ఆంతరంగిక కోట: తెరెసమ్మ బోధించిన ఏడు నివాసాల ఆధ్యాత్మిక ప్రయాణం

 


ఆంతరంగిక కోట

ఆవిలపురి తెరేసమ్మ గారి అత్యంత శాస్త్రీయమైన రచన ఆంతరంగిక కోట, క్రైస్తవ ఆధ్యాత్మిక రచనలలో అత్యంత ప్రాచుర్యం పొందిన రచన కూడా. మన హృదయంలోనికి మనం  ఎప్పుడైనా లోతుగా చూశామా? మనం రోజూ ఎన్నో పనుల్లో మునిగిపోతాం ఉద్యోగం, కుటుంబం, బాధ్యతలు మొదలగునవి.  కానీ మన లోపల ఎంతో అందమైన, విలువైన ఒక లోకం ఉందని మనం మరచిపోతాం. పదహారవ శతాబ్దంలో స్పెయిన్ దేశపు కార్మెలియ  సన్యాసిని, గొప్ప ఆధ్యాత్మిక గురువు అయిన తెరెసమ్మ ఈ లోతైన సత్యాన్ని ఒక అద్భుతమైన ఉపమానం  ద్వారా వివరించారు.  మన ఆత్మ ఒక స్ఫటికం లాంటి కోట అని, ఆ కోట  మధ్యలో  దేవుడు నివసిస్తున్నాడని చెబుతుంది.

ఇది కేవలం సన్యాసుల కోసమో, పండితుల కోసమో రాయబడిన పుస్తకం కాదు.   ప్రతి విశ్వాసి తన హృదయంలో ఉన్న  దేవుడిని ఎలా  వేదకాలి, ఆయనతో ఎలా సన్నిహిత సంబంధం పెంచుకోవాలి అనే ఆచరణాత్మక  మార్గదర్శిని ఆమె రాసిన అంతరింగ కోట. ఈ ఆంతరంగిక కోటను ఏడు నివాసాల సముదాయ (Seven Mansions) ప్రయాణముగా ఆమె వర్ణించినది.  

ఆమె చెప్పినట్టు, పరిపూర్ణతకు ప్రత్యేకమైన వ్యక్తులు మాత్రమే అర్హులు కాదు, ప్రతి ఒక్కరూ దేవుని పిలుపును అందుకోగలరు. మనం ఎక్కడ ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా, ఏ కుటుంబ పరిస్థితుల్లో ఉన్నా, ఈ అంతరంగ ప్రయాణం మొదలుపెట్టడానికి అవసరమైనది కేవలం చిత్తశుద్ధి, కొంచెం ఓర్పు, మరియు దేవుని కృపపై నమ్మకం మాత్రమే.

గ్రంథ నేపథ్యం

తెరెసా తన జీవితంలో అనేక సంవత్సరాలు ఉదాసీనమైన, నామమాత్రపు ప్రార్థనా జీవితం గడిపారు. కానీ నలభై ఏళ్ల వయసు దాటాక ఆమెకు దేవునితో లోతైన అనుభవం కలిగింది, అది ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. ఆ తర్వాత ఆమె కార్మెల్  సన్యాస సభ  సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించారు, తన నిగూడమైన ఆధ్యాత్మిక అనుభవాలను గ్రంథస్తం చేశారు.

  గ్రంథాన్ని ఆమె 1577లో, తన జీవిత చివరి సంవత్సరాల్లో రాశారు. ఆమె సన్యాసినులకు, మార్గదర్శకంగా దీన్ని రాశారు, కానీ శతాబ్దాలుగా ఇది లక్షలాది మంది సాధారణ విశ్వాసులకు కూడా వెలుగునిచ్చింది. దీని ప్రత్యేకత ఏమిటంటే  ఇది కేవలం సిద్ధాంత గ్రంథం కాదు, ఆమె స్వయంగా అనుభవించిన ఆధ్యాత్మిక ప్రయాణం ఆధారంగా రాయబడిన అనుభవపూర్వక మార్గదర్శిని. ఈ గొప్ప రచనకు గాను తెరెసాను  తిరుసభ ఆమెను  'డాక్టర్ ఆఫ్ ద చర్చ్' (తిరుసభ పండితురాలు) బిరుదుతో గౌరవించింది.  ఈ గౌరవం పొందిన తొలి మహిళ ఆమె.

ఈ గ్రంథం రాయడానికి ఆమెకు ఒక దర్శనం ప్రేరణ ఇచ్చిందని చెబుతారు.  దేవుడు ఆమెకు ఆత్మను ఒక స్ఫటికం లాంటి గోళంగా, లోపల అనేక గదులున్న కోటగా  చూపించాడు. ఈ చిత్రం ఆధారంగా ఆమె గ్రంథాన్ని నిర్మించారు, మన ఆత్మ దేవుని వైపు ప్రయాణించే మార్గాన్ని ఏడు దశలుగా (నివాసాలుగా) విభజించారు. ఈ గ్రంథాన్ని ఆమె కొన్ని నెలల్లోనే రాశారు. ఆమె ఫాదర్ జెరోమ్  గ్రాసియన్ ఆదేశం మేరకు దీన్ని రాశారు. ఇది లోతైన వేదాంత సత్యాలను చాలా ఆచరణాత్మకమైన, అనుభవపూర్వకమైన భాషలో అందిస్తుంది.

ప్రధాన రూపకం: స్ఫటిక సౌధం

తెరెసా ఆత్మను ఒక అందమైన స్ఫటికంతో లేదా వజ్రంతో చేయబడిన గోళాకార కోటలా  ఊహించమని చెబుతారు. ఈ కోటలో ఒకటి కాదు, అనేకమైన గదులు (నివాసాలు) ఉన్నాయి.  కొన్ని పైన, కొన్ని కింద, కొన్ని పక్కన. కానీ వీటన్నింటి మధ్యలో, కోట  నట్టనడుమ, అత్యంత ముఖ్యమైన గది ఉంది. అక్కడ స్వయంగా రాజైన దేవుడు నివసిస్తున్నాడు.

ఈ ఉపమానంలో అనేక నిగూడమైన  సత్యాలు దాగి ఉన్నాయి. మొదటిది  మన ఆత్మ విలువ. ఇది సాధారణ రాయితో కాదు, స్ఫటికంతో, వెలకట్టలేని రత్నంతో పోల్చబడింది. ఎందుకంటే మనం దేవుని రూపంలో సృష్టించబడ్డాము (ఆదికాండము 1:27లో చెప్పబడిన సత్యాన్ని ఆమె గుర్తు చేస్తారు). రెండవది దేవుడు మనకు దూరంగా, ఆకాశంలో ఎక్కడో లేడు; ఆయన మన హృదయపు నిగూడమైన  కేంద్రంలోనే నివసిస్తున్నాడు. మూడవది  ఆధ్యాత్మిక జీవితం అంటే బయటకు వెళ్లడం కాదు, లోపలికి ప్రయాణించడం మన స్వంత హృదయపు లోతుల్లోకి అడుగులు వేయడం.

దురదృష్టవశాత్తు, తెరెసా చెప్పినట్టు, చాలామంది ఈ  సౌధం  బయటే, దాని ద్వారం దగ్గరే, లేదా  దాని  చుట్టూ ఉన్న సర్పాలు, విషప్రాణుల మధ్యే జీవితాంతం గడిపేస్తారు.  లోపలికి వెళ్లే ప్రయత్నమే చేయరు. కొందరికి తమ లోపల ఇంత గొప్ప నివాసం ఉందని కూడా తెలియదు. ఆమె ఈ పరిస్థితిని చూసి బాధపడుతూ, ప్రతి ఆత్మ ఈ  కోట లోతుల్లోకి ప్రయాణించాలని, తన కేంద్రంలో నివసిస్తున్న దేవుడిని కలుసుకోవాలని కోరుకుంటారు.

కోటలోనికి కి ప్రవేశించే ద్వారం ప్రార్థన అని తెరెసా స్పష్టం చేస్తారు. ప్రార్థన, ధ్యానం  లేకుండా ఎవరూ ఈ లోపలి గదుల్లోకి ప్రవేశించలేరు. అయితే ఈ ప్రయాణం ఒక్క రోజులో పూర్తయ్యేది కాదు,  ఇది జీవితకాల ప్రయాణం, ఏడు దశల ద్వారా సాగే ప్రయాణం.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఏడు నివాసాలు వేర్వేరు గదుల్లా, ఒకదాని తర్వాత ఒకటి వరుసగా దాటిపోయేవిగా అనుకోకూడదు. ప్రతి నివాసంలో అనేక చిన్న గదులు ఉంటాయని తెరెసా చెబుతారు.  అంటే ప్రతి దశలో కూడా లోతు, వైవిధ్యం ఉంటుంది. అలాగే, ఆత్మ ఒకసారి ముందుకు వెళ్లి, మళ్లీ వెనక్కి జారిపోవడం కూడా సాధ్యమే.  అందుకే ఈ ప్రయాణంలో నిరంతర జాగరూకత, వినయం అవసరమని ఆమె హెచ్చరిస్తారు. కోట  ఎంత అందమైనదైనా, దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత.

తెరెసా ఈ కోటను  వివరించేటప్పుడు సూర్యుని ఉదాహరణ కూడా ఇస్తారు.  సూర్యుడు ఆకాశం మధ్యలో ఉండి తన కిరణాలను అన్ని దిక్కులకూ ప్రసరింపజేసినట్టు, దేవుడు కూడా ఆత్మ  కేంద్రం నుండి తన కృపా కిరణాలను కోటలోని ప్రతి నివాసానికీ ప్రసరింపజేస్తాడు. అంటే, మనం ఏ నివాసంలో ఉన్నా, దేవుని ప్రభావం మనపై ఏదో ఒక స్థాయిలో పనిచేస్తూనే ఉంటుంది.  మనం పూర్తిగా ఆయనకు దూరంగా ఎప్పుడూ ఉండము, కేవలం ఆయన సన్నిధిని గుర్తించే స్థాయి మాత్రమే వేర్వేరుగా ఉంటుంది.

మొదటి నివాసాలు: ఆత్మజ్ఞానపు మెట్టు

కోట మొదటి నివాసాల్లోకి ప్రవేశించే ఆత్మలు దేవుని కృపలో ఉన్నప్పటికీ, ఇంకా ప్రపంచ విషయాలతో, తమ శరీర కోరికలతో, రోజువారీ ఆందోళనలతో ఉంటారు. వీరు దేవుడిని విశ్వసిస్తారు, ప్రార్థన చేస్తారు, కానీ ఇంకా ప్రాపంచిక విషయాల మీదే ఎక్కువ దృష్టి ఉంటుంది. కోట  చుట్టూ ఉన్న సర్పాలు, తేళ్లు, విషప్రాణులు అంటే పాపపు ఆకర్షణలు, దురలవాట్లు వీరిని తరచూ కుడతూ ఉంటాయి, లోపలికి వెళ్లే మార్గం నుండి పక్కదారి పట్టిస్తూ ఉంటాయి. లోపలికి వెళ్లనివ్వవు.

ఈ దశలో అత్యంత ముఖ్యమైనది ఆత్మజ్ఞానం అని తెరెసా నొక్కి చెబుతారు. తెరెసాకు జ్ఞానం అంటే దేవుణ్ణి  ఆయన ఉన్నతిని తెలుసుకోవడం. కాని మనం దేవుని గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు మన స్వంత బలహీనతను, పరిమితిని గుర్తించాలి. అయితే ఆమె ఒక ముఖ్యమైన హెచ్చరిక చేస్తారు. అది ఏమిటంటె  ఆత్మజ్ఞానం అంటే నిరంతరం మన పాపాల గురించి, లోపాల గురించి మాత్రమే ఆలోచించడం కాదు. అలా చేస్తే మనం నిరుత్సాహంలో మునిగిపోతాం. కనుక  నిజమైన ఆత్మజ్ఞానం అంటే మన బలహీనతను గుర్తిస్తూనే, దేవుని కరుణ మరియు ఆయన,  ప్రేమ ఎంత గొప్పదో కూడా అదే స్థాయిలో ధ్యానించడం. మన లోపాలను చూసేటప్పుడు కూడా దేవుని కృపవైపు దృష్టి పెట్టాలి.

ఈ నివాసాల్లో ఉన్నవారికి ప్రార్థన ఇంకా చాలా ప్రాధమిక  స్థాయిలోనే ఉంటుంది.   అంటే  ఉచ్చరణ  ప్రార్థనలు, పరిమిత ధ్యానం. మనసు తరచూ ఇతర విషయాల వైపు మళ్లుతూ ఉంటుంది. ఈ దశలోనే ఉన్నప్పటికీ, ఆత్మ కోటలోనికి అడుగుపెట్టిందన్న విషయం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే బయట ఉండటం కంటే ఎంత కష్టమైనా లోపలికి ప్రయాణించడం ఎప్పుడూ మేలు.

ఆచరణాత్మకంగా, ఈ దశలో ఉన్నవారికి తెరెసా సూచించేది ఏమిటంటె  క్రమం తప్పకుండా ప్రార్థనకు సమయం కేటాయించడం, పరిశుద్ధ గ్రంథం చదవడం, తమ జీవితంలో పాపపు అలవాట్లను గుర్తించి వాటిని వదిలించుకునే ప్రయత్నం చేయడం. ఇది చిన్న అడుగే అయినా, ఇదే మొదటి అడుగు.

ఈ దశలో ఆత్మ  కోట లోనికి ప్రవేశించినప్పటికీ, కోట  లోపల చీకటిగా, గందరగోళంగా ఉండటం గమనించవచ్చు. అంటే, ఈ నివాసాల్లో ఉన్న ఆత్మలకు తమ లోపలి ప్రపంచం గురించి ఇంకా స్పష్టత ఉండదు, తమ ఉద్దేశాలు, తమ బలహీనతలు సరిగా అర్థం కావు. అయినప్పటికీ, వారు కోటలో ఉన్నారు కాబట్టి, దేవుని సన్నిధి ప్రభావం వారిపై కొంతైనా ఉంటుంది.  ఇది వారిని పూర్తిగా ప్రపంచంలో మునిగిపోకుండా కాపాడుతుంది.

ఈ దశలో ఉన్నవారికి తెరెసా ఇచ్చే మరో ముఖ్యమైన సలహా, ఏమిటంటె  చిన్న చిన్న క్రమశిక్షణలతో మొదలుపెట్టడం. పెద్ద పెద్ద త్యాగాలు, కఠినమైన నియమాలు వెంటనే పాటించాలని ప్రయత్నించడం అవసరం లేదు. బదులుగా, ప్రతిరోజూ కొద్ది నిమిషాలు నిశ్శబ్దంగా దేవుని గురించి ఆలోచించడం, ఒక చిన్న సత్కార్యం చేయడం, ఒక చెడు అలవాటును తగ్గించుకోవడం వంటి చిన్న అడుగులే ఈ మొదటి నివాసంలో ఆత్మను ముందుకు నడిపిస్తాయి.

రెండవ నివాసాలు: పిలుపును వినడం

రెండవ నివాసాల్లో ఆత్మ దేవుని పిలుపును మరింత స్పష్టంగా వినడం మొదలుపెడుతుంది. ఈ పిలుపు అనేక రూపాల్లో రావచ్చు.   ఒక మంచి ప్రసంగం ద్వారా, ఒక స్నేహితుడి మాటల ద్వారా, ఒక పుస్తకం చదవడం ద్వారా, లేదా జీవితంలో వచ్చిన ఒక కష్టం, అనారోగ్యం ద్వారా కూడా. దేవుడు రకరకాల మార్గాల్లో మనల్ని తనవైపుకు ఆకర్షిస్తూనే ఉంటాడు.

అయితే ఈ దశలో ఒక పెద్ద పోరాటం మొదలవుతుంది. ఇక్కడ ఆత్మ ఇంకా కోట లోపలికి పూర్తిగా చేరుకోలేదు, కానీ బయటి ప్రలోభాలు ఇంకా బలంగానే ఉంటాయి. ఒకవైపు దేవుని పిలుపు, మరోవైపు ప్రపంచపు ఆకర్షణలు, స్నేహితుల ప్రభావం, పాత అలవాట్లు  వీటన్నింటి మధ్య ఆత్మ నలిగిపోతుంది. తెరెసా ఈ దశను 'యుద్ధభూమి'తో పోలుస్తారు, ఎందుకంటే శత్రువు ఈ దశలో అత్యంత చురుకుగా పనిచేస్తాడు.  ఆత్మ దేవుని వైపు ముందుకు వెళ్లకుండా ఆపడానికి శతవిధాలా ప్రయత్నిస్తాడు.

ఈ దశలో అత్యవసరమైనది సంకల్ప దృఢత్వం అని తెరెసా చెబుతారు. కేవలం మంచి ఉద్దేశాలు సరిపోవు నిర్ణయం తీసుకుని, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఇక్కడే మంచి ఆధ్యాత్మిక గురువు అవసరం అని ఆమె నొక్కి చెబుతారు.  ఒంటరిగా ఈ యుద్ధాన్ని ఎదుర్కోవడం కష్టం. అలాగే ఇక్కడ  ఇతర విశ్వాసుల సహవాసం, మంచి పుస్తకాలు చదవడం, తరచూ ప్రార్థనలో గడపడం ఈ దశలో ఆత్మను బలపరుస్తాయి.

ఇక్కడ తెరెసా ఇచ్చే ముఖ్యమైన సలహా ఏమిటంటె  వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు సాగడం. ఒకసారి దేవుని పిలుపు విన్న తర్వాత, పాత జీవితం వైపు మళ్లీ మళ్లీ చూస్తూ ఉంటే ప్రయాణం కష్టమవుతుంది. లూకా సువార్తలో యేసు ప్రభువు నాగలిపై చెయ్యి పెట్టి వెనుకకు చూసేవాడు దేవుని రాజ్యానికి అర్హుడు కాదు అనే మాటలను తెరెసా గుర్తు చేస్తుంది.

ఈ దశలో ఉన్నవారికి తరచూ అనుమానాలు కూడా వస్తాయి,  'నేను నిజంగా ఈ మార్గంలో వెళ్లగలనా? నా వల్ల అవుతుందా?' అనే భయం. తెరెసా దీనికి ధైర్యాన్నిస్తూ, ఈ ప్రయాణం మన సొంత శక్తితో పూర్తి చేయాల్సింది కాదు, దేవుడే మనల్ని నడిపిస్తాడు. మనం చేయాల్సింది కేవలం చిన్న అడుగు వేయడం, మిగతాది దేవుని కృపకు వదిలేయడం అని చెబుతుంది.  ఈ నమ్మకమే ఈ దశలో ఆత్మకు అవసరమైన బలం.

తెరెసా ఈ దశలో ఉన్న ఆత్మలకు మరో ముఖ్యమైన హెచ్చరిక ఇస్తారు, అది ఏమిటంటె  చెడు సాంగత్యానికి దూరంగా ఉండటం. ఈ దశలో ఆత్మ ఇంకా బలహీనంగానే  ఉంటుంది కాబట్టి, తనను ప్రపంచపు విషయాల వైపు లాగే స్నేహితుల ప్రభావం చాలా ప్రమాదకరం. దీనికి బదులుగా, తనను దేవుని వైపు ప్రోత్సహించే వ్యక్తుల సాంగత్యం, మంచి ఆధ్యాత్మిక పుస్తకాలు, తరచూ పాప సంకీర్తనం (Confession) చేయడం  ఈ దశలో ఆత్మను రక్షిస్తాయి.

మూడవ నివాసాలు: క్రమశిక్షణతో కూడిన జీవితం

మూడవ నివాసాలకు చేరుకున్న ఆత్మలు  ప్రశంసనీయమైన జీవితం గడుపుతూ ఉంటారు. వీరు క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉంటారు, దానధర్మాలు చేస్తారు, పాపాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. బయటి నుండి చూస్తే వీరు ఆదర్శవంతమైన క్రైస్తవులు. తెరెసా వీరిని మెచ్చుకుంటారు, కానీ ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఇస్తారు.

ఈ దశలో ఉన్న ప్రమాదం ఏమిటంటే  ఆధ్యాత్మిక అహంకారం, స్వీయనీతి (self-righteousness). వీరు క్రమశిక్షణను, మంచి పనులను చూసుకుని కొంత గర్వపడే అవకాశం ఉంది. అలాగే, జీవితంలో చిన్న కష్టాలు వచ్చినా, ఎవరైనా తమను విమర్శించినా, తీవ్రంగా కలత చెందుతారు, ఎందుకంటే వీరు తమ మంచితనం మీద ఎక్కువ ఆధారపడతారు, దేవుని కృప మీద పూర్తిగా ఆధారపడరు. తమ స్వంత ప్రయత్నాలతోనే పరిపూర్ణతను సాధించగలమని అనుకోవడం ఈ దశలో వచ్చే పెద్ద ఆపద.

అలాగే, ఈ దశలో ప్రార్థనలో తరచూ 'ఎటువంటి ఇష్టంలేకపోవడం' (dryness) జరుగుతుంది.  ఎంత ప్రార్థన చేసినా దేవుని సన్నిధి అనుభూతి కలగదు, ప్రార్థన యాంత్రికంగా అనిపిస్తుంది. ఇటువంటి స్తితి  సహజమేనని, దీనికి కృంగిపోవాల్సిన అవసరం లేదని తెరెసా ధైర్యం చెబుతారు. నిజానికి ఇది తదుపరి దశకు మార్గం సుగమం చేసే సమయం.

ఈ దశలో ఆత్మకు కావలసినది వినయం మరియు దేవుని చిత్తానికి పూర్తిగా లొంగిపోవడం. తన సొంత ప్రయత్నాల మీద కాక దేవుని కృప మీద ఆధారపడటం నేర్చుకోవాలి. తెరెసా ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతారు. అది ఏమిటంటె  దేవుడు మనకు కష్టాలు, పరీక్షలు ఇచ్చినప్పుడు మనం వాటిని ఎలా స్వీకరిస్తాం? నిజమైన ఆధ్యాత్మిక పరిపక్వత కష్ట సమయాల్లోనే బయటపడుతుంది. యోబు గ్రంథంలో యోబు ఎదుర్కొన్న పరీక్షలను ఆమె ఉదాహరణగా ప్రస్తావిస్తారు. నిజమైన భక్తుడు కష్టాల్లో కూడా దేవుని పట్ల విశ్వాసం కోల్పోడు.

తెరెసా ఈ దశలో ఉన్నవారికి వారు సరియైన మార్గంలో ఉన్నారో లేదో తెలుసుకొనుటకు ఒక విషయం చెబుతారు. అది ఏమిటంటె మీరు ఇచ్చిన దానధర్మం ఎవరైనా తిరస్కరిస్తే, లేదా మీ మంచి పనిని ఎవరైనా గుర్తించకపోతే, మీరు ఎలా స్పందిస్తారు? అసంతృప్తి, కోపం కలిగితే, అది మీ ఆధ్యాత్మిక జీవితం ఇంకా మీ 'అహం' చుట్టూనే తిరుగుతోందని సూచిస్తుంది. నిజమైన ప్రేమ ప్రతిఫలాన్ని ఆశించదు. ఈ దశ దాటాలంటే, ఆత్మ తన మంచితనం, తన సేవలు కూడా దేవుని బహుమానమేనని, వాటికి తానే కర్త కాదని లోతుగా అర్థం చేసుకోవాలి,  ఇదే వినయనికి  నిజమైన అర్థం.

ఈ మూడవ నివాసంలో ఉన్నవారు తరచూ దేవుని నుండి గొప్ప ఆధ్యాత్మిక అనుభవాలు, ప్రార్థనా అనుభూతులు ఆశిస్తారు, అవి రాకపోతే నిరాశ చెందుతారు. తెరెసా ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం  చెబుతారు, అది ఏమిటంటె  దేవుడు మనకు ఏమి ఇస్తాడు, ఏమి ఇవ్వడు అనేది పూర్తిగా ఆయన మీద ఆధారపడి ఉంటుంది, మనం దాన్ని పట్టుపట్టలేం. అసలైన ఆధ్యాత్మిక పరిపక్వత అంటే, దేవుడు ఏమి ఇచ్చినా, ఏమి ఇవ్వకపోయినా, ఆయన పట్ల ప్రేమతో, నమ్మకంతో ఉండటమే.

నాలుగవ నివాసాలు: మానవ ప్రయత్నం నుండి దైవ కృప వైపు

నాలుగవ నివాసాలు తెరెసా వర్ణించిన ప్రయాణంలో ఒక కీలక మలుపు. ఇక్కడి నుండి ఆధ్యాత్మిక జీవితం స్వభావరీత్యా మారిపోతుంది.  మొదటి మూడు నివాసాల్లో ఎక్కువగా మన స్వంత ప్రయత్నం (ధ్యానం, ప్రార్థన) ప్రధానంగా ఉంటే, నాలుగవ నివాసం నుండి దేవుని కృప మరింత ప్రత్యక్షంగా, స్పష్టంగా పనిచేయడం మొదలవుతుంది. దీన్ని తెరెసా మౌన ప్రార్ధన (Prayer of Quiet) అని పిలుస్తారు.

ఈ దశను వివరించడానికి ఆమె ఒక అందమైన పోలిక వాడతారు, అది తోటలో నీరు పోయడం. ఒక తోటకు నీరు అందించడానికి నాలుగు మార్గాలు ఉన్నాయని ఆమె చెబుతారు: మొదటిది, బావి నుండి బకెట్లతో నీరు తోడి తీసుకురావడం (ఇది చాలా శ్రమతో కూడినది - ఇది మొదటి నివాసాల ప్రార్థన); రెండవది, ఒక చక్రం (waterwheel) సహాయంతో నీరు తేవడం (కొంచెం తక్కువ శ్రమ); మూడవది, ఏరు లేదా కాలువ నుండి నీరు నేరుగా తోటలోకి పారించడం (ఇంకా తక్కువ శ్రమ, నీరు మరింత సమృద్ధిగా వస్తుంది); నాలుగవది, వర్షం నేరుగా ఆకాశం నుండి కురవడం (దీనికి మనం ఏమీ శ్రమ పడనవసరం లేదు, పూర్తిగా దేవుని దయ).

నాలుగవ నివాసంలో ప్రార్థన ఈ మూడవ, నాలుగవ మార్గాల వైపు మళ్లడం మొదలవుతుంది. అంటే, మనం చాలా శ్రమపడి ఆలోచనలతో ప్రార్థన చేయాల్సిన అవసరం తగ్గి, దేవుని సన్నిధి సహజంగా, ప్రశాంతంగా అనుభవమవడం మొదలవుతుంది. మనసు నిశ్శబ్దంగా ఉంటుంది, హృదయం దేవుని ప్రేమతో నిండిపోతుంది, ప్రత్యేక ప్రయత్నం లేకుండానే ఒక గాఢమైన  శాంతి కలుగుతుంది.

ఇక్కడ తెరెసా ఒక ముఖ్యమైన తేడాను స్పష్టం చేస్తారు,  సహజమైన ఊపశమనాల ఆనందం మరియు ఆధ్యాత్మిక ఉపశమనాలు మధ్య తేడా గురించి చెబుతారు.  కొన్నిసార్లు మనం మంచి సంగీతం విన్నప్పుడో, ప్రకృతి అందాన్ని చూసినప్పుడో సంతోషం కలుగుతుంది,  ఇది సహజమైనది, మంచిదే, కానీ ఇది దేవుని ప్రత్యక్ష కృపతో సమానం కాదు. దైవిక ఆనందం అనేది దేవుడు స్వయంగా ఆత్మలో కలిగించే లోతైన, వర్ణించలేని శాంతి, ఇది మన ప్రయత్నం వల్ల రాదు, పూర్తిగా ఆయన బహుమానం.

ఈ దశలో ఆత్మ నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠం ఏమిటంటె  దేవుని కృపకు లొంగిపోవడం, తన స్వంత ప్రయత్నాలను వదిలిపెట్టడం. చాలామంది ఈ దశలో పొరపాటు చేస్తారు.  ప్రార్థనలో వచ్చే ప్రశాంతతను తామే సాధించాలని విపరీతంగా ప్రయత్నిస్తారు, కానీ అది వ్యతిరేక ఫలితాన్నిస్తుంది. తెరెసా ఎక్కువ ఆలోచించకుండా, ఎక్కువ మాట్లాడకుండా, కేవలం ప్రేమతో దేవుని సన్నిధిలో ప్రశాంతంగా ఉండటం నేర్చుకోవాలని సలహాఇస్తారు.

ఈ దశలో మనసు పూర్తిగా అదుపులో ఉండదని తెరెసా వాస్తవికంగా చెబుతారు. హృదయం దేవుని సన్నిధిలో ప్రశాంతంగా ఉన్నా, బుద్ధి (ఆలోచనలు) ఇంకా అటూఇటూ తిరుగుతూనే ఉండవచ్చు. దీని గురించి కంగారుపడనవసరం లేదు, ఇది సహజమే, హృదయం దేవునితో ఉంటే చాలు, ఆలోచనలు పూర్తిగా నిలిచిపోవాలని బలవంతం చేయనవసరం లేదు.

ఈ నాలుగవ నివాసంలో ఆత్మకు మరో ముఖ్యమైన సవాలు ఎదురవుతుంది. అది  ఆధ్యాత్మిక అనుభూతిని కోరుకోవడం, ఒకసారి అనుభవించిన  దాని కోసం ప్రయత్నించడం చేస్తుంటారు. కొందరు ఒకసారి ఈ ప్రశాంతతను రుచి చూశాక, దాన్ని మళ్లీ మళ్లీ అనుభవించాలని తహతహలాడతారు,  ఒక ప్రార్ధన  'అనుభూతి కోసం అన్వేషణ' చేస్తుంటారు.  తెరెసా దీన్ని ఖండిస్తూ, ప్రార్థన లక్ష్యం అనుభూతి పొందడం కాదు, దేవుని చిత్తానికి లొంగిపోవడం, ఆయనతో ప్రేమ సంబంధం పెంచుకోవడం. అనుభూతులు వచ్చినా, రాకపోయినా, ఆత్మ దేవుని పట్ల నమ్మకంగా, స్థిరంగా ఉండటమే నిజమైన పరిపక్వతకు గుర్తు అని వెల్లడిచేస్తారు.

ఐదవ నివాసాలు: ఐక్యత వైపు మార్పు - పట్టుపురుగు ఉదాహరణ

ఐదవ నివాసాల్లో ఐక్యత ప్రార్ధన  (Prayer of Union) అనే లోతైన అనుభవాన్ని వివరిస్తారు. పట్టుపురుగు మల్బరీ ఆకులు తిని పెరుగుతుంది. ఒక దశలో అది తనను తాను తన స్వంత లాలాజలంతో నేసిన కోశంలో బంధించుకుంటుంది.  ఆ కోశం లోపల అది చనిపోయినట్టు కనిపిస్తుంది, స్తబ్ధుగా ఉంటుంది. కానీ కొంతకాలం తర్వాత, ఆ కోశం నుండి ఒక అందమైన తెల్లని సీతాకోకచిలుక బయటకు వస్తుంది.  ఇది పూర్తిగా కొత్త ప్రాణి, ఇక భూమిపై పాకదు, ఆకాశంలో ఎగురుతుంది.

తెరెసా ఈ ఉదాహరణను ఆధ్యాత్మిక జీవితానికి అన్వయిస్తారు. మల్బరీ ఆకు అంటే క్రీస్తు మరియు దివ్య సంస్కారాలు (Sacraments). వీటి ద్వారానే ఆత్మ పోషణ పొందుతుంది. కోశం అంటే క్రీస్తే,  ఆత్మ తనను తాను క్రీస్తులో పూర్తిగా దాచుకోవాలి, తన స్వార్థం, తన ఇష్టాలు, తన పాత జీవన విధానాన్ని త్యజించాలి. ఇది ఒక రకమైన 'మరణం',  పాత మనిషి చనిపోవడం. కానీ ఈ మరణం తర్వాతే నిజమైన రూపాంతరం జరుగుతుంది.  ఆత్మ సీతాకోకచిలుకలా కొత్త జీవితంలోకి, దేవునితో లోతైన ఐక్యతలోకి బయటకు వస్తుంది.

ఈ దశలో దేవునితో ఐక్యత క్షణికమే అయినా (సాధారణంగా ఇది ఎక్కువసేపు ఉండదు), అది అత్యంత లోతైనది, పరివర్తనాత్మకమైనది. ఆత్మ ఈ అనుభవం తర్వాత ఇక మునుపటిలా ఉండదు,  దాని ప్రాధాన్యతలు మారిపోతాయి, ప్రపంచపు విషయాల పట్ల ఆసక్తి తగ్గిపోతుంది, దేవుని పట్ల ప్రేమ, ఇతరుల పట్ల ప్రేమ బాగా పెరుగుతుంది.

ఈ దశలో వచ్చే ఒక ముఖ్యమైన మార్పు,  ఆత్మ ఇక తన కోసమే జీవించదు, ఇతరుల మేలు కోసం, దేవుని రాజ్య విస్తరణ కోసం జీవించాలని కోరుకుంటుంది. నిజమైన ఆధ్యాత్మిక అనుభవానికి రుజువు ప్రత్యేకమైన దర్శనాలో, అనుభూతులో కాదు, దాని ఫలితంగా వచ్చే ప్రేమ, వినయం, ఇతరులకు సేవ చేయాలనే తపన. సీతాకోకచిలుక ఇక తనలో ఉండదు, ఎగిరిపోతుంది, ఇతర పువ్వుల దగ్గరకు వెళ్తుంది, తన అందాన్ని పంచుతుంది.  అలాగే ఈ దశలో ఆత్మ కూడా ఇతరులకు మేలు చేయడానికి బయటకు వెళ్తుంది.

ఈ దశలో తెరెసా ఒక ఆసక్తికరమైన హెచ్చరిక కూడా చేస్తుంది. అది ఏమిటంటె సీతాకోకచిలుక కూడా విశ్రాంతి స్థలం వెతుక్కుంటుంది, ఎందుకంటే ప్రపంచంలో దానికి నిజమైన నివాసం లేదు. అలాగే, ఈ దశకు చేరుకున్న ఆత్మ కూడా ప్రపంచపు క్షణిక సుఖాల్లో తృప్తి పొందదు, నిరంతరం దేవుని కోసం ఆరాటపడుతూనే ఉంటుంది. ఈ ఆరాటం బాధాకరమైనదిగా అనిపించినా, ఇది ఆరోగ్యకరమైన సంకేతమే,  ఎందుకంటే ఇది ఆత్మను తదుపరి, లోతైన దశ వైపు నడిపిస్తుంది.

ఈ ఐదవ నివాసంలో తెరెసా మరో ముఖ్యమైన విషయం స్పష్టం చేస్తారు, దేవునితో ఐక్యత అనుభవం సమయంలో ఆత్మ యొక్క సంకల్పం పూర్తిగా దేవుని చిత్తానికి లొంగిపోతుంది, కానీ బుద్ధి, జ్ఞాపకశక్తి వంటి ఇతర శక్తులు కొంతమేరకు స్వతంత్రంగానే పనిచేస్తూ ఉండవచ్చు. ఈ సూక్ష్మ భేదాలను ఆమె చాలా జాగ్రత్తగా విశ్లేషిస్తారు, ఎందుకంటే తప్పుడు అవగాహన ఆత్మను గందరగోళానికి గురిచేయవచ్చు. ఈ దశ ఇంకా పరిపూర్ణ ఐక్యత కాదు, దీనికి ఆరు, ఏడు నివాసాల్లో మరింత లోతు అవసరం.

ఆరవ నివాసాలు: నిశ్చితార్థపు దశ - లోతైన శుద్ధీకరణ

ఆరవ నివాసాలు ఏడు దశల్లో అత్యంత సుదీర్ఘమైనవి, మరియు అత్యంత తీవ్రమైనవి కూడా. తెరెసా దీన్ని 'ఆధ్యాత్మిక నిశ్చితార్థం' దశగా వర్ణిస్తుంది.  వధూవరులు వివాహానికి ముందు నిశ్చితార్థం చేసుకున్నట్టుగా, ఆత్మ దేవునితో పూర్తి ఐక్యత (ఏడవ నివాసం) పొందడానికి ముందు ఈ దశలో లోతైన శుద్ధీకరణ ప్రక్రియకు లోనవుతుంది.

ఈ దశలో ఆత్మకు రెండు రకాల అనుభవాలు కలుగుతాయి. గొప్ప ఆధ్యాత్మిక ఆనందాలు మరియు తీవ్రమైన బాధలు, రెండూ కూడా అసాధారణ స్థాయిలో ఇక్కడ ఉంటాయి. ఆనందాల విషయానికొస్తే, కొన్నిసార్లు ఆత్మకు దర్శనాలు (visions), అంతరంగిక వాక్కులు (locutions - దేవుడు నేరుగా మాట్లాడుతున్నట్టు అనిపించడం), పారవశ్యాలు (ecstasies/raptures) కలుగవచ్చు. ఈ అనుభవాల్లో శరీరం కూడా కొన్నిసార్లు ప్రభావితమవుతుంది.  గాఢమైన ప్రార్థనలో ఉన్నప్పుడు శరీరం బలహీనమైపోవడం, కదల్లేకపోవడం వంటివి జరగవచ్చని తెరెసా తన స్వంత అనుభవం నుండి వివరిస్తారు.

అయితే ఇలాంటి అసాధారణ అనుభవాలు ఆధ్యాత్మిక పరిపక్వతకు కొలమానం కాదు, మరియు వీటిని అతిగా కోరుకోవడం ప్రమాదకరం. కొన్నిసార్లు ఇలాంటి అనుభవాలు మానసిక కారణాల వల్ల కూడా రావచ్చు, లేదా మోసం కూడా కావచ్చు. అందుకే ఆమె పదే పదే ఇలాంటి అనుభవాలు కలిగినప్పుడు వాటిని అనుభవించిన వ్యక్తి తప్పకుండా అనుభవజ్ఞుడైన, జ్ఞానవంతుడైన ఆధ్యాత్మిక గురువుతో సంప్రదించాలి అని చెబుతారు.  వినయంగా ఉండటం, తన అనుభవాలను స్వతంత్రంగా నిర్ధారించుకోకుండా తగిన మార్గదర్శకత్వం కింద పరిశీలించుకోవడం అత్యవసరం.

ఈ దశలో బాధలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి. ఆత్మ దేవుని కోసం తీవ్రమైన 'ఆకలి' (longing) అనుభవిస్తుంది.  దేవుడు కొంతసేపు తనను వదిలేసినట్టు అనిపించే క్షణాలు వస్తాయి.  దశలో ఉన్నవారు తరచూ ఇతరుల నుండి అపార్థాలు, విమర్శలు, హింసలు కూడా ఎదుర్కోవచ్చు. ప్రజలు వీరిని అర్థం చేసుకోలేకపోవచ్చు, వీరి ఆధ్యాత్మిక అనుభవాలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు.

ఈ శుద్ధీకరణ ఎందుకు అవసరమో తెరెసా వివరిస్తారు, శుద్దికరణ ఎందుకంటే బంగారాన్ని అగ్నిలో కరిగించి శుద్ధి చేసినట్టుగా, ఆత్మ కూడా ఈ బాధల ద్వారా శుద్ధి చెంది, పూర్తిగా దేవుని కోసమే జీవించే స్థితికి చేరుకుంటుంది. ఈ దశ దాటిన తర్వాతే ఆత్మ ఏడవ నివాసంలోకి, అంటే పరిపూర్ణ ఐక్యతలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతుంది. యోహాను సువార్తలో యేసు ద్రాక్షావల్లి గురించి చెప్పిన మాటలను ఇక్కడ గుర్తుచేసుకోవచ్చు,  ఫలించే ప్రతి తీగను తండ్రి ఇంకా ఎక్కువ ఫలించేలా కత్తిరిస్తాడు.

ఈ దశలో ఆత్మకు మరో విచిత్రమైన అనుభవం కూడా కలుగుతుంది,  తీవ్రమైన ఆధ్యాత్మిక ఆనందాల తర్వాత వెంటనే తీవ్రమైన శూన్యత, ఒంటరితనం అనుభూతి కలగడం. ఈ హెచ్చుతగ్గులు ఆత్మను గందరగోళపరచవచ్చు, కానీ తెరెసా వివరించే ప్రకారం ఇది సాధారణమైనదే.  దేవుడు ఆత్మను తనపై పూర్తిగా ఆధారపడేలా, తన సొంత అనుభూతుల మీద కాకుండా విశ్వాసం మీద ఆధారపడేలా తర్ఫీదు ఇస్తున్నాడు. ఈ దశలో సహనం, స్థిరత్వం చాలా ముఖ్యం.  ఇవి లేకుండా ఆత్మ మధ్యలోనే వెనుదిరిగే ప్రమాదం ఉంది.

తెరెసా ఈ ఆరవ నివాసంలో ఒక ముఖ్యమైన సూత్రం కూడా నొక్కి చెబుతారు. అది ఏమిటంటె  ఆత్మకు వచ్చే ప్రతి అనుభవాన్ని దాని ఫలాల ద్వారా పరీక్షించాలి. నిజమైన దైవిక అనుభవం ఆత్మలో ఎక్కువ వినయం, ఎక్కువ ప్రేమ, ఎక్కువ శాంతి, ఇతరుల పట్ల ఎక్కువ కరుణ కలిగిస్తుంది. అదే అనుభవం గర్వాన్ని, ఇతరులను తక్కువగా చూసే భావననో, స్వీయ ప్రాముఖ్యతనో పెంచితే, అది అనుమానాస్పదమైనదని ఆమె హెచ్చరిస్తారు. ఈ వివేచన సూత్రం ఈనాటికీ ఆధ్యాత్మిక జీవితంలో అత్యంత విలువైన మార్గదర్శకం.

ఏడవ నివాసాలు: ఆధ్యాత్మిక వివాహం - పరిపూర్ణ ఐక్యత

చివరకు, కోట  నట్టనడుమ ఉన్న ఏడవ, అత్యంత లోతైన నివాసానికి ఆత్మ చేరుకుంటుంది. ఇక్కడ దేవుడు నివసిస్తున్నాడు, మరియు ఇక్కడే ఆత్మ ఆయనతో 'ఆధ్యాత్మిక వివాహం' (Spiritual Marriage) అనుభవిస్తుంది. ఇది నిశ్చితార్థం కంటే భిన్నమైనది.  నిశ్చితార్థంలో వధూవరులు కొంతకాలం కలిసి ఉండి, మళ్లీ విడిపోతారు, కానీ వివాహంలో వారు శాశ్వతంగా ఏకమవుతారు, ఇక ఎన్నటికీ విడిపోరు.

ఈ దశలో ఆత్మకు దేవునితో ఐక్యత అప్పుడప్పుడు వచ్చే అనుభవం కాదు. ఇది ఒక శాశ్వత స్థితి. ఆత్మ ఎల్లప్పుడూ, రోజువారీ పనుల్లో ఉన్నప్పుడు కూడా దేవుని సన్నిధిలో నివసిస్తుంది.  తెరెసా దీన్ని వివరించడానికి మరో పోలిక వాడతారు.  ఒక గదిలో రెండు కిటికీల నుండి వెలుతురు వస్తే, ఆ రెండు వెలుతురులు కలిసిపోయి ఒకే వెలుగుగా మారినట్టు, ఆత్మ, దేవుడు ఇద్దరూ వేరుగానే ఉన్నా, వారి మధ్య ఐక్యత అంత సన్నిహితంగా ఉంటుంది.

ఈ దశలో వచ్చే అత్యంత ముఖ్యమైన మార్పు, తీవ్రమైన ఆధ్యాత్మిక అనుభవాలు (దర్శనాలు, పారవశ్యాలు) చాలా అరుదుగా జరుగుతాయి, ఎందుకంటే వాటి అవసరం తగ్గిపోతుంది. ఎందుకంటే ఆత్మ ఇప్పటికే దేవునితో స్థిరమైన, లోతైన ఐక్యతలో నివసిస్తోంది. దీనికి బదులుగా, ఆత్మలో గొప్ప శాంతి, స్థిరత్వం, మరియు లోకంలో సేవ చేయాలనే బలమైన కోరిక కనిపిస్తాయి.

ఈ పరిపూర్ణ ఐక్యత దశలో ఉన్న ఆత్మ మార్త మరియు మరియ ఇద్దరి గుణాలను కలిపి జీవిస్తుంది (లూకా సువార్తలో యేసు  ప్రభువు  వారి  ఇంటికి వచ్చినప్పుడు మార్త సేవలో, మరియ ఆయన పాదాల చెంత కూర్చున్న సంఘటనను ఆమె ప్రస్తావిస్తారు). అంటే, ఆత్మ లోపల ఎప్పుడూ దేవుని సన్నిధిలో ప్రార్థనాభావంతో (మరియలా) ఉంటూనే, బయట చురుకుగా సేవాకార్యాల్లో (మార్తలా) పాల్గొంటుంది. ఈ రెండూ వేరు వేరు కాదు, ఒకే జీవితంలో భాగాలు.

ఇది తెరెసా బోధనలో అత్యంత ఆచరణాత్మక  అంశం.  నిజమైన ఆధ్యాత్మికత లోకం నుండి పారిపోవడం కాదు, లోకంలో ఉంటూనే దేవునితో లోతైన సంబంధం కలిగి ఉండటం, మరియు ఆ సంబంధం ఫలితంగా ఇతరులకు ప్రేమతో సేవ చేయడం. ఈ విషయాన్ని ఆమె స్పష్టంగా చెబుతారు.  ఈ ఏడవ నివాసానికి చేరుకున్న ఆత్మలు మరింత వినయంగా, మరింత సేవాభావంతో, మరింత ప్రేమతో మారతారే తప్ప, గర్విష్టులుగా, ప్రత్యేకమైనవారుగా భావించుకోరు. అసలైన పరిశుద్ధత గుర్తు గొప్ప అనుభవాలు కాదు, గొప్ప ప్రేమ, గొప్ప వినయం.

చివరిగా, తెరెసా ఒక ముఖ్యమైన హామీ ఇస్తారు,  ఈ ఏడవ నివాసానికి చేరుకున్న ఆత్మకు ఇక భయం ఉండదు, ఎందుకంటే అది దేవునితో విడదీయరాని బంధంలో ఉంటుంది. కష్టాలు, బాధలు జీవితంలో ఇంకా వస్తూనే ఉంటాయి, కానీ ఆత్మ శాంతిని, స్థిరత్వాన్ని కోల్పోదు. ఇది తెరెసా వాగ్దానం చేసిన అంతిమ లక్ష్యం.  దేవునితో శాశ్వతమైన, పూర్తి ఐక్యత, ఇది భూమిపైనే ప్రారంభమై, స్వర్గంలో పరిపూర్ణమవుతుంది.

ఈ దశలో ఆత్మకు జీవితం, మరణం పట్ల దృక్పథం కూడా పూర్తిగా మారిపోతుందని తెరెసా చెబుతారు. మరణం ఇక భయపెట్టే విషయం కాదు, ఎందుకంటే అది కేవలం ఇప్పటికే ఆరంభమైన ఐక్యతను పరిపూర్ణం చేసే ద్వారం మాత్రమే. అలాగే, ఆత్మ తన జీవితకాలం ఎంత మిగిలి ఉందో అనే దానితో సంబంధం లేకుండా, ప్రతి క్షణాన్ని దేవుని సేవలో, ప్రేమతో గడపాలని కోరుకుంటుంది. ఇది తెరెసా స్వయంగా తన చివరి సంవత్సరాల్లో జీవించిన విధానం.  అనారోగ్యంతో, అలసటతో ఉన్నా, ఆమె తన సంస్కరణ కార్యక్రమాన్ని, తన రచనలను ఆఖరి శ్వాస వరకూ కొనసాగించారు.

ప్రార్థన నాలుగు దశలు 

తెరెసా వివరించిన ఏడు నివాసాల ప్రయాణాన్ని ప్రార్థన పరంగా నాలుగు ప్రధాన దశలుగా కూడా అర్థం చేసుకోవచ్చు. మొదటిది, 'ఆలోచనాత్మక ప్రార్థన' (Discursive/Meditative Prayer), ఇందులో మనం మన బుద్ధిని, ఊహను ఉపయోగించి దేవుని గురించి, పరిశుద్ధ గ్రంథం గురించి ఆలోచిస్తూ ప్రార్థన చేస్తాం. ఇది మొదటి మూడు నివాసాలకు సరిపోతుంది.  ఇక్కడ మన స్వంత ప్రయత్నం ఎక్కువగా అవసరం.

రెండవది, 'మౌన  ప్రార్థన' (Prayer of Quiet)  నాలుగవ నివాసంలో మొదలయ్యేది. ఇక్కడ మన ఆలోచనలు తగ్గి, దేవుని సన్నిధిలో ప్రశాంతంగా ఉండటం మొదలవుతుంది, పెద్దగా మాటలు, ఆలోచనలు అవసరం లేకుండా ఉంటుంది. మూడవది, 'ఐక్యత ప్రార్థన' (Prayer of Union)  ఐదవ నివాసంలో వచ్చేది, ఇక్కడ ఆత్మ దేవునితో లోతైన, పరివర్తనాత్మక ఐక్యత అనుభవిస్తుంది, పట్టుపురుగు సీతాకోకచిలుకగా మారినట్టు.

నాలుగవది, 'పరివర్తనాత్మక/పరిపూర్ణ ఐక్యత ప్రార్థన' (Transforming/Perfect Union) ఆరు, ఏడు నివాసాల్లో వచ్చేది, ఇక్కడ ఆత్మ దేవునితో శాశ్వత, స్థిరమైన ఐక్యతలో నివసిస్తుంది. ఈ నాలుగు దశలు వరుసగా జరుగుతాయని అనుకోకూడదని తెరెసా హెచ్చరిస్తారు. ఆధ్యాత్మిక జీవితం ఒక సరళరేఖలా సాగదు, ముందుకు వెనుకకు కదలికలు ఉంటాయి, కొన్నిసార్లు ఒక దశలో ఉన్నా మరో దశ అనుభవాలు కూడా కలగవచ్చు. దేవుడు ప్రతి ఆత్మను తనదైన ప్రత్యేక మార్గంలో నడిపిస్తాడు.

ఈ నాలుగు దశల విభజన మనకు ఒక ప్రయోజనం చేకూరుస్తుంది. మన ప్రార్థనా జీవితంలో మనం ఎక్కడ ఉన్నామో అర్థం చేసుకోవడానికి ఒక స్థూలమైన చట్రం ఇస్తుంది. అయితే ఈ దశలను కేవలం మనం ఎంత 'ముందుకు వెళ్లాము' అని కొలుచుకోవడానికి వాడకూడదు. పోటీ పడే మనస్తత్వంతో, 'నేను ఏ నివాసంలో ఉన్నాను' అని నిరంతరం బేరీజు వేసుకోవడం ఆరోగ్యకరం కాదు. బదులుగా, ఈ చట్రం మనకు ఓదార్పునివ్వాలి.  మనం ఎక్కడ ఉన్నా, దేవుడు మనతో ఉన్నాడని, మన ప్రయాణాన్ని ఆయనే నడిపిస్తున్నాడని తెలుసుకోవడమే దీని అసలు లక్ష్యం.

ధ్యానానికి కొన్ని ప్రశ్నలు

ఇది చదివిన తర్వాత, మన హృదయాన్ని పరిశీలించుకోవడం ముఖ్యం. కింది ప్రశ్నలు మీ వ్యక్తిగత ప్రార్థనలో ఆలోచించడానికి సహాయపడవచ్చు.

నేను ప్రస్తుతం ఆత్మలోని  ఏ నివాసంలో ఉన్నాను అని అనిపిస్తుంది? నా ప్రార్థనా జీవితం ఇంకా ప్రపంచపు ఆందోళనలతో నిండిపోయి ఉందా, లేదా దేవుని సన్నిధిలో కొంత ప్రశాంతత అనుభవమవుతోందా? నేను నా మంచి పనుల మీద, నా క్రమశిక్షణ మీద ఆధారపడుతున్నానా, లేక దేవుని కృపపై పూర్తిగా నమ్మకం ఉంచుతున్నానా?

జీవితంలో వచ్చే కష్టాలను, అపార్థాలను నేను ఎలా స్వీకరిస్తున్నాను.  వాటిని దేవుని శుద్ధీకరణ ప్రక్రియగా చూస్తున్నానా, లేదా వాటి వల్ల పూర్తిగా కృంగిపోతున్నానా? నా ప్రార్థన కేవలం నా కోసమేనా, లేక అది నన్ను ఇతరులకు సేవ చేసేలా ప్రేరేపిస్తోందా? ఈ ప్రశ్నలకు జవాబులు వెతుక్కుంటూ, ప్రతిరోజూ కొంచెం సమయమైనా నిశ్శబ్దంగా దేవుని ముందు కూర్చుని, ఆయన స్వరాన్ని వినడానికి ప్రయత్నిద్దాం.

ఈ ప్రశ్నలను ఒక్కసారి మాత్రమే కాక, నెలవారీగా, లేదా ప్రతి ఆధ్యాత్మిక ఏకాంతవాసం (retreat) సమయంలో మళ్లీ మళ్లీ పరిశీలించుకోవడం మంచిది. ఎందుకంటే మన ఆధ్యాత్మిక స్థితి కాలంతో పాటు మారుతూ ఉంటుంది. ఒక సమయంలో ఇచ్చిన జవాబు మరో సమయంలో మారిపోవచ్చు. ఈ నిరంతర ఆత్మపరిశీలనే మనల్ని ఆంతరంగిక కోటలోని లోతుల్లోకి స్థిరంగా ముందుకు నడిపిస్తుంది.

ఈనాటి జీవితంలో ఈ బోధన ప్రాముఖ్యత

నాలుగు వందల యాభై ఏళ్ల క్రితం రాయబడిన ఈ గ్రంథం ఈనాటి, వేగవంతమైన, డిజిటల్ యుగంలో బతుకుతున్న మనకు ఎందుకు ముఖ్యమైనది?  అంటే  మానవ హృదయపు లోతైన అవసరాలు శతాబ్దాలు గడిచినా మారవు. మనం ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా, నిరంతర సమాచార ప్రవాహం మధ్య జీవిస్తున్నాం.  ఇవి మనల్ని నిరంతరం బయటికి, ఇతరుల జీవితాల వైపు,  బయట విషయాల వైపు లాగుతూ ఉంటాయి. తెరెసా చెప్పిన ఆంతరంగిక కోట  చుట్టూ ఉన్న సర్పాలు, విషప్రాణులు నేటి కాలంలో వేరే రూపాల్లో కనిపిస్తున్నాయి.  నిరంతర పోలికలు, అసూయ, అసంతృప్తి, ఏకాగ్రత లోపం.

ఇలాంటి పరిస్థితుల్లో, మన హృదయపు లోతుల్లోకి ప్రయాణించడం, నిశ్శబ్దంలో దేవుని సన్నిధిని వెతుక్కోవడం అనేది ఎప్పటికంటే ఇప్పుడే మరింత అవసరం. తెరెసా బోధన మనకు గుర్తుచేసేది ఏమిటంటే, నిజమైన శాంతి, నిజమైన సంతృప్తి బయట దొరకదు.  అది మన హృదయపు కేంద్రంలో, దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. ప్రతిరోజూ కొన్ని నిమిషాలైనా నిశ్శబ్దంగా దేవుని ముందు కూర్చోవడం ఈ ఆధునిక యుగంలో ఒక విప్లవాత్మక చర్యగా చెప్పవచ్చు.

సాధారణంగా వచ్చే అపోహలు

తెరెసా బోధనను అర్థం చేసుకునేటప్పుడు కొన్ని సాధారణ అపోహలు తలెత్తుతూ ఉంటాయి, వాటిని ఇక్కడ స్పష్టం చేసుకోవడం మంచిది. మొదటి అపోహ, ఈ ఏడు నివాసాల ప్రయాణం కేవలం సన్యాసులకు, సన్యాసినులకు మాత్రమే సాధ్యమని అనుకోవడం. కానీ తెరెసా స్వయంగా చెప్పినట్టు, వివాహిత జీవితంలో ఉన్నవారు, వ్యాపారంలో ఉన్నవారు, సాధారణ ఉద్యోగులు కూడా ఈ లోతైన ఐక్యతను చేరుకోగలరు. బాహ్య జీవన స్థితి కాదు, హృదయపు అంతర్గత దృక్పథమే ముఖ్యం.

రెండవ అపోహ,  ఆధ్యాత్మిక అనుభవాలు (దర్శనాలు, పారవశ్యాలు) లేకుండా ఆధ్యాత్మిక ప్రగతి సాధ్యం కాదని అనుకోవడం. వాస్తవానికి, తెరెసా పదే పదే చెప్పేది,  చాలామంది గొప్ప సన్యాసులు  ఇలాంటి అసాధారణ అనుభవాలు లేకుండానే పరిపూర్ణతకు చేరుకున్నారు. ఈ అనుభవాలు దేవుని ఇష్టానుసారం వచ్చే బహుమానాలు మాత్రమే, అవి లక్ష్యం కాదు, మార్గం మాత్రమే. మూడవ అపోహ,  ఈ ప్రయాణంలో ముందుకు వెళ్లడం అంటే మరింత కష్టమైన, బాధాకరమైన జీవితం గడపడం అని అనుకోవడం. నిజానికి, ఈ ప్రయాణం చివరికి గొప్ప శాంతి, ఆనందం, స్వేచ్ఛకు దారితీస్తుంది,  మధ్యలో వచ్చే కష్టాలు తాత్కాలికమే, శాశ్వతం కాదు.

నాలుగవ అపోహ,  ఆత్మజ్ఞానం అంటే నిరంతరం తన లోపాల గురించే ఆలోచిస్తూ ఉండటం అని అనుకోవడం. ఇది తెరెసా ఉద్దేశం కాదు, ఆమె ఆత్మజ్ఞానాన్ని ఎప్పుడూ దేవుని గొప్పతనం, కృప ధ్యానంతో జతచేస్తారు. మన బలహీనతలను చూసేటప్పుడు నిరాశలో మునిగిపోకుండా, దేవుని ప్రేమవైపు దృష్టి మళ్లించడమే సరైన మార్గం.

ఈ బోధన కేవలం మేధోపరమైన అవగాహన కోసం కాదు, దీన్ని ఆచరణలో పెట్టాలి. ప్రతిరోజూ ప్రార్థనకు సమయం కేటాయించకుండా, కేవలం ఈ గ్రంథాన్ని చదివి అర్థం చేసుకుంటే సరిపోదు.  నడక ప్రారంభించడమే అసలైన అవసరం. జ్ఞానం కేవలం మొదటి అడుగు మాత్రమే, గమ్యం కాదు.

ముగింపు

తెరెసా గారి  ‘ఆంతరంగిక కోట ' మనకు ఇచ్చే అతిపెద్ద సందేశం ఏమిటంటే,  దేవుడు మనకు దూరంగా లేడు. ఆయన మన హృదయపు లోతైన కేంద్రంలోనే నివసిస్తున్నాడు, మనం ఆయనను వెతుక్కుంటూ బయటకు వెళ్లనవసరం లేదు, లోపలికి మన లోనికి  ప్రయాణించాలి. ఏడు నివాసాల ఈ ప్రయాణం  ఆత్మజ్ఞానం నుండి మొదలుపెట్టి, పరిపూర్ణ ఐక్యత వరకు,  ప్రతి ఒక్క విశ్వాసికి తెరిచి ఉన్న మార్గం.

ఈ ప్రయాణంలో కష్టాలు ఉంటాయి, శుద్ధీకరణ బాధలు ఉంటాయి, కానీ చివరికి దేవునితో పరిపూర్ణ ఐక్యత అనే అమూల్యమైన బహుమానం ఉంది. ఈ ప్రయాణం ఎంత లోతైనదైనా, ఇది మనల్ని ప్రపంచం నుండి దూరం చేయదు, బదులుగా, మనల్ని మరింత ప్రేమగల, మరింత వినయంగల, మరింత సేవాభావం గల మనుషులుగా మారుస్తుంది.

మన హృదయంలో ఇంత గొప్ప కోట లేక సౌధం  ఉందని, దాని నట్టనడుమ స్వయంగా దేవుడు మనకోసం వేచి ఉన్నాడని తెలుసుకోవడమే మొదటి అడుగు. ప్రతిరోజూ కొంత సమయం నిశ్శబ్దంగా ప్రార్థనలో గడుపుతూ, చిన్న చిన్న అడుగులతోనైనా ఈ కోట  లోతుల్లోకి ప్రయాణిద్దాం. తెరెసా చెప్పినట్టుగా, ఈ ప్రయాణంలో నిరుత్సాహపడకుండా, దేవుని కృపను నమ్ముకుంటూ ముందుకు సాగుదాం. ఆయన మనకోసం ఎదురుచూస్తున్నాడు.  

ఈ గ్రంథం ముగింపులో తెరెసా తన పాఠకులకు ఇచ్చే చివరి మాట ఏమిటంటే,  ఈ దుర్గాన్ని నిర్మించింది దేవుడే, దాన్ని పరిపూర్ణం చేయగలిగేది కూడా ఆయనే. మనం చేయాల్సింది కేవలం తలుపు తెరవడం, లోపలికి ప్రవేశించడానికి సిద్ధపడటం మాత్రమే. మన బలహీనతలు, మన గత తప్పులు మనల్ని వెనక్కి లాగకూడదు, ఎందుకంటే ఈ దుర్గంలోకి ప్రవేశించడానికి పరిపూర్ణులం కావాల్సిన అవసరం లేదు, కేవలం చిత్తశుద్ధి, వినయం చాలు.

Fr. Amruth Raju Vellaturi OCD

Fr. Amruth Raju Vellaturi, OCD

Discalced Carmelite Priest

కార్మెల్ సన్యాసి మరియు ఆధ్యాత్మికత అధ్యాపకుడు. Master's in Spirituality పట్టభద్రుడు. తెలుగు క్రైస్తవులకు బైబిల్ సందేశాలను, కార్మెల్ సభ ఆధ్యాత్మికతను, పవిత్రుల జీవితాలను అందించడం ఈ బ్లాగు లక్ష్యం.

📲 మా WhatsApp Channel జాయిన్ అవ్వండి!

ప్రతి నిత్య పోస్ట్ మీ WhatsApp కు నేరుగా వస్తుంది

Join WhatsApp Channel

Comments

మీ అభిప్రాయాలను, ప్రశ్నలను క్రింద రాయండి:

Post a Comment

కామెంట్‌లు