మార్త, మరియ, లాజరు జీవిత చరిత్ర | Bethany Family Bible Lessons| కార్మెల్ శోభ
మార్త, మరియ, లాజరుల జీవిత చరిత్ర
1. పరిచయం
పవిత్ర గ్రంధంలో ముఖ్యంగా నూతన నిబంధనలో, యేసుక్రీస్తుకు అత్యంత సన్నిహితులైన కుటుంబాలలో ఒకటిగా మార్త, మరియ, లాజరుల కుటుంబం నిలుస్తుంది. వీరు ముగ్గురు అన్న,లేక తమ్ముడు అక్కచెల్లెళ్ళు, బేతనియ అనే గ్రామంలో నివసించేవారు. బేతనియ గ్రామం యెరూషలేముకు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో, ఒలీవు కొండ (Mount of Olives) తూర్పు వైపున ఉంది. యేసు ప్రభువు తన పరిచర్య కాలంలో యెరూషలేముకు వెళ్ళినప్పుడల్లా ఈ కుటుంబం వద్ద విశ్రాంతి తీసుకునేవాడని, వారితో సన్నిహిత సంబంధం కలిగి ఉండేవాడని సువార్తలు తెలియజేస్తున్నాయి. ఈ ముగ్గురి జీవితం, యేసు ప్రభువుతో వారికి ఉన్న సంబంధం, వారు ఎదుర్కొన్న సంఘటనలు క్రైస్తవ విశ్వాసులకు అనేక ఆధ్యాత్మిక పాఠాలను, జీవిత సూత్రాలను అందిస్తాయి.
2. మార్త, మరియ లాజరుల కుటుంబం మరియు బేతనియ గ్రామం
బేతనియ ఒక చిన్న గ్రామం అయినప్పటికీ, సువార్తల
చరిత్రలో అది ప్రత్యేక స్థానాన్ని పొందింది. ఈ గ్రామంలో మార్తా, మరియ, లాజరు ఒకే
ఇంట్లో నివసించేవారని లూకా, యోహాను సువార్తలు
సూచిస్తున్నాయి. వీరి తల్లిదండ్రుల గురించి బైబిల్‌లో ప్రత్యక్ష ప్రస్తావన లేదు, అయితే
మార్తా పెద్ద అక్కగా, ఇంటి బాధ్యతలను నిర్వహించే
వ్యక్తిగా చిత్రీకరించబడింది. కొందరు వ్యాఖ్యాతల ప్రకారం, మార్తా వారి
ఇంటి యజమానురాలిగా ఉండి ఉండవచ్చు, ఎందుకంటే లూకా సువార్తలో
"మార్తా అనే స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను" అని రాయబడింది. ఈ
వివరం మార్తా బాధ్యతాయుతమైన, ఆతిథ్యం ఇచ్చే స్వభావం కలిగిన
స్త్రీ అని సూచిస్తుంది.
మరియ, మార్తా సోదరి, తరచుగా యేసు ప్రభువు బోధనలను శ్రద్ధగా వినే వ్యక్తిగా చూస్తాం. లాజరు వీరి సోదరుడు, అతని గురించి యోహాను సువార్తలో ఎక్కువగా ప్రస్తావించబడింది, ప్రత్యేకించి అతని మరణం మరియు పునరుత్థాన సంఘటనలు చూస్తాం. ఈ ముగ్గురు వ్యక్తులు నిజమైన మానవ భావోద్వేగాలు, సంబంధాలు, కష్టాలు కలిగిన వ్యక్తులుగా చిత్రీకరించబడ్డారు. వారి కథ మానవ జీవితంలోని విశ్వాసం, సేవ, దుఃఖం, ఆనందం వంటి అంశాలను ప్రతిబింబిస్తాయి.
3. మార్తా మరియు మరియ కథ (లూకా 10:38-42)
ఈ కుటుంబం గురించి బైబిల్‌లో మొదటిసారి
ప్రస్తావించబడిన సంఘటన లూకా సువార్త పదవ అధ్యాయంలో కనిపిస్తుంది. యేసు ప్రభువు తన శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తూ బేతనియ
గ్రామానికి వచ్చినప్పుడు, మార్తా ఆయనను తన ఇంటికి
ఆహ్వానించింది. ఆమె యేసు ప్రభువుకు, ఆయన శిష్యులకు ఆతిథ్యం
ఇవ్వడానికి అనేక సేవా కార్యక్రమాలలో నిమగ్నమైంది. వంట
చేయడం, ఇల్లు సిద్ధం చేయడం, అతిథులకు
అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం వంటివి పనులలో నిమగ్నం అయ్యింది. ఆమె ఈ
పనులన్నీ శ్రద్ధగా, బాధ్యతతో
నిర్వహిస్తున్నప్పుడు, ఆమె సోదరి మరియ యేసు ప్రభువు పాదాల చెంత కూర్చుని ఆయన బోధనలను వింటున్నది.
మార్తా, తన సోదరి తనతో పాటు సేవా
కార్యక్రమాలలో సహాయం చేయకపోవడం చూసి, కొంత అసంతృప్తికి, ఆందోళనకు
గురైంది. ఆమె యేసు ప్రభువు వద్దకు వచ్చి, " ఆమెను నాకు
సహాయం చేయమని చెప్పమని " అడిగింది. ఈ మాటలలో మార్తా యొక్క నిజాయితీ, ఆమె
అనుభవిస్తున్న ఒత్తిడి, మరియు తన సోదరి పట్ల ఆమెకున్న
అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తాయి.
యేసు ప్రభువు దీనికి సమాధానంగా, "మార్తా, మార్తా, నీవు ఎన్నో
పనులనుగూర్చి విచారించుచు ఆతురపడుచున్నావు. కాని
అవసరమైనది ఒక్కటే. మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్ను కొనినది." అని చెప్పాడు. యేసు
ప్రభువు, మార్త చేస్తున్న సేవను
తప్పుపట్టలేదు, కానీ ఆమె తన మనసును అనేక
ఆందోళనలతో నింపుకోవడాన్ని ఎత్తి చూపాడు. మరోవైపు, మరియ
ఎన్నుకున్న "ఉత్తమ భాగం" అంటే యేసు ప్రభువు బోధనలను వినడం, ఆధ్యాత్మిక
అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం.
ఈ సంఘటన క్రైస్తవ జీవితంలో సేవ మరియు ఆధ్యాత్మిక సాన్నిహిత్యం మధ్య సమతుల్యతను నొక్కి చెబుతుంది. సేవ ముఖ్యమే, కానీ దేవుని వాక్యాన్ని వినడం, ఆయనతో సాన్నిహిత్యం పెంచుకోవడం అంతకంటే ముఖ్యమైనదిగా యేసు బోధించాడు.
4. లాజరు మరణం మరియు పునరుత్థానం (యోహాను 11వ అధ్యాయం)
ఈ కుటుంబంలో అత్యంత ప్రసిద్ధమైన, లోతైన
ఆధ్యాత్మిక అర్థాన్ని కలిగిన సంఘటన లాజరు మరణం మరియు అతని పునరుత్థానం. యోహాను
సువార్త పదకొండవ అధ్యాయంలో ఈ కథ వివరంగా వర్ణించబడింది.
లాజరు అనారోగ్యానికి గురయ్యాడు. మార్తా, మరియ తమ
సోదరుడి అనారోగ్యం గురించి యేసు ప్రభువుకు కబురు పంపారు. “ప్రభూ! మీరు ప్రేమించు
లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు” అని ఆ కబురు సారాంశం. ఇది వారికి యేసు ప్రభువుపై
ఉన్న నమ్మకాన్ని, ఆయన లాజరును
ప్రేమిస్తున్నాడని వారికున్న అవగాహనను తెలియజేస్తుంది. అయితే, యేసు ప్రభువు
వెంటనే బయలుదేరకుండా, తాను ఉన్న
చోటనే మరో రెండు రోజులు ఉండిపోయాడు. ఈ ఆలస్యం వెనుక దైవ ప్రణాళిక ఉందని సువార్త తెలియజేస్తుంది. "ఈ
వ్యాధి మరణముకొరకు వచ్చినది కాదు. ఇది దేవుని మహిమ కొరకును, ఇందు మూలమున దేవుని కుమారుడు మహిమపరుపబడుటకును
వచ్చిన" అని యేసు ప్రభువు చెప్పాడు.
యేసు ప్రభువు బేతనియకు చేరుకునే సమయానికి లాజరు మరణించి
నాలుగు రోజులైంది, అతని శరీరం సమాధిలో
ఉంచబడింది. ఇది యూదుల సంప్రదాయం ప్రకారం మరణం నిశ్చయమని రుజువు చేసే కాలవ్యవధి. ఆ కాలంలో ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి పూర్తిగా
వెళ్లిపోతుందని నమ్మేవారు, కాబట్టి నాలుగు రోజుల తర్వాత
తిరిగి బతికే అవకాశం లేదని భావించేవారు.
మార్తా యేసు ప్రభువును కలవడానికి ముందుకు
వెళ్ళింది, మరియ ఇంట్లోనే ఉండిపోయింది. మార్తా యేసుతో, "ప్రభూ! మీరు
ఇచట ఉండియున్నచో నా సహోదరుడు మరణించి ఉండెడివాడుకాడు. ఇప్పుడైనను దేవుని మీరు ఏమి
అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియును" అని పలికింది. ఈ మాటలలో మార్తా
యొక్క దుఃఖం, నిరాశ, మరియు అదే సమయంలో ఆమెకున్న
అచంచలమైన విశ్వాసం కనిపిస్తాయి. యేసు ఆమెతో, "నీ సోదరుడు తిరిగి
లేస్తాడు" అని చెప్పగా, మార్తా దానిని "తుది
దినమున పునరుత్థానమందు అతడు లేచునని నేనెరుగుదును" అని అర్థం చేసుకుంది. అంటే
భవిష్యత్తులో జరిగే పునరుత్థానం గురించి ఆమె భావించింది.
అప్పుడు యేసు ప్రభువు ఈ మాటలు
పలికాడు: “నేనే పునరుత్థాన మును జీవమును. నన్ను విశ్వసించువాడు మరణించినను
జీవించును. జీవము ఉండగా ,నన్ను
విశ్వసించు ప్రతివాడు ఎన్నటికిని మరణము చవి చూడడు. నీవు దీనిని విశ్వసించుచున్నావా?" మార్తా
ఆత్మవిశ్వాసంతో సమాధానమిచ్చింది, "అవును ప్రభూ! లోకమున అవతరింపనున్న దేవుని
కుమారుడవగు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను" ఈ ప్రకటన పవిత్ర గ్రంధంలో అత్యంత శక్తివంతమైన విశ్వాస ప్రకటనలలో ఒకటిగా
పరిగణించబడుతుంది, ఇది అపొస్తలుడైన పేతురు చేసిన
ప్రకటనతో సమానమయినటువంటిది. తర్వాత మరియ కూడా యేసు ప్రభువు వద్దకు వచ్చి, తన సోదరి
చెప్పిన అదే మాటలు చెప్పింది: "ప్రభూ, నీవు ఇక్కడ ఉండి ఉంటే నా
సోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు." ఆమె ఏడుస్తుండటం, ఆమెతో పాటు
వచ్చిన యూదులు కూడా ఏడుస్తుండటం చూసి యేసు ప్రభువుని మనసు కలత చెందింది, ఆత్మలో
దుఃఖించాడు. బైబిల్‌లో అతి చిన్న వచనంగా ప్రసిద్ధి చెందిన "యేసు కంటతడి
పెట్టెను" (యోహాను 11:35) ఈ
సందర్భంలోనే వస్తుంది. ఇది యేసు ప్రభువుని పూర్తి మానవత్వాన్ని, ఆయనలో ఉన్న
సానుభూతిని, ప్రేమను తెలియజేస్తుంది. దేవుడైనప్పటికీ ఆయన మానవ దుఃఖాన్ని అనుభవించాడు.
యేసు ప్రభువు, లాజరు సమాధి వద్దకు వెళ్లి, రాయి
తీసివేయమని ఆజ్ఞాపించాడు. మార్తా, సహజమైన ఆలోచనతో, "ప్రభూ! అతడు
చనిపోయి నాలుగు దినములైనది. ఇప్పటికి దుర్వాసన కొట్టుచుండును" అని
హెచ్చరించింది. అయినప్పటికీ, యేసు ప్రభువు మాట ప్రకారం రాయి తీసివేయబడింది. యేసు ప్రభువు కృతజ్ఞతా
ప్రార్థన చేసిన తర్వాత, బిగ్గరగా "లాజరా, బయటకు
రా!" అని పిలిచాడు. లాజరు, చనిపోయినవారికి వేసే
వస్త్రాలతోనే, సమాధి నుండి బయటకు వచ్చాడు. ఇది యేసు ప్రభువు చేసిన అత్యంత గొప్ప అద్భుతాలలో ఒకటిగా
పరిగణించబడుతుంది, ఇది ఆయనకు మరణంపై, జీవితంపై ఉన్న అధికారాన్ని
స్పష్టంగా సూచిస్తుంది.
ఈ అద్భుతం యేసు ప్రభువుని దైవత్వాన్ని రుజువు చేయడమే కాకుండా, రాబోయే ఆయన మరణం మరియు పునరుత్థానానికి ముందస్తు సూచనగా కూడా చూడవచ్చు. ఇది యూదా మతనాయకులకు యేసు ప్రభువుపై వ్యతిరేకతను మరింత పెంచింది, మరియు యేసు ప్రభువును సిలువ వేయాలనే వారి నిర్ణయానికి ఒక ప్రధాన కారణంగా మారింది, ఎందుకంటే ఈ అద్భుతం తర్వాత అనేకమంది యూదులు యేసు ప్రభువు నందు విశ్వాసముంచారు.
5. మరియ యేసు ప్రభువు పాదాలకు పరిమళ
తైలం పూయుట
లాజరు పునరుత్థానం తర్వాత, యేసు ప్రభువు
సిలువ వేయబడటానికి ముందు, బేతనియలో ఒక
విందు ఏర్పాటు చేయబడింది. ఈ విందులో మార్తా మామూలుగానే సేవ చేస్తూ కనిపిస్తుంది, లాజరు
అతిథులలో ఒకడిగా భోజనం చేస్తుండగా కనిపిస్తాడు. ఈ సందర్భంలో మరియ చాలా విలువైన
సుగంధ ద్రవ్యమైన "జటామాంసి" తైలాన్ని తీసుకువచ్చి యేసు ప్రభువు పాదాలకు
పూసి, తన తలవెంట్రుకలతో తుడిచింది. ఈ తైలం విలువ
దాదాపు మూడు వందల దేనారాలు ఉంటుందని, అంటే అప్పటి కూలీ ఒక సంవత్సరం
పని చేస్తే వచ్చే జీతంతో సమానమని సువార్త తెలియజేస్తుంది.
ఈ చర్య ఆమెకు యేసు ప్రభువు పై ఉన్న అపారమైన ప్రేమను, కృతజ్ఞతను, భక్తిని ప్రదర్శిస్తుంది. ఇస్కరియోతు యూదా ఈ చర్యను విమర్శిస్తూ, ఈ తైలాన్ని అమ్మి పేదలకు దానం చేయవచ్చని వాదించాడు, కానీ యోహాను సువార్త ప్రకారం అతని అసలు ఉద్దేశం పేదల పట్ల శ్రద్ధ కాదు, తాను దొంగతనం చేయాలనుకున్నాడు. యేసు ప్రభువు మరియను సమర్థిస్తూ, ఆమె ఈ పని తన సమాధి దినం కోసం చేసిందని, పేదలు ఎల్లప్పుడూ వారితో ఉంటారని, కానీ తాను ఎల్లప్పుడూ వారితో ఉండడని చెప్పాడు. ఇది మరియ యొక్క ఆధ్యాత్మిక అవగాహనను, ఆమె యేసు ప్రభువుకు రాబోయే మరణాన్ని ముందుగానే గ్రహించిందని సూచిస్తుంది.
6. వారి పాత్రల మధ్య వ్యత్యాసం మరియు సారూప్యత
మార్తా మరియు మరియ ఇద్దరూ యేసు ప్రభువును
ప్రేమించారు, కానీ వారి వ్యక్తీకరణ శైలులు భిన్నంగా ఉన్నాయి.
మార్తా ఆచరణాత్మకమైనది, సేవాభావం కలిగినది, చురుకైనది.
ఆమె తన ప్రేమను పనుల ద్వారా, సేవ ద్వారా వ్యక్తపరిచింది.
మరియ ధ్యానశీలమైనది, భావోద్వేగపరమైనది, ఆధ్యాత్మిక
విషయాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించేది. ఆమె తన ప్రేమను నిశ్శబ్దమైన భక్తి ద్వారా, శ్రద్ధగా
వినడం ద్వారా, త్యాగపూర్వక చర్యల ద్వారా వ్యక్తపరిచింది.
ఈ ఇద్దరి వ్యక్తిత్వాలు క్రైస్తవ సంఘంలో ఉన్న
విభిన్న సేవా రీతులను ప్రతిబింబిస్తాయి. కొందరు సేవ ద్వారా దేవుణ్ణి సేవిస్తే, మరికొందరు
ప్రార్థన, ధ్యానం, ఆరాధన ద్వారా సేవిస్తారు.
రెండు రీతులు విలువైనవే, కానీ యేసు ప్రభువు బోధన
ప్రకారం, అన్నిటికంటే ముఖ్యమైనది దేవుని వాక్యం పట్ల, ఆయనతో
సంబంధం కలిగి ఉండటం ముఖ్యమైనది.
లాజరు, ఇద్దరు సోదరీమణుల కంటే తక్కువగా మాట్లాడే పాత్రగా చిత్రీకరించబడినప్పటికీ, అతని కథ మరణంపై యేసు ప్రభువుకున్న అధికారానికి, పునరుత్థాన శక్తికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. అతను తిరిగి బతికిన తర్వాత అతని జీవితం ఎలా మారిందో స్పష్టంగా వివరించబడనప్పటికీ, అతను యేసు ప్రభువుకు వ్యతిరేకంగా ఉన్న మతనాయకులకు ఒక సవాలుగా మారాడు. వారు లాజరును కూడా చంపాలని పథకం వేశారని యోహాను సువార్త తెలియజేస్తుంది, ఎందుకంటే అతని పునరుత్థానం చూసి అనేకమంది యేసు ప్రభువును విశ్వాసముంచుతున్నారు.
7. వారి జీవితం నుండి మనం నేర్చుకోగల పాఠాలు
7.1 ప్రాధాన్యతలను సరిగ్గా నిర్ణయించుకోవడం
మార్తా-మరియ సంఘటన నుండి మనం నేర్చుకోవలసిన మొదటి పాఠం ఏమిటంటే, జీవితంలో
ఏది ప్రాధాన్యత కలిగినదో సరిగ్గా గుర్తించడం. రోజువారీ బాధ్యతలు, పనులు
ముఖ్యమైనవే, కానీ ఆధ్యాత్మిక జీవితాన్ని, దేవుని
వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. తరచుగా మనం మార్తాలాగా అనేక పనుల్లో మునిగిపోయి, నిజంగా
ముఖ్యమైనదాన్ని మరచిపోతాము.
7.2 ఆందోళన మరియు అంతర్గత శాంతి
యేసు ప్రభువు మార్తతో "మార్తమ్మా!
మార్తమ్మా! నీవు ఎన్నో పనులనుగూర్చి విచారించుచు ఆతురపడుచున్నావు" అని
చెప్పడం ద్వారా, అధిక చింత, ఆందోళన మన
అంతర్గత శాంతిని ఎలా దెబ్బతీస్తాయో సూచిస్తుంది. క్రైస్తవ జీవితంలో దేవునిపై
నమ్మకం ఉంచి, అనవసరమైన ఆందోళనలను వదిలివేయడం చాలా ముఖ్యమైనటువంటిది.
7.3 కష్టకాలంలో విశ్వాసం
లాజరు మరణ సమయంలో మార్తా, మరియ ఇద్దరూ
తీవ్ర దుఃఖాన్ని అనుభవించారు, అయినప్పటికీ వారు యేసు ప్రభువుపై
తమ నమ్మకాన్ని కోల్పోలేదు. మార్త, ప్రభువుతో, నీవు దేవునిని ఏమి అడిగినను నీకు అనుగ్రహిస్తాడని చెప్పడం, కష్టకాలంలో
కూడా విశ్వాసాన్ని కాపాడుకోవడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. మన జీవితంలో
దేవుడు మన ప్రార్థనలకు వెంటనే సమాధానం ఇవ్వకపోయినా, ఆయన
ప్రణాళిక మనకు అర్థం కాకపోయినా, ఆయనపై నమ్మకం ఉంచడం
నేర్చుకోవాలి.
7.4 దేవుని సమయం మరియు మన సమయం
యేసు ప్రభువు, లాజరు అనారోగ్యం గురించి తెలిసినా వెంటనే
బయలుదేరకుండా, రెండు రోజులు ఆలస్యం చేయడం, దేవుని సమయం
మన సమయం కంటే భిన్నంగా ఉంటుందని, ఆయన ప్రణాళికలు మన అవగాహనకు
మించినవని బోధిస్తుంది. కొన్నిసార్లు మనం భావించే ఆలస్యాలు, కష్టాలు
వాస్తవానికి దేవుని గొప్ప మహిమను ప్రదర్శించడానికి దారితీస్తాయి.
7.5 మరణంపై యేసు అధికారం మరియు నిత్యజీవం ఆశ
లాజరు పునరుత్థానం క్రైస్తవ విశ్వాసానికి
పునాదిగా ఉన్న అంశాన్ని బలపరుస్తుంది. యేసుక్రీస్తుకు మరణంపై అధికారం ఉంది, మరియు
ఆయనయందు విశ్వాసముంచువారికి నిత్యజీవం లభిస్తుంది. ఇది భౌతిక మరణం చివరిది కాదని, విశ్వాసులకు
పునరుత్థానం, నిత్యజీవం ఉన్నదని
హామీ ఇస్తుంది.
7.6 త్యాగపూర్వక భక్తి మరియు ప్రేమ
మరియ యేసుప్రభువు పాదాలకు విలువైన తైలం పూయడం ద్వారా, నిజమైన
భక్తి త్యాగంతో కూడుకున్నదని నేర్పుతుంది. మనం దేవునికి ఇచ్చే అర్పణ కేవలం మిగులు
నుండి కాకుండా, మన హృదయపూర్వక ప్రేమ నుండి
రావాలి. ప్రపంచం దృష్టిలో అనవసరంగా కనిపించే ఆధ్యాత్మిక చర్యలు దేవుని దృష్టిలో
అమూల్యమైనవి.
7.7 యేసు ప్రభువు మానవత్వం మరియు
సానుభూతి
యేసు ప్రభువు లాజరు సమాధి వద్ద కన్నీరు విడవడం, ఆయన పూర్తి
దైవత్వంతో పాటు పూర్తి మానవత్వాన్ని కూడా కలిగి ఉన్నాడని రుజువు చేస్తుంది. ఆయన మన
దుఃఖాలను, బాధలను అర్థం చేసుకుంటాడు, మనతో పాటు
దుఃఖిస్తాడు. ఇది విశ్వాసులకు గొప్ప ఓదార్పునిచ్చే సత్యం. దేవుడు
మన బాధలకు దూరంగా లేడు, ఆయన వాటిని మనతో పంచుకుంటాడు.
7.8 సంఘం మరియు స్నేహం యొక్క విలువ
యేసుప్రభువుకు ఈ కుటుంబంతో ఉన్న సన్నిహిత సంబంధం, ఆధ్యాత్మిక నాయకుడికి కూడా వ్యక్తిగత స్నేహాలు, విశ్రాంతి తీసుకునే స్థలాలు అవసరమని చూపిస్తుంది. క్రైస్తవ జీవితంలో సంఘ సభ్యుల మధ్య, స్నేహితుల మధ్య ఉన్న ప్రేమపూర్వక సంబంధాలు ముఖ్యమైనవి.
8. క్రైస్తవ జీవితంలో వారి ప్రాముఖ్యత
8.1 సేవ మరియు ఆరాధన మధ్య సమతుల్యతకు నమూనా
మార్తా, మరియల కథ ప్రతి క్రైస్తవ
విశ్వాసికి సేవ మరియు ఆరాధన మధ్య సమతుల్యతను ఎలా సాధించాలో నేర్పే ఒక ప్రామాణిక
ఉదాహరణగా నిలుస్తుంది. సంఘంలో సేవ చేసేవారు, పరిచర్యలో నిమగ్నమైనవారు తమ
ఆధ్యాత్మిక జీవితాన్ని, దేవుని వాక్య అధ్యయనాన్ని
నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త వహించాలని ఈ కథ గుర్తు చేస్తుంది.
8.2 పునరుత్థాన విశ్వాసానికి పునాది
లాజరు పునరుత్థానం క్రైస్తవ మతంలో అత్యంత ప్రధాన
సిద్ధాంతమైన "పునరుత్థానం" మరియు "నిత్యజీవం" లకు ఒక నిజమైన, చారిత్రక
ఉదాహరణగా పనిచేస్తుంది. ఇది యేసు ప్రభువు స్వంత
పునరుత్థానానికి ముందస్తు సంకేతంగా, మరియు భవిష్యత్తులో విశ్వాసుల
పునరుత్థానానికి వాగ్దానంగా పరిగణించబడుతుంది. మార్త చేసిన ప్రకటన "నీవు
క్రీస్తువు, దేవుని కుమారుడవు" అనేది క్రైస్తవ
విశ్వాసానికి పునాదిరాయిగా ఉన్న ప్రకటనలలో ఒకటి.
8.3 స్త్రీల పాత్రకు గౌరవం
ఆనాటి యూద సమాజంలో స్త్రీలకు తక్కువ ప్రాధాన్యత
ఇచ్చే సంస్కృతి ఉన్నప్పటికీ, యేసు ప్రభువు మార్త, మరియలను గొప్ప ఆధ్యాత్మిక సంభాషణలలో భాగస్వాములుగా
చేసుకున్నాడు. మార్తతో లోతైన ఆధ్యాత్మిక చర్చ జరపడం, మరియను
శిష్యురాలిగా బోధనలు వినడానికి అనుమతించడం, ఆనాటి సంప్రదాయాలకు భిన్నంగా
స్త్రీలను గౌరవించే యేసు ప్రభువు వైఖరిని
ప్రదర్శిస్తుంది. ఇది క్రైస్తవ సంఘంలో స్త్రీల ఆధ్యాత్మిక భాగస్వామ్యానికి ఒక
ముఖ్యమైన నమూనాగా నిలుస్తుంది.
8.4 దుఃఖంలో దేవుని సన్నిధి
లాజరు మరణ సమయంలో యేసు ప్రభువు చూపిన సానుభూతి, ఆయన
కన్నీళ్లు, దుఃఖంలో ఉన్న ప్రతి విశ్వాసికి దేవుడు తమతో పాటు
ఉంటాడని, తమ బాధలను అర్థం చేసుకుంటాడని భరోసా ఇస్తాయి.
ఇది శోకసమయాలలో క్రైస్తవులకు ఓదార్పు వనరుగా ఉపయోగపడుతుంది.
8.5 త్యాగపూర్వక ఆరాధనకు స్ఫూర్తి
మరియ చేసిన త్యాగపూర్వక అర్పణ, క్రైస్తవ
ఆరాధనలో నిజమైన భక్తి అంటే ఏమిటో నిర్వచిస్తుంది. ఇది కేవలం ఆచార పూర్వకమైన
కర్మకాండ కాదు, హృదయపూర్వకమైన, వ్యక్తిగత
త్యాగంతో కూడిన ప్రేమ వ్యక్తీకరణ.
8.6 సిలువ మరియు పునరుత్థానానికి ముందస్తు సూచన
లాజరు పునరుత్థానం, మరియ యేసు ప్రభువును సమాధి కోసం సిద్ధం చేయడం. ఈ రెండు సంఘటనలు యేసు ప్రభువుకు రాబోయే మరణం, సమాధి, పునరుత్థానానికి ప్రత్యక్ష ముందస్తు సూచనలుగా పనిచేస్తాయి. ఇవి సువార్త కథనంలో లాజరు కుటుంబాన్ని యేసు ప్రభువు జీవితంలోని అత్యంత కీలకమైన ఘట్టానికి దగ్గరగా ముడిపెడతాయి.
9. ఆధునిక క్రైస్తవ జీవితానికి అనువర్తనం
నేటి ఖాళీ
లేని జీవన శైలిలో, పని ఒత్తిడి, కుటుంబ
బాధ్యతలు, సామాజిక కార్యక్రమాలు మధ్య, మార్తలాగా
అనేక విషయాల్లో మునిగిపోయి ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్లక్ష్యం చేసే ప్రమాదం ప్రతి
విశ్వాసికి ఉంటుంది. ఈ కథ మనకు ఆత్మపరిశీలన చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. మన జీవితంలో "ఉత్తమ భాగం" అంటే ఏమిటి? మనం మన
సమయాన్ని, శక్తిని ఎక్కడ వెచ్చిస్తున్నాం?
అలాగే, జీవితంలో ఎదురయ్యే నష్టాలు, మరణాలు, దుఃఖాలు ఎదుర్కొనేటప్పుడు, లాజరు కుటుంబం చూపిన విశ్వాసం మనకు మార్గదర్శకంగా నిలుస్తుంది. దేవుడు చేసే ఆలస్యం నిరాశకాకూడదని, ఆయన ప్రణాళిక మనకు అర్థంకాని రీతిలో మేలు చేయడానికేనని నమ్మడం నేర్చుకోవాలి.
10. ముగింపు
మార్తా, మరియ, లాజరుల జీవితం మనకు సేవ మరియు ఆరాధన మధ్య సమతుల్యతను, కష్టకాలంలో
విశ్వాసాన్ని కాపాడుకోవడాన్ని, దేవుని సమయం పట్ల ఓర్పును, త్యాగపూర్వక
ప్రేమను, మరియు మరణంపై యేసుక్రీస్తు అధికారాన్ని
నమ్మడాన్ని బోధిస్తుంది. వీరి జీవితాల ద్వారా యేసుక్రీస్తు తన మానవత్వాన్ని, దైవత్వాన్ని
రెండింటినీ ప్రదర్శించాడు. ఆయన మన దుఃఖాలలో మనతో దుఃఖిస్తాడు, మరియు
మరణాన్ని కూడా జయించే శక్తి కలిగి ఉన్నాడు. ప్రతి
క్రైస్తవ విశ్వాసికి ఈ ముగ్గురి జీవితం ఒక అద్దంలా పనిచేస్తుంది. మనం మార్తలా
సేవాభావంతో ఉండాలా, మరియలా ఆధ్యాత్మిక దృష్టితో
ఉండాలా, లేదా లాజరులా దేవుని శక్తికి సాక్ష్యంగా
జీవించాలా అని ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఇది అవకాశం ఇస్తుంది. చివరికి, ఈ కథ మనకు
బోధించే అతిముఖ్యమైన పాఠం ఏమిటంటే, జీవితంలో అన్నిటికంటే విలువైనది యేసుక్రీస్తుతో
వ్యక్తిగత సంబంధం, ఆయనపై అచంచలమైన విశ్వాసం, మరియు ఆయన
ప్రేమకు ప్రతిస్పందనగా మనం అర్పించే హృదయపూర్వక భక్తి. ఇవన్నీ మన జీవితాలలో ఎల్లపుడూ
ఉండాలని ప్రభువును వేడుకుందాం. ఆమెన్
Comments
మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:
Post a Comment