైనట్లే వీరుకూడా శ్రమలకు గురవుతారు. యేసు ప్రభువు ఎలా సేవ చేశారో, వీరు కూడా అలానే చేయాలి, ఆయన గురువు, బోధకుడు అయ్యివుండి కూడా వారి కాళ్ళు కడిగారు, వారి మీద పెత్తనం చేయలేదు. వారి అవసరంలో ఆదుకున్నాడు. క్రీస్తు విశ్వాసికి, శిష్యునకు గర్వం లేక అహంకారం ఉండకూడదు. ప్రభువు పట్ల వినయం, ప్రజల పట్ల సేవభావం మాత్రమే వారికి ఉండాలి.
ప్రభువు మాటను ఆచరించుట గొప్ప ధన్యత
యేసు ప్రభువు తన శిష్యులను అన్నివిధాలుగా సిద్దపరిచాడు. ఏవిధంగా వారు ధన్యులు అవుతారో వారికి తెలియజేస్తున్నారు. కేవలం యేసు ప్రభువు వద్ద నుండి వారు చూచిన ఈ ప్రేమ గురించి, ఈ వినయం గురించి తెలుసుకోవడం వలన వారు గొప్ప వారు కారు, ఎప్పుడైతే ఆయన శిష్యులు యేసు ప్రభువు వలే ప్రేమ జీవితం జీవిస్తూ, ఇతరులకు సేవ చేస్తూ, అహం లేకుండ ఉంటారో అప్పుడు వారు గొప్పవారు అవుతారు. కేవలము యేసు ప్రభువు చేసిన లేక చెప్పిన మాటలను తెలుసుకోవడం వలన కాక వాటిని పాటించడం ద్వారా మనం ధన్యులం అవుతాం. కనుక ఆయన వలె జీవించుట, మనం అలవాటు చేసుకోవాలి. అందుకే పవిత్ర గ్రంధంలో మంచి చెడులు తెలిసినవారు కాదు జ్ఞానులు, మంచి చెడులు తెలిసి మంచి మాత్రమే అనుసరించు వారిని జ్ఞానులు అంటారు.
ఎప్పుడు శిష్యులు ప్రభువుకు వ్యతిరేకంగా జీవిస్తారు
"నాతో భుజించువారు నాకు విరుద్ధముగా లేచును" యేసు ప్రభువు ఈమాటలను తనను అప్పగించబోతున్న యూదా గురించి చెబుతున్నారు. తనను ఎవరు అప్పగించబోవుతున్నారో ప్రభువుకు ముందుగానే తెలుసు. యేసు ప్రభువు ఈ విషయమును ముందుగానే తన శిష్యులకు ఏమిజరుగబోతున్నదో తెలియజేస్తున్నాడు. తరువాత వారు ప్రభువు ముందుగానే ఈ విషయమును వారికి తెలియజేసి వారిని అన్నిటికి సిద్ధపడేలా జేస్తున్నాడు. యూదా గురించి ప్రభువు ముందుగానే తెలుసు అందుకే మీరు శుద్ధులై ఉన్నారు కాని అందరు కాదు అని చెప్పారు. యూదా యేసు ప్రభువుతోటి కలిసి జీవించాడు, కలిసి తిన్నాడు కాని, తన స్వార్ధానికి తనను నమ్మిన ప్రభువును అమ్ముకుంటున్నాడు. ప్రభువులో ఏ లోపం చూసి యూదా యేసు ప్రభువుకు వ్యతిరేఖంగా మారలేదు, కేవలం స్వార్ధం, అసూయ, స్వలాభం అనేక గుణాలను పెంపొందించుకొన్నాడు. ప్రభువు గురించి తెలిసి కూడా తన స్వార్ధముననే నిలబడ్డాడు. లేఖనము నెరవేరుటకై ఇవన్నీ జరగాలి అని ప్రభువు చెబుతున్నారు. అంటే ప్రభువు మనలను రక్షించుటకు అన్నిటికి సిద్దపడిఉన్నాడు. ఇవన్నీ జరిగినప్పుడు వారు ప్రభువు వారికి ఇవ్వన్నీ చెప్పారు అని వారు తెలుసుకున్నారు.
ప్రభువును స్వీకరించుట
యేసు ప్రభువున శిష్యులు గురువు, రాజు, ప్రవక్త, క్రీస్తుగా స్వీకరించారు. యేసు ప్రభువును ఈవిధంగా స్వీకరించడం ద్వారా యేసు ప్రభువును గౌరవిస్తున్నారు. దేవునితో ఆయనకు ఉన్న సంబంధమును అంగీకరిస్తున్నారు. కేవలం అంగీకరించడమే కాక వారుకూడా ఆ బంధములో ఉండాలనే కోరికను వెల్లడిచేస్తున్నారు. తనను స్వీకరించువారు తన తండ్రిని స్వీకరిస్తున్నారు అని చెబుతున్నారు. యేసు ప్రభువు తండ్రి తరపున, తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చాడు. యేసు ప్రభువు తన శిష్యులను అన్ని విధాలుగా సిద్ధపరచే సమయం కడరా భోజన సమయం. అందుకే ఇక్కడ వారితో చెబుతున్నాడు. మిమ్ములను స్వీకరించువాడు నన్ను స్వీకరిస్తున్నాడు అని అంటున్నాడు. యేసు ప్రభువు శిష్యులు ఆయన ప్రతినిధులుగా వున్నారు. వారి జీవితం, మాటలు, పనుల ద్వారా ప్రభువును వ్యక్తపరచాలి. శిష్యులు ప్రభువుతో సంభందం కలిగివున్నారు. దేవుని వాక్కును బోధించుట, దేవుని అనుభవించిన వారి కర్తవ్యం. అది ధన్యమైన జీవితం. వారిని గౌరవించడం అందరి విధి.
ప్రార్ధన : ప్రభువా! మీ శిష్యులను అన్ని విధాలుగా మీవలే గొప్ప జీవితం జీవిస్తూ, ఇతరుల రక్షణ కొరకు పాటుపడాలని కాక్షించారు. వారు మీరు వాక్కును బోధిస్తూ ఉన్నత జీవితం జీవించారు. మీ వలె కొన్నిసార్లు తిరస్కరించబడ్డారు. మా జీవితాలలో కూడా మిమ్ములను ఇతరులకు తెలియపరచాలని కోరుకుంటున్నాము. అందుకు మీలాంటి జీవితం జీవించాలని ఆశపడుతున్నాము. కాని కొన్ని సార్లు మాలో ఉన్న స్వార్ధం మమ్ములను మీకు దూరంగా చేస్తుంది. అటువంటి సమయాలలో మమ్ము క్షమించి, మేము మీ నిజమైన శిష్యులుగా జీవించుటకు కావలసిన అనుగ్రహము దయచేయండి. మేము మీ వాక్కును బోధించేవారిని గౌరవించి, మిమ్ములను స్వీకరించేలా మమ్ములను మార్చండి. ఎప్పుడు మీతో ఉండాలనే మమ్ము దీవించండి. ఆమెన్
Fr. Amruth
పవిత్ర గ్రంధంలో ఉపవాసం Telugu | Fasting in Bible Telugu | కార్మెల్ శోభ
లూకా 5: 33-39 "యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు, ప్రార్ధనలు చేసెదరు. అటులనే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కాని, మీ శిష్యుల...
-
లూకా 5: 33-39 "యోహాను శిష్యులు తరచుగా ఉపవాసములు, ప్రార్ధనలు చేసెదరు. అటులనే పరిసయ్యుల శిష్యులను చేయుదురు. కాని, మీ శిష్యుల...
-
దావీదు జీవితం పూర్తి వివరణ పరిచయం దావీదు బేత్లెహేము నివాసి, యిషాయి ఎనిమిదిమంది కుమారులలో చివరివాడు. యిస్రాయేలీయుల రెండవ రా...
-
సమూయేలు చరిత్ర సమూవేలు పవిత్ర గ్రంధంలో ఉన్న న్యాయాధిపతులలో చివరి న్యాయాధిపతి మరియు న్యాయాధిపతులో ఎక్కువ కాలం జీవించ...