తీర్పు, ఆత్మవిమర్శ మరియు వివేచన యొక్క అంతరార్థం| కార్మెల్ శోభ
మత్తయి 7: 1-6
"పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు. అప్పుడు మిమ్ము గూర్చి అట్లే తీర్పు చేయబడదు. ఏలనన మీరు పరులను గూర్చి తీర్పు చేసినట్లే మీకును తీర్పు చెప్పబడును. మీరు ఏ కొలతతో కొలిచెదరో ఆ కొలతతోనే మీకు కొలవ బడును. నీ కంటిలోని దూలమును గమనింపక నీ సహోదరుని కంటిలోని నలుసును వ్రేలెత్తి చూపెదవేల? నీ కంటిలోని నలుసును తీసివేయనిమ్ము అని, సోదరుని నీవెట్లు అడుగగలవు? నీ కంటిలో దూలమున్నది గదా! కపట భక్తుడా! ముందుగ నీ కంటిలోని దూలమును తీసివేసికొనుము. అప్పుడు నీ సోదరుని కంటిలోని నలుసును తీసివేయుటకు నీ చూపు స్పష్టముగా నుండును. పవిత్రమైన దానిని కుక్కల పాలు చేయవలదు. వెలగల ముత్యములను పందులకు పారవేయవలదు. అవి కాళ్లతో త్రొక్కి నీ పైబడి నిన్ను చీల్చివేయును."
తీర్పు చెప్పే అలవాటు మన నరనరాల్లో
ఒక కుటుంబ సమావేశంలో ఎవరో బంధువు గురించి మాట వచ్చింది. "ఆమె అలా చేయకూడదు", "అతనికి బాధ్యత లేదు", "వాళ్ళ పిల్లల పెంపకం సరిగ్గా లేదు" - ఇలాంటి మాటలు ఎంత సహజంగా మన నోటి నుండి వచ్చేస్తాయో గమనించారా? ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే, మనం రోజులో ఎన్నిసార్లు ఇతరులపై తీర్పు తీరుస్తామో లెక్క కట్టడం కష్టం. ఎవరో ఎలా దుస్తులు ధరించారని, ఎవరో ఏం మాట్లాడారని, మన మనస్సు నిరంతరం ఇతరులపై తీర్పులు చెప్తూనే ఉంటుంది. ఇది మానవ నైజంలో భాగమైపోయింది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇతరులపై తీర్పు తీర్చడం వెనుక సాధారణంగా ఒక మానసిక సంతృప్తి దాగి ఉంటుంది. ఇతరుల తప్పులను ఎత్తిచూపినప్పుడు, మనకు తెలియకుండానే మనం వారికంటే నైతికంగా ఉన్నతంగా ఉన్నామనే భావన కలుగుతుంది. ఇది ఒక సూక్ష్మమైన బయటకు కనపడని గర్వం. ఇది హృదయాన్ని క్రమంగా కఠినతరం చేసే గర్వం. మనం గమనించకుండానే, ఇతరుల తప్పులను వెతకడం ద్వారా మన అసంపూర్ణతలను, మన భయాలను, మన అభద్రతా భావాలను కప్పిపుచ్చుకుంటాం. యేసుప్రభువు ఈ సూక్ష్మమైన మానసిక ఎత్తుగడను సరిగ్గా గుర్తించి, దానిని మన ఎదుట నిర్మొహమాటంగా బహిర్గతం చేస్తున్నారు.
ప్రభువు ఈ సహజమైన అలవాటును నేరుగా సవాలు చేస్తున్నారు. "పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు" అనే ఈ చిన్న వాక్యం, మన హృదయపు లోతుల్లోకి వెళ్లి, మనం ఇతరులను చూసే విధానాన్నే సమూలంగా మార్చే శక్తి కలిగినది.
సందర్భం
6వ అధ్యాయంలో దేవునిపై సంపూర్ణ నమ్మకం, చింత వదిలి దేవుని రాజ్యాన్ని వెదకడం గురించి బోధించిన వెంటనే, యేసుప్రభువు తీర్పు తీర్చడం గురించి మాట్లాడటం ప్రారంభిస్తారు. ఎందుకంటే, దేవునిపై నమ్మకం ఉన్నవాడు ఇతరుల జీవితాలను తానే నియంత్రించాలని, తీర్పరిగా వ్యవహరించాలని ప్రయత్నించడు. దేవుని సార్వభౌమాధికారాన్ని గుర్తించిన హృదయం, తీర్పు తీర్చే అధికారం కూడా దేవునిదేనని అంగీకరిస్తుంది.
తీర్పు తీర్చే అధికారం ఎవరిది?
"తీర్పు చేయుట" అనే పదానికి గ్రీకులో "వేరు చేయుట", "విభజించుట", "నిర్ణయించుట" అనే అర్థాలు ఉన్నాయి. న్యాయస్థానంలో న్యాయమూర్తి ఒక వ్యక్తిని దోషి అని లేదా నిర్దోషి అని తీర్పు చెప్పినట్లుగా, మనం కూడా ఇతరుల హృదయ ఉద్దేశాలను, వారి విలువను, వారి శాశ్వత గమ్యాన్ని నిర్ణయించే అధికారం మనకు ఉన్నట్లుగా వ్యవహరిస్తాం.
మానవుడిగా మనకు ఇతరుల ప్రవర్తన మాత్రమే కనిపిస్తుంది. వారి హృదయంలో ఏముందో, వారు ఏ పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకున్నారో మనకు పూర్తిగా తెలియదు. కానీ దేవుడు మాత్రమే హృదయాంతరంగాలను, ఉద్దేశాలను, పరిస్థితులను సంపూర్ణంగా ఎరిగినవాడు. "మనుష్యుడు బాహ్యమును చూచును గాని యావే హృదయమును చూచును" అని 1 సమూయేలు 16:7 చెబుతుంది. కాబట్టి, అంతిమ తీర్పు తీర్చే అధికారం, న్యాయాధిపతి స్థానం దేవునిది మాత్రమే. మనం ఆ స్థానాన్ని ఆక్రమించుకున్నప్పుడు, తెలియకుండానే దేవుని అధికారాన్ని కాజేస్తున్నాం.
యాకోబు దీనిని మరింత స్పష్టంగా చెబుతాడు: "ధర్మశాస్త్రకర్తయు తీర్పరియు ఒక్కడే; ఆయన రక్షించుటకును, నశింపజేయుటకును శక్తిగలవాడు. నీవు ఎవడవు, పరుని గూర్చి తీర్పు తీర్చుటకు?" (యాకోబు 4:12). ఈ వచనం మనకు గుర్తుచేస్తుంది.
విమర్శనాత్మక తీర్పు - వివేచనాత్మక జ్ఞానం
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేసుకోవాలి. "తీర్పు చేయకుడు" అనే మాటకు అర్థం, మంచి-చెడుల మధ్య తేడా గుర్తించవద్దని కాదు, లేదా పాపాన్ని పాపంగా పిలవవద్దని కాదు. యేసుప్రభువే మరో సందర్భంలో "పైకి కనిపించు వాటిని బట్టి కాక ,న్యాయసమ్మతమైన తీర్పు చేయుడు" అని బోధించారు (యోహాను 7:24). అంటే, విచక్షణాజ్ఞానంతో కూడిన నైతిక వివేచన అవసరమే. తల్లిదండ్రులు పిల్లలను సరిదిద్దాలి, సంఘ నాయకులు తప్పుడు బోధనలను గుర్తించాలి, సమాజం అన్యాయాన్ని ఖండించాలి.
అయితే, యేసుప్రభువు ఇక్కడ ఖండిస్తున్నది వేరు, మనల్ని మనం ఇతరుల కంటే నైతికంగా ఉన్నతంగా చూసుకుంటూ, వారిని కించపరుస్తూ, వారి హృదయ ఉద్దేశాలను శంకిస్తూ, వారిని శాశ్వతంగా 'చెడ్డవారు' అని ముద్రవేసే వైఖరి. ఇది ప్రేమ లేని, దయ లేని, పశ్చాత్తాప అవకాశం లేకుండా చేసే తీర్పు. ఒక సోదరుని తప్పును ప్రేమతో సరిదిద్దడానికి, వారి పాపాన్ని ఖండించి వారిని శాశ్వతంగా తృణీకరించడానికి మధ్య అపారమైన వ్యత్యాసం ఉంది.
కొలత సూత్రం
"మీరు ఏ కొలతతో కొలిచెదరో ఆ కొలతతోనే మీకు కొలవ బడును" అనే వాక్యం, యూదు సమాజంలో బాగా తెలిసిన ఒక సూత్రం. ధాన్యం, నూనె వంటి వస్తువులను అమ్మేటప్పుడు, వ్యాపారి ఉపయోగించే కొలత పాత్రను బట్టి కొనుగోలుదారుడికి ఎంత దొరుకుతుందో నిర్ణయించబడేది. ఒకవేళ వ్యాపారి తక్కువ కొలత ఉపయోగిస్తే, అతను కూడా అదే తక్కువ కొలతతో కొలవబడతాడు. ఇది ఒక ఆధ్యాత్మిక న్యాయసూత్రంగా యేసుప్రభువు మన ముందు ఉంచుతున్నారు.
మన హృదయం ఇతరుల పట్ల ఎంత కఠినంగా, నిర్దాక్షిణ్యంగా ఉంటుందో, దేవుని ముందు మనం కూడా అదే కొలతతో కొలవబడతాం. ఇది భయపెట్టడానికి కాదు, కానీ మనం ఎంత దయతో, క్షమాగుణంతో ఇతరులను చూస్తామో, దేవుడు కూడా మనల్ని అంతే దయతో చూస్తాడని ఒక ఆశాజనకమైన వాగ్దానంగా కూడా చూడవచ్చు. యేసుప్రభువు తానే నేర్పిన ప్రభువు ప్రార్థనలో "మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించునట్లు మా అప్పులను క్షమింపుము" అని చెప్పడం యాదృచ్ఛికం కాదు,
ఇతరులపై మన తీర్పు, దేవుని నుండి మనం ఆశించే క్షమాపణకు అద్దం పడుతుంది.
ఈ సూత్రం మనం రోజువారీ జీవితంలో అనుభవించే ఒక వాస్తవం కూడా. ఇతరులపై నిరంతరం తప్పులు వెతికే వ్యక్తి, తనను తాను కూడా అదే కఠినమైన దృష్టితో చూసుకుంటాడు, తనలో కూడా ఎల్లప్పుడూ లోపాలను వెతుకుతూ, ఆత్మన్యూనతా భావంతో బాధపడతాడు. కానీ ఇతరులను దయతో, సహనంతో చూసే హృదయం, తనపై కూడా అదే దయను చూపించుకోగలడు. ఇది మానసిక ఆరోగ్యానికి కూడా దోహదపడే ఆధ్యాత్మిక సత్యం.
దూలము-నలుసు ఉపమానం
"నీ కంటిలోని దూలమును గమనింపక నీ సహోదరుని కంటిలోని నలుసును వ్రేలెత్తి చూపెదవేల?" (మత్తయి 7:3)
ఈ ఉపమానం యేసుప్రభువు బోధనా శైలికి ఒక అద్భుతమైన ఉదాహరణ. మూల గ్రీకు భాషలో "నలుసు" అనే పదానికి "కార్ఫోస్" (κάρφος - karphos) అని, "దూలము" అనే పదానికి "డోకోస్" (δοκός - dokos) అని వాడబడింది. "కార్ఫోస్" అంటే ఒక చిన్న చెక్క పొట్టు, గడ్డి పరక, లేదా ఎండిన ఆకు ముక్క - కంటిలో పడిన ఇసుక రేణువంత చిన్నది. "డోకోస్" అంటే ఇంటి కప్పును మోసే భారీ కలప దూలం.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, యేసుప్రభువు స్వయంగా ఒక వడ్రంగి కుటుంబంలో పెరిగినవారు (మత్తయి 13:55). కలప పనిముట్లు, దూలాలు, చెక్క ముక్కలు ఆయనకు సుపరిచితమైనవి. ఒక మనిషి తన కంట్లో పెద్ద కలప దూలం ఉండగా, తన సోదరుని కంట్లోని చిన్న నలుసును తీసివేయడానికి ప్రయత్నిస్తున్న హాస్యాస్పదమైన, అసాధ్యమైన దృశ్యం.
ఒక అబద్ధికుడు ఇతరులను అనుమానిస్తాడు, ఒక స్వార్థపరుడు ఇతరుల్లో స్వార్థాన్ని వెతుకుతాడు, ఒక గర్విష్టి ఇతరుల గర్వాన్ని త్వరగా గుర్తిస్తాడు. మన కంట్లోని దూలం, మన చూపును వక్రీకరిస్తుంది, తద్వారా మనం ఇతరులను సరిగ్గా చూడలేకపోతాం మరియు బదులుగా మన స్వంత లోపాలనే వారిలో ప్రతిబింబంగా చూస్తాం.
"కపట భక్తుడా!"
యేసుప్రభువు ఈ తీర్పరిని "కపట భక్తుడా" అని సంబోధించడం చాలా ముఖ్యమైనది. మూల గ్రీకు పదం "హుపోక్రిటేస్" (ὑποκριτής - hypokritēs) - ఇది గ్రీకు రంగస్థల నాటకాల నుండి వచ్చిన పదం, అర్థం "నటుడు" లేదా "ముసుగు ధరించినవాడు".
ఇతరులపై తీర్పు తీర్చే వ్యక్తి ఒక నటుడిలాంటివాడు అని యేసుప్రభువు చెబుతున్నారు. బయటకు నీతిమంతుడిగా, ధర్మపరిరక్షకుడిగా నటిస్తూ, లోపల తన స్వంత పాపాలను, బలహీనతలను దాచిపెడుతున్నాడు. మన దృష్టి ఇతరుల తప్పులపై కేంద్రీకృతమైనప్పుడు, మనం మన స్వంత ఆత్మపరిశీలనను తప్పించుకుంటున్నామేమో అని ఆలోచించాలి.
పవిత్రమైనది కుక్కలకు కాదు
"పవిత్రమైన దానిని కుక్కల పాలు చేయవలదు. వెలగల ముత్యములను పందులకు పారవేయవలదు. అవి కాళ్లతో త్రొక్కి నీ పైబడి నిన్ను చీల్చివేయును." (మత్తయి 7:6)
యూదు సంప్రదాయంలో "కుక్కలు", "పందులు" అనేవి అపవిత్రమైనవిగా, మలిన జంతువులుగా పరిగణించబడేవి. ఇక్కడ యేసుప్రభువు ఉద్దేశం పవిత్రమైన దైవసత్యాలను, వాటిని అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేని, వాటిని తృణీకరించే, దుర్వినియోగం చేసే వ్యక్తులకు బలవంతంగా అందించవద్దని.
సువార్త ప్రకటన విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఒక వ్యక్తి ఇంకా దేవుని వాక్యాన్ని వినడానికి హృదయం తెరవని సమయంలో, బలవంతంగా బోధించడం కంటే, ప్రేమతో, ఓర్పుతో, వారి హృదయం సిద్ధమయ్యే వరకు వేచి ఉండటం మంచిది.
పరిశుద్ధ గ్రంథంలో ఈ సత్యానికి సాక్ష్యాలు
యేసుప్రభువు బోధించిన ఈ సత్యం పరిశుద్ధ గ్రంథమంతటా అనేక సందర్భాలలో ప్రతిధ్వనిస్తుంది. లూకా సువార్త 18:9-14లో, యేసుప్రభువు పరిసయ్యుడు మరియు సుంకరి ప్రార్థన గురించి చెప్పిన ఉపమానం. దేవాలయంలో పరిసయ్యుడు నిలబడి, "దేవా, నేను దొంగలవంటివాడను, అన్యాయస్థులవంటివాడను, వ్యభిచారులవంటివాడను కాను; లేదా ఈ సుంకరివంటివాడను కాను గనుక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను" అని ప్రార్థిస్తాడు. అతని ప్రార్థన వాస్తవానికి ప్రార్థన కాదు, అది ఒక తీర్పు. తనను తాను ఇతరులతో పోల్చుకుని, తనను ఉన్నతంగా, వారిని హీనంగా చూపే గర్వపూరిత ప్రకటన. అదే సమయంలో, సుంకరి దూరంగా నిలబడి, తన కళ్లను పైకెత్తలేక, "దేవా, పాపినైన నన్ను కరుణింపుము" అని మాత్రమే ప్రార్థిస్తాడు. నీతిమంతుడుగా ఇంటికి వెళ్లినవాడు సుంకరియే, పరిసయ్యుడు కాదు యేసు ప్రభువు చెప్పాడు.
పాత నిబంధనలో కూడా ఇదే సత్యం కనిపిస్తుంది. దావీదు రాజు ఊరియా భార్య బత్షెబతో పాపం చేసిన తర్వాత, ప్రవక్త నాతాను దావీదు వద్దకు వచ్చి, ఒక ధనవంతుడు తన అనేక గొర్రెలను వదిలి, పేదవాని ఏకైక గొర్రెపిల్లను అపహరించుకున్న కథ చెబుతాడు. దావీదు ఆ కథ విని కోపోద్రిక్తుడై, "ఆ మనుష్యుడు మరణమునకు తగినవాడు" అని తీర్పు తీరుస్తాడు. అప్పుడు నాతాను సూటిగా "ఆ మనుష్యుడవు నీవే" అని చెబుతాడు (2 సమూయేలు 12:1-7). దావీదు ఇతరులపై వేగంగా తీర్పు తీర్చగలిగాడు, కానీ తన స్వంత పాపాన్ని గుర్తించడానికి ఒక ప్రవక్త అద్దం పట్టవలసి వచ్చింది. ఇది మానవ హృదయపు బలహీనతకు శాశ్వతమైన సాక్ష్యం.
తీర్పుకు బదులుగా- సోదర సరిదిద్దుబాటు
యేసుప్రభువు తీర్పు తీర్చడాన్ని నిషేధించినప్పటికీ, ఆయన మనల్ని పూర్తిగా ఇతరుల తప్పులను చూసీచూడనట్లు ఉండమని కోరడం లేదు. పరిశుద్ధ గ్రంథం మనకు ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపుతుంది, అది సోదర ప్రేమతో కూడిన సరిదిద్దుబాటు. గలతీయులకు 6:1లో పౌలు అపోస్తలుడు ఇలా బోధిస్తాడు: "సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను పడినయెడల ఆత్మసంబంధులైన మీరు సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి మార్గమునకు తీసికొని రావలెను." ఇక్కడ ముఖ్యమైన మాట "సాత్వికమైన మనస్సు" కోపంతో, గర్వంతో కాదు, వినయంతో, ప్రేమతో సరిదిద్దాలి.
మత్తయి సువార్త 18:15లో యేసుప్రభువు సోదరుని తప్పును సరిదిద్దే విధానాన్ని కూడా బోధించారు "నీ సహోదరుడు నీయెడల తప్పిదము చేసినయెడల వెళ్లి, నీవును అతడును మాత్రమే ఉన్నప్పుడు అతని దోషమును తెలియజెప్పుము." గమనించండి, ఇది బహిరంగంగా, ఇతరుల ముందు అవమానపరచడం కాదు, ఏకాంతంగా, ప్రేమతో, వ్యక్తిగతంగా మాట్లాడటం. తీర్పు తీర్చడం అంటే ఇతరులను బహిర్గతంగా ఖండించడం, వారి గౌరవాన్ని దెబ్బతీయడం, వారిని శాశ్వతంగా ముద్రవేయడం. సోదర సరిదిద్దుబాటు అంటే, వినయంతో, రహస్యంగా, వారి మంచి కోసం, వారిని తిరిగి సరైన మార్గంలోకి తీసుకురావాలనే ప్రేమతో మాట్లాడటం. మొదటిది మనల్ని ఎత్తులో ఉంచుతుంది, రెండవది మనల్ని వారితో సమానంగా, ఒక తోటి పాపిగా నిలబెడుతుంది.
నేటి సమాజంలో అన్వయం: సోషల్ మీడియా యుగంలో దూలము-నలుసు
ఈ సువార్త సత్యం రెండు వేల సంవత్సరాల క్రితం బోధించబడినా, నేటి డిజిటల్ యుగంలో మరింత ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకుంది. సోషల్ మీడియా వేదికలు మనకు ఇతరులపై తీర్పు తీర్చడానికి అపరిమితమైన అవకాశాలను, వేదికలను ఇస్తున్నాయి. ఒక వ్యక్తి పోస్ట్ చేసిన ఫోటో, వారి అభిప్రాయం, వారి జీవనశైలిని చూసి క్షణాల్లో మనం వారిని "తీర్పు" తీర్చేస్తాం - వ్యాఖ్యల రూపంలో, లేదా మన మనస్సులో నిశ్శబ్దంగా.
"కాన్సిల్ కల్చర్" (cancel culture) అని పిలువబడే నేటి ధోరణి - ఒక వ్యక్తి చేసిన ఒక తప్పును బట్టి వారిని శాశ్వతంగా తృణీకరించడం, వారికి పశ్చాత్తాపం, మార్పు చెందే అవకాశం ఇవ్వకుండా - ఇది సరిగ్గా యేసుప్రభువు హెచ్చరించిన "కటాక్రీనో" తీర్పుకు ఆధునిక రూపం. మనం ఇతరుల తప్పులను శాశ్వతంగా ముద్రవేస్తున్నప్పుడు, మనం కూడా అదే కొలతతో కొలవబడతామని మర్చిపోతున్నాం.
కుటుంబంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు-పిల్లల మధ్య, అత్తమామలు-కోడళ్ల మధ్య సంబంధాలలో నిరంతర తీర్పు, విమర్శ ఎన్నో కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తోంది. "నీవు ఎప్పుడూ ఇలాగే చేస్తావు", "నీకు బాధ్యత లేదు" వంటి మాటలు, మన కంట్లోని దూలాన్ని గుర్తించకుండా, ఎదుటివారి నలుసును పెద్దది చేసి చూపే ధోరణికి నిదర్శనం. ఒక్కసారి మనం మన స్వంత తప్పులను, మన బలహీనతలను నిజాయితీగా ఒప్పుకుంటే, మన కుటుంబ సభ్యుల పట్ల మన దృష్టి సహజంగానే మృదువుగా మారుతుంది.
సంఘ సహవాసంలో కూడా ఈ ప్రమాదం పొంచి ఉంది. మన పారిష్‌లో, ప్రార్థనా బృందాలలో, బైబిల్ అధ్యయన సమూహాలలో సైతం, "వారు చర్చికి సరిగ్గా రారు", "వారి విశ్వాసం బలహీనమైనది", "వారు నిజమైన క్రైస్తవులు కాదు" వంటి మాటలు తరచుగా వినిపిస్తాయి. విచిత్రంగా, మతభక్తి పేరుతో, ఆధ్యాత్మిక శ్రేష్ఠత భావనతో, మనం ఇతర విశ్వాసులను తేలికగా తీర్పు తీర్చేస్తాం - ఇది యేసుప్రభువు హెచ్చరించిన పరిసయ్యుల తీర్పుకు మరో ఆధునిక రూపం. ఒక సంఘం నిజంగా క్రీస్తు శరీరంగా పెరగాలంటే, సభ్యులు ఒకరినొకరు తీర్పు తీర్చడం మాని, ఒకరి బలహీనతలను ఒకరు ప్రేమతో భరించుకోవాలని పౌలు అపోస్తలుడు ఎఫెసీయులకు 4:2లో బోధిస్తాడు: "సంపూర్ణమైన వినయముతోను సాత్వికముతోను దీర్ఘశాంతముతోను ప్రేమగలవారై ఒకనినొకడు సహించుకొనుచు." పని స్థలాల్లో కూడా సహోద్యోగుల పనితీరును, వారి వ్యక్తిగత ఎంపికలను నిరంతరం నిశితంగా విమర్శించడం, నిజమైన బృంద స్ఫూర్తిని దెబ్బతీస్తుంది. తీర్పు బదులు సహనం, విమర్శ బదులు ప్రోత్సాహం చూపే చోటే, నిజమైన క్రైస్తవ సహవాసం వికసిస్తుంది.
నా కంట్లో దూలం ఏమిటి?
ఈ సువార్త భాగాన్ని నిజంగా జీవించాలంటే, మనం కొన్ని కఠినమైన ప్రశ్నలతో మనల్ని మనం పరీక్షించుకోవాలి. నేను ఎవరిని తరచుగా విమర్శిస్తాను, మరియు ఎందుకు? నేను ఇతరులలో గమనించే ఆ లోపం, నాలో కూడా వేరే రూపంలో ఉందా?
నేను ఎప్పుడు ఒక వ్యక్తి గురించి తీర్పు తీర్చే ముందు, వారి పరిస్థితిని, వారి గత చరిత్రను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించానా ?
ప్రతిరోజూ రాత్రి నిద్రపోయేముందు, ఆ రోజు మనం ఎవరిని, ఎందుకు తీర్పు తీర్చామో గుర్తుచేసుకుని, ఆ ఆలోచనలను దేవుని ముందు ఒప్పుకోవడం ఒక మంచి అలవాటు. వారానికి ఒకసారైనా, మనం తరచుగా విమర్శించే ఒక వ్యక్తి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయడం పవిత్రతకు మార్గం.
దూలం తీసివేయబడినప్పుడు లభించే స్వేచ్ఛ
యేసుప్రభువు ఈ బోధనను ముగిస్తూ, "అప్పుడు నీ సోదరుని కంటిలోని నలుసును తీసివేయుటకు నీ చూపు స్పష్టముగా నుండును" అని చెప్పడం గమనార్హం. ఆయన మనల్ని ఇతరులను పూర్తిగా విస్మరించమని, వారి తప్పులను పట్టించుకోవద్దని చెప్పడం లేదు. బదులుగా, సరైన క్రమాన్ని బోధిస్తున్నారు, ముందుగా నా స్వంత హృదయాన్ని శుద్ధి చేసుకుంటే, అప్పుడు మాత్రమే నేను ఇతరులకు నిజమైన సహాయం చేయగలను, వారిని ప్రేమతో, వినయంతో సరిదిద్దగలను.
ఈ సత్యాన్ని జీవించడం అంత సులభం కాదు. మన అహం, మన గర్వం, ఇతరులతో పోల్చుకోవడం ద్వారా మనల్ని మనం గొప్పగా భావించుకోవాలనే మానవ నైజం, ఈ మార్పును కష్టతరం చేస్తాయి.
చివరగా, ఈ సువార్త భాగం మనకు ఒక గొప్ప స్వేచ్ఛను కూడా అందిస్తుంది. ఇతరులపై తీర్పు తీర్చే భారాన్ని మోయడం మానేసినప్పుడు, మన హృదయం తేలికపడుతుంది. మనం ప్రతి వ్యక్తి జీవితానికి, ప్రతి పరిస్థితికి న్యాయమూర్తిగా ఉండాల్సిన అవసరం లేదని తెలుసుకున్నప్పుడు, ఒక గొప్ప ఆంతరంగిక శాంతి లభిస్తుంది. తీర్పు తీర్చే బాధ్యత దేవునిది, మనది ప్రేమించే బాధ్యత మాత్రమే. ఈ సత్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించినప్పుడు, మనం నిజమైన దైవరాజ్య పౌరులుగా జీవించడం ప్రారంభిస్తాం.
ప్రార్థన
ప్రేమగల పరలోకపు తండ్రీ, ఇతరులపై తీర్పు తీర్చడంలో నేను ఎంత త్వరితంగా ఉంటానో, నా స్వంత హృదయాన్ని పరిశీలించుకోవడంలో అంత నెమ్మదిగా ఉంటానని ఒప్పుకుంటున్నాను. ప్రభువా, నా కంటిలోని దూలాన్ని నాకు కనపరచు, నా గర్వాన్ని, నా స్వీయనీతిని , నా కఠినమైన హృదయాన్ని గుర్తించే వరాన్ని నాకు దయచేయి. నేను ఏ కొలతతో ఇతరులను కొలుస్తానో, నీవు కూడా అదే కొలతతో నన్ను కొలవకుండా, నీ అపార కరుణతో నన్ను చూడమని వేడుకుంటున్నాను. పునీత తెరెసమ్మ, పునీత యోహాను, మరియు పునీత లిసియూ తెరెసమ్మల మాదిరిగా, నా హృదయాన్ని శుద్ధి చేసుకుని, ఇతరులలో నీ పోలికను చూడగలిగే వరాన్ని నాకు అనుగ్రహించు. నా ఆలోచనలను పవిత్రపరచు, నేను తీర్పరిగా కాకుండా, ప్రేమతో సేవ చేసేవాడిగా జీవించేలా నన్ను నడిపించు. యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రీ, ఆమెన్.
Comments
మీ అభిప్రాయాలు, ప్రశ్నలు క్రింద రాయండి:
Post a Comment